కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ఆలోచనల్ని ఎవరు మలుస్తున్నారు?

మీ ఆలోచనల్ని ఎవరు మలుస్తున్నారు?

“ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి.”రోమా. 12:2.

పాటలు: 88, 45

1, 2. (ఎ) పేతురు చెప్పినదానికి యేసు ఏమన్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) యేసు ఎందుకు అలా అన్నాడు?

శిష్యులు యేసు మాటలు విని అవాక్కయ్యారు! ఎందుకంటే, ఆయన ఇశ్రాయేలుకు మళ్లీ రాజ్యాన్ని ఇస్తాడని వాళ్లు అనుకున్నారు. కానీ ఆయన త్వరలో బాధలుపడి, చనిపోతానని చెప్పాడు. అపొస్తలుడైన పేతురు అందరికన్నా ముందు మాట్లాడుతూ “ప్రభువా, అలా మాట్లాడొద్దు. అలా నీకు జరగనే జరగదు” అన్నాడు. దానికి యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో. నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు” అని అన్నాడు.—మత్త. 16:21-23; అపొ. 1:6.

2 అలా చెప్పడం ద్వారా యెహోవా ఆలోచనలకు, సాతాను గుప్పిట్లో ఉన్న లోక ఆలోచనలకు తేడా ఉందని యేసు స్పష్టం చేశాడు. (1 యోహా. 5:19) లోకంలోని చాలామందిలాగే స్వార్థంగా ఆలోచించమని పేతురు యేసుకు చెప్పాడు. కానీ త్వరలో అనుభవించబోయే బాధలకు, మరణానికి తాను సిద్ధపడాలనేది యెహోవా చిత్తమని యేసుకు తెలుసు. ఆయన లోకస్థుల ఆలోచనల్ని తిరస్కరించి, యెహోవా ఆలోచనను అంగీకరించాడని పేతురుకు ఇచ్చిన జవాబును బట్టి అర్థమౌతుంది.

3. యెహోవాలా ఆలోచించడం ఎందుకు కష్టం?

3 మరి మన విషయమేంటి? మనం యెహోవాలా ఆలోచిస్తున్నామా లేక లోకస్థుల్లా ఆలోచిస్తున్నామా? క్రైస్తవులముగా, మనం దేవుడు ఇష్టపడే పనులు చేయడానికి ఎంతో కృషిచేస్తాం. కానీ మన ఆలోచనల సంగతేంటి? యెహోవాలా ఆలోచించడానికి అంటే విషయాల్ని ఆయన చూసినట్లు చూడడానికి కృషి చేస్తున్నామా? అలా చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు, లోకస్థుల్లా ఆలోచించడం చాలా తేలిక. ఎందుకంటే, ఈ లోక వైఖరి మన చుట్టూ గాలిలా వ్యాపించింది. (ఎఫె. 2:2) అంతేకాదు, లోకస్థులు తరచూ స్వార్థంగా ఆలోచిస్తారు కాబట్టి మనం కూడా వాళ్లలాగే ఆలోచించాలని అనుకోవచ్చు. అవును, యెహోవాలా ఆలోచించడం కష్టం కానీ లోకస్థుల్లా ఆలోచించడం చాలా తేలిక.

4. (ఎ) ఈ లోకం మన ఆలోచనల్ని మలిచేలా అనుమతిస్తే ఏం జరుగుతుంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 ఈ లోకం మన ఆలోచనల్ని మలిచేలా అనుమతిస్తే, మనం స్వార్థపరులుగా తయారౌతాం. పైగా మంచేదో చెడేదో సొంతగా నిర్ణయించుకునే ప్రమాదం ఉంది. (మార్కు 7:21, 22) కాబట్టి, లోకస్థుల్లా కాకుండా దేవునిలా ఆలోచించడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. అంతేకాదు, విషయాల్ని యెహోవా చూసినట్లు చూడడం మన ప్రయోజనం కోసమే గానీ మనల్ని కట్టుదిట్టం చేసినట్లు కాదని ఎందుకు చెప్పవచ్చు? లోకం మనల్ని మలచకూడదంటే ఏం చేయవచ్చు? వంటి ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆయా విషయాల్లో యెహోవా ఆలోచన ఏంటో, దాన్ని మనమెలా అలవర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

యెహోవాలా ఆలోచించడం ప్రయోజనకరం

5. తమ ఆలోచనల్ని ఎవ్వరూ ప్రభావితం చేయకూడదని కొంతమంది ఎందుకు కోరుకుంటారు?

