కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 47

మీరు అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉన్నారా?

మీరు అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉన్నారా?

‘చివరిగా సహోదరులారా, సంతోషిస్తూ ఉండండి; అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండండి.’—2 కొరిం. 13:11.

పాట 54 ఇదే త్రోవ

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మత్తయి 7:13, 14 ప్రకారం, మనం ఒక ప్రయాణంలో ఉన్నామని ఎందుకు చెప్పవచ్చు?

మనందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. మన గమ్యం లేదా లక్ష్యం, యెహోవా ప్రేమగల పరిపాలన కింద కొత్తలోకంలో జీవించడం. జీవానికి నడిపించే దారిలో వెళ్లడానికి మనం ప్రతీరోజు కృషి చేస్తున్నాం. అయితే ఆ దారి ఇరుకుగా, కొన్నిసార్లు కష్టంగా ఉంటుందని యేసు చెప్పాడు. (మత్తయి 7:13, 14 చదవండి.) మనం అపరిపూర్ణులం, కాబట్టి ఈ దారి నుండి సులభంగా పక్కకు మళ్లే ప్రమాదం ఉంది.—గల. 6:1.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం? (“ మార్పులు చేసుకోవడానికి వినయం మనకు సహాయం చేస్తుంది” బాక్సు కూడా చూడండి.)

2 జీవానికి నడిపించే ఇరుకు దారిలోనే కొనసాగాలంటే, మన ఆలోచనల్లో, వైఖరిలో, పనుల్లో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. “అవసరమైన మార్పులు చేసుకుంటూ” ఉండమని అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (2 కొరిం. 13:11) ఆ సలహా మనకు కూడా ఉపయోగపడుతుంది. మార్పులు చేసుకోవడానికి దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుందో, జీవానికి నడిపించే దారిలో కొనసాగడానికి పరిణతిగల క్రైస్తవులు మనకెలా సహాయం చేస్తారో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని పాటించడం మనకు ఎలాంటి సందర్భాల్లో కష్టంగా ఉండవచ్చో కూడా పరిశీలిస్తాం. అంతేకాదు, మార్పులు చేసుకుంటూ యెహోవా సేవలో ఆనందాన్ని కాపాడుకోవడానికి వినయం ఎలా సహాయం చేస్తుందో చూస్తాం.

దేవుని వాక్యం మిమ్మల్ని సరిదిద్దనివ్వండి

3. దేవుని వాక్యం మీకెలా సహాయం చేస్తుంది?

3 మన ఆలోచనల్ని, భావాల్ని పరిశీలించుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే మన హృదయం మోసకరమైనది, అది మనల్ని ఎటువైపు నడిపిస్తుందో తెలుసుకోవడం కష్టం. (యిర్మీ. 17:9) “తప్పుడు ఆలోచనతో” మనల్ని మనం సులభంగా మోసం చేసుకునే ప్రమాదం ఉంది. (యాకో. 1:22) కాబట్టి దేవుని వాక్యం సహాయంతో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన హృదయ లోతుల్లో ఉన్న “ఆలోచనల్ని, ఉద్దేశాల్ని” దేవుని వాక్యం వెల్లడి చేస్తుంది. (హెబ్రీ. 4:12, 13) ఒకవిధంగా చెప్పాలంటే, దేవుని వాక్యం ఎక్స్‌రే మెషీన్‌లా పనిచేసి మన లోపల ఏముందో స్పష్టంగా చూపిస్తుంది. అయితే బైబిలు, పరిణతిగల స్నేహితులు, లేదా దేవుని సంస్థ ఇచ్చే సలహాల నుండి ప్రయోజనం పొందాలంటే మనకు వినయం ఉండాలి.

4. సౌలు రాజు ఎలా గర్విష్ఠిగా తయారయ్యాడు?

