కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 47

యెహోవా నుండి ఏదీ మిమ్మల్ని వేరుచేయనివ్వకండి

యెహోవా నుండి ఏదీ మిమ్మల్ని వేరుచేయనివ్వకండి

“యెహోవా, నాకు నీ మీద నమ్మకముంది.”కీర్త. 31:14.

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

ఈ ఆర్టికల్‌లో. . . a

1. యెహోవా మనకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?

 యెహోవా మనల్ని తనకు దగ్గరవ్వమని ఆహ్వానిస్తున్నాడు. (యాకో. 4:8) మన దేవునిగా, తండ్రిగా, స్నేహితునిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తూ, కష్టాల్లో మనకు తోడుంటాడు. అంతేకాదు తన సంస్థ ద్వారా మనకు బోధిస్తూ మనల్ని కాపాడతాడు. అయితే, యెహోవాకు దగ్గరవ్వాలంటే మనం ఏం చేయాలి?

2. యెహోవాకు మనం ఎలా దగ్గరవ్వవచ్చు?

2 ప్రార్థించడం ద్వారా, బైబిల్ని చదివి ధ్యానించడం ద్వారా మనం యెహోవాకు దగ్గరవ్వవచ్చు. అప్పుడు ఆయన మీద మనకున్న ప్రేమ, కృతజ్ఞత ఇంకా ఎక్కువౌతాయి. దాంతో ఆయనకు లోబడాలని, ఆయన్ని ఘనపర్చాలని కోరుకుంటాం. అందుకు ఆయన నిజంగా ఎంతో అర్హుడు. (ప్రక. 4:11) యెహోవా గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయన మీద, ఆయన సంస్థ మీద మన నమ్మకం అంత ఎక్కువ బలపడుతుంది.

3. యెహోవా నుండి మనల్ని వేరుచేయడానికి అపవాది ఏవిధంగా ప్రయత్నిస్తాడు? యెహోవాను, ఆయన సంస్థను ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండడానికి మనకేం సహాయం చేస్తుంది? (కీర్తన 31:13, 14)

3 అపవాది అయిన సాతాను మనల్ని యెహోవా నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా మనకు సవాళ్లు ఎదురైనప్పుడు అతను అలా చేస్తాడు. ఏవిధంగా? యెహోవా మీద, ఆయన సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని నెమ్మది నెమ్మదిగా పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని దాడుల్ని మనం ఎదిరించగలం. మన విశ్వాసం బలంగా ఉండి, యెహోవా మీద మన నమ్మకం స్థిరంగా ఉంటే యెహోవాను, ఆయన సంస్థను ఎప్పుడూ విడిచిపెట్టం.కీర్తన 31:13, 14 చదవండి.

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

4 సంఘం బయటి నుండి వచ్చే మూడు సవాళ్ల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఈ సవాళ్ల వల్ల యెహోవా మీద, ఆయన సంస్థ మీద మన నమ్మకం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇవి యెహోవా నుండి మనల్ని ఎలా వేరుచేయగలవు? సాతాను చేసే ఈ దాడుల్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు?

కష్టాలు వచ్చినప్పుడు

5. కష్టాల వల్ల యెహోవా మీద, ఆయన సంస్థ మీద మన నమ్మకం ఎలా తగ్గిపోవచ్చు?

