కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాలా న్యాయాన్ని, కరుణను చూపించండి

యెహోవాలా న్యాయాన్ని, కరుణను చూపించండి

“సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి.”జెక. 7:9.

పాటలు: 125, 88

1, 2. (ఎ) దేవుని ధర్మశాస్త్రం గురించి యేసు ఎలా భావించాడు? (బి) శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రంలోని విషయాల్ని ఎలా తప్పుగా అన్వయించారు?

 యేసుకు ధర్మశాస్త్రమంటే చాలా ఇష్టం. ఎందుకంటే దాన్ని తన తండ్రి అయిన యెహోవా ఇచ్చాడు. యేసు తన జీవితంలో యెహోవాకు అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు. ధర్మశాస్త్రం మీద యేసుకు ఉండే ప్రగాఢమైన ప్రేమ గురించి బైబిలు ముందే చెప్పింది. కీర్తన 40:8 లో ఇలా ఉంది, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” దేవుని ధర్మశాస్త్రం ఏ లోపంలేనిదని, ప్రయోజనకరమైనదని, దానిలోని విషయాలు తప్పక నెరవేరుతాయని యేసు తన మాటల ద్వారా, క్రియల ద్వారా నిరూపించాడు.—మత్త. 5:17-19.

2 తన తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని విషయాల్ని శాస్త్రులు, పరిసయ్యులు తప్పుగా అన్వయించారు, వాటిని పాటించడం కష్టమని ప్రజలు అనుకునేలా చేశారు. అది చూసి యేసు చాలా బాధపడ్డాడు. ఆయన శాస్త్రులూ, పరిసయ్యులతో, “మీరు పుదీనలో, సోపులో, జీలకర్రలో పదోవంతు ఇస్తారు” అని అన్నాడు. అంటే వాళ్లు ధర్మశాస్త్రంలోని చిన్న విషయాలను చాలా జాగ్రత్తగా పాటిస్తారని అర్థం. మరి సమస్య ఎక్కడ వచ్చింది? యేసు ఇలా వివరించాడు, “కానీ, ధర్మశాస్త్రంలోని మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని, కరుణను, విశ్వసనీయతను పట్టించుకోరు.” (మత్త. 23:23) వాళ్ల మనసంతా నియమాలు పెట్టడం మీదే ఉండేది కానీ ధర్మశాస్త్రాన్ని అర్థంచేసుకునేవాళ్లు కాదు. పైగా తాము ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకునేవాళ్లు. యేసు మాత్రం అలా కాదు. ధర్మశాస్త్రం వెనకున్న ఉద్దేశమేమిటో, ప్రతీ ఆజ్ఞ యెహోవా గురించి ఏమి చెప్తుందో ఆయన అర్థంచేసుకున్నాడు.

3. ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

3 క్రైస్తవులమైన మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (రోమా. 7:6) మరైతే, యెహోవా తన వాక్యమైన బైబిల్లో ధర్మశాస్త్రాన్ని కూడా ఎందుకు రాయించాడు? “మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని” అంటే మనం ధర్మశాస్త్రంలోని సూత్రాలను అర్థంచేసుకొని, వాటిని పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఉదాహరణకు, ఆశ్రయపురాల ఏర్పాటు నుండి మనం ఏ సూత్రాలను నేర్చుకుంటాం? ముందటి ఆర్టికల్‌లో అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఏం చేయాలో పరిశీలించడం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఈ ఆర్టికల్‌లో, ఆశ్రయపురాలు యెహోవా గురించి ఏమి నేర్పిస్తున్నాయో, ఆయన లక్షణాలను మనమెలా అనుకరించవచ్చో పరిశీలిస్తాం. యెహోవా కరుణగల దేవుడని ఆశ్రయపురాల ఏర్పాటును బట్టి ఎలా తెలుసుకోవచ్చు? జీవంపట్ల యెహోవాకున్న అభిప్రాయం గురించి అవి మనకు ఏమి నేర్పిస్తాయి? అవి యెహోవా పరిపూర్ణ న్యాయాన్ని ఎలా తెలియజేస్తాయి? అనే ప్రశ్నలకు జవాబులు కూడా తెలుసుకుంటాం. ఒక్కో ప్రశ్నకు జవాబు తెలుసుకుంటుండగా మీరు మీ పరలోక తండ్రిని ఎలా అనుకరించవచ్చో ఆలోచించండి.—ఎఫెసీయులు 5:1 చదవండి.

