కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 45

క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

“కాబట్టి, మీరు వెళ్లి . . . శిష్యుల్ని చేయండి; . . . నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.”—మత్త. 28:19, 20.

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

ఈ ఆర్టికల్‌లో. . . *

1. మత్తయి 28:18-20 ప్రకారం, యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

యేసుక్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత, గలిలయలో సమకూడిన తన శిష్యులకు కనిపించాడు. ఆయన వాళ్లకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. ఏంటది? దాన్ని తెలుసుకోవాలంటే మనం మత్తయి 28:18-20 వచనాలు చూడాలి.—చదవండి.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 శిష్యుల్ని చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞ నేడున్న దేవుని సేవకులందరికీ వర్తిస్తుంది. కాబట్టి, యేసు మనకు అప్పగించిన ఆ పనికి సంబంధించి మూడు ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటిగా, మన బైబిలు విద్యార్థులకు దేవుడు కోరుతున్నవాటిని బోధించడంతో పాటు ఇంకా ఏం చేయాలి? రెండవదిగా, విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా సంఘంలోని ప్రచారకులందరూ ఎలా సహాయం చేయవచ్చు? మూడవదిగా, శిష్యుల్ని చేసే పనిలో తిరిగి పాల్గొనేలా నిష్క్రియులకు ఎలా సహాయం చేయవచ్చు?

క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం వాళ్లకు నేర్పించండి

3. యేసు ఇచ్చిన నిర్దేశంలోని ఏ ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు?

3 యేసు ఇచ్చిన నిర్దేశం స్పష్టంగా ఉంది. అదేంటంటే, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం ప్రజలకు నేర్పించాలి. అయితే అందులో ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసు, ‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ వాళ్లకు నేర్పించండి’ అని చెప్పలేదు కానీ, “నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి” అని చెప్పాడు. అలా చేయాలంటే, మన బైబిలు విద్యార్థులకు ఏం చేయాలో బోధించడంతో పాటు ఎలా చేయాలో కూడా నేర్పించాలి. ఎందుకు?

4. క్రీస్తు ఆజ్ఞల్ని పాటించడం మన విద్యార్థికి ఎలా నేర్పించవచ్చో తెలిపే ఒక ఉదాహరణ చెప్పండి.

4 క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం బైబిలు విద్యార్థులకు ఎలా నేర్పించవచ్చో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ పరిశీలించండి: డ్రైవింగ్‌ స్కూల్‌ వాళ్లు ఒక వ్యక్తికి ట్రాఫిక్‌ నియమాల్ని పాటించడం ఎలా నేర్పిస్తారు? వాళ్లు ముందుగా అతనికి క్లాస్‌రూమ్‌లో ట్రాఫిక్‌ నియమాలు నేర్పిస్తారు. అయితే, ఆ నియమాల్ని పాటించడం అతనికి నేర్పించాలంటే వాళ్లు ఇంకో పని చేయాలి. వాళ్లు అతనితో పాటు డ్రైవింగ్‌కి వెళ్లాలి. అతను వాహనాన్ని నడుపుతూ, నేర్చుకున్న వాటిని పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్లు పక్కనే ఉండి సలహాలు ఇవ్వాలి. ఈ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

5. (ఎ) యోహాను 14:15; 1 యోహాను 2:3 ప్రకారం మన బైబిలు విద్యార్థికి ఏం నేర్పించాలి? (బి) మనం ఎలాంటి విషయాల్లో విద్యార్థులకు సహాయం చేయవచ్చు?

