కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 44

యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?

యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?

“[యెహోవా] విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”—కీర్త. 136:1.

పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా మనల్ని ఏం చేయమని కోరుతున్నాడు?

యెహోవా విశ్వసనీయ ప్రేమను చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాడు. (హోషే. 6:6) మనం కూడా ఆ లక్షణాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రవక్తయిన మీకా ద్వారా ‘విశ్వసనీయ ప్రేమను ప్రేమించమని’ ఆయన మనకు చెప్తున్నాడు. (మీకా 6:8, అధస్సూచి.) మనమలా చేయాలంటే విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసుండాలి.

2. విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటి?

2 అసలు విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటి? “విశ్వసనీయ ప్రేమ” అనే మాట పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో 290 కన్నా ఎక్కువసార్లు ఉంది. ఆ అనువాదంలో ఉన్న “బైబిలు పదాల పదకోశం” ప్రకారం, విశ్వసనీయ ప్రేమ అనే మాట ‘నిబద్ధత, యథార్థత, విశ్వసనీయత, ప్రగాఢ అనుబంధం అనే వాటివల్ల పుట్టే ప్రేమను సూచిస్తుంది. ఇది సాధారణంగా దేవునికి మనుషుల మీద ఉన్న ప్రేమను సూచిస్తుంది, మనుషుల మధ్య కూడా ఈ ప్రేమ ఉంటుంది.’ విశ్వసనీయ ప్రేమను చూపించడంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శం. ఈ ఆర్టికల్‌లో, యెహోవా మనుషుల మీద విశ్వసనీయ ప్రేమను ఎలా చూపిస్తాడో చర్చిస్తాం. తర్వాతి ఆర్టికల్‌లో, యెహోవా సేవకులుగా మనం ఒకరిపట్ల ఒకరం విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ ఆయన్ని ఎలా అనుకరించవచ్చో తెలుసుకుంటాం.

యెహోవా “అపారమైన విశ్వసనీయ ప్రేమ” చూపించే దేవుడు

3. యెహోవా తన గురించి మోషేకు ఏం చెప్పాడు?

3 ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన కొంతకాలానికి యెహోవా తన పేరు గురించి, లక్షణాల గురించి మోషేకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు; ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు.” (నిర్గ. 34:6, 7) యెహోవా తన లక్షణాల గురించి చక్కగా వర్ణిస్తున్నప్పుడు తన విశ్వసనీయ ప్రేమకున్న ప్రత్యేకత గురించి మోషేకు చెప్పాడు. ఏంటా ప్రత్యేకత?

4-5. (ఎ) యెహోవా తన గురించి ఎలా వర్ణించుకున్నాడు? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

4 యెహోవా విశ్వసనీయ ప్రేమను మాత్రమే కాదుగానీ, “అపారమైన విశ్వసనీయ ప్రేమను” చూపించే దేవునిగా వర్ణించుకున్నాడు. “అపారమైన విశ్వసనీయ ప్రేమ” అనే పదం బైబిల్లో మరో ఎనిమిదిసార్లు ఉంది. (సంఖ్యా. 14:18; కీర్త. 69:13; 86:5, 15; 103:8; 106:7; విలా. 3:32; యోవే. 2:13) ఆ లేఖనాలన్నిటిలో ఆ పదం కేవలం యెహోవా గురించే చెప్పబడింది కానీ మనుషుల గురించి కాదు. తనకున్న విశ్వసనీయ ప్రేమ గురించి యెహోవా బైబిల్లో ఇన్నిసార్లు ప్రస్తావించడం ఆసక్తిగా అనిపించట్లేదా? దీన్నిబట్టి ఆయన విశ్వసనీయ ప్రేమను ప్రాముఖ్యంగా ఎంచుతాడని అర్థమౌతుంది. * అందుకే రాజైన దావీదు ఇలా అన్నాడు: ‘యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ ఆకాశం వరకు చేరుకుంటుంది. దేవా నీ విశ్వసనీయ ప్రేమ ఎంత అమూల్యమైనది! నీ రెక్కల నీడలో మనుషులు ఆశ్రయం పొందుతారు.’ (కీర్త. 36:5, 7) దావీదులాగే మనం కూడా దేవుని విశ్వసనీయ ప్రేమను విలువైనదిగా ఎంచాలి.

