అధ్యయన ఆర్టికల్ 46
సంతోషంగా సహించడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
“మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు, మీ మీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు.”—యెష. 30:18.
పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
ఈ ఆర్టికల్‌లో. . . a
1-2. (ఎ) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం? (బి) మనకు సహాయం చేయాలనే కోరిక యెహోవాకు ఉందని ఎలా చెప్పవచ్చు?
కష్టాల్ని సహించడానికి, తన సేవలో సంతోషాన్ని పొందడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. అయితే ఆయన మనకు ఎలా సహాయం చేస్తాడు? ఆయన ఇచ్చే సహాయం నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? ఆ ప్రశ్నలకు జవాబులు ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ముందుగా, మనకు సహాయం చేయాలనే కోరిక యెహోవాకు ఉందో లేదో తెలుసుకుందాం.
2 అపొస్తలుడైన పౌలు, హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో ఉపయోగించిన మాటల్ని ఒకసారి గమనించండి: “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?” (హెబ్రీ. 13:6) ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం, “సహాయం చేసేది యెహోవాయే” అనే మాటకున్న అర్థాన్ని వివరిస్తుంది. దాని ప్రకారం ఆ మాట, ఎవరైనా బాధలో ఏడుస్తుంటే వాళ్లకు సహాయం చేయడానికి పరుగెత్తే వ్యక్తిని సూచిస్తుంది. ఎవరైనా బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్లను కాపాడడానికి యెహోవా పరుగెత్తుతున్నట్టు ఊహించుకోండి. మనకు సహాయం చేయాలనే కోరిక యెహోవాకు ఎంతుందో ఈ లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యెహోవా మనకు తోడుంటే, ఎలాంటి కష్టాన్నైనా సంతోషంగా సహించగలం.
3. కష్టాల్ని సంతోషంగా సహించడానికి యెహోవా మనకు ఏ మూడు విధానాల్లో సహాయం చేస్తాడు?
3 కష్టాల్ని సంతోషంగా సహించడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? దానికి జవాబు యెషయా పుస్తకంలో ఉంది. యెషయా ద్వారా యెహోవా రాయించిన ఎన్నో ప్రవచనాలు నేడున్న దేవుని సేవకులకు సరిగ్గా సరిపోతాయి. అంతేకాదు యెషయా యెహోవా గురించి చెప్పేటప్పుడు, తేలిగ్గా అర్థమయ్యే మాటల్ని ఉపయోగించాడు. ఒకసారి, యెషయా 30వ అధ్యాయం గమనించండి. యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేస్తాడో చెప్పడానికి, కొన్ని మంచి ఉదాహరణల్ని యెషయా అందులో ఉపయోగించాడు. (1) మన ప్రార్థనల్ని జాగ్రత్తగా వింటూ వాటికి జవాబివ్వడం ద్వారా, (2) మనకు అవసరమయ్యే నిర్దేశాలు ఇస్తూ మనల్ని నడిపించడం ద్వారా, (3) ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో మనల్ని దీవించడం ద్వారా యెహోవా మనకు సహాయం చేస్తాడని యెషయా రాశాడు. ఈ మూడు విధానాల్లో, యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం.
