కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 45

పాట 138 తలనెరుపులో ఉన్న సొగసు

నమ్మకమైన వాళ్ల చివరి మాటల నుండి నేర్చుకుందాం

నమ్మకమైన వాళ్ల చివరి మాటల నుండి నేర్చుకుందాం

“వృద్ధుల దగ్గర తెలివి ఉంటుంది. దీర్ఘాయుష్షు వల్ల అవగాహన వస్తుంది.”యోబు 12:12.

ముఖ్యాంశం

యెహోవా దేవుని మాట వింటే ఇప్పుడు దీవెనలు పొందుతాం, భవిష్యత్తులో శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటాం.

1. వయసులో పెద్దవాళ్ల నుండి మనం ఎందుకు నేర్చుకోవాలి?

 మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మనందరికీ మంచి సలహాలు అవసరం. సంఘ పెద్దలు, పరిణతిగల క్రైస్తవులు ఈ విషయంలో మనకు సహాయం చేయగలరు. వాళ్లు మనకంటే వయసులో పెద్దవాళ్లు కాబట్టి వాళ్ల సలహాల్ని పాత చింతకాయ పచ్చడిలా చూడకూడదు. మనం పెద్దవాళ్ల నుండి నేర్చుకోవాలని యెహోవా కోరుతున్నాడు. మనకంటే ఎక్కువకాలం జీవించారు కాబట్టి వాళ్లకు అనుభవం, అవగాహన, తెలివి మనకంటే ఎక్కువే ఉంటాయి.—యోబు 12:12.

2. ఈ ఆర్టికల్‌లో ఏం తెలుసుకుంటాం?

2 బైబిలు కాలాల్లో యెహోవా తన ప్రజల్ని ప్రోత్సహించడానికి, నడిపించడానికి నమ్మకమైన వృద్ధుల్ని ఉపయోగించాడు. మోషే, దావీదు, అపొస్తలుడైన యోహాను గురించి ఆలోచించండి. వాళ్లు వేర్వేరు కాలాల్లో, పరిస్థితుల్లో జీవించారు. వాళ్ల జీవితంలోని చివరి రోజుల్లో తమ కంటే చిన్నవాళ్లకు తెలివైన సలహాలు ఇచ్చారు. యెహోవా మాట వినడం ఎంత ప్రాముఖ్యమో చెప్పారు. మనం కూడా వాళ్ల మాటల్ని విని ప్రయోజనం పొందేలా యెహోవా వాటిని బైబిల్లో రాయించాడు. మనం వయసులో చిన్నవాళ్లమైనా, పెద్దవాళ్లమైనా ఆ సలహాల్ని పరిశీలిస్తే ఎన్నో ప్రయోజనాల్ని పొందుతాం. (రోమా. 15:4; 2 తిమో. 3:16) ఈ ఆర్టికల్‌లో ఈ ముగ్గురు వృద్ధులు చివరిగా చెప్పిన మాటల గురించి, మనం నేర్చుకోగలిగే పాఠాల గురించి తెలుసుకుంటాం.

“నువ్వు చాలాకాలం జీవిస్తావు”

3. మోషే యెహోవా సేవలో ఏమేం చేశాడు?

3 మోషే తన జీవితకాలమంతా నిండుహృదయంతో యెహోవా కోసం కష్టపడ్డాడు. ఆయన ప్రవక్తగా, న్యాయమూర్తిగా, నాయకునిగా, రచయితగా సేవచేశాడు. మోషేకు చాలా అనుభవం ఉంది. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. యెహోవా చేసిన ఎన్నో అద్భుతాల్ని కళ్లారా చూశాడు. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని, 90వ కీర్తనను రాయడానికి యెహోవా ఆయన్ని ఉపయోగించుకున్నాడు. బహుశా 91వ కీర్తనను, యోబు పుస్తకాన్ని కూడా మోషేనే రాసుంటాడు.

4. మోషే ఎవర్ని ప్రోత్సహించాడు? ఎందుకు?