5 మన విద్యార్థికి బైబిలు స్టడీ ఇస్తున్నప్పుడు, దేవుడు ఏం కోరుతున్నాడో బోధిస్తాం. అయితే మనం ఇంకో పని కూడా చేయాలి. నేర్చుకున్న వాటిని తన జీవితంలో ఎలా పాటించాలో విద్యార్థికి నేర్పించాలి. (యోహాను 14:15; 1 యోహాను 2:3 చదవండి.) స్కూల్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, సరదాగా సమయం గడుపుతున్నప్పుడు బైబిలు సూత్రాల్ని ఎలా పాటించవచ్చో, వాటిని మనం ఎలా పాటిస్తున్నామో వాళ్లకు చెప్పవచ్చు. అంతేకాదు, వాటిని పాటించడం వల్ల మనం ఎలా కొన్ని సమస్యలు తప్పించుకున్నామో లేదా తెలివైన నిర్ణయాలు తీసుకున్నామో విద్యార్థికి చెప్పవచ్చు. విద్యార్థితో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, అతనికి * పవిత్రశక్తి సహాయాన్ని ఇవ్వమని యెహోవాను అడగవచ్చు.—యోహా. 16:13.

6. యేసు ఆజ్ఞల్ని పాటించడం విద్యార్థులకు నేర్పించాలంటే ఏం చేయాలి?

6 యేసు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం విద్యార్థులకు నేర్పించాలంటే మనం ఇంకా ఏం చేయాలి? శిష్యుల్ని చేసే పనిలో పాల్గొనాలనే కోరికను వాళ్ల హృదయంలో నాటాలి. కొంతమంది విద్యార్థులు ప్రకటనా పని చేయడానికి భయపడుతుండవచ్చు. కాబట్టి, బైబిలు సత్యాల్ని బాగా అర్థం చేసుకుని బలమైన విశ్వాసాన్ని పెంచుకునేలా మనం వాళ్లకు ఓపిగ్గా సహాయం చేయాలి. అప్పుడు బైబిలు సత్యాలు వాళ్ల హృదయాన్ని తాకుతాయి, వాళ్లలో ప్రకటించాలనే కోరిక కలుగుతుంది. మరి ఆ కోరికను పెంచుకునేలా విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?

7. మంచివార్త ప్రకటించాలనే కోరికను పెంచుకునేలా విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?

7 మన బైబిలు విద్యార్థిని ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు: “బైబిలు చెప్పేవాటిని పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు పొందారు? బైబిలు సత్యాల్ని వేరేవాళ్లు కూడా తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు?” (సామె. 3:27; మత్త. 9:37, 38) మన బోధనా పనిముట్లలోని కరపత్రాలను విద్యార్థికి చూపించి, వాటిలో ఏ కరపత్రం తన బంధువులకు, స్నేహితులకు, లేదా తోటి ఉద్యోగులకు నచ్చుతుందో అడగండి. విద్యార్థికి కావల్సిన కొన్ని కరపత్రాల్ని ఇవ్వండి. కరపత్రాల్ని నేర్పుగా ఎలా ఇవ్వవచ్చో విద్యార్థితో ప్రాక్టీసు చేయండి. విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అయిన తర్వాత, మనం అతనితో కలిసి ప్రీచింగ్‌ చేస్తూ ఇంకా ఎక్కువ శిక్షణ ఇస్తాం.—ప్రసం. 4:9, 10; లూకా 6:40.

విద్యార్థులు ప్రగతి సాధించడానికి సంఘంలోని వాళ్లు ఏం చేయవచ్చు?

8. మన విద్యార్థులు దేవుని మీద, సాటిమనిషి మీద ప్రగాఢమైన ప్రేమ పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (“ దేవుని మీద ప్రేమ పెంచుకునేలా మన బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?” బాక్సు కూడా చూడండి.)

