అధ్యయన ఆర్టికల్ 47
లేవీయకాండము పుస్తకం నుండి పాఠాలు
‘లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి ప్రయోజనకరంగా ఉంటాయి.’—2 తిమో. 3:16.
పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. లేవీయకాండము గురించి ఎక్కువ తెలుసుకోవడానికి నేడు ఉన్న క్రైస్తవులు ఎందుకు ఆసక్తి చూపించాలి?
అపొస్తలుడైన పౌలు తన స్నేహితుడైన యువ తిమోతికి ఇలా గుర్తుచేశాడు, ‘లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి ప్రయోజనకరమైనవి.’ (2 తిమో. 3:16) వాటిలో లేవీయకాండము పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకం గురించి మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో మన కాలానికి ఉపయోగపడని ఎన్నో నియమాలు ఉన్నాయని కొంతమంది అనుకుంటారు. కానీ నిజక్రైస్తవులు అలా అనుకోరు.
2 సుమారు 3,500 సంవత్సరాల క్రితం లేవీయకాండము రాయబడింది. కానీ “మనకు బోధించడానికే” యెహోవా ఆ పుస్తకాన్ని భద్రపరిచేలా చూశాడు. (రోమా. 15:4) యెహోవా ఆలోచనల్ని, భావాల్ని అర్థంచేసుకోవడానికి లేవీయకాండము మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆ పుస్తకం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మనం ఆసక్తి చూపించాలి. నిజానికి, దేవుడు ప్రేరేపించిన ఆ పుస్తకం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. వాటిలో నాలుగు పాఠాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
యెహోవా ఆమోదాన్ని మనమెలా పొందవచ్చు?
3. ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున ఎందుకు బలులు అర్పించబడేవి?
3 మొదటి పాఠం: యెహోవా మన బలులను అంగీకరించాలంటే మనకు ఆయన ఆమోదం కావాలి. ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున ఇశ్రాయేలు జనాంగం సమకూడేవాళ్లు, వాళ్ల తరఫున ప్రధాన యాజకుడు జంతువుల్ని బలిగా అర్పించేవాడు. తమ పాపాలు క్షమించబడాల్సిన అవసరం ఉందని ఆ బలులు ఇశ్రాయేలీయులకు గుర్తుచేసేవి. అయితే, వాళ్ల పాపాలు క్షమించబడడానికి ప్రధాన యాజకుడు ఆ రోజు జంతువుల రక్తాన్ని అతి పవిత్ర స్థలంలోకి తీసుకెళ్లే ముందు మరో పని చేయాల్సి ఉంది. అది ఇశ్రాయేలు
జనాంగం పాపాలు క్షమించబడడం కన్నా ప్రాముఖ్యమైనది.4. లేవీయకాండము 16:12, 13 ప్రకారం, ప్రధాన యాజకుడు అతి పవిత్ర స్థలంలోకి మొదటిసారి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? (ముఖచిత్రం చూడండి.)
4 లేవీయకాండము 16:12, 13 చదవండి. ప్రాయశ్చిత్త రోజున జరిగే సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకోండి. ఆ రోజున ప్రధాన యాజకుడు గుడారంలోకి ప్రవేశించాక మూడుసార్లు అతి పవిత్ర స్థలంలోకి వెళ్తాడు. ఆయన మొదటిసారి అతి పవిత్ర స్థలంలోకి వెళ్తున్నప్పుడు, ఒక చేతితో పరిమళ ధూపద్రవ్య పొడి ఉన్న పాత్ర పట్టుకుంటాడు. రెండో చేతితో, నిప్పులు నిండివున్న బంగారు ధూపపాత్ర పట్టుకుంటాడు. ఆయన, అతి పవిత్ర స్థలం ప్రవేశం దగ్గర ఉండే తెర ముందు కాస్త ఆగుతాడు. ఆయన ప్రగాఢ గౌరవంతో అతి పవిత్ర స్థలంలోకి వెళ్లి, ఒప్పంద మందసం ముందు నిలబడతాడు. అంటే, సూచనార్థక భావంలో ఆయన యెహోవా ముందు నిలబడినట్టే! తర్వాత యాజకుడు, పవిత్రమైన ధూపద్రవ్య పొడిని నిప్పుల మీద జాగ్రత్తగా వేస్తాడు. దాంతో ఆ గది అంతా పరిమళ వాసనతో నిండిపోతుంది. * ఆ తర్వాత, పాపపరిహారార్థ బలిగా ఇచ్చిన జంతువుల రక్తాన్ని తీసుకొని ఆయన అతి పవిత్ర స్థలంలోకి రెండోసారి వెళ్తాడు. బలిచ్చిన జంతువుల రక్తాన్ని అర్పించే ముందు ప్రధాన యాజకుడు ధూపం వేశాడని గమనించారా?
