కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యుద్ధం ఉన్నప్పుడూ లేనప్పుడూ యెహోవా మాకు బలాన్నిచ్చాడు

యుద్ధం ఉన్నప్పుడూ లేనప్పుడూ యెహోవా మాకు బలాన్నిచ్చాడు

పౌల్‌: మేము పట్టరాని ఆనందంతో ఉన్నాం! అది 1985 నవంబరు నెల. మేము పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాకు వెళ్తున్నాం. అది మా మొదటి మిషనరీ నియామకం. మా ఫ్లయిట్‌ సెనెగల్‌లో ఆగింది. “ఇంకో గంటలో లైబీరియాలో ఉంటాం” అని ఆన్‌ అన్నదో లేదో ఒక అనౌన్స్‌మెంట్‌ వినిపించింది: “లైబీరియా వెళ్లే ప్రయాణికులు ఇక్కడే ప్లేన్‌ దిగిపోవాలి. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు జరుగుతున్నాయి, కాబట్టి ఈ ఫ్లయిట్‌ అక్కడ ఆగడం వీలుకాదు.” తర్వాతి పది రోజులు మేము సెనెగల్‌లోని మిషనరీల దగ్గర ఉన్నాం. లైబీరియాలో ప్రాణాలంటే లెక్క లేకుండా చాలామందిని దారుణంగా చంపేస్తున్నారని, ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందని, దాన్ని ఉల్లంఘించిన వాళ్లను షూట్‌ చేస్తున్నారని వార్తల్లో వినేవాళ్లం.

ఆన్‌: మాది సాహసాలు చేసే స్వభావం కానేకాదు. నిజానికి నన్ను అయితే పసితనం నుండే కంగారుపడే పిల్ల అనేవాళ్లు. కనీసం రోడ్డు దాటాలన్నా చాలా భయపడేదాన్ని. అయినా కూడా మేము మా నియామకానికి వెళ్లాలనే నిర్ణయించుకున్నాం.

పౌల్‌: నేను, ఆన్‌ ఒకే దగ్గర పెరిగాం. పశ్చిమ ఇంగ్లాండ్‌లో మా ఇంటికి, వాళ్ల ఇంటికి మధ్య కేవలం 8 కిలోమీటర్ల దూరం. మా అమ్మానాన్నలు, అలాగే ఆన్‌ వాళ్ల అమ్మ మమ్మల్ని బాగా ప్రోత్సహించడంతో హైస్కూల్‌ పూర్తవ్వగానే ఇద్దరం పయినీరింగ్‌ మొదలుపెట్టాం. నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు, బెతెల్‌ సేవలో అడుగుపెట్టే గొప్ప అవకాశం దొరికింది. ఆన్‌ మాత్రం 1982 లో మా పెళ్లయ్యాక బెతెల్‌కు వచ్చింది.

1985 సెప్టెంబరు 8, గిలియడ్‌ పట్టా పొందినప్పుడు

ఆన్‌: మాకు బెతెల్‌ బాగా నచ్చింది కానీ మొదటి నుండి ప్రచారకుల అవసరం ఎక్కువున్న దేశానికి వెళ్లి సేవ చేయాలనే కోరిక ఉండేది. అంతకుముందు మిషనరీలుగా సేవ చేసిన వాళ్లతో బెతెల్‌లో కలిసి పనిచేయడం వల్ల ఆ కోరిక ఇంకా బలపడింది. మేము మూడేళ్లపాటు ప్రతీరోజు రాత్రి ఈ విషయం గురించి ప్రత్యేకంగా ప్రార్థించాం. 1985 లో, గిలియడ్‌ 79వ తరగతి కోసం ఆహ్వానం అందుకున్నప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు! తర్వాత మమ్మల్ని పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో మిషనరీలుగా నియమించారు.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ ప్రేమ మాకు బలాన్నిచ్చింది