యెహోవా మన ప్రార్థనల్ని వింటాడు
4. (ఎ) యెషయా కాలంలోని యూదుల గురించి యెహోవా ఏమన్నాడు? ఆయన చెప్పినట్టే ఏం జరిగింది? (బి) నమ్మకమైన వాళ్లలో ఆశను నింపే ఏ విషయాన్ని యెహోవా చెప్పాడు? (యెషయా 30:18, 19)
4 యెషయా 30వ అధ్యాయం మొదట్లో, యూదులు “మొండి పిల్లలు” అని, “పాపం మీద పాపం మూటగట్టుకుంటున్నారు” అని యెహోవా చెప్పాడు. తర్వాత, “వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు, . . . యెహోవా ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడరు” అని కూడా ఆయన అన్నాడు. (యెష. 30:1, 9) ప్రజలు వినడానికి ఇష్టపడలేదు కాబట్టి యెహోవా వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాడని యెషయా ముందే చెప్పాడు. (యెష. 30:5, 17; యిర్మీ. 25:8-11) ఆయన చెప్పినట్టే విపత్తు వచ్చింది, బబులోనీయులు వాళ్లను బందీలుగా తీసుకెళ్లిపోయారు. అయితే ఆ యూదుల్లో కొంతమంది నమ్మకమైనవాళ్లు ఉన్నారు. వాళ్లలో ఆశను నింపే ఒక సందేశాన్ని యెషయా చెప్పాడు. ఏదోకరోజు యెహోవా వాళ్లమీద అనుగ్రహం చూపిస్తాడని ఆయన చెప్పాడు. (యెషయా 30:18, 19 చదవండి.) అవును యెహోవా అనుగ్రహం చూపించాడు, వాళ్లను విడుదల చేశాడు, అయితే వెంటనే కాదు. “మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు” అనే మాటను బట్టి, వాళ్లు విడుదల అవ్వడానికి కొంత సమయం పడుతుందని అర్థమౌతుంది. నిజానికి ఇశ్రాయేలీయులు బబులోనులో 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. ఆ తర్వాతే, వాళ్లలో కొంతమంది యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి అనుమతి పొందారు. (యెష. 10:21; యిర్మీ. 29:10) బబులోనులో దుఃఖంతో కంటతడి పెట్టుకున్న ఇశ్రాయేలీయులు, స్వదేశానికి వచ్చినప్పుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
5. యెషయా 30:19 లో మనకు ఎలాంటి భరోసా ఉంది?
5 “సహాయం కోసం నువ్వు పెట్టే మొర వినబడగానే ఆయన తప్పకుండా నీ మీద అనుగ్రహం చూపిస్తాడు” అనే మాటల నుండి నేడు మనం ఎంతో ఓదార్పు పొందుతాం. (యెష. 30:19) మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన జాగ్రత్తగా వింటాడు, మన విన్నపాలకు వెంటనే జవాబిస్తాడు అనే భరోసాతో ఉండవచ్చని యెషయా చెప్పాడు. యెషయా ఇంకా ఇలా అంటున్నాడు: “నీ మొర విన్న వెంటనే నీకు జవాబిస్తాడు.” తనవైపు చూసే వాళ్లకు వెంటనే సహాయం చేయాలనే బలమైన కోరిక మన తండ్రికి ఉందని ఆ మాటలు మనకు గుర్తుచేస్తాయి. ఇది తెలుసుకోవడం వల్ల మనం సంతోషంగా సహించగలుగుతాం.
6. తన సేవకుల్లో ప్రతీఒక్కరి ప్రార్థనల్ని యెహోవా వింటాడని యెషయా అన్న మాటలు ఎలా స్పష్టం చేస్తున్నాయి?
6 మన ప్రార్థనల విషయంలో, ఈ వచనం ఇంకా ఏ భరోసా ఇస్తుంది? మనలో ప్రతీఒక్కరి ప్రార్థనల్ని యెహోవా శ్రద్ధగా వింటాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? యెషయా 30వ అధ్యాయం మొదట్లో, యెహోవా “మీరు” అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక గుంపుగా ఉన్న తన ప్రజలతో మాట్లాడాడు. అయితే 19వ వచనంలో “నువ్వు,” “నీకు,” “నీ” లాంటి పదాలున్నాయి. అంటే, అవి ఒక్కో వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు అని అర్థమౌతుంది. యెషయా ఇలా రాశాడు:“నువ్వు అస్సలు ఏడ్వవు,” “తప్పకుండా నీ మీద అనుగ్రహం చూపిస్తాడు,”“నీకు జవాబిస్తాడు.” యెహోవా ప్రేమగల తండ్రి. తన పిల్లలు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఇతరులతో పోలుస్తూ, “నీ సహోదరుణ్ణి, సహోదరిని చూడు! నువ్వు కూడా వాళ్లలా బలంగా ఉండాలి” అని ఆయన ఎన్నడూ అనడు. బదులుగా మనలో ప్రతీఒక్కరి పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని గుర్తించి, మన ప్రార్థనల్ని జాగ్రత్తగా వింటాడు.—కీర్త. 116:1; యెష. 57:15.
7. పట్టుదలతో ప్రార్థించడం ప్రాముఖ్యమని యెషయా, యేసు ఎలా చూపించారు?