5 విశ్వసనీయ ప్రేమ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం రెండు ప్రశ్నల్ని పరిశీలిద్దాం. అవేంటంటే: యెహోవా ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు? యెహోవా చూపించే ఆ విశ్వసనీయ ప్రేమ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

యెహోవా ఎవరి మీద విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడు?

6. యెహోవా ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు?

6 యెహోవా ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు? మనం ‘వ్యవసాయాన్ని,’ “ద్రాక్షారసాన్ని, నూనెను,” “క్రమశిక్షణను,” “జ్ఞానాన్ని,” “తెలివి” వంటివాటిని ప్రేమిస్తామని బైబిలు చెప్తుంది. (2 దిన. 26:10; సామె. 12:1; 21:17; 29:3) అయితే విశ్వసనీయ ప్రేమను మనుషుల మీద మాత్రమే చూపిస్తాం గానీ వస్తువుల మీద కాదు. యెహోవా విశ్వసనీయ ప్రేమను అందరి మీద చూపించడు. తనతో దగ్గరి సంబంధం ఉన్న వాళ్లమీద మాత్రమే ఆయన దాన్ని చూపిస్తాడు. ఆయన తన స్నేహితులకు విశ్వసనీయంగా ఉంటాడు. వాళ్ల విషయంలో ఆయనకు ఒక అద్భుతమైన సంకల్పం ఉంది అలాగే వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాడు.

తనను ఆరాధించని వాళ్లతో సహా మనుషులందరికీ యెహోవా ఎన్నో మంచివాటిని ఇస్తున్నాడు (7వ పేరా చూడండి) *

7. యెహోవా మనుషులందరి మీద ఎలా ప్రేమను చూపించాడు?

7 యెహోవా మనుషులందరి మీద ప్రేమ చూపించాడు. యేసు నీకొదేముతో ఇలా అన్నాడు: “దేవుడు లోకంలోని [మనుషులందర్నీ] ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”—యోహా. 3:1, 16; మత్త. 5:44, 45.

రాజైన దావీదు, ప్రవక్తయిన దానియేలు చెప్పినట్టు, తన గురించి తెలుసుకుని, తనకు భయపడి, తనను ప్రేమించి, తన ఆజ్ఞల్ని పాటించే వాళ్లమీద యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు (8, 9 పేరాలు చూడండి)

8-9. (ఎ) యెహోవా తన ఆరాధకుల పట్ల విశ్వసనీయ ప్రేమ ఎందుకు చూపిస్తాడు? (బి) మనమిప్పుడు ఏ విషయాల్ని పరిశీలిస్తాం?

8 పైన చెప్పినట్టు తనతో దగ్గరి సంబంధం కలిగి ఉండే తన సేవకుల మీద మాత్రమే యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు. దీనిని రాజైన దావీదు అలాగే ప్రవక్తయిన దానియేలు మాటల్ని బట్టి అర్థంచేసుకోవచ్చు. ఉదాహరణకు దావీదు ఇలా అన్నాడు: “నిన్ను తెలుసుకున్నవాళ్లకు నీ విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ ఉండు.” “యెహోవాకు భయపడేవాళ్ల పట్ల ఆయన విశ్వసనీయ ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది.” అంతేకాదు దానియేలు ఇలా రాశాడు: ‘సత్యదేవుడివైన యెహోవా, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞల్ని పాటించే వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.’ (కీర్త. 36:10; 103:17; దాని. 9:4) తన సేవకులు తన గురించి తెలుసుకుని, తనకు భయపడుతూ, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞల్ని పాటిస్తారు కాబట్టి యెహోవా వాళ్లపట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని ఆ మాటల్ని బట్టి అర్థమౌతుంది. తనను సరైన విధానంలో ఆరాధించేవాళ్ల మీద మాత్రమే యెహోవా విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడు.