పౌల్‌: లైబీరియాకు వెళ్లడానికి దొరికిన మొదటి ఫ్లయిట్‌ ఎక్కాం. అక్కడ ఇంకా గొడవలు జరుగుతున్నాయి, కర్ఫ్యూలు పెట్టారు. ఉన్నట్టుండి కారు శబ్దం వచ్చినా ప్రజలు భయంతో కేకలు పెడుతూ పారిపోయేవాళ్లు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతీరోజు రాత్రి ఇద్దరం కలిసి కీర్తనల పుస్తకం చదివేవాళ్లం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మా నియామకాన్ని చాలా ఇష్టపడ్డాం. ఆన్‌ రోజూ ప్రీచింగ్‌కి వెళ్లేది, నేను బెతెల్‌లో బ్రదర్‌ జాన్‌ చెరుక్‌తో a పాటు పనిచేసేవాణ్ణి. అతను లైబీరియాలో చాలాకాలం ఉన్నాడు కాబట్టి అక్కడి బ్రదర్స్‌-సిస్టర్స్‌ పరిస్థితుల గురించి, వాళ్ల కష్టాల గురించి అతనికి బాగా తెలుసు. అతని నుండి నేను చాలా నేర్చుకున్నాను.

ఆన్‌: లైబీరియాలో బ్రదర్స్‌-సిస్టర్స్‌ చాలా ప్రేమగా, కలుపుగోలుగా, నమ్మకంగా ఉండేవాళ్లు. అందుకే అక్కడ సేవ చేయడం మాకు వెంటనే నచ్చేసింది. వాళ్లతో ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించేది, వాళ్లే మా కొత్త కుటుంబం అయ్యారు. వాళ్లు చక్కని సలహాలు చెప్పేవాళ్లు, ఆధ్యాత్మికంగా బలపర్చేవాళ్లు. అక్కడ ప్రీచింగ్‌ సూపర్‌ ఉండేది. మేము ఇంటివాళ్ల దగ్గర ఎక్కువసేపు ఉండకపోతే వాళ్లు ఫీలయ్యేవాళ్లు! ప్రజలు వీధుల్లో కూడా బైబిలు ప్రశ్నల గురించి మాట్లాడుకునేవాళ్లు. మనం ఊరికే వెళ్లి వాళ్లతో మాటలు కలపొచ్చు. ఎన్ని స్టడీలు ఉండేవంటే, అన్నీ చేయడానికి టైం సరిపోయేది కాదు. నిజంగా అదొక అద్భుతమైన ప్రాంతం!

భయాల మధ్య యెహోవా మాకు బలాన్నిచ్చాడు

1990, లైబీరియా బెతెల్‌లో శరణార్థుల బాగోగులు చూసుకుంటున్నప్పుడు

పౌల్‌: నాలుగేళ్లు కాస్త ప్రశాంతంగా గడిచాయి, తర్వాత 1989 లో అంతా మారిపోయింది, ఘోరమైన అంతర్యుద్ధం మొదలైంది. 1990 జూలై 2న తిరుగుబాటు దళాలు బెతెల్‌ దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలలపాటు మాకు బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. చివరికి ప్రపంచ ప్రధాన కార్యాలయంతో, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేకపోయాం. ఎక్కడ చూసినా అరాచకాలు, ఆహారకొరతలు, అత్యాచారాలే. ఇలాంటి పరిస్థితే 14 ఏళ్ల పాటు దేశమంతా కొనసాగింది.

ఆన్‌: కొన్ని తెగలవాళ్లు వేరే తెగలవాళ్లను కొట్టుకుంటూ, చంపుకుంటూ ఉండేవాళ్లు. వీధుల్లో ఎక్కడ చూసినా ఫైటర్లే కనిపించేవాళ్లు. వాళ్లు వింత బట్టలు వేసుకొని, ఆయుధాలు పట్టుకొని, ప్రతీ ఇంట్లోకి చొరబడి నచ్చింది తీసుకెళ్లేవాళ్లు. వాళ్లలో కొంతమందికి మనుషుల్ని చంపడం అంటే కోళ్లను చంపడం లాంటిది. చెక్‌ పోస్ట్‌ల దగ్గర శవాలు గుట్టలుగుట్టలుగా పడి ఉండేవి, బెతెల్‌కి దగ్గర్లో కూడా అదే పరిస్థితి. కొంతమంది నమ్మకమైన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ప్రాణాలు కోల్పోయారు, వాళ్లలో ఇద్దరు మిషనరీలు కూడా ఉన్నారు.

ఫైటర్లు వేటాడి చంపుతున్న తెగకు చెందిన బ్రదర్స్‌-సిస్టర్స్‌ని మనవాళ్లు ప్రాణాలకు తెగించి మరీ దాచిపెట్టారు. మిషనరీలు, బెతెల్‌ కుటుంబ సభ్యులు కూడా అలా దాచిపెట్టారు. పారిపోయి వచ్చిన కొంతమంది సాక్షులు బెతెల్‌లో కింది అంతస్తులో పడుకున్నారు; ఇంకొంతమంది పై అంతస్తులో మాతోపాటు, మా గదుల్లో ఉన్నారు. మా రూమ్‌లోనైతే మాతోపాటు ఇంకో ఏడుగురు ఉన్నారు.

