అధ్యయన ఆర్టికల్ 45
పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది?
“ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలి. 4:13.
పాట 104 పవిత్రశక్తి దేవుడిచ్చే బహుమానం
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. (ఎ) ప్రతీరోజు మన సమస్యల్ని తట్టుకొని ముందుకెళ్లడానికి ఏది సహాయం చేస్తుంది? వివరించండి. (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
మీరు ఎదుర్కొన్న ఒక పరీక్ష గురించి ఆలోచించినప్పుడు, ‘నా సొంత శక్తితోనైతే ఆ పరీక్షను తట్టుకోవడం అసంభవం!’ అని మీకెప్పుడైనా అనిపించిందా? మనలో చాలామందికి అలా అనిపించే ఉంటుంది. బహుశా, ఒక తీవ్రమైన జబ్బును లేదా ఇష్టమైనవాళ్లను పోగొట్టుకున్న దుఃఖాన్ని మీరు ఎలా తట్టుకోగలిగారో గుర్తుచేసుకున్నప్పుడు అలా అనుకొనివుంటారు. మీరు దాటివచ్చిన ఆ పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు, యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ఇచ్చిన “అసాధారణ శక్తి” వల్లే ఒక్కో రోజు నెట్టుకురాగలిగారని మీకు అనిపిస్తుంది.—2 కొరిం. 4:7-9.
2 ఈ చెడ్డ లోక ప్రభావానికి లొంగిపోకుండా ఉండాలంటే కూడా మనకు పవిత్రశక్తి అవసరం. (1 యోహా. 5:19) అంతేకాదు “ఎంతోమంది చెడ్డదూతలతో” పోరాడడానికి మనకు బలం కావాలి. (ఎఫె. 6:12) కాబట్టి ఈ సమస్యలన్నిటిలో పవిత్రశక్తి మనకు సహాయం చేసే రెండు మార్గాల గురించి ఇప్పుడు చర్చిస్తాం. అలాగే ఆ సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే ఏం చేయాలో చర్చించుకుంటాం.
పవిత్రశక్తి మనకు బలాన్నిస్తుంది
3. పరీక్షల్ని తట్టుకోవడానికి యెహోవా మనకు సహాయం చేసే ఒక మార్గం ఏంటి?
3 పరీక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ మనకున్న బాధ్యతల్ని నిర్వర్తించడానికి కావాల్సిన బలాన్ని దేవుని పవిత్రశక్తి మనకు ఇస్తుంది. అపొస్తలుడైన పౌలు “క్రీస్తు శక్తి” మీద ఆధారపడడం వల్లే పరీక్షలు ఎదురైనప్పటికీ యెహోవా సేవ కొనసాగించగలిగాడు. (2 కొరిం. 12:9) పౌలు తన రెండో మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు, ఎక్కువ సమయం పరిచర్యలో గడపడమే కాకుండా, తన ఖర్చుల కోసం పని కూడా చేశాడు. ఆయన కొరింథులో అకుల, ప్రిస్కిల్ల ఇంట్లో ఉండేవాడు. ఆ జంట డేరాలు కుట్టేవాళ్లు. పౌలు కూడా డేరాలు కుట్టేవాడు కాబట్టి కొన్నిరోజులు వాళ్లతో కలిసి పనిచేశాడు. (అపొ. 18:1-4) పౌలు తన ఖర్చుల కోసం పని చేసుకోవడానికి అలాగే పరిచర్య చేయడానికి కావాల్సిన బలాన్ని పవిత్రశక్తి ద్వారా పొందాడు.
4. రెండో కొరింథీయులు 12:7బి-9 ప్రకారం, పౌలు ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు?
రెండో కొరింథీయులు 12:7బి-9 చదవండి. ఈ వచనాల్లో, తన “శరీరంలో ఓ ముల్లు” ఉందని పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడు? మీకు ముల్లు గుచ్చుకొని, అది శరీరంలోనే ఉండిపోతే చాలా నొప్పి పెడుతుంది. అదేవిధంగా, బాధ కలిగించే ఒక సమస్యను ఎదుర్కొన్నానని పౌలు చెప్తున్నాడు. ఆ సమస్య, ‘సాతాను దూతలా పనిచేస్తూ, అదేపనిగా నన్ను బాధిస్తోంది’ అని ఆయన చెప్పాడు. బహుశా సాతాను లేదా అతని చెడ్డ దూతలు పౌలు శరీరంలోకి ఒక ముల్లును పొడిచినట్లుగా ఆయనకు నేరుగా కష్టాలు కలిగించి ఉండకపోవచ్చు. కానీ ఆ చెడ్డ దూతలు పౌలుకున్న ‘ముల్లును’ గమనించినప్పుడు, ఆయన వేదనను పెంచడానికి ఒకవిధంగా వాళ్లు ఆ ముల్లును మరింత లోతుకు దించాలని ప్రయత్నించి ఉంటారు. అప్పుడు పౌలు ఏం చేశాడు?
