కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 48

భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగండి

భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగండి

“నీ కళ్లు అటూఇటూ చూడకుండా తిన్నగా ముందుకు చూడాలి.”—సామె. 4:25.

పాట 77 చీకటి లోకంలో వెలుగు

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. సామెతలు 4:25 లో ఉన్న సలహాను మనమెలా పాటించవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

ఈ సన్నివేశాల్ని ఊహించుకోండి. ఒక పెద్ద వయసు సహోదరి గతంలో ఆనందించిన మంచి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటోంది. ఆమె ప్రస్తుతం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నా, యెహోవా సేవలో చేయగలిగింది చేస్తూ ముందుకు సాగుతోంది. (1 కొరిం. 15:58) ఆమె తన ప్రియమైనవాళ్లతో కలిసి కొత్తలోకంలో ఉన్నట్టు ప్రతీరోజు ఊహించుకుంటుంది. మరో సహోదరి, సంఘంలో ఒకరు తనను బాధపెట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. కానీ తన మనసులో కోపం ఉంచుకోకూడదని నిర్ణయించుకుంది. (కొలొ. 3:13) ఒక సహోదరుడు గతంలో చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు, కానీ యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఇప్పుడు తాను ఏం చేయగలడు అనేదాని మీద మనసుపెడుతున్నాడు.—కీర్త. 51:10.

2 ఆ ముగ్గురిలోనూ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే, ఆ ముగ్గురూ గతంలో జరిగినవాటిని గుర్తు తెచ్చుకున్నారు, కానీ వాళ్లు గతంలోనే ఉండిపోలేదు. వాళ్లు భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నారు.—సామెతలు 4:25 చదవండి.

3. భవిష్యత్తు వైపు చూస్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

3 భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగడం ఎందుకు ప్రాముఖ్యం? ఒక వ్యక్తి అదేపనిగా వెనక్కి చూస్తూ ఉంటే, తిన్నగా ముందుకు వెళ్లలేడు. అదేవిధంగా, మనం గతం వైపే చూస్తూ ఉంటే యెహోవా సేవలో ముందుకు వెళ్లలేం.—లూకా 9:62.

4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 మనం గతంలోనే ఉండిపోయేలా * చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం: (1) ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయని పదేపదే అనుకోవడం, (2) కోపాన్ని మనసులో ఉంచుకోవడం, (3) విపరీతమైన అపరాధ భావాలు కలిగి ఉండడం. “వెనక ఉన్నవాటిని” విడిచిపెట్టి “ముందున్న వాటి” వైపు సాగడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయో కూడా పరిశీలిస్తాం.—ఫిలి. 3:13.

ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయని అనుకోవడం

భవిష్యత్తు వైపు చూడకుండా మనల్ని ఏవి ఆపుతాయి? (5, 9, 13 పేరాలు చూడండి) *

5. మనం ఏం చేయకూడదని ప్రసంగి 7:10 చెప్తుంది?

5 ప్రసంగి 7:10 చదవండి. “పాత రోజులే బావున్నాయి” అని అనకూడదని ఆ లేఖనం చెప్పట్లేదు. ఎందుకంటే మంచి జ్ఞాపకాలు యెహోవా ఇచ్చిన బహుమానం. అయితే, “ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయి” అని అనకూడదని ఆ లేఖనం చెప్తుంది. అంటే ఇప్పటి పరిస్థితుల్ని పాత పరిస్థితులతో పోల్చుకుని, ఇప్పుడు పరిస్థితులన్నీ ఘోరంగా మారాయని అనుకోకూడదు.

ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏ పొరపాటు చేశారు? (6వ పేరా చూడండి)

6. జీవితం ఇప్పటికన్నా గతంలోనే బాగుందని పదేపదే అనుకోవడం ఎందుకు తెలివైన పని కాదు? ఒక ఉదాహరణ చెప్పండి.

