కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 46

ధైర్యంగా ఉండండి—మీకు సహాయం చేసేది యెహోవాయే

ధైర్యంగా ఉండండి—మీకు సహాయం చేసేది యెహోవాయే

“నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.”—హెబ్రీ. 13:5.

పాట 55 శత్రువులకు భయపడకండి!

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఒంటరిగా అనిపిస్తున్నప్పుడు లేదా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఏ విషయం మనకు ఓదార్పునిస్తుంది? (కీర్తన 118:5-7)

ఏదైనా సమస్యతో ఒంటరిగా పోరాడుతున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా? నమ్మకమైన యెహోవా సేవకులతో సహా చాలామందికి అలా అనిపించింది. (1 రాజు. 19:14) మీకెప్పుడైనా అలా అనిపిస్తే, యెహోవా చేసిన ఈ వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోండి: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” మీరు కూడా “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను” అని ధైర్యంగా చెప్పవచ్చు. (హెబ్రీ. 13:5, 6) అపొస్తలుడైన పౌలు ఆ మాటల్ని దాదాపు క్రీ.శ. 61 లో యూదయలో ఉన్న తోటి క్రైస్తవులకు రాశాడు. ఆయన మాటలు, కీర్తన 118:5-7 లో కీర్తనకర్త చెప్పిన విషయాల్ని గుర్తుచేస్తాయి.—చదవండి.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం? ఎందుకు?

2 కీర్తనకర్తలాగే పౌలు కూడా, తనకు సహాయం చేసేది యెహోవాయే అని స్వయంగా తెలుసుకున్నాడు. ఉదాహరణకు, హెబ్రీయులకు ఉత్తరం రాయడానికి రెండు కన్నా ఎక్కువ సంవత్సరాల ముందు, పౌలు ఒక భయంకరమైన తుఫానులో ఓడ ప్రయాణం చేశాడు. (అపొ. 27:4, 15, 20) ఆ ప్రయాణం అంతటిలో అలాగే ఆ ప్రయాణానికి ముందు, యెహోవా ఎన్నో విధాలుగా పౌలుకు సహాయం చేశాడు. వాటిలో మూడిటిని ఇప్పుడు పరిశీలిస్తాం. (1) యేసు ద్వారా, దేవదూతల ద్వారా; (2) అధికారుల ద్వారా; (3) తోటి క్రైస్తవుల ద్వారా యెహోవా పౌలుకు సహాయం చేశాడు. పౌలు జీవితంలో జరిగిన ఈ సంఘటనల్ని పరిశీలించడం వల్ల, మనకు సహాయం చేస్తానని యెహోవా ఇచ్చిన మాట మీద నమ్మకం బలపడుతుంది.

యేసు ద్వారా, దేవదూతల ద్వారా సహాయం

3. పౌలు ఏం అనుకొని ఉంటాడు? ఎందుకు?

3 పౌలుకు సహాయం అవసరమైంది. దాదాపు క్రీ.శ. 56 లో ఒక గుంపు ఆయన్ని యెరూషలేము ఆలయంలో నుండి బయటికి ఈడ్చుకొచ్చి, చంపడానికి ప్రయత్నించింది. తర్వాతి రోజు పౌలును మహాసభ ముందు నిలబెట్టినప్పుడు, అక్కడ కూడా శత్రువులు ఆయన్ని చంపబోయారు. (అపొ. 21:30-32; 22:30; 23:6-10) ఈ సమస్యను ఇంకెంతకాలం సహించాల్సి వస్తుందో అని పౌలు అనుకొని ఉంటాడు.

4. యెహోవా యేసు ద్వారా పౌలుకు ఎలా సహాయం చేశాడు?