9 మనం యెహోవాను సేవించడం మొదలుపెట్టక ముందు, సాధారణంగా ఆయన మనుషులందరి మీద చూపించే ప్రేమను మనం అనుభవించాం. (కీర్త. 104:14) కానీ ఇప్పుడు ఆయన ఆరాధకులుగా తన విశ్వసనీయ ప్రేమ నుండి కూడా ప్రయోజనం పొందుతున్నాం. నిజానికి యెహోవా తన ఆరాధకులకు ఇలా మాటిస్తున్నాడు: “నీ మీద నాకున్న విశ్వసనీయ ప్రేమ తొలగిపోదు.” (యెష. 54:10) అంతేకాదు, “యెహోవా తన విశ్వసనీయుల్ని ప్రత్యేకంగా చూసుకుంటాడు” అని దావీదు అనుభవపూర్వకంగా చెప్పాడు. (కీర్త. 4:3) యెహోవా మన మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నందుకు మనమెలా స్పందించాలి? దాని గురించి కీర్తనకర్త ఇలా రాశాడు: “తెలివిగల వాళ్లందరూ వీటిని గమనిస్తారు, యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి వాళ్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు.” (కీర్త. 107:43) యెహోవా ఇచ్చే ఈ సలహాను మనసులో పెట్టుకొని, ఆయన చూపించే విశ్వసనీయ ప్రేమ వల్ల తన ఆరాధకులు ప్రయోజనం పొందే మూడు విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా చూపించే విశ్వసనీయ ప్రేమ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

తనను ఆరాధించే వాళ్లకు యెహోవా మరెన్నో మంచివాటిని ఇస్తాడు (10-16 పేరాలు చూడండి) *

10. యెహోవా విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుందని తెలుసుకోవడం మనకెలా సహాయం చేస్తుంది? (కీర్తన 31:7)

10 దేవుని విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఈ మాట 136వ కీర్తనలో 26 సార్లు రాయబడింది. మొదటి వచనంలో ఇలా చదువుతాం: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు; ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.” (కీర్త. 136:1) 2 నుండి 26 వచనాల్లో, “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అనే మాటను మనం ప్రతీ వచనంలో చదువుతాం. ఈ కీర్తన చదువుతున్నప్పుడు, తన విశ్వసనీయ ప్రేమను యెహోవా మానకుండా ఎన్నో విధాలుగా చూపిస్తున్నందుకు మనం ఆశ్చర్యపోతాం. “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అని పదేపదే చెప్పబడిన ఆ మాట, తన సేవకుల పట్ల యెహోవా ప్రేమ తగ్గదనే అభయాన్ని ఇస్తుంది. యెహోవా తన సేవకులను ప్రేమిస్తూనే ఉంటాడని తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తనను సేవించేవాళ్లను ఆయన ప్రేమించడం మొదలుపెడితే, వాళ్లను అంటిపెట్టుకుని ఉంటాడు, ముఖ్యంగా వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లను విడిచిపెట్టడు. దీన్నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం? యెహోవా మనకు తోడుగా ఉంటాడని తెలుసుకోవడం సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనకు ఎదురయ్యే కష్టాల్ని సహించి, ఆయన సేవ చేస్తూ ఉండడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది.—కీర్తన 31:7 చదవండి.

11. కీర్తన 86:5 ప్రకారం, క్షమించడానికి యెహోవాను ఏది కదిలిస్తుంది?

