కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 46

పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

సహోదరులారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?

సహోదరులారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”అపొ. 20:35.

ముఖ్యాంశం

సంఘ పరిచారకులు అవ్వాలనే కోరికను పెంచుకోవడానికి, తగిన అర్హతలు సంపాదించుకోవడానికి బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్‌కు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

1. అపొస్తలుడైన పౌలు సంఘ పరిచారకుల్ని ఎలా చూశాడు?

 సంఘ పరిచారకులు సంఘంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తారు. అపొస్తలుడైన పౌలు ఈ నమ్మకమైన సహోదరుల్ని ఎంతో విలువైనవాళ్లుగా చూశాడు. అందుకే ఫిలిప్పీలోని క్రైస్తవులకు రాస్తున్నప్పుడు, సంఘ పెద్దలతో పాటు ప్రత్యేకించి సంఘ పరిచారకుల గురించి కూడా ప్రస్తావించాడు.—ఫిలి. 1:1.

2. సంఘ పరిచారకుడిగా సేవ చేయడం గురించి బ్రదర్‌ లూయిస్‌కి ఏం అనిపిస్తుంది?

2 బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్‌ చిన్నవాళ్లయినా-పెద్దవాళ్లయినా సంఘ పరిచారకులుగా సేవచేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. డెవన్‌ అనే బ్రదర్‌ 18 ఏళ్లకే సంఘ పరిచారకుడు అయ్యాడు. లూయిస్‌ అనే ఇంకో బ్రదరేమో 50 ఏళ్లు దాటాక అయ్యాడు. సంఘ పరిచారకుడిగా సేవ చేయడం గురించి ఆయనకు ఏం అనిపిస్తుందో ఇలా అంటున్నాడు: “సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌కు ఇలా సహాయం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వాళ్లు నామీద ఎంతో ప్రేమను కురిపించారు, ఇప్పుడిది నా వంతు!” చాలామంది సంఘ పరిచారకుల నోట ఇదే మాట వినిపిస్తుంది.

3. మనం ఏ ప్రశ్నల గురించి చూస్తాం?

3 మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరుడై, ఇంకా సంఘ పరిచారకుడు అవ్వకపోతే, మీరు ఇప్పుడు ఆ లక్ష్యాన్ని పెట్టుకోగలరా? ఏ కారణాల్ని బట్టి మీరు ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి? దానికోసం మీరు ఎలాంటి లేఖన అర్హతలు సంపాదించాలి? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ముందుగా సంఘ పరిచారకుల బాధ్యతలు ఏంటో చూద్దాం.

సంఘ పరిచారకుడి బాధ్యతలు ఏంటి?

4. సంఘ పరిచారకులు ఎలాంటి పనులు చేస్తారు? (చిత్రం కూడా చూడండి.)

4 సంఘ పరిచారకుడు, పవిత్రశక్తితో నియమించబడిన బాప్తిస్మం తీసుకున్న బ్రదర్‌. ఆయన సంఘంలో ఎన్నో ప్రాముఖ్యమైన పనుల్ని చూసుకుంటూ పెద్దలకు చేయందిస్తాడు. కొంతమంది సంఘ పరిచారకులు, ప్రచారకులందరి దగ్గర ప్రీచింగ్‌ చేయడానికి సరిపడా టెరిటరీ ఉండేలా, ప్రచురణలు ఉండేలా చూసుకుంటారు. ఇంకొంతమంది రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనుల్లో, రిపేరు చేసే పనుల్లో సహాయం చేస్తారు. మీటింగ్‌ జరుగుతున్నప్పుడు అటెండెంట్లుగా పని చేస్తారు, ఆడియో-వీడియో పరికరాల్ని చూసుకుంటారు. ఇలా సంఘ పరిచారకులు ఎన్నెన్నో పనులు చేస్తారు. వాటన్నిటికన్నా ముఖ్యంగా, వాళ్లు ఆధ్యాత్మిక పురుషులు. అంటే యెహోవాను ప్రేమిస్తారు, ఆయన నీతి ప్రమాణాల ప్రకారం జీవిస్తారు. అంతేకాదు వాళ్లు బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రాణంగా ప్రేమిస్తారు. (మత్త. 22:37-39) మరైతే బాప్తిస్మం తీసుకున్న ఒక బ్రదర్‌, సంఘ పరిచారకుడు అవ్వడానికి ఎలా ముందుకు రావచ్చు?