4 వినయం లేకపోతే ఏం జరిగే ప్రమాదం ఉందో సౌలు రాజు ఉదాహరణ చూపిస్తుంది. గర్వం వల్ల సౌలు కళ్లు ఎంతగా మూసుకుపోయాయంటే తన ఆలోచనల్లో, పనుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించలేకపోయాడు. (కీర్త. 36:1, 2; హబ. 2:4) ఒక సందర్భంలో సౌలుకున్న గర్వం బయటపడింది. అమాలేకీయుల్ని ఓడించిన తర్వాత ఏం చేయాలో యెహోవా సౌలుకు స్పష్టంగా చెప్పాడు. కానీ సౌలు యెహోవా మాటకు లోబడలేదు. పైగా సమూయేలు ప్రవక్త వచ్చి అడిగినప్పుడు సౌలు తన తప్పు ఒప్పుకోకపోగా, తనను తాను సమర్థించుకున్నాడు, ఆ తప్పును వేరేవాళ్ల మీదికి నెట్టేశాడు. (1 సమూ. 15:13-24) అంతకుముందు కూడా ఒక సందర్భంలో సౌలు ఇలాంటి వైఖరే చూపించాడు. (1 సమూ. 13:10-14) విచారకరంగా, తన హృదయంలో గర్వం మొలకెత్తడానికి సౌలు అనుమతించాడు. ఆయన తన ఆలోచనల్ని సరిచేసుకోలేదు కాబట్టి యెహోవా ఆయన్ని గద్దించాడు, తిరస్కరించాడు.

5. సౌలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

5 మనం సౌలులా ఉండాలనుకోం, కాబట్టి ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘నేను దేవుని వాక్యంలో ఏదైనా విషయం చదివినప్పుడు, దాన్ని పాటించకుండా ఉండడానికి సాకులు వెతుకుతానా? నేను చేసేది అంత పెద్ద తప్పు కాదులే అనుకుంటానా? నా తప్పును వేరేవాళ్ల మీదికి నెట్టేస్తానా?’ వీటిలో ఏ ప్రశ్నకైనా మన జవాబు అవును అయితే మన ఆలోచనల్లో, వైఖరిలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, మన హృదయంలో గర్వం పెరిగిపోతుంది, యెహోవా మనల్ని తన స్నేహితునిగా తిరస్కరిస్తాడు.—యాకో. 4:6.

6. సౌలు రాజుకు, దావీదు రాజుకు ఉన్న తేడా వివరించండి.

6 సౌలు రాజుకు, ఆయన తర్వాతి రాజైన దావీదుకు ఉన్న తేడా గమనించండి. దావీదు “యెహోవా ధర్మశాస్త్రాన్ని” ప్రేమించాడు. (కీర్త. 1:1-3) యెహోవా వినయస్థుల్ని రక్షిస్తాడని, గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడని దావీదుకు తెలుసు. (2 సమూ. 22:28) అందుకే, దేవుని ధర్మశాస్త్రం తన ఆలోచనల్ని మలిచేందుకు దావీదు అనుమతించాడు. ఆయన ఇలా రాశాడు: “నాకు సలహా ఇచ్చిన యెహోవాను నేను స్తుతిస్తాను. రాత్రివేళ కూడా నా అంతరంగం నన్ను సరిదిద్దుతుంది.”—కీర్త. 16:7.

దేవుని వాక్యం

జీవానికి నడిపించే దారి నుండి పక్కకు మళ్లితే, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వినయం ఉంటే, దేవుని వాక్యం మన ఆలోచనల్ని సరిదిద్దేలా అనుమతిస్తాం (7వ పేరా చూడండి)

7. మనకు వినయం ఉంటే ఏం చేస్తాం?

7 మనకు వినయం ఉంటే, మన ఆలోచనలు చెడ్డ పనులకు దారితీయక ముందే దేవుని వాక్యం సహాయంతో వాటిని సరిచేసుకుంటాం. దేవుని వాక్యం, “ఇదే దారి. ఇందులో నడువు” అని మనకు చెప్తుంది. ఆ దారి నుండి కుడికి గానీ ఎడమకు గానీ తిరిగితే, అది మనల్ని హెచ్చరిస్తుంది. (యెష. 30:21) యెహోవా చెప్పేది వింటే మనం ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందుతాం. (యెష. 48:17) ఉదాహరణకు, వేరేవాళ్లు మనల్ని సరిదిద్దాల్సి వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటాం. అంతేకాదు, ప్రేమగల తండ్రిలా మనల్ని చూసుకుంటున్న యెహోవాకు మరింత దగ్గరౌతాం.—హెబ్రీ. 12:7.

