కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

“యెహోవా నన్ను గుర్తుంచుకున్నాడు”

“యెహోవా నన్ను గుర్తుంచుకున్నాడు”

దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో ఉన్న ఓరియల అనే గ్రామంలో నేను పుట్టాను. మా ఊరిలో దాదాపు 2,000 మంది ఉంటారు. మాది ఒక మారుమూల ప్రాంతం, ఒక చిన్న విమానంలో లేదా పడవలో మాత్రమే ఇక్కడికి రాగలరు.

నేను 1983 లో పుట్టాను. చిన్నప్పుడు నేను మిగతా పిల్లల్లాగే ఆరోగ్యంగా ఉన్నాను. కానీ పదేళ్ల వయసులో నాకు ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు మొదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత, ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచినప్పుడు నేను కదల్లేకపోయాను. ఎంత ప్రయత్నించినా కాళ్లు తీసి కింద పెట్టలేకపోయాను. ఆరోజు నుండి నా జీవితంలో నడక అనేది దూరమైపోయింది. అంతేకాదు అనారోగ్యం వల్ల నా ఎదుగుదల కూడా ఆగిపోయింది. ఈరోజుకి కూడా నేను పిల్లవాడిలానే కనిపిస్తాను.

కొన్ని నెలలపాటు నేను ఇంటికే పరిమితమైపోయాను. ఒకరోజు ఇద్దరు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. సాధారణంగా ఎవరైనా మా ఇంటికి వస్తే నేను దాక్కుంటాను, కానీ ఆరోజు ఆ ఇద్దరు స్త్రీలు చెప్పింది విన్నాను. వాళ్లు పరదైసు గురించి చెప్తున్నప్పుడు, దాదాపు నా ఐదేళ్ల వయసులో జరిగిన విషయాలు గుర్తొచ్చాయి. అప్పట్లో సురినామ్‌ నుండి జెత్రో అనే మిషనరీ నెలకు ఒకసారి మా ఊరికి వచ్చి మా నాన్నకు స్టడీ ఇచ్చేవాడు. జెత్రో నాతో చాలా ప్రేమగా ఉండేవాడు, ఆయనంటే నాకు ఇష్టం. అంతేకాదు, నానమ్మ తాతయ్యలు మా ఊరిలో జరిగిన కొన్ని యెహోవాసాక్షుల మీటింగ్స్‌కి నన్ను తీసుకెళ్లారు. అందుకే మా ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరైన ఫ్లోరెన్స్‌, ‘ఎక్కువ విషయాలు తెలుసుకోవడం ఇష్టమేనా?’ అని అడిగినప్పుడు ‘ఇష్టమే’ అన్నాను.

ఫ్లోరెన్స్‌ తన భర్త జస్టస్‌ను తీసుకుని మా ఇంటికి వచ్చింది. వాళ్లు నాతో బైబిలు స్టడీ మొదలుపెట్టారు. నాకు చదువు రాదని తెలిసినప్పుడు వాళ్లు నాకు చదవడం నేర్పించారు. కొంతకాలానికే నా అంతట నేను చదవగలిగాను. అయితే వాళ్లను సురినామ్‌లో సేవ చేయడానికి పంపిస్తున్నారని ఒకరోజు నాకు చెప్పారు. నాకు స్టడీ ఇవ్వడానికి మా ఊరిలో ఇంకెవరూ లేరు అని బాధపడ్డాను. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, యెహోవా నన్ను గుర్తుంచుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఫ్లాయిడ్‌ అనే పయినీరు సహోదరుడు మా ఊరికి వచ్చాడు. ఆయన ఇంటింటి పరిచర్య చేస్తూ నన్ను కలిశాడు. ఆయన నాకు బైబిలు స్టడీ ఇస్తానని చెప్పినప్పుడు నేను నవ్వాను. “మీరెందుకు నవ్వుతున్నారు?” అని ఆయన అడిగాడు. అప్పుడు, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషురుతో నాకు స్టడీ అయిపోయిందని, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము * పుస్తకంలో కొన్ని అధ్యాయాలు అయ్యాయని చెప్పాను. స్టడీ ఎందుకు ఆగిపోయిందో కూడా వివరించాను. ఫ్లాయిడ్‌ నా స్టడీ కొనసాగించి, జ్ఞానము పుస్తకం పూర్తి చేశాడు. కానీ ఆయన్ని కూడా వేరేచోట సేవ చేయడానికి పంపించారు. మళ్లీ నాకు స్టడీ ఇవ్వడానికి ఎవ్వరూ లేకుండా పోయారు.

అయితే 2004 లో గ్రాన్‌విల్‌, జాషువ అనే ఇద్దరు ప్రత్యేక పయినీర్లు మా ఊరికి నియమించబడ్డారు. వాళ్లు ఇంటింటి పరిచర్య చేస్తూ నన్ను కలిశారు. స్టడీ తీసుకోవడం ఇష్టమేనా అని వాళ్లు అడిగినప్పుడు నవ్వాను. జ్ఞానము పుస్తకంలో మొదటి నుండి స్టడీ ఇవ్వమని అడిగాను. ఎందుకంటే, వీళ్లు ఇదివరకు స్టడీ ఇచ్చినవాళ్లు చెప్పినవే చెప్తారో లేక వేరే విషయాలు చెప్తారో తెలుసుకోవాలనుకున్నాను. మా ఊరిలో మీటింగ్స్‌ జరుగుతున్నాయి అని గ్రాన్‌విల్‌ నాకు చెప్పాడు. నేను ఇల్లు దాటి దాదాపు పదేళ్లు అయినా, మీటింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కాబట్టి గ్రాన్‌విల్‌ మా ఇంటికి వచ్చి, నన్ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి రాజ్యమందిరానికి తీసుకెళ్లాడు.

