కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 45

పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?

పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?

‘వాళ్లు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని ఖచ్చితంగా తెలుసుకుంటారు.’యెహె. 2:5.

పాట 67 ‘వాక్యాన్ని ప్రకటించండి’

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనకు ఏ విషయం తెలుసు, అయినా ఏ నమ్మకంతో ఉండవచ్చు?

 ప్రకటించేటప్పుడు కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తారని మనకు తెలుసు. ఆ వ్యతిరేకత భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవ్వవచ్చు. (దాని. 11:44; 2 తిమో. 3:12; ప్రక. 16:21) అయితే, యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. తమ నియామకాల్ని చేయడానికి యెహోవా తన సేవకులకు ఎప్పుడూ సహాయం చేశాడు. ఆ నియామకాలు ఎంత కష్టమైనవైనా సరే ఆయన వాళ్లకు తోడున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన బబులోనులో బందీలుగా ఉన్న యూదులకు ప్రకటించే నియామకం పొందాడు.

2. యెహెజ్కేలు ఎలాంటి వాళ్లకు ప్రకటించాలి అని యెహోవా చెప్పాడు? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం? (యెహెజ్కేలు 2:3-6)

2 యెహెజ్కేలు ఎలాంటి వాళ్లకు ప్రకటించాడు? వాళ్లు “మొండివాళ్లు,” “కఠిన హృదయులు,” “తిరుగుబాటు చేసే ప్రజలు” అని యెహోవా చెప్పాడు. వాళ్లు ముళ్లు, తేళ్లలా ప్రమాదకరమైన ప్రజలు. అందుకే యెహోవా యెహెజ్కేలుతో, “భయపడకు” అని చాలాసార్లు చెప్పాడు. (యెహెజ్కేలు 2:3-6 చదవండి.) యెహెజ్కేలు తన నియామకాన్ని చక్కగా చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవేంటంటే: (1) ఆయన్ని యెహోవా పంపించాడు, (2) ఆయన పవిత్రశక్తి ఇచ్చే బలాన్ని పొందాడు, (3) దేవుని మాటల వల్ల ఆయన విశ్వాసం బలపడింది. ఈ మూడు విషయాలు యెహెజ్కేలుకు ఎలా సహాయం చేశాయి? ఈరోజుల్లో అవి మనకు ఎలా సహాయం చేస్తాయి? వాటి గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

యెహెజ్కేలును యెహోవా పంపించాడు

3. ఏ మాటలు యెహెజ్కేలులో ధైర్యాన్ని నింపివుంటాయి? యెహెజ్కేలుకు తన సహాయం ఉంటుందని యెహోవా ఎలా భరోసా ఇచ్చాడు?

3 యెహోవా యెహెజ్కేలుతో, “నేను నిన్ను పంపిస్తున్నాను” అని అన్నాడు. (యెహె. 2:3, 4) ఆ మాటలు యెహెజ్కేలులో ఎంతో ధైర్యాన్ని నింపివుంటాయి. ఎందుకంటే యెహోవా మోషేను, యెషయాను ప్రవక్తలుగా ఎంచుకున్నప్పుడు ఇలాంటి మాటల్నే చెప్పాడని యెహెజ్కేలుకు ఖచ్చితంగా గుర్తొచ్చి ఉంటుంది. (నిర్గ. 3:10; యెష. 6:8) కష్టమైన నియామకాల్ని చక్కగా చేయడానికి యెహోవా ఆ ఇద్దరికి ఎలా సహాయం చేశాడో కూడా యెహెజ్కేలుకు తెలుసు. కాబట్టి “నేను నిన్ను పంపిస్తున్నాను” అని యెహోవా యెహెజ్కేలుకు రెండుసార్లు చెప్పినప్పుడు, యెహోవా సహాయం ఆయనకు ఖచ్చితంగా ఉంటుందని నమ్మాడు. అలాగే యెహెజ్కేలు పుస్తకంలో, ‘యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చింది’ అనే మాట చాలాసార్లు కనిపిస్తుంది. (యెహె. 3:16) ‘యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చింది’ అనే మాట కూడా పదేపదే కనిపిస్తుంది. (యెహె. 6:1) కాబట్టి తనను యెహోవాయే పంపించాడని యెహెజ్కేలు బలంగా నమ్మాడు. అంతేకాదు యెహెజ్కేలు వాళ్ల నాన్న, ఒక యాజకుడు. తన ప్రవక్తలకు తోడుంటానని యెహోవా ఇచ్చిన భరోసా గురించి ఆయన యెహెజ్కేలుకు నేర్పించి ఉంటాడు. ఉదాహరణకు ఇస్సాకు, యాకోబు, యిర్మీయాలతో “నేను నీకు తోడుగా ఉన్నాను” లేదా “నేను నీతో ఉన్నాను” అని యెహోవా అన్నాడు.—ఆది. 26:24; 28:15; యిర్మీ. 1:8.