8. యాకోబు 1:22-25 ప్రకారం, దేవుని వాక్యాన్ని అద్దంలా ఎలా ఉపయోగించవచ్చు?

8 దేవుని వాక్యం అద్దంలా పని చేస్తుంది. (యాకోబు 1:22-25 చదవండి.) మనలో చాలామందిమి రోజూ ఉదయం బయటికి వెళ్లేముందు అద్దంలో చూసుకుంటాం. దానివల్ల, మనం ఏదైనా సరిచేసుకోవాల్సి ఉంటే, వేరేవాళ్లు చెప్పకముందే అది మనకు తెలుస్తుంది. అదేవిధంగా, రోజూ బైబిలు చదివితే మన ఆలోచనల్లో, వైఖరిలో ఏయే మార్పులు చేసుకోవాలో తెలుస్తుంది. రోజూ ఉదయం బయటికి వెళ్లేముందు దినవచనం చదవడం ప్రయోజనకరంగా ఉందని చాలామంది గమనించారు. చదివిన విషయాలు తమ ఆలోచనల్ని మలిచేందుకు వాళ్లు అనుమతిస్తారు. అంతేకాదు, రోజంతా దేవుని వాక్యంలోని సలహాను పాటించే అవకాశాల కోసం చూస్తారు. దానితోపాటు, రోజూ దేవుని వాక్యాన్ని చదివే, ధ్యానించే అలవాటు మనకు ఉండాలి. అది చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ, జీవానికి నడిపించే దారిలో కొనసాగేలా మనకు సహాయం చేసే అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో అదొకటి.

పరిణతిగల స్నేహితులు చెప్పేది వినండి

పరిణతిగల స్నేహితులు

పరిణతిగల తోటి క్రైస్తవుడు మనల్ని దయగా హెచ్చరించవచ్చు. అలాంటప్పుడు, మన స్నేహితుడు ధైర్యం చేసి మనతో మాట్లాడినందుకు కృతజ్ఞతతో ఉందాం (9వ పేరా చూడండి)

9. ఒక స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడు సరిదిద్దాల్సి రావచ్చు?

9 మీరెప్పుడైనా యెహోవాకు నచ్చని తప్పుడు దారిలో అడుగులు వేయడం మొదలుపెట్టారా? (కీర్త. 73:2, 3) ఆ సమయంలో పరిణతిగల ఒక స్నేహితుడు ధైర్యం చేసి మిమ్మల్ని సరిదిద్దాడా? మీరు అతని సలహా విని పాటించారా? అయితే మీరు మంచి పని చేశారు. మీ స్నేహితుడు మిమ్మల్ని హెచ్చరించినందుకు మీరు కృతజ్ఞతతో ఉండివుంటారు.—సామె. 1:5.

10. మీ స్నేహితుడు మిమ్మల్ని సరిదిద్దితే మీరెలా స్పందించాలి?