సంఘ పరిచారకులు యేసులాగే ఇతరులకు సేవచేయడానికి ఇష్టంగా ముందుకొస్తారు (4వ పేరా చూడండి)


5. సంఘ పరిచారకుడు అవ్వాలనే లక్ష్యం వైపు ఒక బ్రదర్‌ ఎలా అడుగులు వేయవచ్చు?

5 సంఘ పరిచారకులుగా అవ్వాలంటే, బ్రదర్స్‌కి ఎలాంటి అర్హతలు ఉండాలో బైబిలు చెప్తుంది. (1 తిమో. 3:8-10, 12, 13) ఆ అర్హతల గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, వాటిని చేరుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆ లక్ష్యం వైపు అడుగులు వేయవచ్చు. కానీ ముందు మీరు అసలు ఎందుకు సంఘ పరిచారకుడు అవ్వాలని అనుకుంటున్నారో, ఆ కారణాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

సంఘ పరిచారకుడు అవ్వాలని మీరెందుకు అనుకుంటున్నారు?

6. మీరు ఏ కారణం వల్ల బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సహాయం చేయడానికి ముందుకు రావాలి? (మత్తయి 20:28; చిత్రం కూడా చూడండి.)

6 యేసు ఉంచిన గొప్ప ఆదర్శం గురించి ఆలోచించండి. ఆయన ఏం చేసినా తండ్రి మీద, ప్రజల మీద ఉన్న ప్రేమతోనే చేశాడు. ఆ ప్రేమవల్లే కష్టపడి పనిచేశాడు, ఇతరులు చిన్నచూపు చూసే పనుల్ని కూడా చేయడానికి ముందుకొచ్చాడు. (మత్తయి 20:28 చదవండి; యోహా. 13:5, 14, 15) మీకు కూడా ప్రేమ ఉంటే యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు, సంఘ పరిచారకుడిగా అయ్యేలా సహాయం చేస్తాడు.—1 కొరిం. 16:14; 1 పేతు. 5:5.

గొప్ప స్థానాల కోసం పాకులాడే బదులు ఇతరులకు వినయంగా సేవచేయాలని యేసు తన ఆదర్శం ద్వారా అపొస్తలులకు నేర్పించాడు (6వ పేరా చూడండి)


7. సొంత ప్రయోజనం చూసుకోవాలని గానీ, ఇతరుల మీద అధికారం చెలాయించాలని గానీ బ్రదర్స్‌ ఎందుకు అనుకోకూడదు?

7 లోకంలోని ప్రజలు తమనుతాము గొప్పగా చూపించుకునే వాళ్లను ఇష్టపడతారు. కానీ యెహోవా ప్రజలు అలా కాదు. యేసులా ఇతరుల్ని ప్రేమించే బ్రదర్స్‌ అధికారం కోసం ఆరాటపడరు, ఇతరుల మీద పెత్తనం చెలాయించరు, నలుగురిలో ఒక హోదా కావాలని కోరుకోరు. అధికార దాహం ఉన్న వ్యక్తి సంఘంలో బాధ్యతల్ని పొందితే, యెహోవా అమూల్యమైన గొర్రెల్ని చూసుకునే విషయంలో కొన్ని చిన్నచిన్న పనులు చేయకపోవచ్చు. అలాంటివి చేస్తే తన స్థాయి తగ్గిపోతుందని అనుకోవచ్చు. (యోహా. 10:12) గర్వంతో సొంత ప్రయోజనాలు చూసుకునేవాళ్లు చేసే ఏ పనినీ యెహోవా దీవించడు.—1 కొరిం. 10:24, 33; 13:4, 5.

8. యేసు తన అపొస్తలులను ఏమని సరిదిద్దాడు?

