దేవుని సన్నిహిత స్నేహితులను అనుకరిద్దాం
‘ప్రభువుకు [యెహోవాకు] భయపడువారు ఆయనకు సన్నిహితులు అవుతారు.’ —కీర్త. 25:14, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.
1-3. (ఎ) మనందరం దేవునికి స్నేహితులవ్వగలమని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఎవరి ఉదాహరణలు పరిశీలిస్తాం?
అబ్రాహాము దేవుని స్నేహితుడనే విషయం బైబిల్లో మూడు చోట్ల కనిపిస్తుంది. (2 దిన. 20:7; యెష. 41:8; యాకో. 2:23) దేవుని స్నేహితుడని బైబిలు ప్రత్యేకంగా పిలుస్తున్న వ్యక్తి ఆయనే. అంటే అబ్రాహాము తప్ప ఏ మనిషీ యెహోవాతో స్నేహం చేయలేదని దానర్థమా? కాదు. దేవునికి స్నేహితులయ్యే గొప్ప అవకాశం మనందరికీ ఉందని బైబిలు చెప్తుంది.
2 యెహోవాపట్ల భయభక్తులు, విశ్వాసం కలిగివుంటూ ఆయనకు సన్నిహిత స్నేహితులైన నమ్మకమైన స్త్రీపురుషుల వృత్తాంతాలు బైబిల్లో చాలా ఉన్నాయి. (కీర్త. 25:14) పౌలు చెప్పిన ‘గొప్ప సాక్షి సమూహంలో’ వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లలో ప్రతీఒక్కరూ దేవుని స్నేహితులే.—హెబ్రీ. 12:1-2.
3 అలా స్నేహం చేసినవాళ్లలో ముగ్గురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లెవరంటే: (1) చిన్నవయసులోనే భర్తను పోగొట్టుకున్న నమ్మకస్థురాలైన రూతు, (2) విశ్వాసంగల యూదా రాజు హిజ్కియా, (3) వినయస్థురాలైన యేసు తల్లి మరియ. వీళ్లు యెహోవాకు స్నేహితులైన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
ఆమె నిజమైన ప్రేమ చూపించింది
4, 5. రూతు ఎలాంటి కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అది ఎందుకు కష్టమైనది? (ప్రారంభ చిత్రం చూడండి.)
4 నయోమి, తన ఇద్దరు కోడళ్లయిన రూతు, ఓర్పాలతో కలిసి చాలాదూరం నడుస్తూ వెళ్తోంది. వాళ్లు మోయాబు నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో, ఓర్పా మోయాబులో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అయితే నయోమి తన సొంత దేశమైన ఇశ్రాయేలుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. మరి రూతు ఏమి చేసింది? ఆమెకు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. కావాలనుకుంటే ఆమె తన అమ్మానాన్నలతో కలిసి ఉండడానికి మోయాబు దేశానికి తిరిగి వెళ్లవచ్చు లేదా తన అత్త నయోమినే అంటిపెట్టుకుని ఉంటూ బేత్లెహేముకు వెళ్లవచ్చు.—రూతు 1:1-8, 14.
5 రూతు కుటుంబమంతా మోయాబు దేశంలో ఉండేది. కాబట్టి అక్కడికి తిరిగి వెళ్లిపోతే, వాళ్లే ఆమె బాగోగులను చూసుకుంటారు. రూతుకు అక్కడి ప్రజలు, భాష, సంస్కృతి కూడా బాగా తెలుసు. కానీ నయోమితో బేత్లెహేముకు వెళ్తే అక్కడ అలాంటి జీవితం దొరకకపోవచ్చు. పైగా ఆమెకు ఓ భర్తను, ఇంటిని ఇవ్వలేననీ, మోయాబుకు తిరిగి వెళ్లిపొమ్మనీ నయోమియే స్వయంగా రూతుకు చెప్పింది. అప్పటికే ఓర్పా, “తన జనులయొద్దకును తన దేవునియొద్దకు” తిరిగి వెళ్లిపోయింది. (రూతు 1:9-15) కానీ రూతు మాత్రం తన ప్రజల దగ్గరకు, అబద్ధ దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకుంది.
6. (ఎ) రూతు ఎలాంటి తెలివైన నిర్ణయం తీసుకుంది? (బి) రూతు ‘యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి’ వచ్చిందని బోయజు ఎందుకు అన్నాడు?
