కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను నీ సత్యంలో నడుస్తాను’

‘నేను నీ సత్యంలో నడుస్తాను’

‘యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు. నేను నీ సత్యంలో నడుస్తాను.’ కీర్త. 86:11, NW.

పాటలు: 31, 72

1-3. (ఎ) బైబిలు సత్యాన్ని మనమెలా ఎంచాలి? ఉదాహరణ చెప్పండి. (ప్రారంభ చిత్రాలు చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

ఈరోజుల్లో ప్రజలు ఒక వస్తువును కొనడం, దాన్ని తిరిగి ఇచ్చేయడం మామూలైపోయింది. ఆన్‌లైన్‌లో కొంటున్నవాళ్లు ఇంకా ఎక్కువగా అలా చేస్తున్నారు. బహుశా ఆ వస్తువు వాళ్లు అనుకున్నట్టు లేకపోవచ్చు లేదా పాడై ఉండవచ్చు. అందుకే దానికి బదులు వేరేదాన్ని కొనాలనుకుంటారు లేదా డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడుగుతారు.

2 బైబిలు సత్యం విషయంలో మనం ఎప్పటికీ అలా చేయకూడదు. ఒక్కసారి సత్యాన్ని కొన్నామంటే దాన్ని మనం ఎన్నడూ అమ్మకూడదు, అంటే విడిచిపెట్టకూడదు. (సామెతలు 23:23 చదవండి; 1 తిమో. 2:4) సత్యం నేర్చుకోవడానికి మనం త్యాగం చేసిన కొన్ని విషయాల గురించి ముందటి ఆర్టికల్‌లో పరిశీలించాం. మన సమయాన్ని, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని త్యాగం చేశాం. అంతేకాదు ఇతరులతో మనకున్న సంబంధాలు మారాయి. మన ఆలోచనల్ని, ప్రవర్తనను మార్చుకున్నాం. యెహోవాకు ఇష్టంలేని ఆచారాల్ని, పద్ధతుల్ని వదిలేశాం. నిజానికి సత్యం నేర్చుకోవడం వల్ల పొందిన ఆశీర్వాదాలతో పోలిస్తే ఇవేమీ ఎక్కువ కాదని మనం తెలుసుకున్నాం.

3 యేసు, మంచి ముత్యాల కోసం వెదుకుతున్న ఒక వ్యాపారస్థుని ఉదాహరణ చెప్పాడు. ఎంతో విలువైన ముత్యాన్ని చూసినప్పుడు, ఆ వ్యాపారి వెంటనే తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి దాన్ని కొన్నాడు. ఆ ముత్యం దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని సూచిస్తుంది. సత్యం కోసం వెదికేవాళ్లకు అదెంత విలువైనదిగా ఉంటుందో యేసు ఈ ఉదాహరణ ద్వారా చెప్పాడు. (మత్త. 13:45, 46) మనం కూడా సత్యం నేర్చుకున్న కొత్తలో, అంటే దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని అలాగే బైబిల్లో ఉన్న ఇతర విలువైన సత్యాల్ని నేర్చుకున్నప్పుడు, వాటికోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాం. మనం ఆ సత్యాన్ని ఎప్పటికీ విలువైనదిగా ఎంచితే, దాన్ని ఎన్నడూ విడిచిపెట్టం. కానీ విచారకరంగా దేవుని ప్రజల్లో కొంతమంది సత్యాన్ని విలువైనదిగా ఎంచడం మానేసి, చివరికి దాన్ని విడిచిపెట్టేశారు. మనం ఎప్పటికీ అలా చేయకూడదు! అందుకే ‘సత్యానికి తగ్గట్టు జీవించాలని’ లేదా సత్యంలో నడవాలనే బైబిలు సలహాను మనం పాటించాలి. (3 యోహాను 2-4 చదవండి.) అంటే సత్యానికి మొదటిస్థానం ఇస్తున్నామని మన జీవన విధానంలో చూపించాలి. కానీ ఒకవ్యక్తి సత్యాన్ని ఎందుకు, ఎలా అమ్మేసే అవకాశం ఉంది? సత్యాన్ని ఎన్నడూ అమ్మకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు? మనం సత్యంలో నడవాలని ఎలా బలంగా నిశ్చయించుకోవచ్చు? వంటి ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

కొంతమంది సత్యాన్ని ఎందుకు, ఎలా అమ్మేస్తారు?

