యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
“నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా.”—యెష. 41:8.
1, 2. (ఎ) మనుషులు దేవునితో స్నేహం చేయగలరని మనమెలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఎవరి గురించి పరిశీలిస్తాం?
పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు మనందరికీ ప్రేమ అవసరం. మనుషులకు కేవలం స్త్రీపురుషుల మధ్య ఉండేలాంటి ప్రేమ మాత్రమే కాదుగానీ, సన్నిహితంగా ఉంటూ ప్రేమించేవాళ్ల స్నేహం కూడా అవసరం. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మనకు యెహోవా ప్రేమ అవసరం. కానీ దేవుడు కనిపించడు, పైగా ఆయన అందరికన్నా గొప్పవాడు కాబట్టి, ఆయనకు సన్నిహితంగా ఉంటూ స్నేహం చేయలేమని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటో మనకు తెలుసు.
2 కొంతమంది మనుషులు దేవునితో స్నేహం చేశారని బైబిలు చెప్తుంది. వాళ్లనుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే దేవునితో స్నేహం చేయడమే మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన లక్ష్యం. అలా దేవునితో స్నేహం చేసినవాళ్లలో ఒకరు అబ్రాహాము. ఆయన గురించి ఇప్పుడు చూద్దాం. (యాకోబు 2:23 చదవండి.) అబ్రాహాము దేవునికి ఎలా స్నేహితుడయ్యాడు? తనకున్న విశ్వాసాన్నిబట్టి ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు, అంతేకాదు ‘విశ్వాసం ఉన్నవాళ్లందరికీ తండ్రి’ అని బైబిలు ఆయన్ని పిలుస్తుంది. (రోమా. 4:11) ఆయన గురించి పరిశీలిస్తుండగా మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను అబ్రాహాము విశ్వాసాన్ని అనుకరిస్తూ యెహోవాతో నా స్నేహాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?’
అబ్రాహాము యెహోవా స్నేహితుడు ఎలా అయ్యాడు?
3, 4. (ఎ) అబ్రాహాము విశ్వాసానికి ఎదురైన అతిపెద్ద పరీక్ష ఏమై ఉండవచ్చు? (బి) అబ్రాహాము తన కొడుకును బలివ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు?
3 ఈ సందర్భాన్ని ఊహించుకోండి. దాదాపు 125 ఏళ్ల అబ్రాహాము అడుగులో అడుగు వేసుకుంటూ కొండ ఎక్కుతున్నాడు. [1] దాదాపు 25 ఏళ్లున్న ఇస్సాకు, కట్టెలు మోస్తూ ఆయన వెనక నడుస్తున్నాడు. అబ్రాహాము చేతిలో కత్తి, మంటను వెలిగించడానికి కావాల్సినవి ఉన్నాయి. ఇది అబ్రాహాము జీవితంలో చాలా కష్టమైన ప్రయాణం. దానికి కారణం ఆయన వయసు కాదు, ఎందుకంటే ఆ వయసులో కూడా ఆయనకు చాలా బలం ఉంది. అయినప్పటికీ ఆ ప్రయాణం ఎందుకు కష్టంగా ఉందంటే యెహోవా అడిగినట్లు తన కొడుకును బలి ఇవ్వడానికి ఆయన వెళ్తున్నాడు.—ఆది. 22:1-8.
4 అబ్రాహాము విశ్వాసానికి ఎదురైన పరీక్షల్లో బహుశా ఇదే అతిపెద్ద పరీక్ష అయ్యుంటుంది. తన కొడుకును బలి ఇవ్వమని అబ్రాహామును అడిగినందుకు దేవుడు క్రూరుడని కొంతమంది అంటారు. కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే అబ్రాహాముకు కొడుకు మీద ప్రేమలేదని ఇంకొంతమంది అంటారు. ప్రజలకు విశ్వాసం లేకపోవడమే కాదు అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా తెలీదు, అందుకే అలాంటి మాటలు అంటారు. (1 కొరిం. 2:14-16) కానీ అబ్రాహాము గుడ్డిగా అంటే ముందూవెనకా ఆలోచించకుండా దేవుడు చెప్పింది చేయలేదు. ఆయనకు నిజమైన విశ్వాసం ఉంది కాబట్టే దేవుని మాట విన్నాడు. తనకు తీరని నష్టం కలిగించే ఏ పనిని చేయమని యెహోవా అడగడని అబ్రాహాముకు తెలుసు. అంతేకాదు యెహోవా మాట వింటే ఆయన తనను, తన కొడుకును ఆశీర్వదిస్తాడని కూడా అబ్రాహాముకు తెలుసు. అంత బలమైన విశ్వాసం అబ్రాహాముకు ఎలా కలిగింది? ఆయనకున్న జ్ఞానం, అనుభవం వల్లే అది సాధ్యమైంది.