45. పౌలు ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?
5 మొదట్లో పౌలు, తన ‘ముల్లును’ యెహోవా తీసేయాలని కోరుకున్నాడు. ఆయనిలా ఒప్పుకుంటున్నాడు, “దాన్ని నాలో నుండి తీసేయమని ప్రభువును [యెహోవాను] మూడుసార్లు బ్రతిమాలాను.” కానీ పౌలు ఎంత ప్రార్థించినా తన శరీరంలో ముల్లు పోలేదు. దానర్థం యెహోవా పౌలు ప్రార్థనలకు జవాబివ్వలేదనా? కానేకాదు. పౌలుకున్న సమస్యను తీసేయడం ద్వారా కాదుగానీ దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడం ద్వారా యెహోవా జవాబిచ్చాడు. “నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీలో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది” అని యెహోవా చెప్పాడు. (2 కొరిం. 12:8, 9) ఆయన సహాయం వల్లే పౌలు తన సంతోషాన్ని, ప్రశాంతతను కాపాడుకోగలిగాడు.—ఫిలి. 4:4-7.
6. (ఎ) మీ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబివ్వవచ్చు? (బి) లేఖనాల్లో ఉన్న ఏ వాగ్దానాలు మీకు బలాన్నిస్తాయి?
6 బహుశా మీరు కూడా పౌలులాగే, మీకున్న సమస్యను తీసేయమని చాలాసార్లు ప్రార్థించివుంటారు. కానీ ఆ సమస్య అలానే ఉండి ఉండవచ్చు లేదా ఇంకా తీవ్రమై ఉండవచ్చు. అప్పుడు, యెహోవాకు మీమీద కోపమొచ్చిందేమో అని అనుకున్నారా? అలాగైతే, పౌలును గుర్తుచేసుకోండి. యెహోవా పౌలు ప్రార్థనలకు జవాబిచ్చినట్టే, మీ ప్రార్థనలకు కూడా ఖచ్చితంగా జవాబిస్తాడు. యెహోవా మన సమస్యను తీసేయకపోవచ్చు, కానీ దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని పవిత్రశక్తి ద్వారా ఇస్తాడు. (కీర్త. 61:3, 4) బహుశా మీరు “కృంగిపోయి” ఉండవచ్చు, కానీ యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు.—2 కొరిం. 4:8, 9; ఫిలి. 4:13.
యెహోవా సేవ చేస్తూ ఉండేలా పవిత్రశక్తి సహాయం చేస్తుంది
7-8. (ఎ) పవిత్రశక్తిని బలంగా వీచే గాలితో ఎందుకు పోల్చవచ్చు? (బి) పవిత్రశక్తి పనిచేసే విధానాన్ని పేతురు ఎలా వివరించాడు?
7 పవిత్రశక్తి ఇంకా ఏ విధంగా మనకు సహాయం చేస్తుంది? పవిత్రశక్తిని బలంగా వీచే గాలితో పోల్చవచ్చు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నాసరే, సరైన దిశలో వీచే గాలిని ఉపయోగించుకొని ఓడ ఎలాగైతే దాని గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటుందో, అలాగే మనం సమస్యల్లో ఉన్నా, పవిత్రశక్తి సహాయంతో దేవుడు వాగ్దానం చేసిన కొత్త లోకంలోకి ప్రవేశించే వరకు యెహోవా సేవ చేస్తూ ఉండగలం.
8 అపొస్తలుడైన పేతురు ఒక జాలరి కాబట్టి, ఆయనకు ఓడ ప్రయాణం గురించి బాగా తెలుసు. అందుకేనేమో, ఆయన పవిత్రశక్తి పనిచేసే విధానం గురించి చెప్తున్నప్పుడు, ఓడ ప్రయాణానికి సంబంధించిన పదాన్ని ఉపయోగించాడు. ఆయన ఇలా రాశాడు, “ప్రవచనం ఎప్పుడూ మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ పవిత్రశక్తి ప్రేరణతో మనుషులు దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.” ఇక్కడ, “ప్రేరణ” అని అనువదించబడిన గ్రీకు పదానికి “నిర్దేశించబడడం” లేదా “కదిలించబడడం” అనే అర్థాలు కూడా ఉన్నాయి.—2 పేతు. 1:21.