6 రూతు యెహోవా గురించి బహుశా తన భర్త నుండో లేదా నయోమి నుండో నేర్చుకుని ఉంటుంది. యెహోవా మోయాబు దేవుళ్ల లాంటివాడు కాదని ఆమె తెలుసుకుంది. అందుకే ఆమె యెహోవాను ప్రేమించింది, ఆయన్ను మాత్రమే ప్రేమించి, ఆరాధించాలని గ్రహించి ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. రూతు నయోమితో ఇలా చెప్పింది, “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు.” (రూతు 1:16) నయోమిపై రూతు చూపించిన ప్రేమ గురించి ఆలోచించినప్పుడల్లా మన కళ్లు చెమ్మగిల్లుతాయి. రూతులో ఉన్న మరో మంచి లక్షణమేమిటంటే, ఆమె యెహోవాను ప్రేమించింది. అందుకే బోయజుకు కూడా ఆమె నచ్చింది. ‘యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి’ వచ్చినందుకు ఆయన రూతును మెచ్చుకున్నాడు. (రూతు 2:12 చదవండి.) బోయజు అన్న మాటలు చదివినప్పుడు, తండ్రి రెక్కల కింద తలదాచుకున్న ఓ చిన్న పక్షిపిల్ల మనకు గుర్తుకురావచ్చు. (కీర్త. 36:7; 91:1-4) ఆ తండ్రిపక్షిలాగే యెహోవా కూడా రూతును ప్రేమతో సంరక్షించాడు. అంతేకాదు ఆమె చూపించిన విశ్వాసానికి ప్రతిఫలాన్నిచ్చాడు. ఆమె తీసుకున్న నిర్ణయాన్నిబట్టి బాధపడే పరిస్థితి రూతుకు ఎప్పుడూ రాలేదు.
7. తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకోవడానికి వెనకాడే వాళ్ళకు ఏది సహాయం చేస్తుంది?
7 చాలామంది యెహోవా గురించి నేర్చుకుంటారు కానీ ఆయన మీద ఆధారపడరు. తమ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతారు. ఒకవేళ మీ పరిస్థితి కూడా అదే అయితే, మీరు వెనకాడడానికి కారణాలేమిటో ఓసారి ఆలోచించండి. ప్రతీఒక్కరూ ఏదో ఒక దేవున్ని ఆరాధిస్తారు. (యెహో. 24:15) కానీ నిజమైన దేవున్ని ఆరాధించడమే తెలివైన పని. మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని కాపాడతాడనే విశ్వాసం మీకు ఉందని చూపిస్తారు. అలా చేస్తే, ఎన్ని సమస్యలొచ్చినా తనను ఆరాధిస్తూ ఉండడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. రూతుకు యెహోవా అలానే సహాయం చేశాడు.
‘అతను యెహోవాను హత్తుకొని’ ఉన్నాడు
8. హిజ్కియాకు చిన్నతనంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో వివరించండి.
8 రూతు పరిస్థితులకు, హిజ్కియా పరిస్థితులకు చాలా తేడా ఉంది. హిజ్కియా, యెహోవా దేవునికి సమర్పించుకున్న ఇశ్రాయేలు జనాంగంలో పుట్టాడు. కానీ ఇశ్రాయేలీయుల్లో అందరూ తాము చేసుకున్న సమర్పణకు తగ్గట్లు జీవించలేదు. హిజ్కియా తండ్రైన ఆహాజు రాజు చాలా చెడ్డవాడు. ఆహాజు దేవుని ఆలయం పట్ల ఏమాత్రం గౌరవం చూపించలేదు. తన రాజ్యంలోని ప్రజలు కూడా ఇతర దేవుళ్లను ఆరాధించేలా చేశాడు. ఆఖరికి అతను హిజ్కియా సోదరుల్లో కొందర్ని బ్రతికుండగానే మంటల్లో వేసి అబద్ధ దేవుళ్లకు బలిగా ఇచ్చాడు. కాబట్టి చిన్నతనంలో హిజ్కియాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పవచ్చు.—2 రాజు. 16:2-4, 10-17; 2 దిన. 28:1-3.
9, 10. (ఎ) హిజ్కియా ఎలాంటి వ్యక్తిలా తయారైవుండవచ్చు? (బి) మనం యెహోవాపై ఎందుకు కోపగించుకోకూడదు? (సి) మనమెలాంటి వ్యక్తిలా తయారవుతామనేది మన కుటుంబ వాతావరణం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుందని ఎందుకు అనుకోకూడదు?