4. ఇంకా ఏ మాటలు యెహెజ్కేలుకు ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చి ఉంటాయి?

4 యెహెజ్కేలు ప్రకటించినప్పుడు చాలామంది ఇశ్రాయేలీయులు ఎలా స్పందిస్తారు? యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ఇంటివాళ్లు నువ్వు చెప్పేది వినరు, ఎందుకంటే నేను చెప్పేది వినడం వాళ్లకు ఇష్టం లేదు.” (యెహె. 3:7) ఆ మాట, ప్రజలు పట్టించుకోనంత మాత్రాన తను ప్రవక్తగా సరిగ్గా పని చేయనట్టు అవ్వదనే ఓదార్పును యెహెజ్కేలుకు ఇచ్చి ఉంటుంది. యెహెజ్కేలు చెప్పేది పట్టించుకోకపోవడం ద్వారా, ఇశ్రాయేలీయులు యెహోవానే వద్దనుకున్నారు. యెహెజ్కేలు ప్రకటించిన తీర్పు సందేశాలన్నీ నెరవేరినప్పుడు, ప్రజలు ‘తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు’ అని కూడా యెహోవా చెప్పాడు. (యెహె. 2:5; 33:33) ఈ మాటలన్నీ, పరిచర్య చేయడానికి కావల్సిన ధైర్యాన్ని యెహెజ్కేలుకు ఇచ్చి ఉంటాయి.

మనల్ని యెహోవా పంపిస్తున్నాడు

యెహెజ్కేలు కాలంలోలాగే, మన చుట్టూ ఉన్న ప్రజలు మనం చెప్పే సందేశాన్ని వినకపోవచ్చు లేదా మనల్ని వ్యతిరేకించవచ్చు. కానీ యెహోవా మనతో ఉన్నాడని మనకు తెలుసు (5-6 పేరాలు చూడండి)

5. యెషయా 44:8 ప్రకారం, మనం ఎందుకు ధైర్యంగా ఉండవచ్చు?

5 మనం కూడా ధైర్యంగా ఉండవచ్చు, ఎందుకంటే యెహోవాయే మనల్ని పంపిస్తున్నాడు. మనల్ని తన “సాక్షులు” అని పిలుస్తూ గౌరవిస్తున్నాడు. (యెష. 43:10) అది నిజంగా ఎంత గొప్ప గౌరవమో కదా! యెహోవా యెహెజ్కేలుకు చెప్పినట్టే, మనకు కూడా “భయపడకండి” అని చెప్తున్నాడు. అలా వ్యతిరేకులకు భయపడకుండా ఉండడానికి మన దగ్గర బలమైన కారణాలే ఉన్నాయి. యెహెజ్కేలులాగే మనల్ని పంపించేది, మనకు తోడుగా ఉండేది యెహోవాయే.—యెషయా 44:8 చదవండి.

6. (ఎ) యెహోవా మనకు సహాయం చేస్తాడని ఏ మాటల్ని బట్టి చెప్పవచ్చు? (బి) మనం ధైర్యాన్ని, ఓదార్పును ఎలా పొందవచ్చు?

