కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతీవారం అధ్యయనం చేయడానికి టిప్స్‌

ప్రతీవారం అధ్యయనం చేయడానికి టిప్స్‌

ప్రతీవారం బైబిల్ని అధ్యయనం చేయడం మీకు కష్టంగా ఉంటుందా? కొన్నిసార్లు బోర్‌ కొడుతుందా? మనందరికీ ఏదోక సమయంలో అలా అనిపించవచ్చు. కానీ మనం ప్రతీరోజు చేసే కొన్ని పనుల గురించి ఆలోచించండి. ఉదాహరణకు స్నానం చేయడం. దానికి సమయం, శక్తి వెచ్చించాలి, కానీ స్నానం చేశాక ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో కదా! బైబిల్ని అధ్యయనం చేయడం కూడా అలాంటిదే. మనం ఒకవిధంగా, “దేవుని వాక్యమనే నీళ్లతో” స్నానం చేస్తున్నట్టు. (ఎఫె. 5:26) అందుకు సహాయం చేసే కొన్ని టిప్స్‌:

  • ఒక టైం పెట్టుకోండి. వ్యక్తిగత బైబిలు అధ్యయనం అనేది క్రైస్తవులు తప్పకుండా చేయాల్సిన “ఎక్కువ ప్రాముఖ్యమైన” వాటిలో ఒకటి. (ఫిలి. 1:10) ఏ రోజు, ఏ సమయంలో చదువుకుంటారో ఒక పేపర్‌ మీద రాసి, బాగా కనిపించే ఒక చోట, అంటే ఫ్రిజ్‌ లాంటి వాటిమీద అంటించండి. అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. లేదా టైంకి కాస్త ముందు గుర్తుచేసేలా మీ ఫోన్‌లో ఒక అలారం పెట్టుకోండి.

  • మీ అవసరాలకు తగ్గట్టు ప్లాన్‌ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ టైం చదువుకోవడం మీకు ఈజీనా? లేక తక్కువ టైం వెచ్చిస్తూ ఎక్కువసార్లు చదువుకోవడం ఈజీనా? మీ పరిస్థితుల గురించి మీకే బాగా తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు టైం పెట్టుకోండి. ఒకవేళ ఆ టైం వచ్చినప్పుడు మీకు అధ్యయనం చేయాలని అనిపించకపోతే, కేవలం పది నిమిషాలైనా చదవండి. అలా కొంచెంసేపు చదివినా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అంతేకాదు మీ ఆసక్తి పెరిగి ఇంకాసేపు చదవాలని కూడా కొన్నిసార్లు అనిపించవచ్చు.—ఫిలి. 2:13.

  • అంశాల్ని ముందే ఎంచుకోండి. అధ్యయనం చేయడానికి కూర్చున్నప్పుడు ఏం చదవాలా అని ఆలోచిస్తూ ఉండిపోతే “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా” ఉపయోగించినట్టు కాదు. (ఎఫె. 5:16) కాబట్టి, మీరు అధ్యయనం చేయాలనుకునే అంశాల్ని, ఆర్టికల్స్‌ని ఒక చోట రాసిపెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు, దాన్ని ఆ లిస్టులో రాయండి. ప్రతీసారి అధ్యయనం పూర్తయ్యాక, మళ్లీ ఈసారి చదవడానికి మీ లిస్టులో వేరే టాపిక్స్‌ కూడా రాసుకోండి.

  • అవసరమైనప్పుడు మార్పులు చేసుకోండి. ఎంత టైం చదవాలి, ఏ టాపిక్స్‌ చదవాలి లాంటివి మీ పరిస్థితుల్ని బట్టి మార్చుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడు, ఎంతసేపు, ఏం అధ్యయనం చేస్తారు అనేది కాదుకానీ ప్రతీవారం అధ్యయనం చేస్తున్నారా లేదా అనేదే చాలా ముఖ్యం.

మనం ప్రతీవారం అధ్యయనం చేస్తే ఎంతో ప్రయోజనం పొందుతాం. యెహోవాకు ఇంకా దగ్గరౌతాం, తెలివిగా ప్రవర్తిస్తాం, సేదదీర్పు పొందుతాం.—యెహో. 1:8.