5 కొంతమంది తమ ఆలోచనల్ని ఎవ్వరూ ప్రభావితం చేయకూడదని కోరుకుంటారు. “నేనే సొంతగా ఆలోచించుకుంటాను” అని అంటారు. బహుశా, తమ నిర్ణయాలు తామే తీసుకుంటామని, అలా తీసుకునే హక్కు తమకుందని వాళ్ల ఉద్దేశమై ఉండవచ్చు. ఏం చేయాలో తమకెవ్వరూ చెప్పకూడదనీ, అందరిలాగే ఉండమని బలవంతం చేయకూడదనీ వాళ్లు కోరుకుంటారు. *

6. (ఎ) యెహోవా మనకు ఏ స్వేచ్ఛ ఇచ్చాడు? (బి) మన స్వేచ్ఛకు హద్దులు లేవా? వివరించండి.

6 అయితే, మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, యెహోవా ఆలోచనను అంగీకరించినంత మాత్రాన మనకంటూ సొంత అభిప్రాయాలు ఉండకూడదని కాదు. రెండవ కొరింథీయులు 3:17 ఇలా చెప్తుంది, “యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.” మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను యెహోవా ఇస్తున్నాడు. మనకు సొంత ఇష్టాయిష్టాలు ఉండవచ్చు, నచ్చినవాటిని ఎంపికచేసుకోవచ్చు. ఎందుకంటే, యెహోవా మనల్ని ఆ సామర్థ్యంతో సృష్టించాడు. కానీ దానర్థం మన స్వేచ్ఛకు హద్దుల్లేవని కాదు. (1 పేతురు 2:16 చదవండి.) తప్పొప్పులను తెలుసుకోవడానికి మనం తన వాక్యమైన బైబిల్ని ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఇది మనల్ని కట్టుదిట్టం చేస్తుందా? లేదా మనకు ప్రయోజనాన్ని ఇస్తుందా?

7, 8. విషయాల్ని యెహోవా చూసినట్లు చూడడం మనల్ని కట్టుదిట్టం చేస్తుందా? ఉదాహరణ చెప్పండి.

7 ఒక ఉదాహరణ పరిశీలించండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు నేర్పించడానికి కృషిచేస్తారు. పిల్లలు నిజాయితీగా ఉండాలని, కష్టపడి పనిచేయాలని, ఇతరుల్ని పట్టించుకోవాలని తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఇది పిల్లల్ని కట్టుదిట్టం చేసినట్లు కాదు. బదులుగా, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవడానికి తల్లిదండ్రులు వాళ్లను సిద్ధం చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక, తమ కాళ్లమీద తాము నిలబడినప్పుడు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు నేర్పించిన విలువల్ని పాటిస్తే, పిల్లలు ఎక్కువశాతం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దానివల్ల ఎన్నో సమస్యల్ని, ఆందోళనల్ని, పశ్చాత్తాపపడే పరిస్థితుల్ని తప్పించుకోగలుగుతారు.

8 ఒక మంచి తండ్రిలా యెహోవా కూడా, తన పిల్లలు వీలైనంత ఎక్కువ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. (యెష. 48:17, 18) కాబట్టి నైతిక ప్రవర్తన గురించి, ఇతరులతో వ్యవహరించడం గురించిన ప్రాథమిక సూత్రాలు నేర్పిస్తున్నాడు. విషయాల్ని తాను చూసినట్లు చూడమని, తాను నేర్పించిన విలువల్ని పాటించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇది మనల్ని కట్టుదిట్టం చేయదు గానీ మన ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. (కీర్త. 92:5; సామె. 2:1-5; యెష. 55:9) యెహోవా చెప్పింది చేస్తూ కూడా సొంత ఇష్టాయిష్టాలు కలిగివుండవచ్చు, సంతోషాన్నిచ్చే సరైన ఎంపికలు చేసుకోవచ్చు. (కీర్త. 1:2, 3) నిజానికి యెహోవాలా ఆలోచిస్తే, మనకెన్నో ప్రయోజనాలు ఉంటాయి!

యెహోవా ఆలోచనలు ఉన్నతమైనవి

9, 10. లోక ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలే ఉన్నతమైనవని ఎందుకు చెప్పవచ్చు?

