కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా?

మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా?

“యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.”కీర్త. 34:22.

పాటలు: 8, 54

1. వారసత్వంగా వచ్చిన పాపం వల్ల దేవుని నమ్మకమైన సేవకుల్లో చాలామంది ఎలా భావిస్తున్నారు?

 “నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి!” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమా. 7:24) పౌలులాగే నేడున్న దేవుని నమ్మకమైన సేవకుల్లో చాలామంది నిరుత్సాహపడి, కృంగిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే యెహోవాను సంతోషపెట్టాలని ఎంత కోరుకున్నా వారసత్వంగా వచ్చిన పాపం, అపరిపూర్ణత బట్టి అలా చేయలేకపోతున్నాం. గంభీరమైన పాపం చేసిన కొంతమంది క్రైస్తవులైతే, యెహోవా తమను ఎన్నడూ క్షమించడని అనుకున్నారు.

2. (ఎ) కీర్తన 34:22 వ వచనం బట్టి దేవుని సేవకులు అపరాధ భావాలతో కృంగిపోవాల్సిన అవసరం లేదని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి నేర్చుకుంటాం? (“ పాఠాలా లేక సాదృశ్యాలా” అనే బాక్సు చూడండి.)

2 మనం యెహోవాను ఆశ్రయిస్తే అపరాధ భావాలతో కృంగిపోవాల్సిన అవసరం లేదని బైబిలు చెప్తోంది. (కీర్తన 34:22 చదవండి.) యెహోవాను ఆశ్రయించడమంటే ఏమిటి? ఆయన మనల్ని కరుణించి, క్షమించాలంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే, ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలులో ఉన్న ఆశ్రయపురాల ఏర్పాటు గురించి తెలుసుకోవాలి. ధర్మశాస్త్ర ఒప్పందం అమలులో ఉన్నంతవరకు అంటే క్రీ.శ. 33 పెంతెకొస్తు వరకు ఆశ్రయపురాలు ఉండేవి. ధర్మశాస్త్రం యెహోవా ఇచ్చాడు కాబట్టి పాపాన్ని, పాపం చేసినవాళ్లను, పశ్చాత్తాపపడిన వాళ్లను ఆయనెలా చూస్తాడో ఆశ్రయపురాల ఏర్పాటు నుండి తెలుసుకోవచ్చు. ముందుగా ఇశ్రాయేలులో ఆశ్రయపురాలు ఎందుకు ఉండేవో, అవి ఎలా ఉపయోగపడేవో తెలుసుకుందాం.

‘ఆశ్రయపురాల్ని మీ కోసం ఎంపిక చేసుకోండి’

3. ప్రాచీన ఇశ్రాయేలులో హత్య చేసిన వ్యక్తికి ఏమి జరిగేది?

3 నరహత్య యెహోవా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఒక ఇశ్రాయేలీయుడు ఎవరినైనా చంపితే, ప్రతీకారం తీర్చుకునే పురుషుడు అంటే చనిపోయిన వ్యక్తికి దగ్గరి బంధువు ఆ హంతకుణ్ణి చంపాలి. (సంఖ్యా. 35:19-20ఎ) ఆ విధంగా చనిపోయిన వ్యక్తి ప్రాణానికి ప్రతిగా, హంతకుడు తన ప్రాణాన్ని ఇస్తున్నట్లు అవుతుంది. ఒకవేళ ఆ హంతకుణ్ణి వెంటనే చంపకపోతే వాగ్దాన దేశం అపవిత్రం అవుతుంది. నరహత్య చేసి, “మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు” అని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.—సంఖ్యా. 35:33, 34.

4. ఒక ఇశ్రాయేలీయుడు అనుకోకుండా ఎవరినైనా చంపితే ఏమి చేయాలి?