10 బైబిలు ఇలా చెప్తుంది: “స్నేహితుడు చేసే గాయాలు నమ్మకమైనవి.” (సామె. 27:6) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఈ ఉదాహరణ పరిశీలించండి: మీరు రద్దీగా ఉన్న రోడ్డు దాటబోతున్నారు, ఇంతలో మీ ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది. మీరు అది చూసుకుంటూ, అటుగా వస్తున్న కారును గమనించుకోకుండా రోడ్డు దాటబోయారు. సరిగ్గా అప్పుడే మీ స్నేహితుడు మీ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు. ఆయన గట్టిగా లాగడం వల్ల మీ చేతికి గాయమైంది. కానీ ఆయన వెంటనే లాగకపోయుంటే కారు మిమ్మల్ని గుద్దేసేది. మీ చేతికి అయిన గాయం మిమ్మల్ని చాలా రోజులు బాధపెట్టవచ్చు, అంతమాత్రాన మీ స్నేహితుడు లాగినందుకు మీరు నొచ్చుకుంటారా? నొచ్చుకోరు! నిజానికి, ఆయన చేసిన సహాయానికి మీరు కృతజ్ఞతతో ఉంటారు. అదేవిధంగా, మీ మాటలు లేదా పనులు దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా లేవని మీ స్నేహితుడు హెచ్చరిస్తే, మొదట్లో మీకు కాస్త బాధగా అనిపించవచ్చు. అయితే ఆయన సలహా ఇచ్చినందుకు కోపం తెచ్చుకోకండి లేదా నొచ్చుకోకండి. అలా చేయడం తెలివితక్కువ పని. (ప్రసం. 7:9) మీ స్నేహితుడు ధైర్యం చేసి మీతో మాట్లాడినందుకు కృతజ్ఞతతో ఉండండి.

11. స్నేహితుడు ఇచ్చే మంచి సలహాను వినకుండా ఏది అడ్డుకుంటుంది?

11 స్నేహితుడు ప్రేమతో ఇచ్చే మంచి సలహాను వినకుండా గర్వం అడ్డుపడుతుంది. గర్విష్ఠులు “సత్యాన్ని వినడం మానేసి,” “తమకు నచ్చేవాటిని చెప్పే” వాళ్లవైపు తిరుగుతారు. (2 తిమో. 4:3, 4) వాళ్లు తమ అభిప్రాయమే సరైనదని, తామే గొప్పవాళ్లమని అనుకుంటారు. కానీ, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఒక వ్యక్తి ఏమీ కాకపోయినా తాను గొప్పవాణ్ణని అనుకుంటే, అతను తనను తాను మోసం చేసుకుంటున్నాడు.” (గల. 6:3) సొలొమోను రాజు ఇలా రాశాడు: “హెచ్చరికల్ని ఇక ఏమాత్రం పట్టించుకోని మూర్ఖుడైన ముసలి రాజుకన్నా, పేదవాడే అయినా తెలివిగల పిల్లవాడు నయం.”—ప్రసం. 4:13.

12. గలతీయులు 2:11-14 ప్రకారం, అపొస్తలుడైన పేతురు మనకు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

12 అపొస్తలుడైన పౌలు అందరిముందు అపొస్తలుడైన పేతురును సరిదిద్దినప్పుడు ఏం జరిగిందో గమనించండి. (గలతీయులు 2:11-14 చదవండి.) పౌలు సలహా ఇచ్చిన తీరు నచ్చలేదని, అందరిముందు సలహా ఇవ్వడం బాలేదని సాకులు చెప్తూ పేతురు కోపం పెంచుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పేతురు పౌలు మీద కోపం పెంచుకునే బదులు ఆయన ఇచ్చిన సలహాను స్వీకరించాడు. అంతేకాదు, ఆ తర్వాత పౌలును “ప్రియ సహోదరుడు” అని పిలిచాడు.—2 పేతు. 3:15.

13. సలహా ఇస్తున్నప్పుడు మనం ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి?