4 యెహోవా పౌలుకు ఎలా సహాయం చేశాడు? పౌలు బంధించబడిన రాత్రి ‘ప్రభువైన’ యేసు ఆయన పక్కన నిలబడి ఇలా అన్నాడు: “ధైర్యంగా ఉండు! నువ్వు నా గురించి యెరూషలేములో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చినట్టే రోములో కూడా సాక్ష్యమివ్వాలి.” (అపొ. 23:11) ఆ మాటలు పౌలుకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి! యెరూషలేములో పౌలు చేసిన పరిచర్యను యేసు మెచ్చుకున్నాడు. అంతేకాదు, పౌలు సురక్షితంగా రోముకు చేరుకుంటాడని, అక్కడ కూడా సాక్ష్యమిస్తాడని యేసు మాటిచ్చాడు. అది విన్నప్పుడు, తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్న పిల్లాడిలా పౌలుకు సురక్షితంగా అనిపించి ఉంటుంది.

సముద్ర ప్రయాణంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, ఓడలోని వాళ్లందరూ సురక్షితంగా గమ్యానికి చేరుకుంటారని ఒక దేవదూత పౌలుకు అభయం ఇచ్చాడు (5వ పేరా చూడండి)

5. యెహోవా దేవదూత ద్వారా పౌలుకు ఎలా సహాయం చేశాడు? (ముఖచిత్రం చూడండి.)

5 పౌలు ఇంకా ఏ కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? యెరూషలేములో ఆ సంఘటనలు జరిగిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, పౌలు ఓడలో ఇటలీకి వెళ్తుండగా ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. అప్పుడు ఓడ సిబ్బంది అలాగే ప్రయాణికులు చనిపోతామని భయపడ్డారు. కానీ పౌలు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన ఇలా అన్నాడు: “నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఎవరికి పవిత్రసేవ చేస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా పక్కన నిలబడి, ‘పౌలూ, భయపడకు. నువ్వు కైసరు ముందు నిలబడాలి. ఇదిగో! నీతోపాటు ప్రయాణిస్తున్నవాళ్ల ప్రాణాల్ని కూడా దేవుడు దయతో కాపాడతాడు’ అని చెప్పాడు.” యెహోవా అంతకుముందు యేసు ద్వారా ఇచ్చిన అభయాన్నే, ఇప్పుడు మళ్లీ దేవదూత ద్వారా ఇచ్చాడు. యెహోవా చెప్పినట్టుగానే పౌలు రోముకు చేరుకున్నాడు.—అపొ. 27:20-25; 28:16.

6. యేసు ఇచ్చిన ఏ మాట మనకు బలాన్ని ఇస్తుంది? ఎందుకు?

6 యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? పౌలుకు సహాయం చేసినట్టే యెహోవా యేసు ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు, తన అనుచరులందరికీ యేసు ఇలా మాటిచ్చాడు: “ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:20) ఆ మాట మనకు బలాన్ని ఇస్తుంది. ఎందుకు? ఎందుకంటే మనం కూడా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. ఉదాహరణకు, మనలో కొంతమంది తమ ప్రియమైన వాళ్లను కోల్పోవడం వల్ల బాధను అనుభవిస్తున్నారు. ఇంకొంతమంది వయసు పైబడడం వల్ల వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది కృంగుదలతో పోరాడుతున్నారు. అయినప్పటికీ మనం వాటిని సహిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే యేసు ఎప్పుడూ,”  అంటే కష్ట సమయాల్లో కూడా మనతో ఉంటాడని మనకు తెలుసు.—మత్త. 11:28-30.

ప్రకటనా పనిలో దేవదూతలు మనకు సహాయం చేస్తారు, మనల్ని నడిపిస్తారు (7వ పేరా చూడండి)

7. ప్రకటన 14:6 ప్రకారం, నేడు యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడు?

7 యెహోవా దేవదూతల ద్వారా మనకు సహాయం చేస్తాడని బైబిలు హామీ ఇస్తోంది. (హెబ్రీ. 1:7, 14) ఉదాహరణకు, మనం “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” రాజ్య సువార్త ప్రకటిస్తుండగా దేవదూతలు మనకు సహాయం చేస్తారు, మనల్ని నడిపిస్తారు.—మత్త. 24:13, 14; ప్రకటన 14:6 చదవండి.