7 మనం మన కష్టాల గురించి యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఆయన ముందుగా దాన్ని తట్టుకోవడానికి కావల్సిన బలాన్ని మనకు ఇవ్వొచ్చు. అయితే మనం అనుకున్నంత త్వరగా మన సమస్యకు పరిష్కారం రాకపోతే, దాన్ని సహించడానికి కావల్సిన బలం కోసం యెహోవాను పదేపదే అడగవచ్చు. అస్సలు మొహమాట పడకుండా, తనను అలా అడగమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అందుకే “[యెహోవాకు] ఏమాత్రం విశ్రాంతినివ్వకండి” అని యెషయా రాశాడు. (యెష. 62:7) కాబట్టి మనం ఎంత పట్టుదలగా ప్రార్థించాలంటే, యెహోవాకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకూడదు. యెషయా మాటలు, ప్రార్థన గురించి లూకా 11:8-10, 13 లో యేసు చెప్పిన ఉదాహరణల్ని మనకు గుర్తుచేస్తాయి. యేసు కూడా “పట్టుదలతో” ప్రార్థిస్తూ, “పదేపదే” పవిత్రశక్తి కోసం అడగమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు సరైన నిర్ణయాల్ని తీసుకోవడానికి అవసరమైన నిర్దేశాల్ని ఇవ్వమని కూడా మనం యెహోవాను అడగవచ్చు.
యెహోవా నిర్దేశాలు ఇస్తూ మనల్ని నడిపిస్తాడు
8. ప్రాచీన కాలంలో యెషయా 30:20, 21 లోని మాటలు ఎలా నిజమయ్యాయి?
8 యెషయా 30:20, 21 చదవండి. బబులోను సైన్యం ఒకటిన్నర సంవత్సరాల పాటు యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు, రొట్టె తినడం-నీళ్లు తాగడం లాగే, కష్టాలు అనుభవించడం కూడా సర్వసాధారణం అయిపోయింది. కానీ 20, 21 వచనాల్లో, పశ్చాత్తాపపడి తమ అలవాట్లను మార్చుకుంటే వాళ్లను కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. యెషయా యెహోవాను “మహాగొప్ప ఉపదేశకుడు” అని పిలుస్తూ, తనకు నచ్చిన విధంగా ఎలా ఆరాధించాలో ఆయనే నేర్పిస్తాడు అని ప్రజలకు చెప్పాడు. బందీలుగా ఉన్న యూదులు విడుదలైనప్పుడు ఆ మాటలు నిజమయ్యాయి. యెహోవా మహాగొప్ప ఉపదేశకునిగా ఉంటూ తన ప్రజలకు నిర్దేశాలిచ్చాడు కాబట్టి, వాళ్లు స్వచ్ఛారాధనను తిరిగి మొదలుపెట్టారు. యెహోవా మనకు కూడా మహాగొప్ప ఉపదేశకునిగా ఉండడం ఎంత గొప్ప దీవెనో కదా!
9. యెహోవా మనకు నిర్దేశాలు ఇస్తూ నడిపించే ఒక విధానం ఏంటి?
9 మనం విద్యార్థులమని, యెహోవా మనకు రెండు విధాలుగా నేర్పిస్తున్నాడని కూడా యెషయా చెప్తున్నాడు. మొదటి విధానం గురించి ఆయన ఇలా అన్నాడు: “నువ్వు కళ్లారా నీ మహాగొప్ప ఉపదేశకుణ్ణి చూస్తావు.” ఇక్కడ, తన విద్యార్థులు చూడగలిగేలా వాళ్ల ముందు నిలబడి ఉన్న ఒక ఉపదేశకుని గురించి ఉంది. యెహోవా ఇచ్చే నిర్దేశాల నుండి ప్రయోజనం పొందే గొప్ప అవకాశం నేడు మనకుంది. మరి యెహోవా మనకు ఎలా నిర్దేశాలిస్తాడు? తన సంస్థ ద్వారా ఇస్తాడు. సంస్థ నుండి పొందే స్పష్టమైన నిర్దేశాల విషయంలో, మనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. మీటింగ్స్, సమావేశాలు, ప్రచురణలు, వీడియోలు వంటి వాటి ద్వారా ఇచ్చే నిర్దేశాలు, కష్టమైన పరిస్థితుల్ని సంతోషంగా సహించడానికి మనకు సహాయం చేస్తాయి.
