కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

తన సేవలో విజయం సాధించేందుకు యెహోవా నాకు సాయం చేశాడు

తన సేవలో విజయం సాధించేందుకు యెహోవా నాకు సాయం చేశాడు

యుద్ధంలో పాల్గొననందుకు నేను ఇదివరకే జైలుకు వెళ్లానని ఆఫీసర్‌కు చెప్పి, “నన్ను మళ్లీ జైలుకు పంపిస్తారా?” అని ఆయన్ను అడిగాను. సైన్యంలో చేరమని ప్రభుత్వం నన్ను అడగడం ఇది రెండోసారి.

నేను 1926⁠లో, అమెరికాలోని ఒహాయోలో ఉన్న క్రూక్స్‌విలలో పుట్టాను. మేము ఎనిమిది మంది పిల్లలం. మా అమ్మానాన్నలకు మతం అంటే పెద్దగా ఆసక్తిలేకపోయినా, మమ్మల్ని మాత్రం చర్చికి వెళ్లమనేవాళ్లు. నేను మెథడిస్ట్‌ చర్చికి వెళ్లేవాడిని. నాకు 14 ఏళ్లున్నప్పుడు, ఏడాదిలో ఒక్క ఆదివారం కూడా మానకుండా చర్చికి వెళ్లినందుకు పాస్టర్‌ నాకు ఓ బహుమతి ఇచ్చాడు.

నాకు సత్యం పరిచయం చేసిన మార్గరెట్‌ వాకర్‌ (ఎడమ నుండి రెండో సహోదరి)

అప్పటికి మా ఇంటి పక్కన ఉండే మార్గరెట్‌ వాకర్‌ అనే ఓ యెహోవాసాక్షి మా అమ్మను కలిసి బైబిల్లోని విషయాలు చెప్తుండేది. ఓ రోజు నేను కూడా అమ్మతోపాటు కూర్చుని ఆమె ఏమి చెప్తుందో విందామనుకున్నాను. కానీ ఆమెను విననివ్వకుండా అల్లరి చేస్తానేమోనని అమ్మ నన్ను బయటికి వెళ్లమంది. అయినాసరే వాళ్లు మాట్లాడుకునే విషయాలు వినడానికి ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. కొన్నిరోజుల తర్వాత మార్గరెట్‌ నన్ను, “నీకు దేవుని పేరు తెలుసా?” అని అడిగింది. “ఆయన పేరు దేవుడు అని అందరికీ తెలుసు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు మార్గరెట్‌, “నీ బైబిలు తెచ్చుకుని, కీర్తన 83:18 చూడు” అని చెప్పింది. అలా నేను, దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నాను. ఆ తర్వాత వెంటనే నా స్నేహితుల దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు రాత్రి ఇంటికెళ్లాక, కీర్తన 83:18 చదివి దేవుని పేరేమిటో తెలుసుకోండి” అని చెప్పాను. ఓ విధంగా, నేను సత్యం తెలుసుకున్న రోజు నుండే ప్రకటనాపని చేయడం మొదలుపెట్టాను.

నేను స్టడీ తీసుకుని 1941⁠లో బాప్తిస్మం పొందాను. ఆ తర్వాత కొద్దిరోజులకే నాకు సంఘ పుస్తక అధ్యయనం చేసే నియామకం వచ్చింది. దాన్ని చూడడానికి రమ్మని మా అమ్మను, తోబుట్టువులను కూడా పిలిచేవాణ్ణి. అలా వాళ్లు నేను నిర్వహించే పుస్తక అధ్యయనానికి వచ్చేవాళ్లు. కానీ నాన్నకు మాత్రం ఆసక్తి ఉండేదికాదు.