9 తండ్రి క్రూరమైన ప్రవర్తనను చూసిన హిజ్కియా యెహోవాపై కోపం పెంచుకుని ఆయనకు ఎదురుతిరిగే వ్యక్తిలా తయారైవుండేవాడు. నేడు కొంతమందికి హిజ్కియా లాంటి చేదు అనుభవాలు ఎదురవ్వకపోయినా ‘యెహోవామీద కోపగించుకుంటున్నారు’ లేదా ఆయన సంస్థకు ఎదురు తిరుగుతున్నారు. (సామె. 19:2, 3) ఇంకొంతమందేమో, తాము చెడు వాతావరణంలో పెరగడం వల్ల చెడు జీవితానికి అలవాటుపడతామని లేదా తమ అమ్మానాన్నలు చేసినలాంటి తప్పులే చేస్తామని అనుకుంటారు. (యెహె. 18:2, 3) వీళ్ల ఆలోచనలు సరైనవే అంటారా?
10 అస్సలు కాదు. హిజ్కియా జీవితమే అందుకు తిరుగులేని రుజువు. యెహోవాపై కోపగించుకోవడానికి సరైన కారణమే ఉండదు. ఎందుకంటే ప్రజలకు చెడు జరిగేలా యెహోవా చేయడు. (యోబు 34:10) అయితే తల్లిదండ్రుల ప్రభావం వల్ల పిల్లలు మంచిగానైనా లేదా చెడ్డగానైనా తయారవ్వచ్చనేది నిజమే. (సామె. 22:6; కొలొ. 3:21) అంతమాత్రాన ఒకరి జీవితం వాళ్ల కుటుంబ వాతావరణం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుందని దానర్థం కాదు. ఎందుకు? ఎందుకంటే, మంచి చేయాలో లేదా చెడు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ యెహోవా మనలో ప్రతీఒక్కరికి ఇచ్చాడు. (ద్వితీ. 30:19) ఆ స్వేచ్ఛ అనే విలువైన బహుమతిని హిజ్కియా ఎలా ఉపయోగించుకున్నాడు?
11. హిజ్కియా ఎలా ఒక మంచి రాజయ్యాడు?
11 హిజ్కియా వాళ్ల నాన్న, యూదాను పరిపాలించిన అత్యంత చెడ్డ రాజుల్లో ఒకడైనప్పటికీ, హిజ్కియా మాత్రం చాలా మంచి రాజుగా తయారయ్యాడు. (2 రాజులు 18:5, 6 చదవండి.) ఆయన తన తండ్రి నడిచిన చెడ్డ దారిలో నడవకూడదని అనుకున్నాడు. బదులుగా యెహోవా ప్రవక్తలైన యెషయా, మీకా, హోషేయ వంటివాళ్ల మాటల్ని జాగ్రత్తగా వినాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లు ఇచ్చిన సలహాలపై, దిద్దుబాటులపై మనసుపెట్టాడు. అలా చేయడం ద్వారా, వాళ్ల నాన్న చేసిన ఎన్నో తప్పులవల్ల కలిగిన నష్టాన్ని ఆయన పూరించగలిగాడు. ఉదాహరణకు, హిజ్కియా యెహోవా ఆలయాన్ని పరిశుద్ధపర్చి, ప్రజలు చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. అంతేకాదు తన రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నిటినీ పడగొట్టించాడు. (2 దిన. 29:1-11, 18-24; 31:1) ఆ తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు యెరూషలేముపై దాడిచేసినప్పుడు హిజ్కియా ఎంతో ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూపించాడు. యెహోవా రక్షణపై నమ్మకముంచి ప్రజలకు ధైర్యం చెప్పాడు. (2 దిన. 32:7, 8) అయితే ఒకానొక సందర్భంలో హిజ్కియా మనసులో గర్వం మొలకెత్తింది, కానీ ఎప్పుడైతే యెహోవా సరిదిద్దాడో ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. (2 దిన. 32:24-26) నిజంగా, హిజ్కియా మనకు అద్భుతమైన మాదిరి ఉంచాడు. తన కుటుంబ పరిస్థితులను సాకుగా పెట్టుకుని ఆయన తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. బదులుగా, తాను యెహోవా స్నేహితుడినని నిరూపించుకున్నాడు.
12. హిజ్కియాలాగే తాము కూడా దేవుని స్నేహితులమని నేడు చాలామంది ఎలా నిరూపించుకున్నారు?