10. మనం ఏవిధంగా, “[మన] వెనక నుండి ఒక శబ్దాన్ని” వింటాం?
10 యెహోవా మనకు నిర్దేశాలిచ్చే రెండో విధానం గురించి యెషయా ఇలా రాశాడు: “నీ వెనక నుండి ఒక శబ్దం రావడం నీ చెవులారా వింటావు.” యెహోవా తన విద్యార్థుల్ని బాగా గమనించే ఒక ఉపదేశకునిగా వాళ్ల వెనకాలే నడుస్తూ, ఎటు వెళ్లాలో దారి చూపిస్తూ, నిర్దేశాలు ఇస్తున్నాడని యెషయా ఇక్కడ చెప్తున్నాడు. నేడు మనం కూడా వెనక నుండి వచ్చే దేవుని స్వరాన్ని వింటున్నాం. ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం, అంటే వెనకటి రోజుల్లో దేవుడు తన మాటల్ని బైబిల్లో రాయించాడు. కాబట్టి మనం దాన్ని చదివినప్పుడు ఒక విధంగా మన వెనక నుండి దేవుని స్వరాన్ని వింటున్నట్టు ఉంటుంది.—యెష. 51:4.
11. కష్టాల్ని సహిస్తూ సంతోషంగా ముందుకెళ్లడానికి మనం ఏ రెండు పనులు చేయాలి? ఎందుకు?
11 తన సంస్థ ద్వారా, తన వాక్యం ద్వారా యెహోవా ఇచ్చే నిర్దేశాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, మనం ఏం చేయాలి? యెషయా చెప్పిన రెండు విషయాల్ని గమనించారా? మొదటిది, “ఇదే దారి.” రెండోది, “ఇందులో నడువు.” (యెష. 30:21) “దారి” ఏదో తెలుసుకుంటే సరిపోదు, ‘ఆ దారిలో నడవడం’ కూడా ప్రాముఖ్యం. బైబిలు ద్వారా, సంస్థ ద్వారా యెహోవా మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుంటాం. తెలుసుకున్నవాటిని ఎలా పాటించాలో కూడా నేర్చుకుంటాం. ఈ రెండు పనులు చేసినప్పుడు, కష్టాల్ని సహిస్తూ యెహోవా సేవలో సంతోషంగా ముందుకు వెళ్లగలుగుతాం. అప్పుడు యెహోవా మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.
యెహోవా మనల్ని దీవిస్తాడు
12. యెషయా 30:23-26 ప్రకారం, యెహోవా తన ప్రజల్ని ఎలా దీవించాడు?
12 యెషయా 30:23-26 చదవండి. బబులోను నుండి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన యూదుల విషయంలో ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? బ్రతకడానికి, ఆయన్ని సేవిస్తూ ఉండడానికి యెహోవా వాళ్లను ఎన్నో విధాలుగా దీవించాడు. వాళ్లకు అవసరమయ్యే ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఆయనకు దగ్గరవ్వడానికి, ఆయన్ని సరైన విధానంలో ఆరాధించడానికి అవసరమయ్యే ప్రతీది కూడా ఇచ్చాడు. వాళ్లు ఇంతకుముందెన్నడూ ఇన్ని దీవెనల్ని పొందలేదు. 26వ వచనం చెప్తున్నట్టు, యెహోవా వాళ్లమీద మరింత వెలుగు ప్రకాశించేలా చేశాడు. అంటే ఆయన వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. (యెష. 60:2) యెహోవా ఇచ్చే దీవెనల వల్ల వాళ్లు హృదయానందంతో ఉన్నారు. దానివల్ల ఆయన సేవలో సంతోషంగా, ధైర్యంగా కొనసాగగలిగారు.—యెష. 65:14.
13. స్వచ్ఛారాధన తిరిగి మొదలుపెట్టడం గురించిన ప్రవచనం, మన కాలంలో ఎలా నెరవేరుతోంది?