ఇంట్లో వ్యతిరేకత

నాకు సంఘంలో మరిన్ని బాధ్యతలు అప్పగించారు, సాక్షులు ప్రచురించిన ఎన్నో పుస్తకాల్ని సేకరించాను కూడా. ఓరోజు నాన్న ఆ పుస్తకాల వైపు చూపిస్తూ, “ఇవేవీ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాటితోపాటు నువ్వు కూడా వెళ్లొచ్చు” అని అన్నాడు. ఇక నేను ఇంట్లో నుండి వచ్చేసి ఒహాయోలోని జాన్జ్‌విల దగ్గర్లో ఇల్లు తీసుకుని ఉండేవాణ్ణి. కానీ నా కుటుంబసభ్యుల్ని ప్రోత్సహించడానికి అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుండేవాణ్ణి.

అమ్మను మీటింగ్స్‌కు వెళ్లనివ్వకుండా చేయాలని నాన్న చాలా ప్రయత్నించేవాడు. కొన్నిసార్లయితే ఆమె మీటింగ్‌కు వెళ్తున్నప్పుడు, నాన్న ఆమె వెనకాలే వెళ్లి ఇంటికి లాక్కొచ్చేవాడు. అయినాసరే అమ్మ మరో గుమ్మం నుండి తప్పించుకుని మీటింగ్‌కి వెళ్లిపోయేది. ఓసారి అమ్మతో నేనిలా అన్నాను, “దిగులుపడకు. నీ వెనుక పరుగెత్తి, పరుగెత్తి నాన్న అలసిపోతాడు.” అనుకున్నట్లుగానే, కొంతకాలానికి నాన్న ఆమెను అడ్డుకోవడం మానేశాడు. దాంతో అమ్మ ఏ ఇబ్బందీ లేకుండా మీటింగ్స్‌కు వెళ్లేది.

దైవపరిపాలనా పాఠశాల 1943⁠లో మొదలైనప్పుడు, నేను సంఘంలో విద్యార్థి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రసంగం ఇచ్చిన తర్వాత సహోదరులు నాకు ఇచ్చిన సలహాలు, నేను మంచి ప్రసంగీకుణ్ణి అవ్వడానికి సహాయం చేశాయి.

సైన్యంలో చేరకపోవడం

1944⁠లో అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, సైన్యంలో చేరమంటూ నాకు పిలుపు వచ్చింది. నేను ఒహాయోలోని కొలంబస్‌లో ఉన్న ఫోర్ట్‌ హేజ్‌ మిలటరీ క్యాంపుకు వెళ్లాను. అక్కడ నాకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహించారు, కొన్ని పేపర్లలో నా గురించిన వివరాలు కూడా నింపాను. నాకు సైన్యంలో చేరడం ఇష్టంలేదని అక్కడున్న ఆఫీసర్లకు చెప్పాను, దాంతో వాళ్లు నన్ను ఇంటికి వెళ్లిపొమ్మన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఓ ఆఫీసర్‌ మా ఇంటికి వచ్చి, “కార్వన్‌ రాబ్సన్‌, నిన్ను అరెస్ట్‌ చేయమని నోటీసు వచ్చింది” అని అన్నాడు.

ఆ తర్వాత రెండు వారాలకు నన్ను కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ జడ్జి, “నన్నడిగితే నీకు జీవిత ఖైదు విధించాలి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని అడిగాడు. అందుకు నేను, “యువర్‌ ఆనర్‌, నన్ను ఒకరకంగా పాస్టరు అని చెప్పవచ్చు. ప్రతీ ఇంటి గుమ్మం నాకు ఓ వేదిక. అలా నేను చాలామందికి రాజ్యసువార్తను ప్రకటించాను.” నా వాదన విన్న తర్వాత జడ్జి న్యాయనిర్ణేతలతో ఇలా అన్నాడు, “ఈ యువకుడు పాస్టరా కాదా అన్నది ఇప్పుడు సమస్య కాదు. ఇతను సైన్యంలో చేరుతున్నాడా లేదా అనేదే ఇప్పుడు నిర్ణయించాల్సిన విషయం.” అరగంట అవ్వకముందే, నేను దోషినని జడ్జి తీర్పునిచ్చి కెంటకీలోని యాష్‌లాండ్‌లో ఉన్న జైల్లో ఐదేళ్ల శిక్ష విధించాడు.

