అధ్యయన ఆర్టికల్ 44
అంతం రాకముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోండి
“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును.”—సామె. 17:17.
పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. మొదటి పేతురు 4:7, 8 ప్రకారం కష్టాల్ని తట్టుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?
మనందరం “చివరి రోజుల” ముగింపులో జీవిస్తున్నాం కాబట్టి, మనకు తీవ్రమైన కష్టాలు ఎదురవ్వవచ్చు. (2 తిమో. 3:1) ఉదాహరణకు, పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశంలో ఎన్నికల ప్రచారం ముగిశాక అక్కడ చాలా గొడవలు, కొట్లాటలు జరిగాయి. దానివల్ల, ఆ ప్రాంతంలో ఉంటున్న మన సహోదరసహోదరీలు ఆరు నెలల కన్నా ఎక్కువకాలం స్వేచ్ఛగా తిరగలేకపోయారు. మరి ఆ కష్ట పరిస్థితిని వాళ్లెలా తట్టుకోగలిగారు? కొంతమంది, సురక్షిత ప్రాంతాల్లో ఉంటున్న సహోదరుల ఇళ్లలో ఆశ్రయం పొందారు. ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, “అలాంటి పరిస్థితిలో నేను నా స్నేహితులతో ఉన్నందుకు చాలా సంతోషించాను. మేము ఒకరినొకరం ప్రోత్సహించుకోగలిగాం.”
2 “మహాశ్రమ” మొదలైనప్పుడు, మనల్ని ప్రేమించే మంచి స్నేహితులు ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. (ప్రక. 7:14) కాబట్టి ఇప్పుడే అలాంటి స్నేహితుల్ని సంపాదించుకోవడం అత్యవసరం. (1 పేతురు 4:7, 8 చదవండి.) ఈ విషయంలో మనం యిర్మీయా నుండి ఎంతో నేర్చుకోవచ్చు. యెరూషలేము నాశనానికి కొంచెం ముందు, తన స్నేహితులు ఆయన ప్రాణాల్ని కాపాడారు. * మనం యిర్మీయాను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
యిర్మీయా నుండి నేర్చుకోండి
3. (ఎ) యిర్మీయా ఇతరులకు దూరంగా ఉండే అవకాశముందని ఎలా చెప్పవచ్చు? (బి) యిర్మీయా బారూకుతో ఏ విషయాలు పంచుకున్నాడు? దాని ఫలితం ఏంటి?
3 యిర్మీయా 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు అవిశ్వాసుల మధ్య జీవించాడు. వాళ్లలో తన పొరుగువాళ్లు, బహుశా తన సొంతూరైన అనాతోతుకు చెందిన కొంతమంది బంధువులు కూడా ఉండివుంటారు. (యిర్మీ. 11:21; 12:6) అయినప్పటికీ ఆయన ఇతరులకు దూరంగా ఉండాలనుకోలేదు. నిజానికి, ఆయన తన భావాల్ని నమ్మకస్థుడైన తన కార్యదర్శి బారూకుతో, అలాగే బైబిల్లోని తన పుస్తకం ద్వారా మనతో కూడా పంచుకున్నాడు. (యిర్మీ. 8:21; 9:1; 20:14-18; 45:1) ఆసక్తికరంగా సాగే యిర్మీయా జీవిత కథను బారూకు రాస్తున్నప్పుడు, వాళ్లిద్దరి మధ్య ప్రగాఢమైన ప్రేమ-గౌరవం కలిగివుంటాయి.—యిర్మీ. 20:1, 2; 26:7-11.
4. యెహోవా యిర్మీయాను ఏం చేయమని చెప్పాడు? ఆ పని యిర్మీయా, బారూకుల మధ్య స్నేహాన్ని ఎలా బలపర్చింది?