9 లోక ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలే ఉన్నతమైనవి. కాబట్టి మనం ఆయనలా ఆలోచించాలి. నైతిక ప్రవర్తన గురించి, కుటుంబ సంతోషం గురించి, మంచి భవిష్యత్తు గురించి, జీవితంలోని మిగతా రంగాల గురించి లోకం సలహాలిస్తుంది. కానీ చాలావరకు ఆ సలహాలు యెహోవా ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, లోకం తరచూ సొంత ఇష్టాలకే ప్రాముఖ్యతనివ్వమని, లైంగిక పాపాలు తప్పేమీ కాదని చెప్తుంది. అంతేకాదు భార్యాభర్తలు సంతోషంగా ఉంటారనిపిస్తే, చిన్నచిన్న కారణాలకు కూడా వాళ్లు విడాకులు తీసుకోవచ్చని, లేదా వేరుగా ఉండవచ్చని సలహా ఇస్తుంది. కానీ బైబిలు బోధిస్తున్న దానికి ఇది పూర్తి విరుద్ధమైనది. అయితే, బైబిలు సలహాల కన్నా లోకం ఇచ్చే సలహాలు నేడు పనికొస్తాయా?

10 “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి” అని యేసు అన్నాడు. (మత్త. 11:19) లోకం టెక్నాలజీపరంగా ఎంతో అభివృద్ధి సాధించినా, మన సంతోషాన్ని హరించివేసే పెద్దపెద్ద సమస్యల్ని అంటే యుద్ధం, జాతి వివక్ష, నేరం వంటివాటిని మాత్రం పరిష్కరించలేకపోతుంది. దానికితోడు, లైంగిక పాపాలు తప్పేమీ కాదన్నట్లు లోకం చూపిస్తుంది. కానీ అవి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని, అనారోగ్యానికి, ఇతర చెడు పర్యవసానాలకు దారితీస్తున్నాయని చాలామంది ఒప్పుకుంటారు. మరి యెహోవా ఇచ్చే సలహాల సంగతేంటి? ఆయన సలహాల్ని పాటించే క్రైస్తవ కుటుంబాలు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సహోదరసహోదరీలతో శాంతిగా ఉంటున్నారు. (యెష. 2:4; అపొ. 10:34, 35; 1 కొరిం. 6:9-11) దీన్నిబట్టి, లోక ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలే ఉన్నతమైనవని స్పష్టంగా అర్థమౌతుంది.

11. మోషే ఆలోచనల్ని ఎవరు మలిచారు? దానివల్ల అతను ఎలాంటి ప్రతిఫలం పొందాడు?

11 యెహోవా ఆలోచనలే ఉన్నతమైనవని ప్రాచీనకాల నమ్మకమైన దేవుని సేవకులకు తెలుసు. ఉదాహరణకు, మోషే “ఐగుప్తు దేశస్థులకు సంబంధించిన అన్ని విద్యల్ని” నేర్చుకున్నప్పటికీ, నిజమైన తెలివి యెహోవా నుండి వస్తుందని గుర్తించాడు. (అపొ. 7:22; కీర్త. 90:12) అందుకే, యెహోవాను ఇలా అడిగాడు, “నీ మార్గమును నాకు తెలుపుము.” (నిర్గ. 33:13) తన ఆలోచనల్ని మలచడానికి మోషే యెహోవాను అనుమతించాడు. అందుకే, యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మోషేను ఉపయోగించుకున్నాడు. అంతేకాదు, మోషేను గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తని పిలవడం ద్వారా యెహోవా అతన్ని గౌరవించాడు.—హెబ్రీ. 11:24-27.

12. పౌలు దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నాడు?

12 అపొస్తలుడైన పౌలు తెలివైనవాడు, చదువుకున్నవాడు. అతను హీబ్రూ, గ్రీకు భాషలు కూడా మాట్లాడేవాడు. (అపొ. 5:34; 21:37, 39; 22:2, 3) కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోక జ్ఞానంపై కాకుండా, దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. (అపొస్తలుల కార్యాలు 17:2; 1 కొరింథీయులు 2:6, 7, 13 చదవండి.) ఫలితంగా, పరిచర్యను సమర్థవంతంగా చేశాడు, శాశ్వతకాలం ఉండే బహుమతి కోసం ఎదురుచూశాడు.—2 తిమో. 4:8.

13. యెహోవా ఆలోచనలకు తగ్గట్టు మన ఆలోచనల్ని మలచుకోవాల్సిన బాధ్యత ఎవరిది?

13 దేవుని ఆలోచనలు, లోక ఆలోచనల కన్నా చాలా ఉన్నతమైనవని స్పష్టమౌతుంది. మనం దేవుని ప్రమాణాల్ని పాటిస్తే నిజమైన సంతోషాన్ని, విజయాన్ని సొంతం చేసుకుంటాం. అయితే, తనలా ఆలోచించమని యెహోవా మనల్ని బలవంతపెట్టడు. “నమ్మకమైన బుద్ధిగల దాసుడు” గానీ సంఘపెద్దలు గానీ మన ఆలోచనల్ని నియంత్రించరు. (మత్త. 24:45; 2 కొరిం. 1:24) బదులుగా, యెహోవా ఆలోచనలకు తగ్గట్టు మన ఆలోచనల్ని మలచుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతీఒక్కరికి ఉంది. మరి దాన్నెలా చేయవచ్చు?