పౌల్‌: మేము ఎవరినైనా దాచిపెడుతున్నామేమో అని చూడడానికి ప్రతీరోజు ఫైటర్లు బెతెల్‌ లోపలికి రావడానికి ప్రయత్నించేవాళ్లు. ఆ సమయంలో నలుగురు బ్రదర్స్‌ కాపలా ఉండేవాళ్లు. ఆ ఫైటర్లు వచ్చినప్పుడు ఇద్దరేమో బెతెల్‌ బయటి గేట్‌ దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడేవాళ్లు, ఇంకో ఇద్దరు కిటికీ దగ్గర నిలబడి వాళ్లను గమనిస్తూ ఉండేవాళ్లు. గేట్‌ దగ్గర ఉన్నవాళ్లు తమ చేతులు ముందువైపు పెట్టుకొని ఉంటే, ప్రమాదం ఏమీ లేదని అర్థం. కానీ వాళ్లు చేతులు వెనకవైపు పెట్టుకుంటే, ఫైటర్లు దూకుడుగా ఉన్నారని అర్థం. అప్పుడు కిటికీ నుండి చూస్తున్న వాళ్లు, బ్రదర్స్‌-సిస్టర్స్‌ని వెంటనే దాచిపెట్టడానికి పరుగెత్తుకొని వచ్చేవాళ్లు.

ఆన్‌: చాలా వారాల తర్వాత, ఒక ఫైటర్ల గుంపు తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. అప్పుడు నేను, ఇంకో సిస్టర్‌ ఒక బాత్రూంలోకి వెళ్లి గొళ్లెం పెట్టుకున్నాం. అందులో ఒక కబోర్డ్‌ ఉంది, దాంట్లో ఎవరికీ కనిపించని ఒక చిన్న షెల్ఫ్‌ ఉంది. నాతో ఉన్న సిస్టర్‌ దాంట్లో దూరి దాక్కుంది. ఫైటర్లు తమ మెషిన్‌ గన్‌లతో పై అంతస్తుకి వచ్చారు. వాళ్లు కోపంగా తలుపు తట్టారు. పౌల్‌ వాళ్లను రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ, “మా ఆవిడ బాత్రూంలో ఉంది” అన్నాడు. కబోర్డ్‌ని మూసినప్పుడు శబ్దం వచ్చింది, పైగా షెల్ఫ్‌లను ఎప్పటిలా సర్దడానికి కాస్త టైం పట్టింది. నేను లోపల ఏదో చేస్తున్నట్టు ఫైటర్లకు అనుమానం వచ్చేసి ఉంటుందని నాకు అనిపించి భయంతో గజగజ వణికిపోయాను. కానీ తలుపు తెరవక తప్పలేదు. సహాయం చేయమని మనసులో యెహోవాను వేడుకున్నాను. తర్వాత తలుపు తీసి ప్రశాంతంగా వాళ్లను పలకరించాను. వాళ్లలో ఒకతను నన్ను పక్కకు నెట్టేసి నేరుగా కబోర్డ్‌ దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచాడు, షెల్ఫ్‌లలో ఉన్నవన్నీ చిందరవందర చేశాడు. కానీ అక్కడ ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత అతనూ, అతనితో వచ్చిన గుంపులోని వాళ్లు మిగతా గదుల్ని, అలాగే అటక మీద వెదికారు. వాళ్లకు ఏం దొరకలేదు.

సత్యం ప్రకాశిస్తూనే ఉంది

పౌల్‌: కొన్ని నెలలపాటు మాకు తినడానికి సరిపడా ఆహారం లేదు. ఆధ్యాత్మిక ఆహారమే మమ్మల్ని ప్రాణాలతో ఉంచింది. బెతెల్‌ ఉదయకాల ఆరాధనే మాకు “బ్రేక్‌ఫాస్ట్‌” అయింది. సహించడానికి కావాల్సిన బలాన్ని అది మాకిచ్చింది.