4 యెరూషలేముకు జరగబోయే దానిగురించి యిర్మీయా ఎన్నో సంవత్సరాలపాటు ఇశ్రాయేలీయుల్ని ధైర్యంగా హెచ్చరించాడు. (యిర్మీ. 25:3) పశ్చాత్తాపపడేలా ప్రజలకు మరో అవకాశం ఇస్తూ యెహోవా తన హెచ్చరికల్ని ఒక గ్రంథపు చుట్టలో రాయమని యిర్మీయాకు చెప్పాడు. (యిర్మీ. 36:1-4) దేవుడిచ్చిన ఆ పనిలో యిర్మీయా, బారూకు సన్నిహితంగా పనిచేశారు. దాన్ని పూర్తిచేయడానికి వాళ్లకు చాలా నెలలు పట్టివుంటుంది. వాళ్లు ఆ పని చేస్తున్నప్పుడు తమ విశ్వాసాన్ని బలపర్చే ఎన్నో విషయాలు మాట్లాడుకొని ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
5. బారూకు ఒక మంచి స్నేహితుడని ఎలా చూపించాడు?
5 వాళ్లు ఆ గ్రంథపు చుట్టను రాయడం పూర్తయిన తర్వాత, దానిలో ఉన్న సందేశాన్ని ప్రజలకు చెప్పడానికి యిర్మీయాకి బారూకు సహాయం అవసరమైంది. (యిర్మీ. 36:5, 6) బారూకు ప్రమాదకరమైన ఆ నియామకాన్ని ధైర్యంగా చేశాడు. బారూకు మందిర ఆవరణకు వెళ్లి, తను చెప్పింది చేసినప్పుడు యిర్మీయాకు ఎంత గర్వంగా అనిపించివుంటుందో ఊహించండి. (యిర్మీ. 36:8-10) బారూకు చేసిన పని గురించి యూదా అధిపతులు విన్నారు, దాంతో ఆ గ్రంథపు చుట్టను తమకోసం బిగ్గరగా చదవమని వాళ్లు బారూకును ఆజ్ఞాపించారు. (యిర్మీ. 36:14, 15) యిర్మీయా చెప్పిన విషయాలు రాజైన యెహోయాకీముకు చెప్పాలని ఆ అధిపతులు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్లు బారూకు పరిస్థితిని అర్థంచేసుకుని ఇలా అన్నారు, “నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దు.” (యిర్మీ. 36:16-19) అది ఎంత మంచి సలహానో కదా!
6. వ్యతిరేకత ఎదురైనప్పుడు యిర్మీయా, బారూకు ఎలా స్పందించారు?
6 యిర్మీయా రాసిన మాటలు విని రాజైన యెహోయాకీముకు ఎంత కోపం వచ్చిందంటే, అతను గ్రంథపు చుట్టను కాల్చేశాడు. అంతేకాదు యిర్మీయాను, బారూకును బంధించమని ఆజ్ఞాపించాడు. కానీ యిర్మీయా భయపడలేదు. ఆయన మరో గ్రంథపు చుట్టను తీసుకొని బారూకుకు ఇచ్చాడు. యెహోవా సందేశాన్ని యిర్మీయా చెప్తుంటే బారూకు, “యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని” మళ్లీ రాశాడు.—యిర్మీ. 36:26-28, 32.
7. యిర్మీయా, బారూకు కలిసి పనిచేసినప్పుడు ఏం జరిగి ఉండవచ్చు?
7 సాధారణంగా, ఇద్దరు వ్యక్తులు ఏదైనా సమస్యను కలిసి ఎదుర్కొన్నప్పుడు వాళ్లు మంచి స్నేహితులు అవుతారు. చెడ్డ రాజైన యెహోయాకీము కాల్చేసిన గ్రంథపు చుట్టను మళ్లీ రాస్తున్నప్పుడు బహుశా యిర్మీయా, బారూకు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకొని, సన్నిహిత స్నేహితులు అయ్యుంటారు. ఆ ఇద్దరు నమ్మకమైన పురుషుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
మనసువిప్పి మాట్లాడండి
8. సన్నిహిత స్నేహితుల్ని సంపాదించుకోవడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారు? దానికోసం మనమెందుకు పట్టుదలగా కృషిచేస్తూ ఉండాలి?