4. యేసు కాలంలో కొంతమంది ఎందుకు సత్యంలో చివరివరకు నడవలేదు?

4 యేసు కాలంలో కొంతమంది సత్యాన్ని అంగీకరించారు గానీ దానిలో చివరివరకు నడవలేదు. ఉదాహరణకు, యేసు అద్భుతరీతిలో ఒక పెద్ద గుంపుకు ఆహారం పెట్టిన తర్వాత, ఆ ప్రజలు గలిలయ సముద్రం అవతలి వరకు యేసు వెనకాలే వెళ్లారు. కానీ అక్కడ యేసు చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు! ఆయనిలా అన్నాడు: “మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప మీరు జీవం పొందరు.” ఆ మాటలకు అర్థమేంటో అడిగే బదులు, “ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరైనా వినగలరా?” అని వాళ్లు అన్నారు. ఫలితంగా, “ఆయన శిష్యుల్లో చాలామంది ఆయన్ని అనుసరించడం మానేసి, తాము గతంలో చేసిన పనుల్ని చేసుకోవడానికి వెళ్లిపోయారు.”—యోహా. 6:53-66.

5, 6. (ఎ) మనకాలంలో కొంతమంది ఎందుకు సత్యాన్ని విడిచిపెట్టారు? (బి) ఒకవ్యక్తి సత్యం నుండి ఎలా దూరమైపోతాడు?

5 విచారకరంగా, మనకాలంలో కూడా కొంతమంది సత్యాన్ని విడిచిపెట్టారు. ఎందుకు? బహుశా, ఏదైనా లేఖన అవగాహనలో వచ్చిన మార్పు వాళ్లకు నచ్చకపోయి ఉండవచ్చు, లేదా మంచి పేరున్న ఒక సహోదరుని మాటల వల్లో, పనుల వల్లో నొచ్చుకొని ఉండవచ్చు. అంతేకాదు, వాళ్లకిచ్చిన బైబిలు సలహా వల్ల బాధపడివుండవచ్చు లేదా సంఘంలో ఎవరితోనైనా తీవ్రమైన మనస్పర్థలు వచ్చివుండవచ్చు. మతభ్రష్టుల బోధల్ని అనుసరించి ఉండవచ్చు లేదా మన గురించి అబద్ధాలు చెప్పేవాళ్ల మాటల్ని నమ్మివుండవచ్చు. వాళ్లు యెహోవాను, సంఘాన్ని ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టడానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. (హెబ్రీ. 3:12-14) అయితే, అలాంటివాళ్లు అపొస్తలుడైన పేతురులాగే యేసుపై నమ్మకం ఉంచాల్సింది. ఎందుకంటే, తన మాటలకు అభ్యంతరపడి కొంతమంది వెళ్లిపోతుంటే “మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా” అని యేసు తన శిష్యుల్ని అడిగాడు, దానికి పేతురు “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితానికి నడిపించే మాటలు నీ దగ్గరే ఉన్నాయి” అని అన్నాడు.—యోహా. 6:67-69.

6 ఇంకొంతమంది వాళ్లకు తెలియకుండానే సత్యం నుండి క్రమక్రమంగా దూరమైపోతారు. అలాంటివాళ్లను, నది ఒడ్డు నుండి మెల్లమెల్లగా కొట్టుకుపోయే ఓడతో పోల్చవచ్చు. అయితే సత్యం నుండి ‘దూరంగా కొట్టుకుపోకుండా’ జాగ్రత్తపడమని బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. (హెబ్రీ. 2:1) సాధారణంగా సత్యం నుండి దూరమయ్యే వ్యక్తి కావాలని అలా చేయడు. కానీ యెహోవాతో తనకున్న స్నేహం బలహీనపడేలా అనుమతించి, కొంతకాలానికి ఆ స్నేహాన్ని కోల్పోతాడు. మనకు అలా జరగకూడదంటే ఏం చేయాలి?