5. ప్రాయశ్చిత్త రోజున ధూపం ఉపయోగించడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 ప్రాయశ్చిత్త రోజున ధూపం ఉపయోగించడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుని నమ్మకమైన ఆరాధకులు చేసే ఆమోదయోగ్యమైన ప్రార్థనలు ధూపంలా ఉన్నాయని బైబిలు చెప్తుంది. (కీర్త. 141:2; ప్రక. 5:8) ప్రధాన యాజకుడు ధూపాన్ని ప్రగాఢ గౌరవంతో యెహోవా సముఖంలోకి తీసుకెళ్లాడని గుర్తుచేసుకోండి. అదేవిధంగా, మనం యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని ప్రగాఢ గౌరవంతో చేస్తాం. ఒక తండ్రి తన పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచినట్టు, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త తనను సమీపించమని, తనకు దగ్గరవ్వమని మనల్ని ఆహ్వానిస్తున్నందుకు మనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. (యాకో. 4:8) ఆయన మనల్ని తన స్నేహితులుగా అంగీకరిస్తున్నాడు. (కీర్త. 25:14) దాన్ని మనం ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం కాబట్టి ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయం.
6. ప్రధాన యాజకుడు బలులు అర్పించే ముందు ధూపం వేయడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
6 ప్రధాన యాజకుడు బలులు అర్పించే ముందు ధూపం వేయాలని గుర్తుంచుకోండి. అలా ధూపం వేయడం ద్వారా, బలులు అర్పించేటప్పుడు దేవుని ఆమోదం తనకు ఉండేలా చూసుకుంటాడు. దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యేసు భూమ్మీద ఉన్నప్పుడు, మనుషుల రక్షణ కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించే ముందు ఒక ప్రాముఖ్యమైన పని చేయాల్సివచ్చింది. ఏంటది? యెహోవా తన బలిని అంగీకరించాలంటే యేసు తన భూజీవితమంతటిలో యథార్థంగా ఉంటూ, విధేయత చూపించాలి. ఆ విధంగా, యెహోవా చెప్పినట్లు చేయడమే సరైన జీవన విధానమని యేసు నిరూపించాడు. అంతేకాదు, తన తండ్రి సర్వాధిపత్యమే సరైనదని, ఆయన పరిపాలనా విధానమే న్యాయమైనదని యేసు నిరూపించాడు.
7. యేసు జీవిత విధానమంతా తన తండ్రిని సంతోషపెట్టేలా ఉందని ఎలా చెప్పవచ్చు?
7 యేసు తన భూజీవితమంతటిలో యెహోవా నీతియుక్తమైన ప్రమాణాలకు పరిపూర్ణంగా లోబడ్డాడు. ఆయనకు ప్రలోభాలు-కష్టాలు ఎదురైనా, ఆయన చాలా బాధాకరమైన మరణం అనుభవిస్తాడని తెలిసినా తన తండ్రి పరిపాలనా విధానమే సరైనదని నిరూపించాలనుకున్నాడు. (ఫిలి. 2:8) పరీక్షలు వచ్చినప్పుడు యేసు, ‘దేవునికి కన్నీళ్లతో బిగ్గరగా ప్రార్థించాడు.’ (హెబ్రీ. 5:7) ఆయన హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు యెహోవా పట్ల ఆయనకున్న యథార్థతను చూపించాయి. అంతేకాదు, యెహోవాకు లోబడి ఉండాలనే తన కోరికను మరింత బలపర్చాయి. యేసు ప్రార్థనలు యెహోవాకు పరిమళ వాసనగా ఉన్నాయి. యేసు జీవిత విధానమంతా తన తండ్రిని సంతోషపెట్టేలా, ఆయన సర్వాధిపత్యం సరైనదని నిరూపించేలా ఉంది.
8. యేసులానే మనం కూడా ఏం చేయాలి?