ఆశ్రయపురాలు ఉన్న స్థలాలు దేవుని కరుణను తెలియజేస్తున్నాయి

4, 5. (ఎ) అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురాలకు సులభంగా వెళ్లగలిగేలా ఎలాంటి ఏర్పాట్లు చేయబడ్డాయి? ఎందుకు? (బి) అది యెహోవా గురించి మనకేమి నేర్పిస్తుంది?

4 అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి సులభంగా వెళ్లగలిగేలా యెహోవా ఆరు ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. యొర్దానుకు చెరో వైపున మూడు పట్టణాలను ఎంచుకోమని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎందుకంటే, అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి వాటిలో ఒక దానిలోకి త్వరగా, సులభంగా వెళ్లగలుగుతాడు. (సంఖ్యా. 35:11-14) వాటికి వెళ్లే దారులను కూడా మంచి స్థితిలో ఉంచేవాళ్లు. (ద్వితీ. 19:3) యూదా ఆచారం ప్రకారం, ఆశ్రయపురాలను కనుక్కునేలా రోడ్ల వెంబడి గుర్తులు ఉండేవి. ఆశ్రయపురాలు ఉన్నాయి కాబట్టి, అనుకోకుండా హత్య చేసిన ఇశ్రాయేలీయుడు భద్రత కోసం వేరే దేశానికి పారిపోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ, వేరే దేశాలకు వెళ్తే అక్కడ అబద్ధ దేవుళ్లను ఆరాధించే ప్రమాదంలో పడవచ్చు.

5 దీనిగురించి ఆలోచించండి. హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఎవరైనా అనుకోకుండా హత్య చేస్తే ఆ వ్యక్తి కరుణను, కనికరాన్ని, భద్రతను పొందే ఏర్పాటు కూడా యెహోవా చేశాడు. ఒక బైబిలు వ్యాఖ్యాత ఇలా అన్నాడు, “ప్రతీది స్పష్టంగా, సూటిగా, సాధ్యమైనంత సులభంగా ఉంది.” యెహోవా, తన సేవకులను శిక్షించడానికి అవకాశాల కోసం వెదికే క్రూరమైన న్యాయాధిపతి కాదు. ఆయన “అత్యంత కరుణామయుడు.”—ఎఫె. 2:4.

6. పరిసయ్యులు యెహోవాలా కరుణ చూపించారా? వివరించండి.

6 పరిసయ్యులు ఇతరుల పట్ల కరుణ చూపించడానికి ఇష్టపడేవాళ్లు కాదు. ఉదాహరణకు, ఎవరైనా ఒకే తప్పును మూడు కన్నా ఎక్కువసార్లు చేస్తే వాళ్లను పరిసయ్యులు క్షమించేవాళ్లు కాదని యూదా ఆచారం తెలియజేస్తోంది. వాళ్ల ఆలోచనా విధానం ఎంత తప్పో తెలియజేయడానికి, పన్ను వసూలు చేసే వ్యక్తి పక్కన నిలబడి ప్రార్థన చేస్తున్న పరిసయ్యుని గురించిన ఉదాహరణను యేసు చెప్పాడు. పరిసయ్యుడు ఇలా అన్నాడు, “దేవా, నేను మిగతావాళ్లలా లేనందుకు, అంటే దోచుకునేవాళ్లలా, అనీతిమంతుల్లా, వ్యభిచారుల్లా, చివరికి ఈ పన్ను వసూలు చేసేవాడిలా కూడా లేనందుకు నీకు కృతజ్ఞతలు.” ఇంతకీ యేసు ఏమి చెప్పాలనుకున్నాడు? పరిసయ్యులు “ఇతరుల్ని చిన్నచూపు” చూసేవాళ్లు, తాము ఇతరులపట్ల కరుణ చూపించాల్సిన అవసరం లేదని అనుకునేవాళ్లు.—లూకా 18:9-14.

క్షమాపణ అడగడానికి ఇతరులు మీ దగ్గరకు ధైర్యంగా వస్తారా లేదా భయపడతారా? వినయంగా, స్నేహపూర్వకంగా ఉండండి (4-8 పేరాలు చూడండి)

7, 8. (ఎ) యెహోవాలా మనం ఎలా కరుణ చూపించవచ్చు? (బి) ఇతరులను క్షమించాలంటే మనకెందుకు వినయం ఉండాలి?

