కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 45

ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండండి

ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండండి

“ఒకరితో ఒకరు విశ్వసనీయ ప్రేమతో, కరుణతో ప్రవర్తించండి.”—జెక. 7:9.

పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయ ప్రేమ చూపించుకోవడానికి మనకెలాంటి మంచి కారణాలున్నాయి?

ఒకరిపట్ల ఒకరం విశ్వసనీయ ప్రేమ చూపించుకోవడానికి మనకు మంచి కారణాలున్నాయి. వాటిలో కొన్ని ఏంటి? అవేంటో తెలుసుకోడానికి బైబిల్లో ఉన్న ఈ సామెతల్ని గమనించండి: “విశ్వసనీయ ప్రేమను, సత్యాన్ని విడిచిపెట్టకు. . . . అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో అనుగ్రహం పొందుతావు.” “విశ్వసనీయ ప్రేమ గలవాడు తన ప్రాణానికి మేలు చేసుకుంటాడు.” ‘నీతిని, విశ్వసనీయ ప్రేమను వెంబడించేవాళ్లు జీవాన్ని పొందుతారు.’—సామె. 3:3, 4; 11:17, అధస్సూచి; 21:21.

2 మనం విశ్వసనీయ ప్రేమను ఎందుకు చూపించాలో మూడు కారణాల్ని ఆ సామెతలు చెప్తున్నాయి. మొదటిగా, మనం విశ్వసనీయ ప్రేమను చూపించినప్పుడు దేవుని దృష్టిలో విలువైనవాళ్లుగా ఉంటాం. రెండవదిగా, విశ్వసనీయ ప్రేమ చూపించినప్పుడు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతాం. ఉదాహరణకు, మనం ఇతరులతో శాశ్వతకాలం ఉండే స్నేహాల్ని ఏర్పరచుకుంటాం. మూడవదిగా, విశ్వసనీయ ప్రేమ చూపించడం వల్ల భవిష్యత్తులో శాశ్వత జీవితంతో పాటు ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతాం. కాబట్టి “ఒకరితో ఒకరు విశ్వసనీయ ప్రేమతో, కరుణతో ప్రవర్తించండి” అని యెహోవా చెప్తున్న మాటలకు లోబడడానికి మనకు మంచి కారణాలున్నాయి.—జెక. 7:9.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో మనం నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. మనం ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపించాలి? విశ్వసనీయ ప్రేమ చూపించడం గురించి రూతు పుస్తకం నుండి మనమేం నేర్చుకోవచ్చు? నేడు విశ్వసనీయ ప్రేమను మనమెలా చూపించవచ్చు? విశ్వసనీయ ప్రేమ చూపించేవాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

మనం ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపించాలి?

4. విశ్వసనీయ ప్రేమను చూపించే విషయంలో యెహోవాను మనమెలా అనుకరించవచ్చు? (మార్కు 10:29, 30)

4 తనను ప్రేమించి, ఆరాధించేవాళ్ల మీద మాత్రమే యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. (దాని. 9:4) మనం ‘దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించాలని’ కోరుకుంటాం. (ఎఫె. 5:1) అందుకే సంఘంలోని సహోదర సహోదరీల పట్ల విశ్వసనీయ ప్రేమను వృద్ధి చేసుకోవాలని అనుకుంటాం.—మార్కు 10:29, 30 చదవండి.

5-6. సాధారణంగా నమ్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటి?

5 విశ్వసనీయ ప్రేమ గురించి ఎంత బాగా అర్థంచేసుకుంటే, దాన్ని అంతెక్కువగా తోటి సహోదర సహోదరీల పట్ల చూపించవచ్చని మీరు ఒప్పుకుంటారు. విశ్వసనీయ ప్రేమ అంటే నమ్మకంగా ఉండడమని సాధారణంగా ప్రజలు అనుకుంటారు. కానీ ఆ రెండిటి మధ్య తేడా ఉంది. దాన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం.

6 ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పని చేస్తే ఆయన్ని నమ్మకమైన ఉద్యోగి అని అంటాం. అయితే అక్కడ పని చేసిన సంవత్సరాలన్నిటిలో అతను ఆ కంపెనీ యజమానుల్ని ఎప్పుడూ కలిసి ఉండకపోవచ్చు. ఆ యజమానులు తీసుకున్న నిర్ణయాలు అతనికి అన్నిసార్లూ నచ్చి ఉండకపోవచ్చు. అతనికి ఆ కంపెనీ ఇష్టం లేకపోయినా జీతం వస్తుంది కాబట్టి పని చేస్తున్నాడు. అతను రిటైర్‌ అయ్యేదాక లేదా వేరేచోట ఇంకా మంచి ఉద్యోగం దొరికే దాకా అక్కడ పని చేస్తాడు.

