కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 47

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?

సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?

“ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.”1 తిమో. 3:1.

ముఖ్యాంశం

ఒక బ్రదర్‌ సంఘ పెద్ద అవ్వాలనుకుంటే, అతను ఎలాంటి అర్హతల్ని సంపాదించాలని బైబిలు చెప్తుందో వాటిగురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

1-2. సంఘ పెద్దలు చేసే “మంచిపని” ఏంటి?

 మీరు కొంతకాలంగా సంఘ పరిచారకుడిగా సేవ చేస్తుంటే సంఘ పెద్దకు ఉండాల్సిన ఎన్నో లక్షణాలు మీరిప్పటికే పెంచుకుని ఉంటారు. మరి సంఘ పెద్దలు చేసే “మంచిపని” చేయడానికి మీరు ముందుకు రాగలరా?—1 తిమో. 3:1.

2 పెద్దలు ఎలాంటి పనులు చేస్తారు? వాళ్లు ప్రకటనా పనిలో ముందుంటారు. సంఘాన్ని కాయడానికి, బోధించడానికి కష్టపడతారు. తమ మాటల ద్వారా, పనుల ద్వారా సంఘాన్ని బలపరుస్తారు. అందుకే కష్టపడి పనిచేసే పెద్దల్ని బైబిలు “మనుషుల్లో వరాలు” అని సరిగ్గానే పిలుస్తుంది.—ఎఫె. 4:8.

3. ఒక బ్రదర్‌ సంఘ పెద్ద ఎలా అవ్వవచ్చు? (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9)

3 మీరు సంఘ పెద్ద ఎలా అవ్వవచ్చు? బయట ఉద్యోగం కోసం అర్హతలు సంపాదించడం, పెద్ద అవ్వడానికి అర్హతలు సంపాదించడం ఒకటి కాదు. మామూలుగా మీకు ఏదైనా ఉద్యోగం కావాలంటే మీ బాస్‌ కోరే నైపుణ్యాలు మీకుంటే చాలు, ఆ ఉద్యోగం దొరుకుతుంది. కానీ సంఘ పెద్ద అవ్వాలంటే ప్రకటించే, బోధించే నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. 1 తిమోతి 3:1-7; తీతు 1:5-9లో పెద్దలకు ఉండాల్సిన అర్హతల్ని సంపాదించాలి. (చదవండి.) ఈ మూడు రంగాల్లో పెద్దలు ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం: సంఘం లోపల-బయట మంచిపేరు సంపాదించడం, కుటుంబ పెద్దగా మంచి ఆదర్శాన్ని ఉంచడం, సంఘానికి సేవ చేయడంలో ముందుండడం.

మంచిపేరు సంపాదించడం

4. “ఏ నిందా ఉండకూడదు” అంటే ఏంటి?

4 మీరు సంఘ పెద్ద అవ్వాలనుకుంటే మీ మీద “ఏ నిందా ఉండకూడదు,” అంటే మీ ప్రవర్తననుబట్టి సంఘంలో మంచిపేరు ఉండాలి. అలాగే ఎవ్వరూ మీ మీద నింద వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. అంతేకాదు, మీకు “బయటివాళ్ల దగ్గర కూడా మంచిపేరు ఉండాలి.” మామూలుగా మీ క్రైస్తవ నమ్మకాల్ని బయటివాళ్లు తప్పుపట్టవచ్చు. కానీ మీ నిజాయితీ గురించి, ప్రవర్తన గురించి వేలెత్తి చూపించడానికి వాళ్లకు ఎలాంటి కారణం ఉండకూడదు. (దాని. 6:4, 5) ఇలా ప్రశ్నించుకోండి: ‘నాకు సంఘం లోపల-బయట మంచిపేరు ఉందా?’

5. మీరు ‘మంచితనాన్ని ప్రేమిస్తారు’ అని ఎలా చూపించవచ్చు?

5 ‘మంచితనాన్ని ప్రేమించేవాళ్లు’ ఇతరుల్లో మంచిని చూస్తారు. ఇతరుల మంచి లక్షణాల్ని బట్టి మెచ్చుకుంటారు. మంచి చేయడానికి సంతోషంగా ముందుకొస్తారు. అంతేకాదు అవసరమైన దానికంటే ఎక్కువగా, ఒక అడుగు ముందుకెళ్లి ఇతరులకు సహాయం చేస్తారు. (1 థెస్స. 2:8) పెద్దలకు ఈ లక్షణం ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే వాళ్లు సంఘాన్ని కాయడానికి, నియామకాల్ని చూసుకోవడానికి ఎక్కువ సమయం పెట్టాలి. (1 పేతు. 5:1-3) నిజమే దానికోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేయాలి, బాగా కష్టపడాలి. కానీ దానికి మించి ఎన్నోరెట్లు ఎక్కువ సంతోషాన్ని పొందుతారు.—అపొ. 20:35.