అధికారుల ద్వారా సహాయం

8. యెహోవా ఒక సహస్రాధిపతి ద్వారా పౌలుకు ఎలా సహాయం చేశాడు?

8 యెహోవా పౌలుకు ఎలా సహాయం చేశాడు? క్రీ.శ. 56 లో, పౌలు రోముకు చేరుకుంటాడని యేసు మాటిచ్చాడు. కానీ, యెరూషలేములో కొంతమంది యూదులు మాటువేసి పౌలును చంపాలని పథకం వేశారు. ఆ విషయం రోమా సహస్రాధిపతి అయిన క్లౌదియ లూసియకు తెలిసింది. పౌలును రక్షించడానికి క్లౌదియ వెంటనే చర్య తీసుకున్నాడు. అతను పౌలును యెరూషలేముకు దాదాపు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైసరయకు పంపించాడు. ఆయనకు కాపలాగా చాలామంది సైనికుల్ని కూడా పంపాడు. కైసరయలో, పౌలును “హేరోదు రాజభవనంలో కాపలావాళ్ల సంరక్షణలో ఉంచమని” అధిపతి అయిన ఫేలిక్సు ఆదేశించాడు. ఆ విధంగా, పౌలు తన శత్రువుల చేతికి చిక్కకుండా యెహోవా కాపాడాడు.—అపొ. 23:12-35.

9. అధిపతి అయిన ఫేస్తు పౌలుకు ఎలా సహాయం చేశాడు?

9 రెండు సంవత్సరాల తర్వాత, పౌలు ఇంకా కైసరయలోని చెరసాలలోనే ఉన్నాడు. ఫేలిక్సు స్థానంలో అధిపతి అయిన ఫేస్తు వచ్చాడు. విచారణ కోసం పౌలును యెరూషలేముకు పంపించమని యూదులు ఫేస్తును వేడుకున్నారు. కానీ ఫేస్తు ఒప్పుకోలేదు. ఎందుకంటే, “వాళ్లు పౌలు కోసం మాటువేసి అతన్ని దారిలోనే చంపేయాలని పథకం వేస్తున్నారు” అని ఫేస్తుకు తెలిసివుంటుంది.—అపొ. 24:27–25:5.

10. కైసరుకు విన్నవించుకుంటానని పౌలు అడిగినప్పుడు ఫేస్తు ఏమన్నాడు?

10 తర్వాత, కైసరయలో పౌలు మీద విచారణ జరిగింది. “యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో” ఫేస్తు పౌలును ఇలా అడిగాడు: “మనం యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ నా సమక్షంలో నీకు తీర్పు జరగడం నీకు ఇష్టమేనా?” యెరూషలేముకు వెళ్తే శత్రువులు తనను చంపే అవకాశం ఉందని, తాను సురక్షితంగా రోముకు చేరుకుని అక్కడ పరిచర్య చేయాలని పౌలుకు తెలుసు. అందుకే ఆయన, “నేను కైసరుకే విన్నవించుకుంటాను!” అని అన్నాడు. ఫేస్తు తన సలహాదారులతో మాట్లాడిన తర్వాత, పౌలుతో ఇలా అన్నాడు: “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు.” ఫేస్తు పౌలుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల ఆయన తన శత్రువుల నుండి కాపాడబడ్డాడు. తర్వాత, పౌలు తనను చంపాలనుకుంటున్న వాళ్లకు చాలా దూరంగా రోముకు చేరుకుంటాడు.—అపొ. 25:6-12.

11. యెషయా చెప్పిన ఏ ప్రోత్సాహకరమైన మాటల గురించి పౌలు ధ్యానించి ఉంటాడు?