11 దేవుని విశ్వసనీయ ప్రేమ ఆయన్ని క్షమించేలా కదిలిస్తుంది. ఒక తప్పిదస్థుడు పశ్చాత్తాపపడి పాపం చేయడం ఆపేశాడని యెహోవా గమనిస్తే, ఆ వ్యక్తిని క్షమించడానికి విశ్వసనీయ ప్రేమ ఆయన్ని కదిలిస్తుంది. కీర్తనకర్తయిన దావీదు యెహోవా గురించి ఇలా అన్నాడు: “ఆయన మన పాపాలకు తగ్గట్టు మనతో వ్యవహరించలేదు, మన తప్పులకు తగినట్టు మనల్ని శిక్షించలేదు.” (కీర్త. 103:8-11) తప్పు చేశాననే భావన మనసుకు ఎంత బాధ కలిగిస్తుందో దావీదు తన అనుభవం నుండి తెలుసుకున్నాడు. కానీ యెహోవా ‘క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని’ కూడా ఆయనకు తెలుసుకున్నాడు. అలా క్షమించడానికి యెహోవాను ఏది కదిలిస్తుంది? దానికి జవాబు కీర్తన 86:5 లో ఉంది. (చదవండి.) దావీదు ప్రార్థించినట్లు, తనకు మొరపెట్టే వాళ్లందరి మీద యెహోవాకు విశ్వసనీయ ప్రేమ ఉంది కాబట్టి ఆయన వాళ్లను క్షమిస్తాడు.

12-13. గతంలో చేసిన తప్పుల్నిబట్టి మనం అపరాధ భావాలతో సతమతమౌతుంటే మనకేది సహాయం చేస్తుంది?

12 మనం తప్పు చేసినప్పుడు బాధపడడం సరైనదే, కొన్నిసార్లు అది మంచిది కూడా. మనం పశ్చాత్తాపపడడానికి, చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అది సహాయం చేస్తుంది. కానీ కొంతమంది దేవుని సేవకులు గతంలో తప్పులు చేయడం వల్ల కలిగిన అపరాధ భావాల్ని తీసేసుకోలేకపోయారు. వాళ్లు యెహోవాను క్షమాపణ అడిగి తప్పుచేయడం ఆపేసినా, ఆయన తమను ఎప్పటికీ క్షమించడని అనుకుంటారు. మీరూ అలాంటి భావాలతో సతమతమౌతుంటే, తన ఆరాధకుల పట్ల దేవుడు విశ్వసనీయ ప్రేమ చూపించడానికి సిద్ధంగా ఉంటాడని అర్థంచేసుకున్నప్పుడు వాటినుండి బయటపడతారు.

13 దీన్నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం? మనం అపరిపూర్ణులమైనా యెహోవాను స్వచ్ఛమైన మనస్సాక్షితో సంతోషంగా సేవించవచ్చు. “ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది” కాబట్టి అది సాధ్యమౌతుంది. (1 యోహా. 1:7) ఏదైనా తప్పు చేయడం వల్ల మీరు నిరుత్సాహపడుతుంటే, పశ్చాత్తాపపడేవాళ్లను యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని గుర్తుంచుకోండి. విశ్వసనీయ ప్రేమకి, క్షమాగుణానికి ఉన్న సంబంధం గురించి దావీదు ఏం చెప్పాడో గమనించండి: “ఆకాశం భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉందో, తనకు భయపడేవాళ్ల పట్ల ఆయన విశ్వసనీయ ప్రేమ అంత గొప్పది. పడమటికి తూర్పు ఎంత దూరంలో ఉంటుందో, ఆయన మన అపరాధాల్ని మనకు అంత దూరంలో ఉంచాడు.” (కీర్త. 103:11, 12) నిజానికి యెహోవా మనల్ని ‘అధికంగా క్షమించడానికి’ ఇష్టపడుతున్నాడు.—యెష. 55:7.

14. యెహోవా విశ్వసనీయ ప్రేమ ఇచ్చే కాపుదలను దావీదు ఎలా వర్ణించాడు?