జైల్లో యెహోవా నన్ను కాపాడడం

మొదటి రెండు వారాలు నన్ను ఒహాయోలోని కొలంబస్‌లో ఉన్న జైల్లో ఉంచారు. మొదటి రోజు నా జైలు గది నుండి నేను అస్సలు బయటికి రాలేదు. ఆ సమయంలో నేను యెహోవాకు ఇలా ప్రార్థించాను, “ఐదేళ్లు నేనిలా జైలు గదిలో ఉండలేను. నాకు ఏం చేయాలో అర్థంకావట్లేదు.”

ఆ తర్వాత రోజు, జైలు గార్డులు నన్ను నా గది నుండి బయటికి రావడానికి అనుమతిచ్చారు. నేను అలా నడుచుకుంటూ ఎత్తుగా ఆజానుబాహుడిలా ఉన్న ఓ ఖైదీ దగ్గరకు వెళ్లాను. మేము కిటికీలో నుండి బయటికి చూస్తూ నిలబడ్డాం. అప్పుడు ఆ వ్యక్తి నన్ను, “పొట్టోడా, నిన్ను జైల్లో ఎందుకు వేశారు?” అని అడిగాడు. అందుకు నేను, “నేనొక యెహోవాసాక్షిని” అని చెప్పాను. అప్పుడా వ్యక్తి, “అయితే ఏంటి? నిన్ను జైల్లో ఎందుకు వేశారు?” అని అడిగాడు. “యెహోవాసాక్షులు యుద్ధం చేయరు, మనుషుల్ని చంపరు” అని నేను చెప్పాను. దానికి అతను, “అయితే ప్రజల్ని చంపనందుకు నిన్ను జైల్లో వేశారన్నమాట. కానీ మిగతావాళ్లనేమో చంపినందుకు జైల్లో వేస్తారు. అసలు ఇందులో ఏమైనా అర్థముందా?” అని అన్నాడు. “అస్సలు అర్థంలేదు” అని జవాబిచ్చాను.

ఆ తర్వాత ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, “నేను 15 ఏళ్లపాటు వేరే జైల్లో ఉన్నాను. అక్కడ మీ ప్రచురణల్ని కొన్ని చదివాను.” ఆ మాట వినగానే నేను, “యెహోవా, ఈ వ్యక్తి నా వైపు ఉండేలా సహాయం చేయి” అని ప్రార్థించాను. అంతలో పాల్‌ అనే ఆ వ్యక్తి “ఇక్కడ ఉన్నవాళ్లెవరైనా నీ జోలికి వస్తే నన్ను పిలువు. వాళ్ల సంగతి నేను చూసుకుంటా” అని అన్నాడు. కాబట్టి నేను ఆ జైల్లో ఉన్నంతకాలం అక్కడున్న 50 మంది ఖైదీలతో నాకు ఏ సమస్యా ఎదురుకాలేదు.

యుద్ధంలో పాల్గొననందుకు కెంటకీలోని యాష్‌లాండ్‌ జైల్లో శిక్ష అనుభవించిన సాక్షుల్లో నేనూ ఒకడిని