8 గతంలో ఎవరైనా మనల్ని బాధపెట్టడం వల్ల, ఇతరులతో మనసువిప్పి మాట్లాడడం మనకు కష్టంగా ఉండవచ్చు. (సామె. 18:19, 24) లేదా సన్నిహిత స్నేహితుల్ని సంపాదించుకునేంత సమయం, శక్తి మనకు లేవని అనిపించవచ్చు. కానీ మనం పట్టుదలగా కృషిచేస్తూ ఉండాలి. కష్టాల్లో సహోదరులు మన వెన్నంటే ఉండాలంటే, ఇప్పుడే వాళ్లతో బలమైన స్నేహం ఏర్పర్చుకోవాలి. అలా చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే మన ఆలోచనల్ని, భావాల్ని వాళ్లతో పంచుకోవడం.—1 పేతు. 1:22.
9. (ఎ) యేసు తన స్నేహితుల్ని నమ్మాడని ఎలా చూపించాడు? (బి) మనసువిప్పి మాట్లాడితే ఇతరులతో మీ స్నేహం బలపడుతుందని ఎలా చెప్పవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.
9 యేసు తన స్నేహితులతో నిజాయితీగా, ఏదీ దాచి పెట్టకుండా మాట్లాడడం ద్వారా వాళ్లను నమ్మాడని చూపించాడు. (యోహా. 15:15) మనం కూడా మన సంతోషాల్ని, బాధల్ని, చింతల్ని స్నేహితులతో పంచుకోవడం ద్వారా యేసును అనుకరించవచ్చు. మీతో ఎవరైనా మాట్లాడుతుంటే జాగ్రత్తగా వినండి. అప్పుడు మీకూ వాళ్లకూ దాదాపుగా ఒకేలాంటి ఆలోచనలు, భావాలు, లక్ష్యాలు ఉన్నాయని తెలుసుకుంటారు. సిండీ అనే 29 ఏళ్ల సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె మారీ-లూయిజ్ అనే 67 ఏళ్ల పయినీరు సహోదరితో స్నేహం చేసింది. వాళ్లిద్దరూ కలిసి ప్రతీ గురువారం ఉదయం ప్రీచింగ్ చేసేవాళ్లు. అంతేకాదు వాళ్లు చాలా విషయాల గురించి మనసువిప్పి మాట్లాడుకునేవాళ్లు. సిండీ ఇలా చెప్తుంది, “నేను ముఖ్యమైన విషయాల్ని స్నేహితులతో మాట్లాడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే, అలా మాట్లాడితే వాళ్లను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాను.” సిండీలాగే మీరు కూడా మీ ఆలోచనల్ని, భావాల్ని మీ స్నేహితులతో పంచుకున్నప్పుడు, వాళ్లు మాట్లాడుతుంటే విన్నప్పుడు మీ మధ్య ఉన్న స్నేహం ఇంకా బలపడుతుంది.—సామె. 27:9.
కలిసి పనిచేయండి
10. సామెతలు 27:17 ప్రకారం, తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేసినప్పుడు ఏం జరగవచ్చు?
10 యిర్మీయా, బారూకు విషయంలో జరిగినట్టే, మనం తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేసినప్పుడు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాలు చూసినప్పుడు వాళ్లనుండి నేర్చుకోగలుగుతాం, వాళ్లకు ఇంకా సన్నిహితం అవ్వగలుగుతాం. (సామెతలు 27:17 చదవండి.) ఉదాహరణకు, పరిచర్యలో మీ స్నేహితుడు తన విశ్వాసం గురించి ధైర్యంగా వివరించినప్పుడు లేదా యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి బలమైన నమ్మకంతో మాట్లాడినప్పుడు మీకెలా అనిపిస్తుంది? బహుశా అతన్ని మీరు ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు.
11-12. కలిసి ప్రీచింగ్ చేయడం వల్ల స్నేహాలు బలపడతాయని ఏ ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు?