13 మీ స్నేహితునికి సలహా ఇవ్వాలని మీకెప్పుడైనా అనిపిస్తే, ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి? మీ స్నేహితునితో మాట్లాడేముందు, ‘నేను “అతి నీతిమంతునిగా” ఉంటున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ప్రసం. 7:16) అతి నీతిమంతునిగా ఉండే వ్యక్తి యెహోవా ప్రమాణాల్ని బట్టి కాదుగానీ, తన సొంత ప్రమాణాల్ని బట్టి ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తాడు. సాధారణంగా అలాంటి వ్యక్తి ఇతరుల మీద కరుణ చూపించడు. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్న తర్వాత కూడా మీ స్నేహితుణ్ణి సరిదిద్దాలని మీకు అనిపిస్తుందా? అయితే అతనిలో ఉన్న సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి, నేర్పుగా ప్రశ్నల్ని ఉపయోగిస్తూ తన తప్పు తెలుసుకునేలా సహాయం చేయండి. మీరు చెప్పే విషయాలు బైబిలు మీద ఆధారపడి ఉండేలా చూసుకోండి, మీ స్నేహితుడు మీకు కాదుగానీ యెహోవాకు లెక్క అప్పజెప్పాలని గుర్తుంచుకోండి. (రోమా. 14:10) దేవుని వాక్యంలో ఉన్న తెలివి మీద ఆధారపడండి, సలహా ఇస్తున్నప్పుడు యేసులా కనికరం చూపించండి. (సామె. 3:5; మత్త. 12:20) ఎందుకంటే, మీరు వేరేవాళ్లతో ఎలా వ్యవహరిస్తారో యెహోవా కూడా మీతో అలాగే వ్యవహరిస్తాడు.—యాకో. 2:13.

దేవుని సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని పాటించండి

దేవుని సంస్థ

ప్రచురణలు, వీడియోలు, మీటింగ్స్‌ ద్వారా దేవుని వాక్యంలో ఉన్న సలహాల్ని పాటించేలా సంస్థ మనకు సహాయం చేస్తోంది. అప్పుడప్పుడు, పరిపాలక సభ మన పనికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేస్తుంది (14వ పేరా చూడండి)

14. దేవుని సంస్థ మనకు ఏ విధంగా సహాయం చేస్తుంది?

14 జీవానికి నడిపించే దారిలో వెళ్తున్న మనల్ని యెహోవా తన సంస్థలోని భూభాగం ద్వారా నిర్దేశిస్తున్నాడు. వీడియోలు, ప్రచురణలు, మీటింగ్స్‌ ద్వారా దేవుని వాక్యంలో ఉన్న సలహాల్ని పాటించేలా ఆయన సంస్థ మనందరికీ సహాయం చేస్తోంది. వాటిలోని సమాచారమంతా లేఖనాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకటనా పనికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పరిపాలక సభ పవిత్రశక్తి మీద ఆధారపడుతుంది. అయినప్పటికీ, ఆ నిర్ణయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని పరిపాలక సభ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటుంది. ఎందుకు? “ఈ లోకం తీరుతెన్నులు మారుతున్నాయి” కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు దేవుని సంస్థ నిర్దేశాలు ఇస్తుంది.—1 కొరిం. 7:31.

15. కొంతమంది ప్రచారకులు ఏ సవాలును ఎదుర్కొన్నారు?

15 దేవుని సంస్థ లేఖన అవగాహనలో ఏదైనా మార్పు తెలియజేసినప్పుడు, లేదా నైతిక విషయాల్లో నిర్దేశం ఇచ్చినప్పుడు మనం వెంటనే అంగీకరిస్తాం. కానీ, మన జీవితంలో వేరే విషయాల్ని ప్రభావితం చేసే నిర్దేశాన్ని ఇచ్చినప్పుడు ఎలా స్పందిస్తాం? ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో ఆరాధనా స్థలాల్ని నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి చాలా ఖర్చు అవుతోంది. అందుకే, ఒక రాజ్యమందిరాన్ని వీలైనన్ని ఎక్కువ సంఘాలు ఉపయోగించాలని పరిపాలక సభ నిర్దేశించింది. ఈ మార్పు వల్ల కొన్ని సంఘాల్ని కలిపేశారు, కొన్ని రాజ్యమందిరాల్ని అమ్మేశారు. అలా ఆదా చేసిన డబ్బును, రాజ్యమందిరాల అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో వాటిని నిర్మించడానికి ఉపయోగిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా రాజ్యమందిరాల్ని అమ్మేశారా? సంఘాల్ని కలిపేశారా? అయితే, కొత్త పరిస్థితులకు అలవాటు పడడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఈ మార్పు వల్ల కొంతమంది ప్రచారకులు మీటింగ్స్‌కి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. రాజ్యమందిరాన్ని నిర్మించడంలో లేదా మరమ్మతులు చేయడంలో కష్టపడి పనిచేసిన సహోదర సహోదరీలకు, దీన్ని ఎందుకు అమ్మేస్తున్నారా అని అనిపించవచ్చు. తమ సమయం, కష్టం వృథా అయిపోయాయని కూడా అనిపించవచ్చు. అయినప్పటికీ సహోదర సహోదరీలు ఈ కొత్త ఏర్పాటుకు సహకరిస్తున్నారు. కాబట్టి మనం వాళ్లను మెచ్చుకోవాలి.