8 యేసులానే మనం కూడా యెహోవాకు లోబడుతూ ఆయనకు యథార్థంగా ఉండడానికి కృషిచేయాలి. పరీక్షలు వచ్చినప్పుడు సహాయం కోసం యెహోవాకు పట్టుదలగా ప్రార్థిస్తాం. ఎందుకంటే మనం యెహోవాను సంతోషపెట్టాలని కోరుకుంటాం. అవన్నీ చేయడం ద్వారా, యెహోవా పరిపాలనా విధానానికి మనం మద్దతిస్తాం. ఒకవేళ యెహోవా అసహ్యించుకునే పనిని చేస్తే ఆయన మన ప్రార్థనల్ని అంగీకరించడని మనకు తెలుసు. కానీ, మనం యెహోవా ప్రమాణాల ప్రకారం జీవిస్తే, మన హృదయపూర్వక ప్రార్థనలు ఆయనకు పరిమళ వాసనగా ఉంటాయని నమ్మవచ్చు. మనం చూపించే యథార్థత, విధేయత మన పరలోక తండ్రిని సంతోషపెడతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.—సామె. 27:11.
మనం యెహోవా పట్ల కృతజ్ఞతతో, ప్రేమతో సేవ చేస్తాం
9. సమాధాన బలుల్ని ఎందుకు అర్పించేవాళ్లు?
9 రెండో పాఠం: మనకు యెహోవా పట్ల కృతజ్ఞత ఉంది కాబట్టి ఆయన సేవ చేస్తాం. ఇశ్రాయేలీయులు చేసే సత్యారాధనలో మరో ముఖ్యాంశమైన సమాధాన బలుల గురించి పరిశీలించడం ద్వారా మనం ఆ పాఠాన్ని నేర్చుకుంటాం. * ఒక ఇశ్రాయేలీయుడు తన ‘కృతజ్ఞతను తెలపడానికి’ సమాధాన బలిని అర్పించవచ్చని లేవీయకాండము పుస్తకంలో మనం నేర్చుకుంటాం. (లేవీ. 7:11-13, 16-18) అతను ఏదో తప్పదని ఆ బలి అర్పించడు గానీ, తన ఇష్టంతోనే దాన్ని అర్పిస్తాడు. అతను యెహోవా మీద ప్రేమతో ఆ బలిని ఇష్టపూర్వకంగా అర్పిస్తాడు కాబట్టి అది స్వేచ్ఛార్పణ అవుతుంది. బలిచ్చిన జంతు మాంసాన్ని, అర్పించిన వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులు, యాజకులు తింటారు. అయితే, ఆ జంతువులోని కొన్ని భాగాలు యెహోవాకు మాత్రమే అర్పించాలి. అవి ఏంటి?
10. లేవీయకాండము 3:6, 12, 14-16లో చెప్పబడిన సమాధాన బలులకు, యేసు చేసిన సేవకు ఎలాంటి పోలిక ఉంది?
10 మూడో పాఠం: యెహోవా మీద ప్రేమతో ఆయనకు శ్రేష్ఠమైనది ఇస్తాం. ఒక జంతువులో కొవ్వును, యెహోవా శ్రేష్ఠమైన భాగంగా ఎంచాడు. మూత్రపిండాలకు అలాగే ఇంకొన్ని భాగాలకు ప్రత్యేక విలువుందని ఆయన చెప్పాడు. (లేవీయకాండము 3:6, 12, 14-16 చదవండి.) కాబట్టి ఒక ఇశ్రాయేలీయుడు ఆ భాగాలతో పాటు కొవ్వును ఇష్టపూర్వకంగా అర్పించినప్పుడు యెహోవా సంతోషించేవాడు. ఒక ఇశ్రాయేలీయుడు వాటిని అర్పించినప్పుడు, యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనే తన కోరికను తెలిపేవాడు. అదేవిధంగా యేసు, యెహోవా మీదున్న ప్రేమనుబట్టి నిండు మనసుతో సేవ చేయడం ద్వారా శ్రేష్ఠమైనది ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. (యోహా. 14:31) దేవుని ఇష్టం చేయడం యేసుకు సంతోషాన్నిచ్చింది; దేవుని ధర్మశాస్త్రం పట్ల యేసుకు ప్రగాఢమైన ప్రేమ ఉంది. (కీర్త. 40:8) యేసు ఇష్టపూర్వకంగా సేవ చేయడం చూసి యెహోవా ఎంత సంతోషించి ఉంటాడో కదా!