4 మోషే చనిపోకముందు అంటే 120 ఏళ్లు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందర్నీ పిలిపించి, వాళ్లు చూసిన వాటన్నిటి గురించి ఒకసారి గుర్తుచేశాడు. ఆయన మాట వింటున్నవాళ్లు తమ యౌవనంలో, యెహోవా చేసిన ఎన్నో అద్భుతాల్ని, ఐగుప్తు మీద తెచ్చిన తీర్పుల్ని స్వయంగా చూశారు. (నిర్గ. 7:3, 4) ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు వాళ్లు ఆరిన నేలమీద నడిచారు, ఫరో సైన్యం నాశనమవ్వడం చూశారు. (నిర్గ. 14:29-31) ఎడారిలోనైతే యెహోవా కాపుదలను, శ్రద్ధను చూశారు. (ద్వితీ. 8:3, 4) ఇప్పుడు వాళ్లు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్లను ప్రోత్సహించడానికి తనకున్న ఈ చివరి అవకాశాన్ని మోషే ఉపయోగించుకున్నాడు. a

5. ద్వితీయోపదేశకాండం 30:19, 20 లో మోషే చెప్పిన చివరి మాటలు ఇశ్రాయేలీయులకు ఏ అభయాన్ని ఇచ్చాయి?

5 మోషే ఏం చెప్పాడు? (ద్వితీయోపదేశకాండం 30:19, 20 చదవండి.) ఇశ్రాయేలీయుల ముందు బంగారు భవిష్యత్తు ఉంది. యెహోవా దీవెనలతో వాగ్దాన దేశంలో ఎక్కువకాలం జీవించవచ్చు అనే అభయం వాళ్లకుంది. ఆ దేశం చాలా అందంగా ఉండేది, పంటలు పుష్కలంగా పండేవి. దాని గురించి మోషే ఇలా వివరించాడు: ‘నువ్వు నిర్మించని శ్రేష్ఠమైన గొప్ప నగరాలు, నువ్వు కష్టపడి సంపాదించని అన్నిరకాల మంచి వస్తువులతో నిండివున్న ఇళ్లు, నువ్వు తవ్వని బావులు, నువ్వు నాటని ద్రాక్షతోటలు ఒలీవ చెట్లు ఉన్న దేశం.’—ద్వితీ. 6:10, 11.

6. వేరే దేశాలు ఇశ్రాయేలీయులపై దాడి చేయడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?

6 మోషే ఇశ్రాయేలీయులకు ఒక హెచ్చరికను కూడా ఇచ్చాడు. వాళ్లు ఆ చక్కని దేశంలో జీవిస్తూ ఉండాలంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు లోబడాలి. వాళ్లు యెహోవా “మాట వింటూ, ఆయన్ని హత్తుకొని” ఉంటూ, “జీవాన్ని కోరుకోవాలి” అని మోషే చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులు యెహోవాకు లోబడలేదు. అందుకే కొంతకాలం తర్వాత అష్షూరీయులు, బబులోనీయులు వాళ్లపై దాడి చేసి వాళ్లను బందీలుగా తీసుకెళ్లిపోయారు. యెహోవా దాన్ని అనుమతించాడు.—2 రాజు. 17:6-8, 13, 14; 2 దిన. 36:15-17, 20.

7. మోషే చెప్పిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 మనకేంటి పాఠం? యెహోవాకు లోబడితే శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దగ్గర్లో ఉన్నట్టే, మనం కూడా దేవుడు మాటిచ్చిన కొత్త లోకానికి చాలా దగ్గర్లో ఉన్నాం. అప్పుడు భూమంతా పరదైసులా మారుతుంది. (యెష. 35:1; లూకా 23:43) సాతాను, చెడ్డదూతలు లేకుండా పోతారు. (ప్రక. 20:2, 3) ప్రజల్ని యెహోవాకు దూరం చేసే అబద్ధమతం ఇక కనిపించదు. (ప్రక. 17:16) మనుష్యుల్ని అణచివేసే ప్రభుత్వాలు ఉండవు. (ప్రక. 19:19, 20) తిరుగుబాటు చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. (కీర్త. 37:10, 11) ప్రజలందరూ యెహోవా నీతి ప్రమాణాల్ని పాటిస్తారు. భూమంతా ఐక్యతకు, శాంతికి చిరునామాలా ఉంటుంది. (యెష. 11:9) అందరూ ఒకరినొకరు ప్రేమిస్తారు, నమ్ముతారు. ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా! యెహోవాకు లోబడితే మనం పరదైసు భూమ్మీద కొన్ని వందల సంవత్సరాలే కాదు, శాశ్వత కాలం జీవిస్తాం.—కీర్త. 37:29; యోహా. 3:16.