సత్యాన్ని ఎన్నడూ అమ్మకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?

7. సత్యాన్ని ఎన్నడూ అమ్మకుండా ఉండాలంటే ఏం చేయాలి?

7 మనం సత్యంలో నడుస్తూ ఉండాలంటే, యెహోవా చెప్పే ప్రతీదాన్ని ఒప్పుకోవాలి, పాటించాలి. మన జీవితంలో సత్యానికే మొదటిస్థానం ఇవ్వాలి. అంతేకాదు మనం చేసే ప్రతీ పనిలో బైబిలు సూత్రాలు పాటించాలి. రాజైన దావీదు యెహోవాకు ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: ‘నేను నీ సత్యంలో నడుస్తాను.’ (కీర్త. 86:11, NW) దావీదు సత్యంలో నడుస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాడు, మనం కూడా అదే చేయాలి. ఒకవేళ అలా నిశ్చయించుకోకపోతే సత్యం కోసం మనం వదులుకున్న వాటి గురించి ఆలోచించడం మొదలుపెడతాం. అంతేకాదు వాటిలో కొన్నిటిని మళ్లీ కోరుకునే ప్రమాదం ఉంది. అయితే ఏ బైబిలు సత్యాల్ని పాటించాలో, వేటిని పాటించకూడదో ఎంపిక చేసుకునే అవకాశం మనకు లేదు. మనం “సత్యాన్ని పూర్తిగా” పాటించాలి. (యోహా. 16:13) సత్యం నేర్చుకోవడానికి, దాన్ని పాటించడానికి మనం త్యాగం చేసిన ఐదు విషయాల గురించి ముందటి ఆర్టికల్‌లో చర్చించాం. అయితే మళ్లీ వాటి జోలికి వెళ్లకూడదంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.—మత్త. 6:19.

8. ఒక క్రైస్తవుడు తన సమయాన్ని తెలివిగా ఉపయోగించకపోతే ఎలా సత్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంది? అనుభవం చెప్పండి.

8 సమయం. సత్యం నుండి దూరంగా కొట్టుకుపోకుండా ఉండాలంటే మన సమయాన్ని ఎప్పుడూ తెలివిగా ఉపయోగించాలి. మనం జాగ్రత్తగా లేకపోతే ఉల్లాసకార్యక్రమాలకు, హాబీలకు, ఇంటర్నెట్‌కు, టీవీకి ఎక్కువ సమయం కేటాయించే ప్రమాదం ఉంది. ఆ పనులు తప్పు కాకపోయినా బైబిలు అధ్యయనానికి, పరిచర్యకు వెచ్చించాల్సిన సమయాన్ని వాటికే ఉపయోగించే అవకాశం ఉంది. ఇషా * అనే సహోదరి విషయంలో అదే జరిగింది. ఆమెకు చిన్నప్పటినుండి గుర్రాలంటే చాలా ఇష్టం, సమయం దొరికితే చాలు వాటిమీద స్వారీ చేసేది. కానీ తన హాబీకి చాలా సమయం కేటాయిస్తుందని గుర్తించి, ఆమె మార్పులు చేసుకోవాలనుకుంది. ఒకప్పుడు గుర్రం మీద విన్యాసాలు చేసే కోరీ వెల్జ్‌ అనే సహోదరి అనుభవం నుండి ఆమె ప్రోత్సాహం పొందింది. * ఇషా ఇప్పుడు ఎక్కువ సమయం యెహోవా సేవకే ఉపయోగిస్తోంది. అంతేకాదు సంఘంలోని స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతోంది. ఆమె తన సమయాన్ని తెలివిగా ఉపయోగించడం వల్ల దేవునికి చాలా దగ్గరైంది, సంతోషంగా ఉంది.