7-8. (ఎ) బైబిలు కాలాల్లో దేవుని సేవకులు ఏ ఉద్దేశంతో విశ్వసనీయ ప్రేమ చూపించారు? (బి) రూతు పుస్తకంలోని కొన్ని లేఖనాల్ని మనమెందుకు పరిశీలిస్తాం?

7 కాబట్టి ఒక వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా నమ్మకంగా ఉంటాడు. మరి బైబిలు కాలాల్లో దేవుని సేవకులు ఏ ఉద్దేశంతో విశ్వసనీయ ప్రేమ చూపించారు? విశ్వసనీయ ప్రేమను చూపించినవాళ్లు తప్పదన్నట్లు ఆ లక్షణాన్ని చూపించలేదు, కానీ వాళ్ల హృదయాలు పురికొల్పడం వల్ల దాన్ని చూపించారు. దావీదు ఉదాహరణను పరిశీలించండి. యోనాతాను తండ్రి దావీదును చంపాలనుకున్నాడు. కానీ దావీదు హృదయం పురికొల్పడం వల్ల, ఆయన తన స్నేహితుడైన యోనాతాను మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు. యోనాతాను చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకు మెఫీబోషెతు మీద దావీదు విశ్వసనీయ ప్రేమ చూపించాడు. అలా దావీదు యోనాతాను మీద కూడా విశ్వసనీయ ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు.—1 సమూ. 20:9, 14, 15; 2 సమూ. 4:4; 8:15; 9:1, 6, 7.

8 రూతు పుస్తకంలోని కొన్ని లేఖనాల్ని పరిశీలించడం ద్వారా విశ్వసనీయ ప్రేమ గురించి మనమింకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఆ పుస్తకంలోని వ్యక్తుల నుండి విశ్వసనీయ ప్రేమ గురించి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? నేర్చుకున్న విషయాల్ని సంఘంలో మనమెలా పాటించవచ్చు? *

విశ్వసనీయ ప్రేమ చూపించడం గురించి రూతు పుస్తకం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

9. యెహోవా తనకు విరోధి అయ్యాడని నయోమి ఎందుకు అనుకుంది?

9 రూతు పుస్తకంలో నయోమి గురించి, ఆమె కోడలు రూతు గురించి అలాగే బోయజు గురించి చదువుతాం. బోయజు దేవున్ని ప్రేమించే వ్యక్తి అలాగే నయోమి భర్తకు బంధువు. ఇశ్రాయేలు దేశంలో కరువు రావడం వల్ల నయోమి, ఆమె భర్త అలాగే ఇద్దరు కొడుకులు మోయాబు దేశానికి వెళ్లారు. వాళ్లక్కడ ఉన్నప్పుడు నయోమి భర్త చనిపోయాడు. ఆమె ఇద్దరు కొడుకులకు పెళ్లయింది కానీ విచారకరంగా వాళ్లు కూడా చనిపోయారు. (రూతు 1:3-5; 2:1) ఆ విషాదకర సంఘటనల వల్ల నయోమి నిరుత్సాహంలో కూరుకుపోయింది. ఆమె ఎంతగా నిరుత్సాహపడిందంటే యెహోవా తనకు విరోధి అయ్యాడని అనుకుంది. దేవుని గురించి ఆమెకెలా అనిపించిందో గమనించండి: “యెహోవా చెయ్యి నాకు విరోధంగా తిరిగింది.” “సర్వశక్తిమంతుడు నా జీవితాన్ని చేదుమయం చేశాడు.” ‘యెహోవాయే నాకు విరోధి అయ్యాడు, సర్వశక్తిమంతుడే నా మీదికి విపత్తు తీసుకొచ్చాడు.’—రూతు 1:13, 20, 21.

10. నయోమి మాటలకు యెహోవా ఎలా స్పందించాడు?