11 పౌలు ఇటలీకి ప్రయాణమయ్యే ముందు, యెహోవాను వ్యతిరేకించే వాళ్లను ఉద్దేశించి యెషయా ప్రవక్త రాసిన ఈ మాటల్ని ధ్యానించి ఉంటాడు: “పన్నాగం పన్నండి, కానీ అది భగ్నం చేయబడుతుంది! ఏమంటారో అనండి, కానీ మీరన్నట్టు జరగదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు!” (యెష. 8:10) దేవుడు తనకు సహాయం చేస్తాడని పౌలుకు తెలుసు. దానివల్లే, ముందుముందు రాబోయే కష్టాల్ని ఎదుర్కోవడానికి ఆయన ధైర్యం కూడగట్టుకున్నాడు.

గతంలోలాగే నేడు కూడా, యెహోవా తన సేవకుల్ని కాపాడడానికి అధికారుల్ని ఉపయోగించవచ్చు (12వ పేరా చూడండి)

12. యూలి పౌలుతో ఎలా ప్రవర్తించాడు? పౌలు ఏం గ్రహించి ఉంటాడు?

12 క్రీ.శ. 58 లో పౌలు ఇటలీకి ప్రయాణమయ్యాడు. పౌలు ఒక ఖైదీ కాబట్టి ఆయన్ని యూలి అనే సైనికాధికారికి అప్పగించారు. యూలి పౌలుతో కఠినంగా ప్రవర్తించవచ్చు లేదా దయగా ప్రవర్తించవచ్చు. మరి యూలి తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడు? తర్వాతి రోజు, వాళ్లు తమ ప్రయాణంలో మొదటి రేవుకు చేరుకున్నప్పుడు “యూలి మానవత్వంతో పౌలు మీద దయ చూపించి అతన్ని తన స్నేహితుల దగ్గరికి వెళ్లనిచ్చాడు.” ఆ తర్వాత, యూలి పౌలు ప్రాణాన్ని కూడా కాపాడాడు. ఎలా? సైనికులు ఓడలో ఉన్న ఖైదీలందర్నీ చంపాలనుకున్నప్పుడు యూలి వాళ్లను అడ్డుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే, యూలి “పౌలును క్షేమంగా తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు.” దయగల ఈ అధికారి ద్వారా యెహోవా తనకు సహాయం చేస్తున్నాడని పౌలు గ్రహించి ఉంటాడు.—అపొ. 27:1-3, 42-44.

13వ పేరా చూడండి

13. యెహోవా అధికారుల్ని ఎలా ఉపయోగించవచ్చు?

13 యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? యెహోవా తన సంకల్పానికి అనుగుణంగా, పవిత్రశక్తిని ఉపయోగించి అధికారుల్ని తనకు నచ్చినట్టుగా నడిపించవచ్చు. రాజైన సొలొమోను ఇలా రాశాడు: “రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది. ఆయన తనకు నచ్చినవైపు దాన్ని తిప్పుతాడు.” (సామె. 21:1) ఆ మాటలకు అర్థం ఏంటి? మనుషులు ఒక కందకం తవ్వి, కాలువ నీటిని తమకు నచ్చినవైపు మళ్లించగలరు. అదేవిధంగా, యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి పరిపాలకుల ఆలోచనల్ని తన సంకల్పానికి అనుగుణంగా మలచగలడు. అలా మలిచినప్పుడు వాళ్లు దేవుని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారు.—ఎజ్రా 7:21, 25, 26 తో పోల్చండి.

14. అపొస్తలుల కార్యాలు 12:5 ప్రకారం, మనం ఎవరి కోసం ప్రార్థించవచ్చు?

14 మనం ఏం చేయవచ్చు? ‘రాజులు, అధికార స్థానాల్లో ఉన్నవాళ్లు’ మన ప్రీచింగ్‌, మీటింగ్స్‌ వంటివాటిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ల కోసం మనం ప్రార్థించవచ్చు. (1 తిమో. 2:1, 2, అధస్సూచి; నెహె. 1:11) మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే, మనం కూడా జైల్లో ఉన్న మన సహోదర సహోదరీల కోసం పట్టుదలగా ప్రార్థిస్తాం. (అపొస్తలుల కార్యాలు 12:5 చదవండి; హెబ్రీ. 13:3) అంతేకాదు, ఆ జైళ్లలోని అధికారుల గురించి కూడా మనం ప్రార్థించవచ్చు. ఆ అధికారులు యూలిలాగే మన సహోదర సహోదరీల మీద ‘మానవత్వంతో దయ చూపించేలా’ వాళ్ల ఆలోచనల్ని మలచమని మనం యెహోవాను వేడుకోవచ్చు.