లోకం మిమ్మల్ని మలచనివ్వకండి

14, 15. (ఎ) విషయాల్ని యెహోవా చూసినట్లు చూడాలంటే మనం దేనిగురించి ధ్యానించాలి? (బి) లోక ఆలోచనలు మన మనసులోకి వచ్చేలా ఎందుకు అనుమతించకూడదు? ఉదాహరణ చెప్పండి.

14 రోమీయులు 12:2 ఇలా చెప్తుంది, “ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ మనసు మార్చుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోండి. అలా మీరు మంచిదైన, ఆమోదయోగ్యమైన, సంపూర్ణమైన దేవుని ఇష్టమేమిటో పరీక్షించి తెలుసుకుంటారు.” ఈ లేఖనం ప్రకారం, సత్యం తెలుసుకోకముందు మన ఆలోచనల్ని ఎవరు మలిచినా, ఇప్పుడు వాటిని దేవునికి అనుగుణంగా మార్చుకోవచ్చని అర్థమౌతుంది. జన్యుపరమైన విషయాలు, జీవితంలో ఎదురైన అనుభవాలు మన ఆలోచనలపై కొంతమేరకు ప్రభావం చూపించినా, మన మనసు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంతేకాదు, మనం వేటిగురించి ఆలోచించాలని అనుకుంటామో దానికి తగ్గట్లు మన మనసు మారుతుంది. కాబట్టి యెహోవా ఆలోచనల గురించి ధ్యానిస్తే, ఆయన ఆలోచనలే సరైనవని బలంగా నమ్మగలుగుతాం. అప్పుడు, విషయాల్ని యెహోవా చూసినట్లు చూడగలుగుతాం.

15 అయితే, యెహోవా ఆలోచనలకు తగ్గట్లుగా మన మనసు మార్చుకోవాలంటే, ‘ఈ వ్యవస్థ మనల్ని మలచనివ్వకుండా’ జాగ్రత్తపడాలి. అంటే దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నవాటిని చూడడం, చదవడం, వినడం మానేయాలి. అలా చేయడం ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణ పరిశీలించండి. ఆరోగ్యంగా ఉండాలనుకునే వ్యక్తి పౌష్టిక ఆహారం తింటాడు. కానీ వాటితోపాటు పాడైన ఆహారం తింటే అతని కష్టమంతా వృథా అవుతుంది! అదేవిధంగా, లోక ఆలోచనలు మన మనసులోకి వచ్చేలా అనుమతిస్తే, యెహోవా ఆలోచనల్ని తెలుసుకోవడానికి మనం చేసే కృషి అంతా వృథా అవుతుంది.

16. మనల్ని మనం దేన్నుండి కాపాడుకోవాలి?

16 లోక ఆలోచనలకు పూర్తిగా దూరంగా ఉండడం కష్టమే. మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి దాని ఆలోచనలు ఎలాగోలా మన చెవినబడతాయి. (1 కొరిం. 5:9, 10) ఉదాహరణకు, ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు ప్రజలు చెప్పే తప్పుడు అభిప్రాయాల్ని, అబద్ధ నమ్మకాల్ని వింటుంటాం. అయితే, తప్పుడు అభిప్రాయాలు మన చెవినబడినంత మాత్రాన వాటిగురించే ఆలోచించాల్సిన లేదా వాటిని అంగీకరించాల్సిన అవసరంలేదు. యేసులా మనం సాతాను ఆలోచనల్ని వెంటనే తిప్పికొట్టాలి. అంతేకాదు, లోక ఆలోచనలు అనవసరంగా మన మనసులోకి రాకుండా జాగ్రత్తపడాలి.—సామెతలు 4:23 చదవండి.

17. లోక ఆలోచనలకు మనమెలా దూరంగా ఉండవచ్చు?

17 ఉదాహరణకు, మనం స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. యెహోవాసాక్షులుకాని వాళ్లతో సన్నిహితంగా ఉంటే, వాళ్లలా ఆలోచించే ప్రమాదం ఉందని బైబిలు హెచ్చరిస్తుంది. (సామె. 13:20; 1 కొరిం. 15:12, 32, 33) మనం వినోదాన్ని కూడా జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. పరిణామ సిద్ధాంతాన్ని, హింసను, లేదా అనైతికతను ప్రోత్సహించే వినోదాన్ని తిరస్కరిస్తే, “దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న” ఆలోచనలతో మన మనసు కలుషితం అవ్వదు.—2 కొరిం. 10:5.