11 సహోదరసహోదరీలతో కలిసి ప్రీచింగ్ చేయడం వల్ల ఒకరికొకరు దగ్గరౌతారని చెప్పడానికి రెండు అనుభవాల్ని పరిశీలించండి. అడలీన్ అనే 23 ఏళ్ల సహోదరి, తన స్నేహితుల్లో ఒకరైన కాన్‌డీస్ అనే సహోదరిని అంతకుముందు ఎప్పుడూ చేయని క్షేత్రంలో ప్రీచింగ్ చేద్దామని అడిగింది. ఆమె ఇలా చెప్తుంది, “మేము ప్రీచింగ్‌ని ఎక్కువ ఉత్సాహంగా చేయాలని, ఎక్కువ ఆనందించాలని అనుకున్నాం. యెహోవా సేవలో మేము చేయగలిగినదంతా చేస్తూ ఉండడానికి మాకు కాస్త ప్రోత్సాహం కావాలని కోరుకున్నాం.” కలిసి పనిచేయడం వల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందారు? అడలీన్ ఇలా చెప్తుంది, “మేము రోజూ సాయంత్రం, ప్రీచింగ్‌లో ఎదురైన మంచి అనుభవాల గురించి, యెహోవా సహాయాన్ని రుచి చూసిన సందర్భాల గురించి, మా భావాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇలా మాట్లాడుకోవడం మాకు సంతోషాన్నిచ్చింది. అంతేకాదు ఒకరినొకరం ఇంకా ఎక్కువ అర్థం చేసుకోగలిగాం.”
12 ఫ్రాన్స్‌కు చెందిన లేయలా, మారీయాన అనే ఇద్దరు పెళ్లికాని సహోదరీలు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధానియైన బాంగీ అనే నగరంలో ఐదు వారాలు ప్రీచింగ్ చేయడానికి వెళ్లారు. అది చాలా రద్దీగా ఉండే నగరం. లేయలా ఇలా గుర్తుచేసుకుంటుంది, “నేనూ, మరీయాన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ చక్కగా మాట్లాడుకోవడం వల్ల, నిజమైన ప్రేమ చూపించుకోవడం వల్ల
మా స్నేహం బలపడింది. పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే మనస్తత్వాన్ని, స్థానిక ప్రజల పట్ల ఆమెకున్న ప్రేమను, పరిచర్యలో ఆమెకున్న ఉత్సాహాన్ని గమనించినప్పుడు మరీయాన పట్ల నాకున్న గౌరవం పెరిగింది.” మీరు కూడా ఇలాంటి ప్రయోజనాలు పొందాలంటే, వేరే దేశానికి వెళ్లి ప్రీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ సంఘ క్షేత్రంలో ఒక సహోదరునితో లేదా సహోదరితో కలిసి ప్రీచింగ్ చేసిన ప్రతీసారి, వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతారు, మీ మధ్య ఉన్న స్నేహం కూడా బలపడుతుంది.మంచి లక్షణాల మీద మనసుపెట్టండి, క్షమిస్తూ ఉండండి
13. మన స్నేహితులతో ఎక్కువగా పనిచేసినప్పుడు మనకు ఏ సవాలు ఎదురవ్వవచ్చు?
13 మనం మన స్నేహితులతో ఎక్కువగా పనిచేసినప్పుడు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాలతోపాటు కొన్నిసార్లు వాళ్ల పొరపాట్లు కూడా కనిపిస్తాయి. అయినప్పటికీ వాళ్లతో స్నేహం కొనసాగించడానికి ఏది సహాయం చేస్తుంది? యిర్మీయా ఉదాహరణను మళ్లీ పరిశీలించండి. ఇతరుల్లో ఉన్న పొరపాట్లను కాకుండా మంచిని చూడడానికి ఆయనకు ఏది సహాయం చేసింది?
14. యిర్మీయా యెహోవా గురించి ఏం నేర్చుకున్నాడు? అది ఆయనకెలా సహాయం చేసింది?