కొంతకాలం తర్వాత జైలు అధికారులు నన్ను యాష్‌లాండ్‌లో ఉన్న జైలుకు మార్చారు. జైలు శిక్ష అనుభవిస్తున్న పరిణతిగల సహోదరులు కొంతమంది అప్పటికే అక్కడ ఉండడంతో వాళ్లను కలవగలిగాను. ఆ సహోదరులు, యెహోవాకు దగ్గరవ్వడానికి నాకూ ఇతరులకూ సహాయం చేశారు. అంతేకాదు వాళ్లు మాకు ప్రతీవారం కొన్ని బైబిలు అధ్యాయాలు చదవమని చెప్పేవాళ్లు. తర్వాత మేం గుంపులు గుంపులుగా విడిపోయేవాళ్లం, అప్పుడు కొంతమంది సహోదరులు మమ్మల్ని ఆ అధ్యాయాల మీద ప్రశ్నలు అడిగేవాళ్లు. అలా కలుసుకోవడాన్నే మేము బైబిల్‌ బీస్‌ అని పిలుచుకునేవాళ్లం. జైల్లో మేం ఉండే గది పెద్దగా ఉండేది, అందులో గోడకు ఆనుకుని పరుపులు ఉండేవి. ఓ సహోదరుడు మాకు పరిచర్య చేసేందుకు క్షేత్రాన్ని నియమించేవాడు. ఆయన నాకిలా చెప్పేవాడు, “రాబ్సన్‌, ఫలానా పరుపు నుండి ఫలానా పరుపు వరకు నీ క్షేత్రం. అక్కడికి ఎవ్వరు వచ్చినా వాళ్లకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. వాళ్లు వెళ్లేలోపే నువ్వు వాళ్లతో మాట్లాడేలా చూసుకో.” ఈ విధంగా మేం ఓ పద్ధతి ప్రకారం ప్రకటించేవాళ్లం.

జైలు బయట జీవితం

రెండవ ప్రపంచ యుద్ధం 1945⁠లో ముగిసింది. ఆ తర్వాత కూడా నేను కొంతకాలంపాటు జైల్లోనే ఉన్నాను. కానీ నా కుటుంబసభ్యుల గురించి నేను చాలా ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఎందుకంటే నాన్న నాతో, “ముందు నిన్ను వదిలించుకుంటే, మిగతావాళ్లను నేను చూసుకోగలను” అని అనేవాడు. అయితే నేను విడుదలయ్యాక నా కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నాన్న వ్యతిరేకిస్తున్నప్పటికీ నా కుటుంబంలో ఏడుగురు మీటింగ్స్‌కు హాజరౌతున్నారు, చెల్లి బాప్తిస్మం కూడా తీసుకుంది.

1913 నుండి యెహోవా సేవచేస్తున్న డమీట్రీయెస్‌ పాపాజోర్జ్‌ అనే ఓ అభిషిక్త సహోదరునితో పరిచర్యకు వెళ్తూ

1950⁠లో కొరియా యుద్ధం మొదలైనప్పుడు, సైన్యంలో చేరడానికి ఫోర్ట్‌ హేజ్‌ మిలటరీ క్యాంపుకు రమ్మని నన్ను మళ్లీ పిలిచారు. నా శక్తిసామర్థ్యాలను పరీక్షించాక, “నీతోపాటు వచ్చినవాళ్లందరిలో నీకే ఎక్కువ మార్కులు వచ్చాయి” అని ఓ ఆఫీసర్‌ నాతో అన్నాడు. అందుకు నేను, “అవునా, కానీ నేను సైన్యంలో చేరాలనుకోవడంలేదు” అని చెప్పాను. అంతేకాదు 2 తిమోతి 2:3వ వచనం చెప్పి, “నేను ఇప్పటికే క్రీస్తు సైనికునిగా ఉన్నాను” అని అన్నాను. ఆ మాటలు వినగానే ఆయన చాలాసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. చివరికి “నువ్వు వెళ్లొచ్చు” అని అన్నాడు.

