కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు ప్రస్తావించిన ప్రజా సేవకులు ఎవరు? వాళ్లకు ఆ పేరు ఎందుకు వచ్చింది?

చనిపోవడానికి ముందురోజు రాత్రి, యేసు తన అపొస్తలులతో మాట్లాడుతూ గొప్ప పేరు కోసం ప్రాకులాడవద్దని సలహా ఇచ్చాడు. ఆయనిలా అన్నాడు: “దేశాల్ని పాలించే రాజులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, అధికారం ఉన్నవాళ్లు ప్రజా సేవకులు అని పిలవబడతారు. అయితే మీరు అలా ఉండకూడదు.”—లూకా 22:25, 26.

యేసు ప్రస్తావించిన ప్రజా సేవకులు ఎవరు? ప్రసిద్ధి చెందిన పురుషులకు, పాలకులకు యూర్జెటీజ్‌ లేదా ప్రజా సేవకుడు అనే బిరుదు ఇవ్వడం గ్రీకులకు, రోమన్లకు ఆనవాయితీ అని శిలాశాసనాలు, నాణేలు, రాతప్రతులు తెలియజేస్తున్నాయి. వాళ్లు చేసిన విలువైన ప్రజా సేవకు ఆ బిరుదును ఇచ్చి గౌరవించేవాళ్లు.

చాలామంది రాజులకు ప్రజా సేవకులు అనే బిరుదు ఇవ్వబడింది. ఉదాహరణకు, ఐగుప్తు పాలకులైన టాలమీ III, టాలమీ VIII, రోమా పాలకులైన జూలియస్‌ సీజర్‌, ఔగుస్తు, యూదయ రాజైన హేరోదు ఆ బిరుదును పొందారు. బహుశా హేరోదు, కరువు కాలంలో ప్రజల కోసం వేరే దేశం నుండి గోధుమలు తెప్పించడం వల్ల, అవసరంలో ఉన్నవాళ్లకు బట్టలు ఇవ్వడం వల్ల ఆ బిరుదు పొందివుంటాడు.

అప్పట్లో ప్రజా సేవకుడు అనే బిరుదు ఇవ్వడం సర్వసాధారణమని జర్మన్‌ బైబిలు విద్వాంసుడైన అడాల్ఫ్‌ డైస్‌మాన్‌ అన్నాడు. “[ఈ బిరుదు ఉన్న] వంద శిలాశాసనాలు తేలిగ్గా సేకరించవచ్చని, దానికి ఎంతో సమయం పట్టదని” ఆయన చెప్పాడు.

“అయితే మీరు అలా ఉండకూడదు” అని యేసు తన శిష్యులతో అన్న మాటలకు అర్థమేంటి? సమాజానికి సహాయం చేయవద్దనీ, తమ చుట్టూ ఉన్న ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవద్దనీ ఆయన చెప్తున్నాడా? కానేకాదు. ఉదారతతో చేసే పనుల వెనక ఎలాంటి ఉద్దేశం ఉండాలో ఆయన చెప్తున్నాడు.

యేసు కాలంలోని ధనవంతులు మంచిపేరు సంపాదించుకోవడం కోసం తమ డబ్బును ఖర్చుపెట్టి కొన్ని ప్రదర్శనల్ని, క్రీడల్ని ఏర్పాటు చేసేవాళ్లు; పార్కులు, ఆలయాలు కట్టించేవాళ్లు; అంతేకాదు అలాంటి పనులకు ఆర్థిక మద్దతు ఇచ్చేవాళ్లు. అయితే వాళ్లు ప్రజల మెప్పును పొందాలని, ప్రముఖులు అవ్వాలని లేదా ఓట్లు సంపాదించాలని ఆ పనులు చేసేవాళ్లు. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది, “అలాంటి దాతలు ఉదారత చూపించిన సందర్భాలు ఉన్నప్పటికీ, తరచూ రాజకీయ లాభం పొందాలనే స్వార్థంతో అలా చేసేవాళ్లు.” కానీ అలాంటి ఆలోచనా విధానానికి, స్వార్థానికి దూరంగా ఉండమని యేసు తన అనుచరులకు చెప్పాడు.

కొన్నేళ్ల తర్వాత అపొస్తలుడైన పౌలు కూడా, ఉదారంగా ఇవ్వడం వెనక సరైన ఉద్దేశం ఉండాలనే ప్రాముఖ్యమైన సత్యం గురించి చెప్పాడు. కొరింథులోని తోటి విశ్వాసులకు ఆయనిలా రాశాడు: “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.”—2 కొరిం. 9:7.