5 కొన్నిసార్లు కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, ఉద్యోగం పోవడం లాంటి కష్టాలు రావచ్చు. వాటివల్ల యెహోవా సంస్థ మీద మన నమ్మకం తగ్గడం, ఆయన నుండి మనం వేరైపోవడం ఎలా జరగవచ్చు? కష్టాల్ని చాలాకాలంగా ఎదుర్కొంటుంటే, ఇక మన పరిస్థితి ఇంతేనా అని కృంగిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని, ‘అసలు యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడా, లేదా?’ అని సందేహించేలా సాతాను చేస్తాడు. మన కష్టాలన్నిటికీ యెహోవా లేదా ఆయన సంస్థే కారణమని మనం అనుకోవాలన్నది సాతాను కోరిక. ఐగుప్తులో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీయుల విషయంలో అదే జరిగింది. వాళ్లను బానిసత్వం నుండి విడిపించడానికే యెహోవా మోషేను, అహరోనును నియమించాడని వాళ్లు మొదట్లో నమ్మారు. (నిర్గ. 4:29-31) కానీ ఫరో వాళ్ల పనిని పెంచినప్పుడు తమ కష్టాలకు కారణం మోషే, అహరోనులే అని నిందిస్తూ ఇలా అన్నారు: “మీరు ఫరో, అతని సేవకులు మమ్మల్ని నీచంగా చూసేలా చేశారు, మమ్మల్ని చంపడానికి వాళ్ల చేతిలో ఖడ్గం పెట్టారు.” (నిర్గ. 5:19-21) విచారకరంగా వాళ్లు దేవుని నమ్మకమైన సేవకుల్ని నిందించారు. మీరు చాలాకాలంగా కష్టాల్ని సహిస్తూ ఉంటే యెహోవా మీద, ఆయన సంస్థ మీద మీ నమ్మకాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?

6. కష్టాల్ని సహించే విషయంలో హబక్కూకు ప్రవక్త నుండి మనం ఏం నేర్చుకుంటాం? (హబక్కూకు 3:17-19)

6 మీ మనసులో ఏముందో ప్రార్థనలో యెహోవాకు చెప్పండి, సహాయం కోసం ఆయన వైపు చూడండి. హబక్కూకు ప్రవక్తకు చాలా కష్టాలు వచ్చాయి. ఒక సందర్భంలో అయితే, యెహోవా తనను అసలు పట్టించుకుంటున్నాడా లేదా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు తన మనసులో ఉన్నదంతా ప్రార్థనలో యెహోవాకు చెప్పాడు. ఆయన ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఎంతకాలం సహాయం కోసం నేను నీకు మొరపెట్టాలి? ఎప్పుడు నా మొర వింటావు? . . . అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?” (హబ. 1:2, 3) తన నమ్మకమైన సేవకుడు అలా మనసువిప్పి చేసిన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు. (హబ. 2:2, 3) యెహోవా గతంలో తన ప్రజల్ని ఎలా కాపాడాడో జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, హబక్కూకు తన సంతోషాన్ని మళ్లీ పొందాడు. అంతేకాదు యెహోవాకు తన మీద శ్రద్ధ ఉందని, ఏ సమస్య వచ్చినా దాన్ని సహించడానికి ఆయన సహాయం చేస్తాడని నమ్మకం కుదిరింది. (హబక్కూకు 3:17-19 చదవండి.) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? మీకు కష్టాలొస్తే యెహోవాకు ప్రార్థించండి, మీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పండి. సహాయం కోసం ఆయన వైపు చూడండి. అలా చేసినప్పుడు, సహించడానికి కావల్సిన బలాన్ని యెహోవా ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. అంతేకాదు ఆయన సహాయాన్ని పొందినప్పుడు, ఆయన మీద మీ విశ్వాసం ఇంకా పెరుగుతుంది.

7. షెర్లీ వాళ్ల బంధువు ఆమెను ఏమని నమ్మించడానికి ప్రయత్నించాడు? యెహోవా మీద విశ్వాసం తగ్గిపోకుండా ఉండడానికి ఆమె ఏం చేసింది?