8 కొన్నిసార్లు యేసు దగ్గరి స్నేహితులు కూడా తప్పుడు ఉద్దేశంతో బాధ్యతలు కావాలని అనుకున్నారు. ఒక సందర్భంలో అపొస్తలులైన యాకోబు, యోహాను తన రాజ్యంలో ప్రత్యేక స్థానాల్ని ఇవ్వమని యేసుని అడిగారు. వాళ్లు చేసిన పనిని యేసు అస్సలు మెచ్చుకోలేదు. బదులుగా పన్నెండుమంది అపొస్తలులకు ఇలా చెప్పాడు: “మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి, మీలో అందరికన్నా ముఖ్యమైన స్థానంలో ఉండాలనుకునేవాడు అందరికీ దాసుడిగా ఉండాలి.” (మార్కు 10:35-37, 43, 44) ఏ బ్రదర్స్‌ అయితే సరైన ఉద్దేశంతో, అంటే ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తారో, వాళ్లు సంఘానికి దీవెనగా ఉంటారు.—1 థెస్స. 2:8.

సంఘ పరిచారకుడు అవ్వాలనే కోరికను మీరెలా పెంచుకోవచ్చు?

9. సంఘ పరిచారకుడు అవ్వాలనే కోరికను ఎలా పెంచుకోవచ్చు?

9 మీకు యెహోవా మీద ప్రేమ ఉంది, ఇతరులకు సేవ చేయాలని కూడా ఉంది. అయితే సంఘ పరిచారకులు చేసే అదనపు పనుల్ని చేయాలనే కోరిక మాత్రం మీలో లేకపోవచ్చు. మరి ఆ కోరికను ఎలా పెంచుకోవచ్చు? బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సేవ చేయడంలో వచ్చే ఆనందం గురించి ఒకసారి ఆలోచించండి. యేసు ఇలా అన్నాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) తను చెప్పడమే కాదు దాన్ని చేసి చూపించాడు. ఇతరులకు సేవచేయడంలో ఆయన ఎంతో ఆనందాన్ని పొందాడు. మీరు కూడా ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.

10. ఇతరులకు సేవ చేయడం తనకు ఇష్టమని యేసు ఎలా చూపించాడు? (మార్కు 6:31-34)

10 ఇతరులకు సేవ చేయడమంటే యేసుకు చాలా ఇష్టం. (మార్కు 6:31-34 చదవండి.) ఒకానొక సందర్భంలో యేసు, అపొస్తలులు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఎవరూలేని ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తున్నారు. కానీ యేసు మాటలు వినడానికి, వాళ్లకన్నా ముందే ప్రజలు అక్కడికి పెద్ద గుంపుగా చేరుకున్నారు. నిజానికి యేసుకు, ఆయన శిష్యులకు అప్పుడు కనీసం “తినడానికి కూడా తీరిక లేకపోయింది.” కాబట్టి యేసు కావాలనుకుంటే వాళ్లను పంపించేయవచ్చు. లేదంటే, రెండు-మూడు విషయాలు చెప్పి ఊరుకోవచ్చు. కానీ ప్రేమతో “ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.” “సాయంత్రం” అయ్యేవరకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. (మార్కు 6:35) యేసు ఏదో చేయాలి కదా అని చేయలేదు. ఆయన “వాళ్లమీద జాలిపడ్డాడు,” వాళ్లను ప్రేమించాడు కాబట్టి వాళ్లకు బోధించాలని బలంగా కోరుకున్నాడు. అవును, ఇతరులకు సేవచేయడం యేసుకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చింది.

11. యేసు బోధించడంతో పాటు, ప్రజల కోసం ఇంకా ఏం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)