14 యిర్మీయా తన పేరుతో ఉన్న పుస్తకంతోపాటు 1 రాజులు, 2 రాజులు పుస్తకాలను కూడా రాసివుంటాడు. అపరిపూర్ణ మనుషుల మీద యెహోవా ఎంత కరుణ చూపించాడో యిర్మీయా ఆ పుస్తకాల్ని రాస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకొని ఉంటాడు. ఉదాహరణకు, అహాబు రాజు తన చెడు పనుల విషయంలో పశ్చాత్తాపం చూపించినప్పుడు, అతను బ్రతికివుండగా అతని కుటుంబమంతా నాశనం కాకుండా యెహోవా చూశాడని యిర్మీయాకు తెలుసు. (1 రాజు. 21:27-29) మనష్షే, అహాబు కన్నా ఎక్కువ చెడ్డపనులు చేశాడని కూడా యిర్మీయాకు తెలుసు. అయినప్పటికీ, అతను పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా క్షమించాడు. (2 రాజు. 21:16, 17; 2 దిన. 33:10-13) యిర్మీయా తన సన్నిహిత స్నేహితులతో వ్యవహరిస్తున్నప్పుడు దేవునిలా ఓర్పును, కరుణను చూపించడానికి ఆ ఉదాహరణలు ఖచ్చితంగా సహాయం చేసివుంటాయి.—కీర్త. 103:8, 9.
15. బారూకు విషయంలో యిర్మీయా యెహోవాలా ఓర్పును, దయను ఎలా చూపించాడు?
15 బారూకు కొంతకాలంపాటు తన నియామకం మీద కాకుండా వేరేవాటి మీద మనసు పెట్టినప్పుడు యిర్మీయా ఆయనతో ఎలా వ్యవహరించాడో పరిశీలించండి. బారూకు ఇక మారడని యిర్మీయా వెంటనే ఒక ముగింపుకు రాలేదు. బదులుగా యెహోవా దయతో ఇచ్చిన సూటైన సందేశాన్ని ఆయనకు చెప్పాడు. (యిర్మీ. 45:1-5) ఈ వృత్తాంతం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
16. సామెతలు 17:9 ప్రకారం, ఇతరులతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి?
16 నిజానికి, మనం మన సహోదరసహోదరీల నుండి పరిపూర్ణతను ఆశించలేం. కాబట్టి ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు, ఆ స్నేహాన్ని కాపాడుకోవడానికి మనం కృషిచేస్తూనే ఉండాలి. ఒకవేళ మన స్నేహితులు తప్పుచేస్తే, వాళ్లకు దయగా, నిజాయితీగా బైబిలు ఆధారిత సలహా ఇవ్వాల్సి రావచ్చు. (కీర్త. 141:5) అంతేకాదు వాళ్లు మనల్ని బాధపెడితే, క్షమించాలి. అలా ఒక్కసారి క్షమించేశాక, మనల్ని బాధపెట్టిన విషయం గురించి వాళ్లతో గానీ వేరేవాళ్లతో గానీ మళ్లీ ఎన్నడూ మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. (సామెతలు 17:9 చదవండి.) ఈ కష్టమైన కాలాల్లో, మన సహోదరసహోదరీల పొరపాట్ల మీద కాకుండా వాళ్లలోని మంచి లక్షణాల మీద మనసుపెట్టడం ఎంతో ముఖ్యం. అలాచేస్తే వాళ్లతో మన స్నేహం బలపడుతుంది. నిజానికి మహాశ్రమ కాలంలో మనకు అలాంటి స్నేహితులు చాలా అవసరం.
విశ్వసనీయ ప్రేమ చూపించండి
17. కష్టకాలంలో నిజమైన స్నేహితునిగా ఉన్నాడని యిర్మీయా ఎలా చూపించాడు?
17 యిర్మీయా ప్రవక్త, కష్టకాలంలో నిజమైన స్నేహితునిగా ఉన్నాడని తన పనుల ద్వారా చూపించాడు. ఉదాహరణకు, యిర్మీయా బురదతో నిండిన గోతిలో చనిపోకుండా రాజభవనంలో అధికారియైన ఎబెద్మెలెకు కాపాడాడు. అది తెలిసి అధిపతులు తనను చంపేస్తారేమోనని ఎబెద్మెలెకు భయపడ్డాడు. యిర్మీ. 38:7-13; 39:15-18.