8 తాను “ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం” ఇతరులకు నేర్పించమని యేసు చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించిన వాటిలో దేవుణ్ణి ప్రేమించాలి, సాటిమనిషిని ప్రేమించాలి అనే రెండు ముఖ్యమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ రెండు ఆజ్ఞలకు, ప్రకటనా-బోధనా పనికి చాలా దగ్గరి సంబంధం ఉంది. (మత్త. 22:37-39) ఎలా? దేవుని మీద, సాటిమనిషి మీద ప్రేమ ఉంటేనే, విద్యార్థి ప్రకటనా పని చేయాలని కోరుకుంటాడు. నిజమే, కొంతమంది విద్యార్థులు ప్రకటనా పని చేయడానికి భయపడుతుండవచ్చు. కానీ, యెహోవా సహాయంతో వాళ్లు మెల్లమెల్లగా మనుషుల భయాన్ని అధిగమించవచ్చని మనం విద్యార్థులకు ధైర్యం చెప్పవచ్చు. (కీర్త. 18:1-3; సామె. 29:25) దేవుని మీద ప్రేమ పెంచుకునేలా మనం విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌కు సంబంధించిన బాక్సు వివరిస్తుంది. మరి ఈ విషయంలో సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

9. డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న వ్యక్తి ఏయే విధాలుగా విలువైన పాఠాలు నేర్చుకుంటాడు?

9 డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న వ్యక్తి ఉదాహరణను మరోసారి పరిశీలించండి. అతను డ్రైవింగ్‌ నేర్పే వ్యక్తితో కలిసి ట్రాఫిక్‌లో వాహనాన్ని నడుపుతున్నప్పుడు, ఏయే విధాలుగా డ్రైవింగ్‌ నేర్చుకుంటాడు? డ్రైవింగ్‌ నేర్పే వ్యక్తి చెప్పేది వినడం ద్వారా, అలాగే రోడ్డు మీద వాహనాన్ని జాగ్రత్తగా నడుపుతున్న డ్రైవర్లను గమనించడం ద్వారా అతను నేర్చుకుంటాడు. ఉదాహరణకు డ్రైవింగ్‌ నేర్పే వ్యక్తి, వేరే వాహనానికి దయతో దారి ఇచ్చే మంచి డ్రైవర్‌ను అతనికి చూపించవచ్చు. లేదా తన కారు లైట్లను ఎదురుగా వస్తున్న వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా చూసుకునే మంచి డ్రైవర్‌ను అతనికి చూపించవచ్చు. అలాంటి మంచి డ్రైవర్ల నుండి అతను విలువైన పాఠాలు నేర్చుకుంటాడు, వాటిని పాటిస్తాడు.

10. బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించడానికి ఏది సహాయం చేస్తుంది?

10 అదేవిధంగా, జీవ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టిన ఒక బైబిలు విద్యార్థి తనకు స్టడీ ఇస్తున్న వ్యక్తి నుండే కాకుండా, ఇతర యెహోవా సేవకుల మంచి ఆదర్శం నుండి కూడా ఎంతో నేర్చుకుంటాడు. కాబట్టి, విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే మీటింగ్స్‌కి హాజరవడం ప్రాముఖ్యం. మీటింగ్స్‌లో చెప్పే విషయాల వల్ల విద్యార్థుల జ్ఞానం మరింత పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది, దేవుని మీదున్న ప్రేమ ఎక్కువౌతుంది. (అపొ. 15:30-32) అంతేకాదు, స్టడీ ఇస్తున్న వ్యక్తి మీటింగ్స్‌లో తన విద్యార్థిని అతనిలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్న సహోదర సహోదరీలకు పరిచయం చేస్తాడు. సంఘంలోని సహోదర సహోదరీల ఆదర్శం విద్యార్థికి ఎలా సహాయం చేస్తుంది?

11. ఒక విద్యార్థి సంఘంలో ఎలాంటివాళ్లను చూడవచ్చు? వాళ్లను చూసినప్పుడు విద్యార్థికి ఎలా అనిపిస్తుంది?

