కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా?

మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా?

“మీ మనసు మార్చుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోండి.”రోమా. 12:2.

పాటలు: 56, 123

1, 2. మనం ప్రగతి సాధించేకొద్దీ ఏం నేర్చుకుంటాం? ఉదాహరణ చెప్పండి.

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఒక పిల్లవాడికి ఎవరైనా గిఫ్ట్‌ ఇచ్చినప్పుడు అతని తల్లిదండ్రులు, “థ్యాంక్యూ చెప్పు” అని ఆ పిల్లవాడితో అంటారు. తల్లిదండ్రులు చెప్పారు కాబట్టే ఆ పిల్లవాడు థ్యాంక్యూ చెప్తాడు. కానీ అతను పెద్దౌతుండగా, తల్లిదండ్రులు ఎందుకు థ్యాంక్యూ చెప్పమన్నారో అర్థంచేసుకుంటాడు. కొంతకాలానికి, నేర్చుకున్నదాన్ని బట్టి అతనే సొంతగా ఇతరులకు థ్యాంక్యూ చెప్తాడు.

2 మన విషయం కూడా అంతే. మనం సత్యం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు, యెహోవా ప్రాథమిక ఆజ్ఞల్ని పాటించడం ప్రాముఖ్యమని నేర్చుకున్నాం. అయితే మనం ప్రగతి సాధించేకొద్దీ, ఆయన ఆలోచనల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అంటే ఆయనకు ఏవి ఇష్టమో, ఏవి ఇష్టం కావో, విషయాల్ని ఆయనెలా చూస్తాడో నేర్చుకుంటాం. మనం యెహోవా ఆలోచనల ప్రకారం ఎంపికలు చేసుకున్నప్పుడు, ప్రవర్తించినప్పుడు ఆయనలా ఆలోచించిన వాళ్లమౌతాం.

3. యెహోవాలా ఆలోచించడం మనకెందుకు కష్టంగా ఉండవచ్చు?

3 యెహోవాలా ఆలోచించడం మనందరికీ ఇష్టమే. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు ఆయనలా ఆలోచించడం కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు నైతిక పరిశుభ్రతను, వస్తుసంపదల్ని, ప్రకటనా పనిని, రక్తాన్ని దుర్వినియోగం చేయడాన్ని, ఇంకా ఇతర విషయాల్ని యెహోవా ఎలా చూస్తాడో మనకు తెలుసు. కానీ వాటిని ఎందుకలా చూస్తున్నాడో అర్థంచేసుకోవడం మనకు కష్టంకావచ్చు. మరైతే, మనం ఇంకా ఎక్కువగా యెహోవాలా ఆలోచించడం ఎలా నేర్చుకోవచ్చు? ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సరైనది చేయడానికి అది మనకెలా సహాయం చేస్తుంది?

యెహోవాలా ఆలోచించడం ఎలా?

4. మనసు మార్చుకోవడం అంటే ఏంటి?

4 రోమీయులు 12:2 చదవండి. మనం యెహోవాలా ఆలోచించాలంటే ఏం చేయాలో అపొస్తలుడైన పౌలు ఈ వచనంలో వివరించాడు. ఆయనిలా చెప్పాడు, “ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి.” అంటే ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు మనం లోక ఆలోచనల్ని, వైఖరుల్ని తిరస్కరించాలి. దాంతోపాటు మన మనసు మార్చుకోవాలని కూడా పౌలు చెప్పాడు. అంటే మనం బైబిల్ని అధ్యయనం చేయాలి, యెహోవా ఆలోచనల్ని అర్థంచేసుకోవాలి, వాటిగురించి ధ్యానించాలి, ఆయనలా ఆలోచించడానికి కృషిచేయాలి.

5. అధ్యయనం అంటే ఏంటి?

5 అధ్యయనం అంటే సమాచారాన్ని గబగబా చదివేసి, జవాబులు అండర్‌లైన్‌ చేసుకోవడం మాత్రమే కాదు. అధ్యయనం చేస్తున్నప్పుడు, మనం చదివే సమాచారం యెహోవా గురించి, ఆయన పనుల గురించి, ఆయన ఆలోచనల గురించి ఏం చెప్తుందో పరిశీలిస్తాం. యెహోవా ఫలానా పని ఎందుకు చేయమంటున్నాడో, ఎందుకు వద్దంటున్నాడో అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మన జీవితంలో, మన ఆలోచనల్లో ఏయే మార్పులు చేసుకోవాలో పరిశీలిస్తాం. నిజమే, అధ్యయనం చేస్తున్న ప్రతీసారి వీటన్నిటి గురించి ధ్యానించడం మనకు సాధ్యంకాకపోవచ్చు. కానీ అధ్యయనం చేసే సమయంలో కనీసం సగం సమయం ధ్యానించడానికి కేటాయించడం మంచిది.—కీర్త. 119:97; 1 తిమో. 4:15.