9. మనం వస్తుసంపదలకు ఎలా మొదటిస్థానం ఇచ్చే అవకాశం ఉంది?

9 వస్తుసంపదలు. మనం సత్యంలో నడుస్తూ ఉండాలంటే వస్తుసంపదలకు మొదటిస్థానం ఇవ్వకూడదు. సత్యం నేర్చుకున్నప్పుడు వస్తుసంపదల కన్నా యెహోవా సేవే చాలా ప్రాముఖ్యమని గుర్తించాం, వాటిని సంతోషంగా త్యాగం చేశాం కూడా. కానీ కాలం గడిచేకొద్దీ, వేరేవాళ్లు కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరాలను కొనడం, ఇతర వస్తువులతో సంతోషంగా ఉండడం చూసి, మనం ఏదో కోల్పోతున్నట్లు అనిపించవచ్చు. అంతేకాదు ఉన్నవాటితో తృప్తిపడకుండా, యెహోవా సేవ కన్నా వస్తుసంపదల్నే ఎక్కువ ప్రేమించవచ్చు. దేమాకు ఏం జరిగిందో పరిశీలించండి. “ఈ వ్యవస్థ” మీద ప్రేమవల్ల అతను అపొస్తలుడైన పౌలుతో సేవచేసే నియామకాన్ని విడిచిపెట్టాడు. (2 తిమో. 4:10) బహుశా అతను దేవుని సేవ కన్నా వస్తుసంపదల్నే ఎక్కువ ప్రేమించివుంటాడు. లేదా పౌలుతో కలిసి సేవ చేస్తున్నప్పుడు త్యాగాలు చేయడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం గతంలో వస్తుసంపదల్ని చాలా ప్రేమించివుండవచ్చు. కానీ జాగ్రత్తగా లేకపోతే మనలో ఆ ప్రేమ మళ్లీ మొలకెత్తి, బలపడి, సత్యం మీదున్న ప్రేమను అణచివేయవచ్చు.

10. మనమీద ఎవరి ప్రభావం పడకుండా జాగ్రత్తపడాలి?

10 ఇతరులతో మనకున్న సంబంధాలు. సత్యంలో నడుస్తూ ఉండాలంటే, యెహోవాను ఆరాధించనివాళ్ల ప్రభావం మనమీద పడనివ్వకూడదు. సత్యం నేర్చుకున్నప్పుడు సాక్షులుకాని మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మనకున్న సంబంధాలు మారాయి. వాళ్లలో కొంతమంది మన నమ్మకాల్ని గౌరవించి ఉండవచ్చు, ఇంకొంతమంది వ్యతిరేకించి ఉండవచ్చు. (1 పేతు. 4:4) నిజమే, మన కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగివుండడానికి, దయగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తాం. కానీ వాళ్లను సంతోషపెట్టడానికి యెహోవా ప్రమాణాల్ని పక్కనబెట్టం. అంతేకాదు, 1 కొరింథీయులు 15:33 చెప్తున్నట్లు మనం యెహోవా ఆరాధకులతోనే స్నేహం చేస్తాం.

11. అపవిత్ర ఆలోచనలకు, పనులకు మనమెలా దూరంగా ఉండవచ్చు?

11 అపవిత్ర ఆలోచనలు, పనులు. సత్యంలో నడుస్తూ ఉండాలంటే, యెహోవా దృష్టిలో మనం పవిత్రంగా ఉండాలి. (యెష. 35:8; 1 పేతురు 1:14-16 చదవండి.) సత్యం నేర్చుకున్నప్పుడు బైబిలు ప్రమాణాల ప్రకారం మన జీవితంలో మార్పులు చేసుకున్నాం. కొంతమంది చాలా పెద్ద మార్పులు చేసుకున్నారు. అయితే అపవిత్రమైన జీవితం కోసం పవిత్రమైన జీవితాన్ని ఎన్నడూ వదులుకోకుండా జాగ్రత్తపడాలి. తప్పు చేయాలనే శోధనను తిప్పికొట్టడానికి మనకేది సహాయం చేస్తుంది? మనం పవిత్రంగా ఉండాలంటే యెహోవా మనకిచ్చిన దాని గురించి ఆలోచించాలి. ఆయన మనకోసం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అమూల్యమైన ప్రాణాన్నిచ్చాడు! (1 పేతు. 1:18, 19) అదెంత విలువైనదో గుర్తుపెట్టుకుంటే యెహోవా దృష్టిలో ఎప్పుడూ పవిత్రంగా ఉండగలుగుతాం.

12, 13. (ఎ) యెహోవాకు ఇష్టంలేని ఆచారాలకు మనమెలా దూరంగా ఉండవచ్చు? (బి) మనం ఇప్పుడు ఏం పరిశీలిస్తాం?

12 దేవునికి ఇష్టంలేని ఆచారాలు, పద్ధతులు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు దేవునికి ఇష్టంలేని ఆచారాల్లో అంటే పుట్టినరోజు వేడుకల్లో, పండుగల్లో పాల్గొనమని మనల్ని ఒత్తిడి చేయవచ్చు. ఆ ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు? యెహోవా వాటిని ఎందుకు ఇష్టపడడో మనకు స్పష్టంగా తెలిసుండాలి. అంతేకాదు అవెలా మొదలయ్యాయని మన ప్రచురణలు చెప్తున్నాయో మనం పరిశోధించవచ్చు. ఆ సమాచారాన్ని మళ్లీ ధ్యానించినప్పుడు, మనం ‘ప్రభువుకు ఇష్టమైన’ దారిలో నడుస్తున్నామనే నమ్మకం కుదురుతుంది. (ఎఫె. 5:10) యెహోవా మీద, ఆయన వాక్యం మీద నమ్మకం ఉంచితే ఇతరులు మనగురించి ఏమనుకుంటారో అని భయపడం.—సామె. 29:25.

13 మనం సత్యంలో ఎప్పటికీ నడుస్తూ ఉండాలని కోరుకుంటాం. ఆ కోరికను బలపర్చుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? మనం చేయాల్సిన మూడు పనుల గురించి చూద్దాం.

సత్యంలో నడుస్తూ ఉండాలని బలంగా నిశ్చయించుకోండి

14. (ఎ) సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకోవడానికి బైబిల్ని అధ్యయనం చేస్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) తెలివి, క్రమశిక్షణ, అవగాహన మనకు ఎందుకు అవసరం?

14 మొదటిగా, బైబిల్ని ప్రతీరోజు అధ్యయనం చేస్తూ, నేర్చుకున్నవాటి గురించి లోతుగా ఆలోచించండి. మీరెంత ఎక్కువగా అధ్యయనం చేస్తే అంతెక్కువగా సత్యాన్ని ప్రేమిస్తారు, దాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుంటారు. బైబిలు ఇలా చెప్తుంది, ‘సత్యాన్ని కొనుక్కో, దాన్ని ఎన్నడూ అమ్మకు.’ అంతేకాదు ‘తెలివి, క్రమశిక్షణ, అవగాహనను’ కూడా కొనుక్కోమని అది చెప్తుంది. (సామె. 23:23, NW) కాబట్టి కేవలం బైబిలు సత్యం నేర్చుకుంటే సరిపోదు గానీ దాన్ని మన జీవితంలో పాటించాలి. అవగాహన ఉంటే, కొత్తగా నేర్చుకున్న విషయాల్ని మనకు అప్పటికే తెలిసిన విషయాలతో పోల్చి చూస్తాం. తెలివి ఉంటే, నేర్చుకున్నవాటి ప్రకారం ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు, మనం ఏ మార్పులు చేసుకోవాలో తెలియజేయడం ద్వారా సత్యం మనకు క్రమశిక్షణ ఇస్తుంది. దానికి మనం వెంటనే స్పందించాలి. ఆ క్రమశిక్షణ వెండికన్నా విలువైనదని బైబిలు చెప్తుంది.—సామె. 8:10.

15. సత్యమనే నడికట్టు మనల్ని ఎలా కాపాడుతుంది?

15 రెండవదిగా, మీ రోజువారీ జీవితంలో సత్యాన్ని పాటించాలని నిశ్చయించుకోండి. సత్యాన్ని, సైనికుడి నడికట్టుతో బైబిలు పోలుస్తుంది. (ఎఫె. 6:14) ప్రాచీనకాలంలో, ఒక సైనికుడి నడికట్టు అతని నడుముకు రక్షణగా ఉండేది. అయితే అతను ఆ నడికట్టును బిగుతుగా కట్టుకోవాలి. ఒకవేళ అది వదులుగా ఉంటే, రక్షణ ఇవ్వదు. మరి సత్యమనే నడికట్టు మనల్ని ఎలా కాపాడుతుంది? అన్ని సమయాల్లో బైబిలు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే, అది మనల్ని తప్పుడు ఆలోచనల నుండి కాపాడుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. శోధనలు, పరీక్షలు ఎదురైనప్పుడు సరైనది చేయాలనే మన నిర్ణయాన్ని బలపరుస్తుంది. సైనికుడు యుద్ధానికి వెళ్లేటప్పుడు నడికట్టును తప్పకుండా ధరిస్తాడు. అలాగే మనం కూడా ప్రతీ సందర్భంలో బైబిలు సత్యాన్ని పాటించాలి, దాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అయితే సైనికుడు తన నడికట్టుకు ఖడ్గాన్ని కూడా పెట్టుకుంటాడు. మరి ఆ సైనికుడిలాగే మనమేం చేయవచ్చు?

16. ఇతరులకు బోధించడానికి బైబిల్ని ఉపయోగించినప్పుడు ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

16 మూడవదిగా, వీలైనంత ఎక్కువగా ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించండి. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. ఒక మంచి సైనికుడు ఖడ్గాన్ని నైపుణ్యంగా ఉపయోగిస్తాడు, అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించాలి. (ఎఫె. 6:17) “సత్యవాక్యాన్ని సరిగ్గా” బోధించేవాళ్లముగా మనందరం మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి కృషిచేయవచ్చు. (2 తిమో. 2:15) ఇతరులకు బోధించడానికి బైబిల్ని ఉపయోగించినప్పుడు సత్యాన్ని ఎక్కువగా తెలుసుకుంటాం, ప్రేమిస్తాం. అంతేకాదు సత్యంలో నడుస్తూ ఉండాలని బలంగా నిశ్చయించుకుంటాం.

17. సత్యం మీకెందుకు విలువైనది?

17 సత్యం, యెహోవా మనకిచ్చిన విలువైన బహుమానం. మన పరలోక తండ్రితో దగ్గరి సంబంధం కలిగివుండడానికి అది సహాయం చేస్తుంది. ఆ సంబంధమే మనకు అన్నిటికన్నా విలువైనది. యెహోవా మనకు ఇప్పటికే ఎన్నో విషయాలు బోధించాడు, కానీ ఇది ఆరంభం మాత్రమే! ఆయన ఎప్పటికీ బోధిస్తూనే ఉంటానని మాటిచ్చాడు. కాబట్టి, సత్యాన్ని విలువైన ముత్యంలా చూద్దాం. దాన్ని ఎన్నడూ అమ్మకుండా, కొనుక్కుంటూ ఉందాం. అప్పుడు, దావీదులాగే మనం కూడా యెహోవాకు ఇచ్చిన ఈ మాటను నిలబెట్టుకుంటాం, ‘నేను నీ సత్యంలో నడుస్తాను.’—కీర్త. 86:11, NW.

^ పేరా 8 అసలు పేర్లు కావు.

^ పేరా 8 JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ఇంటర్వ్యూలు, అనుభవాలు విభాగంలో, సత్యం జీవితాలను మార్చేస్తుంది కింద చూడండి.