10 నయోమి మాటలకు యెహోవా ఎలా స్పందించాడు? ఆయన నయోమిని విడిచిపెట్టలేదు. ఆమె మీద సహానుభూతి చూపించాడు. “అణచివేత తెలివిగలవాణ్ణి పిచ్చివాణ్ణి చేయగలదు” అని యెహోవాకు తెలుసు. (ప్రసం. 7:7) యెహోవా తనతోనే ఉన్నాడని అర్థంచేసుకోవడానికి నయోమికి సహాయం అవసరమైంది. మరి దేవుడు ఎలా సహాయం చేశాడు? (1 సమూ. 2:8) ఆయన నయోమి పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించడానికి రూతును కదిలించాడు. నయోమి నిరుత్సాహపడకుండా ఉండడానికి అలాగే యెహోవా తననింకా ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకోవడానికి రూతు ప్రేమతో, దయతో సహాయం చేసింది. రూతు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకుంటాం?

11. చాలామంది సహోదర సహోదరీలు, బాధలో లేదా నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు ఎందుకు సహాయం చేయాలనుకుంటారు?

11 మనకు విశ్వసనీయ ప్రేమ ఉంటే నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. రూతు నయోమిని అంటిపెట్టుకుని ఉన్నట్టే నేడు చాలామంది దయగల సహోదర సహోదరీలు, బాధలో లేదా నిరుత్సాహంలో ఉన్న తోటి క్రైస్తవులకు సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్లు తోటి సహోదరసహోదరీల్ని ప్రేమిస్తారు కాబట్టి వాళ్లకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేయాలని కోరుకుంటారు. (సామె. 12:25, అధస్సూచి; 24:10) అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించినట్టే వాళ్లూ చేస్తున్నారు. ఆయనిలా అన్నాడు: “కృంగినవాళ్లతో ఊరటనిచ్చేలా మాట్లాడండి, బలహీనులకు మద్దతివ్వండి, అందరితో ఓర్పుగా ఉండండి.”—1 థెస్స. 5:14.

నిరుత్సాహంలో ఉన్న సహోదరుడు లేదా సహోదరి చెప్పేది వినడం ద్వారా మనం వాళ్లకు సహాయం చేయవచ్చు (12వ పేరా చూడండి)

12. నిరుత్సాహంలో ఉన్న సహోదరుడికి లేదా సహోదరికి మనం సహాయం చేయగల మంచి మార్గం ఏంటి?

12 నిరుత్సాహంలో ఉన్న సహోదరుడికి లేదా సహోదరికి మనం సహాయం చేయగల మంచి మార్గం ఏంటి? వాళ్లు చెప్పేది వినడం ద్వారా అలాగే మనం వాళ్లను ప్రేమిస్తున్నామని భరోసా ఇవ్వడం ద్వారా సహాయం చేయవచ్చు. తన ప్రియమైన సేవకులకు సహాయం చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని యెహోవా తప్పకుండా గుర్తిస్తాడు. (కీర్త. 41:1) సామెతలు 19:17 ఇలా చెప్తుంది: “పేదవాళ్ల మీద దయ చూపించేవాడు యెహోవాకు అప్పు ఇస్తున్నాడు, అతను చేసినదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు.”

ఓర్పా తిరిగి మోయాబుకు వెళ్లిపోతున్నా, రూతు తన అత్త నయోమిని అంటిపెట్టుకుని ఉంది. రూతు నయోమితో ఇలా అంటుంది: “నువ్వు ఎక్కడికి వెళ్తే నేనూ అక్కడికి వస్తాను.” (13వ పేరా చూడండి)

13. రూతు నిర్ణయానికి, ఓర్పా నిర్ణయానికి మధ్య తేడా ఏంటి? రూతు విశ్వసనీయ ప్రేమ ఎలా చూపించింది? (ముఖచిత్రం చూడండి.)

13 తన భర్త, కొడుకులు చనిపోయిన తర్వాత నయోమికి ఏం జరిగిందో ఆలోచించడం ద్వారా విశ్వసనీయ ప్రేమ గురించి ఇంకా బాగా అర్థంచేసుకుంటాం. “యెహోవా మళ్లీ తన ప్రజల్ని ఆశీర్వదించి వాళ్లకు ఆహారం ఇస్తున్నాడని” నయోమి తెలుసుకున్నప్పుడు తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. (రూతు 1:6) ఇద్దరు కోడళ్లు ఆమెతో కలిసి బయల్దేరారు. కానీ దారిలో నయోమి మూడుసార్లు వాళ్లను మోయాబుకు తిరిగి వెళ్లిపొమ్మని బ్రతిమాలింది. అప్పుడేమైంది? బైబిల్లో ఇలా చదువుతాం: “ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకుని వెళ్లిపోయింది. కానీ రూతు తన అత్తతోనే ఉండిపోయింది.” (రూతు 1:7-14) ఓర్పా తిరిగి వెళ్లిపోవడం వల్ల నయోమి చెప్పినట్టే చేసింది. కానీ రూతు అంతకుమించి చేసింది. ఆమె కూడా తన ఇంటికి వెళ్లిపోవచ్చు కానీ విశ్వసనీయ ప్రేమ వల్ల నయోమితోనే ఉండిపోయింది. (రూతు 1:16, 17) ఏదో తప్పదు కదా అని రూతు నయోమిని అంటిపెట్టుకుని లేదుగానీ ఆమెకు అలా చేయాలనుకుంది కాబట్టి చేసింది. రూతు విశ్వసనీయ ప్రేమ చూపించింది. ఆమె నుండి మనమేం నేర్చుకోవచ్చు?

