కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను ఆనందంగా సేవిస్తూ ఉండండి

యెహోవాను ఆనందంగా సేవిస్తూ ఉండండి

మీ జీవితంలో అన్నిటికన్నా సంతోషకరమైన రోజు ఏదో ఒక్కసారి గుర్తుచేసుకోండి. అది మీ పెళ్లి రోజా? మీ మొదటి బిడ్డ పుట్టిన రోజా? లేదా మీరు బాప్తిస్మం తీసుకున్న రోజా? బహుశా మీరు బాప్తిస్మం తీసుకున్న రోజే మీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైన, సంతోషకరమైన రోజు అయ్యుంటుంది. మీరు యెహోవాను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమిస్తున్నారని అందరి ముందు తెలియజేయడం చూసి మీ తోటి సహోదరసహోదరీలు ఆ రోజు ఎంతో సంతోషించి ఉంటారు.—మార్కు 12:30.

బాప్తిస్మం తీసుకున్న రోజు నుండి యెహోవా సేవచేస్తూ మీరు ఎంతో ఆనందాన్ని పొందివుంటారు. కానీ, కొంతమంది ప్రచారకులు అంతకుముందు సేవ చేసినంత ఆనందంగా ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఎందుకు? యెహోవాకు ఆనందంగా సేవచేస్తూ ఉండడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి?

కొంతమంది ఆనందాన్ని ఎందుకు కోల్పోయారు?

దేవుని రాజ్యసువార్త మనకు చెప్పలేనంత ఆనందాన్నిస్తుంది. ఎందుకు? ఎందుకంటే, ఆ రాజ్యం త్వరలోనే ఈ దుష్టలోకాన్ని నాశనం చేసి కొత్త లోకాన్ని స్థాపిస్తుందని యెహోవా మాటిచ్చాడు. అయితే, “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది” అని జెఫన్యా 1:14 చెప్తుంది. కానీ దానికోసం మనం అనుకున్న దానికన్నా ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వస్తుందనిపిస్తే, మనం ఒకప్పుడున్న ఆనందాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల దేవుని సేవను ఉత్సాహంగా చేయలేకపోతాం.—సామె. 13:12.

తోటి సహోదరసహోదరీలతో సమయం గడిపితే, యెహోవా సేవను ఆనందంగాచేస్తూ ఉండాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం. యెహోవా ప్రజల మంచి ప్రవర్తన వల్ల మనం నిజమైన ఆరాధన ఏదో తెలుసుకుని, యెహోవాను ఆనందంగా సేవచేయడం మొదలుపెట్టాం. (1 పేతు. 2:12) కానీ మన సహోదరసహోదరీలు ఎవరైనా దేవుని ఆజ్ఞల్ని పాటించనందుకు గద్దింపును పొందినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? దానివల్ల సంఘంలోని కొంతమంది నిరుత్సాహపడి, తమ ఆనందాన్ని కోల్పోవచ్చు.

వస్తుసంపదల మీద ఇష్టంవల్ల కూడా మన ఆనందాన్ని పోగొట్టుకుంటాం. ఎలా? మనకు నిజంగా అవసరంలేని వస్తువులు మనకు అవసరమని నమ్మించడానికి సాతాను లోకం ప్రయత్నిస్తుంది. అందుకే, “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అని యేసు చెప్పిన మాటలను మనం గుర్తుచేసుకోవచ్చు. (మత్త. 6:24) ఒకవైపు ఈ లోకంలో ఉన్నవాటన్నిటినీ సంపాదించడానికి ప్రయత్నిస్తూ, మరోవైపు యెహోవా సేవను ఆనందంగా చేయలేం.

యెహోవా సేవను ఆనందంగా చేయడం

యెహోవాను ప్రేమించేవాళ్లకు ఆయన సేవ భారంగా అనిపించదు. (1 యోహా. 5:3) యేసు ఏమి చెప్పాడో గుర్తుచేసుకోండి. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్త. 11:28-30) నిజ క్రైస్తవునిగా జీవించడం మనకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. మనం యెహోవా సేవలో ఆనందించడానికి మంచి కారణాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాటిలో మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.—హబ. 3:18.

జీవదాత, సంతోషంగల దేవుడు అయిన యెహోవాను మనం సేవిస్తున్నాం. (అపొ. 17:28; 1 తిమో. 1:8-11) మనకు జీవాన్నిచ్చిన సృష్టికర్తకు రుణపడి ఉన్నామని మనకు తెలుసు. కాబట్టి మనం బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలైనప్పటికీ యెహోవాకు ఆనందంగా సేవచేస్తూ ఉందాం.

ఎక్‌టోర్‌, దేవుని రాజ్యంలో పొందబోయే వాటి గురించి ఆలోచిస్తూ, పరిచర్యను ఉత్సాహంగా చేయడం ద్వారా తన ఆనందాన్ని కోల్పోకుండా చూసుకుంటున్నాడు

40 సంవత్సరాలపాటు ప్రయాణ పర్యవేక్షకునిగా సేవచేసిన ఎక్‌టోర్‌ అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. “ముసలితనమందు” కూడా ఆయన యెహోవా సేవను ఆనందంగా చేస్తున్నాడు. (కీర్త. 92:12-15) తన భార్య ఆరోగ్యం పాడవ్వడంవల్ల ఆయన ఎక్కువగా సేవ చేయలేకపోతున్నాడు, కానీ ఆయన తన ఆనందాన్ని మాత్రం కోల్పోలేదు. ఆయన ఇలా అంటున్నాడు, “నా భార్య ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడం చూస్తుంటే నాకు బాధగా ఉంది, ఆమె బాగోగులు చూసుకోవడం కూడా కష్టంగా ఉంది. కానీ దానివల్ల సత్య దేవుణ్ణి సేవించడం ద్వారా కలిగే ఆనందాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకున్నాను. మనిషిని ఒక సంకల్పంతో సృష్టించిన యెహోవాకు నేను రుణపడి ఉన్నానని తెలుసుకోవడం, ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తూ, పూర్ణహృదయంతో సేవించడానికి ఒక కారణాన్ని ఇచ్చింది. నేను ప్రకటనా పనిని ఎప్పుడూ ఉత్సాహంగా చేయడానికి కృషిచేస్తాను. అంతేకాదు నా ఆనందాన్ని కోల్పోకుండా ఉండడానికి, దేవుని రాజ్యంలో నేను పొందబోయే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడానికి ప్రయత్నిస్తాను.”

మన జీవితాన్ని ఆనందంగా గడిపేలా యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. నిజానికి, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహా. 3:16) కాబట్టి దేవుడు ప్రేమతో చేసిన ఆ ఏర్పాటుపట్ల విశ్వాసం చూపించినప్పుడు మన పాపాలకు క్షమాపణే కాకుండా నిత్యజీవాన్ని కూడా పొందుతాం. మనం దేవునిపట్ల కృతజ్ఞత చూపించడానికి ఇదొక చక్కని కారణం. ఆ కృతజ్ఞతా భావమే యెహోవాకు ఆనందంగా సేవచేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది.

కెసూస్‌ సాదాసీదాగా జీవిస్తూ సంవత్సరాలపాటు యెహోవా సేవను ఆనందంగా చేశాడు

మెక్సికోలో ఉంటున్న కెసూస్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “నేను నా ఉద్యోగమే లోకంగా బ్రతికేవాణ్ణి, కొన్నిసార్లు అవసరం లేకపోయినా వరుసగా ఐదు షిఫ్టులు పని చేసేవాణ్ణి. కేవలం ఎక్కువ డబ్బు సంపాదించాలనే అలా చేసేవాణ్ణి. కొంతకాలానికి నేను యెహోవా గురించి, ఆయన తనకు ఇష్టమైన కొడుకును మనుషులందరి కోసం బలి అర్పించడం గురించి నేర్చుకున్నాను. దాంతో ఆయనకు సేవచేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. అందుకే యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను కంపెనీలో 28 ఏళ్లు పనిచేశాను, ఆ తర్వాత ఉద్యోగాన్ని మానేసి పూర్తికాల సేవ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను.” అప్పటినుండి ఆ సహోదరుడు యెహోవాను సంతోషంగా సేవిస్తున్నాడు.

మన మంచి ప్రవర్తన మనకు ఆనందాన్నిస్తుంది. యెహోవా గురించి నేర్చుకోకముందు మీ జీవితం ఎలా ఉండేదో మీకు గుర్తుందా? రోములోని క్రైస్తవులు “పాపమునకు దాసులై” ఉండేవాళ్లు కానీ ఆ తర్వాత “నీతికి దాసులు” అయ్యారని అపొస్తలుడైన పౌలు వాళ్లకు గుర్తుచేశాడు. అంటే వాళ్లు మంచి ప్రవర్తనతో జీవిస్తున్నారు కాబట్టి నిత్యజీవం కోసం ఎదురుచూడవచ్చు. (రోమా. 6:17-22) మనం కూడా యెహోవా ప్రమాణాలు పాటిస్తున్నాం కాబట్టి, తప్పుడు పనులు లేదా చెడు జీవన విధానంవల్ల కలిగే బాధను తప్పించుకుంటున్నాం. మనం ఆనందించేందుకు ఎంత మంచి కారణమో కదా!

“యెహోవా సేవలో గడిపిన సంవత్సరాలే నా జీవితంలో అన్నిటికన్నా సంతోషకరమైన కాలం.”—కాయీమె

ఒకప్పుడు నాస్తికుడు, పరిణామ సిద్ధాంతవాది, బాక్సర్‌ అయిన కాయీమె అనే సహోదరుని అనుభవం చూడండి. ఆయన మన మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టాడు, అక్కడ సహోదరసహోదరీల మధ్య ఉన్న ప్రేమను చూసి ముగ్ధుడయ్యాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి తనపై నమ్మకం ఉంచేందుకు సహాయం చేయమని కాయీమె యెహోవాను అడిగాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, “ప్రేమగల తండ్రి, కనికరంగల దేవుడు నిజంగా ఉన్నాడని మెల్లమెల్లగా తెలుసుకున్నాను. యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం నాకు కాపుదలను ఇచ్చింది. నా పాత జీవితాన్ని విడిచిపెట్టకపోయుంటే, బాక్సింగ్‌లో చనిపోయిన నా స్నేహితుల్లాగే నేనూ చనిపోయి ఉండేవాణ్ణి. యెహోవా సేవలో గడిపిన సంవత్సరాలే నా జీవితంలో అన్నిటికన్నా సంతోషకరమైన కాలం.”

మీ ప్రయత్నాల్ని ఆపకండి

ఈ దుష్టలోక అంతం కోసం ఎదురుచూస్తుండగా మనం ఎలా భావించాలి? మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నామని, నిత్యజీవం కోసం ఎదురుచూస్తున్నామని గుర్తుపెట్టుకోండి. అందుకే, “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” (గల. 6:8, 9) యెహోవా దేవుని సహాయంతో మనకు వచ్చే కష్టాల్ని సహిస్తూ, మహాశ్రమల్ని తప్పించుకోవడానికి కావాల్సిన లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి కృషిచేద్దాం. అలాగే యెహోవాను ఆనందంగా సేవిస్తూ ఉందాం.—ప్రక. 7:9, 13, 14; యాకో. 1:2-4.

కష్టాల్ని సహిస్తే యెహోవా మనకు తప్పకుండా బహుమానం ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే మనం యెహోవా కోసం, ఆయన నామం కోసం చేసే పనిని, చూపించే ప్రేమను ఆయన చూస్తున్నాడు. మనం యెహోవా సేవను ఆనందంగా చేస్తూ ఉంటే కీర్తనకర్త దావీదుకున్న నమ్మకమే మనకూ ఉంటుంది. ఆయనిలా అన్నాడు, “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది.”—కీర్త. 16:8, 9.