కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 48

విశ్వసనీయతకు పరీక్షలు వచ్చినప్పుడు మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి

విశ్వసనీయతకు పరీక్షలు వచ్చినప్పుడు మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి

“అన్ని విషయాల్లో నీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకో.”2 తిమో. 4:5.

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? (2 తిమోతి 4:5)

 మనల్ని కృంగదీసే సవాళ్లు ఎదురైనప్పుడు యెహోవాకు, ఆయన సంస్థకు విశ్వసనీయంగా ఉండడం కష్టంగా అనిపించవచ్చు. అలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనం ఎలా విశ్వసనీయంగా ఉండవచ్చు? మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుంటూ, మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. (2 తిమోతి 4:5 చదవండి.) మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి, సరిగ్గా ఆలోచించాలి, విషయాల్ని యెహోవా దృష్టితో చూడడానికి ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు, కేవలం ఆ సమయంలో మనకు అనిపించిన దాన్నిబట్టి ఆలోచించం.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 ముందటి ఆర్టికల్‌లో, సంఘం బయట నుండి వచ్చే మూడు సవాళ్లను పరిశీలించాం. ఈ ఆర్టికల్‌లో సంఘం లోపల నుండి వచ్చే మూడు సవాళ్ల గురించి పరిశీలిస్తాం. యెహోవా మీద మనకున్న విశ్వసనీయతను పరీక్షించే సవాళ్లు ఈ మూడు పరిస్థితుల్లో మనకు రావచ్చు: (1) తోటి విశ్వాసి మనల్ని బాధ పెట్టినట్టు అనిపించినప్పుడు, (2) మనకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు, (3) సంస్థలో వచ్చే మార్పులకు అలవాటు పడడం కష్టంగా అనిపించినప్పుడు. ఈ సవాళ్లు ఎదురైనప్పుడు, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుంటూ యెహోవాకు, ఆయన సంస్థకు ఎలా విశ్వసనీయంగా ఉండవచ్చు?

తోటి విశ్వాసి మనల్ని బాధ పెట్టినట్టు అనిపించినప్పుడు

3. తోటి విశ్వాసి మనల్ని బాధ పెట్టినట్టు అనిపించినప్పుడు ఏం జరిగే ప్రమాదముంది?

3 తోటి విశ్వాసి, బహుశా బాధ్యతల్లో ఉన్న ఒక సహోదరుడు, మిమ్మల్ని బాధ పెట్టినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? నిజానికి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం ఆయనకు ఉండకపోవచ్చు. (రోమా. 3:23; యాకో. 3:2) అయినప్పటికీ, ఆయన చేసిన పనులు మిమ్మల్ని నొప్పించి ఉంటాయి. దాని గురించి ఆలోచించి మీకు రాత్రుళ్లు నిద్రపట్టుండకపోవచ్చు. ‘ఒక సహోదరుడు ఇలా చేయవచ్చా? నిజంగా ఇది దేవుని సంస్థేనా?’ అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవాలన్నదే సాతాను కోరిక. (2 కొరిం. 2:11) అలాంటి ఆలోచనలు, యెహోవా నుండి-ఆయన సంస్థ నుండి మనల్ని దూరం చేస్తాయి. కాబట్టి ఎవరైనా సహోదరుడు లేదా సహోదరి మనల్ని బాధ పెట్టినట్టు అనిపించినప్పుడు, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుంటూ సాతాను ఉరిలో చిక్కుకోకుండా ఎలా ఉండవచ్చు?

4. యోసేపును వాళ్ల అన్నలు బాధ పెట్టినప్పుడు, ఆయన తన ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? దాన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? (ఆదికాండం 50:19-21)