హానికరమైన వినోదానికి దూరంగా ఉండేలా మన పిల్లలకు సహాయం చేస్తున్నామా? (18, 19 పేరాలు చూడండి)

18, 19. (ఎ) లోక ఆలోచనలు పరోక్షంగా మన చెవినబడినప్పుడు ఏం చేయాలి? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? ఎందుకు?

18 లోక ఆలోచనలు పరోక్షంగా మన చెవినబడొచ్చు. కానీ మనం వాటిని గుర్తించి, తిరస్కరించాలి. ఉదాహరణకు, కొన్నిసార్లు వార్తా నివేదికలు ఫలానా రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని సమర్థిస్తుండవచ్చు. అంతేకాదు, లోకం గొప్పగా ఎంచే లక్ష్యాల్ని, విజయాల్ని వార్తల్లో చూపిస్తుంటారు. “నేనే ముందు,” “కుటుంబమే అన్నిటికన్నా ఎక్కువ” అనే ఆలోచనలతో కొన్ని సినిమాలు, పుస్తకాలు ఉంటాయి. అవి సహేతుకమైనవిగా, ఆసక్తికరమైనవిగా, సరైనవిగా ఈ లోకం చూపిస్తుంది. కానీ ఆ ఆలోచనలన్నీ బైబిలుకు విరుద్ధంగా ఉన్నాయి. బైబిలు ప్రకారం, యెహోవాకు మొదటిస్థానం ఇస్తే మనమూ, మన కుటుంబం నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాం. (మత్త. 22:36-39) చిన్నపిల్లల కోసం తీసిన సినిమాల్లో, కార్టూన్‌ బొమ్మల్లో, కథల్లో కూడా అనైతిక ప్రవర్తన తప్పు కాదన్నట్లు చూపిస్తున్నారు. పిల్లలపై వాటి ప్రభావం పడవచ్చు.

19 అయితే, మనం మంచి వినోదాన్ని చూడడం తప్పుకాదు. కానీ మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘లోక ఆలోచనల్ని పరోక్షంగా చూపించినప్పుడు నేను వాటిని గుర్తిస్తానా? అలాంటి టీవీ ప్రోగ్రామ్‌ల నుండి, పుస్తకాల నుండి నన్నూ, నా పిల్లల్ని కాపాడుకుంటున్నానా? లోక ఆలోచనలు నా పిల్లల చెవినబడినప్పుడు లేదా కంటబడినప్పుడు వాటి ప్రభావానికి గురవ్వకుండా, విషయాల్ని యెహోవా చూసినట్టు చూడడం నేను వాళ్లకు నేర్పిస్తున్నానా?’ దేవుని ఆలోచనలకు, లోక ఆలోచనలకు తేడాను గుర్తిస్తే, ‘ఈ లోకం మనల్ని మలిచే’ అవకాశాన్ని ఇవ్వం.

మిమ్మల్ని ఎవరు మలుస్తున్నారు?

20. మిమ్మల్ని ఎవరు మలుస్తున్నారో ఎలా తెలుస్తుంది?

20 మనకు రెండే రెండు మార్గాల ద్వారా సమాచారం వస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకటి, యెహోవా; రెండు, సాతాను అలాగే అతని గుప్పిట్లో ఉన్న లోకం. అయితే, మిమ్మల్ని ఎవరు మలుస్తున్నారు? మీరు సమాచారం ఎక్కడినుండి తీసుకుంటున్నారనే దాన్నిబట్టి మీ జవాబు ఉంటుంది. ఒకవేళ మనం లోక ఆలోచనల్ని అంగీకరిస్తే స్వార్థంగా ఆలోచిస్తాం, ప్రవర్తిస్తాం. కాబట్టి మనం ఏం చూడాలో, చదవాలో, వినాలో, ఆలోచించాలో జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి.

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

21 మనం యెహోవాలా ఆలోచించాలంటే, లోక ఆలోచనల్ని తిరస్కరించాలని, ఆయన ఆలోచనల గురించి ధ్యానించాలని ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. అయితే, మనం ఇంకా ఎక్కువగా యెహోవాలా ఎలా ఆలోచించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 5 నిజానికి, ఎవ్వరి మీద ఆధారపడని వ్యక్తులపై కూడా ఇతరుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు జీవం ఎలా వచ్చిందనే విషయంలో లేదా మనం వేసుకునే బట్టల విషయంలో కూడా ఇతరుల ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. అయితే ఎవరు మనపై ప్రభావం చూపించాలో మనమే ఎంపికచేసుకోవచ్చు.