కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

అర్థవంతమైన జీవితం కోసం నేను వెతికాను

అర్థవంతమైన జీవితం కోసం నేను వెతికాను

మధ్యధరా సముద్రంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు నా పాత పడవకు రంధ్రం పడి, లోపలికి బాగా నీళ్లు రావడం మొదలైంది. అది చూసి నేను అవాక్కయ్యాను. అప్పుడే ఒక తుఫాను కూడా మొదలైంది. నాకు భయమేసి చాలా సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రార్థించాను. ఆ రోజు నేను ఆ పడవలో ఎందుకు ఉన్నానో చెప్తాను. అలాగే నా జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకుంటాను.

నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు నేను, మా కుటుంబం బ్రెజిల్‌లో ఉండేవాళ్లం

నేను 1948లో నెదర్లాండ్స్‌లో పుట్టాను. ఆ తర్వాతి సంవత్సరం మా కుటుంబం, బ్రెజిల్‌లో ఉన్న సావో పౌలోకు తరలివెళ్లింది. మా తల్లిదండ్రులు క్రమంగా చర్చికి వెళ్లేవాళ్లు. అలాగే దాదాపు ప్రతీ రాత్రి భోజనం తర్వాత కుటుంబంగా బైబిలు చదివేవాళ్లం. 1959లో బ్రెజిల్‌ నుండి అమెరికాకు వెళ్లాం. అక్కడ మసాచుసెట్స్‌ అనే రాష్ట్రంలో స్థిరపడ్డాం.

ఎనిమిదిమంది ఉన్న మా కుటుంబాన్ని పోషించడానికి నాన్న కష్టపడి పనిచేసేవాడు. ఆయన ఒక సేల్స్‌మ్యాన్‌గా, రోడ్డు నిర్మాణ కార్మికుడిగా అలాగే ఒక అంతర్జాతీయ విమాన కంపెనీలో పనిచేశాడు. మా నాన్నకు విమాన సంస్థలో ఉద్యోగం వచ్చినప్పుడు మేం వేర్వేరు ప్రాంతాలకు తిరగొచ్చని సంతోషించాం.

హైస్కూల్లో ఉన్నప్పుడు, ‘నేను పెద్దయ్యాక ఏం చేయాలి?’ అని తరచూ ఆలోచించేవాణ్ణి. నా స్నేహితుల్లో కొంతమంది యూనివర్సిటీలో చేరాలని, ఇంకొంతమంది మిలిటరీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మిలిటరీలో చేరాలనుకోలేదు. ఎందుకంటే ఇతరులతో గొడవపడడం, పోట్లాడడం నాకిష్టం ఉండదు. ఆ కారణం వల్ల నేను యూనివర్సిటీలో చేరాలని నిర్ణయించుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయాలని కోరుకున్నాను. అలా చేస్తే నా జీవితానికి ఒక అర్థం ఉంటుందని అనుకున్నాను.

యూనివర్సిటీలో నా జీవితం

జీవితానికున్న అర్థాన్ని తెలుసుకోవడానికి నేను చాలా సంవత్సరాలు ప్రయత్నించాను

జీవం ఉనికిలోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కోరిక నాకు ఉండేది, కాబట్టి యూనివర్సిటీలో మానవ శాస్త్రం (ఆంత్రోపాలజీ) ఆసక్తిగా అనిపించింది. ప్రొఫెసర్లు మాకు పరిణామ సిద్ధాంతం గురించి బోధించి అదే నిజమని నమ్మమనేవాళ్లు. కానీ వాళ్లిచ్చిన కొన్ని వివరణలు నాకంత అర్థవంతంగా అనిపించకపోయినా గుడ్డిగా నమ్మాల్సి వచ్చింది.