14. (ఎ) నేడు చాలామంది సహోదర సహోదరీలు తోటి క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తున్నారు? (బి) హెబ్రీయులు 13:16 ప్రకారం, దేవున్ని మనమెలా సంతోషపెట్టవచ్చు?

14 మనకు విశ్వసనీయ ప్రేమ ఉంటే చేయగలిగిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తాం. గతంలోలాగే నేడు చాలామంది సహోదర సహోదరీలు అంతకుముందు ఎప్పుడూ చూడని తోటి సహోదర సహోదరీల మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తున్నారు. ఉదాహరణకు, ప్రకృతి విపత్తు సంభవించిందని తెలిసిన వెంటనే సహాయం చేయడానికి వాళ్లు ముందుకొస్తున్నారు. సంఘంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లకు ఏం కావాలో తెలుసుకుని సహాయం చేస్తున్నారు. మొదటి శతాబ్దపు మాసిదోనియాలోని క్రైస్తవుల్లాగే నేడున్న సహోదర సహోదరీలు చేయగలిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తున్నారు. అవసరంలో ఉన్న సహోదరులకు సహాయం చేయడానికి వాళ్లు తమ సమయాన్ని, వస్తువుల్ని ‘ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువే ఇస్తున్నారు.’ (2 కొరిం. 8:3) వాళ్ల విశ్వసనీయ ప్రేమను చూసి యెహోవా ఎంతో సంతోషిస్తున్నాడు.—హెబ్రీయులు 13:16 చదవండి.

నేడు విశ్వసనీయ ప్రేమను మనమెలా చూపించవచ్చు?

15-16. రూతు పట్టువిడవలేదని మనమెలా చెప్పవచ్చు?

15 రూతు, నయోమిల వృత్తాంతాన్ని పరిశీలించడం ద్వారా మనం మంచి పాఠాల్ని నేర్చుకోవచ్చు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

16 పట్టువిడవకండి. రూతు తనతో యూదయకు వస్తానని అన్నప్పుడు నయోమి వద్దంది. కానీ రూతు పట్టువిడవలేదు. అప్పుడేమైంది? “రూతు తనతోనే వస్తానని పట్టుబట్టడం చూసి నయోమి ఇక ఆమెను ఒప్పించే ప్రయత్నం మానుకుంది.”—రూతు 1:15-18.

17. పట్టువిడవకుండా ప్రయత్నించడానికి మనకేది సహాయం చేస్తుంది?

17 మనమేం నేర్చుకోవచ్చు? నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలంటే మనకు ఓర్పు అవసరం. కానీ పట్టువిడవకుండా ప్రయత్నించాలి. అవసరంలో ఉన్న ఒక సహోదరి మొదట మన సహాయాన్ని వద్దు అనొచ్చు. * అయినా మనకు విశ్వసనీయ ప్రేమ ఉంటే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. (గల. 6:2) ఏదోక రోజు ఆమె మన నుండి సహాయాన్ని, ఓదార్పును అంగీకరిస్తుందని ఆశిస్తాం.

18. రూతుకు ఏ విషయం బాధ కలిగించి ఉంటుంది?