6. మనం క్రమంగా బైబిలు చదివి ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది?

6 ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మనం క్రమంగా బైబిలు చదివి, ధ్యానించినప్పుడు యెహోవా ఆలోచనలే పరిపూర్ణమైనవని ‘పరీక్షించి తెలుసుకుంటాం’ లేదా నమ్మకం కుదుర్చుకుంటాం. ఫలానా విషయాన్ని యెహోవా ఎలా చూస్తున్నాడో అర్థంచేసుకోవడం మొదలుపెడతాం, ఆయన ఆలోచనలు సరైనవని ఒప్పుకుంటాం. అలా మన మనసు మార్చుకొని కొత్తగా ఆలోచిస్తాం, క్రమక్రమంగా యెహోవాలా ఆలోచించగలుగుతాం.

మన ఆలోచనలు మన పనులపై ప్రభావం చూపిస్తాయి

7, 8. (ఎ) వస్తుసంపదల విషయంలో యెహోవా ఆలోచన ఏంటి? (ప్రారంభ చిత్రాలు చూడండి.) (బి) మనం వస్తుసంపదల్ని యెహోవా చూసినట్లు చూస్తే, దేనికి మొదటిస్థానం ఇస్తాం?

7 మన ఆలోచనలు మన పనుల మీద ప్రభావం చూపిస్తాయి. (మార్కు 7:21-23; యాకో. 2:17) దీన్ని అర్థంచేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. మొదటిది, యేసు పుట్టుక గురించిన వృత్తాంతం. వస్తుసంపదల విషయంలో యెహోవా ఆలోచన ఏంటో ఆ వృత్తాంతం స్పష్టంగా తెలియజేస్తుంది. యోసేపు, మరియలు పేదవాళ్లు అయినప్పటికీ దేవుడు తన కుమారుణ్ణి పెంచే బాధ్యతను వాళ్లకిచ్చాడు. (లేవీ. 12:8; లూకా 2:24) యేసు పుట్టినప్పుడు మరియ, “ఉండడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో ఆ బిడ్డను పశువులు మేతమేసే తొట్టిలో పడుకోబెట్టింది.” (లూకా 2:7) యెహోవా కావాలనుకుంటే, యేసును అంతకన్నా మంచి స్థలంలో పుట్టేలా చేసుండేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. బదులుగా, తనకు మొదటిస్థానం ఇచ్చే కుటుంబంలో యేసు పెరగాలని యెహోవా కోరుకున్నాడు. ఎందుకంటే, అదే ఆయన దృష్టిలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది.

8 యెహోవా వస్తుసంపదల్ని ఎలా చూస్తాడో యేసు పుట్టుక గురించిన వృత్తాంతాన్ని బట్టి అర్థమౌతుంది. కొంతమంది తల్లిదండ్రులు, యెహోవాతో ఉన్న సంబంధాన్ని పణంగా పెట్టయినాసరే ఎక్కువ వస్తుసంపదలు సంపాదించమని పిల్లలకు చెప్తుంటారు. కానీ తనతో మనకున్న సంబంధాన్నే యెహోవా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచుతాడు. మీరు వస్తుసంపదల్ని యెహోవా చూసినట్లు చూస్తున్నారా? మీ పనులు ఏం చూపిస్తున్నాయి?—హెబ్రీయులు 13:5 చదవండి.

9, 10. ఇతరుల్ని అభ్యంతరపెట్టడాన్ని యెహోవా చూసినట్లే చూస్తున్నామా? వివరించండి.

9 రెండో ఉదాహరణ: ఇతరులు పాపం చేయడానికి లేదా యెహోవా సేవను ఆపేయడానికి కారణమయ్యే వ్యక్తులను ఆయన చూసే విధానం. యేసు ఇలా అన్నాడు, “విశ్వాసంగల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి ఎవరైతే కారణమౌతారో, అతని మెడకు ఒక పెద్ద తిరుగలి రాయిని కట్టి అతన్ని సముద్రంలో పడేయడమే అతనికి మంచిది.” (మార్కు 9:42) అవి ఎంత శక్తివంతమైన మాటలో కదా! అయితే, యేసు తన తండ్రిలా ఆలోచిస్తాడని మనకు తెలుసు. కాబట్టి యేసు అనుచరుల్లో ఎవరైనా అభ్యంతరపడేలా మనం ప్రవర్తిస్తే, యెహోవా చాలా బాధపడతాడని అర్థంచేసుకోవచ్చు.—యోహా. 14:9.

