కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 44

పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి

అన్యాయాన్ని సహించడం ఎలా?

అన్యాయాన్ని సహించడం ఎలా?

“చెడును నీ మీద విజయం సాధించనివ్వకు, బదులుగా మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండు.”రోమా. 12:21.

ముఖ్యాంశం

అన్యాయం జరిగినప్పుడు సమస్య ఇంకా ముదిరిపోకుండా ఏం చేయవచ్చో నేర్చుకుంటాం.

1-2. మనందరం ఎలాంటి అన్యాయాల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు?

 యేసు అందరి మనసులో నిలిచిపోయే ఒక ఉదాహరణ చెప్పాడు. అందులో ఒక విధవరాలు న్యాయం చేయమని న్యాయమూర్తిని పదేపదే బతిమాలింది. అప్పట్లో అన్యాయస్థుల చేతుల్లో బలవ్వడం ప్రజలకు కొత్తేమీ కాదు. అందుకే యేసు శిష్యుల హృదయాల్లో ఆ ఉదాహరణ ముద్రపడిపోయింది. (లూకా 18:1-5) మనం కూడా ఎప్పుడోకప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొని ఉంటాం కాబట్టి ఆ విధవరాలి మనసును అర్థం చేసుకోగలం.

2 ఇప్పుడు కూడా వివక్ష, వేరేవాళ్లను తక్కువ చేసి చూడడం, అణచివేత అడుగడుగునా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు ఆశ్చర్యపోం. (ప్రసం. 5:8) అయితే మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనకు అన్యాయం చేస్తారని మాత్రం అస్సలు ఊహించం. కానీ, అలా కూడా జరగవచ్చు. వ్యతిరేకించే వాళ్లలా, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ కావాలని మనల్ని బాధపెట్టరు. వాళ్లు కూడా అపరిపూర్ణులే కాబట్టి అలా జరుగుతుంది. వ్యతిరేకించేవాళ్ల వల్ల యేసుకు కూడా అన్యాయం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడో పరిశీలిస్తే మనం ఎంతో నేర్చుకోవచ్చు. వ్యతిరేకించేవాళ్లు అన్యాయం చేసినప్పుడే మనం ఓపిగ్గా సహిస్తుంటే, బ్రదర్స్‌-సిస్టర్స్‌ అలా చేసినప్పుడు ఇంకెంత ఓపిగ్గా సహించాలి! బ్రదర్స్‌-సిస్టర్స్‌ గానీ, బయటివాళ్లు గానీ మనకు అన్యాయం చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఆయన పట్టించుకుంటాడా?

3. మనకు అన్యాయం జరిగితే యెహోవా పట్టించుకుంటాడా? ఎందుకు?

3 మనం బాధపడడం యెహోవాకు అస్సలు ఇష్టం లేదు. మనకు జరిగే ప్రతీ అన్యాయం ఆయనకు తెలుసు. ఎందుకంటే “యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.” (కీర్త. 37:28) సరైన సమయం వచ్చినప్పుడు యెహోవా “త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు” అని యేసు మాటిస్తున్నాడు. (లూకా 18:7, 8) అంతేకాదు రాబోయే రోజుల్లో మనకున్న బాధంతటినీ తీసేస్తాడు, అన్యాయాన్ని అంతం చేస్తాడు.—కీర్త. 72:1, 2.

4. అన్యాయాన్ని సహించడానికి యెహోవా మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు?

4 భూమంతా నీతిన్యాయాలతో నిండిపోయే సమయం కోసం మనం ఎదురుచూస్తున్నాం. ఈలోపు అన్యాయాన్ని సహించడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. (2 పేతు. 3:13) ఉదాహరణకు, ఎవరైనా మనతో చెడుగా ప్రవర్తిస్తే, సమస్య ఇంకా ముదిరిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలో యెహోవా చెప్తున్నాడు. అన్యాయాన్ని ఎలా సహించాలో యేసు ఆదర్శాన్ని ఉపయోగించి నేర్పిస్తున్నాడు, మంచి సలహాలు కూడా ఇస్తున్నాడు.