11 కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. ఒంటరి తల్లి అయిన ఒక బైబిలు విద్యార్థి తనలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న సహోదరిని సంఘంలో చూస్తుంది. తన పిల్లల్ని తీసుకుని రాజ్యమందిరానికి రావడానికి ఆ సహోదరి చేస్తున్న కృషి విద్యార్థి మనసును ఆకట్టుకుంటుంది. అలాగే, సిగరెట్లు మానుకోవడానికి కృషి చేస్తున్న ఒక బైబిలు విద్యార్థి, ఎంతో కష్టపడి ఆ అలవాటును మానుకున్న ప్రచారకుణ్ణి కలుస్తాడు. దేవుని ఆజ్ఞలకు లోబడడానికి యెహోవా మీదున్న ప్రేమ తనకెలా సహాయం చేసిందో ఆ ప్రచారకుడు విద్యార్థికి వివరిస్తాడు. (2 కొరిం. 7:1; ఫిలి. 4:13) అది విన్నాక, తాను కూడా ఆ అలవాటును మానుకోగలను అనే నమ్మకం విద్యార్థిలో కలుగుతుంది. అంతేకాదు, యౌవనురాలైన ఒక బైబిలు విద్యార్థి, సంతోషంగా దేవుణ్ణి సేవిస్తున్న ఒక యువ సహోదరిని చూస్తుంది. ఆ సహోదరి ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని విద్యార్థికి అనిపిస్తుంది.

12. విద్యార్థులు ప్రగతి సాధించడానికి సంఘంలో ఉన్న ప్రతీఒక్కరు సహాయం చేయగలరని ఎందుకు చెప్పవచ్చు?

12 నమ్మకంగా సేవ చేస్తున్న వేర్వేరు ప్రచారకుల గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుణ్ణి, సాటిమనిషిని ప్రేమించాలనే క్రీస్తు ఆజ్ఞను పాటించడం అంటే ఏంటో విద్యార్థి అర్థం చేసుకుంటాడు. (యోహా. 13:35; 1 తిమో. 4:12) మరిముఖ్యంగా తనలాంటి సమస్యలే ఎదుర్కొంటున్న ప్రచారకుల నుండి విద్యార్థి ఎంతో నేర్చుకుంటాడు. తాను కూడా మార్పులు చేసుకుని, క్రీస్తు శిష్యుణ్ణి అవ్వగలనని విద్యార్థి వాళ్ల అనుభవాల నుండి గ్రహిస్తాడు. (ద్వితీ. 30:11) బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించడానికి సంఘంలో ఉన్న ప్రతీఒక్కరు ఏదోక విధంగా సహాయం చేయగలరు. (మత్త. 5:16) మీటింగ్స్‌కి వస్తున్న బైబిలు విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి మీరెలా కృషి చేస్తున్నారు?

శిష్యుల్ని చేసే పనిలో తిరిగి పాల్గొనేలా నిష్క్రియులకు సహాయం చేయండి

13-14. కృంగిపోయిన అపొస్తలులతో యేసు ఎలా వ్యవహరించాడు?

13 ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో తిరిగి పాల్గొనేలా నిష్క్రియులైన సహోదర సహోదరీలకు సహాయం చేయాలని మనం కోరుకుంటాం. కృంగిపోయిన అపొస్తలులతో యేసు ఎలా వ్యవహరించాడో గమనించడం ద్వారా నిష్క్రియులతో మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవచ్చు.

14 యేసు చనిపోవడానికి ముందు అపొస్తలులందరూ “ఆయన్ని వదిలేసి పారిపోయారు.” (మార్కు 14:50; యోహా. 16:32) కృంగిపోయిన తన అపొస్తలులతో యేసు ఎలా వ్యవహరించాడు? పునరుత్థానమైన తర్వాత ఆయన కొంతమంది స్త్రీలతో ఇలా అన్నాడు: ‘భయపడకండి! మీరు వెళ్లి నా సహోదరులకు [నేను తిరిగి బ్రతికానని] చెప్పండి.’ (మత్త. 28:10) ఆయన తన అపొస్తలుల మీద నమ్మకం కోల్పోలేదు. తనను వదిలేసి పారిపోయినా, యేసు వాళ్లను “నా సహోదరులు” అనే పిలిచాడు. యెహోవాను అనుకరిస్తూ యేసు వాళ్లమీద కరుణ చూపించాడు, క్షమించాడు.—2 రాజు. 13:23.