4 కోపం పెంచుకోకండి. యోసేపుకు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన అన్నలు ఆయనతో చాలా కఠినంగా ప్రవర్తించారు. వాళ్లు ఆయన్ని ద్వేషించారు, కొందరైతే ఆయన్ని చంపాలనుకున్నారు. (ఆది. 37:4, 18-22) చివరికి ఆయన్ని బానిసగా అమ్మేశారు. దానివల్ల దాదాపు 13 సంవత్సరాల పాటు యోసేపు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ‘యెహోవాకు నిజంగా నా మీద ప్రేమ ఉందా? కష్టాల్లో ఆయన నన్ను ఎందుకు వదిలేశాడు?’ అని యోసేపు ఆలోచించవచ్చు. కానీ యోసేపు అలా ఆలోచించలేదు, కోపం పెంచుకోలేదు. ఆయన ప్రశాంతంగా ఉంటూ, తన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకున్నాడు. తన అన్నల మీద పగతీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు, ఆయన అలా చేయకుండా వాళ్ల మీద ప్రేమ చూపించాడు, క్షమించాడు. (ఆది. 45:4, 5) యోసేపు సరిగ్గా ఆలోచించాడు కాబట్టే, అలా చేయగలిగాడు. ఆయన తన సమస్యల గురించి ఆలోచించే బదులు, యెహోవా ఇష్టం మీదే మనసుపెట్టాడు. (ఆదికాండం 50:19-21 చదవండి.) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే యెహోవా మీద కోపం పెంచుకోకండి లేదా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడని అనుకోకండి. బదులుగా ఆ సమస్యను సహించడానికి, ఆయన మీకు ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, ప్రేమతో వాళ్ల తప్పుల్ని కప్పేయడానికి ప్రయత్నించండి.—1 పేతు. 4:8.

5. మికాస్‌ తన ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?

5 దక్షిణ అమెరికాలో సంఘ పెద్దగా సేవచేస్తున్న మికాస్‌ b అనుభవం గురించి ఆలోచించండి. కొంతమంది పెద్దలు ఆయనతో కఠినంగా ప్రవర్తించినట్టు ఆయనకు అనిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నా జీవితంలో అంత ఒత్తిడికి నేను ఎప్పుడూ గురవ్వలేదు. నాకు చాలా భయమేసింది. రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు, ఏం చేయాలో అర్థంకాక ఏడ్చేసేవాన్ని.” అయినా మికాస్‌ కృంగిపోకుండా, కోపం పెంచుకోకుండా తన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకున్నాడు. ఆయన తరచూ యెహోవాకు ప్రార్థిస్తూ పవిత్రశక్తిని, ఆ సమస్యను తట్టుకోవడానికి కావల్సిన బలాన్ని ఇవ్వమని అడిగాడు. అంతేకాదు, తనకు సహాయపడే సమాచారం కోసం ప్రచురణల్లో వెతికాడు. దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఎవరైనా సహోదరుడు లేదా సహోదరి మిమ్మల్ని బాధ పెట్టినట్టు అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండండి, కృంగిపోకండి, కోపం పెంచుకోకండి. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశారో మీకు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రార్థనలో దాని గురించి యెహోవాతో మాట్లాడండి. విషయాన్ని వాళ్ల వైపు నుండి చూడడానికి సహాయం చేయమని అడగండి. అలా చేస్తే, వాళ్లు మిమ్మల్ని కావాలనే బాధ పెట్టలేదని అర్థంచేసుకుని, వాళ్లను క్షమించగలుగుతారు. (సామె. 19:11) మీరు ఎంతగా బాధపడుతున్నారో యెహోవాకు తెలుసని, ఆ సమస్యను తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి.—2 దిన. 16:9; ప్రసం. 5:8.

మనకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు

6. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే క్రమశిక్షణ ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (హెబ్రీయులు 12:5, 6, 11)

6 క్రమశిక్షణ మన మనసుకు చాలా బాధ కలిగించవచ్చు. కానీ మనం అలాగే బాధ పడుతూ ఉంటే, అవసరం లేకపోయినా అన్యాయంగా మనకు క్రమశిక్షణ ఇచ్చారని అనిపించవచ్చు. దానివల్ల, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే క్రమశిక్షణ ఇచ్చాడు, అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోలేం. (హెబ్రీయులు 12:5, 6, 11 చదవండి.) మనం అలా బాధలో మునిగిపోతే సాతాను ఉరిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. మనం క్రమశిక్షణ తీసుకోకుండా యెహోవాకు, సంఘానికి దూరం అవ్వాలన్నదే సాతాను కోరిక. మీకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మీ ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

పేతురు వినయం చూపిస్తూ సలహాను, క్రమశిక్షణను అంగీకరించాడు. దానివల్ల యెహోవా ఆయన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకున్నాడు (7వ పేరా చూడండి)

7. (ఎ) చిత్రంలో చూపించినట్టు క్రమశిక్షణను అంగీకరించిన తర్వాత, యెహోవా పేతురును ఎలా ఉపయోగించుకున్నాడు? (బి) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం?