మనం యెహోవాకు లోబడితే పరదైసు భూమ్మీద కొన్ని వందల సంవత్సరాలే కాదు, శాశ్వత కాలం జీవిస్తాం (7వ పేరా చూడండి)


8. శాశ్వత జీవితాన్ని కళ్లముందు ఉంచుకోవడం మిషనరీ సేవ చేస్తున్న ఒక బ్రదర్‌కి ఎలా సహాయం చేసింది? (యూదా 20, 21)

8 శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ మన కళ్లముందే ఉంచుకుంటే, ఎలాంటి సమస్య వచ్చినా యెహోవాను అంటిపెట్టుకుని ఉంటాం. (యూదా 20, 21 చదవండి.) మనకున్న బలహీనతలతో పోరాడడానికి అది శక్తినిస్తుంది. ఆఫ్రికాలో ఎన్నో సంవత్సరాలుగా మిషనరీ సేవ చేస్తున్న ఒక బ్రదర్‌ ఉదాహరణ పరిశీలించండి. ఆయన ఒక బలహీనతతో చాలా రోజులు పోరాడాను అని చెప్తూ ఇలా అంటున్నాడు: “ఆ బలహీనత వల్ల శాశ్వత జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నాకు అర్థమైంది. అప్పుడు దానితో పోరాడి జయించాలని ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నాను, యెహోవాకు ఇంకా తీవ్రంగా ప్రార్థించాను. ఆయన సహాయంతో నేను దాన్నుండి బయటపడగలిగాను.”

“నువ్వు విజయం సాధిస్తావు”

9. దావీదు ఎలాంటి కష్టాల్ని చూశాడు?

9 దావీదు ఒక గొప్ప రాజు. ఆయన ఒక సంగీతకారుడు, కవితలు రాసేవాడు, యోధుడు, ఒక ప్రవక్త కూడా. ఆయన జీవితంలో ఎన్నో కష్టాల్ని చూశాడు. రాజైన సౌలు ఆయన్ని చంపాలనుకున్నాడు. అప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన దాక్కోవాల్సి వచ్చింది. దావీదు రాజయ్యాక, ఆయన కుమారుడు అబ్షాలోము సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. దావీదు మళ్లీ తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. వీటికి తోడు ఆయన కూడా కొన్ని తప్పులు చేశాడు, కానీ చివరివరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకే యెహోవా ఆయన్ని “నా హృదయానికి నచ్చిన వ్యక్తి” అని పిలిచాడు. కాబట్టి దావీదు ఇచ్చిన సలహాల్ని వింటే మనం ఎన్నో ప్రయోజనాలను పొందుతాం.—అపొ. 13:22; 1 రాజు. 15:5.

10. రాజు అవ్వబోతున్న సొలొమోనుకు దావీదు ఎందుకు సలహా ఇచ్చాడు?

10 ఉదాహరణకు, దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చిన సలహా గురించి ఆలోచించండి. యువకుడైన సొలొమోను రాజు అవ్వబోతున్నాడు. సత్యారాధనను ముందుకు తీసుకెళ్లడానికి, ఆలయం కట్టడానికి యెహోవా ఆయన్ని ఎంచుకున్నాడు. (1 దిన. 22:5) సొలొమోను ముందు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి దావీదు ఆయనకు ఎలాంటి సలహా ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

11. మొదటి రాజులు 2:2, 3 లో దావీదు సొలొమోనుకు ఏ సలహా ఇచ్చాడు? ఆ సలహా ప్రకారమే సొలొమోను జీవితంలో ఏం జరిగింది? (చిత్రం కూడా చూడండి.)

11 దావీదు ఏం చెప్పాడు? (1 రాజులు 2:2, 3 చదవండి.) యెహోవాకు లోబడితే జీవితంలో విజయం సాధిస్తామని దావీదు తన కుమారునికి చెప్పాడు. ఆ సలహాను పాటించినందుకు, చాలా సంవత్సరాల పాటు సొలొమోను చేసిన ప్రతీది సఫలమైంది. (1 దిన. 29:23-25) ఆయన గొప్ప ఆలయాన్ని కట్టించాడు, బైబిల్లో కొన్ని పుస్తకాల్ని రాశాడు. ఆయన మాటలు బైబిల్లో ఉన్న వేరే పుస్తకాల్లో కూడా కనిపిస్తాయి. తెలివైనవాడని, ధనవంతుడని పేరు సంపాదించుకున్నాడు. (1 రాజు. 4:34) అయితే దేవునికి లోబడినంత కాలమే నువ్వు విజయం సాధిస్తావని దావీదు సొలొమోనుకు చెప్పాడు. కానీ, సొలొమోను వృద్ధుడు అయ్యాక ఆ సలహాను పెడచెవిన పెట్టి, వేరే దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టాడు. దాంతో యెహోవా ఆమోదాన్ని, నీతి-న్యాయాలతో పరిపాలించే తెలివిని కోల్పోయాడు.—1 రాజు. 11:9, 10; 12:4.