7 యెహోవాకు దగ్గరగా ఉండడానికి సహాయం చేసే పనుల్ని చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల ఒక సహోదరి ఎలా ప్రయోజనం పొందిందో ఇప్పుడు చూద్దాం. పాపువా న్యూగినిలో ఉంటున్న షెర్లీ b అనే సహోదరి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. ఆమెది చాలా పేద కుటుంబం, కొన్నిసార్లయితే వాళ్లకు సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. అప్పుడు యెహోవా మీద ఆమె నమ్మకాన్ని తగ్గించడానికి వాళ్ల బంధువు ప్రయత్నించాడు. ఆయన ఇలా అన్నాడు: “నీకు పవిత్రశక్తి సహాయం చేస్తుందని అంటావు. కానీ ఎక్కడ సహాయం చేస్తుంది? మీరింకా పేదవాళ్లుగానే ఉన్నారు. నువ్వు పరిచర్య చేస్తూ టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నావు.” తర్వాత ఏం జరిగిందో షెర్లీ ఇలా చెప్తుంది: “‘దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా లేడా?’ అనే ప్రశ్న నాకు వచ్చింది. నేను వెంటనే యెహోవాకు ప్రార్థించి, నా మనసులో ఉన్నదంతా చెప్పాను. అలాగే బైబిల్ని, ప్రచురణల్ని చదవడం, ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి వెళ్లడం ఆపలేదు.” తన కుటుంబం ఎప్పుడూ ఆకలితో లేదని, వాళ్లు సంతోషంగా ఉన్నారని, అలా యెహోవా వాళ్ల కుటుంబాన్ని చూసుకుంటున్నాడని ఆమె కొంతకాలానికే అర్థం చేసుకుంది. షెర్లీ ఇంకా ఇలా అంటుంది: “యెహోవా నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడని అనిపించింది.” (1 తిమో. 6:6-8) దేవునికి దగ్గరగా ఉండడానికి చేయాల్సిన పనుల్ని మీరు చేస్తూ ఉంటే కష్టాలు, సందేహాలు యెహోవా నుండి మిమ్మల్ని వేరుచేయలేవు.

బాధ్యతల్లో ఉన్న సహోదరుల్ని హింసించినప్పుడు

8. యెహోవా సంస్థలో బాధ్యతల్లో ఉన్న సహోదరులకు ఏం జరగవచ్చు?

8 సోషల్‌ మీడియా ద్వారా, న్యూస్‌ ద్వారా శత్రువులు యెహోవా సంస్థలో బాధ్యతల్లో ఉన్న సహోదరుల గురించి అబద్ధాల్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. (కీర్త. 31:13) కొంతమంది సహోదరుల్ని అరెస్టు చేసి, నేరస్తులని నిందిస్తున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అపొస్తలుడైన పౌలు మీద అబద్ధ ఆరోపణలు వేసి, అరెస్టు చేసినప్పుడు అప్పటి క్రైస్తవులు ఏం చేశారు?

9. అపొస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేశారు?

9 అపొస్తలుడైన పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు, కొంతమంది క్రైస్తవులు ఆయనకు మద్దతివ్వడం ఆపేశారు. (2 తిమో. 1:8, 15) ఎందుకు? ప్రజలు పౌలును ఒక నేరస్తునిగా చూస్తున్నారు కాబట్టి, ఆయన్ని వెళ్లి కలిస్తే వాళ్ల పరువు పోతుందని అనుకున్నారా? (2 తిమో. 2:8, 9) లేదా వాళ్లకు కూడా హింస ఎదురౌతుందని భయపడ్డారా? కారణం ఏదైనాసరే, పౌలుకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిజానికి పౌలు వాళ్లకోసం ఎన్నో కష్టాల్ని సహించాడు, చివరికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. (అపొ. 20:18-21; 2 కొరిం. 1:8) అవసరంలో ఉన్న పౌలును విడిచిపెట్టిన వాళ్లలా మనం ఎప్పుడూ ఉండకూడదు. బాధ్యతల్లో ఉన్న సహోదరులు హింసించబడుతున్నప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి?

10. బాధ్యతల్లో ఉన్న సహోదరులు హింసించబడుతున్నప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? ఎందుకు?

10 మనం ఎందుకు హింసను ఎదుర్కొంటున్నామో, దాని వెనక ఎవరున్నారో గుర్తుంచుకోండి. రెండో తిమోతి 3:12 ఇలా చెప్తుంది: “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.” కాబట్టి బాధ్యతల్లో ఉన్న సహోదరుల మీద సాతాను దాడిచేసినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు. ఆ సహోదరులు యెహోవాకు దూరమవ్వాలి, మనం బెదిరిపోవాలి అన్నదే అతని ఉద్దేశం.—1 పేతు. 5:8.

