జీవిత కథ
“నేను యెహోవా కోసం పనిచేయాలి అనుకున్నాను”
సురినామ్ అడవుల్లోని గ్రాన్‌బూరీ అనే ఊరిలో కొన్ని రోజులు ఉన్నాక, మేము అక్కడి నుండి బయల్దేరాం. ఒక పడవలో టాపానహోనీ నది గుండా ప్రయాణిస్తున్నాం. అలా ప్రయాణిస్తుండగా మా పడవకున్న మోటర్ ఒక రాయిని ఢీ కొట్టింది. అప్పుడు పడవ ముందు భాగం, అలాగే మేమంతా నీళ్లలోకి వెళ్లిపోయాం. నా గుండె వేగంగా కొట్టుకుంది. నేను చాలా సంవత్సరాలుగా ప్రాంతీయ పర్యవేక్షకునిగా ఇలాంటి పడవల్లో ప్రయాణిస్తున్నాను, అయినా నాకు ఈత కొట్టడం రాదు.
తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు, నేను అసలు పూర్తికాల సేవ ఎలా మొదలుపెట్టానో చెప్తాను.
నేను 1942 లో కురాసోవ్ అనే అందమైన కరీబియన్ ద్వీపంలో పుట్టాను. మా నాన్న పుట్టి పెరిగింది సురినామ్‌లో, కానీ ఉద్యోగం కోసం ఆయన కురాసోవ్‌కి వచ్చాడు. నేను పుట్టకముందే, మా నాన్న బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాడు. కురాసోవ్‌లో మొట్టమొదటి యెహోవాసాక్షుల్లో మా నాన్న కూడా ఒకరు. a మేము ఐదుగురు పిల్లలం, నాన్న మాతో ప్రతీవారం బైబిలు స్టడీ చేసేవాడు. మేము కుదురుగా నేర్చుకోకపోయినా, ఆయన క్రమంగా మాకు బైబిలు గురించి నేర్పించేవాడు. నాకు 14 ఏళ్లున్నప్పుడు, నానమ్మను చూసుకోవడానికి ఆయన మమ్మల్ని సురినామ్‌కు తీసుకెళ్లిపోయాడు.
మంచి స్నేహితులు నా జీవితాన్ని మార్చేశారు
సురినామ్‌లో, యెహోవా సేవను ఉత్సాహంగా చేస్తున్న కొంతమంది యౌవనస్థులతో నేను స్నేహం చేశాను. వాళ్లు వయసులో నాకంటే కొంచెం పెద్దవాళ్లు, క్రమ పయినీర్లు. పరిచర్యలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయేవి. మీటింగ్స్ తర్వాత నేను, నా స్నేహితులు కొన్నిసార్లు ఆరుబయట కూర్చుని, నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని చూస్తూ బైబిలు విషయాలు మాట్లాడుకునేవాళ్లం. నా జీవితంలో నేను ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఆ స్నేహితులు సహాయం చేశారు. నేను యెహోవా కోసం పనిచేయాలి అనుకున్నాను. కాబట్టి 16 ఏళ్లకు బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాత 18 ఏళ్లకే, క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాను.
కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాను
పయినీరుగా సేవ చేస్తున్నప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నా పూర్తికాల సేవ అంతటిలో అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. మొదటిగా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో నేను నేర్చుకున్నాను. నేను పయినీరింగ్ మొదలుపెట్టినప్పుడు, విలమ్ వాన్ సెయిల్ అనే మిషనరీ నామీద ప్రత్యేక b సంఘంలో రకరకాల నియామకాల్ని ఎలా చేయాలో ఆయన నాకు నేర్పించాడు. నిజానికి ఆ సమయంలో నాకు ఆ శిక్షణ ఎంతో అవసరం. ఎందుకంటే తర్వాతి సంవత్సరం నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు. ఆ నియామకంలో భాగంగా, వర్షాలు ఎక్కువగా ఉండే సురినామ్ అడవుల్లో చాలా దూరంలో ఉన్న సహోదర సహోదరీల గుంపులతో కలిసి సేవ చేశాను. విలమ్ లాంటి సహోదరులు ఇచ్చిన శిక్షణ వల్లే నేను ఆ గుంపుల్ని చూసుకోగలిగాను. సరిగ్గా అవసరమైన సమయంలో నాకు శిక్షణ ఇచ్చినందుకు వాళ్లకు ఎంతో రుణపడివున్నాను. వాళ్లలాగే నేను కూడా సమయం తీసుకుని ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
శ్రద్ధ చూపిస్తూ ఎంతో సహాయం చేశాడు.నేను నేర్చుకున్న రెండో పాఠం ఏంటంటే, ముందే జాగ్రత్తగా లెక్క వేసుకుని సాదాసీదాగా జీవిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ నెల మొదట్లో నేను, నా పయినీరింగ్ పార్ట్‌నర్ కలిసి నెలకు సరిపడా సరుకుల లిస్టు రాసుకునే వాళ్లం. తర్వాత ఎవరో ఒకరం, దూరంలో ఉన్న రాజధాని నగరానికి వెళ్లి అవసరమైన సరుకులు కొనుక్కొచ్చే వాళ్లం. మా ఖర్చుల కోసం సంస్థ ఇచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ, సరుకులు నెల చివరివరకు వచ్చేలా పొదుపుగా జీవించేవాళ్లం. నెల మధ్యలోనే సరుకులు అయిపోతే, ఇక ఈ అడవుల్లో బ్రతకడం చాలా కష్టం! చిన్న వయసులోనే జాగ్రత్తగా లెక్క వేసుకుంటూ, సాదాసీదాగా జీవించడం నేర్చుకున్నాను కాబట్టే, జీవితాంతం యెహోవా సేవకు మొదటి స్థానం ఇవ్వగలిగాను అని నాకు అనిపిస్తుంది.
నేను నేర్చుకున్న మూడో పాఠం ఏంటంటే, ప్రజలకు వాళ్ల మాతృభాషలో బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నేను చిన్నప్పుడు డచ్, ఇంగ్లీష్, పాపియామెంటో భాషల్ని అలాగే సురినామ్‌లో ఎక్కువగా మాట్లాడే స్రానన్‌టోంగో (స్రానన్ అని కూడా పిలుస్తారు) భాషను నేర్చుకున్నాను. కానీ అడవుల్లోని ప్రజలకు వాళ్ల మాతృభాషలో మంచివార్త చెప్పినప్పుడు, అది వాళ్ల హృదయాన్ని చేరుకోవడం నేను గమనించాను. అయితే స్వరాన్ని పెంచి, తగ్గించి మాట్లాడే సరమకన్ లాంటి కొన్ని భాషలు మాట్లాడడం నాకు కష్టం అనిపించింది. అయినాసరే కష్టపడి నేర్చుకున్నందుకు మంచి ఫలితాలు వచ్చాయి. ప్రజలతో వాళ్ల మాతృభాషలో మాట్లాడడం వల్ల నేను ఎంతో మందికి సత్యం నేర్పించగలిగాను.
కొన్నిసార్లు పొరపాట్లు కూడా చేశాను. ఒకసారి, సరమకన్ భాష మాట్లాడే ఒక బైబిలు విద్యార్థికి ఒంట్లో బాలేదు. అప్పుడు నేను, “మీ కడుపు నొప్పి ఎలా ఉంది?” అని అడగాలనుకున్నాను. కానీ, “మీరు కడుపుతో ఉన్నారా?” అని అర్థం వచ్చే ప్రశ్న అడిగాను. అలా అడిగేసరికి ఆమె కొంచెం ఇబ్బందిపడింది. అలాంటి పొరపాట్లు చేసినాసరే, నేను సేవ చేస్తున్న ప్రాంతాల్లోని ప్రజల మాతృభాషలోనే మాట్లాడడానికి కృషిచేస్తూ వచ్చాను.