6. ‘ఆతిథ్యం ఇచ్చేవాళ్లుగా’ ఉండడం అంటే ఏంటి? (హెబ్రీయులు 13:2, 16; చిత్రం కూడా చూడండి.)

6 మీరు ఇతరులకు మంచి పనులు చేసినప్పుడు, ముఖ్యంగా మీ దగ్గరి స్నేహితులు కానివాళ్లకు కూడా అలా చేసినప్పుడు మీరు “ఆతిథ్యమిచ్చే” వాళ్లని చూపించుకుంటారు. (1 పేతు. 4:9) ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి గురించి ఒక బైబిలు డిక్షనరీ ఇలా చెప్తుంది: “అతని ఇంటి తలుపులు, మనసు తలుపులు పరిచయం లేనివాళ్లతో సహా అందరికీ తెరిచే ఉంటాయి.” ఇలా ప్రశ్నించుకోండి: ‘సంఘానికి వచ్చే కొత్తవాళ్లను ఆహ్వానించే విషయంలో నాకెలాంటి పేరుంది?’ (హెబ్రీయులు 13:2, 16 చదవండి.) ఆతిథ్య స్ఫూర్తి ఉన్న వ్యక్తి పేదవాళ్ల మీద, వేరే సంఘాల నుండి ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్లమీద, బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రోత్సహించడానికి కష్టపడి పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షకుల్లాంటి వాళ్లమీద, ఇలా అందరి మీద దయ చూపిస్తాడు.—ఆది. 18:2-8; సామె. 3:27; లూకా 14:13, 14; అపొ. 16:15; రోమా. 12:13.

ఒక జంట ఆతిథ్య స్ఫూర్తిని చూపిస్తూ ఒక ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి, అతని భార్యని వాళ్ల ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు (6వ పేరా చూడండి)


7. “డబ్బును ప్రేమించేవాడు” కాదని సంఘ పెద్ద ఎలా చూపిస్తాడు?

7 ‘డబ్బును ప్రేమించేవాడు అయ్యుండకూడదు.’ అంటే డబ్బు, వస్తువులే మీ లోకం అయ్యుండకూడదు. మీరు పేదవాళ్లయినా-డబ్బున్న వాళ్లయినా, దేవుని రాజ్యానికే మొదటిస్థానం ఇస్తారు. (మత్త. 6:33) మీ సమయాన్ని, శక్తిని, మీకున్న వాటిని యెహోవా ఆరాధన కోసం; మీ కుటుంబాన్ని చూసుకోవడం కోసం; సంఘం కోసం ఉపయోగిస్తారు. (మత్త. 6:24; 1 యోహా. 2:15-17) ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను డబ్బును ఎలా చూస్తున్నాను? అవసరమైన వాటితో తృప్తిపడుతున్నానా? లేక ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం మీదే మనసు పెడుతున్నానా?’—1 తిమో. 6:6, 17-19.

8. “అలవాట్ల విషయంలో మితంగా” ఉన్నారని, మీకు “ఆత్మనిగ్రహం” ఉందని ఎలా చూపించవచ్చు?

8 “అలవాట్ల విషయంలో మితంగా” ఉంటే, మీకు “ఆత్మనిగ్రహం” ఉంటే మీ జీవితంలో అన్ని విషయాల్లో మీరు హద్దులు దాటరు. అంటే మీరు అతిగా తినరు-తాగరు. బట్టలు, హెయిర్‌స్టయిల్స్‌, సరదాగా సమయం గడపడం లాంటి విషయాల్లో సరిగ్గా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. యెహోవాను ఆరాధించని ప్రజల దారిలో మీరు వెళ్లరు. (లూకా 21:34; యాకో. 4:4) ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినాసరే, అన్ని సందర్భాల్లో మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ‘తాగుబోతుగా’ ఉండరు, అతిగా తాగుతారు అనే పేరు కూడా మీకు ఉండదు. ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను అలవాట్ల విషయంలో మితంగా ఉంటున్నానా? నాకు ఆత్మనిగ్రహం ఉందా?’

9. “మంచి వివేచన” ఉండడం, ‘పద్ధతిగా నడుచుకోవడం’ అంటే ఏంటి?

