కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోష స్వరంతో పాడండి!

సంతోష స్వరంతో పాడండి!

“మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది.”కీర్త. 147:1

పాటలు: 10, 2

1. పాటలు పాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి?

 ప్రసిద్ధి చెందిన ఒక పాటల రచయిత ఇలా అన్నాడు, “మాటలు ఆలోచనలను రేకెత్తిస్తాయి. సంగీతం భావాల్ని కలిగిస్తుంది. కానీ పాటలు ఆ రెండింటిని కలిగించి మనసును హత్తుకుంటాయి.” మన పాటల ద్వారా, మన పరలోక తండ్రైన యెహోవాను స్తుతిస్తాం, ఆయనపట్ల మనకున్న ప్రేమను తెలియజేస్తాం. అవి మనల్ని ఆయనకు మరింత దగ్గరయ్యేలా చేస్తాయి. కాబట్టి ఒంటరిగా పాడినా లేదా మన సహోదరసహోదరీలతో కలిసి పాడినా, సత్యారాధనలో పాటలకు ప్రాముఖ్యమైన స్థానం ఉందని అర్థంచేసుకుంటాం.

2, 3. (ఎ) సంఘంలో అందరితోపాటు బిగ్గరగా పాడడం కొంతమందికి ఎలా అనిపిస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

2 సంఘంలో అందరితోపాటు బిగ్గరగా పాడడం మీకెలా అనిపిస్తుంది? సిగ్గుగా అనిపిస్తుందా? కొన్ని సంస్కృతుల్లోని మగవాళ్లు ఇతరుల ముందు పాడడానికి ఇబ్బందిపడవచ్చు. కానీ అలాంటి వైఖరి సంఘమంతటి మీద చెడు ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా, సంఘపెద్దలు పాడడానికి వెనకాడడం వల్ల లేదా పాటలు పాడేటప్పుడు వేరే పనులు చేయడం వల్ల సంఘం మీద చెడు ప్రభావం పడవచ్చు.—కీర్త. 30:11, 12.

3 యెహోవా ఆరాధనలో పాటలు పాడడం కూడా ఒక భాగమే. కాబట్టి పాట పాడే సమయంలో బయటికి వెళ్లడం లేదా ఆ భాగానికి రాకపోవడం లాంటివి మనం చేయం. మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘మీటింగ్స్‌లో పాటలు పాడడం నాకెలా అనిపిస్తుంది? ఇతరుల ముందు పాడడానికి నేను వెనకాడుతుంటే ఏమి చేయవచ్చు? నేను పాటల్ని భావయుక్తంగా ఎలా పాడవచ్చు?’

పాటలు పాడడం సత్యారాధనలో ఒక ముఖ్యమైన భాగం

4, 5. ప్రాచీన ఇశ్రాయేలులోని ఆలయంలో పాటల కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి?

4 చరిత్రంతటినీ గమనిస్తే, యెహోవాను స్తుతించడానికి ఆయన సేవకులు సంగీతాన్ని ఉపయోగించారు. ఆసక్తికరంగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు నమ్మకంగా ఉన్న సమయంలో, పాటలు పాడడం వాళ్ల ఆరాధనలో ముఖ్యమైన భాగంగా ఉండేది. ఉదాహరణకు దావీదు, ఆలయంలో సంగీతంతో యెహోవాను స్తుతించడానికి 4,000 మంది లేవీయుల్ని నియమించాడు. వాళ్లలో 288 మంది ‘యెహోవాకు గానము చేయడంలో నేర్పు పొందినవాళ్లు.’—1 దిన. 23:5; 25:7.

5 ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో కూడా సంగీతానికి, పాటలకు ముఖ్యమైన స్థానం ఉండేది. బైబిలు ఇలా చెప్తోంది, ‘బాకాలు ఊదేవాళ్లు, గాయకులు ఒకే స్వరంతో యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతుండగా . . . వాళ్లు యెహోవాను స్తుతిస్తున్నప్పుడు బాకాల, తాళాల, ఇతర సంగీత వాద్యాల శబ్దం మారుమోగుతుండగా . . . సత్య దేవుని మందిరం యెహోవా మహిమతో నిండిపోయింది.’ ఆ సందర్భంలో ఇశ్రాయేలీయుల విశ్వాసం ఎంత బలపడి ఉంటుందో ఊహించండి!—2 దిన. 5:13-14, NW; 7:5.