తోటి క్రైస్తవుల ద్వారా సహాయం

15-16. యెహోవా అరిస్తార్కు ద్వారా, లూకా ద్వారా పౌలుకు ఎలా సహాయం చేశాడు?

15 యెహోవా పౌలుకు ఎలా సహాయం చేశాడు? పౌలు రోముకు ప్రయాణిస్తున్నప్పుడు యెహోవా ఎన్నోసార్లు తోటి క్రైస్తవుల ద్వారా ఆయనకు సహాయం చేశాడు. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

16 పౌలుకు నమ్మకమైన సహచరులైన అరిస్తార్కు, లూకా ఆయనతో కలిసి రోముకు ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. * వాళ్లు సురక్షితంగా రోముకు చేరుకుంటారని యేసు వాళ్లకు వ్యక్తిగతంగా హామీ ఇవ్వకపోయినా, వాళ్లు ప్రాణాల్ని పణంగా పెట్టి పౌలుతో ఇష్టపూర్వకంగా వెళ్లారు. వాళ్లు రోముకు సురక్షితంగా చేరుకుంటారనే విషయం ప్రయాణం మధ్యలో గానీ వాళ్లకు తెలీలేదు. కాబట్టి అరిస్తార్కు, లూకా తనతో కలిసి కైసరయలో ఓడ ఎక్కినప్పుడు పౌలు యెహోవాకు ప్రార్థించి ఉంటాడు. ధైర్యవంతులైన ఆ ఇద్దరు సహోదరుల ద్వారా తనకు సహాయం చేస్తున్నందుకు పౌలు యెహోవాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి ఉంటాడు.—అపొ. 27:1, 2, 20-25.

17. యెహోవా తోటి క్రైస్తవుల ద్వారా పౌలుకు ఎలా సహాయం చేశాడు?

17 ప్రయాణం మధ్యలో, తోటి క్రైస్తవులు పౌలుకు ఎన్నోసార్లు సహాయం చేశారు. ఉదాహరణకు, సీదోను అనే రేవు పట్టణంలో యూలి పౌలును “తన స్నేహితుల దగ్గరికి వెళ్లనిచ్చాడు. దానివల్ల వాళ్లు పౌలుకు సహాయం చేయగలిగారు.” తర్వాత, ఓడ పొతియొలీ నగరానికి చేరుకున్నప్పుడు అక్కడి సహోదరులు పౌలును, ఆయన సహచరుల్ని కలిశారు. సహోదరులు “ఒక వారం రోజులు తమతో ఉండమని బ్రతిమాలడంతో” వాళ్లు ఏడు రోజులు అక్కడే ఉన్నారు. ఆ రెండు నగరాల్లోని క్రైస్తవులు వాళ్ల అవసరాలు చూసుకున్నారు. ఖచ్చితంగా పౌలు ఆ క్రైస్తవులతో ప్రోత్సాహకరమైన అనుభవాలు పంచుకొని ఉంటాడు, వాళ్లంతా ఆ సమయాన్ని చాలా ఆనందంగా గడిపి ఉంటారు. (అపొస్తలుల కార్యాలు 15:2, 3 తో పోల్చండి.) అలా సేదదీర్పు పొందిన తర్వాత పౌలు, ఆయన సహచరులు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.—అపొ. 27:3; 28:13, 14.

పౌలుకు చేసినట్లే యెహోవా మనకు కూడా తోటి క్రైస్తవుల ద్వారా సహాయం చేస్తాడు (18వ పేరా చూడండి)

18. పౌలు ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు?