ఇంకొన్ని బాధ్యతలు
1970 లో, నన్ను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. ఆ సంవత్సరం, “యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం” అనే స్లైడ్ ప్రోగ్రామ్‌ను అడవుల్లో చాలా దూరంలో ఉన్న గ్రూపులకు చూపించాను. వాళ్లను కలవడానికి నేను, కొంతమంది సహోదరులు పడవలో వెళ్లేవాళ్లం. మాతోపాటు ఒక జనరేటర్, చిన్న పెట్రోల్ ట్యాంక్, కిరోసిన్ దీపాలు, అలాగే స్లైడ్‌లు చూపించడానికి అవసరమయ్యే వాటిని తీసుకెళ్లేవాళ్లం. వెళ్లాల్సిన ప్రాంతానికి చేరుకున్నాక, అడవి లోపల స్లైడ్ ప్రోగ్రామ్‌ను చూపించే
చోటికి సామాన్లన్నీ మోసుకెళ్లే వాళ్లం. ప్రజలు స్లైడ్ ప్రోగ్రామ్‌ను ఎంతో ఇష్టపడేవాళ్లు, ఆ ప్రయాణాలంతటిలో నాకు బాగా గుర్తున్న విషయం అదే. యెహోవా గురించి, ఆయన సంస్థలోని భూభాగం గురించి ఇతరులకు నేర్పించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇతరులు యెహోవాకు దగ్గరవ్వడం చూసినప్పుడు, నేను పడిన కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయని సంతోషించేవాన్ని.మూడు పేటల తాడు
పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ పూర్తికాల సేవచేయడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. అయినా నాకు పెళ్లి చేసుకోవాలి అనిపించింది. కాబట్టి దాని గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. అడవుల్లోని కష్టాల్ని సహిస్తూ, పూర్తికాల సేవను సంతోషంగా చేయగలిగే ఒక సహోదరిని భార్యగా ఇవ్వమని యెహోవాను అడిగాను. ఒక సంవత్సరం తర్వాత, ఎతెల్ అనే సహోదరితో కోర్ట్‌షిప్ మొదలుపెట్టాను. ఆమె ఒక ప్రత్యేక పయినీరు. కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవా సేవను సంతోషంగా చేయాలని ఆమె కోరుకునేది. చిన్నప్పటి నుండి ఆమెకు అపొస్తలుడైన పౌలు అంటే చాలా ఇష్టం. ఆయనలాగే పరిచర్యలో చేయగలిగినదంతా చేయాలని ఆమె అనుకుంది. మేము 1971, సెప్టెంబరులో పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ప్రాంతీయ సేవ మొదలుపెట్టాం.
ఎతెల్ వాళ్లది అంతగా డబ్బున్న కుటుంబమేమీ కాదు. కాబట్టి ఈ అడవుల్లో ప్రయాణ పనికి తను త్వరగానే అలవాటుపడింది. ఉదాహరణకు, అడవుల్లో దూరంలో ఉన్న సంఘాల్ని సందర్శించడానికి వెళ్లేటప్పుడు, చాలా తక్కువ సామాన్లు తీసుకెళ్లేవాళ్లం. నదుల్లోనే స్నానం చేసేవాళ్లం, అక్కడే బట్టలు ఉతుక్కునేవాళ్లం. అక్కడి సహోదరులు ఏం పెట్టినా మేం తినేవాళ్లం. వాళ్లు మాకు అడవుల్లో వేటాడినవి, నదుల్లో దొరికినవి పెట్టేవాళ్లు. కొన్నిసార్లు ఇగువానా అనే పెద్దపెద్ద బల్లుల్ని, పిరానా అనే భయంకరమైన చేపల్ని పెట్టేవాళ్లు. ప్లేట్లు లేనప్పుడు అరిటాకుల్లో తినేవాళ్లం, స్పూన్లు లేనప్పుడు చేత్తో తినేవాళ్లం. త్యాగాలు చేస్తూ, యెహోవా సేవను కలిసి చేయడం వల్ల మా మూడు పేటల తాడు మరింత బలంగా తయారైంది. (ప్రసం. 4:12) నిజంగా అది ఎంతో వెలకట్టలేని ఆశీర్వాదం!