ఆహారం, నీళ్లు అయిపోవడం వల్ల వాటి కోసం మేము ఒకవేళ బయటికి వెళ్లుంటే మా దగ్గర దాక్కున్న వాళ్లను చంపేసేవాళ్లు. తరచూ యెహోవా మాకు కావాల్సిన వాటిని సరిగ్గా సమయానికి, అది కూడా ఊహించని విధాల్లో ఏర్పాటు చేసేవాడు. యెహోవా మా అవసరాలు తీర్చడమే కాదు, ప్రశాంతంగా ఉండడానికి కూడా సహాయం చేశాడు.

లోకం అంతకంతకూ చీకట్లో కూరుకుపోతుంటే, సత్యం అంతకంతకూ ప్రకాశించింది. బ్రదర్స్‌-సిస్టర్స్‌ చాలాసార్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోవాల్సి వచ్చింది, కానీ వాళ్ల విశ్వాసం బలంగా ఉంది, అన్ని కష్టాల్లో కూడా వాళ్లు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్లలో కొందరు, అలా యుద్ధం మధ్య జీవించడం “మహాశ్రమకు ప్రాక్టీసు” అవుతుందని అన్నారు. పెద్దలు, యౌవన సహోదరులు ధైర్యం చూపించి బ్రదర్స్‌-సిస్టర్స్‌కు అండగా నిలిచారు. ఇళ్లను వదిలేసి పారిపోయిన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. అక్కడి ప్రజలకు ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు అడవిలో ఏవి దొరికితే వాటితో చిన్నచిన్న రాజ్యమందిరాల్ని కట్టి మీటింగ్స్‌ జరుపుకున్నారు. ఆ కష్టాల కడలిలో బ్రదర్స్‌-సిస్టర్స్‌కి మీటింగ్స్‌, ప్రీచింగ్‌ కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి; వాళ్లలో ఆశను నింపాయి. మేము అవసరమైన కొన్ని వస్తువుల్ని పంచిపెడుతున్నప్పుడు, చాలామంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ బట్టల కోసం కాకుండా ప్రీచింగ్‌ బ్యాగ్‌ల కోసం అడిగేవాళ్లు. అది చూసి మాకు చాలా ప్రోత్సాహంగా అనిపించేది. యుద్ధంలో ఎన్నో ఘోరాలు చూసిన చాలామంది మంచివార్త వినడానికి ఇష్టపడేవాళ్లు. సాక్షులు సంతోషంగా, పాజిటివ్‌గా ఉండడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయేవాళ్లు. ఆ చీకటి సమయం అంతట్లో సాక్షులు ఒక వెలుగులా ప్రకాశించారు! (మత్త. 5:14-16) బ్రదర్స్‌-సిస్టర్స్‌ చూపించిన ఉత్సాహం వల్ల కొంతమంది క్రూర ఫైటర్లు కూడా మన బ్రదర్స్‌ అయ్యారు.

బాధను తట్టుకోవడానికి యెహోవా బలాన్నిచ్చాడు

పౌల్‌: మేము కొన్నిసార్లు లైబీరియాను విడిచి వెళ్లాల్సి వచ్చింది. మూడుసార్లేమో కొన్నిరోజుల పాటు వెళ్లాం, రెండుసార్లు ఏకంగా సంవత్సరం పాటు వెళ్లాం. అలా వెళ్లినప్పుడు మాకు ఎలా అనిపించిందో ఒక మిషనరీ సిస్టర్‌ తన మాటల్లో ఇలా చెప్పింది: “సేవచేసే చోట బ్రదర్స్‌-సిస్టర్స్‌ని హృదయపూర్వకంగా ప్రేమించమని గిలియడ్‌లో మాకు నేర్పించారు, మేము అలాగే చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్స్‌-సిస్టర్స్‌ని వదిలి వెళ్తున్నప్పుడు మా హృదయాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది!” అయితే, మేము వేరే దేశాల్లో ఉండి కూడా లైబీరియాలోని బ్రదర్స్‌-సిస్టర్స్‌కి, ప్రీచింగ్‌కి ఎంతో మద్దతు ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉంది.

1997 లో సంతోషంగా లైబీరియాకు తిరిగి వస్తున్నప్పుడు

ఆన్‌: 1996 మే నెలలో ఒకసారి నేను, పౌల్‌, ఇంకో ఇద్దరితో కలిసి బ్రాంచి కారులో బయల్దేరాం. మాతో పాటు ముఖ్యమైన బ్రాంచి రికార్డులు కూడా చాలా ఉన్నాయి. మేము పట్టణం అవతలి వైపు, 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నాం. సరిగ్గా అప్పుడే మా ప్రాంతం మీద దాడి మొదలైంది. ఆవేశంగా ఉన్న ఫైటర్లు తమ గన్‌లతో గాల్లోకి షూట్‌ చేశారు, వాళ్లు మా కారును ఆపి మా ముగ్గుర్ని బయటికి లాగారు. పౌల్‌ ఇంకా కారులో ఉండగా ఫైటర్లు కారు తీసుకొని వెళ్లిపోయారు. మేము షాక్‌లో అలా నిల్చుండిపోయాం. ఇంతలో పౌల్‌ నడుచుకుంటూ మా వైపు రావడం చూశాం, ఆయన తల నుండి రక్తం కారుతోంది. ఆ గందరగోళంలో, పౌల్‌ని షూట్‌ చేశారని మేము అనుకున్నాం; కానీ కాసేపటికి అర్థమైంది, ఒకవేళ షూట్‌ చేసుంటే పౌల్‌ అలా నడిచి రాలేడు కదా! పౌల్‌ను కారు నుండి బయటికి తోస్తున్నప్పుడు ఒక ఫైటర్‌ ఆయన్ని కొట్టాడు దానివల్లే ఆ రక్తం. కానీ అది చిన్న గాయమే.

దగ్గర్లో ఒక మిలిటరీ ట్రక్కు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది, అది జనాలతో కిక్కిరిసిపోయింది. వాళ్లంతా భయంభయంగా ఉన్నారు. లోపల అస్సలు ఖాళీ లేదు కాబట్టి మేము బయట నుండి ట్రక్కును పట్టుకొని వేలాడుతున్నాం. డ్రైవర్‌ ఫుల్‌ స్ఫీడ్‌లో పోనిచ్చాడు, దాంతో దాదాపు పడిపోయినంత పనైంది. బండి ఆపమని అతన్ని బ్రతిమాలాం కానీ అతను భయపడి ఆపలేదు. మేము పడిపోకుండా అలాగే గట్టిగా పట్టుకున్నాం. గమ్యానికి చేరుకునేసరికి మా ఒళ్ళంతా పులిసిపోయింది, బాగా బెదిరిపోయాం, వణుకు ఆగలేదు.

పౌల్‌: మాసిపోయిన, చినిగిపోయిన బట్టలతో మేము ఒకరినొకరం చూసుకొని అసలు ఎలా బ్రతికి బయటపడ్డామా అని ఆశ్చర్యపోయాం. మా పక్కనే చాలా బులెట్లు తగిలి, కూలిపోయేలా ఉన్న ఒక హెలికాప్టర్‌ ఉంది. తర్వాతి రోజు మేము దానిలోనే సియర్రా లియోన్‌కు ప్రయాణించాలి. కాబట్టి ఆ రాత్రి, పక్కన ఉన్న ఒక మైదానంలో పడుకున్నాం. సియర్రా లియోన్‌కు చేరుకున్నప్పుడు మేము ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించాం కానీ మా మనసంతా లైబీరియాలోని బ్రదర్స్‌-సిస్టర్స్‌తో ఉంది.

అనుకోని కొత్త సమస్యను తట్టుకోవడానికి యెహోవా బలాన్నిచ్చాడు

ఆన్‌: మేము సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఉన్న బెతెల్‌కు సురక్షితంగా చేరుకున్నాం. అక్కడ బ్రదర్స్‌ మా బాగోగులు చక్కగా చూసుకున్నారు. కానీ అనుకోని సమస్య ఒకటి మొదలైంది, లైబీరియాలో ఎదురైన ఘోరమైన సంఘటనలు పీడకలలా గుర్తుకొస్తుండేవి. పగటిపూట ఏదో జరుగుతుందని భయపడుతూ, దేని గురించీ సరిగ్గా ఆలోచించలేక పోయేదాన్ని, అంతా భ్రమలా అనిపించేది. రాత్రిపూట, ఏదో ఘోరం జరిగినట్టు ఉలిక్కిపడి నిద్ర లేచేదాన్ని, వణికిపోతూ ఉండేదాన్ని, చెమటలు పట్టేవి, ఊపిరాడేది కాదు. పౌల్‌ నా భుజం చుట్టూ చేయివేసి నాతో కలిసి ప్రార్థన చేసేవాడు. భయం పూర్తిగా పోయేవరకు ఇద్దరం కలిసి రాజ్యగీతాలు పాడేవాళ్లం. నాకు ఏదో పిచ్చి పట్టిందని, ఇక మిషనరీగా సేవ చేయలేనని అనుకున్నాను.

ఆ తర్వాత జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరిగ్గా అదే వారం రెండు పత్రికలు వచ్చాయి. ఒకటి, 1996 జూన్‌ 8 తేజరిల్లు! (ఇంగ్లీష్‌) పత్రిక. అందులో, “ఆందోళనలు ముంచెత్తినప్పుడు ఏం చేయాలి?” అనే ఆర్టికల్‌ ఉంది. అది చదివినప్పుడు నా సమస్య ఏంటో నాకు అర్థమైంది. రెండోది, 1996 మే 15 కావలికోట పత్రిక. దానిలో, “వారికి తమ బలం ఎక్కడనుండి వచ్చింది?” అనే ఆర్టికల్‌ ఉంది. అందులో, రెక్క విరిగిన సీతాకోకచిలుక బొమ్మ ఉంది. సీతాకోకచిలుక రెక్కలు బాగా పాడైనా కూడా అది తినడం, ఎగరడం లాంటి పనులు చేసుకోగలదు; అలాగే మనం కూడా, మన మనసుకు గాయాలు తగిలినా యెహోవా పవిత్రశక్తి ఇచ్చే బలంతో ఇతరులకు సహాయం చేయగలం అని ఆ ఆర్టికల్‌ వివరించింది. అలా యెహోవా సరైన టైంలో, నాకు సరిగ్గా అవసరమైనది ఇచ్చి నన్ను బలపర్చాడు. (మత్త. 24:45) నా సమస్య గురించి రీసర్చ్‌ చేశాను, అలాంటి ఇంకొన్ని ఆర్టికల్స్‌ కూడా వెతికి, వాటితో ఒక ఫోల్డర్‌ తయారుచేసుకున్నాను. అవి నాకు చాలా సహాయం చేశాయి. కొంతకాలానికి నా సమస్య మెల్లమెల్లగా తగ్గిపోయింది.

కొత్త నియామకానికి అలవాటుపడేలా యెహోవా మాకు బలాన్నిచ్చాడు

పౌల్‌: మేము తిరిగి లైబీరియాకు వెళ్లినప్పుడల్లా మాకు చాలా సంతోషంగా ఉండేది. 2004 చివరికల్లా మా నియామకం మొదలుపెట్టి దాదాపు 20 ఏళ్లు అయ్యాయి. అప్పటికి యుద్ధం ముగిసిపోయింది. బ్రాంచి దగ్గర నిర్మాణ పనుల కోసం ప్లాన్‌లు జరుగుతున్నాయి. కానీ ఉన్నట్టుండి మాకు కొత్త నియామకం వచ్చింది.

అది మాకు పెద్ద పరీక్షలా అనిపించింది. మేము బ్రదర్స్‌-సిస్టర్స్‌తో ఎంతో అనుబంధం పెంచుకున్నాం, వాళ్లను విడిచి ఎలా వెళ్లాలి? గిలియడ్‌కి వెళ్లడం కోసం మాకెంతో ప్రియమైన సొంత కుటుంబాల్నే వదిలి వచ్చాం, యెహోవా చేతుల్లో మమ్మల్ని మేము పెట్టుకున్నప్పుడు ఎలాంటి దీవెనలు వచ్చాయో చూశాం. కాబట్టి కొత్త నియామకాన్ని కూడా స్వీకరించాం. మమ్మల్ని దగ్గర్లో ఉన్న ఘానా దేశానికి పంపించారు.

ఆన్‌: లైబీరియాను విడిచి వెళ్తున్నప్పుడు గుండె పిండేసినట్టు అనిపించింది, బాగా ఏడ్చాం. అప్పుడు ఫ్రాంక్‌ అనే అనుభవంగల వృద్ధ సహోదరుడు మాతో ఇలా అన్నాడు: “మీరు మా గురించి మర్చిపోవాలి!” ఆ మాటలు విని మేము ఆశ్చర్యపోయాం. అప్పుడాయన ఇలా అన్నాడు: “మీరు మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరని మాకు తెలుసు. కానీ కొత్త నియామకాన్ని కూడా మీరు నిండు హృదయంతో చేయాలి. అది యెహోవా ఇచ్చింది. కాబట్టి అక్కడి బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద శ్రద్ధపెట్టండి.” ఆ మాటలు మాకు చాలా బలాన్నిచ్చాయి, అంతగా తెలియనివాళ్లున్న కొత్త చోటుకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

పౌల్‌: ఘానాలోని బ్రదర్స్‌-సిస్టర్స్‌తో అనుబంధం పెంచుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. అక్కడ చాలామంది సాక్షులు ఉన్నారు! మా కొత్త స్నేహితుల విశ్వసనీయత, బలమైన విశ్వాసం చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఘానాలో 13 ఏళ్లు సేవచేశాక, ఇంకోసారి మా నియామకం మారింది. మమ్మల్ని కెన్యాలో ఉన్న తూర్పు ఆఫ్రికా బ్రాంచిలో సేవ చేయమని చెప్పారు. మా గత నియామకాల్లో కలిసిన స్నేహితుల్ని మర్చిపోలేకపోయినా, కెన్యాలోని బ్రదర్స్‌-సిస్టర్స్‌ మాకు ఇట్టే స్నేహితులు అయ్యారు. ఇప్పటికీ మేము ప్రచారకుల అవసరం చాలా ఎక్కువ ఉన్న ఆ పెద్ద ప్రాంతంలోనే సేవ చేస్తున్నాం.

2023, తూర్పు ఆఫ్రికా బ్రాంచి క్షేత్రంలో కొత్త స్నేహితులతో

వెనక్కి తిరిగి చూసుకుంటే . . .

ఆన్‌: నా జీవితంలో నేను ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు, చెప్పలేనంత భయపడ్డాను. ప్రమాదకరమైన ప్రాంతాల్లో, కష్టమైన పరిస్థితుల మధ్య జీవించినప్పుడు మన శరీరానికి, మనసుకు గాయాలు తగులుతాయి. యెహోవా అద్భుతరీతిలో మనల్ని కాపాడడు. ఇప్పటికీ తుపాకి శబ్దాలు వినిపిస్తే, నాకు కడుపులో వికారంగా ఉంటుంది, చేతులు చచ్చుబడిపోతాయి. అయితే బలాన్ని ఇవ్వడానికి యెహోవా చేసిన ఏర్పాట్లన్నిటి నుండి సహాయం తీసుకోవాలని నేను నేర్చుకున్నాను. అందులో బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇచ్చే మద్దతు కూడా ఉంది. అధ్యయనం, ప్రార్థన, మీటింగ్స్‌, ప్రీచింగ్‌ లాంటివి క్రమంగా చేస్తూ ఉంటే, మన నియామకంలో కొనసాగడానికి యెహోవా సహాయం చేస్తాడని నేను గమనించాను.

పౌల్‌: “మీ నియామకం మీకు నచ్చిందా?” అని కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు. నిజమే దేశాలు అందంగా ఉండొచ్చు, కానీ అవి అస్థిరంగా, ప్రమాదకరంగా కూడా తయారవ్వొచ్చు. కాబట్టి మాకు దేశం కన్నా, అక్కడి బ్రదర్స్‌-సిస్టర్స్‌ అంటేనే బాగా ఇష్టం. వాళ్లు ఎంతో అమూల్యమైనవాళ్లు, వాళ్లే మా కుటుంబం. నేపథ్యాలు వేరైనా, అందరం ఒకేలా ఆలోచిస్తాం. వాళ్లను ప్రోత్సహించడానికి మమ్మల్ని పంపించారని అనుకున్నాం కానీ నిజానికి వాళ్లే మమ్మల్ని బలపర్చారు.

మేము వేరే చోటికి వెళ్లిన ప్రతీసారి ఈ రోజుల్లో జరుగుతున్న ఒక అద్భుతాన్ని చూశాం, అదే మన సహోదర బృందం. మనం ఒక సంఘంలో భాగంగా ఉన్నంతకాలం మనకు ఒక కుటుంబం, సురక్షితమైన చోటు ఉన్నట్టే. యెహోవా మీద ఆధారపడుతూ ఉంటే, ఏం జరిగినా సరే కావల్సిన బలాన్ని ఇస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నాం.—ఫిలి. 4:13.

a 1973 మార్చి 15 కావలికోట (ఇంగ్లీషు) సంచికలో “దేవునికి, క్రీస్తుకు రుణపడి ఉన్నాను” అనే అంశంతో వచ్చిన జాన్‌ చెరుక్‌ జీవిత కథ చూడండి.