6 మన జీవితం ఇప్పటికన్నా గతంలోనే బాగుందని పదేపదే అనుకోవడం ఎందుకు తెలివైన పని కాదు? ఎందుకంటే, దానివల్ల మనం గతంలో ఉన్న మంచి విషయాల మీద మాత్రమే మనసుపెట్టి, అప్పుడు పడిన కష్టాల్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలీయుల గురించి ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్లు అక్కడ పడిన కష్టాల్ని చాలా త్వరగా మర్చిపోయారు, కానీ అక్కడ తిన్న మంచి ఆహారాన్ని గుర్తుతెచ్చుకున్నారు. వాళ్లు ఇలా అన్నారు: “ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు మాకు చాలా గుర్తొస్తున్నాయి! ఆ దోసకాయలు, పుచ్చకాయలు, ఉల్లి ఆకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మాకు బాగా గుర్తొస్తున్నాయి!” (సంఖ్యా. 11:5) నిజంగా వాళ్లు ఆ ఆహారాన్ని “ఉచితంగా” తిన్నారా? లేదు. ఇశ్రాయేలీయులు దానికోసం వెట్టిచాకిరి చేశారు; ఆ సమయంలో వాళ్లు బానిసలుగా తీవ్ర అణచివేతకు గురయ్యారు. (నిర్గ. 1:13, 14; 3:6-9) అయినప్పటికీ వాళ్లు పడిన కష్టాన్ని మర్చిపోయి, గతంలో గడిపిన జీవితాన్నే మళ్లీ కోరుకున్నారు. ప్రస్తుతం యెహోవా వాళ్ల కోసం చేస్తున్న మంచి విషయాల మీద మనసుపెట్టకుండా, వాళ్లు పాత రోజుల్నే తలచుకుంటున్నారు. యెహోవాకు అది నచ్చలేదు.—సంఖ్యా. 11:10.

7. ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయనే ఆలోచనకు ఒక సహోదరి ఎలా దూరంగా ఉండగలిగింది?

7 ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయనే ఆలోచనకు మనమెలా దూరంగా ఉండవచ్చు? ఒక సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె 1945 లో బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవచేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆమె బెతెల్‌లో సేవ చేస్తున్న ఒక సహోదరుణ్ణి పెళ్లిచేసుకుంది. ఇద్దరు కలిసి చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశారు. అయితే, 1976 లో ఆ సహోదరుడికి జబ్బు చేసింది. తను ఇక ఎంతోకాలం బ్రతకనని తెలిసినప్పుడు, సహోదరుడు ఆమెకు మంచి సలహాల్ని ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధను తట్టుకోవడానికి అవి ఆమెకు ఎంతో సహాయం చేశాయి. సహోదరుడు ఆమెతో ఇలా అన్నాడు: “మనం సంతోషంగా మన వైవాహిక జీవితం గడిపాం. అలా జీవించడం చాలామందికి సాధ్యం కాదు.” ఆయన ఆమెకు ఈ సలహా ఇచ్చాడు: “నీ జ్ఞాపకాలు నిన్ను వెంటాడినా, నువ్వు మాత్రం గతంలో జీవించకు. నెమ్మదిగా తేరుకోవడానికి కాలమే నీకు సహాయం చేస్తుంది. నీ మీద నీవే కోపం తెచ్చుకోకు, నీ మీద నీవే జాలిపడకు. నీకు ఈ ఆనందం, ఆశీర్వాదాలు ఉన్నందుకు సంతోషంగా ఉండు. కొంతకాలం గడచిన తర్వాత ఆ జ్ఞాపకాలే నీకు ఆనందాన్నివ్వడం నువ్వు చూస్తావు. . . . జ్ఞాపకాలు దేవుడు మనకిచ్చిన వరాలు.” అది చాలా మంచి సలహా కదా!

8. తన భర్త ఇచ్చిన సలహాను పాటించడం వల్ల సహోదరి ఎలా ప్రయోజనం పొందింది?

8 ఆ సహోదరి తన భర్త ఇచ్చిన సలహాను పాటించింది. ఆమె యెహోవాకు నమ్మకంగా సేవచేసి, 92 ఏళ్ల వయసులో చనిపోయింది. చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ఆమె ఇలా అంది: “యెహోవా సేవలో గడిపిన 63 సంవత్సరాల పూర్తికాల సేవను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను నిజంగా సంతృప్తికరమైన జీవితమే గడిపానని చెప్పగలను.” ఎందుకు? ఆమె ఇలా వివరించింది: ‘మన సహోదరత్వం, నిరీక్షణ మన జీవితాల్ని నిజంగా సంతృప్తికరం చేస్తాయి. ఒకేఒక్క సత్యదేవుడు, మహాగొప్ప సృష్టికర్త అయిన యెహోవాను శాశ్వతంగా సేవిస్తూ పరదైసు భూమిలో మన సహోదర సహోదరీలతో జీవిస్తామనే నిరీక్షణ మనకుంది.’ * భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగే విషయంలో ఆమె చక్కని ఆదర్శం ఉంచింది!

కోపాన్ని మనసులో ఉంచుకోవడం

9. లేవీయకాండం 19:18 ప్రకారం, కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడం మరిముఖ్యంగా ఎప్పుడు కష్టంగా ఉండవచ్చు?