మాకు యూనివర్సిటీలో మంచేదో చెడేదో నేర్పించేవాళ్లు కాదు. బదులుగా ఏం చేసైనా సరే మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పేవాళ్లు. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లినప్పుడు, అక్కడ డ్రగ్స్‌ తీసుకున్నప్పుడు సంతోషంగా అనిపించేది. కానీ ఆ తర్వాత సంతోషం ఉండేది కాదు. అప్పుడు నేను ఇలా ఆలోచించేవాణ్ణి, ‘నా జీవితం నిజంగా అర్థవంతంగా ఉందా?’

కొంతకాలానికి, నేను బోస్టన్‌ నగరానికి వెళ్లి అక్కడ ఒక యూనివర్సిటీలో చేరాను. సెలవుల్లో నేను ఉద్యోగం చేసేవాణ్ణి. అక్కడే మొదటిసారి ఒక యెహోవాసాక్షిని కలిశాను. అతను నాతో దానియేలు 4వ అధ్యాయంలో ఉన్న “ఏడు కాలాలు” ప్రవచనం గురించి మాట్లాడి, మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామని వివరించాడు. (దాని. 4:13-17) అతను చెప్పేవి విని, వాటిని నమ్మడం మొదలుపెడితే నేను నా జీవితంలో మార్పులు చేసుకోవాల్సి వస్తుందని భయపడ్డాను. కాబట్టి సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాను.

దక్షిణ అమెరికా వెళ్లి వాలంటరీ సేవ చేయడానికి యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నాను. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం వల్ల నా జీవితానికి ఒక అర్థం వస్తుందని అనుకున్నాను. కానీ దానివల్ల కూడా ఏ ఉపయోగం లేదని అనిపించింది. దాంతో నిరాశపడి నా చదువు పూర్తవకుండానే యూనివర్సిటీకి వెళ్లడం ఆపేశాను.

జీవితానికున్న అర్థం గురించి వేర్వేరు దేశాల్లో వెతికాను

1970 మే నెలలో మా నాన్న పనిచేసిన విమాన సంస్థలోనే పనిచేయడానికి నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లాను. ఆ ఉద్యోగం వల్ల నేను ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్‌ అలాగే ఆసియాలోని దేశాలకు వెళ్లగలిగాను. నేను ఏ దేశానికి వెళ్లినా అక్కడున్న వాళ్లందరికీ పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం వాళ్లవల్ల కావట్లేదని నాకర్థమైంది. అవన్నీ చూశాక కూడా, జీవితంలో ఏదో సాధించాలని నాకింకా అనిపించింది. అందుకే అమెరికాకు తిరిగెళ్లి బోస్టన్‌ యూనివర్సిటీలో మళ్లీ చదవాలని నిర్ణయించుకున్నాను.

జీవానికి సంబంధించి నాకున్న ప్రశ్నలకు యూనివర్సిటీలో నేర్చుకుంటున్న విషయాలు జవాబు ఇవ్వట్లేదని కొన్నిరోజులకే నాకర్థమైంది. నాకేం చేయాలో తెలియక మా ప్రొఫెసర్‌ని సలహా అడిగాను. ఆయన నాతో, “నువ్వు ఇంకా ఎందుకు చదువుతున్నావు? ఆపేయోచ్చు కదా!” అని అన్నాడు. ఆయన మాటలకు నేను ఆశ్చర్యపోయాను, ఆ వెంటనే యూనివర్సిటీకి వెళ్లడం ఆపేశాను.

యూనివర్సిటీని విడిచిపెట్టినా నా జీవితానికి అర్థం దొరకలేదు అనిపించింది. కాబట్టి ఒక గుంపుతో కలిశాను. ఆ గుంపులోని వాళ్లు సామాజిక కట్టుబాట్లను తిరస్కరించి శాంతిని, ప్రేమను వృద్ధిచేసేలా కనిపించారు. ఆ తర్వాత నా స్నేహితులతో పాటు అమెరికా మొత్తం ప్రయాణిస్తూ మెక్సికోలోని ఆకాపూల్కో దాకా వెళ్లాను. అప్పుడు మేము హిప్పీలతో కలిసి జీవించాం. ఆ హిప్పీలు ఎలాంటి సమస్యలు, ఆందోళనలు లేనట్టు ఉండేవాళ్లు. కానీ, వాళ్లు జీవించే విధానంలో అర్థంలేదని, నిజమైన సంతోషం రాదని కొంతకాలానికే తెలుసుకన్నాను. అంతేకాదు వాళ్లలో చాలామంది నిజాయితీ గలవాళ్లు, నమ్మకస్థులు కాదని గమనించాను.