6. నెహెమ్యా యెరూషలేముకు అధిపతిగా ఉన్నప్పుడు సంగీతానికి, పాటలకు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?

6 యెరూషలేము గోడల్ని తిరిగి కట్టే పనిని ముందుండి నడిపించిన నెహెమ్యా, సంగీత వాయిద్యాలతో పాటలు పాడడానికి లేవీయుల్లోని కొంతమంది గాయకుల్ని కూడా నియమించాడు. వాళ్ల ప్రదర్శన గోడల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని మరింత ఆనందమయం చేసింది. ‘స్తోత్రగీతాలు పాడడానికి రెండు గొప్ప సమూహాలను’ నెహెమ్యా ఏర్పాటు చేశాడు. ఆ సమూహాలు పట్టణ గోడలపై వ్యతిరేక దిశలో నడుస్తూ ఆలయానికి అతిదగ్గర్లోని గోడవరకు వెళ్లాయి. వాళ్లు పాటల్ని ఎంత బిగ్గరగా పాడారంటే ఆ శబ్దం చాలా దూరం వరకు వినిపించింది. (నెహె. 12:27, 28, 31, 38, 40, 43) తన సేవకులు తనను స్తుతిస్తూ ఉత్సాహంగా పాటలు పాడడం చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషించి ఉంటాడు.

7. క్రైస్తవుల ఆరాధనలో పాటలకు ముఖ్యమైన స్థానం ఉంటుందని యేసు ఎలా చూపించాడు?

7 సత్యారాధనలో పాటలకున్న ముఖ్యమైన స్థానం యేసు కాలం నాటికి కూడా అలానే ఉంది. మానవ చరిత్రంతటిలో అతి ప్రాముఖ్యమైన రాత్రి ఏం జరిగిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. యేసు తన శిష్యులతో కలిసి ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించిన తర్వాత వాళ్లందరూ కలిసి యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడారు.—మత్తయి 26:30 చదవండి.

8. పాటలతో దేవున్ని స్తుతించే విషయంలో తొలి క్రైస్తవులు ఎలా చక్కని ఆదర్శం ఉంచారు?

8 పాటలతో దేవున్ని స్తుతించే విషయంలో తొలి క్రైస్తవులు చక్కని ఆదర్శం ఉంచారు. ఇశ్రాయేలీయులు దేవున్ని ఆరాధించడానికి ఆలయానికి వెళ్లేవాళ్లు. కానీ తొలి క్రైస్తవులు సహోదరుల ఇళ్లలో కలుసుకునేవాళ్లు. అయితే ఆ ఇళ్లు ఆలయమంత అందంగా, ఆకర్షణీయంగా లేకపోయినా సహోదరులు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడేవాళ్లు. అపొస్తలుడైన పౌలు తన తోటి సహోదరులకు ఇలా చెప్పాడు, “కీర్తనలతో, స్తుతిగీతాలతో, కృతజ్ఞత ఉట్టిపడే ఆరాధనా గీతాలతో ఒకరికొకరు బోధించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, అలాగే మీ హృదయాల్లో యెహోవాకు పాటలు పాడండి.” (కొలొ. 3:16) మన పాటల పుస్తకంలోని పాటల్ని కూడా ‘కృతజ్ఞత ఉట్టిపడేలా’ పాడాలి. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మనకు తగిన సమయానికి అందిస్తున్న ‘ఆహారంలో’ అవి కూడా భాగమే.—మత్త. 24:45.

మీరు ధైర్యంగా ఎలా పాడవచ్చు?