18 బాధపడకండి. నయోమి, రూతు బేత్లెహేముకు వచ్చిన తర్వాత ఒకప్పటి తన పొరుగువాళ్లను నయోమి కలిసింది. ఆమె వాళ్లతో ఇలా అంది: “నేను ఇక్కడి నుండి వెళ్లినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, కానీ యెహోవా నన్ను వట్టిచేతులతో తిరిగొచ్చేలా చేశాడు.” (రూతు 1:21) నయోమి మాటలు విన్నప్పుడు రూతుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. నయోమికి సహాయం చేయడానికి రూతు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేసింది. రూతు ఆమెతో కలిసి ఏడ్చింది, ఆమెను ఓదార్చింది, ఆమెతో కలిసి ఎన్నో రోజులు నడిచింది. రూతు అవన్నీ చేసినప్పటికీ నయోమి ఇలా అంది: “యెహోవా నన్ను వట్టిచేతులతో తిరిగొచ్చేలా చేశాడు.” రూతు చేసిన సహాయాన్ని నయోమి గుర్తించలేదని ఆమె మాటలు చూపించాయి. అది రూతుకు ఎంత బాధ కలిగించి ఉంటుందో కదా! అయినా రూతు నయోమిని అంటిపెట్టుకుని ఉంది.

19. నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు మనమెలా ఉండాలి?

19 మనమేం నేర్చుకోవచ్చు? నిరుత్సాహంలో ఉన్న ఒక సహోదరికి మనం సహాయం చేయడానికి ఎంత ప్రయత్నించినా మొదట్లో ఆమె మనల్ని బాధపెట్టేలా మాట్లాడవచ్చు. కానీ ఆమె మాటలకు బాధపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే అవసరంలో ఉన్న ఆ సహోదరిని అంటిపెట్టుకుని ఉంటూ ఆమెను ఓదార్చే మార్గాన్ని చూపించమని యెహోవాను అడుగుతాం.—సామె. 17:17.

నేడు సంఘపెద్దలు బోయజును ఎలా అనుకరించవచ్చు? (20-21 పేరాలు చూడండి)

20. నయోమిని అంటిపెట్టుకుని ఉండడానికి రూతుకు ఏది సహాయం చేసింది?

20 సరైన సమయంలో ప్రోత్సాహాన్ని ఇవ్వండి. రూతు నయోమి మీద విశ్వసనీయ ప్రేమ చూపించింది. కానీ ఇప్పుడు రూతుకే ప్రోత్సాహం అవసరమైంది. ఆమెను ప్రోత్సహించడానికి యెహోవా బోయజును పురికొల్పాడు. బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వాలి, నువ్వు ఎవరి రెక్కల కిందైతే ఆశ్రయం పొందడానికి వచ్చావో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు తగిన జీతాన్ని ఇవ్వాలి.” ఆ దయగల మాటలు ఆమె హృదయాన్ని ఎంతగా తాకాయంటే రూతు బోయజుతో ఇలా అంది: “నువ్వు నన్ను ఓదార్చావు, నీ మాటలతో నీ సేవకురాలికి అభయమిచ్చావు.” (రూతు 2:12, 13) బోయజు సరైన సమయంలో రూతుకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆమె నయోమిని అంటిపెట్టుకుని ఉండగలిగింది.

21. యెషయా 32:1, 2 లో చెప్పినట్టు, శ్రద్ధగల సంఘపెద్దలు ఏం చేస్తారు?

21 మనమేం నేర్చుకోవచ్చు? ఇతరుల మీద విశ్వసనీయ ప్రేమ చూపించేవాళ్లకు కూడా కొన్నిసార్లు ప్రోత్సాహం అవసరమౌతుంది. రూతు నయోమి మీద దయ చూపించడం బోయజు గమనించినప్పుడు ఆమెను మెచ్చుకున్నాడు. అదేవిధంగా నేడు సహోదర సహోదరీలు సంఘంలోని ఇతరులకు సహాయం చేయడం సంఘపెద్దలు గమనించినప్పుడు వాళ్లను మెచ్చుకుంటారు. అలా సరైన సమయంలో సహోదర సహోదరీలను మెచ్చుకున్నప్పుడు వాళ్లు ఇతరులకు సహాయం చేస్తూనే ఉండగల్గుతారు.—యెషయా 32:1, 2 చదవండి.

విశ్వసనీయ ప్రేమ చూపించేవాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

22-23. నయోమి ఆలోచనా విధానం మారిందని మనకెలా తెలుసు? ఆమె ఆలోచనా విధానం మారడానికి కారణమేంటి? (కీర్తన 136:23, 26)

22 బోయజు కొంతకాలం తర్వాత రూతు, నయోమికి ఉదారంగా ఆహారం ఇచ్చాడు. (రూతు 2:14-18) బోయజు చూపించిన ఉదారతను బట్టి నయోమి ఇలా అంది: “బ్రతికి ఉన్నవాళ్ల పట్ల, చనిపోయినవాళ్ల పట్ల తన విశ్వసనీయ ప్రేమ చూపించడం మానని యెహోవా అతన్ని దీవించాలి.” (రూతు 2:20ఎ) నయోమి ఆలోచనా విధానం ఎంత మారిందో కదా! ఒకప్పుడు బాధతో, ‘యెహోవా నాకు విరోధి అయ్యాడు’ అన్న ఆమె, ఇప్పుడు సంతోషంతో యెహోవా ‘విశ్వసనీయ ప్రేమ చూపించడం మానలేదు’ అని అంది. నయోమి ఆలోచనా విధానం మారడానికి కారణమేంటి?