10 మనం ఇతరుల్ని అభ్యంతరపెట్టడాన్ని యెహోవా, యేసు చూసినట్లే చూస్తున్నామా? మన పనులు ఏం చూపిస్తున్నాయి? ఉదాహరణకు మనకు ఫలానా బట్టలు వేసుకోవడం, ఫలానా విధంగా తయారవ్వడం ఇష్టం ఉండవచ్చు. కానీ అవి సంఘంలో కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చు లేదా వాళ్లలో తప్పుడు ఆలోచనలు పుట్టించవచ్చు. మరి మన ఇష్టాల్ని పక్కనబెట్టేలా సహోదరుల మీదున్న ప్రేమ మనల్ని పురికొల్పుతుందా?—1 తిమో. 2:9, 10.

11, 12. మనం చెడును అసహ్యించుకోవడం నేర్చుకుంటే ఏం చేస్తాం?

11 మూడో ఉదాహరణ: యెహోవా అన్యాయాన్ని ద్వేషిస్తాడు. (యెష. 61:8) మనం అపరిపూర్ణులం కాబట్టి, కొన్నిసార్లు సరైనది చేయడం మనకు కష్టమని యెహోవాకు తెలుసు. అయినప్పటికీ మనం తనలాగే చెడును అసహ్యించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 97:10 చదవండి.) యెహోవా చెడును ఎందుకు అసహ్యించుకుంటున్నాడో మనం ధ్యానించినప్పుడు, ఆయనలా ఆలోచించగలుగుతాం, చెడ్డ పనులు చేయకుండా ఉండగలుగుతాం.

12 మనం చెడును అసహ్యించుకోవడం నేర్చుకుంటే, బైబిలు సూటిగా చెప్పని కొన్ని విషయాలు తప్పని గుర్తించగలుగుతాం. ఉదాహరణకు, ల్యాప్‌ డాన్సింగ్‌ అనే అనైతిక ప్రవర్తన ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. కానీ ఆ డాన్స్‌ సెక్స్‌ చేయడంతో సమానం కాదని, అది తప్పేమీ కాదని కొంతమంది అనుకుంటారు. * మరి దీని గురించి యెహోవా కూడా అలాగే భావిస్తున్నాడా? ఆయన ఎలాంటి చెడునైనా అసహ్యించుకుంటాడని గుర్తుంచుకోండి. కాబట్టి, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడం ద్వారా, యెహోవా ద్వేషించేవాటిని ద్వేషించడం ద్వారా మనం చెడుకు దూరంగా ఉందాం.—రోమా. 12:9.

మీ భవిష్యత్తు నిర్ణయాల గురించి ఇప్పుడే ఆలోచించండి

13. విషయాల్ని యెహోవా ఎలా చూస్తాడో ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి?

13 మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, విషయాల్ని యెహోవా ఎలా చూస్తాడో ఆలోచించాలి. దానివల్ల మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అంతేకాదు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో కూడా అయోమయంలో పడకుండా ఉంటాం. (సామె. 22:3) దీనికి సంబంధించి కొన్ని బైబిలు ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం.

14. యోసేపు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

14 పోతీఫరు భార్య యోసేపును లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను వెంటనే తిరస్కరించాడు. దీన్నిబట్టి, వివాహం విషయంలో యెహోవా ఆలోచన ఏంటో యోసేపు ముందే ధ్యానించాడని అర్థమౌతుంది. (ఆదికాండము 39:8, 9 చదవండి.) అతను పోతీఫరు భార్యతో, “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును” అని అన్నాడు. ఆ మాటల్నిబట్టి, అతను యెహోవాలా ఆలోచించాడని అర్థమౌతుంది. మరి మన సంగతేంటి? ఒకవేళ తోటి ఉద్యోగి మీతో సరసాలాడడం మొదలుపెడితే, ఏం చేస్తారు? లేదా ఎవరైనా మీ ఫోన్‌కు అశ్లీల చిత్రం గానీ మెసేజ్‌ గానీ పంపిస్తే, ఏం చేస్తారు? * అలాంటి విషయాల్లో యెహోవా ఆలోచన ఏంటో ముందే తెలుసుకొని, దాన్ని అంగీకరించి, నిర్ణయం తీసుకొనివుంటే ఆయనకు నమ్మకంగా ఉండడం చాలా తేలికౌతుంది.

15. ముగ్గురు హెబ్రీయుల్లాగే యెహోవాకు మనమెలా నమ్మకంగా ఉండగలం?

15 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీయుల ఉదాహరణ కూడా పరిశీలించండి. రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని చేయించి, దానికి మొక్కమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్లు ఆ ఆజ్ఞకు లోబడలేదు. వాళ్లు రాజుకు ఇచ్చిన జవాబును పరిశీలిస్తే, యెహోవాకు నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుందో వాళ్లు ముందే ఆలోచించారని అర్థమౌతుంది. (నిర్గ. 20:4, 5; దాని. 3:4-6, 12, 16-18) నేడు మన విషయమేంటి? ఒకవేళ మీ బాస్‌ ఏదైనా అబద్ధమత పండుగకు చందా ఇవ్వమని అడిగితే, ఏం చేస్తారు? అలాంటి పరిస్థితి వచ్చేవరకు ఆగకుండా, దాని విషయంలో యెహోవా ఆలోచన ఏంటో ఇప్పుడే ధ్యానించడం మంచిది. దానివల్ల ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే, ఆ ముగ్గురు హెబ్రీయుల్లాగే మనం సరైనది చేయగలుగుతాం, చెప్పగలుగుతాం.

మీరు పరిశోధన చేసి, చట్టపరమైన మెడికల్‌ డాక్యుమెంట్‌ను పూర్తి చేసి, మీ డాక్టర్‌తో మాట్లాడారా? (16వ పేరా చూడండి)

16. యెహోవా ఆలోచనల్ని స్పష్టంగా అర్థంచేసుకుంటే, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి కోసం ఎలా సిద్ధపడతాం?

16 యెహోవా ఆలోచనల్ని ధ్యానించడం వల్ల, వైద్యపరంగా అత్యవసర పరిస్థితిలో కూడా ఆయనకు విశ్వసనీయంగా ఉండగలుగుతాం. మనం రక్తాన్ని గానీ, దానిలోని నాలుగు ప్రధాన భాగాల్ని గానీ ఎక్కించుకోకూడదని లేదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. (అపొ. 15:28, 29) కానీ రక్తానికి సంబంధించిన కొన్ని చికిత్సా పద్ధతుల విషయంలో ప్రతీ క్రైస్తవుడు బైబిలు సూత్రాల ఆధారంగా సొంతగా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోవడానికి ఏది సరైన సమయం? హాస్పిటల్‌లో నొప్పితో బాధపడుతూ, త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడిలో ఉన్నప్పుడా? కానేకాదు! ఆ పరిస్థితి రాకముందే అంటే ఇప్పుడే పరిశోధన చేసి, మీ ఇష్టాన్ని తెలియజేసే DPA కార్డు లాంటి చట్టపరమైన మెడికల్‌ డాక్యుమెంట్‌ను పూర్తిచేసి, మీ డాక్టర్‌తో మాట్లాడాలి. *

17-19. యెహోవా ఆలోచనలు ఏంటో ఇప్పుడే తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఉదాహరణ చెప్పండి.

17 చివరిగా యేసు గురించి పరిశీలించండి. “ప్రభువా, అలా మాట్లాడొద్దు” అని పేతురు ఇచ్చిన తెలివితక్కువ సలహాకు ఆయన ఎలా స్పందించాడో ఆలోచించండి. దాన్నిబట్టి, తన విషయంలో దేవుని ఇష్టం గురించి, భూమ్మీద తన జీవితానికి, మరణానికి సంబంధించిన ప్రవచనాల గురించి యేసు అప్పటికే బాగా ధ్యానించాడని అర్థమౌతుంది. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి, తన ప్రాణాన్ని మనందరి కోసం బలివ్వడానికి ఆ జ్ఞానమే ఆయనకు సహాయం చేసింది.—మత్తయి 16:21-23 చదవండి.

18 నేడు, మనం తనకు స్నేహితులుగా ఉండాలని, ప్రకటనా పనిని వీలైనంత ఎక్కువ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. (మత్త. 6:33; 28:19, 20; యాకో. 4:8) కానీ కొంతమంది పేతురులాగే మంచి ఉద్దేశంతో మనల్ని నిరుత్సాహపర్చవచ్చు. ఉదాహరణకు మీ బాస్‌ ఎక్కువ జీతం ఇస్తానని మీతో అనవచ్చు. కానీ దానికోసం మీరు ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుందని, మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి సమయం దొరకదని మీకు తెలుసు. లేదా మీరు విద్యార్థులైతే, మంచి చదువు కోసం మీ ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి వస్తే, ఏం చేస్తారు? అలాంటి పరిస్థితి వచ్చాక, ప్రార్థనాపూర్వకంగా పరిశోధన చేసి, కుటుంబ సభ్యుల్ని, పెద్దల్ని సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారా? ఆ విషయాల్లో యెహోవా ఆలోచన ఏంటో ఇప్పుడే తెలుసుకొని, ఆయనలా ఆలోచించడం మంచిది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితులు ఎదురైతే, వాటికి లొంగిపోకుండా ఉండగలుగుతారు. ఎందుకంటే, మీరు అప్పటికే యెహోవా సేవ మీద మనసుపెట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీకు ఏం చేయాలో సరిగ్గా అర్థమౌతుంది.