13 స్వచ్ఛారాధన తిరిగి మొదలుపెట్టడం గురించిన ప్రవచనం నేడు మన కాలంలో కూడా నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. 1919 నుండి, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనుకు బందీలుగా ఉన్న ఎన్నో లక్షలమంది విడుదలౌతున్నారు. వాళ్లందరూ, ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశం కంటే ఉన్నతమైన చోటుకు అంటే, ఆధ్యాత్మిక పరదైసుకు వచ్చారు. (యెష. 51:3; 66:8) ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏంటి?
14. ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏంటి? నేడు దాంట్లో ఎవరు ఉంటున్నారు? (పదాల వివరణ చూడండి.)
14 1919 నుండి, అభిషిక్త క్రైస్తవులు ఆధ్యాత్మిక పరదైసులో b సంతోషంగా ఉంటున్నారు. తర్వాత, భూ నిరీక్షణ గలవాళ్లు అంటే “వేరే గొర్రెలు” కూడా ఈ ఆధ్యాత్మిక పరదైసులోకి అడుగుపెడుతూ యెహోవా ఇచ్చే ఎన్నో దీవెనల్ని ఆనందిస్తున్నారు.—యోహా. 10:16; యెష. 25:6; 65:13.
15. ఆధ్యాత్మిక పరదైసు ఎక్కడుంది?
15 నేడు ఆధ్యాత్మిక పరదైసు ఎక్కడుంది? యెహోవా ఆరాధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్లుంటున్న ఆధ్యాత్మిక పరదైసు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే మనం సత్యారాధనలో ఉత్సాహంగా పాల్గొన్నట్లయితే, మనం భూమ్మీద ఎక్కడ జీవించినాసరే ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నట్టే.
16. ఆధ్యాత్మిక పరదైసులో ఉన్న అందాన్ని చూస్తూ ఉండాలంటే, మనం ఏం చేయాలి?
16 మనం ఎప్పటికీ ఆధ్యాత్మిక పరదైసులో ఉండాలంటే చేయాల్సిన ఒక పని ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం మీద మనకున్న కృతజ్ఞతను కాపాడుకోవాలి. దాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఆధ్యాత్మిక పరదైసులో ఉంటున్న తోటి ఆరాధకుల లోపాల మీద కాకుండా వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద మనసుపెట్టాలి. (యోహా. 17:20, 21) అది ఎందుకంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక పార్కుకి లేదా గార్డెన్‌కి వెళ్లినప్పుడు రకరకాల అందమైన చెట్లను చూస్తారు. అయితే మీకు దగ్గర్లో ఉన్న ఒక చెట్టులోని చిన్నచిన్న లోపాల్నే చూస్తూ ఉంటే, ఆ పార్కు మొత్తం ఎంత అందంగా ఉందో మీరు చూడలేరు. అదేవిధంగా మన సంఘాల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. (యెష. 44:4; 61:3) అయితే మన లోపాల మీద, మన చుట్టూవున్న వాళ్ల లోపాల మీద దృష్టి పెడితే, ప్రపంచవ్యాప్తంగా మన సహోదర సహోదరీల మధ్య ఉన్న ఐక్యత ఎంత అందంగా ఉందో చూడలేం. కాబట్టి అలా జరగకుండా మనం జాగ్రత్తపడాలి.
17. సంఘంలో ఉన్న ఐక్యతను పెంచడానికి మనలో ప్రతీఒక్కరం ఏం చేయాలి?
17 ఈ ఐక్యతను పెంచడానికి మనలో ప్రతీఒక్కరం ఏం చేయాలి? శాంతిని నెలకొల్పేవాళ్లుగా ఉండాలి. (మత్త. 5:9; రోమా. 12:18) సంఘంలో ఉన్నవాళ్లతో శాంతిగా ఉండడానికి మనం చొరవ తీసుకున్న ప్రతీసారి, ఆధ్యాత్మిక పరదైసుకు ఉన్న అందాన్ని పెంచిన వాళ్లమౌతాం. స్వచ్ఛారాధనలో పాల్గొనడానికి ఆధ్యాత్మిక పరదైసులో ఉంటున్న ప్రతీఒక్కర్ని యెహోవాయే ఆకర్షించాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. (యోహా. 6:44) తాను ఎంతో అమూల్యంగా ఎంచే తన సేవకుల మధ్య శాంతిని, ఐక్యతను పెంచడానికి మనం పడుతున్న కష్టాన్ని చూసి యెహోవా ఎంత సంతోషిస్తాడో ఊహించండి!—యెష. 26:3; హగ్గ. 2:7.