ఇది జరిగిన కొన్నిరోజులకే, నేను ఒహాయోలోని సిన్‌సిన్నాటీలో జరిగిన ఓ సమావేశానికి వెళ్లాను. బెతెల్‌ సేవ చేయాలనుకునే వాళ్లకోసం ఏర్పాటుచేసిన మీటింగ్‌కు కూడా హాజరయ్యాను. రాజ్యంకోసం కష్టపడి పనిచేయాలనుకునే సహోదరుల అవసరం బెతెల్‌లో ఉందని ఆ మీటింగ్‌లో సహోదరుడు మిల్టన్‌ హెన్షల్‌ చెప్పాడు. ఆ తర్వాత నేను బెతెల్‌ అప్లికేషన్‌ నింపాను, రమ్మని ఆహ్వానం కూడా వచ్చింది. అలా నేను 1954 ఆగస్టు నెల నుండి ఇప్పటివరకు బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవచేస్తూ ఉన్నాను.

బెతెల్‌లో నాకు ఎప్పుడూ చేతినిండా పని ఉండేది. చాలా సంవత్సరాలపాటు నేను ప్రింటరీలో అలాగే ఆఫీసు బిల్డింగుల్లో ఉండే బాయిలర్లను (boilers) ఆపరేట్‌ చేశాను, తర్వాత మిషన్లను ఆపరేట్‌ చేసేవాడిని, తాళాలను రిపేరు చేసేవాడిని. న్యూయార్క్‌లో ఉన్న అసెంబ్లీ హాళ్లలో కూడా పనిచేశాను.

బ్రూక్లిన్‌ బెతెల్‌లోని ఆఫీసు బిల్డింగులో ఉన్న బాయిలర్లను ఆపరేట్‌ చేస్తూ

బెతెల్‌లో జరిగే ఉదయకాల ఆరాధన, కావలికోట అధ్యయనంతోపాటు సంఘంతో కలిసి పరిచర్య చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి వీటన్నిటిని ప్రతీ యెహోవాసాక్షుల కుటుంబం క్రమంగా చేయాలి. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి క్రమంగా దినవచనాన్ని చర్చించుకోవడం, కుటుంబ ఆరాధన చేసుకోవడం, మీటింగ్స్‌లో పాల్గొనడం, ఉత్సాహంగా రాజ్యసువార్త ప్రకటించడం వంటివి చేసినప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు యెహోవాకు దగ్గరౌతారు.

నాకు బెతెల్‌లో, సంఘంలో చాలామంది స్నేహితులున్నారు. వాళ్లలో కొందరు అభిషిక్తులు, వాళ్లు చనిపోయి పరలోకానికి వెళ్లిపోయారు. మిగిలినవాళ్లు భూనిరీక్షణ ఉన్నవాళ్లు. కానీ బెతెల్‌లో సేవ చేసేవాళ్లతో సహా యెహోవా సేవకులందరూ అపరిపూర్ణులే. కాబట్టి నాకు ఏ సహోదరుడితోనైనా గొడవైతే మళ్లీ వాళ్లతో మామూలుగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. అంతేకాదు మత్తయి 5:23, 24 వచనాల గురించి ధ్యానిస్తూ, ఎవరితోనైనా మనస్పర్థలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తుంటాను. “సారీ” అని చెప్పడం అంత తేలిక కాకపోయినా చాలా సమస్యలు ఈ ఒక్క మాటతోనే పరిష్కారమౌతాయి.

నా సేవకు మంచి ఫలితాలు

వయసు పైబడడం వల్ల ఇంటింటి పరిచర్యకు వెళ్లడం ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది. అయినా సరే నేను పరిచర్యకు వెళ్లడం మానేయలేదు. మాండరీన్‌ చైనీస్‌ భాషను కొద్దిగా నేర్చుకుని, వీధిలో కనిపించే చైనీస్‌ భాషా ప్రజలకు సంతోషంగా సువార్త ప్రకటిస్తున్నాను. కొన్నిసార్లైతే ఉదయం పూట 30 లేదా 40 పత్రికల వరకు ఇస్తుంటాను.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న చైనీస్‌ భాషా ప్రజలకు సువార్త ప్రకటిస్తూ