19 మీ విశ్వాసానికి ఊహించని పరీక్షలు ఎదురయ్యే ఇతర సందర్భాల గురించి కూడా ఆలోచించవచ్చు. నిజమే, మనకు ఎదురయ్యే ప్రతీ సందర్భం కోసం సిద్ధపడడం సాధ్యంకాదు. కానీ మన వ్యక్తిగత అధ్యయనంలో యెహోవా ఆలోచనల గురించి ధ్యానిస్తే, నేర్చుకున్న విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం, ఏ పరిస్థితిలోనైనా వాటినెలా పాటించాలో తెలుసుకోగలుగుతాం. కాబట్టి అధ్యయనం చేస్తున్నప్పుడు, విషయాల్ని యెహోవా ఎలా చూస్తున్నాడో తెలుసుకోవాలి, ఆయనలా ఆలోచించడం నేర్చుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మనకెలా సహాయం చేస్తుందో ఆలోచించాలి.

యెహోవా ఆలోచనలు, మీ భవిష్యత్తు

20, 21. (ఎ) కొత్త లోకంలో మనకు ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది? (బి) ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

20 మనందరం కొత్త లోకం కోసం ఎంతో ఎదురుచూస్తున్నాం. మనలో చాలామందికి పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉంది. మనం ఈ వ్యవస్థలో అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి దేవుని రాజ్యంలో విడుదల పొందుతాం. అంతేకాదు మన ఇష్టాలకు, కోరికలకు తగ్గట్టు ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ అప్పుడు కూడా ఉంటుంది.

21 కానీ దానర్థం మన స్వేచ్ఛకు హద్దులు ఉండవని కాదు. కొత్త లోకంలో కూడా సాత్వికులు యెహోవా నియమాల, ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు, ఎంతో శాంతిని అనుభవిస్తారు. (కీర్త. 37:11) ఆ సమయం వచ్చేవరకు, యెహోవాలా ఆలోచించడం వల్ల మనం ఇప్పుడు కూడా సంతోషంగా ఉండవచ్చు.

^ పేరా 12 ల్యాప్‌ డాన్సింగ్‌ అంటే అర్థ నగ్నంగా బట్టలు వేసుకున్న డాన్సర్లు, కస్టమర్ల ఒళ్లో కూర్చొని లైంగికంగా రెచ్చగొట్టేలా డాన్స్‌ చేయడం. అయితే, ఒక క్రైస్తవుడు అలాంటి దానిలో పాల్గొన్నాడని తెలిస్తే, సంఘపెద్దలు వాస్తవాల్ని పరిశీలించాక, దాన్ని లైంగిక పాపంగా పరిగణించి, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాంటి దానిలో పాల్గొన్న క్రైస్తవుడు సంఘపెద్దల సహాయం తీసుకోవాలి.—యాకో. 5:14, 15.

^ పేరా 14 సెల్‌ఫోన్‌ ద్వారా అశ్లీల మెసేజ్‌లు, ఫోటోలు, బొమ్మలు, వీడియోలు పంపించుకోవడాన్ని “సెక్స్‌టింగ్‌” అంటారు. క్రైస్తవులు ఎవరైనా అలాంటి పని చేశారని తెలిస్తే వాస్తవాల్ని పరిశీలించాక, సంఘపెద్దలు న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాల్సిరావచ్చు. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో, సెక్స్‌టింగ్‌లో పాల్గొన్న టీనేజర్లను నేరస్థులుగా పరిగణించింది. మరింత సమాచారం కోసం jw.org/te వెబ్‌సైట్‌లో, “యువత అడిగే ప్రశ్నలు—సెక్స్‌టింగ్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్‌ చదవండి. (బైబిలు బోధలు కింద టీనేజర్లు సెక్షన్‌ చూడండి.) లేదా 2013, నవంబరు తేజరిల్లు! సంచికలోని (ఇంగ్లీష్‌) 4-5 పేజీల్లో ఉన్న “సెక్స్‌టింగ్‌ గురించి మీ టీనేజర్లతో ఎలా మాట్లాడాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.