18 పౌలు రోములో అడుగుపెడుతుండగా, మూడు సంవత్సరాల క్రితం ఆ నగరంలో ఉన్న సంఘానికి తాను రాసిన ఈ మాటల్ని గుర్తుతెచ్చుకుని ఉంటాడు: “నేను మీ దగ్గరికి రావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను.” (రోమా. 15:23) అయితే ఒక ఖైదీగా రావాల్సి వస్తుందని ఆయన అనుకొని ఉండడు. తనను పలకరించడానికి రోములోని సహోదరులు దారి పొడవునా నిలబడి ఎదురుచూస్తున్నప్పుడు, పౌలుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! “పౌలు వాళ్లను చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.” (అపొ. 28:15) సహోదరుల్ని చూడగానే పౌలు ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు? ఎందుకంటే, తోటి క్రైస్తవుల ద్వారా యెహోవా తనకు సహాయం చేస్తున్నాడని పౌలు మరోసారి గ్రహించాడు.

19వ పేరా చూడండి

19. మొదటి పేతురు 4:10 ప్రకారం, అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా మనల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

19 మనం ఏం చేయవచ్చు? మీ సంఘంలో సహోదర సహోదరీలు ఎవరైనా అనారోగ్య సమస్యల్ని లేదా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారా? ఎవరైనా ప్రియమైనవాళ్లను కోల్పోయిన దుఃఖంలో ఉన్నారా? ఎవరైనా అవసరంలో ఉన్నారని మనకు తెలిస్తే, వాళ్లతో ప్రేమగా మాట్లాడేలా, ప్రవర్తించేలా సహాయం చేయమని యెహోవాను అడగవచ్చు. మన మాటల ద్వారా, పనుల ద్వారా వాళ్లకు సరిగ్గా అవసరమైన ప్రోత్సాహం వాళ్లకు దొరకవచ్చు. (1 పేతురు 4:10 చదవండి.) * మనం సహాయం చేసినప్పుడు, వాళ్లు యెహోవా ఇచ్చిన ఈ మాట మీద నమ్మకం పెంచుకుంటారు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” అప్పుడు మీరు తప్పకుండా సంతోషిస్తారు కదా!

20. “నాకు సహాయం చేసేది యెహోవాయే” అని మనం ఎందుకు ధైర్యంగా చెప్పవచ్చు?

20 పౌలు, ఆయన సహచరుల్లాగే మన జీవితంలో కూడా భయంకరమైన తుఫాను లాంటి సమస్యలు రావచ్చు. కానీ యెహోవా మనతో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. ఆయన యేసు ద్వారా, దేవదూతల ద్వారా మనకు సహాయం చేస్తాడు. తన సంకల్పానికి అనుగుణంగా ఉంటే, అధికారుల ద్వారా కూడా ఆయన మనకు సహాయం చేయవచ్చు. అంతేకాదు యెహోవా పవిత్రశక్తి ద్వారా తోటి క్రైస్తవుల హృదయాల్ని కదిలించి, వాళ్ల ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని మనలో చాలామందిమి రుచి చూశాం. కాబట్టి పౌలులాగే మనం కూడా ధైర్యంగా ఇలా అంటాం: “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”—హెబ్రీ. 13:6.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

^ పేరా 5 కష్టమైన పరిస్థితుల్ని తట్టుకునేలా అపొస్తలుడైన పౌలుకు యెహోవా ఏ మూడు విధాలుగా సహాయం చేశాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. గతంలో యెహోవా తన సేవకులకు ఎలా సహాయం చేశాడో పరిశీలిస్తాం. దానివల్ల, మన కష్టాల్లో కూడా ఆయన తోడుంటాడనే నమ్మకం బలపడుతుంది.

^ పేరా 16 అరిస్తార్కు, లూకా అంతకన్నా ముందు నుండే పౌలుతో కలిసి ప్రయాణిస్తున్నారు. రోములో పౌలు ఖైదీగా ఉన్నప్పుడు కూడా, వాళ్లు ఆయన్ని విశ్వసనీయంగా అంటిపెట్టుకొని ఉన్నారు.—అపొ. 16:10-12; 20:4; కొలొ. 4:10, 14.