కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 46

కొత్తగా పెళ్లయిన దంపతులారా—యెహోవా సేవ మీద మనసుపెట్టండి

కొత్తగా పెళ్లయిన దంపతులారా—యెహోవా సేవ మీద మనసుపెట్టండి

“యెహోవా నా బలం. . . . నా హృదయం ఆయన మీద నమ్మకం పెట్టుకుంది.”—కీర్త. 28:7.

పాట 131 “దేవుడు ఒకటి చేసినవాళ్లు”

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) కొత్తగా పెళ్లయినవాళ్లు యెహోవా మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? (కీర్తన 37:3, 4) (బి) ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం?

త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదా ఈమధ్యే మీకు పెళ్లయిందా? అలాగైతే మీరెంతో ప్రేమించే మీ భర్త లేదా భార్యతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే వివాహ జీవితం అన్నిసార్లూ సాఫీగా సాగకపోవచ్చు. అలాగే మీరు ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకొచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిమీద మీరు ఎక్కువకాలం సంతోషంగా ఉంటారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మీరు యెహోవా మీద ఆధారపడితే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, మీ వివాహబంధం బలపడుతుంది అలాగే సంతోషంగా ఉంటారు. ఒకవేళ దేవుడిచ్చే సలహాల్ని పాటించకపోతే మీకు సమస్యలు ఎదురవ్వొచ్చు. అవి మీ వివాహ జీవితం మీద ప్రభావం చూపించి మీకు సంతోషం లేకుండా చేస్తాయి.—కీర్తన 37:3, 4 చదవండి.

2 ఈ ఆర్టికల్‌ ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవాళ్ల గురించి మాట్లాడుతున్నా, బహుశా పెళ్లయిన వాళ్లందరూ ఎదుర్కొనే సవాళ్ల గురించి కూడా చర్చిస్తుంది. బైబిల్లో కొంతమంది నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చో ఇందులో పరిశీలిస్తాం. మన జీవితంలో అలాగే వివాహంలో పాటించగల విషయాల్ని ఆ బైబిలు ఉదాహరణల నుండి నేర్చుకుంటాం. నేడున్న కొంతమంది భార్యాభర్తల అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చో కూడా చూస్తాం.

కొత్తగా పెళ్లయినవాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వొచ్చు?

ఎలాంటి నిర్ణయాల వల్ల కొత్తగా పెళ్లయినవాళ్లు యెహోవా సేవ ఎక్కువగా చేయలేకపోవచ్చు? (3-4 పేరాలు చూడండి)

3-4. కొత్తగా పెళ్లయినవాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వొచ్చు?

3 కొత్తగా పెళ్లయినవాళ్లను, లోకంలో చాలామంది జీవిస్తున్నట్టే జీవించమని కొంతమంది ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు వీలైనంత త్వరగా పిల్లల్ని కనమని తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేయవచ్చు. లేదా మంచికోరే స్నేహితులు, కుటుంబ సభ్యులు వాళ్లను ఒక ఇళ్లు కొనుక్కోమని, దాన్ని మంచిమంచి వస్తువులతో నింపుకోమని చెప్పొచ్చు.

4 ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ఆ భార్యాభర్తలు తాము తీసుకొనే నిర్ణయాల వల్ల అప్పులపాలు అవ్వొచ్చు. వాటిని తీర్చడానికి వాళ్లిద్దరూ ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు. దానివల్ల వ్యక్తిగత బైబిలు అధ్యయనానికి, కుటుంబ ఆరాధనకు, పరిచర్యకు వాళ్ల దగ్గర సమయం ఉండకపోవచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి లేదా ఉన్న ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి వాళ్లు ఓవర్‌టైం చేయడం వల్ల కూటాలకు కూడా వెళ్లలేకపోవచ్చు. దానివల్ల యెహోవా సేవను ఇంకా ఎక్కువ చేసే అవకాశాల్ని వాళ్లు చేజార్చుకోవచ్చు.

5. క్లార్క్‌, మేరీ అనుభవం నుండి మనమేం నేర్చుకుంటాం?