6 యెహోవా మనకు సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఉదాహరణకు, “మీరే నాకు సాక్షులు” అని చెప్పే ముందు ఆయన ఇలా అన్నాడు: “నువ్వు జలాల గుండా వెళ్లేటప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను; నువ్వు నదుల గుండా వెళ్లినప్పుడు, అవి నిన్ను ముంచెత్తవు. అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, అగ్ని జ్వాల వల్ల కమిలిపోవు.” (యెష. 43:2) పరిచర్య చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సమస్యలు మనల్ని ముంచెత్తవచ్చు, అగ్నిలాంటి కష్టాలు రావచ్చు. అలాంటప్పుడు కూడా ప్రకటించడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. (యెష. 41:13) యెహెజ్కేలు కాలంలోలాగే, ఈరోజుల్లో కూడా చాలామంది మనం చెప్పేది వినట్లేదు. అంతమాత్రాన దేవుని సాక్షులుగా మనం ఆయన పనిని సరిగ్గా చేయనట్టు అవ్వదు. మనం నమ్మకంగా ప్రకటిస్తున్నందుకు యెహోవా సంతోషిస్తున్నాడని తెలుసుకోవడం ద్వారా ఓదార్పును, ధైర్యాన్ని పొందుతాం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ప్రతీ వ్యక్తి తన పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతాడు.” (1 కొరిం. 3:8; 4:1, 2) ఎన్నో ఏళ్లుగా పయినీరు సేవ చేస్తున్న ఒక సహోదరి ఇలా అంటుంది: “యెహోవా మన ప్రయత్నాల్ని ఆశీర్వదిస్తాడని తెలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది.”

యెహెజ్కేలు, పవిత్రశక్తి ఇచ్చే బలాన్ని పొందాడు

యెహెజ్కేలు దర్శనంలో, యెహోవా పరలోక రథాన్ని చూశాడు. తన పరిచర్యను చేయడానికి యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని అది ఆయనలో పెంచింది (7వ పేరా చూడండి)

7. దర్శనం గురించి ఆలోచించినప్పుడల్లా, యెహెజ్కేలులో ఏ నమ్మకం పెరిగి ఉంటుంది (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

7 పవిత్రశక్తి ఎంత బలమైనదో యెహెజ్కేలు ఒక దర్శనంలో చూశాడు. పవిత్రశక్తి దూతలకు ఎలా సహాయం చేస్తుందో, పరలోక రథానికి ఉన్న పెద్ద చక్రాల్ని ఎలా నడిపిస్తుందో ఆయన చూశాడు. (యెహె. 1:20, 21) అప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడు? ఆయన ఇలా అన్నాడు: “అది చూసినప్పుడు నేను సాష్టాంగపడ్డాను.” భయంతో, ఆశ్చర్యంతో యెహెజ్కేలు కింద పడిపోయాడు. (యెహె. 1:28) ఆ దర్శనం గురించి ఆలోచించినప్పుడల్లా, యెహోవా పవిత్రశక్తి సహాయంతో తన పరిచర్యను చేయగలననే నమ్మకం యెహెజ్కేలులో పెరిగి ఉంటుంది.

8-9. (ఎ) యెహోవా యెహెజ్కేలుతో లేచి నిలబడమని చెప్పినప్పుడు ఏం జరిగింది? (బి) కష్టమైన నియామకాన్ని చేయడానికి యెహోవా యెహెజ్కేలును ఇంకా ఎలా సిద్ధం చేశాడు?

8 యెహోవా యెహెజ్కేలుతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, లేచి నిలబడు, నేను నీతో మాట్లాడాలి.” ఆ మాట, అలాగే దేవుని పవిత్రశక్తి యెహెజ్కేలుకు లేచి నిలబడడానికి కావల్సిన బలాన్ని ఇచ్చాయి. ఆయన ఇలా అంటున్నాడు: “పవిత్రశక్తి నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది.” (యెహె. 2:1, 2) అప్పటినుండి యెహెజ్కేలు పరిచర్య అంతటిలో, దేవుని “చెయ్యి” అంటే దేవుని పవిత్రశక్తి ఆయన్ని నడిపించింది. (యెహె. 3:22; 8:1; 33:22; 37:1; 40:1) “మొండివాళ్లు, కఠిన హృదయులు” అయిన ప్రజలకు ప్రకటించే నియామకాన్ని చేయడానికి కావల్సిన బలాన్ని పవిత్రశక్తి యెహెజ్కేలుకు ఇచ్చింది. (యెహె. 3:7) యెహోవా యెహెజ్కేలుతో ఇలా అన్నాడు: “నేను నీ ముఖాన్ని వాళ్ల ముఖమంత కఠినంగా చేశాను, నీ నుదురును వాళ్ల నుదురంత కఠినంగా చేశాను. నేను నీ నుదురును చెకుముకి రాయి కంటే గట్టిగా, వజ్రంలా చేశాను. వాళ్లకు భయపడకు, వాళ్ల ముఖాలు చూసి బెదిరిపోకు.” (యెహె. 3:8, 9) ఇంకో మాటలో చెప్పాలంటే, యెహోవా యెహెజ్కేలుతో ఇలా అన్నాడు: ‘వాళ్ల మొండితనాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడకు. నేను నిన్ను బలపరుస్తాను.’