జైల్లో ఉన్న పౌలుకు, ఒనేసిఫోరు ధైర్యంగా మద్దతిచ్చాడు. ఈ పునర్నటనలో చూస్తున్నట్టు, జైల్లో ఉన్న తోటి క్రైస్తవులకు నేడు సహోదర సహోదరీలు మద్దతిస్తున్నారు (11-12 పేరాలు చూడండి)

11. ఒనేసిఫోరు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకుంటాం? (2 తిమోతి 1:16-18)

11 మీ సహోదరులకు మద్దతిస్తూ, నమ్మకంగా వాళ్లను అంటిపెట్టుకుని ఉండండి. (2 తిమోతి 1:16-18 చదవండి.) పౌలు జైల్లో ఉన్నప్పుడు, మిగతా క్రైస్తవుల్లా కాకుండా ఒనేసిఫోరు ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. “[పౌలు] సంకెళ్ల విషయంలో అతను సిగ్గుపడలేదు.” ఒనేసిఫోరు పౌలు కోసం వెతికి, ఆయన్ని కలుసుకుని, అవసరమైన సహాయం చేశాడు. నిజానికి అలా సహాయం చేస్తూ, ఒనేసిఫోరు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? మనం మనుషులకు భయపడి, హింసలు ఎదుర్కొంటున్న సహోదరులకు మద్దతివ్వడానికి వెనకడుగు వేయవద్దు. బదులుగా వాళ్లకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం. (సామె. 17:17) వాళ్లకు మన ప్రేమ, మద్దతు అవసరం.

12. రష్యాలోని సహోదర సహోదరీల నుండి మనం ఏం నేర్చుకుంటాం?

12 జైల్లో ఉన్న తమ తోటి విశ్వాసులకు రష్యాలోని సహోదర సహోదరీలు ఎలా మద్దతిస్తున్నారో ఆలోచించండి. ఎవరినైనా విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్లినప్పుడు వాళ్లకు మద్దతివ్వడానికి చాలామంది సహోదర సహోదరీలు వెళ్తారు. దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? బాధ్యతల్లో ఉన్న సహోదరుల మీద అబద్ధ ఆరోపణలు వేసినప్పుడు, అరెస్టు చేసినప్పుడు లేదా వాళ్లను హింసించినప్పుడు భయపడకండి. వాళ్ల కోసం ప్రార్థించండి, వాళ్ల కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ చూపించండి, జైల్లో ఉన్న ఆ సహోదరులకు ఇంకా ఎలా సహాయం చేయగలరో ఆలోచించండి.—అపొ. 12:5; 2 కొరిం. 1:10, 11.

మనల్ని ఎగతాళి చేసినప్పుడు

13. ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు యెహోవా మీద, ఆయన సంస్థ మీద మన నమ్మకం ఎలా తగ్గిపోవచ్చు?

13 ప్రకటనా పని చేస్తున్నందుకు, యెహోవా నియమాల ప్రకారం జీవిస్తున్నందుకు యెహోవాసాక్షులుకాని మన బంధువులు, తోటి ఉద్యోగులు లేదా విద్యార్థులు మనల్ని ఎగతాళి చేయవచ్చు. (1 పేతు. 4:4) వాళ్లు ఇలా అనొచ్చు: “మీరు మంచివాళ్లే కానీ, మీ మతం మాత్రం పాతకాలపు మతం. మీ మతంలో చాలా రూల్స్‌ ఉంటాయి.” బహిష్కరణ ఏర్పాటు గురించి కొంతమంది మనల్ని తప్పుపడుతూ, “మీకు మనుషుల మీద ప్రేమ ఉందని అసలు ఎలా చెప్పుకుంటారు?” అని అంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మన మనసులో సందేహాలు మొలకెత్తి ఇలా అనుకోవచ్చు: ‘యెహోవా నా నుండి మరీ ఎక్కువ ఆశిస్తున్నాడా? ఆయన సంస్థలో చాలా రూల్స్‌ ఉన్నాయా?’ ఒకవేళ మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే యెహోవాకు, ఆయన సంస్థకు ఎలా దగ్గరగా ఉండవచ్చు?