14 దేవుని విశ్వసనీయ ప్రేమ ఆధ్యాత్మిక కాపుదల ఇస్తుంది. యెహోవాకు ప్రార్థిస్తూ దావీదు ఇలా అన్నాడు: “నేను దాక్కునే స్థలం నువ్వు; నువ్వు నన్ను కష్టాల నుండి కాపాడతావు. నా చుట్టూ విడుదల సంబరాలు ఉండేలా చేస్తావు. . . . యెహోవా మీద నమ్మకముంచేవాళ్లకు ఆయన విశ్వసనీయ ప్రేమ తోడుంటుంది.” (కీర్త. 32:7, 10) బైబిలు కాలాల్లో నగరానికి చుట్టూ ఉండే గోడలు, లోపలున్న ప్రజల్ని శత్రువుల నుండి కాపాడేవి. అలాగే యెహోవా చూపించే విశ్వసనీయ ప్రేమ కూడా ఒక గోడలా ఉంటూ, ఆయనతో ఉన్న సంబంధాన్ని పాడుచేయగల దేన్నుండైనా మనల్ని కాపాడుతుంది. అంతేకాదు, మనల్ని తన దగ్గరికి తెచ్చుకునేలా తన విశ్వసనీయ ప్రేమ యెహోవాను కదిలిస్తుంది.—యిర్మీ. 31:3.

15. యెహోవా విశ్వసనీయ ప్రేమను ఆశ్రయంతో, కోటతో ఎందుకు పోల్చవచ్చు?

15 దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడతాడో వర్ణించడానికి దావీదు మరో పోలిక చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “నామీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవుడే నా సురక్షితమైన ఆశ్రయం.” దావీదు ఇంకా ఇలా అన్నాడు: “నా విశ్వసనీయ ప్రేమ, నా కోట ఆయనే, ఆయనే నా సురక్షితమైన ఆశ్రయం, నా రక్షకుడు, నా డాలు, నేను ఆయన్నే ఆశ్రయించాను.” (కీర్త. 59:17; 144:2) యెహోవా విశ్వసనీయ ప్రేమను ఆశ్రయంతో, కోటతో దావీదు ఎందుకు పోల్చాడు? ఎందుకంటే మనం ఈ భూమ్మీద ఏ మూల జీవిస్తున్నా ఆయన సేవకులుగా ఉన్నంతవరకు, మనకు తనతో ఉన్న అమూల్యమైన బంధాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే కాపుదలను ఆయనిస్తాడు. ఇలాంటి హామీ 91వ కీర్తనలో కూడా ఉంది. అక్కడ ఇలా చదువుతాం: “ ‘నువ్వే నా ఆశ్రయం, నా కోట’ అని నేను యెహోవాతో అంటాను.” (కీర్త. 91:1-3, 9, 14) యెహోవా మనల్ని ఒక ఆశ్రయంలా కాపాడతాడని మోషే కూడా చెప్పాడు. (కీర్త. 90:1, అధస్సూచి.) ఆయన చనిపోవడానికి కొంతకాలం ముందు మరో విషయం కూడా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “పురాతన కాలాల నుండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి.” (ద్వితీ. 33:27) “ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి” అనే మాటలు యెహోవా గురించి మనకేం చెప్తున్నాయి?

16. యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? (కీర్తన 136:23)

16 యెహోవా ఆశ్రయంగా ఉన్నప్పుడు మనకు సురక్షితంగా అనిపిస్తుంది. అయినా కొన్నిసార్లు మనకు నిరుత్సాహం కలగవచ్చు, దాన్నుండి బయటికి రాలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో యెహోవా ఏం చేస్తాడు? (కీర్తన 136:23 చదవండి.) తన బాహువులతో లేదా చేతులతో ఆయన మనల్ని మృదువుగా పైకి లేపి, నిరుత్సాహం నుండి బయటపడడానికి సహాయం చేస్తాడు. (కీర్త. 28:9; 94:18) దీన్నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం? అన్ని సమయాల్లో దేవుని మీద ఆధారపడొచ్చని తెలుసుకోవడం, మనమెక్కడ జీవిస్తున్నా సరే యెహోవా మనకెప్పుడూ కాపుదల ఇస్తాడని, మనమీద ఎంతో శ్రద్ధ చూపిస్తాడని గుర్తుచేస్తుంది.

దేవుడు విశ్వసనీయ ప్రేమ చూపిస్తూనే ఉంటాడని మనమెందుకు నమ్మవచ్చు?