7 పరిసయ్యులను కాదు, యెహోవాను అనుకరించండి. కరుణను, కనికరాన్ని చూపించండి. (కొలొస్సయులు 3:13 చదవండి.) ఇతరులు ఏ మాత్రం సంకోచించకుండా మీ దగ్గరకొచ్చి క్షమాపణ అడిగేలా ఉండండి. (లూకా 17:3, 4) ఈ ప్రశ్నలు వేసుకోండి, ‘ఇతరులు నన్ను పదేపదే బాధపెట్టినా నేను వాళ్లను త్వరగా, సులభంగా క్షమిస్తానా? నన్ను బాధపెట్టిన వాళ్లతో వెంటనే సమాధానపడతానా?’

8 ఇతరులను క్షమించాలంటే, మనకు వినయం ఉండాలి. పరిసయ్యులు తామే గొప్పవాళ్లమని అనుకున్నారు అందుకే వాళ్లు ఇతరులను క్షమించడానికి ఇష్టపడలేదు. కానీ క్రైస్తవులముగా మనం వినయం చూపిస్తూ ‘ఇతరులను మనకన్నా గొప్పవాళ్లుగా ఎంచుతాం,’ వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తాం. (ఫిలి. 2:3) మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను యెహోవాలా వినయాన్ని చూపిస్తున్నానా?’ ఒకవేళ మనం వినయంగా ఉంటే, ఇతరులు మనల్ని సులభంగా క్షమాపణ అడుగుతారు, మనం కూడా వాళ్లను సులభంగా క్షమిస్తాం. కరుణ చూపించడానికి త్వరపడండి, కోప్పడడానికి నిదానించండి.—ప్రసం. 7:8, 9.

జీవాన్ని గౌరవిస్తే, ‘ప్రాణం తీసిన దోషం నీమీద మోపబడదు’

9. జీవం పవిత్రమైనదని ఇశ్రాయేలీయులు అర్థంచేసుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడు?

9 ఆశ్రయపురాలు ఉండడానికి ఒక ముఖ్య కారణమేమిటంటే, అమాయకుల ప్రాణం తీసిన రక్తాపరాధం ఇశ్రాయేలీయుల మీదకు రాకుండా కాపాడడం. (ద్వితీ. 19:10) యెహోవా జీవాన్ని ప్రేమిస్తాడు, హత్యను ద్వేషిస్తాడు. (సామె. 6:16, 17) న్యాయవంతుడు, పవిత్రుడు అయిన యెహోవా దేవుడు, అనుకోకుండా జరిగిన హత్యను కూడా చూసీచూడనట్లు వదిలేయడు. నిజానికి, అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి కరుణ పొందవచ్చు. కానీ ముందు అతను తన పరిస్థితిని పెద్దలకు వివరించాలి. ఆ హత్య అనుకోకుండా జరిగినదేనని పెద్దలు తీర్పునిస్తే, ప్రధాన యాజకుడు చనిపోయేవరకు ఆ హంతకుడు ఆశ్రయపురంలోనే ఉండవచ్చు. అంటే అతను తన మిగిలిన జీవితమంతా ఆశ్రయపురంలోనే ఉండాలి. జీవం ఎంత పవిత్రమైనదో ఈ ఏర్పాటు ఇశ్రాయేలీయులందరికీ గుర్తుచేసింది. వాళ్లు తమ జీవదాతను ఘనపర్చాలంటే, ఇతరుల జీవాన్ని అపాయంలో పడేసే వాటికి దూరంగా ఉండడానికి చేయగలినదంతా చేయాలి.

10. ఇతరుల ప్రాణాలంటే తమకు లెక్కలేదని శాస్త్రులు, పరిసయ్యులు ఎలా చూపించారని యేసు చెప్పాడు?

10 యెహోవా ఇతరుల ప్రాణాల్ని విలువైనవిగా చూసినట్టు శాస్త్రులు, పరిసయ్యులు చూడలేదు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు, “మీరు జ్ఞానపు తాళంచెవిని తీసుకెళ్లిపోయారు. మీరు లోపలికి వెళ్లలేదు, వెళ్లేవాళ్లను కూడా మీరు ఆపుతున్నారు!” (లూకా 11:52) యేసు మాటలకు అర్థమేమిటి? శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలకు దేవుని వాక్యాన్ని వివరించి, శాశ్వత జీవం సంపాదించుకోవడానికి సహాయం చేయాలి. అయితే అలా చేయకపోగా, “జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి” అయిన యేసును అనుసరించకుండా ప్రజలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. (అపొ. 3:15) ఆ విధంగా, వాళ్లు ప్రజలను నాశనానికి నడిపించేవాళ్లు. గర్విష్ఠులు, స్వార్థపరులు అయిన శాస్త్రులు, పరిసయ్యులు ప్రజల ప్రాణాల్ని లెక్క చేసేవాళ్లు కాదు. వాళ్లు ఎంత క్రూరులు, ప్రేమలేనివాళ్లో కదా!