కపట స్నేహితులు తనను ఎగతాళి చేస్తూ చెప్పిన అబద్ధాల్ని యోబు నమ్మలేదు, బదులుగా యెహోవాకు యథార్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు (14వ పేరా చూడండి)

14. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నందుకు ప్రజలు మనల్ని ఎగతాళి చేస్తే మనం ఏం చేయాలి? (కీర్తన 119:50-52)

14 యెహోవా ప్రమాణాల్ని ఎప్పుడూ పాటించాలని నిర్ణయించుకోండి. యెహోవా ప్రమాణాల్ని పాటించినందుకు యోబు కూడా ఎగతాళిని ఎదుర్కొన్నాడు. యోబు యెహోవా ప్రమాణాల్ని పాటించినా, పాటించకపోయినా దేవుడు అసలు పట్టించుకోడని, ఒక కపట స్నేహితుడు యోబును నమ్మించడానికి ప్రయత్నించాడు. (యోబు 4:17, 18; 22:3) కానీ యోబు ఆ అబద్ధాల్ని నమ్మలేదు. మంచి చెడుల విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాలు సరైనవని ఆయనకు తెలుసు. అలాగే, ఆయన వాటిని ఎప్పుడూ పాటించాలని నిర్ణయించుకున్నాడు. వేరేవాళ్ల వల్ల తన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు. (యోబు 27:5, 6) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఎవరో ఏదో అన్నారని యెహోవా ప్రమాణాల్ని సందేహించకండి. మీ గురించి ఒకసారి ఆలోచించండి. యెహోవా ప్రమాణాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎన్నో ప్రయోజనాలు పొందారని మీరు ఒప్పుకోరా? ఆ ప్రమాణాల విషయంలో ఎప్పుడూ రాజీపడని దేవుని సంస్థతో కలిసి నడవాలని నిర్ణయించుకోండి. అలా చేసినప్పుడు ప్రజలు మనల్ని ఎంత ఎగతాళి చేసినా, యెహోవా నుండి మనల్ని వేరుచేయలేరు.—కీర్తన 119:50-52 చదవండి.

15. బ్రిజట్‌ను ఆమె బంధువులు ఎందుకు ఎగతాళి చేశారు?

15 ఇండియాలో ఉంటున్న బ్రిజట్‌ అనే సహోదరి అనుభవాన్ని చూడండి. ఆమె భర్త యెహోవాసాక్షి కాదు. తన నమ్మకాల్ని బట్టి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎగతాళి చేసేవాళ్లు. 1997 లో ఆమె బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే, ఆమె భర్త ఉద్యోగం పోయింది. అప్పుడు ఆమె భర్త, వాళ్ల అమ్మానాన్నలతో కలిసి ఉండడానికి వేరే నగరానికి వెళ్లాలని నిర్ణయించాడు. అక్కడికి వెళ్లాక ఆమె కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. భర్త ఉద్యోగం పోయింది కాబట్టి, కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం చేయాల్సి వచ్చింది. దానికితోడు వాళ్లు వెళ్లిన నగరానికి దగ్గర్లో ఒక్క సంఘం కూడా లేదు. దాదాపు 350 కిలోమీటర్ల దూరంలోనే ఒక సంఘం ఉంది. విచారకరంగా ఆమె భర్త కుటుంబం ఆమెను బాగా వ్యతిరేకించింది. ఎంతగా అంటే, చివరికి వాళ్లు ఇల్లు మారాల్సి వచ్చింది. తర్వాత అనుకోకుండా ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ల మూడో అమ్మాయి, 12 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో చనిపోయింది. ఇదంతా సరిపోనట్టు, వీటన్నిటికీ కారణం బ్రిజటే అని బంధువులు ఆమెను నిందించారు. ఆమె యెహోవాసాక్షి అవడం వల్లే ఇవన్నీ జరిగాయని అన్నారు. అయినాసరే, ఆమె యెహోవాను నమ్ముతూ ఆయన సంస్థను అంటిపెట్టుకుని ఉంది.

16. యెహోవాకు, ఆయన సంస్థకు అంటిపెట్టుకుని ఉండడం వల్ల బ్రిజట్‌ ఎలాంటి ఆశీర్వాదాలు పొందింది?