9 ఆ తర్వాత, పవిత్రశక్తి ఆయన్ని తాను ప్రకటించాల్సిన ప్రాంతానికి తీసుకెళ్లింది. “యెహోవా చెయ్యి నా మీద బలంగా ఉండిపోయింది” అని యెహెజ్కేలు అన్నాడు. పూర్తి నమ్మకంతో ప్రకటించగలిగేలా, తను ప్రకటించాల్సిన సందేశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి యెహెజ్కేలుకు ఒక వారం పట్టింది. (యెహె. 3:14, 15) తర్వాత, ఒక లోయ మైదానానికి వెళ్లమని యెహోవా యెహెజ్కేలుకు చెప్పాడు. అప్పుడు ‘పవిత్రశక్తి ఆయనలోకి ప్రవేశించింది.’ (యెహె. 3:23, 24) యెహెజ్కేలు ఇప్పుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు.

మనం పవిత్రశక్తి ఇచ్చే బలాన్ని పొందుతున్నాం

యెహెజ్కేలులాగే, నేడు మన పరిచర్యను పూర్తి చేయడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి? (10వ పేరా చూడండి)

10. ప్రకటించడానికి మనకు ఏం అవసరం? ఎందుకు?

10 ప్రకటించడానికి మనకు ఏం అవసరం? యెహెజ్కేలు గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రకటించడం మొదలుపెట్టక ముందే, పవిత్రశక్తి ఆయనకు కావల్సిన బలాన్ని ఇచ్చింది. ఈరోజుల్లో కూడా, పవిత్రశక్తి సహాయంతోనే మనం ప్రకటించగలుగుతున్నాం. ఎందుకలా చెప్పవచ్చంటే, ప్రకటనా పనిని ఆపడానికి సాతాను మనతో యుద్ధం చేస్తున్నాడు. (ప్రక. 12:17) సాతాను చాలా శక్తిమంతుడు, అతన్ని అస్సలు ఓడించలేమని చాలామంది అనుకుంటారు. కానీ ప్రకటనా పని ద్వారా మనం అతన్ని జయిస్తున్నాం. (ప్రక. 12:9-11) ఏవిధంగా? మనం ప్రకటించినప్పుడు, సాతాను బెదిరింపులకు భయపడట్లేదని చూపిస్తున్నాం. మనం ప్రకటించిన ప్రతీసారి, సాతాను ఓడిపోతున్నట్టే. ఇంత వ్యతిరేకత ఉన్నా మనం ప్రకటిస్తున్నాం అంటే ఏం రుజువౌతుంది? యెహోవా పవిత్రశక్తి మనకు బలాన్ని ఇస్తోందని, ఆయన ఆమోదం మనకు ఉందని రుజువౌతుంది.—మత్త. 5:10-12; 1 పేతు. 4:14.

11. పవిత్రశక్తి మనకు ఎలా సహాయం చేస్తుంది? పవిత్రశక్తిని పొందుతూ ఉండాలంటే మనం ఏం చేయాలి?

11 యెహెజ్కేలు ముఖాన్ని, నుదురును యెహోవా కఠినంగా చేశాడని లేఖనాల్లో ఉన్న మాటల్ని బట్టి మనం ఇంకా ఏ ధైర్యాన్ని పొందవచ్చు? మనం పరిచర్యలో ఎలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా, దానికి తగ్గట్టు మనకు కావల్సిన బలాన్ని పవిత్రశక్తి ఇస్తుంది. (2 కొరిం. 4:7-9) పవిత్రశక్తిని పొందుతూ ఉండాలంటే మనం ఏం చేయాలి? యెహోవా మన ప్రార్థనల్ని వింటాడనే నమ్మకంతో దానికోసం పట్టుదలగా ప్రార్థించాలి. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “అడుగుతూ ఉండండి, . . . వెతుకుతూ ఉండండి, . . . తడుతూ ఉండండి.” అప్పుడు యెహోవా, ‘తనను అడిగేవాళ్లకు పవిత్రశక్తిని ఇస్తాడు.’—లూకా 11:9, 13; అపొ. 1:14; 2:4.

దేవుని మాటలవల్ల యెహెజ్కేలు విశ్వాసం బలపడింది

12. యెహెజ్కేలు 2:9–3:3 ప్రకారం, గ్రంథపు చుట్ట ఎక్కడి నుండి వచ్చింది? అందులో ఏముంది?