5 ఎక్కువ వస్తువుల్ని సమకూర్చుకోవడం మీద మనసుపెడితే సంతోషంగా ఉండలేమని చాలామంది అనుభవాలు చూపిస్తున్నాయి. క్లార్క్‌, మేరీ అనుభవాన్ని గమనించండి. * పెళ్లయిన కొత్తలో సౌకర్యవంతంగా జీవించడానికి వాళ్లిద్దరూ ఉద్యోగం చేశారు. అయితే వాళ్లకు లోలోపల ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. క్లార్క్‌ ఇలా అంటున్నాడు: “మా దగ్గర కావాల్సిన వాటికన్నా ఎక్కువ వస్తువులు ఉండేవి. కానీ ఆధ్యాత్మికంగా ఎటువంటి లక్ష్యాలు లేవు. నిజానికి మా జీవితం కష్టంగా ఉండేది. అలాగే మామీద ఒత్తిడి ఉండేది.” ఎక్కువ వస్తువుల్ని సంపాదించడం మీద మనసుపెడితే సంతృప్తి ఉండదని మీరు కూడా తెలుసుకొని ఉంటారు. మీకూ అలాంటి పరిస్థితి ఎదురైతే నిరుత్సాహపడకండి. కొంతమంది మంచి ఉదాహరణల్ని పరిశీలించడం ద్వారా మీరు అవసరమైన మార్పులు చేసుకోగలుగుతారు. ముందుగా రాజైన యెహోషాపాతు నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చో చూద్దాం.

రాజైన యెహోషాపాతులాగే యెహోవా మీద నమ్మకం ఉంచండి

6. ఒక పెద్ద సైన్యం తన ప్రజల మీదికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోషాపాతు సామెతలు 3:5, 6 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించాడు?

6 భర్తలారా, మీ బాధ్యతల వల్ల కొన్నిసార్లు మీకు ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుందా? అలాగైతే రాజైన యెహోషాపాతు ఉదాహరణ మీకు సహాయం చేస్తుంది. ఒక రాజుగా యూదా వాళ్లందర్ని కాపాడాల్సిన బాధ్యత యెహోషాపాతుకు ఉంది. అతను అంత బరువైన బాధ్యతను ఎలా చేపట్టాడు? తాను పరిపాలిస్తున్న ప్రజల్ని కాపాడడానికి అతను చేయగలిగింది చేశాడు. యూదాలో ప్రాకారాలుగల నగరాల్ని కట్టించాడు. 11,60,000 కన్నా ఎక్కువమంది సైనికులతో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. (2 దిన. 17:12-19) ఆ తర్వాత యెహోషాపాతుకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. అమ్మోనీయులు, మోయాబీయులు, శేయీరు పర్వత ప్రాంతం వాళ్లు ఒక పెద్ద సైన్యంగా సమకూడి రాజుని, అతని కుటుంబాన్ని, ప్రజల్ని బెదిరించారు. (2 దిన. 20:1, 2) అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? సహాయం కోసం, శక్తి కోసం యెహోవాను అడిగాడు. అలా సామెతలు 3:5, 6 లో ఉన్న తెలివైన సలహాను అతను పాటించాడు. (చదవండి.) యెహోషాపాతు యెహోవా మీద ఎంత నమ్మకం ఉంచాడో 2 దినవృత్తాంతాలు 20:5-12 లో అతను చేసిన ప్రార్థన బట్టి అర్థమౌతుంది. మరి ఆ ప్రార్థనకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

7. యెహోషాపాతు ప్రార్థనకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

7 లేవీయుడైన యహజీయేలు ద్వారా యెహోవా యెహోషాపాతుతో మాట్లాడాడు. ఆయనిలా చెప్పాడు: “మీరు మీ స్థానాల్లో స్థిరంగా నిలబడి, యెహోవా ఇచ్చే రక్షణను చూడండి.” (2 దిన. 20:13-17) సాధారణంగా యుద్ధం చేసే విధానం అదికాదు. అయితే ఆ నిర్దేశాలు ఒక మనిషి ఇచ్చినవి కావు, యెహోవా ఇచ్చినవి. యెహోషాపాతు యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచి ఆ నిర్దేశాల్ని పాటించాడు. అతను తన ప్రజలతో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు ముందువరుసలో అత్యంత నైపుణ్యంగల సైనికుల్ని కాకుండా ఆయుధాలులేని గాయకుల్ని నిలబెట్టాడు. యెహోవా శత్రు సైన్యాన్ని ఓడించి, యెహోషాపాతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.—2 దిన. 20:18-23.

