కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

లక్షలమందికి పరిచయం ఉన్న సౌండ్‌ కారు

లక్షలమందికి పరిచయం ఉన్న సౌండ్‌ కారు

“బ్రెజిల్‌లో దేవుని సేవ చేసే సౌండ్‌ కారు ఒక్కటి మాత్రమే ఉంది. అది ‘ద వాచ్‌ టవర్‌ సౌండ్‌ కారుగా’ లక్షలమందికి తెలుసు.”—నతాన్‌యల్‌ ఆల్‌స్టన్‌ యూల్‌, 1938⁠లో.

బ్రెజిల్‌లో, 1930 తొలినాళ్లలో రాజ్యసంబంధ పనులు అంతంతమాత్రంగానే జరిగేవి. అయితే 1935⁠లో నతాన్‌యల్‌, మోడ్‌ యూల్‌ అనే పయినీరు దంపతులు, అప్పట్లో ప్రకటనాపనికి నాయకత్వం వహిస్తున్న సహోదరుడు జోసెఫ్‌​. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌​కు ఓ ఉత్తరం రాశారు. స్వచ్ఛందంగా ప్రకటనాపని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, “ఎక్కడికి పంపించినా సంతోషంగా వెళ్తామని” వాళ్లు ఆ ఉత్తరంలో తెలిపారు.

సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన నతాన్‌యల్‌కు అప్పుడు 62 ఏళ్లు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కోలోని యెహోవాసాక్షుల సంఘానికి సేవా నిర్దేశకునిగా పనిచేశాడు. అక్కడ ఆయన ప్రకటనా పనిని నడిపిస్తూ, సువార్తను ప్రకటించడానికి సౌండ్‌ పరికరాలను ఉపయోగించాడు. ఆ తర్వాత ఆయన్ను వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్న విస్తార ప్రాంతమైన బ్రెజిల్‌కు బ్రాంచి సేవకునిగా నియమించారు. ఆయనకున్న అనుభవం, సేవచేయడానికి ముందుండే స్ఫూర్తి తన కొత్త నియామకానికి ఓ దీవెనగా మారాయి.

నతాన్‌యల్‌, మోడ్‌లు తమ తోటి పయినీరు, అనువాదకుడైన ఆన్‌టోన్యూ పి. ఆన్‌డ్రాడీతో కలిసి 1936⁠లో బ్రెజిల్‌కు వచ్చారు. వాళ్లు తమతోపాటు కొన్ని విలువైన వస్తువుల్ని కూడా తెచ్చుకున్నారు. అవేమిటంటే, 35 ఫోనోగ్రాఫులు, ఓ సౌండ్‌ కారు. విస్తీర్ణంపరంగా ప్రపంచంలో ఐదవ పెద్ద దేశమైన బ్రెజిల్‌లో అప్పటికి 60 మంది ప్రచారకులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ నతాన్‌యల్‌ బృందం తెచ్చుకున్న సరికొత్త సౌండ్‌ పరికరాలు, కొన్ని సంవత్సరాల్లోనే లక్షలమందికి రాజ్యసువార్త చేరవేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయి.

యూల్‌ దంపతులు వచ్చిన ఒక నెల తర్వాత, బ్రెజిల్‌ దేశ మొదటి సేవా సమావేశాన్ని, బ్రాంచి కార్యాలయం సావోపాలో అనే నగరంలో ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో భాగంగా సహోదరసహోదరీలు కొంత సమయం పరిచర్య కూడా చేసేవాళ్లు. అయితే మోడ్‌, సౌండ్‌ కారులో బహిరంగ ప్రసంగం గురించి చెప్తూ వెళ్లింది, దానివల్ల ఆ సమావేశానికి 110 మంది వచ్చారు. ఆ సమావేశ కార్యక్రమం, ప్రచారకుల్లో ఎంత నమ్మకాన్నీ ఉత్సాహాన్నీ పెంచిందంటే వాళ్లు ప్రకటనాపనిలో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ప్రచురణలు అలాగే సాక్ష్యపు కార్డులతోపాటు ఫోనోగ్రాఫ్‌ రికార్డింగుల సహాయంతో ఎలా ప్రకటించాలో నేర్చుకున్నారు. మొదట్లో ఫోనోగ్రాఫ్‌ రికార్డింగులు ఇంగ్లీషు, జర్మన్‌, హంగేరియన్‌, పోలిష్‌, స్పానిష్‌ భాషల్లో అందుబాటులో ఉండేవి. కొంతకాలానికి అవి పోర్చుగీస్‌ భాషలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ సౌండ్‌ కారును బ్రెజిల్‌లోని లక్షలమందికి సువార్త చేరవేయడానికి ఉపయోగించారు

సావోపాలో, రియోడిజనీరో, కురిటిబా ప్రాంతాల్లో 1937⁠లో జరిగిన మూడు సేవా సమావేశాలు, ప్రకటనాపనిని ఊపందుకునేలా చేశాయి. సమావేశానికి హాజరైనవాళ్లు సౌండ్‌ కారును ఇంటింటి పరిచర్యలో ఉపయోగించారు. ఆ పనిలో జూజె మగ్లోవ్‌స్కీ అనే అబ్బాయి కూడా భాగం వహించాడు. కొంతకాలం తర్వాత అతను ఇలా రాశాడు, “మేము బైబిలు ప్రచురణల్ని ఓ స్టాండ్‌ మీద పెట్టి సౌండ్‌ కారులో రికార్డు చేసి ఉంచిన ప్రసంగాన్ని వినిపించేవాళ్లం. ఏమి జరుగుతుందో చూడడానికి ఇళ్ల నుండి బయటికొచ్చేవాళ్లతో మేం మాట్లాడేవాళ్లం.”

ప్రజలు నదుల్లో స్నానం చేసి వెచ్చదనం కోసం ఆ పక్కనే ఎండలో పడుకునేవాళ్లు. ఆ నదుల్లోనే సహోదరులు బాప్తిస్మం ఇచ్చేవాళ్లు. సౌండ్‌ కారు ఉపయోగించి సువార్త ప్రకటించడం ఎంత మంచి అవకాశమో! సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇస్తున్న బాప్తిస్మ ప్రసంగంతో స్పీకర్లు దద్దరిల్లిపోయాయి. ఆ ప్రసంగాన్ని పోర్చుగీస్‌ భాషలోకి అనువదిస్తుండగా ఆసక్తిగల ప్రజలు కారు చుట్టూ గుమికూడి విన్నారు. ప్రసంగం తర్వాత బాప్తిస్మం తీసుకునేవాళ్లు పోలిష్‌ భాషలో రికార్డు చేసిన రాజ్యగీతాలు వినడంలో లీనమైపోయారు. సహోదరసహోదరీలు ఆ సంగీతానికి వేర్వేరు భాషల్లో గొంతుకలిపారు. ‘పెంతెకొస్తు రోజున ప్రజలు తమ సొంత భాషలో సువార్తను విని అర్థంచేసుకున్న సందర్భాన్ని అది గుర్తుచేసింది’ అని 1938 వార్షిక పుస్తకం నివేదించింది.

సమావేశాల తర్వాత, సహోదరులు ప్రతీ ఆదివారం ఎండనకా వాననకా సావోపాలోలోని పార్కులు, ఇళ్లు, ఫ్యాక్టరీల దగ్గర అలాగే దాని చుట్టుపక్కల పట్టణాల్లో, రికార్డు చేసిన బైబిలు ప్రసంగాల్ని సౌండ్‌ కారులో వినిపించేవాళ్లు. అంతేకాదు సావోపాలోకి 97 కి.మీ. వాయువ్యాన ఉన్న ఓ కాలనీలో 3,000 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్లకు ప్రతీనెల సౌండ్‌ కారులో ప్రసంగాల్ని వినిపించేవాళ్లు. కొంతకాలానికే అక్కడ ఓ సంఘం కూడా తయారైంది. అక్కడున్న రాజ్య ప్రచారకులు అంత భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, తమలాంటి వ్యాధితో ఉన్న మరో కాలనీవాళ్లను కలిసి బైబిలు సందేశాన్ని పంచుకోవడానికి అనుమతి సంపాదించారు.

1938వ సంవత్సరం చివర్లో, రాజ్య గీతాల రికార్డింగులు పోర్చుగీస్‌ భాషలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ ఆల్‌ సోల్స్‌ డే రోజున “చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు?,” “యెహోవా,” “సంపదలు” అనే రికార్డింగులను సౌండ్‌ కారులో ప్లే చేస్తూ శ్మశానాలన్నిటి దగ్గరికి సాక్షులు వెళ్లేవాళ్లు. అలా అక్కడికి వచ్చిన 40,000 మందికి వాళ్లు సాక్ష్యమివ్వగలిగారు.

సహోదరసహోదరీలు ధైర్యంగా బైబిలు సత్యాల్ని ప్రకటించడం చూసి అక్కడి మతనాయకులు మండిపడ్డారు. కొన్నిసార్లయితే సౌండ్‌ కారును అడ్డుకోమని స్థానిక అధికారులపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఓ స్థానిక మతనాయకుడైతే సౌండ్‌ కారును చుట్టుముట్టడానికి కొంతమంది మనుషుల్ని పంపించాడని సహోదరి యూల్‌ గుర్తుచేసుకుంటోంది. అయితే ఆ సమయానికి మేయర్‌, పోలీసు అధికారులు వచ్చి రికార్డింగ్‌ అంతటినీ విన్నారు. మేయర్‌ కొన్ని ప్రచురణల్ని కూడా తీసుకున్నాడు. దాంతో ఆ రోజున ఏ అల్లరి జరగలేదు. అంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ, 1939వ సంవత్సరం “గొప్ప దేవుని గురించి, ఆయన నామం గురించి ప్రకటించడానికి చాలా మంచి సమయం” అని 1940 వార్షిక పుస్తకం చెప్పింది.

నిజంగానే, “ద వాచ్‌ టవర్‌ సౌండ్‌ కారు” బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రకటనాపనిని ఓ మలుపు తిప్పింది. రాజ్య సువార్తను లక్షలమందికి చేరవేయడానికి అది చాలా ఉపయోగపడింది. ఆ కారును 1941⁠లో అమ్మేసినప్పటికీ, ఎంతోమంది సాక్షులు బ్రెజిల్‌లోని మంచి మనసున్నవాళ్లకు రాజ్యసువార్తను ప్రకటించడంలో కొనసాగుతున్నారు.—బ్రెజిల్‌ నుండి సేకరించినవి.