15. నిష్క్రియుల గురించి మనం ఎలా భావిస్తాం?

15 అదేవిధంగా, పరిచర్యను ఆపేసిన వాళ్ల మీద అంటే నిష్క్రియుల మీద మనకెంతో శ్రద్ధ ఉంది. వాళ్లు మన సహోదరసహోదరీలు, వాళ్లను మనం ప్రేమిస్తాం. ఇదివరకు యెహోవా సేవలో వాళ్లు పడిన కష్టాన్ని మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం. వాళ్లలో కొంతమంది ఎన్నో సంవత్సరాలు యెహోవా సేవ చేశారు. (హెబ్రీ. 6:10) వాళ్లు తిరిగి రావాలని మనం కోరుకుంటాం! (లూకా 15:4-7) యేసులాగే మనం కూడా, వాళ్ల మీద శ్రద్ధ ఉందని ఏయే విధాలుగా చూపించవచ్చు?

16. నిష్క్రియుల మీద మనమెలా శ్రద్ధ చూపించవచ్చు?

16 ప్రేమతో ఆహ్వానించండి. కృంగిపోయిన అపొస్తలుల్ని ఒక చోట సమకూడమని ఆహ్వానించడం ద్వారా యేసు వాళ్లను ప్రోత్సహించాడు. (మత్త. 28:10; 1 కొరిం. 15:6) అదేవిధంగా, మీటింగ్స్‌కి ఆహ్వానించడం ద్వారా మనం నిష్క్రియుల్ని ప్రోత్సహించవచ్చు. అయితే, వాళ్లు మీటింగ్స్‌కి రావాలంటే మనం ఓపిక చూపిస్తూ వాళ్లను చాలాసార్లు ఆహ్వానించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అపొస్తలులు తన ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు యేసు సంతోషించాడు, నిష్క్రియులు మీటింగ్స్‌కి వచ్చినప్పుడు మనం కూడా సంతోషిస్తాం.—మత్తయి 28:16; లూకా 15:6 పోల్చండి.

17. నిష్క్రియులు రాజ్యమందిరానికి వస్తే మనం ఏం చేయాలి?

17 ఆప్యాయంగా పలకరించండి. యేసు తన శిష్యుల్ని కలిసినప్పుడు వాళ్లను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు; ఆయనే చొరవ తీసుకుని వాళ్లతో మాట్లాడాడు. (మత్త. 28:18) నిష్క్రియులు ఎవరైనా రాజ్యమందిరానికి వస్తే మనం ఏం చేయాలి? మనమే చొరవ తీసుకుని వాళ్లను ఆప్యాయంగా పలకరించాలి. వాళ్లతో ఏం మాట్లాడాలో తెలీక మనం వాళ్లను పలకరించడానికి వెనకాడుతుండవచ్చు. అయితే, వాళ్లను చూడడం మనకెంత సంతోషంగా ఉందో చెప్తూ మాటలు కలపవచ్చు. కాకపోతే మనం వాళ్లను ఇబ్బందిపెట్టకుండా జాగ్రత్తపడాలి.

18. నిష్క్రియుల్ని మనమెలా ప్రోత్సహించవచ్చు?