11. మనం చేసే సేవ, సమాధాన బలులు లాంటిదని ఎందుకు చెప్పవచ్చు? అది మనకెలా ఓదార్పునిస్తుంది?
11 మనం చేసే సేవ కూడా సమాధాన బలులు లాంటిదే. ఎందుకంటే ఆ సేవ ద్వారా మనం యెహోవా గురించి ఎలా భావిస్తున్నామో తెలియజేస్తాం. మనం యెహోవాను నిండు హృదయంతో ప్రేమిస్తాం కాబట్టి ఆయనకు శ్రేష్ఠమైనది ఇస్తాం. యెహోవా పట్ల, ఆయన మార్గాల పట్ల ప్రగాఢమైన ప్రేమతో లక్షలమంది ఆరాధకులు ఇష్టపూర్వకంగా సేవ చేయడం చూసి ఆయన ఎంత సంతోషిస్తాడో కదా! యెహోవా మన పనుల్ని మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాల్ని కూడా చూస్తాడు, వాటిని విలువైనవిగా ఎంచుతాడు. అది మనకు ఎంతో ఓదార్పునిస్తుంది. ఉదాహరణకు, వయసు పైబడడంవల్ల మీరు అనుకున్నంత సేవ చేయలేకపోతుంటే, మీ పరిమితుల్ని యెహోవా అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. మీరు ఎక్కువ చేయలేకపోయినా, యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమతో మీరు చేయగలిగింది చేస్తుండవచ్చు. కాబట్టి ఆయన ఆ ప్రేమను చూస్తాడు. మీరు ఇవ్వగల శ్రేష్ఠమైనదాన్ని ఆయన సంతోషంగా అంగీకరిస్తాడు.
12. సమాధాన బలులు అర్పించినప్పుడు యెహోవా ఎలా భావించేవాడనే దాన్నిబట్టి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
12 సమాధాన బలుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? జంతువులోని శ్రేష్ఠమైన భాగాల్ని అగ్ని దహించినప్పుడు, పొగ పైకి వెళ్లేది. దాన్నిబట్టి యెహోవా సంతోషించేవాడు. కాబట్టి, మీరు కూడా యెహోవా సేవలో చేయగలిగినదంతా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (కొలొ. 3:23) మిమ్మల్ని చూసి ఆయన ఎంత సంతోషిస్తున్నాడో ఒకసారి ఊహించుకోండి. మీరు ఎక్కువ సేవ చేసినా, తక్కువ సేవ చేసినా యెహోవా మీద ప్రేమతో చేస్తే ఆయన దాన్ని చాలా విలువైనదిగా చూస్తాడు, ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు.—మత్త. 6:20; హెబ్రీ. 6:10.
యెహోవా తన సంస్థను ఆశీర్వదిస్తున్నాడు
13. లేవీయకాండము 9:23, 24 ప్రకారం, కొత్తగా ఏర్పాటు చేయబడిన యాజకత్వం విషయంలో యెహోవా తన ఆమోదాన్ని ఎలా తెలియజేశాడు?
13 నాలుగో పాఠం: యెహోవా తన సంస్థలోని భూభాగాన్ని ఆశీర్వదిస్తున్నాడు. క్రీ.పూ. 1512లో సీనాయి పర్వతం అడుగున గుడారాన్ని నిలబెట్టినప్పుడు ఏం జరిగిందో పరిశీలించండి. (నిర్గ. 40:17) అహరోనును, ఆయన కుమారుల్ని యాజకులుగా నియమించే కార్యక్రమాన్ని మోషే నిర్వహించాడు. ఆ యాజకులు మొదటిసారి జంతువులను బలి అర్పిస్తున్నప్పుడు దాన్ని చూడడానికి ఇశ్రాయేలు జనాంగం అక్కడికి వచ్చింది. (లేవీ. 9:1-5) కొత్తగా ఏర్పాటు చేయబడిన యాజకత్వం విషయంలో యెహోవా తన ఆమోదాన్ని ఎలా తెలియజేశాడు? అహరోను, మోషే ప్రజల్ని దీవిస్తున్నప్పుడు యెహోవా అగ్నిని పంపించి బలిపీఠం మీద ఉన్నదంతా పూర్తిగా దహించాడు.—లేవీయకాండము 9:23, 24 చదవండి.