11 అక్కడికి వచ్చిన ప్రజలకు యేసు బోధించడం కన్నా ఎక్కువే చేశాడు. వాళ్ల అవసరాల్ని పట్టించుకున్నాడు. అద్భుతంగా ఆహారాన్ని తయారుచేసి, దాన్ని ప్రజలకు పంచిపెట్టమని శిష్యులకు చెప్పాడు. (మార్కు 6:41) ఇతరులకు ఎలా సేవ చేయాలో, ఆ సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో యేసు తన శిష్యులకు నేర్పించాడు. నేడు సంఘ పరిచారకులు కూడా అలాంటి ప్రాముఖ్యమైన పనినే చేస్తున్నారు. అపొస్తలులు కూడా, అందరూ ‘తృప్తిగా తినేంతవరకు’ యేసు అద్భుతంగా ఇచ్చిన ఆహారాన్ని పంచిపెట్టారు. ఈ పని చేస్తున్నప్పుడు అపొస్తలులు ఎంత సంతోషించి ఉంటారో ఊహించండి! (మార్కు 6:42) యేసు తన అవసరాల కన్నా ఇతరుల అవసరాల్నే ఎక్కువ పట్టించుకున్నాడు. ఇలా చేయడం ఇది మొదటిసారేం కాదు. భూమ్మీద ఉన్నన్ని రోజులూ ఆయన అదే చేశాడు. (మత్త. 4:23; 8:16) ఇతరులకు బోధించడంలో, తననుతాను తగ్గించుకొని వాళ్ల అవసరాల్ని తీర్చడంలో ఆయన ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందాడు. మీరు కూడా సంఘ పరిచారకుడిగా ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తే ఎంతో ఆనందం పొందుతారు.

యెహోవా మీద ప్రేమ ఉంటే, ఇతరులకు సేవచేయాలనే కోరిక ఉంటే మీరు బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం ఏదైనా చేయడానికి ముందుకొస్తారు (11వ పేరా చూడండి) a


12. ‘నేను సంఘానికి ఉపయోగపడను’ అని ఎందుకు అనుకోకూడదు?

12 మీకు పెద్దగా సామర్థ్యాలు ఏమీ లేవని అనిపిస్తే డీలాపడిపోకండి. ఎందుకంటే సంఘానికి ఉపయోగపడే మంచి లక్షణాలు మీలో ఖచ్చితంగా ఉండుంటాయి. 1 కొరింథీయులు 12:12-30 లో పౌలు చెప్పిన మాటల్ని ప్రార్థన చేసుకుని చదవండి. తర్వాత ఆ మాటలు మీకు ఏం చెప్తున్నాయో ఆలోచించండి. సంఘంలో ప్రతీ ఒక్కరిలాగే మీ అవసరం కూడా ఉందని, మీరు కూడా విలువైనవాళ్లని పౌలు మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ సంఘ పరిచారకుడికి ఉండాల్సిన అర్హతలు ఇప్పుడు మీకు లేకపోతే దిగులుపడకండి. మీరు యెహోవాకు, బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ఉపయోగపడేలా చేయగలిగినదంతా చేయడం మొదలుపెట్టండి. సంఘ పెద్దలు మీ గురించి ఆలోచించి, మీరు చేయగలిగిన పనులే మీకు ఇస్తారనే నమ్మకంతో ఉండండి.—రోమా. 12:4-8.

13. సంఘ పరిచారకుడిగా అవ్వడం అసాధ్యమేమీ కాదు అని ఎందుకు చెప్పవచ్చు?

13 ఒకసారి ఇలా కూడా ఆలోచించండి. సంఘ పరిచారకులు ఏ అర్హతల్ని సంపాదించాలని బైబిలు చెప్తుందో అవి దాదాపు క్రైస్తవులందరికీ ఉండాల్సినవే. క్రైస్తవులందరూ యెహోవాకు దగ్గరవ్వాలి, ఇతరులకు సంతోషంగా ఇవ్వాలి, యెహోవాకు నచ్చే విధంగా జీవించాలి. కాబట్టి సంఘ పరిచారకులకు ఉండాల్సిన అర్హతలు మీకు ఇప్పటికే ఉండివుంటాయి. మరైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరింకా ఏ అడుగులు వేయాలి?

మీరు వేయాల్సిన అడుగులు

14. “బాధ్యతగా” నడుచుకోవడం అంటే ఏంటి? (1 తిమోతి 3:8-10, 12)

14 ఇప్పుడు 1 తిమోతి 3:8-10, 12లో ఉన్న కొన్ని అర్హతల గురించి చూద్దాం. (చదవండి.) సంఘ పరిచారకులు “బాధ్యతగా” నడుచుకోవాలి. ఆ మాటను “గౌరవంగా,” “హుందాగా” లేదా “మర్యాదగా” అని కూడా అనువదించవచ్చు. అంటే మీరు అస్సలు నవ్వకుండా, ఎంజాయ్‌ చేయకుండా, సీరియస్‌గా ఉండాలని కాదు. (ప్రసం. 3:1, 4) మీకిచ్చే పనులన్నిటినీ బాధ్యతగా చేయాలని అర్థం. మీకు నమ్మదగిన వాళ్లు అనే పేరు ఉంటే, సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ మిమ్మల్ని గౌరవిస్తారు.