పెద్ద పడవలో ప్రయాణిస్తూ జీవితానికున్న అర్థాన్ని వెతికాను

ఒక అందమైన ద్వీపాన్ని కనుగొనడానికి నేను, నా స్నేహితుడు ప్రయత్నించాం

ఈలోపు నా చిన్ననాటి కల గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టాను. నేను ఒక నావికుడిగా కాకుండా ఓడను నడిపే కెప్టెన్‌గా సముద్ర ప్రయాణం చేయాలనుకున్నాను. దానికి నాకున్న ఒకేఒక్క దారి సొంత పడవ ఉండడం. నా స్నేహితుల్లో ఒకడైన టామ్‌కి కూడా నాలాంటి కోరికే ఉండడంతో మేమిద్దరం కలిసి ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్నాం. సమాజంలోని నియమాలకు దూరంగా ఉండడానికి ఒక అందమైన ద్వీపాన్ని కనుగొనాలని అనుకున్నాం.

నేను, టామ్‌ స్పెయిన్‌లోని బార్సిలోనాకు దగ్గర్లో ఉన్న అరేనీస్‌-డి-మార్‌ వెళ్లాం. అక్కడ మేము 31 అడుగుల పొడవున్న లిగ్రా అనే పడవను కొన్నాం. సముద్రంలో సురక్షితంగా ప్రయాణించగలిగేలా ఆ పడవకి కొన్ని మార్పులు చేశాం. ద్వీపాన్ని కనుగొనడంలో మాకంత తొందరేమి లేదు కాబట్టి మా పడవ ఇంజన్‌ని బయటికి తీసి, మంచినీటిని నిల్వ చేయడానికి ఆ స్థలాన్ని ఉపయోగించాం. చిన్న ఓడరేవుల్లోకి మా పడవ వెళ్లేలా, రెండు 16 అడుగుల తెడ్లను బిగించాం. చివరికి హిందూ మహా సముద్రంలో ఉన్న సేషెల్స్‌కు మా ప్రయాణం మొదలుపెట్టాం. అక్కడికి చేరడానికి ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా, దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ మీదుగా వెళ్లాలనుకున్నాం. మేము నక్షత్రాల్ని చూస్తూ, కొన్ని మ్యాపుల్ని, పుస్తకాల్ని అలాగే చిన్నచిన్న పరికరాల్ని ఉపయోగించి సరైన దిశలో ప్రయాణించాం. మేమున్న చోటును సరిగ్గా గుర్తించేలా అవి సహాయపడడం చూసి నేను ఆశ్చర్యపోయాను.

చెక్కతో చేసిన ఆ పాత పడవ సముద్రంలో ప్రయాణించడానికి పనికిరాదని మాకు కాసేపటికే అర్థమైంది. పడవకు రంధ్రం పడడం వల్ల ప్రతీ గంటకు 22 లీటర్ల నీళ్లు లోపలికి రావడం మొదలైంది. మొదట్లో చెప్పినట్టు అదే సమయంలో తుఫాను రావడం చూసి నేను భయపడ్డాను, చాలా సంవత్సరాల్లో మొట్టమొదటిసారి దేవునికి ప్రార్థించాను. ఆ గండం నుండి బయటపడితే ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాను. తుఫాను ఆగిపోవడంతో నా మాట నిలబెట్టుకున్నాను.

సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు నేను బైబిలు చదవడం మొదలుపెట్టాను. మధ్యధరా సముద్రంలో పడవలో కూర్చుని ఉన్నప్పుడు, చుట్టూ రకరకాల చేపలు ఎగరడం అలాగే దూరాన ఆకాశం, సముద్రం కలుస్తున్నట్టు కనిపించడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఊహించండి. రాత్రులు ఎన్నో నక్షత్రాల్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాను అలాగే మనుషుల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడనే నా నమ్మకం ఇంకా బలపడింది.

కొన్నివారాల తర్వాత మేము స్పెయిన్‌లోని ఆలీకాంటేలో ఉన్న ఓడరేవుకు చేరుకున్నాం. అక్కడ కొత్త పడవ కొనడానికి, మా పడవను అమ్మకానికి పెట్టాం. కానీ ఇంజన్‌ లేని, లీకౌతున్న మా పాత పడవను కొనేవాళ్లు వెంటనే దొరకలేదు. ఈలోపు బైబిలు చదవడానికి నాకు సమయం దొరికింది.

నేను బైబిల్ని ఎక్కువగా చదివేకొద్దీ, సంతోషంగా జీవించడానికి సహాయం చేసే ఎన్నో విషయాలు దానిలో ఉన్నాయని అనిపించింది. మంచి నైతిక విలువలతో పవిత్రంగా జీవించడం గురించి బైబిల్లో స్పష్టంగా చెప్పిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. అయితే నాతో సహా క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది వాటిని ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాలేదు.

మంచిగా జీవించడానికి పెద్ద మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకుని డ్రగ్స్‌ తీసుకోవడం మానేశాను. అయితే, బైబిలు సూత్రాల ప్రకారం జీవించే ప్రజలు ఉండే ఉంటారని, వాళ్లను కలవాలని అనుకున్నాను. వాళ్లను కలిసేలా సహాయం చేయమని దేవునికి రెండోసారి ప్రార్థించాను.

నిజమైన మతం కోసం వెతికాను

నిజమైన మతాన్ని కనుగొనేవరకు అన్ని మతాల్ని పరిశీలించడం సరైనదే అని నాకు అనిపించింది. ఆలీకాంటే వీధుల్లో నడుస్తున్నప్పుడు వేర్వేరు మతాలకు చెందిన ఆరాధనా స్థలాల్ని చూశాను. కానీ చాలావాటిలో విగ్రహాల్ని చూసినప్పుడు అవి నిజమైన మతానికి చెందినవని కావని నాకు అర్థమైంది.

ఒక ఆదివారం మధ్యాహ్నం ఓడరేవుకు దగ్గర్లో ఉన్న కొండ మీద కూర్చొని నేను బైబిల్లో యాకోబు 2:1-5 చదువుతున్నాను. ఆ వచనాల్లో డబ్బున్న వాళ్లపట్ల ప్రత్యేక అభిమానం చూపించడం తప్పని ఉంది. నేను తిరిగి నా పడవ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆరాధనా స్థలంలా కనిపించిన ఒక బిల్డింగ్‌ చూశాను. దాని ప్రవేశ ద్వారం పైన ఇలా రాసుంది: యెహోవాసాక్షుల రాజ్యమందిరం.

‘ఈ ప్రజలు నాతో ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం’ అని అనుకున్నాను. అందుకే నేను చెప్పులు లేకుండా, గడ్డంతో, చినిగిపోయిన జీన్స్‌ వేసుకుని రాజ్యమందిరానికి వెళ్లాను. అక్కడున్న అటెండెంటు నన్ను తీసుకెళ్లి ఒక పెద్దావిడ పక్కన కూర్చోబెట్టాడు. ప్రసంగీకుడు చెప్తున్న లేఖనాల్ని తెరవడానికి ఆమె నాకు దయగా సహాయం చేసింది. కూటం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నన్ను పలకరించడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒకాయన నాతో బైబిలు గురించి చర్చించడానికి తన ఇంటికి రమ్మన్నాడు. కానీ నేనింకా బైబిల్ని పూర్తిగా చదవలేదు కాబట్టి, “మళ్లీ చెప్తాను” అని అన్నాను. ఈలోపు కూటాలన్నిటికీ హాజరవడం మొదలుపెట్టాను.