14. ఇశ్రాయేలులో ఏర్పాటు చేయబడిన యాజకత్వాన్ని యెహోవా ఆమోదించడం గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
14 ప్రధాన యాజకుణ్ణి నియమించినప్పుడు పరలోకం నుండి అగ్ని రావడం దేన్ని తెలియజేసింది? యాజకులుగా ఉండే విషయంలో అహరోనుకు, ఆయన కుమారులకు యెహోవా ఆమోదం, మద్దతు ఉన్నాయని అది తెలియజేసింది. యాజకులకు యెహోవా మద్దతు ఉందని ఇశ్రాయేలీయులు స్పష్టంగా చూసినప్పుడు, తాము కూడా వాళ్లకు మద్దతివ్వాలని అర్థంచేసుకున్నారు. ఇశ్రాయేలులో ఏర్పాటు చేయబడిన యాజకత్వాన్ని యెహోవా ఆమోదించడం గురించి మనం ఇప్పుడెందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే, ప్రాచీనకాలంలో ఉన్న యాజకత్వం, మరింత ప్రాముఖ్యమైన యాజకత్వానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు; ఆయనకు 1,44,000 మంది సహ రాజులు, యాజకులు ఉన్నారు. వాళ్లు ఆయనతోపాటు పరలోకంలో సేవచేస్తారు.—హెబ్రీ. 4:14; 8:3-5; 10:1.
15-16. ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ మీద తన ఆమోదం ఉందని యెహోవా ఎలా చూపించాడు?
15 యేసు 1919లో, అభిషిక్త సహోదరుల చిన్న గుంపును ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునిగా’ నియమించాడు. ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తూ, క్రీస్తు అనుచరులకు “తగిన సమయంలో ఆహారం” పెట్టే బాధ్యత ఆ దాసునికి అప్పగించబడింది. (మత్త. 24:45) నమ్మకమైన, బుద్ధిగల దాసునికి దేవుని ఆమోదం ఉందని మనం స్పష్టంగా చూడగలుగుతున్నామా?
16 నమ్మకమైన దాసుడు చేసే పనిని ఆపాలని సాతాను, అతనికి మద్దతిచ్చేవాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ యెహోవా సహాయం వల్లే, దాసుడు తన పనిని కొనసాగించగలుగుతున్నాడు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అంతేకాదు, మత్త. 24:14) దీనంతటిని బట్టి, యెహోవా తన సంస్థను నడిపిస్తూ, మెండుగా ఆశీర్వదిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.
దేవుని ప్రజలు అన్యాయానికి, హింసకు గురయ్యారు. అయినప్పటికీ నమ్మకమైన, బుద్ధిగల దాసుడు భూమ్మీదున్న క్రీస్తు అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాడు. నేడు మనకు ఎన్నో ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. అవి 900 కన్నా ఎక్కువ భాషల్లో ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి ఈ పనికి దేవుని మద్దతు ఉందనడంలో ఏ సందేహం లేదు. దాసునిపై యెహోవా మద్దతు ఉందని స్పష్టంగా చెప్పడానికి ప్రకటనా పని కూడా ఒక రుజువు. ఎందుకంటే “మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది.” (17. యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థకు మనం మద్దతిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
17 మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘యెహోవా సంస్థలో ఉన్నందుకు నేను కృతజ్ఞత కలిగివున్నానా?’ మోషే కాలంలో, యెహోవా పరలోకం నుండి అగ్నిని పంపించి తాను నియమించిన యాజకులను ఆమోదిస్తున్నట్లు చూపించాడు. అలాగే నేడున్న తన సంస్థను ఆయన ఉపయోగించుకుంటున్నాడని స్పష్టమైన రుజువుల్ని ఇచ్చాడు. ఆ విషయంలో మనం ఆయనకు ఎంతో కృతజ్ఞులం. (1 థెస్స. 5:18, 19) యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థకు మనం మద్దతిస్తున్నామని ఎలా చూపించవచ్చు? మన ప్రచురణల్లో, మీటింగ్స్‌లో, సమావేశాల్లో ఇవ్వబడుతున్న బైబిలు ఆధారిత నిర్దేశాల్ని పాటించడం ద్వారా; అలాగే ప్రకటనా పనిలో, బోధనా పనిలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొనడం ద్వారా మనం మద్దతిస్తున్నామని చూపించవచ్చు.—1 కొరిం. 15:58.