23 యెహోవా ఎప్పుడూ తనతోనే ఉన్నాడని నయోమి చివరికి అర్థంచేసుకుంది. ఆమె యూదయకు తిరిగి వస్తున్నప్పుడు యెహోవా రూతును ఉపయోగించుకుని కావాల్సిన సహాయం చేశాడు. (రూతు 1:16) వాళ్లిద్దరికీ సహాయం చేయడానికి తమను “తిరిగి కొనగల వ్యక్తుల్లో ఒకడు” అయిన బోయజును కూడా యెహోవా ఉపయోగించుకున్నాడని నయోమి అర్థంచేసుకుంది. * (రూతు 2:19, 20బి) ఆమె ఇలా అనుకుని ఉంటుంది: ‘నాకిప్పుడు అర్థమైంది, యెహోవా నన్ను అస్సలు విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు.’ (కీర్తన 136:23, 26 చదవండి.) రూతు, బోయజు పట్టువిడవకుండా తనకు సహాయం చేస్తూ ఉన్నందుకు నయోమి ఎంత కృతజ్ఞత చూపించి ఉంటుందో కదా! నయోమి తిరిగి ఆనందాన్ని పొందడం, యెహోవా సేవలో కొనసాగడం రూతు, బోయజు చూసినప్పుడు ఆమెతోపాటు వాళ్లు కూడా చాలా సంతోషించారు.

24. తోటి విశ్వాసుల మీద విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ ఉండాలని మనమెందుకు కోరుకుంటాం?

24 విశ్వసనీయ ప్రేమ చూపించడం గురించి రూతు పుస్తకంలో మనమేం నేర్చుకున్నాం? మనకు విశ్వసనీయ ప్రేమ ఉంటే నిరుత్సాహంలో ఉన్న సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి పట్టువిడవకుండా ప్రయత్నిస్తాం. అలాగే చేయగలిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తాం. ఇతరుల మీద విశ్వసనీయ ప్రేమ చూపించేవాళ్లను సరైన సమయంలో ప్రోత్సహిస్తాం. నిరుత్సాహంలో ఉన్నవాళ్లు తిరిగి సంతోషాన్ని పొంది, యెహోవా సేవలో కొనసాగడం మనం చూసినప్పుడు ఆనందిస్తాం. (అపొ. 20:35) ఇంతకీ మనం విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణమేంటి? “అపారమైన విశ్వసనీయ ప్రేమను” చూపించే యెహోవాను అనుకరించాలని, సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం.—నిర్గ. 34:6; కీర్త. 33:22.

పాట 130 క్షమిస్తూ ఉండండి

^ పేరా 5 సంఘంలో సహోదర సహోదరీల పట్ల మనం విశ్వసనీయ ప్రేమ చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. గతంలో కొంతమంది దేవుని సేవకులు ఈ లక్షణాన్ని ఎలా చూపించారో పరిశీలించడం ద్వారా విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటో మనం బాగా అర్థంచేసుకోవచ్చు. రూతు, నయోమి, బోయజు ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 8 ఈ ఆర్టికల్‌ని బాగా అర్థం చేసుకోవడానికి రూతు పుస్తకంలోని 1, 2 అధ్యయనాల్ని చదవమని ప్రోత్సహిస్తున్నాం.

^ పేరా 17 మనం నయోమి ఉదాహరణను పరిశీలిస్తున్నాం కాబట్టి అవసరంలో ఉన్న సహోదరీల గురించి చెప్పాం. అయితే ఈ ఆర్టికల్‌లో ఉన్న పాఠాలు సహోదరులకు కూడా వర్తిస్తాయి.

^ పేరా 23 బోయజు తిరిగి కొనగల వ్యక్తుల్లో ఒకడిగా ఎలా ఉన్నాడో మరింత తెలుసుకోడానికి వాళ్లలా విశ్వాసం చూపించండి పుస్తకంలో “యోగ్యురాలు” అనే 5వ అధ్యాయాన్ని చూడండి.