దావీదు సొలొమోనుకు చెప్పిన చివరి మాటల్ని బట్టి, మనం యెహోవాకు లోబడితే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన తెలివిని ఆయన ఇస్తాడని నమ్మవచ్చు (11-12 పేరాలు చూడండి) b


12. దావీదు మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 మనకేంటి పాఠం? యెహోవాకు లోబడితే విజయం సాధిస్తాం. (కీర్త. 1:1-3) నిజమే సొలొమోనుకు ఇచ్చినట్టు ఆస్తిపాస్తులు, పేరు-ప్రఖ్యాతలు ఇస్తానని యెహోవా మనకు చెప్పట్లేదు. కానీ మనం తనకు లోబడితే, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన తెలివి ఖచ్చితంగా ఇస్తాడు. (సామె. 2:6, 7; యాకో. 1:5) ఉద్యోగం, చదువు, సరదాలు, డబ్బు, ఇలా ప్రతీ విషయంలో ఉపయోగపడే తెలివైన సలహాలు ఇస్తాడు. ఆ తెలివి ఆయనతో మన సంబంధాన్ని దెబ్బతీసే పనుల నుండి కాపాడి, శాశ్వత జీవితం వైపు నడిపిస్తుంది. (సామె. 2:10, 11) అంతేకాదు మనకు మంచి స్నేహితులు ఉంటారు, మన కుటుంబాలు సంతోషంతో కళకళలాడతాయి.

13. కార్‌మెన్‌ ఎలా ఒక మంచి నిర్ణయం తీసుకుంది?

13 జీవితంలో విజయం సాధించాలంటే పై చదువులు చదవాల్సిందే అని మొజాంబిక్‌లో ఉంటున్న కార్‌మెన్‌ అనుకుంది. ఆమె కాలేజీలో చేరి బిల్డింగ్‌లను ఎలా కట్టాలో (ఆర్కిటెక్చర్‌) చదవడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెప్తుంది: “నాకు ఆ కోర్స్‌ చాలా ఇష్టం. కానీ అది నా శక్తిని, సమయాన్నంతా తినేసేది. ఉదయం 7:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను కాలేజీలోనే ఉండేదాన్ని. మీటింగ్స్‌కు వెళ్లడం చాలా కష్టం అయిపోయేది. యెహోవాతో నాకున్న సంబంధం కూడా దెబ్బతింది. నేను ఇద్దరు యజమానులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నానని నా మనసు నాకు చెప్తూ ఉంది.” (మత్త. 6:24) ఆమె ప్రార్థించి, మన ప్రచురణల్లో పరిశోధన చేసింది. తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్తుంది: “సంఘ పెద్దలు, మా మమ్మీ ఇచ్చిన సలహాల్ని విన్న తర్వాత కాలేజీని వదిలేసి, పూర్తికాల సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నిజంగా నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది. ఈ విషయంలో నేను అస్సలు బాధపడట్లేదు.”

14. మోషే, దావీదు ముఖ్యంగా ఏం చెప్పారు?

14 మోషే, దావీదు యెహోవాను ఎంతో ప్రేమించారు. ఆయన మాట వినడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకున్నారు. అందుకే చనిపోకముందు వాళ్ల చివరి మాటల్లో తమ ఆదర్శాన్ని పాటించమని, యెహోవాను అంటిపెట్టుకుని ఉండమని ఇతరుల్ని ప్రోత్సహించారు. యెహోవాను వదిలేస్తే ఆయన స్నేహాన్ని, ఆయనిచ్చే దీవెనల్ని కోల్పోతామని కూడా హెచ్చరించారు. వాళ్ల సలహాలకు ఉన్న విలువ ఇప్పటికీ తరిగిపోలేదు. అయితే వందల సంవత్సరాల తర్వాత, యెహోవాను ఆరాధించిన ఇంకో వ్యక్తి కూడా దేవునికి నమ్మకంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో వివరించాడు.

“సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదు”

15. అపొస్తలుడైన యోహాను తన జీవితంలో ఏమేం చూశాడు?

15 అపొస్తలుడైన యోహాను యేసుక్రీస్తుకు ప్రియమైన స్నేహితుడు. (మత్త. 10:2; యోహా. 19:26) అతను యేసు పరిచర్యను, ఆయన చేసిన అద్భుతాల్ని దగ్గర నుండి చూశాడు; కష్ట సమయాల్లో యేసు వెన్నంటే ఉన్నాడు. యోహాను కళ్లముందే యేసు చనిపోయాడు. పునరుత్థానం అయ్యాక యేసు యోహానుకు కనిపించాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం అభివృద్ధిని అతను చూశాడు, అంతేకాదు ‘మంచివార్త భూమంతటా ప్రకటించబడేంత’ వరకు బ్రతికే ఉన్నాడు.—కొలొ. 1:23.

16. యోహాను రాసిన ఉత్తరాల నుండి ఎవరు ప్రయోజనం పొందారు?

16 యోహాను బాగా వృద్ధుడిగా ఉన్నప్పుడు ప్రకటన పుస్తకాన్ని రాసే గొప్ప అవకాశాన్ని పొందాడు. (ప్రక. 1:1) ఒక సువార్త పుస్తకాన్ని, మూడు ఉత్తరాల్ని కూడా రాశాడు. అందులోని మూడో ఉత్తరాన్ని నమ్మకమైన క్రైస్తవుడిగా ఉన్న గాయియుకు రాశాడు. యోహాను అతన్ని తన సొంత కొడుకులా చూశాడు. (3 యోహా. 1) అతన్నే కాదు, చాలామందిని తన ఆధ్యాత్మిక పిల్లల్లా ప్రేమించాడు. అయితే నమ్మకంగా ఉన్న ఈ వృద్ధ అపొస్తలుడు రాసిన ఉత్తరాలు ఆ కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా యేసు శిష్యులందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి.

17. మూడో యోహాను 4 ప్రకారం, యోహానుకు ఏది గొప్ప సంతోషాన్ని ఇచ్చింది?

17 యోహాను ఏం రాశాడు? (3 యోహాను 4 చదవండి.) సహోదర సహోదరీలు దేవుని మాట వినడం గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తన మూడో ఉత్తరంలో రాశాడు. నిజానికి, అప్పుడు కొంతమంది అబద్ధ బోధల్ని వ్యాప్తి చేస్తున్నారు, సంఘంలో చిచ్చులు పెడుతున్నారు. కానీ మిగతావాళ్లు “సత్యంలో నడుస్తున్నారు,” యెహోవాకు లోబడుతూ ఆయన ‘ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారు.’ (2 యోహా. 4, 6) ఈ నమ్మకమైన క్రైస్తవులు యోహానునే కాదు, యెహోవాను కూడా సంతోషపెట్టారు.—సామె. 27:11.

18. యోహాను చెప్పిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

18 మనకేంటి పాఠం? యెహోవాకు నమ్మకంగా ఉంటే మనతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు. (1 యోహా. 5:3) ఉదాహరణకు, యెహోవాను సంతోషపెడుతున్నందుకు మనం ఎంతో ఆనందిస్తాం. మనం ఈ లోకం మాయలో పడిపోకుండా, సత్యాన్ని సొంతం చేసుకున్నప్పుడు యెహోవా ఎంతో ఆనందిస్తాడు. (సామె. 23:15) పరలోకంలో ఉన్న దూతలు కూడా ఎంతో సంబరపడతారు. (లూకా 15:10) ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు వచ్చినా బ్రదర్స్‌-సిస్టర్స్‌ నమ్మకంగా ఉండడాన్ని చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. (2 థెస్స. 1:4) సాతాను చెప్పుచేతల్లో ఉన్న ఈ లోకంలో కూడా యెహోవాకు నమ్మకంగా ఉండి, కొత్త లోకంలోకి అడుగుపెట్టాం అనే సంతోషం-సంతృప్తి భవిష్యత్తులో మనకు ఉంటుంది.