9 మీకు “మంచి వివేచన” ఉంటే, మీరు బైబిలు సూత్రాల ఆధారంగా ఆచితూచి అడుగులు వేస్తారు. మీరు ముందునుండే బైబిలు సూత్రాల గురించి బాగా ఆలోచించారు కాబట్టి, పరిస్థితుల్ని-విషయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. దేని గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా, తొందరపడి ఒక ముగింపుకు వచ్చేయరు. బదులుగా అన్నీ వివరాలు కనుక్కుంటారు. (సామె. 18:13) అప్పుడు మీరు యెహోవా ఆలోచనకు తగ్గట్టు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ‘పద్ధతిగా నడుచుకునే’ వాళ్లయితే పనులన్నిటినీ క్రమ పద్ధతిలో, టైంకి పూర్తి చేస్తారు. నమ్మదగినవాళ్లు, నిర్దేశాల్ని పాటించేవాళ్లు అనే పేరు మీకు ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మీ మంచి పేరుకు ఉన్న అందాన్ని ఇంకా పెంచుతాయి. అయితే ఇప్పుడు కుటుంబ పెద్దగా మంచి ఆదర్శాన్ని ఉంచే విషయంలో లేఖనాల్లో ఉన్న అర్హతల్ని ఎలా సంపాదించాలో చర్చిద్దాం.

కుటుంబ పెద్దగా మంచి ఆదర్శాన్ని ఉంచడం

10. ‘ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించడం’ అంటే ఏంటి?

10 మీరు ఒక భర్త అయితే, మీ కుటుంబానికి కూడా మంచిపేరు ఉంటేనే సంఘ పెద్ద అవ్వగలరని గుర్తుంచుకోండి. మీరు ‘ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాళ్లుగా ఉండాలి.’ అంటే మీ కుటుంబాన్ని ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారనే పేరు మీకు ఉండాలి. అంతేకాదు మీరు కుటుంబ ఆరాధన చేయాలి. మీ కుటుంబ సభ్యులందరూ మీటింగ్స్‌కి హాజరయ్యేలా చూసుకోవాలి. ప్రీచింగ్‌లో వాళ్లు చేయగలిగిందంతా చేసేలా సహాయం చేయాలి. ఇవన్నీ చేయడం ఎందుకంత ప్రాముఖ్యం? అపొస్తలుడైన పౌలు వేసిన ఈ ప్రశ్నలో జవాబు ఉంది: “తన ఇంటివాళ్లకు ఎలా నాయకత్వం వహించాలో తెలియని వ్యక్తి దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటాడు?”—1 తిమో. 3:5.

11-12. ఒక బ్రదర్‌ సంఘ పెద్ద అవ్వాలనుకుంటే తన పిల్లల ప్రవర్తన చూసుకోవడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? (చిత్రం కూడా చూడండి.)

11 మీ పిల్లలకు 18 లేదా అంతకన్నా తక్కువ వయసు ఉండి మీతోనే ఉంటుంటే ‘చక్కని ప్రవర్తన కలిగి లోబడేవాళ్లుగా’ ఉండాలి. వాళ్లకు మీరు ప్రేమగా నేర్పించాలి, ట్రైనింగ్‌ ఇవ్వాలి. అందరి పిల్లల్లాగే మీ పిల్లలు కూడా ఆడుతూపాడుతూ సంతోషంగా ఉండాలి. కానీ మీరు మంచి ట్రైనింగ్‌ ఇస్తారు కాబట్టి వాళ్లు మీ మాట వింటారు, మర్యాదగా-చక్కగా ప్రవర్తిస్తారు. అలాగే యెహోవాతో మీ పిల్లలకు మంచి సంబంధం ఉండేలా, బైబిలు చెప్తున్నది వాళ్లు పాటించేలా, బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం వైపు అడుగులు వేసేలా చేయగలిగిందంతా చేయాలి.

12 “పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలకు చెడు తిరుగుళ్లు తిరుగుతారనే లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకూడదు.” విశ్వాసులైన పిల్లలు ఘోరమైన పాపం చేస్తే సంఘ పరిచారకునిగా లేదా సంఘ పెద్దగా సేవచేస్తున్న వాళ్ల తండ్రి ఆ సేవల్లో ఇక కొనసాగవచ్చో లేదో పెద్దలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఆయన తన పిల్లలకు అవసరమైన క్రమశిక్షణ, ట్రైనింగ్‌ ఇవ్వకపోయుంటే ఆయన పెద్దగా కొనసాగలేడు.1996 అక్టోబరు 15, కావలికోట 21వ పేజీ, 6-7 పేరాలు చూడండి.