ప్రార్థించడం ద్వారా, బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా కొత్తగా పెళ్లయినవాళ్లు యెహోవా సేవ మీద మనసుపెట్టవచ్చు (8, 10 పేరాలు చూడండి)

8. యెహోషాపాతు నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

8 భర్తలారా, మీరు యెహోషాపాతు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. మీ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి వాళ్లను కాపాడడానికి, వాళ్లకు కావాల్సినవి ఇవ్వడానికి మీరు కష్టపడి పనిచేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని మీయంతట మీరే పరిష్కరించుకోగలరని మీకనిపించవచ్చు. కానీ మీ సొంత శక్తి మీద ఆధారపడకండి. బదులుగా యెహోవా సహాయం కోసం ఒంటరిగా ప్రార్థించండి. అలాగే మీ భార్యతో కలిసి పట్టుదలగా ప్రార్థించండి. బైబిల్ని, సంస్థ ఇస్తున్న ప్రచురణల్ని చదవడం ద్వారా యెహోవా నిర్దేశమేంటో తెలుసుకొని, దాన్ని పాటించండి. బైబిలు ఆధారంగా మీరు తీసుకున్న నిర్ణయాల్ని ఇతరులు అంగీకరించకపోవచ్చు. మీరు తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నారని కూడా వాళ్లు అనొచ్చు. మీ కుటుంబానికి కావాల్సినవన్నీ డబ్బే ఇవ్వగలదని వాళ్లంటారు. కానీ యెహోషాపాతు ఉదాహరణ గుర్తుచేసుకోండి. అతను యెహోవా మీద ఆధారపడ్డాడని అతని పనులు చూపించాయి. విశ్వసనీయంగా ఉన్న యెహోషాపాతును యెహోవా విడిచిపెట్టలేదు. ఆయన మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. (కీర్త. 37:28; హెబ్రీ. 13:5) తమ జీవితం సంతోషంగా ఉండడానికి భార్యాభర్తలు ఇంకా ఏం చేయవచ్చు?

యెషయా ప్రవక్త, ఆయన భార్యలాగే యెహోవా సేవ చేయడం మీదే మనసుపెట్టండి

9. యెషయా ప్రవక్త, ఆయన భార్య గురించి మనకేం తెలుసు?

9 యెషయా ప్రవక్త, ఆయన భార్య యెహోవా సేవ చేయడాన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచారు. యెషయా ఒక ప్రవక్తగా ఉండేవాడు, బహుశా ఆయన భార్య కూడా ప్రవచించేది. ఎందుకంటే బైబిలు ఆమెను “ప్రవక్త్రి” అని పిలుస్తుంది. (యెష. 8:1-4) యెషయా, ఆయన భార్య యెహోవా ఆరాధనకే తమ జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. నేడున్న భార్యాభర్తలకు వాళ్లెంత చక్కని ఆదర్శమో కదా!

10. పెళ్లయినవాళ్లు బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయడం వల్ల, యెహోవా సేవ వీలైనంత ఎక్కువ చేయాలనే కోరిక వాళ్లలో ఎలా బలపడుతుంది?

10 నేడున్న భార్యాభర్తలు యెహోవా సేవలో చేయగలిగినదంతా చేయడం ద్వారా యెషయాను, ఆయన భార్యను అనుకరించవచ్చు. వాళ్లు బైబిలు ప్రవచనాల్ని కలిసి అధ్యయనం చేయడం ద్వారా, అవెలా నెరవేరుతున్నాయో చూడడం ద్వారా యెహోవా మీదున్న నమ్మకాన్ని బలపర్చుకోవచ్చు. (తీతు 1:2) కొన్ని బైబిలు ప్రవచనాల నెరవేర్పులో వాళ్లెలా భాగమవ్వొచ్చో ఆలోచించవచ్చు. ఉదాహరణకు, రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందని యేసు చెప్పిన ప్రవచనం నెరవేరడానికి వాళ్ల వంతు సాయం వాళ్లు చేయవచ్చు. (మత్త. 24:14) ఆ బైబిలు ప్రవచనం నెరవేరుతోందని వాళ్లకు నమ్మకం కుదిరేకొద్దీ, యెహోవా సేవ వీలైనంత ఎక్కువ చేయాలనే కోరిక వాళ్లలో బలపడుతుంది.