5. అబ్రాహాము యెహోవా గురించి ఎలా నేర్చుకుని ఉంటాడు? ఆ జ్ఞానం ఆయనను ఏమి చేసేలా కదిలించింది?
5 జ్ఞానం. అబ్రాహాము ఊరు అనే పట్టణంలో పెరిగాడు. అక్కడి ప్రజలందరూ అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లు, ఆఖరికి అతని కన్న తండ్రి కూడా. (యెహో. 24:2) మరైతే అబ్రాహాము యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు? నోవహు కొడుకైన షేము అబ్రాహాముకు బంధువనీ, అబ్రాహాముకు 150 ఏళ్లు వచ్చేవరకు అతను బ్రతికే ఉన్నాడనీ బైబిలు చెప్తుంది. షేము దేవుని మీద గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి, బహుశా అతను తన బంధువులకు యెహోవా గురించి చెప్పి ఉంటాడు. అయితే అబ్రాహాము యెహోవా గురించి షేము ద్వారానే నేర్చుకుని ఉంటాడా? అయ్యుండవచ్చు కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఒక్కటి మాత్రం నిజం, అదేంటంటే అబ్రాహాము నేర్చుకున్నదాన్నిబట్టి యెహోవాను ప్రేమించగలిగాడు, ఆ జ్ఞానం వల్లే ఆయనలో విశ్వాసం కలిగింది.
6, 7. అబ్రాహాముకు ఎదురైన అనుభవాలనుబట్టి ఆయన విశ్వాసం ఎలా బలపడింది?
6 అనుభవం. యెహోవా మీద ఉన్న విశ్వాసాన్ని బలపర్చుకునేంత అనుభవాన్ని అబ్రాహాము ఎలా సంపాదించుకోగలిగాడు? ఆలోచనలు భావాలను కలిగిస్తాయని, భావాలు పనులకు నడిపిస్తాయని కొంతమంది అంటారు. దేవుని గురించి నేర్చుకున్న విషయాలు అబ్రాహాము హృదయాన్ని కదిలించాయి. అవి “ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా” మీద ప్రగాఢమైన గౌరవం కలిగేలా చేశాయి. (ఆది. 14:22-23) ఆ ప్రగాఢమైన గౌరవాన్నే ‘దైవభక్తి’ అని బైబిలు పిలుస్తుంది. (హెబ్రీ. 5:7) దేవునితో సన్నిహిత స్నేహం కావాలంటే మనకు దైవభక్తి ఉండాలి. (కీర్త. 25:14) యెహోవా మాట వినేందుకు అబ్రాహాముకు ఆ లక్షణమే సహాయం చేసింది.
7 ఊరులోని తమ ఇంటిని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్లమని దేవుడు అబ్రాహాము, శారాలకు చెప్పాడు. వాళ్లు అప్పటికే ముసలివాళ్లు, అంతేకాదు ఇకనుండి వాళ్లు గుడారాల్లో ఉండాల్సిరావచ్చు. తమకు ఎన్నో ప్రమాదాలు ఎదురౌతాయని తెలిసినా అబ్రాహాము దేవుని మాట వినాలని నిశ్చయించుకున్నాడు. అంత విధేయత చూపించినందుకు యెహోవా ఆయన్ని ఆశీర్వదించి, సంరక్షించాడు. ఉదాహరణకు, తన అందమైన భార్యను తీసుకెళ్లిపోతారని, ఆయన్ని చంపేస్తారని అబ్రాహాము భయపడ్డాడు. కానీ యెహోవా ఎన్నోసార్లు అబ్రాహాము, శారాలను అద్భుతరీతిలో రక్షించాడు. (ఆది. 12:10-20; 20:2-7, 10-12, 17, 18) ఆ అనుభవాలవల్ల అబ్రాహాము విశ్వాసం మరింత బలపడింది.
8. యెహోవాతో ఉన్న స్నేహాన్ని బలపర్చుకునేందుకు కావాల్సిన జ్ఞానం, అనుభవం మనమెలా సంపాదించుకోవచ్చు?