తమ పిల్లలు యెహోవా కోసం, సంఘం కోసం ఏదోకటి చేసేలా తండ్రులు వాళ్లకు ట్రైనింగ్‌ ఇవ్వాలి (11వ పేరా చూడండి)


సంఘానికి సేవచేయడం

13. మీరు ‘పట్టుబట్టేవాళ్లు’ కాదని, ‘మొండివాళ్లు’ కాదని ఎలా చూపించవచ్చు?

13 మంచి క్రైస్తవ లక్షణాలు ఉన్న బ్రదర్స్‌ సంఘానికి ఒక దీవెన. మీరు ‘పట్టుబట్టని’ వ్యక్తిలా ఉంటే అందరితో శాంతిగా ఉంటారు, ఒకరితోఒకరు శాంతిగా ఉండేలా ఇతరులకు కూడా సహాయం చేస్తారు. ఇతరులు చెప్పేది వింటారు, వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, పెద్దల సభ మీటింగ్‌లో, పెద్దల్లో ఎక్కువశాతం మంది బైబిలు ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు నచ్చకపోయినా మీరు దానికి ఒప్పుకుంటారు. మీరు ‘మొండిగా’ ఉండరు. అంటే అన్నీ మీకు నచ్చినట్టే జరగాలని పట్టుబట్టరు, ఇతరుల అభిప్రాయాలు-ఆలోచనలు తెలుసుకోవడం ముఖ్యమని గుర్తిస్తారు. (ఆది. 13:8, 9; సామె. 15:22) మీరు ‘గొడవలు పెట్టుకునేవాళ్లుగా,’ ‘ముక్కోపిగా’ ఉండరు. కఠినంగా ఉంటూ, వాదనలకు దిగే బదులు మృదువుగా, నేర్పుగా మాట్లాడతారు. మీరు శాంతిగా ఉంటారు కాబట్టి, అందరూ కోపంలో ఉన్నప్పుడు కూడా చొరవ తీసుకొని శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. (యాకో. 3:17, 18) దయగా మాట్లాడితే ఎవరైనా, చివరికి కోపంగా ఉండే వ్యతిరేకులైనా చల్లబడే అవకాశం ఉంది.—న్యాయా. 8:1-3; సామె. 20:3; 25:15; మత్త. 5:23, 24.

14. “ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడు అయ్యుండకూడదు,” అంటే ఏంటి? ‘విశ్వసనీయుడిగా’ ఉండడం అంటే ఏంటి?

14 పెద్ద అవ్వాలనుకునే బ్రదర్‌ “ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడై” ఉండకూడదు. అంటే మీరు బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలు అవ్వాలని కాదు. బదులుగా పరిణతిగల క్రైస్తవులు అవ్వడానికి కొంత సమయం పడుతుందని దాని అర్థం. మీరు సంఘ పెద్దగా నియమించబడక ముందే యేసులా వినయంగా ఉండాలి. యెహోవా మీకు నియామకాలు ఇచ్చేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడాలి. (మత్త. 20:23; ఫిలి. 2:5-8) మీరు యెహోవాను అంటిపెట్టుకుని ఉంటే, ఆయనకు నచ్చినట్టు జీవిస్తే, సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే మీరు ‘విశ్వసనీయులు’ అని నిరూపించుకుంటారు.—1 తిమో. 4:15.

15. పెద్ద అవ్వాలంటే అదరగొట్టే ప్రసంగాలు ఇవ్వాలా? వివరించండి.

15 పర్యవేక్షకులకు ఖచ్చితంగా “బోధించే సామర్థ్యం ఉండాలి” అని లేఖనాలు చెప్తున్నాయి. అంటే మీరు అదరగొట్టే ప్రసంగాలు ఇవ్వాలనా? కాదు. అర్హతలు సంపాదించిన చాలామంది పెద్దలు ప్రసంగాలు అంతబాగా ఇవ్వలేకపోయినా, పరిచర్యలో చక్కగా బోధిస్తారు, కాపరి సందర్శనాలు కూడా చాలా బాగా చేస్తారు. (1 కొరింథీయులు 12:28, 29 తో; ఎఫెసీయులు 4:11 తో పోల్చండి.) అయినాసరే బోధించే విషయంలో మీకున్న నైపుణ్యాల్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అలా పెంచుకోవడానికి ఏం సహాయం చేస్తుంది?