12 నేడు మనం ప్రేమలేని క్రూరమైన లోకంలో జీవిస్తున్నాం. అందుకే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధలకు నోచుకోవడంలేదు. (2 తిమో. 3:1-5) మనకాలంలోని చాలామంది క్రైస్తవులు, తమ చిన్నతనంలో చేదు అనుభవాలను రుచి చూసినప్పటికీ వాళ్లు యెహోవాకు స్నేహితులవ్వాలని నిర్ణయించుకున్నారు. హిజ్కియాలాగే వాళ్లు కూడా, తాము ఎలాంటివాళ్లుగా తయారౌతామనేది పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉండదని నిరూపించారు. అవును, యెహోవా మనకు స్వేచ్ఛ అనే బహుమానాన్ని ఇచ్చాడు. హిజ్కియాలాగే మనం కూడా దాన్ని ఉపయోగించుకుని యెహోవాను ఆరాధిస్తూ ఆయన్ను ఘనపర్చాలని నిర్ణయించుకుందాం.
“ఇదిగో ప్రభువు దాసురాలను”
13, 14. దేవుడు తనకు అప్పగించిన బాధ్యత గురించి విన్నప్పుడు మరియ ఎందుకు భయపడివుండవచ్చు? కానీ ఆమె ఎలా స్పందించింది?
13 హిజ్కియా పుట్టిన వందల సంవత్సరాల తర్వాత, మరియ అనే వినయస్థురాలైన ఓ యువతి యెహోవాతో ప్రత్యేక స్నేహాన్ని ఏర్పర్చుకుంది. ఆమెకు యెహోవా ఒక అసాధారణమైన బాధ్యతను అప్పగించాడు. అదేమిటంటే ఆమె గర్భవతి అయ్యి దేవుని కుమారుణ్ణి కని, పెంచాలి. యెహోవా మరియను ఎంతో ప్రేమించి, నమ్మాడు కాబట్టే ఆమెకు అంత అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు తనకు అప్పగిస్తున్న బాధ్యత గురించి మొదటిసారి విన్నప్పుడు మరియకు ఎలా అనిపించి ఉంటుంది?
14 మరియకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. కానీ ఆ బాధ్యత గురించి విన్నప్పుడు మరియ మదిలో ఎన్ని భయాలు మెదిలి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు, ఆమె పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అవుతుందని గబ్రియేలు దూత మరియకు చెప్పాడు. కానీ దూత ఆ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు, ఇరుగుపొరుగు వాళ్లకు చెప్పలేదు. మరి మరియ గురించి వాళ్లు ఏమనుకుంటారు? ఆమెను పెళ్లి చేసుకోబోతున్న యోసేపు ఏమనుకుంటాడు? తాను ఏ తప్పూ చేయలేదని ఎలా నిరూపించుకోవాలి? వీటన్నిటితోపాటు, దేవుని కుమారుణ్ణి పెంచే గొప్ప బాధ్యత ఆమె భుజాలపై ఉంది. ఏదేమైనా మరియ మనసులో మెదిలిన ఆలోచనలన్నీ మనకు తెలియకపోయినా గబ్రియేలు దూత చెప్పింది విన్న తర్వాత ఆమె ఏమి చేసిందో మాత్రం మనకు తెలుసు. ఆమె ఇలా అంది, “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.”—లూకా 1:26-38.
15. మరియ విశ్వాసం ఎందుకు సాటిలేనిది?
15 మరియ విశ్వాసం నిజంగా సాటిలేనిది. ఓ దాసురాలిలా, యెహోవా ఏమి అడిగినా చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. యెహోవాయే ఆమెను చూసుకుంటాడని, సంరక్షిస్తాడని ఆమె నమ్మింది. మరియ అంత బలమైన విశ్వాసం ఎలా పెంచుకుంది? సాధారణంగా ఎవ్వరికీ పుట్టుకతోనే విశ్వాసం ఉండదు. దాన్ని అలవర్చుకోవాలంటే మనం కృషి చేస్తూ, ఆ కృషిని దీవించమని యెహోవాను అడగాలి. (గల. 5:22; ఎఫె. 2:8) మరియ బలమైన విశ్వాసాన్ని పెంచుకోవడానికి చాలా కృషిచేసింది. అది మనకెలా తెలుసు? ఆమె ఎలా వినేదో, ఎలాంటి విషయాలు మాట్లాడేదో తెలుసుకుంటే ఆ విషయం మనకు అర్థమౌతుంది. వాటిగురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
16. మరియ శ్రద్ధగా వినేదని ఎలా చెప్పవచ్చు?