అన్యాయం జరిగినప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించండి

5. అన్యాయం జరిగినప్పుడు ఏం చేయకుండా జాగ్రత్తపడాలి?

5 అన్యాయం జరిగితే మన మనసు ముక్కలైపోతుంది. (ప్రసం. 7:7) యోబు, హబక్కూకు లాంటి నమ్మకమైన సేవకులకు కూడా అలాగే అనిపించింది. (యోబు 6:2, 3; హబ. 1:1-3) అది సహజమే, కానీ మనం తప్పటడుగు వేయకుండా జాగ్రత్తపడాలి.

6. అబ్షాలోము ఉదాహరణ మనకేం నేర్పిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

6 మనకు గానీ, మనకు ఇష్టమైనవాళ్లకు గానీ అన్యాయం జరిగితే పగతీర్చుకోవాలి అనిపిస్తుంది. అలా చేస్తే సమస్య అక్కడితో ఆగిపోదు గానీ పుట్టలు-పుట్టలుగా పెరిగిపోతుంది. దావీదు కుమారుడైన అబ్షాలోము సంగతే చూడండి. తన చెల్లి తామారును అమ్నోను పాడుచేసినప్పుడు ఆయన కోపంతో రగిలిపోయాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అమ్నోను చేసిన పనికి మరణ శిక్ష పడాలి. (లేవీ. 20:17) అబ్షాలోముకు కోపం రావడంలో తప్పులేదు గానీ, పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని అమ్నోనును చంపడం తప్పు.—2 సమూ. 13:20-23, 28, 29.

తన చెల్లి తామారుకు అన్యాయం జరిగినప్పుడు అబ్షాలోము బాగా కోపం పెంచుకున్నాడు (6వ పేరా చూడండి)


7. అన్యాయాన్ని చూసి కొంతకాలం వరకు కీర్తనకర్తకు ఏం అనిపించింది?

7 అన్యాయం చేసినవాళ్లకు శిక్ష పడట్లేదని మనకు అనిపిస్తే, మంచిపనులు చేయడంలో ఉపయోగం ఏముంది అనే ప్రశ్న రావచ్చు. కీర్తనకర్త గురించి ఆలోచించండి. చెడ్డవాళ్ల చేతుల్లో మంచివాళ్లు బాధలు అనుభవిస్తున్నారని, ఐనా చెడ్డవాళ్లకు ఏమీ అవ్వట్లేదని ఆయన గమనించాడు. అందుకే ‘దుష్టులు ఎప్పుడూ నిశ్చింతగా ఉంటారు’ అని ఆయన అన్నాడు. (కీర్త. 73:12) ఆయన మనసు ఎంతలా విరిగిపోయిందంటే, ‘యెహోవాను ఆరాధించడంలో అసలు ప్రయోజనం ఉందా?’ అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకే ఇలా అన్నాడు: “నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అది నా మనసును తొలిచేసేది.” (కీర్త. 73:14, 16) పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో చెప్తూ ఆయనిలా అన్నాడు: “నా విషయానికొస్తే, నా పాదాలు దాదాపు దారితప్పాయి; నా అడుగులు జారినంత పనైంది.” (కీర్త. 73:2) ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న బ్రదర్‌ ఆల్బర్ట్‌ a గురించి చూడండి.

8. అన్యాయం జరిగినప్పుడు ఒక బ్రదర్‌ పరిస్థితి ఎలా మారిపోయింది?

8 సంఘానికి చెందిన డబ్బుల్ని దొంగతనం చేశాడని ఆల్బర్ట్‌ మీద కొంతమంది బ్రదర్స్‌ తప్పుగా నిందలు వేశారు. దానివల్ల ఆయన తన బాధ్యతల్ని కోల్పోయాడు. అంతేకాదు ఆ విషయం తెలిసిన చాలామంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆయన్ని గౌరవించడం ఆపేశారు. “ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది, బాధతో నలిగిపోయాను, బాగా చిరాకేసింది” అని ఆయన గుర్తుచేసుకుంటున్నాడు. ఈ ఫీలింగ్స్‌ ఎంతవరకు దారితీశాయంటే యెహోవాతో ఆయన స్నేహం బలహీనపడి, ఐదు సంవత్సరాల పాటు నిష్క్రియునిగా ఉన్నాడు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మన కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే పరిస్థితులు ఎంత వరకు వెళ్తాయో, ఈ ఉదాహరణ చూపిస్తుంది.