ప్రిస్కిల్ల, అకులలాగే రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి

11. ప్రిస్కిల్ల, అకుల దేనికి ప్రాముఖ్యతనిచ్చారు? ఎందుకు?

11 యూదులైన ప్రిస్కిల్ల, అకుల నుండి కొత్తగా పెళ్లయినవాళ్లు ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్లు రోములో నివసించేవాళ్లు; యేసు గురించిన మంచివార్తను విని క్రైస్తవులుగా మారారు. అక్కడ వాళ్లు సంతోషంగా జీవించేవాళ్లు. అయితే చక్రవర్తి అయిన క్లౌదియ యూదులందర్నీ రోము విడిచి వెళ్లమన్నప్పుడు, ఒక్కసారిగా వాళ్ల జీవితం మారిపోయింది. అంటే ప్రిస్కిల్ల, అకుల తమకు బాగా అలవాటైన ప్రాంతాన్ని విడిచి కొత్త ప్రాంతంలో జీవించాలి. అక్కడ మళ్లీ వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. ఆ మార్పులు వాళ్లను యెహోవా సేవ ఎక్కువ చేయకుండా అడ్డుకున్నాయా? లేదని మనకు తెలుసు. ప్రిస్కిల్ల, అకుల కొరింథుకు వెళ్లాక స్థానిక సంఘంలోని వాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టారు. అలాగే అపొస్తలుడైన పౌలుతో కలిసి అక్కడి సహోదరుల్ని బలపర్చారు. ఆ తర్వాత వాళ్లు అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేశారు. (అపొ. 18:18-21; రోమా. 16:3-5) వాళ్ల జీవితం చాలా బిజీగా, సంతోషంగా సాగింది.

12. పెళ్లయినవాళ్లు యెహోవా సేవలో లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి?

12 యెహోవా సేవను ఎక్కువ చేయడం ద్వారా నేడున్న భార్యాభర్తలు ప్రిస్కిల్లను, అకులను అనుకరించవచ్చు. తమ లక్ష్యాల గురించి వాళ్లు పెళ్లికి ముందే మాట్లాడుకోవడం మంచిది. వాళ్లిద్దరూ కలిసి యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి కృషి చేసినప్పుడు ఎన్నో విధాలుగా యెహోవా సహాయాన్ని చూస్తారు. (ప్రసం. 4:9, 12) రస్సెల్‌, ఎలీసబెత్‌ అనుభవాన్ని గమనించండి. రస్సెల్‌ ఇలా అంటున్నాడు: “మేము పెళ్లికి ముందే, యెహోవా సేవలో పెట్టుకోగల లక్ష్యాల గురించి ముఖ్యంగా మాట్లాడుకున్నాం.” ఎలీసబెత్‌ ఇలా అంటుంది: “పెళ్లయ్యాక మేము తీసుకునే ఇతర నిర్ణయాలు, మేము పెట్టుకున్న లక్ష్యాలకు అడ్డురాకూడదని ముందే అలా మాట్లాడుకున్నాం.” పరిస్థితులు అనుకూలించడం వల్ల రస్సెల్‌, ఎలీసబెత్‌ ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న మైక్రోనీసియాకు వెళ్లి సేవ చేయగలిగారు.

ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా కొత్తగా పెళ్లయినవాళ్లు యెహోవా సేవ మీద మనసుపెట్టవచ్చు (13వ పేరా చూడండి)

13. కీర్తన 28:7 ప్రకారం, మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే ఏం జరుగుతుంది?

13 రస్సెల్‌, ఎలీసబెత్‌లాగే పెళ్లయిన చాలామంది తమ జీవితాల్ని సరళం చేసుకుని మంచివార్తను ప్రకటించడంలో, బోధించడంలో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు. పెళ్లయిన ఒక జంట యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి కలిసి కృషిచేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. అప్పుడు, యెహోవా తమను ఎలా పట్టించుకుంటున్నాడో వాళ్లు చూస్తారు; ఆయన మీద వాళ్లకున్న నమ్మకం పెరుగుతుంది అలాగే నిజమైన ఆనందాన్ని పొందుతారు.—కీర్తన 28:7 చదవండి.