కొన్నివారాల తర్వాత, నేను ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బైబిలు గురించి నాకున్న ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. ఒక వారం తర్వాత, నాకు వేసుకోవడానికి ఒక బ్యాగు నిండా మంచి బట్టల్ని ఇచ్చాడు. ఆ బట్టలు జైల్లో ఉన్న ఒక సహోదరుడివి అని; ఒకరినొకరు ప్రేమించుకోమని, యుద్ధం చేయడం నేర్చుకోవద్దని బైబిల్లో ఉన్న ఆజ్ఞలకు లోబడడం వల్ల అతను జైల్లో ఉన్నాడని ఆయన చెప్పాడు. (యెష. 2:4; యోహా. 13:34, 35) నేను వెదుకుతున్నది నాకు దొరికిందని అర్థమైంది. మంచి నైతిక విలువలతో పవిత్రంగా జీవించడం గురించి, బైబిల్లో స్పష్టంగా చెప్పిన విషయాల్ని పాటించే ప్రజల్ని నేను కనుగొన్నాను. ఇప్పుడు నా లక్ష్యం ఒక అందమైన ద్వీపాన్ని వెతకడం కాదుగానీ బైబిల్ని లోతుగా అర్థం చేసుకోవడమే. దానికోసం నేను నెదర్లాండ్స్‌కు తిరిగి వెళ్లాను.

ఉద్యోగం కోసం వెతకడం

నెదర్లాండ్స్‌లోని గ్రోనింగెన్‌ అనే నగరానికి చేరుకోవడానికి నాకు నాలుగు రోజులు పట్టింది. అక్కడ బతకడానికి నాకొక ఉద్యోగం అవసరమైంది. ఉద్యోగం కోసం నేను ఒక వడ్రంగి షాపుకు వెళ్లినప్పుడు వాళ్లు నాకొక ఫారం ఇచ్చారు. అందులో నా మతం గురించి అడిగినప్పుడు, నేను “యెహోవాసాక్షి” అని రాశాను. దాన్ని చదవగానే ఆ యజమాని ముఖం మారిపోయింది. ఆయన నాతో “మీకు ఫోన్‌ చేసి చెప్తాను” అని అన్నాడు కానీ చేయలేదు.

ఇంకొక వడ్రంగి షాపులో ఉద్యోగం కోసం అడిగాను. దానికి ఆ యజమాని నా చదువు గురించి, అంతకుముందు నేను చేసిన ఉద్యోగం గురించి వివరాలు అడిగాడు. నేనొక పెద్ద చెక్క పడవను రిపేరు చేశానని చెప్పాను. నేను ఊహించని విధంగా ఆయన నాతో “నువ్వు ఈరోజు మధ్యాహ్నం నుండే పనిలో చేరొచ్చు. కానీ ఒక షరతు: నేను ఒక యెహోవాసాక్షిని, నేను బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తాను కాబట్టి నా షాపులో పని చేసినంతకాలం ఏ సమస్యా తీసుకురాకూడదు” అని అన్నాడు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ, నేను కూడా ఒక యెహోవాసాక్షినే అన్నాను. నా పొడవాటి జుట్టు, గడ్డం చూసి నేను యెహోవాసాక్షిని కానని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన “నీకు బైబిలు విషయాలు నేర్పిస్తాను” అని అన్నాడు. నేను దానికి సంతోషంగా ఒప్పుకున్నాను. ఈయన దగ్గర నేను బైబిలు నేర్చుకోవాలని యెహోవా కోరుకుని ఉంటాడు. అందుకే మొదటి షాపు యజమాని నాకు ఫోన్‌ చేసి ఉండడు. యెహోవా నా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడని నాకనిపించింది. (కీర్త. 37:4) ఆ సహోదరుడి షాపులో నేను ఒక సంవత్సరం పాటు పనిచేశాను. ఆ సమయంలో ఆయన నాకు బైబిలు స్టడీ ఇచ్చాడు. ఆ తర్వాత 1974 జనవరిలో బాప్తిస్మం తీసుకున్నాను.