7 క్రమశిక్షణను అంగీకరించండి, అవసరమైన మార్పులు చేసుకోండి. యేసు కొన్నిసార్లు మిగతా అపొస్తలుల ముందే పేతురును సరిదిద్దాడు. (మార్కు 8:33; లూకా 22:31-34) బహుశా అప్పుడు పేతురుకు చాలా ఇబ్బందిగా అనిపించి ఉంటుంది. అయినా పేతురు యేసును విశ్వసనీయంగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆయన క్రమశిక్షణను అంగీకరించి, తన తప్పుల నుండి నేర్చుకున్నాడు. విశ్వసనీయంగా ఉన్నందుకు యెహోవా పేతురును ఆశీర్వదించి, సంఘంలో ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. (యోహా. 21:15-17; అపొ. 10:24-33; 1 పేతు. 1:1) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? క్రమశిక్షణ వల్ల మనకు ఎంత బాధ కలిగింది అనే దానిమీద మనసు పెట్టకుండా, దానిని అంగీకరించి అవసరమైన మార్పులు చేసుకోవాలి. అప్పుడు మనం యెహోవాకు, తోటి సహోదరులకు ఎంతో ఉపయోగపడే వాళ్లుగా ఉంటాం. దానివల్ల మనం ప్రయోజనం పొందుతాం, ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు.

8-9. క్రమశిక్షణ పొందినప్పుడు బెర్నార్డోకు ఎలా అనిపించింది? సరైన విధంగా ఆలోచించడానికి ఆయనకు ఏది సహాయం చేసింది?

8 మొజాంబిక్‌లోని బెర్నార్డో అనే సహోదరుడి అనుభవం గురించి ఆలోచించండి. ఆయన్ని సంఘ పెద్దగా తీసేశారు. అప్పుడు ఆయనకు ఎలా అనిపించింది? ఆయన ఇలా అన్నాడు: “నాకు ఇచ్చిన క్రమశిక్షణ అస్సలు నచ్చలేదు, నాకు చాలా కోపం వచ్చింది.” సంఘంలో ఉన్నవాళ్లు తన గురించి ఏమనుకుంటారో అని ఆయన ఆందోళనపడ్డాడు. ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “నా పరిస్థితిని సరైన దృష్టితో చూడడానికి; యెహోవా మీద, ఆయన సంస్థ మీద మళ్లీ నమ్మకం పెంచుకోవడానికి నాకు కొన్ని నెలలు పట్టింది.” సరైన విధంగా ఆలోచించడానికి ఆయనకు ఏది సహాయం చేసింది?

9 బెర్నార్డో తన ఆలోచనను మార్చుకున్నాడు. ఆయన ఇలా వివరించాడు: “నేను సంఘ పెద్దగా ఉన్నప్పుడు, హెబ్రీయులు 12:7 ఉపయోగించి యెహోవా ఇచ్చే క్రమశిక్షణ గురించి సరిగ్గా ఆలోచించేలా ఇతరులకు సహాయం చేశాను. కానీ అందులో ఉన్న సలహాను యెహోవా సేవకులందరూ పాటించాలి. అంటే, ఇప్పుడు నేను కూడా ఆ సలహాను పాటించాలని అర్థం చేసుకున్నాను.” అంతేకాదు యెహోవా మీద, సంస్థ మీద తిరిగి నమ్మకం పెంచుకోవడానికి ఆయన కొన్ని పనులు చేశాడు. ఆయన బైబిల్ని చదవడం, ధ్యానించడం ఇంకా ఎక్కువగా చేశాడు. సహోదర సహోదరీలు తన గురించి ఏమనుకుంటారు అని ఆందోళన ఉన్నా, వాళ్లతో కలిసి పరిచర్య చేశాడు, మీటింగ్స్‌లో చక్కగా పాల్గొన్నాడు. కొంతకాలానికి, ఆయన మళ్లీ సంఘ పెద్ద అయ్యాడు. ఒకవేళ మీరు కూడా క్రమశిక్షణ పొంది ఉంటే, ఆ బాధలో నుండి బయటపడడానికి ప్రయత్నించండి, క్రమశిక్షణను అంగీకరించండి, అవసరమైన మార్పులు చేసుకోండి. c (సామె. 8:33; 22:4) అలా యెహోవాను, ఆయన సంస్థను విశ్వసనీయంగా అంటిపెట్టుకుని ఉంటే, ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

సంస్థలో వచ్చే మార్పులకు అలవాటు పడడం కష్టంగా అనిపించినప్పుడు

10. ఏ మార్పు, కొంతమంది ఇశ్రాయేలీయుల విశ్వసనీయతకు పరీక్ష పెట్టి ఉండవచ్చు?