అపొస్తలుడైన పేతురు, ఆయన భార్యలాగే యెహోవా మాట మీద నమ్మకం ఉంచండి

14. అపొస్తలుడైన పేతురు, ఆయన భార్య మత్తయి 6:25, 31-34 లో యెహోవా ఇచ్చిన మాటమీద ఎలా నమ్మకం ఉంచారు?

14 పెళ్లయినవాళ్లు అపొస్తలుడైన పేతురు, ఆయన భార్య నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అపొస్తలుడైన పేతురు యేసును మొదటిసారి కలిసి కొన్ని నెలలు గడిచాక ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పేతురు తన కుటుంబాన్ని పోషించడానికి చేపలుపట్టే వ్యాపారం చేసేవాడు. కాబట్టి తనను అనుసరించమని యేసు పేతురును ఆహ్వానించినప్పుడు, వెళ్లాలో లేదో నిర్ణయించుకునే ముందు ఆయన తన భార్య గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. (లూకా 5:1-11) పేతురు యేసును అనుసరిస్తూ ప్రకటనా పనిలో భాగం వహించాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు. పేతురు తీసుకున్న నిర్ణయానికి ఆయన భార్య కూడా మద్దతిచ్చి ఉంటుందని మనం నమ్మవచ్చు. ఎందుకంటే యేసు పునరుత్థానమైన తర్వాత ఆమె పేతురుతో కలిసి పరిచర్య చేయడం కోసం కొంతకాలం ప్రయాణించిందని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 9:5) ఆమె ఒక మంచి క్రైస్తవ భార్య కాబట్టే పేతురు తాను రాసిన ఉత్తరంలో క్రైస్తవ భర్తలకు, భార్యలకు ధైర్యంగా సలహా ఇవ్వగలిగాడు. (1 పేతు. 3:1-7) తన రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే వాళ్ల అవసరాలన్నీ తీరుస్తానని యెహోవా ఇచ్చిన మాటమీద పేతురు, ఆయన భార్య నమ్మకం ఉంచారని స్పష్టమౌతుంది.—మత్తయి 6:25, 31-34 చదవండి.

15. టియాగో, ఎస్తేర్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకుంటారు?

15 మీకు పెళ్లయి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అయ్యుంటే, యెహోవా సేవ ఎక్కువ చేయాలనే మీ కోరికను ఎలా పెంచుకోవచ్చు? ఒక మార్గమేంటంటే, వేరే దంపతుల అనుభవాల్ని చదవడం. ఉదాహరణకు, “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు” ఆర్టికల్‌ సిరీస్‌ని మీరు చదవొచ్చు. బ్రెజిల్‌లో ఉంటున్న టియాగో, ఎస్తేర్‌ అనే దంపతులు, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేసేలా ఆ ఆర్టికల్స్‌ పురికొల్పాయి. టియాగో ఇలా చెప్తున్నాడు: “మన కాలంలో యెహోవా తన సేవకులకు ఎలా సహాయం చేశాడో మేము చదివినప్పుడు, ఆయన మమ్మల్ని కూడా నడిపించాలనీ, మామీద శ్రద్ధ చూపించాలనీ కోరుకున్నాం.” కొంతకాలానికి వాళ్లు పరాగ్వేకు వెళ్లి, 2014 నుండి పోర్చుగీస్‌ క్షేత్రంలో సేవ చేస్తున్నారు. ఎస్తేర్‌ ఇలా అంటుంది: “ఎఫెసీయులు 3:20 మా ఇద్దరికీ బాగా ఇష్టమైన లేఖనం. అందులోని మాటలు మా జీవితంలో నిజమవ్వడాన్ని మేము అనేకసార్లు చూశాం.” ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో, యెహోవా మనం అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాడని పౌలు వాగ్దానం చేశాడు. ఆ మాట ఎంత నిజమో కదా!

అనుభవం ఉన్న దంపతులను సలహా అడగడం ద్వారా కొత్తగా పెళ్లయినవాళ్లు యెహోవా సేవ మీద మనసుపెట్టవచ్చు (16వ పేరా చూడండి)

16. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు తమ లక్ష్యాల గురించి ఆలోచిస్తుంటే ఎవరి సలహా తీసుకోవచ్చు?

16 యెహోవా మీద ఇప్పటికే ఆధారపడిన వాళ్ల అనుభవం నుండి కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు ప్రయోజనం పొందవచ్చు. కొంతమంది దంపతులు పయినీర్లుగా ఎన్నో సంవత్సరాలు గడిపి ఉండవచ్చు. మీరు మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తుంటే వాళ్లను సలహా అడగండి. అలా చేస్తే యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నారని చూపిస్తారు. (సామె. 22:17, 19) కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి సంఘపెద్దలు కూడా సహాయం చేయవచ్చు.

17. క్లార్క్‌, మేరీ జీవితంలో ఏం జరిగింది? వాళ్ల అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

17 మనం యెహోవా సేవ ఎక్కువ చేయాలి అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా కాకుండా, మరో విధంగా సేవ చేసేలా యెహోవా మనల్ని నిర్దేశించవచ్చు. మొదట్లో ప్రస్తావించిన క్లార్క్‌, మేరీ దంపతులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. వాళ్లకు పెళ్లయిన మూడు సంవత్సరాల తర్వాత ఫిన్‌లాండ్‌ బ్రాంచిలో నిర్మాణపని చేయడానికి స్వచ్ఛందంగా వెళ్లారు. వాళ్లక్కడ 6 నెలల కన్నా ఎక్కువకాలం ఉండే అవకాశం లేదని తెలిసింది. అది విని వాళ్లు నిరుత్సాహపడ్డారు. అయితే కొంతకాలానికి వాళ్లను అరబిక్‌ భాష నేర్చుకోవడానికి సంస్థ ఆహ్వానించింది. వాళ్లిప్పుడు అరబిక్‌ భాషా క్షేత్రం ఉన్న మరో దేశంలో సంతోషంగా సేవ చేస్తున్నారు. జరిగినదాని గురించి ఆలోచిస్తూ మేరీ ఇలా అంటుంది: “యెహోవా సేవలో ఏదైనా కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు మనకు భయమేస్తుంది, కానీ నేను ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాను. అయితే మేము ఊహించని విధంగా యెహోవా మాకెప్పుడూ సహాయం చేయడాన్ని చూశాం. ఆ తర్వాత నాకు యెహోవా మీదున్న నమ్మకం ఇంకా పెరిగింది.” యెహోవా మీద పూర్తి నమ్మకముంచితే ఆయన ఎప్పుడూ ప్రతిఫలం ఇస్తాడని ఈ అనుభవం చూపిస్తుంది.

18. పెళ్లయినవాళ్లు యెహోవా మీద ఆధారపడుతూ ఉండడానికి ఏం చేయవచ్చు?

18 వివాహం యెహోవా ఇచ్చిన ఒక బహుమానం. (మత్త. 19:5, 6) పెళ్లయినవాళ్లు ఆ బహుమానాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. (సామె. 5:18) కాబట్టి కొత్తగా పెళ్లయిన దంపతులారా, మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో మీరు పరిశీలించుకోవాలి. యెహోవా మీకిచ్చిన బహుమతుల పట్ల మీకు కృతజ్ఞత ఉందని చూపించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారా? ప్రార్థన ద్వారా యెహోవాతో మాట్లాడండి; మీ పరిస్థితికి సరిపోయే సూత్రాలను బైబిల్లో వెతకండి; తర్వాత యెహోవా ఇచ్చే సలహాను పాటించండి. అలా మీరు యెహోవా సేవ చేయడం మీద మనసుపెడితే మీ జీవితం సంతోషంగా ఉంటుందనే నమ్మకంతో ఉండొచ్చు.

పాట 132 మనమిప్పుడు ఒక్కరం

^ పేరా 5 మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు యెహోవా సేవకోసం మనమెంత సమయాన్ని, శక్తిని వెచ్చించగలమో నిర్ణయిస్తాయి. కొత్తగా పెళ్లయినవాళ్లు తమ మిగతా జీవితమంతటి మీద ప్రభావం చూపించే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు సంతోషంగా జీవించేలా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

^ పేరా 5 కొన్ని అసలు పేర్లు కావు.