16 మరియ విన్న విధానం. మనం ‘వినుటకు వేగిరపడేవాళ్లుగా, మాట్లాడడానికి నిదానించువాళ్లుగా’ ఉండాలని బైబిలు చెప్తుంది. (యాకో. 1:19) మరియ శ్రద్ధగా వినేది. ఆమె ఆధ్యాత్మిక విషయాలను, ముఖ్యంగా యెహోవా గురించిన విషయాలను శ్రద్ధగా వినేదని బైబిలు చెప్తుంది. అంతేకాదు ఆ ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆమె జాగ్రత్తగా ఆలోచించేది. ఉదాహరణకు, యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు వచ్చి, దూత చెప్పిన విషయాలను చెప్తున్నప్పుడు ఆమె విన్న విధానమే అందుకు రుజువు. మరొకసారి, 12 ఏళ్ల వయసులో యేసు చెప్పిన ఓ విషయం విని మరియ ఆశ్చర్యపోయింది. ఈ రెండు సందర్భాల్లో మరియ వినింది, గుర్తుపెట్టుకుంది, వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించింది.—లూకా 2:16-19, 49, 51 చదవండి.
17. మరియ మాటల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
17 మరియ మాట్లాడిన విషయాలు. మరియ మాట్లాడిన విషయాల గురించి బైబిల్లో ఎక్కువగా లేదు. ఆమె ఎక్కువసేపు మాట్లాడిన సందర్భం గురించి కేవలం లూకా 1:46-55 వచనాల్లో ఉంది. అందులో ఉన్న మరియ మాటలనుబట్టి ఆమెకు దేవుని వాక్యంలోని విషయాలు బాగా తెలుసని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె మాటలకు, సమూయేలు తల్లి హన్నా చేసిన ప్రార్థనలోని మాటలకు చాలా పోలికలు ఉన్నాయి. (1 సమూ. 2:1-10) మరియ మాట్లాడుతున్నప్పుడు లేఖనాలను దాదాపు 20 సార్లు వాడిందని ఒక అంచనా. దీన్నిబట్టి తన గొప్ప స్నేహితుడైన యెహోవా నుండి, ఆయన వాక్యం నుండి నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడడమంటే మరియకు ఇష్టమని స్పష్టంగా తెలుస్తోంది.
18. మనం మరియను ఏయే విషయాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు?
18 మరియకు అనిపించినట్లే మనకు కూడా యెహోవా ఇచ్చే బాధ్యతలు అప్పుడప్పుడు కష్టమనిపించవచ్చు. కానీ మనం ఆమెను ఆదర్శంగా తీసుకుని, ఆ బాధ్యతల్ని స్వీకరించి యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉందాం. అంతేకాదు ఆమె విశ్వాసాన్ని అనుకరిస్తూ యెహోవా మాటల్ని మనసుపెట్టి విందాం. ఆయన గురించి, ఆయన సంకల్పం గురించి, మనం నేర్చుకున్న వాటిగురించి ఆలోచిద్దాం. అప్పుడు వాటిగురించి ఇతరులకు ఆనందంగా చెప్పగలుగుతాం.—కీర్త. 77:11, 12; లూకా 8:18; రోమా. 10:15.
19. విశ్వాసం విషయంలో ఆదర్శాన్ని ఉంచినవాళ్లను అనుకరిస్తే మనం ఏ బహుమానాన్ని సొంతం చేసుకుంటాం?
19 అబ్రాహాములాగే రూతు, హిజ్కియా, మరియ కూడా దేవుని స్నేహితులని మనం తెలుసుకున్నాం. కేవలం వీళ్లు మాత్రమే కాదు, దేవుని స్నేహితులైన ఓ ‘గొప్ప సాక్షి సమూహం’ ఉంది. కాబట్టి విశ్వాసం విషయంలో అసాధారణమైన ఆదర్శాన్ని ఉంచిన అలాంటివాళ్లను మనం అనుకరిస్తూ ఉందాం. (హెబ్రీ. 6:11, 12) అలాచేస్తే, ఎప్పటికీ యెహోవా స్నేహితులుగా ఉండే గొప్ప బహుమానాన్ని సొంతం చేసుకుంటాం.