తర్వాత కొన్ని రోజులకు, దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరమని గ్రాన్‌విల్‌ నన్ను ప్రోత్సహించాడు. ఆయన ఇలా అన్నాడు: “నువ్వు నడవలేకపోవచ్చు, కానీ మాట్లాడగలవు కదా. నువ్వు ఏదోక రోజు తప్పకుండా బహిరంగ ప్రసంగం ఇస్తావు.” ఆ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి.

నేను గ్రాన్‌విల్‌తో కలిసి ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టాను. అయితే ఎత్తుపల్లాలు ఉండే మా ఊరి రోడ్లమీద చక్రాల కుర్చీలో నన్ను తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. కాబట్టి తోపుడు బండి అయితే కాస్త సులభంగా ఉంటుందని గ్రాన్‌విల్‌కు చెప్పాను. గ్రాన్‌విల్‌ అలాగే చేశాడు, ఆ ఆలోచన బాగా పనిచేసింది. 2005, ఏప్రిల్‌లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. తర్వాత రాజ్యమందిరంలో లిటరేచర్‌, సౌండ్‌ సిస్టమ్‌ చూసుకునేలా సహోదరులు నాకు శిక్షణ ఇచ్చారు.

విచారకరంగా, 2007 లో ఒక పడవ ప్రమాదంలో మా నాన్న చనిపోయాడు. మా కుటుంబమంతా బాధలో మునిగిపోయింది. అప్పుడు గ్రాన్‌విల్‌ మాతో కలిసి ప్రార్థన చేశాడు, బైబిల్లోని ఓదార్పుకరమైన లేఖనాల్ని చూపించాడు. రెండేళ్ల తర్వాత మరో విషాదం మమ్మల్ని కలచివేసింది. సహోదరుడు గ్రాన్‌విల్‌ పడవ ప్రమాదంలో చనిపోయాడు.

దుఃఖంలో మునిగిపోయిన మా చిన్న సంఘాన్ని చూసుకోవడానికి ఇప్పుడు పెద్దలు లేరు, ఒక్క సంఘ పరిచారకుడు మాత్రమే ఉన్నాడు. గ్రాన్‌విల్‌ మరణం నన్ను చాలా బాధపెట్టింది, నేను ఎంతో ప్రేమించిన స్నేహితుడు ఇప్పుడు లేడు. ఆయన నా ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలు చూసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన మీటింగ్‌లో, నాకు కావలికోట పేరాలు చదివే నియామకం ఉంది. నేను మొదటి రెండు పేరాలు బానే చదవగలిగాను కానీ తర్వాత, ఏడ్పు ఆపుకోలేక మధ్యలోనే స్టేజీ మీద నుండి వచ్చేశాను.

వేరే సంఘంలోని సహోదరులు మా సంఘానికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు సంతోషంగా అనిపించింది. అంతేకాదు బ్రాంచి కార్యాలయం కోజో అనే ప్రత్యేక పయినీరును కూడా మా సంఘానికి నియమించింది. మా అమ్మ, తమ్ముడు స్టడీ తీసుకుని బాప్తిస్మం పొందినప్పుడు చాలా సంతోషించాను. తర్వాత 2015, మార్చిలో నేను సంఘ పరిచారకునిగా నియమించబడ్డాను. కొన్ని రోజుల తర్వాత నా మొట్టమొదటి బహిరంగ ప్రసంగం ఇచ్చాను. అప్పుడు, “నువ్వు ఏదోక రోజు తప్పకుండా బహిరంగ ప్రసంగం ఇస్తావు” అని గ్రాన్‌విల్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చి సంతోషంతో, బాధతో ఏడ్చేశాను.

JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాల ద్వారా, నాలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్న సహోదర సహోదరీల గురించి తెలుసుకున్నాను. వైకల్యం ఉన్నా వాళ్లు యెహోవా సేవను ఎక్కువగా చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి నేను కూడా ఏదోకటి చేయగలను. నాకున్న ఈ కాస్త బలాన్ని యెహోవా కోసం ఉపయోగించాలన్న కోరికతో పయినీరు సేవ మొదలుపెట్టాను. 2019, సెప్టెంబరులో నేను ఊహించనిది జరిగింది! దాదాపు 40 మంది ప్రచారకులు ఉన్న మా సంఘంలో నేను సంఘ పెద్దగా నియమించబడ్డాను.

నాకు స్టడీ ఇచ్చి యెహోవాను సేవించేలా సహాయం చేసిన ప్రియ సహోదర సహోదరీలకు నేను కృతజ్ఞుణ్ణి. మరిముఖ్యంగా నన్ను గుర్తుంచుకున్న యెహోవాకు ఎంతో కృతజ్ఞుణ్ణి.

^ పేరా 8 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.