12 దేవుని పవిత్రశక్తివల్ల యెహెజ్కేలు ధైర్యంగా ప్రకటించగలిగాడు. దాంతోపాటు, దేవుడు చెప్పిన మాటల వల్ల ఆయన విశ్వాసం బలపడింది. దర్శనంలో, ఒక గ్రంథపు చుట్టను పట్టుకొనివున్న చేతిని యెహెజ్కేలు చూశాడు. (యెహెజ్కేలు 2:9–3:3 చదవండి.) ఆ గ్రంథపు చుట్ట ఎక్కడినుండి వచ్చిందో, దానిలో ఏముందో, అది యెహెజ్కేలు విశ్వాసాన్ని ఎలా బలపర్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గ్రంథపు చుట్ట దేవుని సింహాసనం నుండి వచ్చింది. యెహెజ్కేలు ఇంతకుముందు చూసిన నలుగురు దేవదూతల్లో ఒకరు దాన్ని ఆయనకు ఇచ్చి ఉంటారు. (యెహె. 1:8; 10:7, 20) ఆ గ్రంథపు చుట్టలో దేవుని మాటలున్నాయి, అది తిరుగుబాటుదారులైన ప్రజలకు యెహెజ్కేలు చెప్పాల్సిన తీర్పు సందేశం. (యెహె. 2:7) అది ఆ గ్రంథపు చుట్ట రెండు వైపులా రాసివుంది.

13. గ్రంథపు చుట్టను ఏం చేయమని యెహోవా యెహెజ్కేలుకు చెప్పాడు? అది ఎందుకు తియ్యగా ఉంది?

13 ఆ గ్రంథపు చుట్టను “తిని దానితో కడుపు నింపుకో” అని యెహోవా యెహెజ్కేలుకు చెప్పాడు. అప్పుడాయన దాన్ని పూర్తిగా తినేశాడు. దాని అర్థమేంటి? తాను ప్రకటించబోయే సందేశాన్ని యెహెజ్కేలు పూర్తిగా అర్థంచేసుకోవాలి, అది ఆయనలో ఒక భాగమైపోవాలి. అంటే, ఇతరులకు ప్రకటించగలిగేలా ఆయన ఆ సందేశాన్ని నమ్మాలి. ఆసక్తికరంగా, ఆ గ్రంథపు చుట్ట “తేనెలా తియ్యగా ఉంది” అని యెహెజ్కేలు అన్నాడు. (యెహె. 3:3) ఎందుకంటే, యెహోవా ప్రతినిధిగా ఉండే గౌరవాన్ని యెహెజ్కేలు ఒక మధురమైన అనుభవంలా చూశాడు. (కీర్త. 19:8-11) యెహోవా తనను ప్రవక్తగా ఎంచుకున్నందుకు యెహెజ్కేలు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు.

14. తన నియామకం కోసం సిద్ధంగా ఉండేలా యెహెజ్కేలుకు ఏం సహాయం చేసింది?

14 ఆ తర్వాత యెహోవా యెహెజ్కేలుతో, “నేను నీకు చెప్పే మాటలన్నిటినీ మనసుపెట్టి విను” అన్నాడు. (యెహె. 3:10) అంటే గ్రంథపు చుట్టలో ఉన్న విషయాలన్నిటినీ యెహెజ్కేలు గుర్తుంచుకుని, వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించాలని యెహోవా చెప్తున్నాడు. అలా చేసినప్పుడు యెహెజ్కేలు విశ్వాసం బలపడింది. అంతేకాదు ఆ గ్రంథపు చుట్టలో, ప్రజలకు ప్రకటించాల్సిన శక్తివంతమైన సందేశం ఉందని ఆయనకు నమ్మకం కుదిరింది. (యెహె. 3:11) ఆ విధంగా యెహెజ్కేలు దేవుని సందేశాన్ని బాగా అర్థం చేసుకుని, దాన్ని నమ్మి, తన నియామకాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.—కీర్తన 19:14.

దేవుని మాటల వల్ల మన విశ్వాసం బలపడుతుంది

15. ప్రకటనా పనిలో ఆగకుండా కొనసాగాలంటే, వేటిని “మనసుపెట్టి వినాలి”?