16. కొలొస్సయులు 3:23, 24 లో ఉన్న సలహాను పాటించడం ద్వారా మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

16 మనం యెహోవా కోసం పని చేస్తున్నామని, ఆయనే తన సంస్థను నడిపిస్తున్నాడని గుర్తుంచుకుంటే మన ఆనందాన్ని కోల్పోకుండా ఉంటాం. (కొలొస్సయులు 3:23, 24 చదవండి.) ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇస్తున్నప్పుడు దావీదు రాజు మంచి స్ఫూర్తిని చూపించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇలా స్వేచ్ఛార్పణలు ఇవ్వడానికి నేను ఎంతటివాణ్ణి? నా ప్రజలు ఎంతటివాళ్లు? ఎందుకంటే అన్నీ నీ నుండే వచ్చాయి; నీ చేతి నుండి వచ్చిన వాటినే మేము నీకు ఇచ్చాం.” (1 దిన. 29:14) విరాళాలు ఇస్తున్నప్పుడు, మనం కూడా యెహోవా చేతి నుండి వచ్చిన వాటినే ఆయనకు తిరిగి ఇస్తున్నాం. అయినప్పటికీ తన పని కోసం మన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉపయోగించినప్పుడు యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—2 కొరిం. 9:7.

ఇరుకు దారిలోనే కొనసాగండి

17. మీరు ఏదైనా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే, ఎందుకు నిరుత్సాహపడకూడదు?

17 ఇరుకు దారిలో కొనసాగాలంటే, మనందరం నమ్మకంగా యేసు అడుగుజాడల్లో నడవాలి. (1 పేతు. 2:21) మీ అడుగుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే, నిరుత్సాహపడకండి. అలా గుర్తించడం మంచి విషయమే, ఎందుకంటే మీరు యెహోవా నిర్దేశానికి స్పందిస్తున్నారని అది చూపిస్తుంది. అపరిపూర్ణులమైన మనం యేసును పరిపూర్ణంగా అనుకరించాలని యెహోవా కోరుకోడు అని గుర్తుంచుకోండి.

18. గమ్యాన్ని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి?

18 మనందరం భవిష్యత్తు మీద మనసుపెడదాం. మన ఆలోచనల్లో, వైఖరిలో, పనుల్లో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. (సామె. 4:25; లూకా 9:62) వినయంగా ఉంటూ ‘సంతోషిస్తూ ఉందాం, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉందాం.’ (2 కొరిం. 13:11) అలా చేస్తే ‘ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు మనకు తోడుంటాడు.’ అంతేకాదు మన ప్రయాణం సంతోషంగా సాగుతుంది, మన గమ్యాన్ని చేరుకుంటాం.

పాట 34 యథార్థంగా జీవించడం

^ పేరా 5 తమ ఆలోచనల్లో, వైఖరిలో, పనుల్లో మార్పులు చేసుకోవడం కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. మనందరం ఎందుకు మార్పులు చేసుకోవాలో, మార్పులు చేసుకుంటున్నప్పుడు ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

^ పేరా 76 చిత్రాల వివరణ: తాను తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందో యువ సహోదరుడు చెప్తున్నాడు, వయసులో అతనికన్నా పెద్దవాడైన (కుడి వైపున్న) సహోదరుడు అతనికి సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి మౌనంగా వింటున్నాడు.