10 కొన్నిసార్లు సంస్థలో వచ్చే మార్పులు మన విశ్వసనీయతకు పరీక్షగా మారవచ్చు. జాగ్రత్తగా లేకపోతే వాటిని బట్టి మనం యెహోవాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఇశ్రాయేలీయుల విషయంలో వచ్చిన ఒక మార్పు గురించి ఆలోచించండి. ధర్మశాస్త్రం రాకముందు, కుటుంబ పెద్దలే యాజకులు చేసే పనిని చేసేవాళ్లు. వాళ్లు బలిపీఠాలు కట్టేవాళ్లు, తమ కుటుంబం తరఫున యెహోవాకు బలులు అర్పించేవాళ్లు. (ఆది. 8:20, 21; 12:7; 26:25; 35:1, 6, 7; యోబు 1:5) కానీ ధర్మశాస్త్రం వచ్చాక, వాళ్లు ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. బలులు అర్పించడానికి యెహోవా అహరోను కుటుంబంలోని వాళ్లను యాజకులుగా నియమించాడు. అప్పటినుండి అహరోను వంశంవాళ్లు కాకుండా ఇంకెవరైనా యాజకులుగా పనిచేస్తే, వాళ్లకు మరణశిక్ష వేసేవాళ్లు. d (లేవీ. 17:3-6, 8, 9) మోషే, అహరోనుల అధికారాన్ని కోరహు, దాతాను, అబీరాము, 250 మంది ప్రధానులు ప్రశ్నించడానికి బహుశా ఈ మార్పు ఒక కారణమా? (సంఖ్యా. 16:1-3) మనం ఖచ్చితంగా చెప్పలేం. కారణం ఏదైనా కోరహు, అతని సహచరులు యెహోవాకు విశ్వసనీయంగా ఉండలేదు. సంస్థలో వచ్చే మార్పులు మీ విశ్వసనీయతకు పరీక్షగా ఉంటే మీరేం చేయవచ్చు?

తమ నియామకంలో మార్పు వచ్చినప్పుడు కహాతీయులు ఇష్టపూర్వకంగా గాయకులుగా, ద్వార పాలకులుగా, గోదాముల మీద అధికారులుగా సేవచేశారు (11వ పేరా చూడండి)

11. కహాతీయుల నుండి మనం ఏం నేర్చుకుంటాం?

11 సంస్థలో వచ్చే మార్పులకు పూర్తి మద్దతివ్వండి. ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణించినప్పుడు, కహాతీయులకు చాలా గొప్ప అవకాశం ఉండేది. ఇశ్రాయేలీయులు ఒక చోటు నుండి ఇంకో చోటుకు మారినప్పుడల్లా కహాతీయులు ప్రజలందరి ముందు ఒప్పంద మందసాన్ని మోసుకెళ్లే వాళ్లు. (సంఖ్యా. 3:29, 31; 10:33; యెహో. 3:2-4) అది ఎంత గొప్ప అవకాశమో కదా! ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడ్డాక, పరిస్థితిలో మార్పు వచ్చింది. వాళ్లు ఒప్పంద మందసాన్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్లే అవసరం అంతగా లేకుండా పోయింది. సొలొమోను కాలంలో ఆలయం కట్టడం పూర్తయ్యాక, కొంతమంది కహాతీయులు గాయకులుగా, ద్వార పాలకులుగా, గోదాముల మీద అధికారులుగా సేవచేశారు. (1 దిన. 6:31-33; 26:1, 24) అయితే, ‘మా పూర్వీకులు ఎంతో గొప్ప పనిచేశారు. కాబట్టి మాకు కూడా అలాంటి గొప్ప పనులు ఇవ్వాలి’ అని కహాతీయులు ఫిర్యాదు చేసినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? యెహోవా సంస్థలో వచ్చే మార్పులకు మనస్ఫూర్తిగా మద్దతివ్వండి. ముఖ్యంగా, మీ బాధ్యతలకు సంబంధించి ఏదైనా మార్పు వస్తే అలా చేయండి. మీకు ఏ నియామకం ఇచ్చినా దాన్ని సంతోషంగా చేయండి. యెహోవా విలువైనదిగా చూసేది మన నియామకాన్ని కాదుగానీ, మనల్ని అని గుర్తుంచుకోండి. మనకున్న ఏ నియామకం కన్నా, మనం చూపించే విధేయతే ఆయన దృష్టిలో ఎన్నో రెట్లు విలువైనది.—1 సమూ. 15:22.