18. మనం ఏం చేయాలని నిర్ణయించుకుందాం?
18 లేవీయకాండము పుస్తకం నుండి నేర్చుకున్నవాటిని పాటించాలని నిర్ణయించుకుందాం. మనం అర్పించే బలులను యెహోవా అంగీకరించాలని కోరుకుందాం. ఆయన పట్ల ఉన్న కృతజ్ఞతతో సేవ చేద్దాం. మనం ఆయన్ని నిండు హృదయంతో ప్రేమిస్తాం కాబట్టి ఆయన సేవలో చేయగలిగినదంతా చేద్దాం. నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థకు హృదయపూర్వకంగా మద్దతిద్దాం. ఇవన్నీ చేస్తూ యెహోవాకు సాక్షులుగా ఉండే గొప్ప అవకాశాన్నిబట్టి సంతోషిస్తున్నామని చూపించవచ్చు.
పాట 96 దేవుడిచ్చిన గ్రంథం ఒక నిధి
^ పేరా 5 లేవీయకాండము పుస్తకంలో యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాలు ఉన్నాయి. క్రైస్తవులమైన మనం ఆ నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు, కానీ వాటినుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆర్టికల్‌లో, లేవీయకాండము పుస్తకం నుండి మనం నేర్చుకోగల విలువైన పాఠాల్ని చర్చిస్తాం.
^ పేరా 4 గుడారంలో వేసే ధూపం పవిత్రమైనదిగా పరిగణించబడేది, ప్రాచీన ఇశ్రాయేలులో ధూపాన్ని యెహోవా ఆరాధనలో మాత్రమే ఉపయోగించేవాళ్లు. (నిర్గ. 30:34-38) మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ ఆరాధనలో భాగంగా ధూపాన్ని ఉపయోగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు.
^ పేరా 9 సమాధాన బలుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్) 2వ సంపుటి, 526వ పేజీ చూడండి. అలాగే, 2012 జనవరి 15 కావలికోట సంచికలో 18వ పేజీ, 11వ పేరా చూడండి.
^ పేరా 54 చిత్రాల వివరణ: ప్రాయశ్చిత్త రోజున, ప్రధాన యాజకుడు ఒక చేతితో పరిమళ ధూపద్రవ్య పొడి ఉన్న పాత్రను, ఇంకో చేతితో నిప్పులు నిండివున్న బంగారు ధూపపాత్రను పట్టుకొని అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించాడు.ఆ తర్వాత, పాపపరిహారార్థ బలిగా ఇచ్చిన జంతువుల రక్తాన్ని తీసుకొని ఆయన మళ్లీ అతి పవిత్ర స్థలంలోకి వెళ్తాడు.
^ పేరా 56 చిత్రాల వివరణ: యెహోవా పట్ల తన కుటుంబానికి ఉన్న కృతజ్ఞతను చూపించడానికి, ఓ ఇశ్రాయేలీయుడు ఒక గొర్రెను సమాధాన బలి కోసం యాజకునికి ఇస్తున్నాడు.
^ పేరా 58 చిత్రాల వివరణ: యేసు తన భూపరిచర్యలో, దేవుని ఆజ్ఞల్ని పాటించడం ద్వారా, తన అనుచరులు కూడా వాటిని పాటించేలా సహాయం చేయడం ద్వారా యెహోవా మీదున్న ప్రగాఢమైన ప్రేమను చూపించాడు.
^ పేరా 60 చిత్రాల వివరణ: ఒక వృద్ధ సహోదరి, తన ఆరోగ్యం బాలేకపోయినా ఉత్తరాల ద్వారా సాక్ష్యమిస్తూ యెహోవాకు శ్రేష్ఠమైనది ఇస్తోంది.
^ పేరా 62 చిత్రాల వివరణ: పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు గెరిట్ లోష్, 2019 ఫిబ్రవరిలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ వర్షన్‌ని జర్మన్ భాషలో విడుదల చేశాడు. ఈ ఇద్దరు సహోదరీల్లాగే, నేడు జర్మనీలో ఉన్న ప్రచారకులు కొత్తగా విడుదలైన బైబిల్ని పరిచర్యలో సంతోషంగా ఉపయోగిస్తున్నారు.