అలా ఒకసారి అడవుల్లోని మారుమూల ప్రాంతానికి వెళ్లి వస్తున్నప్పుడు, నేను మొదట్లో చెప్పిన సంఘటన జరిగింది. లోతు తక్కువగా ఉండి, నీళ్లు వేగంగా ప్రవహించే చోట, పడవ ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోయి, వెంటనే పైకి వచ్చేసింది. మంచి విషయం ఏంటంటే, మేమందరం లైఫ్ జాకెట్లు వేసుకున్నాం, అలాగే నదిలో పడిపోలేదు. మా పడవలోకి మాత్రం నీళ్లు వచ్చేశాయి. అప్పుడు మా దగ్గర ఉన్న గిన్నెల్లోని ఆహారాన్ని పడేసి, ఆ గిన్నెలతో పడవలో ఉన్న నీళ్లను నదిలో పారబోశాం.
తినడానికి మా దగ్గర ఇంకేమీ మిగల్లేదు. దాంతో మేము ఆ నదిలో చేపలు పట్టడం మొదలుపెట్టాం. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. మేము యెహోవాకు ప్రార్థించి, ఆ రోజుకు మాకు కావల్సిన ఆహారం ఇవ్వమని అడిగాం. అలా ప్రార్థించిన వెంటనే, ఒక సహోదరునికి పెద్ద చేప దొరికింది. దాంతో మేము ఐదుగురం ఆ రాత్రి తృప్తిగా తిన్నాం.
ఒక భర్తగా, తండ్రిగా, ప్రయాణ పర్యవేక్షకునిగా
ఐదు సంవత్సరాలు ప్రాంతీయ సేవలో కలిసి పనిచేసిన తర్వాత మాకు ఊహించని ఒక ఆశీర్వాదం దొరికింది, ఎతెల్ గర్భవతి అయింది. ఆ వార్త విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ పిల్లలు పుట్టాక మా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలీదు. సాధ్యమైనంత వరకు పూర్తికాల సేవలోనే ఉండాలని నేను, ఎతెల్ అనుకున్నాం. 1976 లో మా పెద్దబ్బాయి ఎత్నియల్ పుట్టాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత మా రెండో అబ్బాయి జోవానీ పుట్టాడు.
ఆ సమయంలో సురినామ్‌లో అవసరం ఎక్కువ ఉంది కాబట్టి, పిల్లల్ని పెంచుతూనే ప్రయాణ సేవలో కొనసాగమని బ్రాంచి మాకు చెప్పింది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, నన్ను తక్కువ సంఘాలు ఉండే సర్క్యూట్‌లకు నియమించారు. దానివల్ల నేను దాదాపు ప్రతీ నెల రెండు వారాలు ప్రయాణ పర్యవేక్షకునిగా పనిచేసేవాన్ని. నెలలో మిగిలిన సమయమంతా, మమ్మల్ని నియమించిన సంఘంలో పయినీరు సేవ చేసేవాన్ని. ఇంటికి దగ్గర్లో ఉన్న సంఘాల్ని సందర్శించినప్పుడు ఎతెల్, పిల్లలు నాతో వచ్చేవాళ్లు. అయితే అడవుల్లో ఉన్న సంఘాల సందర్శనాలకు, సమావేశాలకు నేను ఒక్కణ్ణే వెళ్లేవాన్ని.
నా బాధ్యతలన్నీ చక్కగా చేయడానికి చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకునేవాన్ని. కుటుంబ అధ్యయనం ప్రతీవారం జరిగేలా చూసుకునేవాన్ని. అడవుల్లో ఉన్న సంఘాల్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు, ఎతెల్ పిల్లలతో కుటుంబ అధ్యయనం చేసేది. వీలైనప్పుడల్లా, పనుల్ని కుటుంబమంతా కలిసి చేసేవాళ్లం. మేము పిల్లలతో కలిసి బయటికి వెళ్లేవాళ్లం, ఆడుకునేవాళ్లం. సాధారణంగా నా నియామకాల కోసం సిద్ధపడడానికి, రాత్రుళ్లు ఆలస్యంగా పడుకునేవాన్ని. ఎతెల్, సామెతలు 31:15 లో ఉన్న గుణవతియైన భార్యలా చీకటితోనే నిద్రలేచి పనులన్నీ చేసేది. దానివల్ల పిల్లల్ని స్కూల్‌కు పంపించే ముందే, మేమంతా కలిసి దినవచనం చదవడం, టిఫిన్ చేయడం సాధ్యమయ్యేది. అలా నా బాధ్యతలన్నీ చక్కగా చేయడానికి, చేదోడువాదోడుగా ఉండే మంచి భార్య దొరకడం నిజంగా గొప్ప ఆశీర్వాదం!