17. దేవుని విశ్వసనీయ ప్రేమ వల్ల మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (కీర్తన 33:18-22)

17 మనం ఇప్పటివరకు నేర్చుకున్నట్టు, మనకు కష్టాలు వచ్చినప్పుడు తనతో ఉన్న మంచి సంబంధాన్ని కాపాడుకోవడానికి యెహోవా ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం నమ్మవచ్చు. (2 కొరిం. 4:7-9) ప్రవక్తయిన యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా విశ్వసనీయ ప్రేమ వల్లే మనం ఇంకా నాశనం కాలేదు, ఆయన ఎప్పటికీ కరుణ చూపిస్తూనే ఉంటాడు.” (విలా. 3:22) యెహోవా మనమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను, తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను గమనిస్తాయి.”—కీర్తన 33:18-22 చదవండి.

18-19. (ఎ) మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

18 మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? మనం యెహోవాను సేవించడం మొదలుపెట్టక ముందు, సాధారణంగా దేవుడు మనుషులందరి మీద చూపించే ప్రేమను రుచిచూశాం. కానీ తన ఆరాధకులుగా యెహోవా విశ్వసనీయ ప్రేమ నుండి కూడా ప్రయోజనం పొందుతున్నాం. ఆ విశ్వసనీయ ప్రేమ వల్లే ఆయన మనకు కాపుదలనిస్తున్నాడు. ఆయన మనకెప్పుడూ తోడుగా ఉంటూ, మన విషయంలో తనకున్న అద్భుతమైన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. మనం ఎప్పటికీ తన స్నేహితులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్త. 46:1, 2, 7) కాబట్టి మనకెలాంటి కష్టం వచ్చినా తనకు నమ్మకంగా ఉండడానికి కావాల్సిన శక్తిని యెహోవా మనకిస్తాడు.

19 యెహోవా తన సేవకుల మీద విశ్వసనీయ ప్రేమను ఎలా చూపిస్తాడో ఇప్పటివరకు తెలుసుకున్నాం. మనం కూడా ఒకరిపట్ల ఒకరం విశ్వసనీయ ప్రేమ చూపించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దాన్నెలా చేయవచ్చు? ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 136 యెహోవా “తగిన జీతాన్ని” ఇస్తాడు

^ పేరా 5 విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటి? యెహోవా ఎవరి మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు? ఆ ప్రేమను పొందేవాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? ఈ ఆర్టికల్‌ అలాగే తర్వాతి ఆర్టికల్‌ విశ్వసనీయ ప్రేమ గురించి చర్చిస్తుంది. పైనున్న మూడు ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబుల్ని తెలుసుకుంటాం.

^ పేరా 4 దేవుని అపారమైన విశ్వసనీయ ప్రేమ గురించి ఇతర లేఖనాల్లో కూడా ప్రస్తావించబడింది.—నెహెమ్యా 9:17; 13:22; కీర్తన 69:16; యోనా 4:2 చూడండి.

^ పేరా 54 చిత్రాల వివరణ: తన సేవకులతో పాటు మనుషులందరి మీద యెహోవా ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు ప్రజల మీద ప్రేమ చూపించే కొన్ని విధానాల్ని సర్కిల్స్‌లోని చిత్రాలు చూపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందే అవకాశాన్ని ఇచ్చాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: యెహోవా సేవకులై, విమోచనా క్రయధనం మీద విశ్వాసం ఉంచేవాళ్లు ఆయన ప్రేమను ప్రత్యేక రీతిలో రుచి చూస్తారు. సాధారణంగా మనుషులందరి మీద దేవుడు చూపించే ప్రేమను పొందడంతో పాటు, కేవలం తన సేవకుల మీద యెహోవా చూపించే విశ్వసనీయ ప్రేమను కూడా వాళ్లు రుచి చూస్తారు. ఆయన తన విశ్వసనీయ ప్రేమను ఎలా చూపిస్తున్నాడో సర్కిల్స్‌లోని చిత్రాల్లో చూస్తాం.