19. సత్యాన్ని ఇతరులకు బోధించడం గురించి రేచల్‌ ఏం అంటుంది? (చిత్రం కూడా చూడండి.)

19 మనం ఇతరులకు యెహోవా గురించి బోధించినప్పుడు, ఆ సంతోషమే వేరు! డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఉంటున్న రేచల్‌కు కూడా అలానే అనిపిస్తుంది. మన గొప్ప దేవుని గురించి ఇతరులకు బోధించడం ఎంత పెద్ద గౌరవమో మాటల్లో చెప్పలేమని ఆమె అంటుంది. యెహోవాను ఆరాధించేలా ఆమె చాలామందికి సహాయం చేసింది. వాళ్ల గురించి ఆమె ఇలా చెప్తుంది: “వాళ్లు యెహోవాను ప్రేమించి, ఆయన మీద పూర్తిగా ఆధారపడుతూ, ఆయన్ని సంతోషపెట్టడానికి మార్పులు చేసుకోవడం చూసినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. వాళ్లకు బోధించడానికి నేను చేసిన త్యాగాలు, పడిన కష్టం అంతా మర్చిపోతాను.”

మనలానే యెహోవాను ప్రేమించడం, ఆయనకు లోబడడం ఇతరులకు నేర్పించినప్పుడు సంతోషాన్ని పొందుతాం (19వ పేరా చూడండి)


వాళ్ల చివరి మాటల నుండి ప్రయోజనం పొందండి

20. మోషే, దావీదు, యోహానులకు అలాగే మనకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?

20 మోషే, దావీదు, యోహాను ఎన్నో ఏళ్ల క్రితం జీవించారు. వాళ్ల పరిస్థితులు మన పరిస్థితులు వేరు. కానీ మనకు వాళ్లకు చాలా పోలికలు ఉన్నాయి. వాళ్లు నిజమైన దేవుణ్ణి ఆరాధించారు, మనమూ అలానే ఆరాధిస్తున్నాం. వాళ్లలాగే మనం యెహోవాకు ప్రార్థిస్తాం, సహాయం కోసం-సలహాల కోసం ఆయన మీద ఆధారపడతాం. తనకు లోబడేవాళ్లను యెహోవా మెండుగా దీవిస్తాడని వాళ్లలాగే మనం నమ్ముతున్నాం.

21. మోషే, దావీదు, యోహాను ఇచ్చిన సలహాల్ని పాటించేవాళ్ల ముందు ఎలాంటి దీవెనలు ఉన్నాయి?

21 మనం ఈ ముగ్గురి సలహాల్ని పాటిస్తూ యెహోవా ఆజ్ఞలకు లోబడదాం. అప్పుడు మనం చేసే ప్రతీ దానిలో విజయం సాధిస్తాం. మనం ‘చాలాకాలం జీవిస్తాం,’ చెప్పాలంటే శాశ్వతకాలం జీవిస్తాం. (ద్వితీ. 30:20) మన ప్రేమగల పరలోక తండ్రికి నచ్చే విధంగా జీవిస్తున్నందుకు సంతోషంగా ఉంటాం. ఇవేకాదు, దేవుడు మనం ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని ఇస్తాడు.—ఎఫె. 3:20.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

a ఎర్రసముద్రం దగ్గర యెహోవా చేసిన అద్భుతాల్ని చూసిన ఇశ్రాయేలీయుల్లో చాలామంది వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టలేదు. (సంఖ్యా. 14:22, 23) 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి పేర్లు నమోదైన వాళ్లు ఎడారిలోనే చనిపోతారని యెహోవా చెప్పాడు. (సంఖ్యా. 14:29) కానీ 20 కన్నా తక్కువ వయసు ఉన్న చాలామంది, యెహోషువ, కాలేబు, లేవీ గోత్రానికి చెందిన చాలామంది చనిపోలేదు. వాళ్లు యొర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు.—ద్వితీ. 1:24-40.

b చిత్రాల వివరణ: ఎడమవైపు: చనిపోయే ముందు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు కొన్ని తెలివైన సలహాలు ఇస్తున్నాడు. కుడివైపు: పయినీరు సేవా పాఠశాలకు హాజరైన విద్యార్థులు, యెహోవా ఇచ్చే తెలివి నుండి ప్రయోజనం పొందుతున్నారు.