యేసులా అన్యాయాన్ని సహించండి

9. యేసుకు ఎలాంటి అన్యాయం జరిగింది? (చిత్రం కూడా చూడండి.)

9 అన్యాయాన్ని సహించే విషయంలో యేసు తిరుగులేని ఆదర్శాన్ని ఉంచాడు. భూమ్మీద ఉన్నప్పుడు ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు యేసుతో సరిగ్గా ప్రవర్తించలేదు. బంధువులు ఆయనకు పిచ్చిపట్టిందని అన్నారు. మతనాయకులు ఆయన చెడ్డదూతల సహాయం తీసుకుంటున్నాడని నిందలు వేశారు. రోమా సైనికులు యేసును ఎగతాళి చేశారు, కొట్టారు, ఆఖరికి చంపేశారు. (మార్కు 3:21, 22; 14:55; 15:16-20, 35-37) ఇంత అన్యాయం జరిగినా యేసు తిరిగి ఒక్కమాట కూడా అనలేదు, ఏ తప్పూ చేయలేదు. ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

అన్యాయాన్ని సహించడంలో యేసు సాటిలేని ఆదర్శాన్ని ఉంచాడు (9-10 పేరాలు చూడండి)


10. యేసు అన్యాయాన్ని ఎలా సహించాడు? (1 పేతురు 2:21-23)

10 మొదటి పేతురు 2:21-23 చదవండి. b మనకు అన్యాయం జరిగినప్పుడు యేసు ఆదర్శాన్ని పాటించవచ్చు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో యేసుకు తెలుసు. (మత్త. 26:62-64) ఇతరులు ఆయన గురించి అబద్ధాలు చెప్పిన ప్రతీసారి ఆయన జవాబు ఇవ్వాలనుకోలేదు. (మత్త. 11:19) ఒకవేళ జవాబిచ్చినా ఆయన తన వ్యతిరేకుల్ని అవమానించడం గానీ, బెదిరించడం గానీ చేయలేదు. బదులుగా యేసు ఆత్మనిగ్రహం చూపించాడు. ఎందుకంటే “నీతిగా తీర్పుతీర్చే దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు.” తనకు అన్యాయం జరుగుతుందనే విషయం యెహోవాకు తెలుసని యేసు మనసులో ఉంచుకున్నాడు. సరైన సమయంలో యెహోవా తనకు న్యాయం చేస్తాడని ఆయన నమ్మాడు.

11. మన మాటల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? (చిత్రాలు కూడా చూడండి.)

11 అన్యాయం జరిగినప్పుడు నోరు జారకుండా, మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా యేసులా ఉండవచ్చు. మనకు జరిగిన అన్యాయం అంత పెద్దదేమి కాకపోతే దాన్ని చూసీచూడనట్టు వదిలేయవచ్చు. పరిస్థితి ముదిరిపోకుండా ఉండడానికి కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలని అనుకోవచ్చు. (ప్రసం. 3:7; యాకో. 1:19, 20) కానీ కొన్నిసార్లు మనం మాట్లాడాల్సి రావచ్చు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ల తరఫున మాట్లాడాలి, లేదా మన నమ్మకాల గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తే నిజమేంటో వివరించాలి. (అపొ. 6:1, 2) అలాంటి సందర్భాల్లో కూడా ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.—1 పేతు. 3:15. c

అన్యాయం జరిగితే ఎప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా యేసులా ఉండవచ్చు (11-12 పేరాలు చూడండి)


12. “నీతిగా తీర్పుతీర్చే దేవునికి” మనల్ని మనం ఎలా అప్పగించుకుంటాం?