9. (ఎ) మీటింగ్స్‌లో, సమావేశాల్లో బిగ్గరగా పాడడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారు? (బి) మనం యెహోవాకు స్తుతిగీతాలు ఎలా పాడాలి? ఆ విషయంలో ఎవరు ముందుండాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 బహుశా మీ కుటుంబంలో, సంస్కృతిలో పాటలు పాడే అలవాటు లేకపోవడం వల్ల మీరు పాడడానికి వెనకాడుతుండవచ్చు. రేడియోలో, టీవీలో గాయకులు పాడే పాటల్ని విని, మీ స్వరం వాళ్లంత మాధుర్యంగా లేదని సిగ్గుపడుతుండవచ్చు లేదా నిరుత్సాహపడుతుండవచ్చు. కానీ యెహోవాకు స్తుతిగీతాలు పాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మీ పాటల పుస్తకాన్ని పైకి పట్టుకుని, మీ తలలు ఎత్తి, ఉత్సాహంతో పాడండి! (ఎజ్రా 3:11; కీర్తన 147:1 చదవండి.) ఈ మధ్య కాలంలో చాలా రాజ్యమందిరాల్లో పాటల లిరిక్స్‌ని స్క్రీన్‌ మీద చూపిస్తున్నారు, వాటి సహాయంతో మనం బిగ్గరగా పాడవచ్చు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇకనుండి సంఘపెద్దల కోసం రాజ్య పరిచర్య పాఠశాలలో కూడా రాజ్య గీతాలు పాడతారు. మీటింగ్స్‌లో పాటలు పాడే విషయంలో సంఘపెద్దలు ముందుండడం ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది.

10. బిగ్గరగా పాడేందుకు భయపడుతుంటే మనమేమి గుర్తుంచుకోవాలి?

10 తమ స్వరం అందరికన్నా పెద్దగా వినిపిస్తుందేమోనని లేదా తమ స్వరం బాగోదేమోనని బిగ్గరగా పాడడానికి చాలామంది భయపడుతుంటారు. ఒకసారి ఆలోచించండి, మాట్లాడేటప్పుడు మనందరం “ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం,” అంతమాత్రాన మాట్లాడడం ఆపేస్తామా? లేదు కదా. (యాకో. 3:2) అలాంటప్పుడు, స్వరం బాగోదేమోననే కారణంతో యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడడం ఎందుకు మానేయాలి?

11, 12. బాగా పాడాలంటే ఏమి చేయాలి?

11 బహుశా ఎలా పాడాలో తెలియకపోవడం వల్ల కూడా మనం పాడడానికి భయపడుతుండవచ్చు. అయితే ఈ విషయంలో మెరుగవ్వడానికి కొన్ని తేలికైన సూచనలు మనకు సహాయం చేస్తాయి. a

12 శ్వాస సరిగ్గా ఎలా తీసుకోవాలో నేర్చుకుంటే మీరు బలంగా, బిగ్గరగా పాడగలుగుతారు. బల్బు వెలగడానికి కరెంటు ఎలాగైతే సహాయం చేస్తుందో, అలాగే మాట్లాడేటప్పుడు లేదా పాడుతున్నప్పుడు శ్వాస మీ స్వరానికి శక్తినిస్తుంది. మీరు ఎంత బిగ్గరగా మాట్లాడతారో, పాడేటప్పుడు కూడా మీ స్వరం అంతే బిగ్గరగా ఉండాలి. వీలైతే అంతకన్నా బిగ్గరగా కూడా ఉండవచ్చు. (దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకంలోని 181 నుండి 184 పేజీల్లో “మీ ఊపిరిని సరైనవిధంగా నియంత్రించుకోండి” అనే అంశం కిందున్న సలహాల్ని చూడండి.) నిజానికి, యెహోవా సేవకులు స్తుతిగీతాలు పాడుతున్నప్పుడు ‘ఆనందంతో కేకలు వేయాలని’ బైబిలు కొన్నిసార్లు చెప్తోంది.—కీర్త. 33:1-3, NW.

13. భయపడకుండా పాడాలంటే ఏమి చేయాలో వివరించండి.