16 బ్రిజట్‌ సంఘానికి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి, ఆమె ఉంటున్న ప్రాంతంలోనే ప్రకటించమని, ఆమె ఇంట్లోనే మీటింగ్స్‌ చేసుకోమని ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రోత్సహించాడు. మొదట్లో ‘ఇవన్నీ చేయగలనా?’ అని ఆమె అనుకుంది. కానీ, ఆ నిర్దేశాన్ని పాటించింది. ఆమె ఇతరులకు మంచివార్త చెప్పింది, తన ఇంట్లోనే మీటింగ్స్‌ చేసుకుంది. అలాగే తన కూతుర్లతో కలిసి క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకుంది. దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. ఆమె ఎన్నో బైబిలు అధ్యయనాల్ని మొదలుపెట్టింది. అలాగే ఆమె స్టడీ ఇచ్చిన చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు. 2005 లో ఆమె క్రమ పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టింది. యెహోవా మీద నమ్మకం ఉంచినందుకు, ఆయన సంస్థను అంటిపెట్టుకుని ఉన్నందుకు ఆమె ఎన్నో ఆశీర్వాదాలు పొందింది. ఆమె కూతుళ్లు యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు. అలాగే ఆమె ఉంటున్న ప్రాంతంలో ఇప్పుడు రెండు సంఘాలు ఉన్నాయి. కష్టాల్ని తట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల నుండి వచ్చిన ఎగతాళిని సహించడానికి యెహోవాయే ఆమెకు బలాన్ని ఇచ్చాడని బ్రిజట్‌ గట్టిగా నమ్ముతుంది.

యెహోవాను, ఆయన సంస్థను అంటిపెట్టుకుని ఉండండి

17. మనం ఏమని తీర్మానించుకోవాలి?

17 కష్టాలు వచ్చినప్పుడు యెహోవా మనకు సహాయం చేయడని, ఆయన సంస్థలో ఉండడం వల్ల కష్టాలు ఇంకా ఎక్కువౌతాయని మనం అనుకోవాలన్నదే సాతాను కోరిక. బాధ్యతల్లో ఉన్న సహోదరులు నిందల పాలైనప్పుడు, హింసించబడినప్పుడు లేదా జైల్లో వేయబడినప్పుడు మనం భయపడాలని సాతాను అనుకుంటున్నాడు. అలాగే మనల్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు యెహోవా ప్రమాణాల మీద, ఆయన సంస్థ మీద మనం నమ్మకం కోల్పోవాలని అతను కోరుకుంటున్నాడు. కానీ సాతాను పన్నాగాలు తెలుసు కాబట్టి మనం మోసపోం. (2 కొరిం. 2:11) సాతాను చెప్పే అబద్ధాల్ని నమ్మకుండా యెహోవాను, ఆయన సంస్థను అంటిపెట్టుకుని ఉండాలని తీర్మానించుకోండి. యెహోవా మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడని గుర్తుంచుకోండి. (కీర్త. 28:7) యెహోవా నుండి మిమ్మల్ని ఏదీ వేరుచేయనివ్వకండి.—రోమా. 8:35-39.

18. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

18 సంఘం బయటి నుండి వచ్చే సవాళ్ల గురించి ఈ ఆర్టికల్‌లో చూశాం. అయితే యెహోవా మీద, ఆయన సంస్థ మీద మన నమ్మకాన్ని తగ్గిపోయేలా చేసే సవాళ్లు సంఘం లోపల నుండి కూడా రావచ్చు. వాటిని మనం ఎలా ఎదుర్కోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

a ఈ చివరిరోజుల్లో వచ్చే సమస్యల్ని సహించాలంటే యెహోవా మీద, ఆయన సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. అయితే సాతాను రకరకాల పరీక్షలతో ఆ నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తాడు. అపవాది తీసుకొచ్చే మూడు సవాళ్లు ఏంటో, వాటిని మనం ఎలా ఎదుర్కోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b కొన్ని అసలు పేర్లు కావు.