9 లేవీయకాండం 19:18 చదవండి. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తిస్తే, కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడం కష్టంగా ఉంటుంది. మరిముఖ్యంగా మనల్ని బాధపెట్టింది మన సహోదరుడో, స్నేహితుడో, బంధువో అయితే అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఈ అనుభవాన్ని పరిశీలించండి: ఒక సహోదరి, తన డబ్బు దొంగిలించిందని మరో సహోదరి మీద నింద వేసింది. అయితే, నిజం తెలుసుకున్నాక తనను క్షమించమని ఆమెను అడిగింది. కానీ ఆమె తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయింది. మీకెప్పుడైనా అలా జరిగిందా? అలాంటి సంఘటనే మన జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఏదోక సందర్భంలో, మనల్ని నొప్పించిన వ్యక్తి మీద కోపం పెంచుకుని ఉంటాం, వాళ్లను ఎప్పటికీ క్షమించలేమని అనుకొని ఉంటాం.

10. కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడానికి ఏం చేయాలి?

10 మనసులో ఎవరి మీదైనా కోపం ఉంటే మనమేం చేయాలి? మొదటిగా, యెహోవా అన్నీ చూస్తాడని గుర్తుంచుకోవాలి. మన జీవితంలో ఏం జరుగుతుందో, మనం ఎలాంటి అన్యాయాల్ని ఎదుర్కొంటున్నామో అన్నీ ఆయనకు తెలుసు. (హెబ్రీ. 4:13) మనం బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు. (యెష. 63:9) అన్యాయాల వల్ల మనకు జరిగిన నష్టమంతటినీ తీసేస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—ప్రక. 21:3, 4.

11. కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

11 రెండవదిగా, కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవడం మనకే మంచిదని గుర్తుంచుకోవాలి. పైపేరాల్లో అవమానానికి గురైన సహోదరి ఆ విషయాన్ని గుర్తించింది. ఆమె మెల్లమెల్లగా తన మనసులో నుండి కోపాన్ని తీసేసుకుంది. మనం ఇతరుల్ని క్షమిస్తే యెహోవా మనల్ని క్షమిస్తాడని ఆమె గుర్తించింది. (మత్త. 6:14) తోటి సహోదరి తన విషయంలో చేసింది ఖచ్చితంగా తప్పే అని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవాలని నిర్ణయించుకుంది. దానివల్ల, ఆమె ఇంతకుముందు కన్నా సంతోషంగా ఉండగలిగింది, యెహోవా సేవ మీద మనసుపెట్టగలిగింది.

విపరీతమైన అపరాధ భావాలు కలిగి ఉండడం

12. మొదటి యోహాను 3:19, 20 నుండి ఏం నేర్చుకోవచ్చు?

12 మొదటి యోహాను 3:19, 20 చదవండి. మనందరికీ ఏదోక సందర్భంలో అపరాధ భావాలు కలుగుతాయి. ఉదాహరణకు, కొంతమంది తాము సత్యం తెలుసుకోకముందు చేసిన పనుల గురించి బాధపడుతుంటారు. ఇంకొంతమంది, తాము బాప్తిస్మం తీసుకున్న తర్వాత చేసిన తప్పుల గురించి బాధపడుతుంటారు. అలా బాధపడడం సహజమే. (రోమా. 3:23) మనం సరైనదే చేయాలనుకుంటాం, కానీ “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.” (యాకో. 3:2; రోమా. 7:21-23) అపరాధ భావాలు మనకు సంతోషాన్ని ఇవ్వవు, అయితే వాటివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అపరాధ భావాలు కలగడం వల్ల మన తప్పును సరిదిద్దుకుంటాం, మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకుంటాం.—హెబ్రీ. 12:12, 13.

13. విపరీతమైన అపరాధ భావాలతో నలిగిపోకుండా మనం ఎందుకు జాగ్రత్తపడాలి?

13 అయితే మనం పశ్చాత్తాపపడి, యెహోవా మనల్ని క్షమించిన తర్వాత కూడా మనం గతంలో చేసిన తప్పుల గురించే బాధపడుతుండవచ్చు. అలాంటి విపరీతమైన అపరాధ భావాలు హానికరమైనవి. (కీర్త. 31:10; 38:3, 4) ఎలా? గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తూ బాధపడిన ఒక సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె ఇలా అంది: “ఎలాగూ యెహోవా నన్ను క్షమించడు కాబట్టి ఇక ఆయన సేవలో కష్టపడి పని చేయడం అనవసరం అనుకున్నాను.” మనలో చాలామందికి అలాగే అనిపించివుంటుంది. కానీ విపరీతమైన అపరాధ భావాలతో నలిగిపోకుండా మనం జాగ్రత్తపడాలి. ఎందుకంటే, యెహోవా మనల్ని క్షమించినా మనల్ని మనం క్షమించుకోకూడదు అన్నది సాతాను కోరిక.—2 కొరింథీయులు 2:5-7, 11 తో పోల్చండి.