18 మనస్ఫూర్తిగా ప్రోత్సహించండి. భూమంతటా ప్రకటించడం తమ శక్తికి మించిన పని అని యేసు శిష్యులు ఆందోళనపడి ఉండవచ్చు. అందుకే యేసు తన అనుచరుల్ని బలపర్చడానికి ఈ హామీ ఇచ్చాడు: “నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:20) ఆ మాటలు శిష్యులకు బలాన్ని ఇచ్చాయా? ఇచ్చాయి. కొన్ని రోజులకే వాళ్లు “బోధిస్తూ, . . . మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 5:42) నిష్క్రియులకు కూడా ప్రోత్సాహం అవసరం. పరిచర్యను తిరిగి మొదలుపెట్టడానికి వాళ్లు ఆందోళన పడుతుండవచ్చు. ప్రకటనా పనిని వాళ్లు ఒంటరిగా చేయాల్సిన అవసరం లేదని మనం భరోసా ఇవ్వవచ్చు. పరిచర్య చేయడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నప్పుడు మనం వాళ్లకు తోడుగా వెళ్లవచ్చు. ప్రకటనా పనిని తిరిగి మొదలుపెట్టడానికి మనం సహాయం చేస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు. వాళ్లను ఇప్పటికీ మన సహోదర సహోదరీల్లానే చూస్తున్నామని గ్రహించినప్పుడు వాళ్లు మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో మళ్లీ చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. అలా జరిగితే సంఘమంతా సంతోషిస్తుంది.

మనకు అప్పగించిన పనిని పూర్తిచేయాలని మనం కోరుకుంటాం

19. మన కోరిక ఏంటి? ఎందుకు?

19 శిష్యుల్ని చేసే పనిని మనం ఎప్పటివరకు కొనసాగించాలి? ఈ వ్యవస్థ ముగింపు వరకు. (మత్త. 28:20; పదకోశంలో “ఈ వ్యవస్థ ముగింపు” చూడండి.) మరి, అప్పటివరకు యేసు అప్పగించిన ఈ పనిలో మనం కొనసాగగలమా? కొనసాగాలనే మనం నిర్ణయించుకున్నాం! “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్న వాళ్లను కనుగొనడానికి మనం మన సమయాన్ని, శక్తిని, డబ్బును సంతోషంగా ఉపయోగిస్తాం. (అపొ. 13:48) ఆ విధంగా మనం యేసును అనుకరిస్తాం. ఆయన ఇలా అన్నాడు: “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.” (యోహా. 4:34; 17:4) మనకు అప్పగించిన పనిని పూర్తిచేయాలన్నదే మన కోరిక కూడా. (యోహా. 20:21) అంతేకాదు ఈ పనిలో నిష్క్రియులు, బైబిలు విద్యార్థులు మనతో కలిసి చివరివరకు కొనసాగాలని మనం కోరుకుంటాం.—మత్త. 24:13.

20. ఫిలిప్పీయులు 4:13 ప్రకారం, యేసు అప్పగించిన పనిని మనం చేయగలమని ఎందుకు చెప్పవచ్చు?

20 యేసు అప్పగించిన పనిని చేయడం అంత తేలిక కాదు. అయితే ఈ పనిలో మనం ఒంటరివాళ్లం కాదు. యేసు మనతో ఉంటానని మాటిచ్చాడు, పైగా మనం “దేవుని తోటి పనివాళ్లం.” (1 కొరిం. 3:9) కాబట్టి యేసు అప్పగించిన పనిని మనం చేయగలం. ఈ పని చేయడం, ఈ పని చేసేలా ఇతరులకు సహాయం చేయడం మనకెంతో సంతోషాన్నిస్తుంది. ఇది మనకు దొరికిన గొప్ప గౌరవం!—ఫిలిప్పీయులు 4:13 చదవండి.

పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

^ పేరా 5 ప్రజల్ని శిష్యులుగా చేయమని, తాను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. దాన్ని ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఇందులోని కొన్ని విషయాలు కావలికోట, జూలై 1, 2004, 14-19 పేజీల్లోని సమాచారం నుండి తీసుకున్నవి.

^ పేరా 5 ఈ ఆర్టికల్‌లో అతను అనే పదం ఉపయోగించినప్పటికీ, అది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది.

^ పేరా 67 చిత్రాల వివరణ: దేవుని మీద ప్రేమ పెంచుకోవడానికి విద్యార్థి ఏం చేయాలో ఒక సహోదరి బైబిలు స్టడీలో వివరిస్తోంది. తర్వాత, ఆ సహోదరి ఇచ్చిన మూడు సలహాల్ని విద్యార్థి పాటిస్తోంది.