13 కుటుంబ ఆరాధన చేసుకుంటున్నప్పుడు లేదా వ్యక్తిగతంగానైనా దీన్ని ప్రయత్నించండి: మన పాటల పుస్తకంలో మీకు ఇష్టమైన పాటను ఎంచుకోండి. ఆ పాట లిరిక్స్‌ని బిగ్గరగా, ధైర్యంగా బయటికి చదవండి. తర్వాత అదే స్వరంతో ప్రతీ పదబంధాన్ని ఆపకుండా చదవండి. చివరిగా అదే స్వరంతో బిగ్గరగా పాడండి. (యెష. 24:14) ఇప్పుడు మీ స్వరం మరింత బిగ్గరగా ఉంటుంది, అది మంచిదే. బిగ్గరగా పాడుతున్నారని భయపడకండి లేదా సిగ్గుపడకండి.

14. (ఎ) పాడేటప్పుడు నోరు పెద్దగా తెరవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? (“ బాగా పాడాలంటే ఏమి చేయాలి” అనే బాక్సు చూడండి.) (బి) బాగా పాడేందుకు సహాయం చేసే ఏ సలహాలు మీకు నచ్చాయి?

14 పాడుతున్నప్పుడు మీ స్వరం బిగ్గరగా ఉండాలంటే మీ నోటిలో ఖాళీ ఏర్పడాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు కన్నా పాడేటప్పుడు నోరును పెద్దగా తెరవాలి. ఒకవేళ మీ స్వరం మరీ పీలగా ఉన్నట్లు లేదా మరీ పెద్దగా ఉన్నట్లు అనిపిస్తే ఏమి చేయాలి? అందుకు ఉపయోగపడే కొన్ని సలహాలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకంలోని 184 పేజీలో ఉన్న “నిర్దిష్ట సమస్యల్ని అధిగమించడం” అనే బాక్సులో ఉంటాయి.

స్తుతిగీతాలు హృదయంలో నుండి రావాలి

15. (ఎ) 2016 వార్షిక కూటంలో ఏ ప్రకటన చేశారు? (బి) పాటల పుస్తకాన్ని రివైజ్‌ చేయడానికి కొన్ని కారణాలు ఏమిటి?

15 సహోదరుడు స్టీఫెన్‌ లెట్‌ 2016 వార్షిక కూటంలో, సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి అనే కొత్త పాటల పుస్తకం వస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆ కూటానికి హాజరైన వాళ్లందరూ చాలా ఆనందించారు. కొత్త పాటల పుస్తకాన్ని తయారు చేయడానికి ఒక కారణం ఏమిటంటే, పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) బైబిలు రివైజ్‌ చేయబడడమని సహోదరుడు వివరించాడు. కాబట్టి రివైజ్‌ చేసిన బైబిల్లోని పదాలకు తగ్గట్లుగా లిరిక్స్‌ని మార్చడం జరిగింది. దాంతోపాటు ప్రకటనా పనికి, విమోచన క్రయధనానికి సంబంధించిన కొత్త పాటల్ని కూడా చేర్చారు. అంతేకాదు పాటలు పాడడం మన ఆరాధనలో ముఖ్యమైన భాగం కాబట్టి అత్యంత నాణ్యమైన పాటల పుస్తకాన్ని తయారుచేయాలని పరిపాలక సభ కోరుకుంది. కొత్త లోక అనువాదం బైబిలుకు ఉన్నలాంటి కవరు, ఇతర రూపురేఖలతోనే పాటల పుస్తకాన్ని తయారుచేశారు.

16, 17. కొత్త పాటల పుస్తకంలో చేసిన ఇతర మార్పులు ఏమిటి?

16 పాటల పుస్తకాన్ని తేలిగ్గా ఉపయోగించడానికి వీలుగా, పాటల్ని అంశాల వారీగా విభజించారు. ఉదాహరణకు మొదటి 12 పాటలు యెహోవా గురించి, తర్వాతి 8 పాటలు యేసు-విమోచన క్రయధనం గురించి, మిగిలినవి ఇతర అంశాల గురించి ఉంటాయి. పుస్తకం మొదట్లో ఉన్న విషయసూచికలో అంశాల లిస్టు ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు, సహోదరులు బహిరంగ ప్రసంగానికి పాటను ఎంపిక చేసుకోవడం తేలికౌతుంది.