విషయం తెలిసిన యిర్మీయా, తన స్నేహితుడైన ఎబెద్మెలెకు ఎలాగోలా తప్పించుకుంటాడని మౌనంగా ఉండిపోలేదు. యిర్మీయా బందీగా ఉన్నప్పటికీ తాను చేయగలిగిన సహాయం చేశాడు, యెహోవా ఇచ్చిన ఓదార్పుకరమైన వాగ్దానాన్ని ఆయన ఎబెద్మెలెకుకు చెప్పాడు.—18. సామెతలు 17:17 ప్రకారం, కష్టాల్లో ఉన్న స్నేహితునికి మనం ఏం చేయవచ్చు?
18 నేడు, మన సహోదరసహోదరీలు ఎన్నో రకాల కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ప్రకృతి విపత్తుల ద్వారా లేదా యుద్ధాలు, కాలుష్యం, తీవ్రవాదం లాంటి మనుషులు తీసుకొచ్చే విపత్తుల ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి జరిగినప్పుడు మనలో కొంతమందిమి, సహోదరసహోదరీలను మన ఇళ్లలో ఉండడానికి ఆహ్వానిస్తాం. ఇంకొంతమందిమి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం. అయితే, మనందరం వాళ్లకోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. ఒక సహోదరుడు లేదా సహోదరి నిరుత్సాహంలో ఉన్నారని తెలిస్తే, వాళ్లతో ఏం మాట్లాడాలో లేదా వాళ్లకోసం ఏం చేయాలో మనకు తెలియకపోవచ్చు. కానీ మనందరం ఏదోక సహాయం చేయగలం. ఉదాహరణకు, మనం వాళ్లతో సమయం గడపవచ్చు; వాళ్లు మాట్లాడుతున్నప్పుడు దయగా వినవచ్చు; మనకు నచ్చిన ఓదార్పుకరమైన లేఖనం చూపించవచ్చు. (యెష. 50:4) అన్నిటినీ మించి, మీ స్నేహితులు అవసరంలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయడానికి మీరు అందుబాటులో ఉండడం చాలా ప్రాముఖ్యం.—సామెతలు 17:17 చదవండి.
19. మనం ఇప్పుడు బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోవడం భవిష్యత్తులో ఎలా సహాయపడుతుంది?
19 మనం ఇప్పుడే మన సహోదరసహోదరీలతో బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకొని, దాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకోవాలి. ఎందుకు? ఎందుకంటే, మన శత్రువులు అబద్ధాల్ని, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించుకుని మనలో విభజనలు సృష్టించాలని ప్రయత్నిస్తారు. మనం మన సహోదరుల్ని నమ్మకుండా, వాళ్లకు మద్దతివ్వకుండా చేయడానికి శత్రువులు ప్రయత్నిస్తారు. కానీ వాళ్ల ప్రయత్నాలు వృథా అవుతాయి. వాళ్లు మన మధ్య ఉన్న ప్రేమను తగ్గించలేరు, మన స్నేహాల్ని పాడు చేయలేరు. నిజానికి, మన స్నేహాలు కేవలం ఈ విధానాంతం వరకే కాదు, శాశ్వతకాలం ఉంటాయి!
పాట 24 యెహోవా పర్వతానికి రండి
^ పేరా 5 అంతం దగ్గరపడుతుండగా, తోటి సహోదరసహోదరీలతో మనకున్న స్నేహాన్ని బలపర్చుకోవాలి. ఈ ఆర్టికల్‌లో, యిర్మీయా నుండి మనమేం నేర్చుకోవచ్చో పరిశీలిస్తాం. అంతేకాదు, నేడు మనం సన్నిహిత స్నేహితుల్ని సంపాదించుకోవడం ద్వారా, భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని ఎలా చక్కగా ఎదుర్కోవచ్చో చర్చిస్తాం.
^ పేరా 2 యిర్మీయా పుస్తకంలోని సంఘటనలు, అవి జరిగిన క్రమంలో రాయబడలేదు.
^ పేరా 57 చిత్రాల వివరణ: “మహాశ్రమ” కాలంలో ఏం జరగవచ్చో చూపించే ఒక సన్నివేశం. కొంతమంది సహోదరసహోదరీలు ఒక సహోదరుని ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్నారు. వాళ్లు స్నేహితులు కాబట్టి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. అదే సహోదర సహోదరీలు మహాశ్రమ మొదలవ్వడానికి చాలాకాలం ముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకున్నారు.