9. “ప్రేరణ” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు పేతురు మనసులో ఏ పదచిత్రం ఉంది?
9 “ప్రేరణ” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు పేతురు మనసులో ఏ పదచిత్రం ఉంది? అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని రాసిన లూకా, గాలికి ‘కొట్టుకుపోయిన’ ఓడ గురించి చెప్తున్నప్పుడు, అదే గ్రీకు పదానికున్న మరో రూపాన్ని ఉపయోగించాడు. అపొ. 27:15) మనుషులు పవిత్రశక్తి “ప్రేరణతో” బైబిల్ని రాశారని చెప్పడానికి పేతురు ఉపయోగించిన పదాన్ని వింటే ఎవరికైనా ఓడ ప్రయాణం గుర్తుకొస్తుందని ఒక బైబిలు విద్వాంసుడు అన్నాడు. ఒక ఓడ దాని గమ్యాన్ని చేరుకోవడానికి బలంగా వీచే గాలి దాన్ని నెట్టినట్టే, బైబిలు రచయితలు తమ పనిని పూర్తిచేయడానికి పవిత్రశక్తి నడిపించిందని పేతురు మాటల భావం. “ఒక విధంగా చెప్పాలంటే ఆ రచయితలు తమ తెరచాపల్ని పైకెత్తారు” అని కూడా ఆ విద్వాంసుడు అన్నాడు. యెహోవా కూడా తన వంతుగా ‘బలమైన గాలిని’ అంటే పవిత్రశక్తిని రప్పించాడు. బైబిలు రచయితలు తమ వంతుగా పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం పనిచేశారు.
(10-11. పవిత్రశక్తి నిర్దేశాన్ని పొందాలంటే మనం ఏ రెండు పనులు చేయాలి? ఉదాహరణ చెప్పండి.
10 నిజమే, నేడు యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి బైబిలు పుస్తకాల్ని రాయించట్లేదు. కానీ తన సేవకులను నిర్దేశించడానికి ఆయన ఇప్పటికీ పవిత్రశక్తిని ఉపయోగిస్తూనే ఉన్నాడు. అవును, యెహోవా తన వంతు పని చేస్తూనే ఉన్నాడు. పవిత్రశక్తి సహాయం పొందాలంటే మనం ఏం చేయాలి? దానికోసం మన వంతు కృషి మనం చేస్తూ ఉండాలి. దాన్నెలా చేయవచ్చు?
11 ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. బలంగా వీచే గాలి సహాయంతో ఓడ నడపాలంటే, నావికుడు రెండు పనులు చేయాలి. మొదటిగా, గాలి వీస్తున్న దిశగా తన ఓడను ఉంచాలి. ఎందుకంటే నావికుడు గాలి వీస్తున్న చోట లేకుండా రేవు దగ్గరే ఉండిపోతే ఓడ కదలదు. రెండోదిగా, ఆయన తెరచాపను పైకెత్తి దాన్ని పూర్తిగా తెరవాలి. అప్పుడు తెరచాప గాలితో నిండిపోయి ఓడ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా, పవిత్రశక్తి సహాయం ఉంటేనే మనం యెహోవా సేవ చేస్తూ ఉండగలం. పవిత్రశక్తి సహాయం పొందాలంటే మనం రెండు పనులు చేయాలి. మొదటిగా, దేవుని సేవకులు ఏం చేయాలని పవిత్రశక్తి నిర్దేశిస్తుందో వాటిని మనం చేయాలి. రెండోదిగా, దేవుడు చెప్తున్న పనుల్లో వీలైనంత ఎక్కువగా భాగం వహించడం ద్వారా ‘మన తెరచాపల్ని ఎత్తాలి.’ (కీర్త. 119:32) ఆ రెండు పనులు చేసినప్పుడు పవిత్రశక్తి ఇచ్చే బలాన్ని పొందుతాం. దానివల్ల కొత్త లోకంలోకి ప్రవేశించే వరకు వ్యతిరేకతను, పరీక్షల్ని తట్టుకొని యెహోవా సేవ చేస్తూ ఉండగలుగుతాం.
12. మనం ఇప్పుడు ఏం పరిశీలిస్తాం?
12 ఇప్పటివరకు, పవిత్రశక్తి మనకు సహాయం చేసే రెండు మార్గాల గురించి చర్చించుకున్నాం. సమస్యల్లో ఉన్నప్పుడు పవిత్రశక్తి మనకు బలాన్నిస్తుంది అలాగే యెహోవాకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు పవిత్రశక్తి మనకు నిర్దేశమిస్తూ, యెహోవా మనకు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి సహాయం చేస్తుంది. ఫలితంగా మనం శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటాం. అయితే, పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే మనం చేయాల్సిన నాలుగు పనుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా ఎలా పొందవచ్చు?