12. తన నియామకంలో మార్పు వచ్చినప్పుడు జైనా అనే సహోదరికి ఎలా అనిపించింది?

12 జైనా అనే సహోదరి అనుభవం గురించి ఆలోచించండి. ఆమెకు బెతెల్‌లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఆమె 23 సంవత్సరాలు బెతెల్‌లో సేవ చేసింది. తర్వాత ఆమెను ప్రత్యేక పయినీరుగా నియమించారు. ఆమె ఇలా అంటుంది: “నా నియామకంలో వచ్చిన మార్పు గురించి తెలిసినప్పుడు నేను షాక్‌ అయ్యాను. నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను బెతెల్‌ నుండి పంపించేస్తున్నారు? ఇక నేను దేనికీ పనికిరానని అనుకున్నాను.” ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సంఘంలో కొంతమంది, “నువ్వు బెతెల్‌లో సరిగ్గా ఉండివుంటే, వాళ్లు నిన్ను అక్కడే ఉండనిచ్చేవాళ్లు” అంటూ సూటిపోటి మాటలతో ఆమెను బాధపెట్టారు. కొంతకాలం పాటు ఆమె బాగా కృంగిపోయి, రాత్రుళ్లు ఏడుస్తూ ఉండేది. కానీ ఆమె ఇలా అంది: “యెహోవాకు, ఆయన సంస్థకు నా మీద ప్రేమ ఉందా అనే సందేహం నా మనసులోకి రాకుండా చూసుకున్నాను.” ఆమె తన ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా కాపాడుకుంది?

13. జైనా తన బాధలో నుండి ఎలా బయటపడింది?

13 జైనా తన బాధ నుండి బయటపడడానికి కొన్ని పనులు చేసింది. తన సమస్యకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురణల్లో వెతికింది. 2001, ఫిబ్రవరి 1, కావలికోట పత్రికలోని “మీరు నిరుత్సాహాన్ని తట్టుకుని నిలబడగలరు!” అనే ఆర్టికల్‌ ఆమెకు చాలా సహాయం చేసింది. ఆ ఆర్టికల్‌లో, తన నియామకంలో మార్పు వచ్చినప్పుడు సువార్త రచయిత అయిన మార్కుకు ఎలా అనిపించిందో ఉంది. “నా బాధలో నుండి బయటపడడానికి మార్కు ఉదాహరణ నాకు చాలా సహాయం చేసింది” అని ఆమె చెప్తుంది. అంతేకాదు, ఎందుకు ఇలా జరిగింది అనే దిగులుతో సంఘంలోని వాళ్లకు దూరమై ఆమె ఒంటరిగా ఉండిపోలేదు. సంఘంలో అందరితో కలిసి పరిచర్య చేసింది. సంస్థను నడిపిస్తున్నది యెహోవా పవిత్రశక్తి అని, బాధ్యతల్లో ఉన్న సహోదరులకు తనమీద ఎంతో శ్రద్ధ ఉందని ఆమె అర్థం చేసుకుంది. యెహోవా పని ముందుకు వెళ్లాలంటే, సంస్థ కొన్ని మార్పులు చేయడం తప్పనిసరి అని ఆమె గుర్తించింది.

14. వ్లాడో ఏ మార్పుకు అలవాటు పడడానికి ఇబ్బంది పడ్డాడు? ఆయనకు ఏది సహాయం చేసింది?