16. మీరు మంచి బోధకులు అవ్వాలనుకుంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

16 “బోధించేటప్పుడు నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా అంటిపెట్టుకునేవాడై ఉండాలి.” మీరు మంచి బోధకులు అవ్వాలనుకుంటే బోధించేటప్పుడు మీరు చెప్పే విషయాలు, బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ఇచ్చే సలహాలు ఎప్పుడూ బైబిలుకు తగ్గట్టుగా ఉండాలి. దానికోసం మీరు బైబిల్ని, మన ప్రచురణల్ని బాగా చదవాలి. (సామె. 15:28; 16:23) అలా చదివేటప్పుడు, మన ప్రచురణలు లేఖనాల్ని ఎలా వివరిస్తున్నాయో బాగా గమనించండి. అప్పుడు మీరు కూడా వాటిని సరిగ్గా వివరించగలుగుతారు. బోధించేటప్పుడు వినేవాళ్ల మనసును తాకడానికి ప్రయత్నించండి. అనుభవంగల పెద్దల్ని సలహాలు అడిగి వాటిని పాటిస్తే, మీరు ఇంకా మంచి బోధకులు అవుతారు. (1 తిమో. 5:17) పెద్దలు బ్రదర్‌-సిస్టర్స్‌ని ‘ప్రోత్సహించగలగాలి.’ అయితే కొన్నిసార్లు వాళ్లను సరిదిద్దాల్సిరావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో గద్దించాల్సిరావచ్చు కూడా. ఏదేమైనా పెద్దలు ఎప్పుడూ దయగా ఉండాలి. మృదువుగా, దయగా మాట్లాడుతూ బైబిలుకు తగ్గట్టు బోధిస్తే మీరు గొప్ప బోధకుడైన యేసులా ఉంటారు, మంచి బోధకులు అవుతారు.—మత్త. 11:28-30; 2 తిమో. 2:24.

అనుభవంగల సంఘ పెద్దతో ఉన్నప్పుడు సంఘ పరిచారకుడు బైబిలు నుండి ఎలా బోధించాలో నేర్చుకుంటున్నాడు. ఆ సంఘ పరిచారకుడు తన ప్రసంగాన్ని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు (16వ పేరా చూడండి)


లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండండి

17. (ఎ) సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండడానికి సంఘ పరిచారకులకు ఏం సహాయం చేస్తుంది? (బి) ఒక బ్రదర్‌ని పెద్దగా నియమించేటప్పుడు సంఘ పెద్దలు ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి? (“ ఒక బ్రదర్‌కి సంఘ పెద్ద అయ్యే అర్హతలు ఉన్నాయో లేవో మాట్లాడుకునేటప్పుడు” అనే బాక్స్‌ చూడండి.)

17 సంఘ పెద్ద అవ్వడానికి ఉండాల్సిన అర్హతలన్నీ చదివాక, ‘నేను ఎప్పటికీ పెద్ద అవ్వలేను’ అని కొంతమంది సంఘ పరిచారకులు అనుకోవచ్చు. కానీ మీరు వీటన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలని యెహోవా గానీ, ఆయన సంస్థ గానీ ఆశించట్లేదని గుర్తుంచుకోండి. (1 పేతు. 2:21) ఈ అర్హతల్ని చేరుకోవడానికి యెహోవాయే తన శక్తిని ఇచ్చి మీకు సహాయం చేస్తాడు. (ఫిలి. 2:13) మీరు ఏదైనా లక్షణాన్ని ఇంకా బాగా చూపించాలని అనుకుంటున్నారా? దానిగురించి యెహోవాకు ప్రార్థించండి, పరిశోధన చేయండి, సలహాల కోసం పెద్దల్ని అడగండి.

18. సంఘ పరిచారకులందరూ ఏం చేయడానికి ముందుకురావచ్చు?

18 ఇప్పటికే సంఘ పెద్దగా సేవచేస్తున్న వాళ్లతోపాటు మనలో ప్రతీఒక్కరం ఈ ఆర్టికల్‌లో చర్చించిన లక్షణాల్ని పెంచుకుంటూ ఉండడానికి ప్రయత్నిద్దాం. (ఫిలి. 3:16) మీరు సంఘ పరిచారకుడిగా సేవ చేస్తున్నారా? అయితే బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ఇంకా సహాయం చేయాలనే లక్ష్యం పెట్టుకోండి. యెహోవాకు, సంఘానికి ఇంకా ఉపయోగపడేలా ట్రైనింగ్‌ ఇవ్వమని ప్రార్థనలో అడగండి. (యెష. 64:8) సంఘ పెద్ద అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాల్ని యెహోవా మెండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాం!

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం