నమ్మకమైన యెహోవా సేవకుల నుండి నేర్చుకోండి
“యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు.”—కీర్త. 18:25.
1, 2. దావీదు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉన్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
దావీదును చంపాలని సౌలు తన 3,000 మంది సైనికులతో కలిసి యూదా అరణ్యంలో ఆయన కోసం వెదుకుతున్నాడు. అయితే ఓ రాత్రి దావీదు తన మనుషులతో కలిసి, సౌలూ అతని సైనికులూ ఉంటున్న ప్రదేశానికి వచ్చాడు. వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో దావీదు అబీషైలు చప్పుడు చేయకుండా సైనికులను దాటుకుంటూ సౌలు దగ్గరకు వెళ్లారు. అప్పుడు అబీషై దావీదు చెవిలో, ‘నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్కపోటు పొడిచి, నేనతన్ని భూమికి నాటివేస్తాను, ఒక దెబ్బతోనే పరిష్కారం చేస్తాను’ అని చెప్తాడు. అందుకు దావీదు, “నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? . . . యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక” అని అంటాడు.—1 సమూ. 26:8-12.
2 యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలో దావీదు గ్రహించాడు. దేవుడు సౌలును ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు కాబట్టి అతన్ని గౌరవించాలని ఆయనకు తెలుసు. అందుకే అతనికి హానిచేయాలనే ఆలోచన కూడా దావీదు తన మనసులోకి రానివ్వలేదు. నేడు కూడా తన సేవకులందరూ తనకు నమ్మకంగా ఉండాలని, తాను అధికారం ఇచ్చిన వాళ్లను గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—కీర్తన 18:25 చదవండి.
3. అబీషై దావీదుకు ఎలా నమ్మకంగా ఉన్నాడు?
3 దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడని అబీషైకు తెలుసు కాబట్టి ఆయన్ని గౌరవించాడు. అయితే, దావీదు రాజయ్యాక ఘోరమైన పాపం చేశాడు. ఆయన ఊరియా భార్యతో వ్యభిచారం చేశాడు. దాని తర్వాత ఊరియాను యుద్ధంలో చంపించమని యోవాబుకు చెప్పాడు. (2 సమూ. 11:2-4, 14, 15; 1 దిన. 2:16) యోవాబుకు అబీషై సోదరుడు కాబట్టి దావీదు చేసిన పని గురించి అతనికి తెలిసే ఉంటుంది. అయినా అబీషై దావీదును గౌరవిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, అబీషై సైనికాధికారి కాబట్టి తనకున్న అధికారాన్ని ఉపయోగించి రాజు అవ్వవచ్చు. కానీ అతను ఎప్పుడూ అలా చేయలేదు. బదులుగా దావీదు దగ్గర పనిచేస్తూ శత్రువుల నుండి ఆయన్ని కాపాడాడు.—2 సమూ. 10:10; 20:6; 21:15-17.
4. (ఎ) దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడని మనకు ఎలా తెలుసు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
4 దావీదు తన జీవితమంతా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు, భారీకాయుడైన గొల్యాతును చంపి యెహోవాను ఘనపర్చాడు, ఇశ్రాయేలీయులను కాపాడాడు. (1 సమూ. 17:23, 26, 48-51) దావీదు రాజయ్యాక పాపం చేశాడు. కానీ ఆయన్ని సరిదిద్దడానికి యెహోవా నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. (2 సమూ. 12:1-5, 13) ఆ తర్వాత, దావీదు ముసలివాడైనప్పుడు యెహోవా మందిరాన్ని కట్టేందుకు ఎన్నో విలువైన వస్తువుల్ని ఇచ్చాడు. (1 దిన. 29:1-5) వీటన్నిటినిబట్టి, దావీదు తన జీవితంలో ఘోరమైన తప్పులు చేసినప్పటికీ, దేవునికి మాత్రం ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాడని స్పష్టంగా అర్థమౌతుంది. (కీర్త. 51:4, 10; 86:2) ఈ ఆర్టికల్‌లో దావీదు గురించి, ఆయన కాలంలో జీవించిన ఇంకొందరి గురించి పరిశీలిస్తూ యెహోవాకు నమ్మకంగా ఉండడానికే మొదటి స్థానం ఎలా ఇవ్వాలో నేర్చుకుంటాం. అందుకు సహాయం చేసే మరికొన్ని లక్షణాల గురించి కూడా పరిశీలిస్తాం.
మీరు యెహోవాకు నమ్మకంగా ఉంటారా?
5. అబీషై చేసిన పొరపాటు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకునే విషయంలో అబీషై పొరపాటు చేశాడు. నిజానికి అతను యెహోవాకు నమ్మకంగా ఉండాలి. కానీ సౌలును చంపుతానని అనడం ద్వారా అతను దావీదుకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాడు. అయితే “అభిషేకము నొందిన వానిని” చంపడం తప్పని దావీదుకు తెలుసు కాబట్టి ఆయన సౌలును చంపనివ్వలేదు. (1 సమూ. 26:8-11) దీని నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనం ఎవరికి మొదట నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు, మనకు ఉపయోగపడే బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలి.
6. మనం ప్రేమించే స్నేహితులకు, కుటుంబసభ్యులకు నమ్మకంగా ఉండాలనుకోవడం సహజమే అయినా మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
6 మనం ప్రేమించేవాళ్లకు అంటే స్నేహితులకు, కుటుంబసభ్యులకు నమ్మకంగా ఉండాలనుకోవడం సహజమే. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి మన భావాలు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. (యిర్మీ. 17:9) మనం ప్రేమించే వాళ్లెవరైనా చెడ్డపని చేస్తునప్పుడు, ముఖ్యంగా వాళ్లు సత్యం వదిలి వెళ్లిపోయినప్పుడు, మనం వాళ్లకు నమ్మకంగా ఉండడంకన్నా యెహోవాకు నమ్మకంగా ఉండడమే ప్రాముఖ్యమని గుర్తుంచుకోవాలి.—మత్తయి 22:37 చదవండి.
7. కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక సహోదరి దేవునికి ఎలా నమ్మకంగా ఉంది?
7 మీ కుటుంబంలో ఎవరినైనా సంఘం నుండి బహిష్కరిస్తే, మీరు యెహోవాకే నమ్మకంగా ఉన్నారని చూపించవచ్చు. ఆన్ [1] అనుభవాన్ని పరిశీలించండి. ఆన్ వాళ్ల అమ్మను సంఘం నుండి బహిష్కరించారు. ఒక రోజు ఆమె ఆన్‌కు ఫోన్ చేసి తనను కలవాలనుకుంటున్నానని, కుటుంబంలో ఎవ్వరూ తనతో మాట్లాడనందుకు చాలా బాధగా ఉందని చెప్పింది. ఆ విషయం విన్న ఆన్‌కు చాలా బాధనిపించింది. అయితే తనకు ఒక ఉత్తరం ద్వారా జవాబు ఇస్తానని ఆన్ చెప్పింది. ఆ ఉత్తరం రాసే ముందు ఆన్ కొన్ని బైబిలు సూత్రాల గురించి ధ్యానించింది. (1 కొరిం. 5:11; 2 యోహా. 9-11) ఆ తర్వాత ఉత్తరంలో, ఆమె తప్పు చేసి పశ్చాత్తాపపడక పోవడంవల్ల ఆమె అంతట ఆమే కుటుంబానికి దూరమైపోయిందని ఆన్ వాళ్ల అమ్మకు దయగా వివరించింది. అంతేకాదు ఆమె మళ్లీ సంతోషంగా ఉండాలంటే యెహోవా దగ్గరకు తిరిగి రావడం ఒక్కటే మార్గమని కూడా ఆమెకు చెప్పింది.—యాకో. 4:8.
8. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఏ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి?
8 దావీదు కాలంలోని నమ్మకమైన యెహోవా సేవకులు వినయాన్ని, దయను, ధైర్యాన్ని కూడా చూపించారు. అయితే, యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఈ లక్షణాలు మనకు ఎలా సహాయం చేస్తాయో ఇప్పుడు చూద్దాం.
మనం వినయం చూపించాలి
9. దావీదును చంపడానికి అబ్నేరు ఎందుకు ప్రయత్నించాడు?
9 దావీదు గొల్యాతును చంపి అతని తలను సౌలు దగ్గరకు తీసుకురావడాన్ని యోనాతానుతోపాటు ఇశ్రాయేలు సైన్యాధికారైన అబ్నేరు కూడా చూశాడు. యోనాతాను దావీదుకు స్నేహితుడు అయ్యి, చివరివరకు ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. (1 సమూ. 17:57–18:3) కానీ అబ్నేరు యోనాతానులా లేడు. దావీదును చంపాలనుకున్న సౌలుకు అతను సహాయం చేశాడు. (కీర్త. 54:3; 1 సమూ. 26:1-5) దేవుడు ఇశ్రాయేలుకు తర్వాతి రాజుగా దావీదును ఎన్నుకున్నాడన్న విషయం యోనాతానుకు, అబ్నేరుకు ఇద్దరికీ తెలుసు. అయినాసరే సౌలు చనిపోయాక, అబ్నేరు దావీదుకు మద్దతివ్వలేదు. బదులుగా సౌలు కొడుకైనా ఇష్బోషెతును రాజుగా చేయాలని చూశాడు. కొంతకాలానికి, అబ్నేరుకు రాజు అవ్వాలనే కోరిక కలిగివుంటుంది. అందుకే సౌలు భార్యల్లో ఒకామెతో సంబంధం పెట్టుకుని ఉండొచ్చు. (2 సమూ. 3:6-11) దావీదు విషయంలో యోనాతాను, అబ్నేరులకు ఎందుకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి? ఎందుకంటే యోనాతాను యెహోవాకు నమ్మకంగా ఉంటూ వినయం చూపించాడు కానీ అబ్నేరు మాత్రం అలా చేయలేదు.—2 సమూ. 2:8-10.
10. అబ్షాలోము దేవునికి ఎందుకు నమ్మకంగా ఉండలేదు?
10 దావీదు కొడుకైన అబ్షాలోముకు వినయం లేదు కాబట్టే అతను దేవునికి నమ్మకంగా ఉండలేదు. అతనికి రాజు అవ్వాలనే కోరిక ఉండేది, అందుకే అతను, “ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను” ఏర్పాటు చేసుకున్నాడు. (2 సమూ. 15:1) చాలామంది ఇశ్రాయేలీయులను తనవైపు తిప్పుకున్నాడు కూడా. దేవుడు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా చేశాడని తెలిసి కూడా ఆయన్ని చంపాలని అబ్షాలోము ప్రయత్నించాడు.—2 సమూ. 15:13, 14; 17:1-4.
11. అబ్నేరు, అబ్షాలోము, బారూకుల వృత్తాంతాల నుండి మనం ఏం నేర్చుకుంటాం?
11 తనదికాని అధికారం కోసం అతిగా ఆశించే వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉండలేడని అబ్నేరు, అబ్షాలోముల ఉదాహరణలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కానీ నమ్మకమైన యెహోవా సేవకులు ఎవ్వరూ వాళ్లలా స్వార్థంగా, చెడ్డగా ప్రవర్తించరు. ఎక్కువ డబ్బును లేదా మనమే ప్రాముఖ్యమైన వాళ్లమని భావించేలా చేసే ఉద్యోగాలను పొందాలనే కోరిక మనలో మొలకెత్తకుండా జాగ్రత్తపడాలి. అది యెహోవాతో మనకున్న స్నేహాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు, యిర్మీయా దగ్గర పనిచేసే బారూకు కొంతకాలంపాటు, తన దగ్గర లేనివి కావాలని కోరుకున్నాడు. దానివల్ల అతను దేవుని సేవను ఆనందంగా చేయలేకపోయాడు. అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు, “నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు.” (యిర్మీ. 45:4, 5) బారూకు యెహోవా మాట విన్నాడు. మనం కూడా యెహోవా మాట వినాలి ఎందుకంటే ఆయన త్వరలోనే ఈ దుష్టలోకాన్ని నాశనం చేస్తాడు.
12. మనకు స్వార్థం ఉంటే దేవునికి ఎందుకు నమ్మకంగా ఉండలేమో ఒక అనుభవం చెప్పండి.
12 మెక్సికోలో ఉంటున్న దాన్యెల్ అనే సహోదరునికి, ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకునే పరిస్థితి ఎదురైంది. అతను యెహోవాను ఆరాధించని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాన్యెల్ ఇలా చెప్తున్నాడు, “నేను పయినీరు సేవ మొదలుపెట్టాక కూడా ఆమెకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను.” అయితే అతను తనకు నచ్చింది చేస్తూ స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడని తర్వాత గ్రహించాడు. అతను యెహోవాకు నమ్మకంగా లేడు, అతనికి వినయం అవసరం. కాబట్టి అనుభవం ఉన్న ఓ పెద్దకు అతను ఆ అమ్మాయి గురించి చెప్పాడు. దాన్యెల్ ఏమంటున్నాడంటే, “దేవునికి నమ్మకంగా ఉండాలంటే ఆమెకు ఉత్తరాలు రాయడం మానేయాలని నేను అర్థంచేసుకునేలా ఆ పెద్ద నాకు సహాయం చేశాడు. ఎంతో ప్రార్థించి, ఎన్నో కన్నీళ్లు విడిచాక ఆ పెద్ద చెప్పినట్లు చేశాను. కొంతకాలానికే నేను పరిచర్యను మరింత ఆనందంగా చేయగలిగాను.” ఇప్పుడు దాన్యెల్ యెహోవాను ప్రేమించే అమ్మాయిని పెళ్లిచేసుకుని, ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్నాడు.
దేవునికి నమ్మకంగా ఉంటే దయ చూపిస్తాం
13. దావీదు పాపం చేసినప్పుడు, నాతాను యెహోవాకు అలాగే దావీదుకు ఎలా నమ్మకంగా ఉన్నాడు?
13 మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, ఇతరులకు కూడా నమ్మకంగా ఉండవచ్చు, వాళ్లు కూడా నమ్మకంగా ఉండడానికి చేతనైనంత సహాయం చేస్తాం. నాతాను ప్రవక్త యెహోవాకు అలాగే దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఊరియా భార్యతో వ్యభిచారం చేసి అతన్ని చంపించిన తర్వాత, దావీదును గద్దించడానికి యెహోవా నాతానును పంపించాడు. నాతాను ధైర్యంగా యెహోవా చెప్పినట్టే చేశాడు. అదేసమయంలో ఆయన తెలివిగా, దయగా ప్రవర్తించాడు. దావీదు ఎంత ఘోరమైన పాపాలు చేశాడో అర్థం చేసుకోవడానికి నాతాను సహాయం చేయాలనుకున్నాడు. అందుకే ఆయన ఓ పేదవానికి ఉన్న ఒక్కగానొక్క గొర్రెపిల్లను దొంగిలించిన ధనవంతుని ఉపమానం చెప్పాడు. అది విన్న దావీదుకు ధనవంతుని మీద కోపం వచ్చింది. అప్పుడు నాతాను, “ఆ మనుష్యుడవు నీవే” అని అంటాడు. దాంతో యెహోవా ఎదుట పాపం చేశానని దావీదు గ్రహిస్తాడు.—2 సమూ. 12:1-7, 13.
14. దయగా ఉండడం ద్వారా యెహోవాకు అలాగే మీరు ప్రేమించేవాళ్లకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?
14 మీరు దయగా ఉండడం వల్ల మొదట యెహోవాకు ఆ తర్వాత ఇతరులకు నమ్మకంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఓ సహోదరుడు ఘోరమైన పాపం చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉంది. ఆ వ్యక్తికి మీరు నమ్మకంగా ఉండాలనుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి మీ సన్నిహిత స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడో అయితే ఆ భావన మరీ బలంగా ఉంటుంది. అయితే, వాళ్లకన్నా యెహోవాకు నమ్మకంగా ఉండడమే ప్రాముఖ్యమని మీకు తెలుసు. కాబట్టి, నాతానులాగే యెహోవాకు లోబడండి, కానీ మీ సహోదరునితో దయగా ఉండండి. సంఘపెద్దల సహాయం తీసుకోమని, త్వరగా వెళ్లి వాళ్లతో మాట్లాడమని ఆ వ్యక్తితో చెప్పండి. ఒకవేళ అతను అలా చేయకపోతే, మీరే వెళ్లి పెద్దలకు చెప్పాలి. ఇలా చేయడం ద్వారా మీరు యెహోవాకు నమ్మకంగా ఉంటారు. అదే సమయంలో మీ సహోదరునితో దయగా ప్రవర్తించినవాళ్లౌతారు. ఎందుకంటే యెహోవాతో మళ్లీ మంచి సంబంధం కలిగివుండడానికి పెద్దలు అతనికి సహాయం చేస్తారు. వాళ్లు ఆ వ్యక్తి మీద కోప్పడకుండా, అతన్ని దయగా సరిదిద్దుతారు.—లేవీయకాండము 5:1; గలతీయులు 6:1 చదవండి.
దేవునికి నమ్మకంగా ఉండాలంటే మనకు ధైర్యం అవసరం
15, 16. దేవునికి నమ్మకంగా ఉండడానికి హూషైకి ధైర్యం ఎందుకు అవసరమైంది?
15 దావీదు నమ్మకమైన స్నేహితుల్లో హూషై ఒకడు. ప్రజలు అబ్షాలోమును రాజుగా చేయాలనుకున్నప్పుడు, దావీదుకు అలాగే దేవునికి నమ్మకంగా ఉండడానికి హూషైకి ధైర్యం అవసరమైంది. అబ్షాలోము తన సైనికులను వెంటబెట్టుకొని యెరూషలేముకు వచ్చాడని, దావీదు అక్కడినుండి పారిపోయాడని హూషైకి తెలుసు. (2 సమూ. 15:13; 16:15) మరి అతను ఏమి చేశాడు? అతను దావీదును విడిచిపెట్టి, అబ్షాలోముకు మద్దతిచ్చాడా? లేదు. దావీదు ముసలివాడైనా, ఆయనను ఎంతోమంది చంపాలని చూస్తున్నా హూషై మాత్రం ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే దావీదును యెహోవా రాజుగా చేశాడు. అందుకే, దావీదును కలుసుకోవడానికి అతను ఒలీవ కొండమీదకు వెళ్లాడు.—2 సమూ. 15:30, 32.
16 దావీదు హూషైని తిరిగి యెరూషలేముకు వెళ్లిపోయి, అబ్షాలోముతో స్నేహం చేస్తున్నట్టు నటించమని చెప్పాడు. అలా చేస్తే అబ్షాలోము అహీతోపెలు మాట కాకుండా హూషై మాట వినే అవకాశం ఉంది. హూషై తన ప్రాణాన్ని పనంగాపెట్టి దావీదు మాట ప్రకారం అక్కడికి వెళ్లాడు. అలా హూషై యెహోవాకు నమ్మకంగా ఉన్నాడని చూపించాడు. అతనికి సహాయం చేయమని దావీదు యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఆ ప్రార్థన విన్నాడు, అబ్షాలోము అహీతోపెలు మాట వినకుండా హూషై మాట విన్నాడు.—2 సమూ. 15:31; 17:14.
17. నమ్మకంగా ఉండడానికి మనకు ధైర్యం ఎందుకు అవసరం?
17 మన కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు లేదా ప్రభుత్వ అధికారులు కోరేది చేయకుండా యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన మాట వినాలంటే మనకు ధైర్యం అవసరం. ఉదాహరణకు, జపాన్‌లో ఉంటున్న తారో అనే సహోదరుడు చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేశాడు. వాళ్లు చెప్పింది చేశాడు, వాళ్లకు నమ్మకంగా ఉన్నాడు. ఏదో చేయాలి కాబట్టి అతను అలా చేయలేదు కానీ వాళ్ల మీద ప్రేమతో అలా చేశాడు. అయితే, ఆయన యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, వాళ్ల తల్లిదండ్రులు స్టడీ ఆపేయమన్నారు. అతనికి చాలా బాధనిపించింది, మీటింగ్స్‌కి వెళ్లడానికి నిర్ణయించుకున్నానని చెప్పడం అతనికి చాలా కష్టమనిపించింది. తారో ఇలా అంటున్నాడు, “వాళ్లకు నా మీద ఎంత కోపమొచ్చిందంటే కొన్ని సంవత్సరాల వరకు నన్ను ఇంటికి రానివ్వలేదు. నా నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాను. ఇప్పుడు వాళ్ల కోపం తగ్గింది, నేను వాళ్లను చూడడానికి ఇంటికి వెళ్లవచ్చు.”—సామెతలు 29:25 చదవండి.
18. ఈ ఆర్టికల్ నుండి మీరు ఎలాంటి ప్రయోజనం పొందారు?
18 దావీదు, యోనాతాను, నాతాను, హూషైలలాగే మనం కూడా, యెహోవాకు నమ్మకంగా ఉండడం వల్ల వచ్చే సంతృప్తిని అనుభవిద్దాం. నమ్మకంగాలేని అబ్నేరు, అబ్షాలోముల్లా మనం ఎన్నటికీ ఉండాలనుకోం. మనం అపరిపూర్ణులం, పొరపాట్లు చేస్తాం అన్నది నిజం. కానీ మన జీవితంలో యెహోవాకు నమ్మకంగా ఉండడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని చూపిద్దాం.
^ [1] (7వ పేరా) అసలు పేర్లు కావు.