4 ఒకవేళ అనుకోకుండా ఎవరినైనా చంపితే అప్పుడేంటి? అనుకోకుండా చంపినా అది హత్యే అవుతుంది. (ఆది. 9:5) కానీ అలాంటి సందర్భంలో, హంతకుడి పట్ల కరుణ చూపించవచ్చని యెహోవా చెప్పాడు. కాబట్టి హంతకుడు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి నుండి తప్పించుకుని, ఆరు ఆశ్రయపురాల్లో ఏదైనా ఒకదానికి పారిపోవచ్చు. ఒకవేళ ఆశ్రయపురంలోకి అనుమతించబడితే అతను సురక్షితంగా ఉన్నట్లే. కానీ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అతను అక్కడే ఉండాలి.—సంఖ్యా. 35:15, 28.

5. యెహోవాను మరింత బాగా అర్థంచేసుకోవడానికి ఆశ్రయపురాల ఏర్పాటు ఎలా సహాయం చేస్తుంది?

5 యెహోవాయే ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఆయన యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాడు, ‘ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు, “నేను మోషే ద్వారా మీకు చెప్పిన ఆశ్రయపురాల్ని మీ కోసం ఎంపిక చేసుకోండి.”’ ఆశ్రయపురాల్ని యెహోవాయే పవిత్రపర్చాడు లేదా ‘ప్రత్యేకపర్చాడు.’ (యెహో. 20:1-3, 7-8, NW) అయితే యెహోవా కరుణను మరింతగా అర్థంచేసుకోవడానికి ఈ ఏర్పాటు మనకెలా సహాయం చేస్తుంది? నేడు యెహోవాను ఆశ్రయించడం గురించి ఈ ఏర్పాటు మనకేమి నేర్పిస్తుంది?

‘పెద్దలకు తన విషయం చెప్పాలి’

6, 7. (ఎ) అనుకోకుండా హత్య చేసిన వ్యక్తికి తీర్పుతీర్చే విషయంలో పెద్దలకు ఉన్న పాత్ర ఏమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) హత్య చేసిన వ్యక్తి పెద్దలతో మాట్లాడడం ఎందుకు తెలివైన పని?

6 ఒక ఇశ్రాయేలీయుడు అనుకోకుండా ఎవరినైనా చంపితే, ఆశ్రయపురానికి పరుగెత్తుకెళ్లి దాని ద్వారం దగ్గర ‘తన విషయం’ గురించి పెద్దలకు చెప్పాలి. పెద్దలు అతన్ని చేర్చుకోవాలి. (యెహో. 20:4, NW) కొంతకాలం తర్వాత, వాళ్లు అతన్ని హత్య జరిగిన ప్రాంతానికి పంపిస్తారు, అక్కడి పెద్దలు అతనికి తీర్పుతీరుస్తారు. (సంఖ్యాకాండము 35:24, 25 చదవండి.) ఆ హత్య అనుకోకుండా జరిగిందేనని వాళ్లు నిర్ణయిస్తే, అతన్ని మళ్లీ ఆశ్రయపురానికే పంపిస్తారు.

7 ఇంతకీ అతను పెద్దలతో ఎందుకు మాట్లాడాలి? ఇశ్రాయేలీయులు పరిశుద్ధంగా ఉండేలా చూసే బాధ్యత అక్కడి పెద్దలకు ఉంది. అంతేకాదు, అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి యెహోవా కరుణ నుండి ప్రయోజనం పొందేలా పెద్దలు సహాయం చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి పెద్దల దగ్గరికి వెళ్లకపోతే తన ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఒక బైబిలు విద్వాంసుడు రాశాడు. దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే దానికి అతనే బాధ్యుడౌతాడు. ఒకవేళ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే అతను సహాయం కోసం పెద్దల దగ్గరకు వెళ్లాలి, వాళ్లు చెప్పినట్లు చేయాలి. ఒకవేళ అతను ఆశ్రయపురాల్లో ఏదైనా ఒకదానికి వెళ్లకపోతే, అతన్ని చంపే స్వేచ్ఛ చనిపోయిన వ్యక్తి దగ్గరి బంధువుకు ఉంటుంది.