చైనీస్‌ భాషలో ఓ పునర్దర్శనాన్ని కూడా చేశాను. ఓ రోజు, పండ్లను అమ్ముతున్న ఓ యువతి నన్ను చూసి నవ్వింది. నేను కూడా ఆమెను చిరునవ్వుతో పలకరించి, చైనీస్‌ భాషలో ఉన్న కావలికోట, తేజరిల్లు! పత్రికలను ఇచ్చాను. ఆమె అవి తీసుకుని తన పేరు కేటీ అని చెప్పింది. అప్పటినుండి ఆమెకు నేనెక్కడ కనిపించినా వచ్చి మాట్లాడేది. నేను ఆమెకు ఇంగ్లీషులో కొన్ని పండ్ల పేర్లను, కాయగూరల పేర్లను నేర్పించేవాడిని, ఆమె వాటిని నాతోపాటు పలుకుతూ నేర్చుకుంది. కొన్ని బైబిలు వచనాల్ని ఆమెకు వివరించేవాడిని, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని కూడా కేటీ తీసుకుంది. కానీ కొన్ని వారాల తర్వాత ఆమె నాకు కనిపించలేదు.

కొన్ని నెలల తర్వాత, పండ్లను అమ్ముతున్న మరో అమ్మాయికి నేను పత్రికల్ని ఇచ్చాను, ఆమె వాటిని తీసుకుంది. ఆ తర్వాతి వారం ఆ అమ్మాయి తన సెల్‌ఫోన్‌ను నాకిచ్చి, ‘చైనా నుండి మీకు ఫోన్‌ వచ్చింది మాట్లాడండి’ అని చెప్పింది. “చైనాలో నాకు ఎవ్వరూ తెలీదు” అని నేను అన్నాను. కానీ ఆమె బలవంతపెట్టడంతో ఫోన్‌ తీసుకుని “హలో, నేను రాబ్సన్‌ను మాట్లాడుతున్నాను” అని అన్నాను. అవతలి నుండి, “రాబీ, నేను కేటీని. నేను చైనా వచ్చేశాను” అని ఓ స్వరం వినిపించింది. “చైనానా?” అని నేను అడిగాను. అందుకు కేటీ, “అవును రాబీ. నీకు ఫోన్‌ ఇచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె మా చెల్లి. నువ్వు నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించావు. మా చెల్లికి కూడా అలానే నేర్పించు” అని చెప్పింది. “కేటీ, నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పినందుకు థాంక్స్‌” అని అన్నాను. ఆ తర్వాత, చివరిసారిగా కేటీ వాళ్ల చెల్లితో మాట్లాడాను. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడున్నా, వాళ్లు యెహోవా గురించి మరింత నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.

నేను 73 ఏళ్లుగా యెహోవాకు సేవ చేస్తున్నాను. యుద్ధంలో పాల్గొనకుండా ఉండేలా, జైల్లో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా ఉండేలా ఆయన నాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాన్న ఎంత వ్యతిరేకించినా నేను పట్టువదలకుండా ఉండడం చూసి తాము చాలా ప్రోత్సాహం పొందామని నా తోబుట్టువులు అంటుంటారు. చివరికి మా అమ్మ, నా తోబుట్టువుల్లో ఆరుగురు బాప్తిస్మం కూడా తీసుకున్నారు. నాన్న మనసు కూడా కొంచెం మారింది. ఆయన చనిపోవడానికి ముందు కొన్నిసార్లు మీటింగ్స్‌కు వెళ్లాడు.

దేవుని చిత్తమైతే, చనిపోయిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు కొత్తలోకంలో తిరిగి బ్రతుకుతారు. మనం ప్రేమించేవాళ్లతో కలిసి యెహోవాను నిత్యం ఆరాధించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. a

a ఈ ఆర్టికల్‌ను ప్రచురణకు సిద్ధం చేస్తుండగా, కార్వన్‌ రాబ్సన్‌ నమ్మకమైన యెహోవా సేవకునిగా చనిపోయాడు.