13. రెండో తిమోతి 3:16, 17 ప్రకారం, లేఖనాలు మనకు ఎలా సహాయం చేస్తాయి? మరి మనం ఏం చేయాలి?
13 మొదటిగా, బైబిల్ని అధ్యయనం చేయాలి. (2 తిమోతి 3:16, 17 చదవండి.) ‘దేవుడు ప్రేరేపించిన’ అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “దేవుడు ఊదిన” అని అర్థం. దేవుడు పవిత్రశక్తి ద్వారా తన ఆలోచనల్ని బైబిలు రచయితల మనసుల్లో “ఊదాడు.” మనం బైబిలు చదివి, ధ్యానించినప్పుడు దేవుని నిర్దేశాలు మన మనసులోకి, హృదయంలోకి వెళ్తాయి. దానివల్ల యెహోవాను సంతోషపెట్టేలా మన జీవితంలో మార్పులు చేసుకోగలుగుతాం. (హెబ్రీ. 4:12) అయితే, పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే, మనం సమయం తీసుకుని రోజూ బైబిల్ని అధ్యయనం చేయాలి, లోతుగా ఆలోచించాలి. అప్పుడు అది మన మాటలన్నిటి మీద, పనులన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది.
14. (ఎ) మన మీటింగ్స్‌లో పవిత్రశక్తి పనిచేస్తుందని ఎందుకు చెప్పవచ్చు? (బి) మీటింగ్స్‌లో పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే ఏం చేయాలి?
14 రెండోదిగా, సహోదరసహోదరీలతో కలిసి దేవున్ని ఆరాధించాలి. (కీర్త. 22:22) మన క్రైస్తవ కూటాల్లో యెహోవా పవిత్రశక్తి పనిచేస్తుంది. (ప్రక. 2:29) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, సహోదరసహోదరీలతో కలిసి ఆరాధిస్తున్నప్పుడు, మనం పవిత్రశక్తి కోసం ప్రార్థిస్తాం, దేవుని వాక్యం ఆధారంగా ఉన్న రాజ్య గీతాలు పాడతాం, పవిత్రశక్తి ద్వారా నియమించబడిన సహోదరులు ఇచ్చే బైబిలు ఆధారిత ఉపదేశం వింటాం. అంతేకాదు, సహోదరీలు తమ నియామకాల కోసం సిద్ధపడడానికి, వాటిని చక్కగా చేయడానికి అదే పవిత్రశక్తి సహాయం చేస్తుంది. అయితే, పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే మీటింగ్స్‌లో కామెంట్ చెప్పేలా బాగా సిద్ధపడాలి. అలా చేసినప్పుడు, తెరచాప విప్పిన ఓడలా వీలైనంత ఎక్కువగా పవిత్రశక్తి సహాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటాం.
15. ప్రకటనా పనిలో పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది?
15 మూడోదిగా, ప్రకటనా పని చేయాలి. ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు బైబిలు ఉపయోగిస్తే, పవిత్రశక్తి పరిచర్యలో మనకు సహాయం చేసేలా అనుమతిస్తాం. (రోమా. 15:18, 19) ఆ సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే, మనం క్రమంగా ప్రీచింగ్‌కి వెళ్తూ సాధ్యమైనప్పుడల్లా బైబిలు ఉపయోగించాలి. పరిచర్యలో ప్రజలతో చక్కగా సంభాషించడానికి ఒక మార్గం ఏంటంటే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌లో ఉన్న “ఇలా మాట్లాడవచ్చు” అనే సంభాషణల్ని ఉపయోగించడం.
16. పవిత్రశక్తిని పొందే సూటైన మార్గం ఏంటి?
16 నాల్గోదిగా, యెహోవాకు ప్రార్థించాలి. (మత్త. 7:7-11; లూకా 11:13) పవిత్రశక్తిని పొందే సూటైన మార్గం ఏంటంటే ప్రార్థనలో దానికోసం యెహోవాను అడగడం. మన ప్రార్థనలు యెహోవా దగ్గరికి చేరకుండా లేదా పవిత్రశక్తి అనే మంచి బహుమానం మన దగ్గరికి చేరకుండా ఏదీ ఆపలేదు. అలా ఆపే శక్తి జైలు గోడలకు గానీ సాతానుకు గానీ లేదు. (యాకో. 1:17) పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే మనం ఎలా ప్రార్థించాలి? ఆ ప్రశ్నకు జవాబు కోసం, ప్రార్థన గురించి మరింత వివరంగా తెలియజేసే ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. అది ఒక్క లూకా సువార్తలోనే ఉంది. *
పట్టుదలగా ప్రార్థించండి
17. ప్రార్థన గురించి లూకా 11:5-9, 13 లో యేసు చెప్పిన ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?