15 ప్రకటనా పనిలో ఆగకుండా కొనసాగాలంటే, మనం కూడా దేవుని వాక్యంతో మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. యెహోవా మనకు చెప్తున్న వాటిని “మనసుపెట్టి వినాలి.” నేడు యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మన ఉద్దేశాలు, భావాలు, ఆలోచనలు దేవుని వాక్యానికి తగ్గట్టు ఉండాలంటే మనం ఏం చేయాలి?

16. మనం దేవుని వాక్యంతో ఏం చేయాలి? దాన్ని ఎలా బాగా అర్థం చేసుకోవచ్చు?

16 ఆహారం తిని, అరిగించుకున్నప్పుడు మనం బలంగా తయారౌతాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. గ్రంథపు చుట్టకు సంబంధించిన పాఠాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. తన వాక్యంతో మనం ‘కడుపు నింపుకోవాలని,’ అంటే దాన్ని బాగా అర్థం చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ప్రార్థించి, చదివి, ధ్యానించడం ద్వారా మనం అలా చేయవచ్చు. మనం మొదటిగా, దేవుని ఆలోచనల్ని తెలుసుకునేలా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రార్థిస్తాం. తర్వాత బైబిల్లోని కొంతభాగాన్ని చదువుతాం. ఆ తర్వాత చదివిన దానిగురించి ధ్యానించడానికి కాస్త సమయం తీసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువ ధ్యానిస్తే, మన విశ్వాసం అంత ఎక్కువ బలపడుతుంది.

17. బైబిల్ని చదివి, ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?

17 బైబిల్ని చదివి, ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం? నేడు మంచివార్తను ప్రకటించడానికి, భవిష్యత్తులో కఠినమైన తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి కావల్సిన ధైర్యాన్ని పొందాలంటే అది చాలా ప్రాముఖ్యం. అలాగే యెహోవాకు ఉన్న మంచి లక్షణాల గురించి ధ్యానించినప్పుడు ఆయనతో మన స్నేహం ఇంకా బలపడుతుంది. అప్పుడు మనం మనశ్శాంతిని, సంతృప్తిని పొందుతాం. అది నిజంగా మధురమైన అనుభవంలా ఉంటుంది.—కీర్త. 119:103.

యెహోవా సహాయంతో పరిచర్యను కొనసాగిద్దాం

18. ప్రజలు ఖచ్చితంగా ఏం ఒప్పుకోవాలి?

18 యెహెజ్కేలుతో నేరుగా మాట్లాడినట్టు, యెహోవా నేడు మనతో నేరుగా మాట్లాడట్లేదు. అయినా, మనం దేవుని వాక్యంలో ఉన్న సందేశాన్ని ప్రకటిస్తున్నాం. యెహోవా ఆపమని చెప్పేంతవరకు ఆ పనిని కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. తీర్పు సమయం వచ్చినప్పుడు, మమ్మల్ని ఎవ్వరూ హెచ్చరించలేదని లేదా దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని ఎవ్వరూ సాకులు చెప్పలేరు. (యెహె. 3:19; 18:23) మనం ప్రకటించిన సందేశం దేవుని నుండే వచ్చిందని ఆ సమయంలో వాళ్లు ఒప్పుకోవాల్సిందే.

19. మన పరిచర్యను పూర్తి చేయడానికి ఏవి సహాయం చేస్తాయి?

19 మన పరిచర్యను పూర్తి చేయడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి? యెహెజ్కేలుకు సహాయం చేసిన మూడు విషయాలే మనకు కూడా సహాయం చేస్తాయి. యెహోవాయే మనల్ని పంపిస్తున్నాడని, ఆయన పవిత్రశక్తి మనకు బలాన్ని ఇస్తుందని, ఆయన వాక్యం ద్వారా మన విశ్వాసం బలపడుతుందని తెలుసు కాబట్టే మనం ప్రకటిస్తున్నాం. యెహోవా సహాయంతో “అంతం వరకు” ప్రకటనా పనిలో కొనసాగుదాం.—మత్త. 24:13.

పాట 65 ముందుకు సాగిపోదాం!

a ప్రకటించడానికి యెహెజ్కేలు ప్రవక్తకు సహాయం చేసిన మూడు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. తన ప్రవక్తకు యెహోవా ఎలా సహాయం చేశాడో తెలుసుకోవడం ద్వారా, ఆయన మనకు కూడా పరిచర్య చేయడానికి సహాయం చేస్తాడనే నమ్మకాన్ని బలపర్చుకోవచ్చు.