14. యెహోవా మనల్ని క్షమించాలనుకుంటున్నాడని మనకెలా తెలుస్తుంది?

14 అయినప్పటికీ మీరు, ‘యెహోవా నన్ను క్షమిస్తాడా?’ అని అనుకుంటుండవచ్చు. ఒకవిధంగా, ఆ ప్రశ్న వచ్చిందంటేనే, యెహోవా మిమ్మల్ని క్షమించగలడని అర్థం. చాలా సంవత్సరాల క్రితం కావలికోట పత్రిక ఇలా చెప్పింది: “మనం ఏదైనా పొరపాటును పదేపదే చేస్తుండవచ్చు. దేవున్ని సేవించడం మొదలుపెట్టే ముందు మనకున్న ఒక బలహీనతను పూర్తిగా తీసేసుకుని ఉండకపోవచ్చు. . . . కానీ ఆశ వదులుకోకండి. మీరేదో క్షమించరాని పాపం చేశారని అనుకోకండి. మీరు అలా అనుకోవాలన్నది సాతాను కోరిక. పొరపాటు చేసినందుకు బాధపడుతున్నారంటేనే మీరు మంచి వ్యక్తి అని, యెహోవా మిమ్మల్ని క్షమించగలడని అర్థం. వినయం చూపిస్తూ, క్షమించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉండండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి, ఆ పొరపాటు మళ్లీ చేయకుండా ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ ఉండండి. సాధారణంగా పిల్లలు ఒక సమస్య ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు సహాయం కోసం తమ తండ్రి దగ్గరికి వెళ్తారు. అలాగే మీరు కూడా మీకున్న బలహీనత విషయంలో ఎన్నిసార్లయినా యెహోవాను సహాయం అడగవచ్చు. ఆయన తన అపారదయతో మీకు సహాయం చేస్తాడు.” *

15-16. యెహోవా తమను క్షమించాలనుకుంటున్నాడని తెలుసుకున్నప్పుడు కొంతమంది ఎలా భావించారు?

15 యెహోవా తమను క్షమించాలనుకుంటున్నాడని తెలుసుకుని చాలామంది దేవుని సేవకులు ఊరట పొందారు. ఉదాహరణకు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు, “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే ఆర్టికల్స్‌లో వచ్చిన ఒక అనుభవం నుండి ప్రోత్సాహం పొందాడు. ఆ అనుభవంలోని సహోదరి, గతంలో తాను చేసిన తప్పుల్ని బట్టి యెహోవా తనను ప్రేమించడం అసాధ్యమని అనుకుంది. బాప్తిస్మం తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత కూడా, ఆమె ఆ అపరాధ భావాలతో నలిగిపోయింది. కానీ విమోచన క్రయధనం గురించి ధ్యానించడం మొదలుపెట్టాక ఆమె ఆలోచనా విధానం మారింది. *

16 ఆ అనుభవం నుండి సహోదరుడు ఎలా ప్రయోజనం పొందాడు? ఆయన ఇలా రాశాడు: “యౌవనంలో ఉన్నప్పుడు నాకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉండేది. చాలా కష్టపడి దాన్ని మానుకున్నాను. కానీ ఈమధ్య వాటిని మళ్లీ చూశాను. నేను సంఘ పెద్దల సహాయం తీసుకున్నాను, నా సమస్యను అధిగమించడానికి కృషి చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నన్ను క్షమించాలనుకుంటున్నాడని పెద్దలు నాకు భరోసా ఇచ్చారు. కానీ నేను పనికిరాని వాడినని, యెహోవా నన్ను ప్రేమించడని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ [సహోదరి] అనుభవం నాకు చాలా సహాయం చేసింది. నేను ఒక విషయం గ్రహించాను: దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటున్నానంటే, ఆయన కుమారుడు ఇచ్చిన విమోచన క్రయధనం నా పాపాల్ని కప్పడానికి సరిపోదని నేను చెప్తున్నట్టే. నేను పనికిరాని వాడినని అనిపించినప్పుడల్లా చదువుకోవడానికి, ధ్యానించడానికి ఈ ఆర్టికల్‌ని కత్తిరించి పెట్టుకున్నాను.”

17. పౌలు విపరీతమైన అపరాధ భావాలతో నలిగిపోకుండా ఎలా జాగ్రత్తపడ్డాడు?