18. మనం వేటి గురించి బాగా ఆలోచించాలి? ఎందుకు?
18 యెహోవా తన సేవకులకు ఎన్నో దీవెనలు ఇస్తున్నాడు. అయితే వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో, ప్రచురణల్లో మనం అధ్యయనం చేసే వాటి గురించి లోతుగా ఆలోచించాలి. అలా చేసినప్పుడు మనం క్రైస్తవ లక్షణాల్ని అలవర్చుకుని అందరి మీద “సహోదర ప్రేమను,” “వాత్సల్యాన్ని” చూపిస్తాం. (రోమా. 12:10) ప్రస్తుతం మనం ఆనందించే దీవెనల గురించి బాగా ఆలోచించినప్పుడు, యెహోవాతో మనకున్న సంబంధం బలపడుతుంది. అలాగే భవిష్యత్తులో యెహోవా మనకు ఇవ్వబోయే దీవెనల గురించి ఆలోచించినప్పుడు, ఆయన్ని శాశ్వతంగా సేవించాలనే మన నిరీక్షణ కూడా బలపడుతుంది. ఇవన్నీ మనం యెహోవాను ఇప్పుడు సంతోషంగా సేవించేలా సహాయం చేస్తాయి.
చివరివరకు సహిద్దాం
19. (ఎ) యెషయా 30:18 ప్రకారం, మనం దేని గురించి నమ్మకంతో ఉండవచ్చు? (బి) కష్టాల్ని సహిస్తూ సంతోషంగా కొనసాగడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
19 ఈ దుష్టలోకాన్ని నాశనం చేసేటప్పుడు, యెహోవా మనల్ని కాపాడడానికి “లేస్తాడు.” (యెష. 30:18) యెహోవా “న్యాయవంతుడైన దేవుడు” కాబట్టి, సాతాను లోకాన్ని అవసరమైన దానికి మించి ఒక్కరోజు కూడా ఉండనివ్వడు అనే నమ్మకం మనకుంది. (యెష. 25:9) మనం విడుదలయ్యే రోజు కోసం యెహోవాతో కలిసి ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉందాం. అయితే ఈలోగా ప్రార్థన అనే వరాన్ని అమూల్యంగా ఎంచుతూ, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి పాటిస్తూ, మనకున్న దీవెనల గురించి ధ్యానిస్తూ ఉండాలని నిర్ణయించుకుందాం. అప్పుడు, కష్టాల్ని సహిస్తూ తన సేవలో సంతోషంగా కొనసాగేలా యెహోవా మనకు సహాయం చేస్తాడు.
పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం
a జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని సంతోషంగా సహించడానికి యెహోవా తన ఆరాధకులకు సహాయం చేసే మూడు విధానాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యెషయా 30వ అధ్యాయాన్ని పరిశీలిస్తూ యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో తెలుసుకుంటాం. ఈ అధ్యాయాన్ని పరిశీలిస్తుండగా యెహోవాకు ప్రార్థించడం, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడం, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో మనం అనుభవించే ఆశీర్వాదాల్ని ధ్యానించడం ఎంత ముఖ్యమో గుర్తుచేసుకుంటాం.
b పదాల వివరణ: “ఆధ్యాత్మిక పరదైసు” అంటే, యెహోవాను ఐక్యంగా ఆరాధించే ఒక సురక్షితమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో దేవునికి సంబంధించిన అబద్ధాలు లేని ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అలాగే దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించే సంతృప్తికరమైన పని కూడా చాలా ఉంటుంది. మనకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటుంది. అలాగే మనల్ని ఎంతో ప్రేమించే మన సహోదర సహోదరీలతో శాంతిగా ఉంటాం. వాళ్ల సహాయంతో జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల్ని సంతోషంగా సహిస్తాం. యెహోవాను సరైన విధంగా ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు, ఆయన్ని అనుకరించడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు మనం ఆ ఆధ్యాత్మిక పరదైసులో అడుగుపెడతాం.