కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

మొర్దెకై నిజంగా జీవించిన వ్యక్తా?

బైబిల్లోని ఎస్తేరు పుస్తకాన్ని చదివితే, యూదుడైన మొర్దెకై ఒక ముఖ్యమైన వ్యక్తి అని అర్థమౌతుంది. ఈయన “అహష్వేరోషు (నేడు చాలామంది ఆయన్ని గ్సెరెక్సెస్‌ I అని కూడా పిలుస్తారు) పరిపాలిస్తున్న రోజుల్లో” అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పర్షియా రాజభవనంలో పనిచేసేవాడు. ఒకసారి కొంతమంది రాజును చంపాలని కుట్ర పన్నినప్పుడు, మొర్దెకై ఆ కుట్రను బయటపెట్టాడు. అప్పుడు రాజు కృతజ్ఞతతో అందరి ముందు ఆయన్ని ఘనపర్చాడు. మొర్దెకైకి, ఇతర యూదులకు శత్రువైన హామాను చనిపోయినప్పుడు రాజు ఆయన్ని ప్రధానమంత్రిగా చేశాడు. అలాంటి ఉన్నత స్థానంలో ఉండడం వల్ల మొర్దెకై ఒక ఆజ్ఞను జారీ చేయగలిగాడు. దాంతో యూదులు పర్షియా రాజ్యం నుండి పూర్తిగా నిర్మూలం అవ్వకుండా, తమను తాము కాపాడుకోగలిగారు.—ఎస్తేరు 1:1; 2:5, 21-23; 8:1, 2; 9:16.

అయితే ఎస్తేరు పుస్తకం ఒక కట్టుకథ అని, మొర్దెకై అసలు జీవించలేదని కొంతమంది చరిత్రకారులు అనేవాళ్లు. కానీ 1941 లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో, పరిశోధకులు కొన్ని రుజువుల్ని కనుగొన్నారు. అవి మొర్దెకై గురించి బైబిలు చెప్తున్న విషయాలు నిజం అని రుజువు చేస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్లు ఏం కనుగొన్నారు?

వాళ్లు పర్షియా కీల లిపి ఉన్న ఒక మట్టి పలకను కనుగొన్నారు. అందులో మార్దుక అనే ఒక వ్యక్తి పేరు ఉంది (తెలుగులో మొర్దెకై). ఆయన షూషనులో ఒక అధికారిగా పనిచేశాడు. బహుశా ఆయన డబ్బుకు సంబంధించిన విషయాలు చూసుకునేవాడు. పర్షియా, దాని చుట్టుపక్కల ప్రాంతాల చరిత్రలో నిపుణుడైన ఆర్థర్‌ అంగ్‌నాడ్‌ ఇలా అన్నాడు: “బైబిల్లో కాకుండా వేరే చోట మొర్దెకై పేరు కనిపించడం ఇదే మొదటిసారి.”

ఆ తర్వాతి కాలంలో, పర్షియా కీల లిపి ఉన్న వేల పలకల్ని పండితులు అనువదించారు. వాటిలో కొన్ని పర్సెపలిస్‌ నగరం దగ్గర జరిగిన తవ్వకాల్లో దొరికాయి. ఒకప్పటి ఖజానా ఉన్న చోట చిన్నచిన్న మట్టి పలకలు కనిపించాయి. అవి గ్సెరెక్సెస్‌ I రాజు పరిపాలన కాలం నాటివి. అవి ఎలామీయుల భాషలో ఉన్నాయి. ఎస్తేరు పుస్తకంలో ఉన్న ఎన్నో పేర్లు వాటిలో కనిపించాయి. a

పర్షియా కీల లిపిలో మొర్దెకై (మార్దుక) పేరు

పర్సెపలిస్‌ పలకల్లో మార్దుక పేరు చాలాసార్లు కనిపిస్తుంది. ఆయన గ్సెరెక్సెస్‌ I పరిపాలిస్తున్న సమయంలో షూషను రాజభవనంలో కార్యదర్శిగా పనిచేసేవాడు. ఒక పలకమీద మార్దుక అనువాదకుడు అని ఉంది. ఈ విషయం మొర్దెకై గురించి బైబిలు చెప్తున్న దానితో సరిగ్గా సరిపోతుంది. బైబిలు ప్రకారం అహష్వేరోషు రాజు (గ్సెరెక్సెస్‌ I) రాజభవనంలో, మొర్దెకై ఆస్థాన అధికారిగా పనిచేసేవాడు. ఆయనకు కనీసం రెండు భాషలు వచ్చు. మొర్దెకై తరచూ షూషనులోని రాజగృహ ద్వారం దగ్గర కూర్చునేవాడు. (ఎస్తేరు 2:19, 21; 3:3) ఈ రాజగృహ ద్వారం నిజానికి ఒక పెద్ద భవనం. అక్కడ ఆస్థాన అధికారులు పని చేసుకునేవాళ్లు.

ఈ పలకల్లో చెప్పబడిన మార్దుకకి, బైబిల్లో చెప్పబడిన మొర్దెకైకి కొన్ని ముఖ్యమైన పోలికలు ఉన్నాయి. వాళ్లు ఒకే కాలంలో జీవించారు, ఒకేచోట ఉండేవాళ్లు. అలాగే ఒకే స్థానంలో, ఒకే చోట పనిచేసేవాళ్లు. తవ్వకాల్లో బయటపడిన ఈ విషయాలు, ఎస్తేరు పుస్తకంలోని మొర్దెకై గురించే చెప్తున్నాయని అనిపిస్తోంది.

a 1992 లో ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ ఎమ్‌. యమవూచి ఒక ఆర్టికల్‌లో పర్సెపలిస్‌ పలకల్లో కనిపించిన కొన్ని పేర్లను ప్రస్తావించాడు. అందులో పది పేర్లు ఎస్తేరు పుస్తకంలో కూడా కనిపిస్తాయి.