8 మనం యెహోవాకు సన్నిహిత స్నేహితులుగా ఉండగలమా? ఖచ్చితంగా. అబ్రాహాములాగే మనం యెహోవా గురించి నేర్చుకోవాలి. అప్పట్లో అబ్రాహాముకు అందుబాటులో లేని జ్ఞానం, అనుభవం నేడు మనకు బైబిల్లో ఉన్నాయి. (దాని. 12:4; రోమా. 11:33) అవును “ఆకాశమునకు భూమికిని సృష్టికర్త” అయిన యెహోవా గురించిన జ్ఞానంతో బైబిలు నిండివుంది. మనం నేర్చుకునే విషయాలు యెహోవాపై ప్రేమను, ప్రగాఢ గౌరవాన్ని కలిగిస్తాయి. ఈ ప్రేమ, గౌరవం దేవుని మాట వినేలా మనల్ని ప్రోత్సహిస్తాయి. దేవుని మాట వింటే ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడో, ఆశీర్వదిస్తాడో చూస్తాం, అది మనకు అనుభవాన్ని ఇస్తుంది. మనం యెహోవాను పూర్తిగా సేవిస్తే సంతృప్తిని, శాంతిని, ఆనందాన్ని పొందుతాం. (కీర్త. 34:8; సామె. 10:22) యెహోవా గురించి ఎంత ఎక్కువ నేర్చుకుని, ఆయన ఆశీర్వాదాలను ఎంత ఎక్కువ రుచి చూస్తే ఆయనతో మన స్నేహం అంత బలపడుతుంది.
యెహోవాతో ఉన్న స్నేహాన్ని అబ్రాహాము ఎలా కాపాడుకున్నాడు?
9, 10. (ఎ) స్నేహం బలపడాలంటే ఏమి అవసరం? (బి) అబ్రాహాము దేవునితో ఉన్న స్నేహాన్ని ఆనందిస్తూ కాపాడుకున్నాడని ఎలా చెప్పవచ్చు?
9 సన్నిహిత స్నేహం ఒక విలువైన సంపద లాంటిది. (సామెతలు 17:17 చదవండి.) ఆ స్నేహం కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగించే ఒక ఖరీదైన గాజు పాత్ర లాంటిది కాదు. అది ఒక అందమైన పువ్వు లాంటిది, ఆ పువ్వు వికసించాలంటే దానికి నీళ్లు, ఒకరి శ్రద్ధ అవసరం. అదేవిధంగా అబ్రాహాము, దేవునితో తనకున్న స్నేహాన్ని ఆనందిస్తూ దాన్ని కాపాడుకున్నాడు. ఎలా?
10 అబ్రాహాము దైవభక్తిని, విధేయతను పెంచుకుంటూనే ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన తన కుటుంబాన్ని, సేవకుల్ని తీసుకుని కనానుకు బయల్దేరినప్పుడు తాను తీసుకునే చిన్నా-పెద్దా నిర్ణయాల్లో యెహోవా నిర్దేశాల్ని పాటిస్తూనే ఉన్నాడు. ఇస్సాకు పుట్టడానికి ఒక సంవత్సరం ముందు అంటే అబ్రాహాముకు 99 ఏళ్లున్నప్పుడు, తన ఇంట్లోని మగవాళ్లందరికీ సున్నతి చేయించమని యెహోవా చెప్పాడు. యెహోవా చెప్పినదాన్ని అబ్రాహాము సందేహించాడా లేదా తప్పించుకోవడానికి ఏవైనా సాకులు చెప్పాడా? లేదు. అబ్రాహాము యెహోవాను నమ్మాడు, ఆయన చెప్పింది “ఆ దినమందే” చేశాడు.—ఆది. 17:10-14, 23.
11. సొదొమ-గొమొర్రాల గురించి అబ్రాహాము ఎందుకు ఆందోళనపడ్డాడు? యెహోవా ఆయనకెలా సహాయం చేశాడు?