17 లూకా 11:5-9, 13 చదవండి. మనం పవిత్రశక్తి కోసం ఎలా ప్రార్థించాలో యేసు చెప్పిన ఉదాహరణ తెలియజేస్తుంది. ఆ ఉదాహరణలో ఉన్న వ్యక్తి “పట్టుదలతో పదేపదే అడిగినందుకు” తనకు కావాల్సింది పొందాడు. అప్పటికే రాత్రి చాలా పొద్దుపోయినా అతను తన స్నేహితుని సహాయం అడగడానికి ఏ మాత్రం వెనకాడలేదు. ఆ ఉదాహరణ ప్రార్థన గురించి ఏం నేర్పిస్తుందని యేసు చెప్పాడు? ఆయనిలా చెప్పాడు, “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది.” కాబట్టి దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనకు పవిత్రశక్తి సహాయం కావాలంటే దానికోసం పట్టుదలగా ప్రార్థించాలి.
18. యేసు చెప్పిన ఉదాహరణ బట్టి, యెహోవా మనకు పవిత్రశక్తిని ఇస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?
18 యెహోవా మనకు పవిత్రశక్తిని ఎందుకు ఇస్తాడో అర్థంచేసుకోవడానికి కూడా యేసు చెప్పిన ఉదాహరణ సహాయం చేస్తుంది. ఆ ఉదాహరణలోని వ్యక్తి, తన ఇంటికి వచ్చిన అతిథి పట్ల శ్రద్ధ చూపించాలనుకున్నాడు. రాత్రిపూట వచ్చిన వ్యక్తికి ఆహారం పెట్టాలని అతను అనుకున్నాడు. కానీ అతని దగ్గర ఏమీ లేవు. అయితే, అతను తన పొరుగువాని దగ్గరకు వెళ్లి రొట్టె కోసం పట్టుదలగా అడగడం వల్ల ఆహారం దొరికింది. ఇక్కడ యేసు ఏం చెప్పాలనుకున్నాడు? పట్టుదలగా అడిగితే ఒక అపరిపూర్ణ మనిషే సహాయం చేయడానికి సిద్ధపడితే, పవిత్రశక్తి కోసం తనను పట్టుదలగా అడిగేవాళ్లకు మన దయగల పరలోక తండ్రి ఇంకెంతగా ఇస్తాడో కదా! కాబట్టి, మనం పవిత్రశక్తి కోసం ప్రార్థనలో అడిగితే యెహోవా తప్పకుండా ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 10:17; 66:19.
19. మనం విజయం సాధిస్తామనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?
19 మనల్ని ఓడించాలని సాతాను ఎంతగా ప్రయత్నించినా, మనం విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే పవిత్రశక్తి మనకు రెండు విధాలుగా సహాయం చేస్తుంది. మొదటిగా, పరీక్షల్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్నిస్తుంది. రెండోదిగా, మనం కొత్త లోకంలోకి ప్రవేశించే వరకు యెహోవా సేవ చేస్తూ ఉండేలా సహాయం చేస్తుంది. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా పవిత్రశక్తి సహాయాన్ని పొందాలని నిశ్చయించుకుందాం.
పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు
^ పేరా 5 మన సమస్యల్ని తట్టుకోవడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేయగలదో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు పవిత్రశక్తి సహాయాన్ని వీలైనంత ఎక్కువగా పొందాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుంటాం.
^ పేరా 59 చిత్రాల వివరణ: మొదటి పని: ఒక సహోదరుడు, సహోదరి రాజ్యమందిరానికి వచ్చారు. యెహోవా పవిత్రశక్తి పనిచేసే చోట వాళ్లు తోటి సహోదరసహోదరీలతో సహవసిస్తున్నారు. రెండో పని: మీటింగ్‌లో భాగం వహించడానికి వాళ్లు సిద్ధపడి వచ్చారు. ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన మిగతావాటికి అంటే బైబిల్ని అధ్యయనం చేయడం, పరిచర్యలో భాగం వహించడం, యెహోవాకు ప్రార్థించడం వంటివాటికి కూడా ఆ రెండు పనులే ఆధారం.