14 స్లోవేనియాలోని 73 ఏళ్ల వ్లాడో అనే సంఘ పెద్ద అనుభవం గురించి ఆలోచించండి. ఆయన వెళ్లే రాజ్యమందిరాన్ని మూసేసి, ఆ సంఘాన్ని వేరే సంఘంలో కలిపేశారు. ఆ మార్పుకు అలవాటు పడడం ఆయనకు కష్టంగా అనిపించింది. ఆయన ఇలా అన్నాడు: “అంత మంచి రాజ్యమందిరాన్ని ఎందుకు మూసేశారో నాకు అర్థంకాలేదు. ఈమధ్యే మేము దానికి మరమ్మతులు చేశాం. నేను ఒక కార్పెంటర్‌ని. అందులో ఉన్న కొన్ని సామాన్లు నేనే తయారుచేశాను. ఈ మార్పుకు తగ్గట్టు సర్దుబాట్లు చేసుకోవడం సంఘంలో ఉన్న నాలాంటి ముసలివాళ్లకు చాలా కష్టమైంది.” మరి ఆ నిర్ణయానికి మద్దతివ్వడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయన ఇలా వివరించాడు: “యెహోవా సంస్థలో వచ్చే మార్పులకు అలవాటు పడడం వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. ఈ చిన్నచిన్న మార్పులు భవిష్యత్తులో వచ్చే పెద్దపెద్ద మార్పులకు మనల్ని సిద్ధం చేస్తాయి.” మీ సంఘాన్ని వేరే సంఘంలో కలిపేయడం లేదా మీ నియామకం మారడం వంటి మార్పులకు అలవాటు పడడానికి మీరు కూడా ఇబ్బందిపడుతున్నారా? అయితే మీకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు తెలుసని గుర్తుంచుకోండి. మార్పులకు మద్దతిస్తూ యెహోవాను, ఆయన సంస్థను విశ్వసనీయంగా అంటిపెట్టుకుని ఉంటే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు.—కీర్త. 18:25.

అన్ని విషయాల్లో మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి

15. సంఘం లోపల నుండి సవాళ్లు వచ్చినప్పుడు, మన ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

15 ఈ లోకాంతం దగ్గరపడే కొద్దీ, సంఘం లోపల నుండి సవాళ్లు వస్తాయని మనం గుర్తుంచుకోవాలి. అవి యెహోవా మీద మనకున్న విశ్వసనీయతకు పరీక్షగా మారవచ్చు. కాబట్టి మన ఆలోచనా సామర్థ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తోటి విశ్వాసి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టు అనిపిస్తే కోపం పెంచుకోకండి. మీకు క్రమశిక్షణ ఇస్తే బాధలో మునిగిపోకుండా సలహాను అంగీకరించి, అవసరమైన మార్పులు చేసుకోండి. సంస్థలో వచ్చిన మార్పుల వల్ల వ్యక్తిగతంగా మీరు సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తే, మనస్ఫూర్తిగా వాటిని అంగీకరించండి, నిర్దేశానికి లోబడండి.

16. యెహోవా మీద, ఆయన సంస్థ మీద మీకున్న నమ్మకాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

16 మీ విశ్వసనీయతకు పరీక్షలు ఎదురైనా యెహోవా మీద, ఆయన సంస్థ మీద మీకున్న నమ్మకాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసం మీరు మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ప్రశాంతంగా ఉండాలి, సరిగ్గా ఆలోచించాలి, విషయాల్ని యెహోవా వైపు నుండి చూడాలి. మీలాంటి సమస్యల్నే ఎదుర్కొన్న బైబిల్లోని వ్యక్తుల గురించి చదవండి, వాళ్ల ఆదర్శాన్ని ధ్యానించండి, సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. సంఘానికి దూరంగా అస్సలు ఉండకండి. అప్పుడు ఏం జరిగినాసరే యెహోవా నుండి, ఆయన సంస్థ నుండి సాతాను మిమ్మల్ని వేరుచేయలేడు.—యాకో. 4:7.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

a కొన్నిసార్లు సంఘం లోపలి నుండి సవాళ్లు వచ్చినప్పుడు యెహోవాకు, ఆయన సంస్థకు విశ్వసనీయంగా ఉండడం కష్టంగా అనిపించవచ్చు. సంఘం లోపలి నుండి వచ్చే మూడు సవాళ్ల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అవి వచ్చినప్పుడు యెహోవాకు, ఆయన సంస్థకు ఎలా విశ్వసనీయంగా ఉండవచ్చో కూడా పరిశీలిస్తాం.

b కొన్ని అసలు పేర్లు కావు.

c ఇంకొన్ని మంచి సలహాల కోసం 2009, ఆగస్టు 15, కావలికోట 30వ పేజీలోని “మీకు ఒకప్పుడు సేవాధిక్యతలు ఉండేవా? మళ్లీ చేపట్టగలరా?” అనే ఆర్టికల్‌ చూడండి.

d మాంసం తినడం కోసం ఒక జంతువును వధించాలంటే, కుటుంబ పెద్దలు ఆ జంతువును గుడారం దగ్గరికి తీసుకురావాలని ధర్మశాస్త్రం చెప్పింది. అయితే, గుడారానికి చాలా దూరంలో ఉన్నవాళ్లు మాత్రం అలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.—ద్వితీ. 12:21.