8, 9. గంభీరమైన పాపం చేసిన క్రైస్తవులు పెద్దల దగ్గరకు ఎందుకు వెళ్లాలి?

8 నేడు, గంభీరమైన పాపం చేసిన క్రైస్తవులు సంఘపెద్దల దగ్గరకు వెళ్లాలి. అప్పుడు యెహోవాతో తమకున్న మంచి సంబంధాన్ని తిరిగి సంపాదించుకునేలా పెద్దలు సహాయం చేస్తారు. ఇది ఎందుకంత ప్రాముఖ్యం? మొదటిగా, గంభీరమైన పాపాల విషయంలో తీర్పుతీర్చడానికి పెద్దలను ఏర్పాటు చేసింది యెహోవాయే. (యాకో. 5:14-16) రెండవదిగా, పశ్చాత్తాపం చూపించిన వ్యక్తి తిరిగి దేవుని ఆమోదాన్ని సంపాదించుకుని, ఆ పాపాన్ని మళ్లీ చేయకుండా ఉండడానికి పెద్దలు సహాయం చేస్తారు. (గల. 6:1; హెబ్రీ. 12:11) మూడవదిగా, పశ్చాత్తాపం చూపించిన వ్యక్తిని బలపర్చేందుకు, అతనికున్న బాధను, అపరాధ భావాల్ని తీసేసుకునేలా సహాయం చేసేందుకు దేవుడు పెద్దల్ని ఎంచుకుని, వాళ్లకు శిక్షణనిచ్చాడు. అలాంటి పెద్దలను “గాలివానకు చాటైన చోటు” అని యెహోవా పిలుస్తున్నాడు. (యెష. 32:1, 2) దేవుడు మనపై చూపించే కరుణకు ఈ ఏర్పాటు ఒక ఉదాహరణ.

9 పెద్దలతో మాట్లాడడం వల్ల, వాళ్లిచ్చే సహాయం తీసుకోవడం వల్ల ఎంతో ఓదార్పు దొరుకుతుందని చాలామంది దేవుని సేవకులు గుర్తించారు. ఉదాహరణకు, డానియేల్‌ అనే సహోదరుడు ఒక గంభీరమైన పాపం చేశాడు. కానీ చాలా నెలల వరకు ఆయన ఆ విషయాన్ని సంఘపెద్దలకు చెప్పలేదు. అయనిలా అంటున్నాడు, “అప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి కాబట్టి ఇక పెద్దలు కూడా ఏమీ చేయలేరని అనుకున్నాను.” లోలోపల మాత్రం, తాను చేసిన పాపం ఎవరికో ఒకరికి తెలిసిపోతుందేమోననే భయం ఉండేది, ప్రార్థన చేసే ప్రతీసారి యెహోవాకు క్షమాపణలు చెప్తూ మొదలుపెట్టాలని అయనకు అనిపించేది. ఆఖరికి, సహాయం చేయమని ఆయన పెద్దల్ని అడిగాడు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనిలా అన్నాడు, “నిజమే, పెద్దల దగ్గరికి వెళ్లడానికి భయపడ్డాను. కానీ వాళ్ల దగ్గరికి వెళ్లాక నా భుజాల పై ఉన్న బరువును ఎవరో తీసేసినట్లు అనిపించింది.” ఇప్పుడు డానియేల్‌ యెహోవాతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడు, మంచి మనస్సాక్షితో ఉండగలుగుతున్నాడు, ఈమధ్యే సంఘ పరిచారకుడు కూడా అయ్యాడు.

‘ఆ పురములలో ఒకదానికి పారిపోవాలి’

10. అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి క్షమాపణ పొందాలంటే ఏమి చేయాలి?

10 అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి క్షమాపణ పొందాలంటే, వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆశ్రయపురానికి పారిపోవాలి. (యెహోషువ 20:4 చదవండి.) ఆశ్రయపురానికి వెళ్లి, ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడ ఉంటేనే అతను ప్రాణాలతో ఉంటాడు. నిజానికి దానికోసం ఆ వ్యక్తి త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అతను తన ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన ఇంటిని, వేరే ప్రాంతాలకు వెళ్లే స్వేచ్ఛను త్యాగం చేయాలి. a (సంఖ్యా. 35:25) కానీ ఆ త్యాగాలకు ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎప్పుడైనా ఆశ్రయపురాన్ని విడిచి వెళ్తే, తాను చేసిన హత్యను గంభీరమైన తప్పుగా ఎంచట్లేదని చూపిస్తాడు, అంతేకాదు అలా వెళ్తే అతని ప్రాణాలకే ముప్పు.

11. దేవుని కరుణ పట్ల కృతజ్ఞత ఉందని పశ్చాత్తాపపడిన క్రైస్తవులు ఎలా చూపించవచ్చు?

11 నేడు కూడా పశ్చాత్తాపపడే వ్యక్తి దేవుని క్షమాపణ పొందాలంటే కొన్ని పనులు చేయాల్సివుంటుంది. అతను చేస్తున్న పాపాల్ని ఆపేయాలి. అంతేకాదు, గంభీరమైన పాపాలకు దారితీసే దేనికైనా దూరంగా ఉండాలి. పశ్చాత్తాపం చూపించిన కొరింథులోని క్రైస్తవులు ఏమి చేశారో వివరిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం మీలో ఎంత పట్టుదలను కలిగించిందో చూడండి. ఆ దుఃఖం మీ మీద పడిన నిందను తీసేసుకోవడానికి మీకు సహాయం చేసింది; తప్పు విషయంలో ఆగ్రహాన్ని, దైవభయాన్ని, పశ్చాత్తాపపడాలనే బలమైన కోరికను కలిగించింది; తప్పు దిద్దే విషయంలో ఉత్సాహాన్ని నింపింది.” (2 కొరిం. 7:10, 11) పాపాలు చేయడం ఆపేయడానికి మనం చేయగలిగినదంతా చేస్తే, మన పరిస్థితి గురించి ఎంతో బాధపడుతున్నామనీ, తన కరుణను అలుసుగా తీసుకోవట్లేదనీ యెహోవాకు చూపిస్తాం.

12. యెహోవా కరుణను పొందుతూ ఉండడానికి క్రైస్తవులు దేన్ని వదిలేయాలి?

12 యెహోవా కరుణను పొందుతూ ఉండడానికి ఒక క్రైస్తవుడు దేన్ని కూడా వదిలేయాలి? పాపానికి దారితీసే దేన్నైనా, ఆఖరికి తమకు ఎంతో ఇష్టమైన వాటిని కూడా వదిలేయడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉండాలి. (మత్త. 18:8, 9) ఉదాహరణకు, ఒకవేళ మీ స్నేహితులు యెహోవాకు ఇష్టంలేని పనులు చేయమని ప్రోత్సహిస్తుంటే, వాళ్లతో స్నేహాన్ని ఆపేస్తారా? మద్యాన్ని ఎంత తాగాలో నియంత్రించుకోలేకపోతే, అతిగా తాగే పరిస్థితులకు దూరంగా ఉంటారా? తప్పుడు కోరికలు అదుపు చేసుకోవడం మీకు కష్టంగా ఉంటే అలాంటి ఆలోచనలు కలిగించే సినిమాలకు, వెబ్‌సైట్లకు లేదా పనులకు దూరంగా ఉంటారా? యెహోవా మాట వినడానికి మీరు చేసే ఏ త్యాగానికైనా ప్రతిఫలం ఉంటుందని గుర్తుంచుకోండి. యెహోవా మనల్ని ‘వదిలేశాడనే’ ఆలోచనకు మించిన బాధ ఇంకొకటి ఉండదు. ఆయన చూపించే ‘శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమను’ పొందడం కన్నా మించిన ఆనందం మరొకటి ఉండదు.—యెష. 54:7, 8, NW.

‘అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి’

13. అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురంలో సురక్షితంగా, సంతోషంగా ఎందుకు ఉండగలడో వివరించండి.

13 అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఒక్కసారి ఆశ్రయపురం లోపలికి వెళ్లాడంటే, ఇక అతను సురక్షితంగా ఉన్నట్లే. వాటిగురించి యెహోవా ఇలా అన్నాడు, ‘అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.’ (యెహో. 20:1-3, NW) ఆ నేరం విషయంలో అతన్ని రెండవసారి తీర్పుతీర్చాలని యెహోవా కోరుకోవట్లేదు. అంతేకాదు, అతన్ని చంపడానికి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి ఆశ్రయపురానికి వెళ్లకూడదు. హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురంలో ఉన్నంతకాలం అతను యెహోవా సంరక్షణలో సురక్షితంగా ఉన్నట్లే. అయితే ఆశ్రయపురం జైలు లాంటిది కాదు. ఆశ్రయపురంలో ఉండే వ్యక్తి ఉద్యోగం చేసుకోవచ్చు, ఇతరులకు సహాయం చేయవచ్చు, ప్రశాంతంగా యెహోవా సేవ చేసుకోవచ్చు. అతను తన జీవితాన్ని సంతోషంగా, సంతృప్తిగా అనుభవించవచ్చు.

యెహోవా మిమ్మల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండండి (14-16 పేరాలు చూడండి)

14. పశ్చాత్తాపం చూపించిన క్రైస్తవుడు ఏ ధైర్యంతో ఉండవచ్చు?

14 గంభీరమైన పాపాలు చేసిన కొంతమంది పశ్చాత్తాపం చూపించిన తర్వాత కూడా అపరాధ భావాలు కలిగివుంటారు. ఇంకొంతమందైతే, తాము చేసిన పనిని యెహోవా ఎన్నడూ మర్చిపోడని అనుకుంటారు. ఒకవేళ మీకలా అనిపిస్తే ఒక విషయం గుర్తుంచుకోండి, యెహోవా ఒక్కసారి క్షమిస్తే దాన్ని పూర్తిగా మర్చిపోతాడు. కాబట్టి మీరు అపరాధ భావాలతో ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ప్రస్తావించిన డానియేల్‌ అనే సహోదరునికి అదే జరిగింది. పెద్దలు ఆయన్ని సరిదిద్ది, మంచి మనస్సాక్షిని తిరిగి పొందేందుకు సహాయం చేసిన తర్వాత, ఆయన ఎంతో ఉపశమనం పొందాడు. ఆయనిలా చెప్పాడు, “నేను ఇక అపరాధ భావాలతో ఉండాల్సిన అవసరం లేదు. మనం చేసిన పాపం ఒక్కసారి పోయిందంటే ఇక అది పూర్తిగా పోయినట్లే. యెహోవా చెప్పినట్లు, ఆయన మన బరువుల్ని తీసేస్తాడు, వాటిని మీకు చాలా దూరంలో పెడతాడు. వాటిని మీరు మళ్లీ ఎప్పుడూ చూడాల్సిన అవసరం ఉండదు.” హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురంలో ఉన్నప్పుడు, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వచ్చి చంపేస్తాడేమోనని భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, యెహోవా మన పాపాల్ని క్షమించిన తర్వాత, వాటిని మళ్లీ గుర్తుచేసుకుని మనల్ని శిక్షిస్తాడేమోనని భయపడాల్సిన అవసరం లేదు.—కీర్తన 103:8-12 చదవండి.

15, 16. యేసు విమోచనా క్రయధనం ఇచ్చాడని, ఆయన మన ప్రధాన యాజకుడని తెలుసుకోవడం వల్ల దేవుని కరుణపై మీ నమ్మకం ఎలా బలపడింది?

15 యెహోవా కరుణపై నమ్మకం ఉంచడానికి ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయుల కన్నా నేడు మనకే ఎక్కువ కారణాలు ఉన్నాయి. యెహోవాకు పరిపూర్ణ విధేయత చూపించలేకపోతున్న పౌలు తాను “దౌర్భాగ్యుణ్ణి” అని చెప్పిన తర్వాత ఇలా అన్నాడు, “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!” (రోమా. 7:25) ఆ మాటలకు అర్థమేమిటి? పౌలు పాపపు కోరికలతో పోరాడి, గతంలో పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపం చూపించాడు. కాబట్టి యేసు విమోచనా క్రయధనం ఆధారంగా యెహోవా తనను క్షమించాడని పౌలు నమ్మాడు. యేసు విమోచనా క్రయధనం అర్పించడం వల్ల మనం మంచి మనస్సాక్షి కలిగివుంటున్నాం, హృదయలోతుల్లో ప్రశాంతతను అనుభవిస్తున్నాం. (హెబ్రీ. 9:13, 14) మన ప్రధాన యాజకుడిగా, “తన పేరున దేవునికి ప్రార్థించేవాళ్లను యేసు పూర్తిస్థాయిలో రక్షించగలడు కూడా, ఎందుకంటే వాళ్ల తరఫున వేడుకోవడానికి ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు.” (హెబ్రీ. 7:24, 25) ప్రాచీన కాలాల్లో, యెహోవా పాపాల్ని క్షమిస్తాడనే భరోసాను ప్రధాన యాజకులు ఇశ్రాయేలీయులకు ఇచ్చేవాళ్లు. అయితే, నేడు యేసు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి, “మనకు సహాయం అవసరమైనప్పుడు కరుణను, అపారదయను” దేవుడు ఇస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీ. 4:15, 16.

16 మనం యెహోవాను ఆశ్రయించాలంటే, విమోచనా క్రయధనంపై విశ్వాసం ఉంచాలి. విమోచనా క్రయధనం మనుషులందరి కోసం అర్పించబడిందని కాకుండా వ్యక్తిగతంగా మీకోసం అర్పించబడిందని విశ్వసించండి. (గల. 2:20, 21) దాని ఆధారంగానే యెహోవా మీ పాపాల్ని క్షమిస్తాడని విశ్వసించండి. దానివల్ల శాశ్వత కాలం జీవించే నిరీక్షణ మీరు పొందారని విశ్వసించండి. యేసు విమోచనా క్రయధనం యెహోవా మీకు ఇచ్చిన బహుమానం.

17. మీరు యెహోవాను ఆశ్రయించాలని ఎందుకు అనుకుంటున్నారు?

17 యెహోవా కరుణను అర్థంచేసుకోవడానికి ఆశ్రయపురాలు మనకు సహాయం చేస్తాయి. దేవుడు చేసిన ఈ ఏర్పాటునుబట్టి జీవం పవిత్రమైనదని నేర్చుకున్నాం. అంతేకాదు పెద్దలు మనకెలా సహాయం చేస్తారో, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏమిటో, యెహోవా మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో నేర్చుకున్నాం. అయితే, మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా? అంతకన్నా సురక్షితమైన స్థలం ఎక్కడా లేదు. (కీర్త. 91:1, 2) న్యాయానికి, కరుణకు అత్యంత గొప్ప ఆదర్శమైన యెహోవాను అనుకరించడానికి ఆశ్రయపురాలు మనకెలా సహాయం చేస్తాయో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

a యూదా విద్వాంసుల ప్రకారం, ఆశ్రయపురంలో తలదాచుకునే వ్యక్తితో ఉండడానికి అతని దగ్గరి బంధువు ఎవరైనా ఒకరు వచ్చేవాళ్లు.