17 ఇలాంటి అనుభవాలు అపొస్తలుడైన పౌలు ఉదాహరణను గుర్తుచేస్తాయి. క్రైస్తవుడిగా మారకముందు ఆయన కొన్ని ఘోరమైన తప్పులు చేశాడు. గతంలో చేసిన తప్పుల్ని పౌలు గుర్తు తెచ్చుకున్నాడు, కానీ ఆయన వాటిమీదే మనసుపెట్టలేదు. (1 తిమో. 1:12-15) విమోచన క్రయధనాన్ని యెహోవా తన కోసమే ఇచ్చిన బహుమానంలా పౌలు చూశాడు. (గల. 2:20) ఆ విధంగా పౌలు విపరీతమైన అపరాధ భావాలతో నలిగిపోకుండా జాగ్రత్తపడ్డాడు, యెహోవా సేవలో చేయగలిగినదంతా చేయడం మీద మనసుపెట్టాడు.

భవిష్యత్తు మీద మనసుపెట్టండి!

భవిష్యత్తు మీదే మనసుపెట్టాలని నిశ్చయించుకుందాం (18-19 పేరాలు చూడండి) *

18. ఈ ఆర్టికల్‌లో ఏం నేర్చుకున్నాం?

18 ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన విషయాల నుండి మనం ఏం నేర్చుకున్నాం? (1) మంచి జ్ఞాపకాలు యెహోవా ఇచ్చిన వరాలు; గతంలో మనం చాలా అందమైన జీవితం గడిపి ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో మనం పొందబోయే జీవితం అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. (2) వేరేవాళ్లు మనల్ని బాధపెట్టవచ్చు, కానీ మనం వాళ్లను క్షమించాలని నిర్ణయించుకుంటే యెహోవా సేవ మీద మనసుపెట్టగలుగుతాం. (3) విపరీతమైన అపరాధ భావాల వల్ల మనం యెహోవా సేవను ఆనందంగా చేయలేకపోవచ్చు. కాబట్టి పౌలులాగే, మనం కూడా యెహోవా మనల్ని క్షమించాడని నమ్మాలి.

19. కొత్తలోకంలో, గతంలోని చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటాడవని ఎందుకు చెప్పవచ్చు?

19 శాశ్వతకాలం జీవించే అవకాశం మన ముందు ఉంది. దేవుని కొత్తలోకంలో, గతంలోని చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటాడవు. ఆ కాలం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “పాత సంగతులు గుర్తుకురావు.” (యెష. 65:17) ఒక్కసారి ఆలోచించండి: యెహోవా సేవలో కొనసాగుతున్న వృద్ధులు కొత్తలోకంలో మళ్లీ యౌవనులు అవుతారు. (యోబు 33:25) కాబట్టి, మనం గతంలోనే ఉండిపోకుండా, భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగాలని నిశ్చయించుకుందాం!

పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

^ పేరా 5 అప్పుడప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోవడం మంచిదే. కానీ గతాన్నే తలచుకుంటూ ఉంటే ప్రస్తుతం చేయగలిగే వాటిని సరిగ్గా చేయలేం, భవిష్యత్తు మీద మనసుపెట్టలేం. భవిష్యత్తు వైపు చూడకుండా చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. గతంలోనే ఉండిపోకుండా ముందుకు సాగేలా సహాయం చేసే బైబిలు సూత్రాల్ని, ఆధునిక కాల ఉదాహరణల్ని కూడా చూస్తాం.

^ పేరా 4 పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో, గతంలోనే ఉండిపోవడం అనే మాట గతం గురించే ఆలోచించడాన్ని సూచిస్తుంది. అంటే గతం గురించి అదేపనిగా మాట్లాడుతూ, గతంలోనే బ్రతుకుతూ, జీవితం అప్పుడే బాగుండేదని అనుకోవడం.

^ పేరా 14 కావలికోట, (ఇంగ్లీషు) ఫిబ్రవరి 15, 1954, 123వ పేజీ చూడండి.

^ పేరా 59 చిత్రాల వివరణ: ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయనే ఆలోచన, కోపాన్ని మనసులో ఉంచుకోవడం, విపరీతమైన అపరాధ భావాలు వంటి పెద్దపెద్ద బరువుల్ని ఈడ్చుకెళ్తే మనం జీవ మార్గంలో సరిగ్గా నడవలేం.

^ పేరా 66 చిత్రాల వివరణ: ఆ బరువుల్ని వదిలేసిన తర్వాత మనకు మనశ్శాంతిగా, సంతోషంగా ఉంటుంది, కొత్త బలం వస్తుంది. అప్పుడు మనం భవిష్యత్తు వైపు చూడగలుగుతాం.