యెహోవా దేవున్ని, పరిచర్యను ప్రేమించేలా మా పిల్లలకు సహాయం చేయడానికి తల్లిదండ్రులుగా మేము చేయగలిగినదంతా చేశాం. వాళ్లు పూర్తికాల సేవ చేయాలని మేము కోరుకున్నాం. అయితే మేము చెప్తున్నాం అని కాదుగానీ, వాళ్లు సొంతగా ఆ నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నాం. పూర్తికాల సేవలో ఎంత ఆనందం ఉందో మేము ఎప్పుడూ చెప్తుండేవాళ్లం. కష్టాలు ఎదురైనా యెహోవా మాకు ఎలా సహాయం చేశాడో, కుటుంబమంతటినీ ఎలా దీవించాడో వాళ్లకు చెప్తుండేవాళ్లం. అలాగే యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చే సహోదర సహోదరీలతో మా అబ్బాయిలు ఎక్కువ సమయం గడిపేలా చూసుకున్నాం.
యెహోవా మా కుటుంబ అవసరాలన్నీ తీర్చాడు, నేను కూడా చేయగలిగినదంతా చేశాను. అడవుల్లో ప్రత్యేక పయినీరుగా సేవ చేసినప్పుడు, జాగ్రత్తగా లెక్క వేసుకుని ఇంట్లో సరిపడా సరుకులు ఉండేలా చూసుకోవడం నేర్చుకున్నాను. ఆ అనుభవం బాగా ఉపయోగపడింది. కానీ కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇబ్బందులు తప్పేవి కాదు. అలాంటి సమయాల్లో యెహోవాయే మాకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. ఉదాహరణకు, 1986 నుండి 1992 వరకు సురినామ్‌లో చాలా పెద్ద అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో, కొన్నిసార్లు నిత్యావసరాలు దొరకడం కూడా కష్టమైపోయింది. అలాంటప్పుడు కూడా యెహోవా మా అవసరాలు తీర్చాడు.—మత్త. 6:32.
వెనక్కి తిరిగి చూసినప్పుడు
ఒక్కసారి వెనక్కి తిరిగి మా జీవితం గురించి ఆలోచించినప్పుడు, యెహోవా మాకు ఎప్పుడూ తోడున్నాడని అనిపిస్తుంది. సంతోషంగా, సంతృప్తిగా ఉండడానికి ఆయన మాకు సహాయం చేశాడు. పిల్లలు పుట్టడం, వాళ్లను యెహోవా సేవకులు అయ్యేలా పెంచడం మాకు దొరికిన గొప్ప ఆశీర్వాదాలు. వాళ్లు కూడా పూర్తికాల సేవ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా అబ్బాయిలు ఎత్నియల్, జోవానీ సంస్థ ఏర్పాటు చేసిన పాఠశాలలకు హాజరయ్యారు. ఇప్పుడు వాళ్లు తమ భార్యలతో కలిసి సురినామ్ బ్రాంచి ఆఫీస్‌లో సేవచేస్తున్నారు.
నేను, ఎతెల్ ఇప్పుడు బాగా ముసలివాళ్లం అయిపోయాం. అయినాసరే యెహోవా పనిలో బిజీగా ఉంటూ ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నాం. మేము ఎంత బిజీ అంటే, ఈత నేర్చుకోవడానికి నాకు ఇప్పటికీ టైం దొరకట్లేదు. కానీ నేను తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎప్పుడూ బాధపడను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, జీవితాంతం పూర్తికాల సేవ చేయాలని యౌవనంలోనే నిర్ణయించుకుని చాలా మంచి పని చేశానని బలంగా చెప్తాను.
b విలమ్ వాన్ సెయిల్ జీవిత కథ చదవడానికి 1999, నవంబరు 8, తేజరిల్లు! పత్రికలో “వాస్తవం నా నిరీక్షణలను మించిపోయింది” అనే ఆర్టికల్ చూడండి.