11 అబ్రాహాము చిన్న విషయాల్లో కూడా యెహోవా మాట విన్నాడు కాబట్టి వాళ్ల స్నేహం మరింత బలపడింది. యెహోవాతో దేని గురించైనా మాట్లాడవచ్చని ఆయన భావించాడు. అంతేకాదు కష్టమైన ప్రశ్నలతో ఆయన సతమతమౌతున్నప్పుడు సహాయం చేయమని యెహోవాను అడిగాడు. ఉదాహరణకు, సొదొమ-గొమొర్రా పట్టణాల్ని యెహోవా నాశనం చేస్తానని చెప్పినప్పుడు అబ్రాహాము ఆందోళనపడ్డాడు. ఎందుకంటే చెడ్డవాళ్లతోపాటు మంచివాళ్లు కూడా చనిపోతారేమో అని ఆయన భయపడ్డాడు. బహుశా ఆ పట్టణంలో ఉన్న తన అన్న కొడుకైన లోతు, అతని కుటుంబం గురించి ఆయన బాధపడివుండవచ్చు. ‘సర్వ లోకానికి తీర్పు తీర్చే’ యెహోవాపై అబ్రాహాము నమ్మకం ఉంచి, తన భయాలన్నిటినీ యెహోవాకు వినయంగా చెప్పుకున్నాడు. తన స్నేహితుడైన అబ్రాహాము అడిగిన ప్రశ్నలన్నిటికీ యెహోవా ఓపిగ్గా జవాబిచ్చి తాను దయగలవాడినని నిరూపించుకున్నాడు. తీర్పు తీర్చేటప్పుడు కూడా తాను మంచివాళ్ల కోసం వెదికి వాళ్లను కాపాడతానని యెహోవా వివరించాడు.—ఆది. 18:22-33.
12, 13. (ఎ) అబ్రాహాముకు ఉన్న జ్ఞానం, అనుభవం ఆయనకు ఎలా సహాయం చేశాయి? (బి) అబ్రాహాముకు యెహోవా మీద నమ్మకం ఉందని దేన్నిబట్టి చెప్పవచ్చు?
12 తాను సంపాదించుకున్న జ్ఞానం, అనుభవం యెహోవాతో ఉన్న స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి అబ్రాహాముకు సహాయం చేశాయని స్పష్టంగా తెలుస్తుంది. యెహోవా ఎప్పుడూ ఓపిగ్గా, దయగా, నమ్మకస్థునిగా, సంరక్షకునిగా ఉన్నాడని అబ్రాహాముకు తెలుసు. కాబట్టి తన కొడుకును బలి ఇవ్వమని అడిగినంత మాత్రాన యెహోవా ఒక్కసారిగా క్రూరునిగా మారిపోలేదని అబ్రాహాముకు ఖచ్చితంగా తెలుసు. అలాగని ఎలా చెప్పవచ్చు?
13 అబ్రాహాము తన సేవకులతో, “మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదము” అని చెప్పాడు. (ఆది. 22:5) అబ్రాహాము ఉద్దేశం ఏమిటి? ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తూ మేం తిరిగి వస్తామని అబ్రాహాము అబద్ధం చెప్తున్నాడా? లేదు. ఒకవేళ ఇస్సాకు చనిపోయినా యెహోవా అతన్ని మళ్లీ బ్రతికించగలడనే నమ్మకం అబ్రాహాముకు ఉందని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 11:17-19 చదవండి.) వృద్ధాప్యంలో ఉన్న తమకు పిల్లల్ని కనే శక్తిని యెహోవా ఇచ్చాడని అబ్రాహాముకు తెలుసు. (హెబ్రీ. 11:11, 12, 17-19) కాబట్టి యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన నమ్మాడు. ఇస్సాకును బలివ్వడానికి వెళ్తున్న రోజున ఏమి జరుగుతుందో అబ్రాహాముకు తెలీదు. కానీ ఏమి జరిగినా, యెహోవా ఇస్సాకును తిరిగి బ్రతికించి తన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చగలడనే విశ్వాసం అబ్రాహాముకు ఉంది. అందుకే ఆయన ‘విశ్వాసం ఉన్నవాళ్లందరికీ తండ్రి’ అయ్యాడు.
14. యెహోవా సేవలో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? అబ్రాహాము ఆదర్శం మీకు ఎలా సహాయం చేయవచ్చు?
14 నేడు యెహోవా మన పిల్లల్ని బలి ఇవ్వమని అడగట్లేదు, కానీ తన ఆజ్ఞలకు లోబడమని చెప్తున్నాడు. కొన్నిసార్లు ఆయన ఫలానా ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడో మనకు అర్థంకాకపోవచ్చు లేదా దాన్ని పాటించడం కష్టంగా ఉండవచ్చు. మీకలా అనిపిస్తుందా? కొంతమందికి ప్రకటనాపని కష్టంగా ఉంటుంది. బహుశా సిగ్గు వల్ల కొత్తవాళ్లతో మాట్లాడడం వాళ్లకు కష్టంగా అనిపించవచ్చు. ఇంకొంతమంది పనిస్థలంలో లేదా స్కూల్లో ఇతరులకు భిన్నంగా ఉండడానికి భయపడవచ్చు. (నిర్గ. 23:2; 1 థెస్స. 2:2) మీకు కష్టంగా అనిపించే దేన్నైనా చేయమని ఎవరైనా చెప్తే, అబ్రాహాము చూపించిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని గుర్తుచేసుకోండి. విశ్వాసంగల స్త్రీపురుషుల గురించి ఆలోచించినప్పుడు వాళ్లను అనుకరిస్తూ మన స్నేహితుడైన యెహోవాకు మరింత దగ్గరవ్వాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం.—హెబ్రీ. 12:1, 2.