15. “రెండు నాలుకల ధోరణి” ఉండకూడదు అంటే ఏంటి? ‘అక్రమ లాభాన్ని ఆశించేవాళ్లుగా’ ఉండకూడదు అంటే ఏంటి?

15 “రెండు నాలుకల ధోరణి” ఉండకూడదు అంటే, మీరు నిజాయితీగా, నమ్మదగిన వాళ్లుగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఎవర్నీ మోసం చేయకూడదు. (సామె. 3:32) ‘అక్రమ లాభాన్ని ఆశించేవాళ్లుగా’ ఉండకూడదు అంటే, వ్యాపారం-డబ్బు వంటి విషయాల్లో నిజాయితీగా ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం బ్రదర్స్‌-సిస్టర్స్‌ని వాడుకోవడం గానీ, మోసం చేయడం గానీ చేయకూడదు.

16. (ఎ) ‘మితిమీరి మద్యం సేవించేవాళ్లుగా’ ఉండకూడదు అంటే ఏంటి? (బి) “స్వచ్ఛమైన మనస్సాక్షితో” ఉండడం అంటే ఏంటి?

16 ‘మితిమీరి మద్యం సేవించేవాళ్లుగా’ ఉండకూడదు అంటే, మీరు మద్యాన్ని ఎక్కువగా తాగకూడదు. అలా తాగేవాళ్లనే పేరు కూడా మీకు ఉండకూడదు. “స్వచ్ఛమైన మనస్సాక్షితో” ఉండడం అంటే యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడం. నిజమే మీరు పరిపూర్ణులు కారు, కానీ యెహోవాతో మీకు మంచి సంబంధం ఉండడం వల్ల మనశ్శాంతితో ఉంటారు.

17. “అర్హులో కాదో ముందుగా పరీక్షించబడాలి” అంటే ఏంటి? (1 తిమోతి 3:10; చిత్రం కూడా చూడండి.)

17 “అర్హులో కాదో ముందుగా పరీక్షించబడాలి” అంటే, మీకు ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని చక్కగా చేస్తారని ముందే నిరూపించుకోవాలి. కాబట్టి పెద్దలు ఏదైనా పని ఇస్తే వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినండి, సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటించండి. మీరు పనుల్ని ఎలా చేయాలి, దాన్ని ఎప్పటికల్లా పూర్తిచేయాలి అనే వివరాల్ని తెలుసుకోండి. ఇచ్చిన ప్రతీ పనిని చక్కగా, ఉత్సాహంగా చేస్తే సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీరు బాధ్యతగల వ్యక్తిగా ఎదుగుతున్నారని గమనిస్తారు. పెద్దలారా, బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్‌కి ట్రైనింగ్‌ ఇచ్చే విషయంలో ముందుండండి. (1 తిమోతి 3:10 చదవండి.) మీ సంఘంలో బాప్తిస్మం తీసుకున్న టీనేజర్లు లేదా అంతకన్నా చిన్న వయసు బ్రదర్స్‌ ఎవరైనా ఉన్నారా? వాళ్లు చక్కగా వ్యక్తిగత అధ్యయనాన్ని చేసుకుంటారా? మీటింగ్స్‌కి బాగా ప్రిపేర్‌ అవుతారా? మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పే అలవాటు ఉందా? ప్రీచింగ్‌కి క్రమంగా వస్తున్నారా? అలాగైతే వాళ్ల వయసుకు, పరిస్థితులకు తగ్గట్టు పనులు ఇవ్వండి. ఆ విధంగా యౌవనంలో ఉన్న ఈ బ్రదర్స్‌ ‘అర్హులో కాదో ముందుగా పరీక్షించబడతారు.’ అప్పుడు, 17-19 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్లు సంఘ పరిచారకులు అయ్యే అవకాశం ఉంటుంది.

బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్‌కు పనులు ఇవ్వడం వల్ల “వాళ్లు అర్హులో కాదో” సంఘ పెద్దలు పరీక్షించగలుగుతారు (17వ పేరా చూడండి)


18. ‘ఏ నిందా లేకపోవడం’ అంటే ఏంటి?

18 ‘ఏ నిందా లేకపోవడం’ అంటే మీరు ఏదైనా పెద్ద తప్పు చేశారని వేలెత్తి చూపించే కారణాలేవీ ఉండకపోవడం. నిజమే కొన్నిసార్లు క్రైస్తవుల మీద అబద్ధ ఆరోపణలు వేస్తుంటారు. యేసుకు అదే జరిగింది, తన శిష్యులకు కూడా అలాగే జరుగుతుందని ఆయన ముందే చెప్పాడు. (యోహా. 15:20) అయితే యేసులా చెడ్డ ప్రవర్తనకు దూరంగా ఉంటే, సంఘంలో మీకు మంచి పేరు వస్తుంది.—మత్త. 11:19.

19. పెళ్లయిన బ్రదర్స్‌కు “ఒకే భార్య ఉండాలి” అని బైబిలు చెప్తున్న దానికి అర్థం ఏంటి?

19 “ఒకే భార్య ఉండాలి.” పెళ్లి విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంటే ఒక పురుషుడు, ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. (మత్త. 19:3-9) ఏ క్రైస్తవుడు కూడా లైంగిక పాపం చేయకూడదు. (హెబ్రీ. 13:4) అదొక్కటే కాదు, మీరు వేరే స్త్రీలతో సరసాలాడడం, మరీ చనువుగా ఉండడం లాంటివి చేయకూడదు. మీ భార్యకు నమ్మకంగా ఉండడంలో ఇది కూడా భాగమేనని గుర్తుంచుకోండి.—యోబు 31:1.

20. ‘ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించడం’ అంటే ఏంటి?

20 “అతను తన పిల్లలకు, ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి.” మీరొక కుటుంబ పెద్ద అయితే మీకున్న బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతీవారం కుటుంబ ఆరాధన చేయండి. వీలైనంత ఎక్కువగా మీ భార్యాపిల్లలతో కలిసి ప్రీచింగ్‌ చేయండి. మీ పిల్లలు యెహోవాతో మంచి స్నేహాన్ని పెంచుకునేలా సహాయం చేయండి. (ఎఫె. 6:4) తన కుటుంబాన్ని బాగా చూసుకునే వ్యక్తి సంఘాన్ని కూడా బాగా చూసుకుంటాడని నిరూపించుకుంటాడు.—1 తిమోతి 3:5 తో పోల్చండి.

21. మీరు ఇంకా సంఘ పరిచారకుడు అవ్వకపోతే ఏం చేయవచ్చు?

21 సహోదరులారా, మీరు ఇంకా సంఘ పరిచారకులు అవ్వకపోతే, ప్రార్థన చేసుకుని ఈ ఆర్టికల్‌లో ఉన్న విషయాల్ని బాగా చదవండి. సంఘ పరిచారకుడు అవ్వడానికి కావాల్సిన అర్హతల గురించి బాగా తెలుసుకోండి. వాటిని చేరుకోవడానికి చేయగలిగిందంతా చేయండి. యెహోవా మీద, బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మీకెంత ప్రేమ ఉందో ఆలోచించండి. వాళ్లకు సేవ చేయాలనే కోరికను పెంచుకోండి. (1 పేతు. 4:8, 10) అలా మీరు సంఘ పరిచారకులు అవ్వడానికి చేయగలిగిందంతా చేస్తే, సంఘంలో బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సేవ చేయడంలో ఎంతో ఆనందం పొందుతారు. ఈ విషయంలో మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ యెహోవా మెండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాం!—ఫిలి. 2:13.

పాట 17 “నాకు ఇష్టమే”

a చిత్రాల వివరణ: ఎడమవైపు, యేసు వినయంగా ఇతరులకు సహాయం చేస్తున్నాడు. కుడివైపు, సంఘంలో ఉన్న వయసుపైబడిన ఒక సహోదరుడికి సంఘ పరిచారకుడు సహాయం చేస్తున్నాడు.