చివరికి అర్థవంతమైన జీవితాన్ని కనుగొన్నాను!

ఒక నెల తర్వాత పయినీరు సేవ మొదలుపెట్టాను. అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ తర్వాతి నెల ఆమ్‌స్టర్‌డామ్‌లో కొత్తగా మొదలైన స్పానిష్‌ భాషా గుంపుకు సహాయం చేయడానికి వెళ్లాను. స్పానిష్‌ అలాగే పోర్చుగీస్‌ భాషల్లో బైబిలు స్టడీలు చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. 1975, మే నెలలో ప్రత్యేక పయినీరుగా సేవచేసే అవకాశాన్ని పొందాను.

ఒక రోజు ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న క్యాథరీనా అనే సహోదరి బొలీవియాకు చెందిన తన బైబిలు విద్యార్థిని, స్పానిష్‌ మాట్లాడే సహోదర సహోదరులకు పరిచయం చేయడానికి మా కూటానికి తీసుకొచ్చింది. క్యాథరీనా, నేను ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడానికి ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెట్టాం. కొంతకాలానికి మా ఇద్దరి లక్ష్యాలు ఒకటేనని అర్థమైంది. మేము 1976లో పెళ్లి చేసుకుని, 1982 వరకు ప్రత్యేక పయినీర్లుగా సేవ చేశాం. అదే సంవత్సరంలో మా ఇద్దర్నీ గిలియడ్‌ పాఠశాల 73వ తరగతికి ఆహ్వానించారు. మమ్మల్ని తూర్పు ఆఫ్రికాకు నియమించినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం, ఆనందపడ్డాం. అక్కడ మేము కెన్యాలోని ముంబాస ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సేవ చేశాం. టాంజానియాలో మన ప్రకటనాపని మీద నిషేధం ఎత్తి వేయబడిన తర్వాత 1987లో మమ్మల్ని తిరిగి అక్కడికి నియమించారు. మేము అక్కడ 26 సంవత్సరాలు సేవచేసి కెన్యాకు తిరిగివచ్చాం.

తూర్పు ఆఫ్రికాలోని ప్రజలకు బైబిలు సత్యాన్ని నేర్పించడం ద్వారా నేను, నా భార్య ఎంతో సంతోషాన్ని పొందాం

వినయంగల ప్రజలకు బైబిలు సత్యాలు నేర్పించడం మా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చింది. ఉదాహరణకు ముంబాసలో వీధి సాక్ష్యం చేస్తున్నప్పుడు నా మొదటి బైబిలు విద్యార్థిని కలిశాను. నేను ఆయనకు రెండు పత్రికలు ఇచ్చిన తర్వాత ఆయన ఇలా అన్నాడు: “నేను వీటిని చదివాక ఏం చేయాలి?” ఆ తర్వాత వారమే, స్వాహిలిలో అప్పుడే విడుదలైన మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు అనే పుస్తకంతో బైబిలు స్టడీ మొదలుపెట్టాం. ఒక సంవత్సరానికి ఆయన బాప్తిస్మం తీసుకొని, క్రమ పయినీరు అయ్యాడు. అప్పటినుండి దాదాపు 100 మంది యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేలా ఆయన, ఆయన భార్య సహాయం చేశారు.

తన ప్రజలు అర్థవంతంగా జీవించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తాడో నేను, క్యాథరీనా స్వయంగా చూశాం

జీవితానికున్న అర్థం గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు ఒక విలువైన ముత్యాన్ని కనుగొని, దాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడని వ్యాపారిలా అనిపించింది. (మత్త. 13:45, 46) జీవితానికున్న నిజమైన అర్థాన్ని తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయాలని నేను కోరుకున్నాను. తన ప్రజలు అర్థవంతంగా జీవించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తాడో నేను, నా భార్య స్వయంగా చూశాం.