17 పాటలు హృదయం నుండి రావాలనే ఉద్దేశంతో, కొన్ని పదాలను మార్చి వాటి భావం మరింత స్పష్టంగా ఉండేలా చూశారు. ఎక్కువగా వాడుకలోలేని పదాల స్థానంలో వేరే పదాల్ని ఉపయోగించారు. అంతేకాదు, “హృదయాన్ని కాపాడుకోండి” అనే శీర్షికను “మన హృదయాల్ని కాపాడుకుందాం” అని మార్చారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ పాటను పాడుతున్నప్పుడు, హృదయాన్ని కాపాడుకోమని ఇతరులకు చెప్తున్నట్లు ఉండేది. అలా పాడడం సమావేశాలకు, మీటింగ్స్‌కు వచ్చే కొత్తవాళ్లకు, ఆసక్తిపరులకు, యౌవనస్థులకు, మన సహోదరీలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ కారణంతోనే పాట శీర్షికను, లిరిక్స్‌ను మార్చడం జరిగింది.

కుటుంబ ఆరాధనలో పాటలు ప్రాక్టీసు చేయండి (18వ పేరా చూడండి)

18. మనం కొత్త పాటల పుస్తకంలోని పాటల్ని ఎందుకు నేర్చుకోవాలి? (అధస్సూచి చూడండి.)

18 ఈ కొత్త పాటల పుస్తకంలోని చాలా పాటలు ప్రార్థనల్లా ఉంటాయి. మీ మనసులోని భావాల్ని యెహోవాకు చెప్పుకోవడానికి అవి సహాయం చేస్తాయి. ఇతర పాటలు, ‘ప్రేమ చూపించమని, మంచి పనులు చేయమని’ మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉంటాయి. (హెబ్రీ. 10:24) అయితే మనం ఆ కొత్త పాటల లిరిక్స్‌ని, మ్యూజిక్‌ని బాగా నేర్చుకోవాలి. దానికొక మార్గమేమిటంటే, సహోదరసహోదరీలు పాడిన పాటల రికార్డింగులను వినడం. అవి jw.orgలో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఇంట్లో ప్రాక్టీసు చేస్తే ధైర్యంగా, భావయుక్తంగా పాడగలుగుతారు. b

19. సంఘమంతా ఏవిధంగా యెహోవాను ఆరాధించవచ్చు?

19 పాటలు పాడడం మన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగమని గుర్తుంచుకోండి. యెహోవా పట్ల మనకున్న ప్రేమను, ఆయన మనకు చేసిన వాటన్నిటికి కృతజ్ఞతను చూపించడానికి అది చక్కని మార్గం. (యెషయా 12:5 చదవండి.) మీరు ఉత్సాహంగా పాడితే, మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఉత్సాహంగా పాడతారు. ఆ విధంగా యౌవనులు, వృద్ధులు, కొత్తవాళ్లు, పాతవాళ్లు అనే తేడా లేకుండా సంఘంలోని అందరూ యెహోవాను ఆరాధించవచ్చు. కాబట్టి పాటలోని భావాల్ని వ్యక్తంచేస్తూ పాడడానికి వెనకాడకండి. ‘యెహోవాకు పాట పాడండి’ అని కీర్తనకర్త ఇచ్చిన నిర్దేశాన్ని పాటించండి. సంతోష స్వరంతో పాడండి!—కీర్త. 96:1, NW.

a మంచి స్వరంతో పాడడానికి సహాయం చేసే మరిన్ని సలహాల కోసం, డిసెంబరు 2014 బ్రాడ్‌కాస్టింగ్‌ (ఇంగ్లీషు) కార్యక్రమం చూడండి. (వీడియో కేటగిరీ మా స్టూడియో నుండి).

b సమావేశాల్లో ఉదయం అలాగే మధ్యాహ్న కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు పది నిమిషాలపాటు వీడియో రూపంలో ఉండే సంగీతాన్ని చూపిస్తారు. పాటలు పాడాలనే ఉత్సాహాన్ని అది మనలో కలిగిస్తుంది. అంతేకాదు కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేలా మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆ సంగీతం ప్రారంభం అవ్వడానికి ముందే మనందరం సీట్లలో కూర్చొని, వినడానికి సిద్ధంగా ఉండాలి.