12 యేసులా మనం ఇంకో పని కూడా చేయవచ్చు. “నీతిగా తీర్పుతీర్చే దేవునికి” మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇతరులు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు లేదా మనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు, నిజంగా ఏం జరిగిందో యెహోవాకు తెలుసనే నమ్మకంతో ఉండవచ్చు. ఆ నమ్మకం వల్ల అన్యాయాన్ని ఓపిగ్గా సహించగలుగుతాం, ఎందుకంటే యెహోవా విషయాల్ని సరి చేస్తాడని మనకు తెలుసు. అన్నిటిని యెహోవాకు వదిలేస్తే కోపాన్ని, పగను మన మనసులో గూడు కట్టనివ్వం. ఒకవేళ మనం అలా చేయకపోతే అతిగా స్పందిస్తాం, సంతోషాన్ని కోల్పోతాం, యెహోవాతో ఉన్న సంబంధాన్ని పాడుచేసుకుంటాం.—కీర్త. 37:8.

13. అన్యాయం సహించడం కష్టం అనిపించినప్పుడు మీకు ఏది ధైర్యాన్నిస్తుంది?

13 నిజం చెప్పాలంటే మనం యేసు అడుగులో అడుగేసి అన్నీ ఆయన చేసినట్టే చేయలేం. కొన్నిసార్లు మాటల్లో, పనుల్లో తప్పిపోతుంటాం. (యాకో. 3:2) ఇంకొన్నిసార్లు అన్యాయం మన మనసుకు, శరీరానికి మానని గాయాన్ని మిగులుస్తుంది. మీ విషయంలో ఇదే నిజమైతే, మీకెలా అనిపిస్తుందో యెహోవాకు తెలుసనే ధైర్యంతో ఉండండి. ఎంతో అన్యాయాన్ని సహించిన యేసు కూడా మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలడు. (హెబ్రీ. 4:15, 16) అన్యాయాన్ని సహించడానికి తన కుమారుడి ఆదర్శం ఒక్కటే కాదు, ఉపయోగపడే సలహాలు కూడా యెహోవా ఇచ్చాడు. వాటిలో కొన్ని రోమీయుల పుస్తకంలో ఉన్నాయి. అందులోని రెండు లేఖనాల్ని ఇప్పుడు చూద్దాం.

“దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వండి”

14. ‘దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వాలంటే’ ఏం చేయాలి? (రోమీయులు 12:19)

14 రోమీయులు 12:19 చదవండి. అపొస్తలుడైన పౌలు “దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వండి” అని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. దాన్ని ఎలా చేయవచ్చు? యెహోవా తన సమయంలో, తన పద్ధతిలో న్యాయం చేసేలా మనం అనుమతించాలి. జాన్‌ అనే బ్రదర్‌కి అన్యాయం జరిగినప్పుడు ఎలా అనిపించిందో చెప్తున్నాడు: “నాకు జరిగిన అన్యాయాన్ని నా అంతట నేనే సరిచేయాలని బాగా అనిపించింది. అలా చేయకుండా నన్ను నేను కంట్రోల్‌ చేసుకోవడం చాలా కష్టమైంది. ఓపిగ్గా ఉండడానికి, యెహోవా మీద నమ్మకం ఉంచడానికి రోమీయులు 12:19 నాకు సహాయం చేసింది.”

15. సమస్యను యెహోవాకు వదిలేయడం ఎందుకు మంచిది?

15 సమస్యను యెహోవాకు వదిలేస్తే మనకే మంచిది. ఎందుకంటే మన సమస్యని సొంతగా పరిష్కరించుకోవాలని అనుకుంటే అది తలకు మించిన భారంలా తయారౌతుంది. యెహోవా మనకు సహాయం చేయడానికి చేయందిస్తున్నాడు. ఒకవిధంగా ఆయనిలా అంటున్నాడు: ‘దీన్ని నాకు వదిలేయి, నేను చూసుకుంటాను.’ యెహోవాయే పగతీర్చుకుంటాను అని మాటిస్తున్నాడు కాబట్టి, తిరుగులేని విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తాడనే నమ్మకంతో అంతా ఆయనకే వదిలేయవచ్చు. ముందు చెప్పిన జాన్‌కి కూడా అదే సహాయం చేసింది. ఆయనిలా అంటున్నాడు: “సమస్యను యెహోవా నాకంటే బాగా పరిష్కరిస్తాడు. అప్పటివరకు నేను ఎదురుచూడగలిగితే చాలు.”

“మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండు”

16-17. “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండడానికి ప్రార్థన మనకు ఎలా సహాయం చేస్తుంది? (రోమీయులు 12:21)

16 రోమీయులు 12:21 చదవండి. “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండమని కూడా పౌలు క్రైస్తవులకు చెప్పాడు. కొండమీద ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి.” (మత్తయి 5:44) యేసు అదే చేశాడు. రోమా సైనికులు యేసును కొయ్యమీద వేలాడదీసినప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డాడో మనకు కొంతవరకు తెలుసు. కానీ ఆరోజు ఆయన సహించిన అన్యాయాన్ని, అవమానాన్ని, పడ్డ వేదనను మనం పూర్తిగా అర్థం చేసుకోలేం.

17 యేసు చెడును తనపై విజయం సాధించనివ్వలేదు. సైనికుల్ని శిక్షించమని అడిగే బదులు ఆయన యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.” (లూకా 23:34) మనతో చెడుగా ప్రవర్తించిన వాళ్లకోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్లమీద కోపావేశాలు తగ్గిపోవచ్చు, వాళ్లమీద మనకున్న అభిప్రాయం కూడా మారవచ్చు.

18. అన్యాయాన్ని సహించడానికి ఆల్బర్ట్‌కి, జాన్‌కి ప్రార్థన ఎలా సహాయం చేసింది?

18 ఈ ఆర్టికల్‌ మొదట్లో చూసిన ఆల్బర్ట్‌కి, జాన్‌కి ప్రార్థన సహాయం చేసింది. ఆల్బర్ట్‌ ఇలా అంటున్నాడు: “నాతో సరిగ్గా ప్రవర్తించని బ్రదర్స్‌ కోసం నేను ప్రార్థన చేశాను. జరిగినదాని గురించి మర్చిపోయి ముందుకెళ్లడానికి సహాయం చేయమని యెహోవాను చాలాసార్లు అడిగాను.” మంచి విషయం ఏంటంటే ఆల్బర్ట్‌ తిరిగి యెహోవాకు నమ్మకంగా సేవచేయడం మొదలుపెట్టాడు. జాన్‌ ఇలా అంటున్నాడు: “నన్ను బాధపెట్టిన బ్రదర్‌ గురించి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను. ఆయన మీద కోపాన్ని తీసేసుకోవడానికి, తీర్పుతీర్చకుండా ఉండడానికి ప్రార్థన నాకు సహాయం చేసింది. ఆ ప్రార్థనల వల్ల మనశ్శాంతిని కూడా పొందాను.”

19. ఈ లోకం అంతమయ్యే వరకు మనం ఏం చేస్తూ ఉండాలి? (1 పేతురు 3:8, 9)

19 ఈ లోకం అంతమయ్యే వరకు మన జీవితంలో ఇంకా ఎన్ని అన్యాయాలు సహించాల్సి రావచ్చో చెప్పలేం. కానీ ఏదేమైనా సహాయం కోసం యెహోవాకు మానకుండా ప్రార్థన చేస్తూ ఉందాం. అన్యాయం జరిగితే యేసులా ఉందాం, బైబిలు సూత్రాల్ని పాటిద్దాం. అప్పుడు మనం ఖచ్చితంగా యెహోవా నుండి దీవెనలు పొందుతాం.—1 పేతురు 3:8, 9 చదవండి.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

a కొన్ని పేర్లను మార్చం.

b కఠినులైన యజమానుల నుండి, అవిశ్వాసులైన భర్తల నుండి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అన్యాయాల్ని సహించిన కొన్ని సందర్భాల గురించి అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి ఉత్తరంలోని 2, 3 అధ్యాయాల్లో చూస్తాం.—1 పేతు. 2:18-20; 3:1-6, 8, 9.

c jw.org వెబ్‌సైట్‌లో ప్రేమ చూపిస్తే నిజమైన శాంతిని పొందుతాం అనే వీడియో చూడండి.