ఆశీర్వాదాలు తెచ్చే స్నేహం
15. అబ్రాహాము దేవుని మాట విన్నందుకు ఎన్నడూ బాధపడలేదని ఎలా చెప్పవచ్చు?
15 దేవుని మాట విన్నందుకు అబ్రాహాము ఎప్పుడైనా బాధపడ్డాడా? “అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు” అని బైబిలు చెప్తుంది. (ఆది. 25:8, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఆయన 175 ఏళ్ల వయసులో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితమంతా చాలా సంతృప్తిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆయన యెహోవాతో స్నేహమే జీవితంగా బ్రతికాడు. అయితే అబ్రాహాము ఎన్నో ఏళ్లు జీవించి ‘సంతృప్తిగా’ చనిపోయాడంటే, దానర్థం ఆయనకు భవిష్యత్తులో నిత్యం జీవించాలనే ఆశ లేదని కాదు.
16. పరదైసులో అబ్రాహాము ఎలాంటి ఆనందాలు పొందుతాడు?
16 “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 11:10) ఏదోక రోజు ఆ పట్టణం అంటే దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలించడాన్ని చూస్తానని అబ్రాహాము నమ్మాడు. ఆయన తప్పకుండా దాన్ని చూస్తాడు కూడా. ఆయన పరదైసు భూమ్మీద జీవిస్తూ దేవునితో తన స్నేహాన్ని మరింత బలపర్చుకుంటూ ఎంత సంతోషిస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. విశ్వాసం విషయంలో తాను ఉంచిన మాదిరి దేవుని సేవకులందరికీ వందల సంవత్సరాల వరకు ఉపయోగపడిందని తెలుసుకుని ఆయన ఎంత సంతోషిస్తాడో కదా! అంతేకాదు మోరీయా పర్వతం దగ్గర ఆయన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడడం, భవిష్యత్తులో జరిగే మరింత గొప్ప పనికి సూచనగా ఉందని తెలుసుకుంటాడు. (హెబ్రీ. 11:17-19) తన కొడుకును బలిగా ఇస్తున్నప్పుడు ఆయన పడిన బాధ, యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా ఇస్తున్నప్పుడు యెహోవా అనుభవించిన వేదనను అర్థంచేసుకోవడానికి లక్షలమందికి సహాయం చేసిందని తెలుసుకుంటాడు. (యోహా. 3:16) అవును, ప్రేమకు సాటిలేని రుజువైన విమోచన క్రయధనం పట్ల మన కృతజ్ఞతను మరింత పెంచుకోవడానికి అబ్రాహాము ఉదాహరణ మనందరికీ సహాయం చేసింది.
17. మనందరం ఏమని నిర్ణయించుకోవాలి? తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చూస్తాం?
17 మనందరం అబ్రాహాములాంటి విశ్వాసాన్నే చూపించాలని నిర్ణయించుకుందాం. ఆయనలాగే మనకు కూడా జ్ఞానం, అనుభవం అవసరం. యెహోవా గురించి నేర్చుకుంటూ ఆయన మాట వింటే, ఆయన మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో, సంరక్షిస్తాడో తెలుసుకోగలుగుతాం. (హెబ్రీయులు 6:10-12 చదవండి.) కాబట్టి ఎప్పటికీ యెహోవానే మన స్నేహితునిగా ఉంచుకుందాం. తర్వాతి ఆర్టికల్‌లో, దేవునితో స్నేహం చేసిన మరో ముగ్గురిని పరిచయం చేసుకుందాం.
^ [1] (3వ పేరా) అబ్రాహాము, శారాల అసలు పేర్లు అబ్రాము, శారాయి. కానీ కొంతకాలం తర్వాత యెహోవా వాళ్లకు పెట్టిన పేర్లను ఈ ఆర్టికల్‌లో ఉపయోగిస్తున్నాం.