11. (ఎ) యెహోవాలా జీవాన్ని విలువైనదిగా ఎంచుతున్నట్లు అపొస్తలుడైన పౌలు ఎలా చూపించాడు? (బి) పౌలులా ఉత్సాహంగా ప్రకటించడానికి మనకేది సహాయం చేస్తుంది?

11 మనం శాస్త్రులు, పరిసయ్యుల్లా కాకుండా యెహోవాలా ఎలా ఉండవచ్చు? మనం జీవాన్ని గౌరవించి, దాన్ని విలువైనదిగా ఎంచాలి. పౌలు సాధ్యమైనంత ఎక్కువమందికి దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం ద్వారా జీవాన్ని విలువైనదిగా ఎంచుతున్నట్లు చూపించాడు. అందుకే ఆయనిలా చెప్పగలిగాడు, “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను.” (అపొస్తలుల కార్యాలు 20:26, 27 చదవండి.) రక్తాపరాధం తనమీదికి రాకూడదని లేదా యెహోవా చెప్పాడని మాత్రమే పౌలు ప్రకటనా పని చేశాడా? లేదు. ఆయన ప్రజలను ప్రేమించాడు, వాళ్ల ప్రాణాల్ని విలువైనవిగా ఎంచాడు. వాళ్లు శాశ్వత జీవం పొందాలని కోరుకున్నాడు. (1 కొరిం. 9:19-23) మనం కూడా జీవాన్ని యెహోవా చూసినట్టు చూడాలి. ప్రతీఒక్కరు పశ్చాత్తాపం చూపించి తమ జీవాన్ని కాపాడుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:9) మనం యెహోవాను అనుకరించాలంటే, ప్రజలను ప్రేమించాలి. మనకు కరుణ ఉంటే ఉత్సాహంగా ప్రకటిస్తాం, ఆ పనిలో ఆనందాన్ని పొందుతాం.

12. దేవుని ప్రజలు భద్రతను ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచుతారు?

12 జీవాన్ని యెహోవా చూసినట్లు చూడాలంటే, భద్రతను మనం ప్రాముఖ్యంగా ఎంచాలి. మనం మీటింగ్‌కి వెళ్తున్నా, ఇంకెక్కడికి వెళ్తున్నా సరే జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలి. రాజ్యమందిరాన్ని కడుతున్నా, రిపేర్లు చేస్తున్నా జాగ్రత్తగా పనిచేయాలి. సమయాన్ని లేదా డబ్బును ఆదాచేయడం కన్నా భద్రత, ఆరోగ్యం అన్ని సందర్భాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. మన దేవుడు ఎప్పుడూ సరైనదే చేస్తాడు, మనం కూడా ఆయనలా ఉండాలని కోరుకోవాలి. ముఖ్యంగా సంఘపెద్దలు తమ సొంత భద్రత అలాగే ఇతరుల భద్రత గురించి ఆలోచించాలి. (సామె. 22:3) భద్రతకు సంబంధించిన నియమాలను లేదా ప్రమాణాలను సంఘపెద్దలు మీకు గుర్తుచేస్తే వాటిని పాటించండి. (గల. 6:1) జీవాన్ని యెహోవా చూసినట్టు చూస్తే, ‘ప్రాణం తీసిన దోషం’ మీమీదికి రాదు.

‘ఈ విధులనుబట్టి తీర్పుతీర్చండి’

13, 14. యెహోవాలా న్యాయం చూపించాలంటే ఇశ్రాయేలు పెద్దలు ఏమి చేయాల్సి ఉండేది?

13 తన ఉన్నతమైన న్యాయప్రమాణాల్ని పాటించమని యెహోవా ఇశ్రాయేలీయుల పెద్దలకు ఆజ్ఞాపించాడు. అలా పాటించాలంటే మొదటిగా, పెద్దలు వాస్తవాలన్నిటినీ తెలుసుకోవాలి. తర్వాత, హత్య చేసిన వ్యక్తి ఉద్దేశాన్ని, ఆలోచన విధానాన్ని, గతంలో చేసిన పనుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి అతను కరుణ పొందడానికి అర్హుడో కాదో నిర్ణయించాలి. చనిపోయిన వ్యక్తి మీద అతనికి ఏమైనా ద్వేషం ఉందా, అతను కావాలనే చంపాడా వంటివి తెలుసుకోవాలి. (సంఖ్యాకాండము 35:20-24 చదవండి.) ఒకవేళ జరిగిన హత్యకు ఎవరైనా సాక్షులు ఉంటే, నిందితునికి శిక్ష విధించే ముందు కనీసం ఇద్దరు సాక్షుల వాంగ్మూలమైన తీసుకోవాలి.—సంఖ్యా. 35:30.

14 అసలేమి జరిగిందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత, జరిగిన నేరం గురించే కాకుండా హత్య చేసిన వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి. కేవలం కంటికి కనిపించే వాటికి మించి చూసే సామర్థ్యం పెద్దలకు ఉండాలి. నేరం జరగడానికిగల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాలా విషయాలను లోతుగా ఆలోచించడానికి; కరుణ, న్యాయం చూపించడానికి పవిత్రశక్తి సహాయం అవసరం.—నిర్గ. 34:6, 7.

15. ప్రజలను పరిసయ్యులు చూసిన విధానానికి, యేసు చూసిన విధానానికి ఉన్న తేడా ఏమిటి?

15 పరిసయ్యులు తీర్పు తీర్చేటప్పుడు కరుణను చూపించలేదు. వాళ్లు కేవలం ఒక వ్యక్తి చేసిన పాపం మీదే మనసుపెట్టేవాళ్లు కానీ అతను ఎలాంటి వ్యక్తో పట్టించుకునేవాళ్లు కాదు. మత్తయి ఇంట్లో భోజనం చేస్తున్న యేసును చూసిన కొంతమంది పరిసయ్యులు ఆయన శిష్యుల్ని ఇలా అడిగారు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు?” దానికి యేసు ఇలా జవాబిచ్చాడు, “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. కాబట్టి వెళ్లి, ‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (మత్త. 9:9-13) యేసు పాపులను వెనకేసుకొస్తున్నాడా? కానేకాదు. వాళ్లు పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకున్నాడు. అదే ఆయన ప్రకటించిన సందేశంలోని ప్రాముఖ్యమైన అంశం. (మత్త. 4:17) ‘పన్ను వసూలు చేసేవాళ్లలో, పాపుల్లో’ కనీసం కొంతమందైనా మారడానికి ఇష్టపడుతున్నారని ఆయన అర్థంచేసుకున్నాడు. వాళ్లు కేవలం భోజనం చేయడానికి మత్తయి ఇంటికి రాలేదు. వాళ్లు యేసును అనుసరిస్తున్నారు కాబట్టే అక్కడికి వచ్చారు. (మార్కు 2:15) విచారకరంగా, ప్రజలను యేసు చూసినట్టుగా చాలామంది పరిసయ్యులు చూడలేకపోయారు. ప్రజలు ఇక మారరని, వాళ్లు ఎందుకూ పనికిరాని పాపులని పరిసయ్యులు అనుకున్నారు. ప్రజలను పరిసయ్యులు చూసిన విధానానికి, న్యాయవంతుడు కరుణామయుడైన యెహోవా చూసిన విధానానికి ఎంత తేడా కదా!

16. న్యాయనిర్ణయ కమిటీ ఏ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి?

16 నేడు సంఘపెద్దలు “న్యాయమును ప్రేమించు” యెహోవాను అనుకరించాలి. (కీర్త. 37:28) పాపం జరిగిందో లేదో నిర్ధారించుకునేందుకు, మొదట వాళ్లు విచారణ జరపాలి. ఒకవేళ పాపం జరిగిందని నిర్ధారణ అయితే, ఏమి చర్య తీసుకోవాలో నిర్ణయించడానికి పెద్దలు బైబిల్లోని నిర్దేశాలను పాటిస్తారు. (ద్వితీ. 13:12-14) అయితే, ఆ గంభీరమైన పాపం చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో న్యాయనిర్ణయ కమిటీలో ఉన్న పెద్దలు చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. అది అన్ని సందర్భాల్లో అంత సులభమైన పని కాదు. ఎందుకంటే చేసిన పాపం విషయంలో ఆ వ్యక్తి ఎలా భావిస్తున్నాడో, అతని హృదయంలో ఏముందో తెలిస్తేనే అతను పశ్చాత్తాపపడుతున్నాడో లేదో అర్థమౌతుంది. (ప్రక. 3:3) పాపం చేసిన వ్యక్తి కరుణ పొందాలంటే అతను పశ్చాత్తాపం చూపించాలి. a

17, 18. తప్పు చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో సంఘపెద్దలు ఎలా తెలుసుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

17 యెహోవాకు, యేసుకు ఒక వ్యక్తి ఆలోచనలు ఏమిటో, భావాలు ఏమిటో సరిగ్గా తెలుసు ఎందుకంటే వాళ్లు హృదయాలను చదవగలరు. కానీ సంఘపెద్దలకు ఆ సామర్థ్యం లేదు. ఒకవేళ మీరు సంఘపెద్ద అయితే, తప్పు చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో మీరెలా తెలుసుకోవచ్చు? మొదటిగా తెలివి, వివేచన కోసం ప్రార్థించండి. (1 రాజు. 3:9) రెండవదిగా, దేవుని వాక్యాన్ని అలాగే నమ్మకమైన బుద్ధిగల దాసుడు నుండి వస్తున్న ప్రచురణల్ని ఉపయోగించి ‘లోకసంబంధమైన దుఃఖానికి,’ ‘దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖానికి’ ఉన్న తేడాను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, “దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం” నిజమైన పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. (2 కొరిం. 7:10, 11) పశ్చాత్తాపం చూపించినవాళ్లను, చూపించనివాళ్లను బైబిలు ఎలా వర్ణిస్తుందో తెలుసుకొని వాళ్ల భావాల్ని, ఆలోచనల్ని, ప్రవర్తనను లోతుగా పరిశీలించండి.

18 మూడవదిగా, చేసిన పాపం గురించే కాకుండా దాన్ని చేసిన వ్యక్తి గురించి కూడా ఆలోచించండి. అతని నేపథ్యాన్ని, ఉద్దేశాల్ని, పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోండి. క్రైస్తవ సంఘానికి శిరస్సైన యేసు గురించి బైబిలు ముందే ఇలా చెప్పింది, “కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును.” (యెష. 11:3, 4) పెద్దలారా, సంఘాన్ని శ్రద్ధగా చూసుకోమని యేసే మిమ్మల్ని నియమించాడు కాబట్టి మీరు న్యాయంగా, కరుణతో తీర్పుతీర్చేందుకు ఆయనే సహాయం చేస్తాడు. (మత్త. 18:18-20) శ్రద్ధగల సంఘపెద్దలు ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం. ఒకరిపట్ల ఒకరం న్యాయం, కరుణ చూపించుకునేందుకు వాళ్లు మనకు సహాయం చేస్తారు.

19. ఆశ్రయపురాల ఏర్పాటు నుండి నేర్చుకున్న ఏ పాఠాలను పాటించాలని మీరు అనుకుంటున్నారు?

19 ధర్మశాస్త్రంలో “జ్ఞానానికి, సత్యానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు” ఉన్నాయి. అవి యెహోవా గురించి, ఆయన సూత్రాల గురించి బోధిస్తాయి. (రోమా. 2:20) ఉదాహరణకు, సంఘపెద్దలు ఎలా ‘సత్యం అనుసరించి తీర్పు తీర్చాలో’ ఆశ్రయపురాల ఏర్పాటు నేర్పిస్తుంది. మనందరం ‘ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనపర్చుకోవాలో’ కూడా అది నేర్పిస్తుంది. (జెక. 7:9) మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, దాన్నిచ్చిన యెహోవా ఎప్పటికీ మారడు. న్యాయం, కరుణ ఆయనకు ఇప్పటికీ ప్రాముఖ్యమైనవే. అలాంటి దేవున్ని ఆరాధించడం మనకు దొరికిన గొప్ప అవకాశం. కాబట్టి, ఆయనలోని అద్భుతమైన లక్షణాలను అనుకరిస్తూ ఆయనిచ్చే భద్రతను, కాపుదలను పొందుదాం.

a 2006, సెప్టెంబరు 15 కావలికోట సంచికలోని 30వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్నలు” అనే ఆర్టికల్‌ను చూడండి.