కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం

మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం

మా నాన్న ఆర్థర్‌కి దేవుడంటే ఇష్టం. అతను యువకునిగా ఉన్నప్పుడు మెథడిస్ట్‌ చర్చీ పరిచారకుడు అవ్వాలనుకున్నాడు. కానీ బైబిలు విద్యార్థులు ఇచ్చిన కొన్ని ప్రచురణలు చదివాక అతను తన ఆలోచన మార్చుకుని, వాళ్లతో సహవసించడం మొదలుపెట్టాడు. చివరికి 1914⁠లో అంటే తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అతన్ని మిలటరీలో చేరమని ప్రభుత్వం ఆదేశించింది, కానీ నాన్న యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. దాంతో నాన్నను కెనడాలోని ఒంటారియోలో ఉన్న కింగ్‌స్టన్‌ జైల్లో పది నెలలు ఉంచారు. అక్కడినుండి విడుదలైన తర్వాత నాన్న కల్‌పోర్చర్‌గా సేవచేయడం మొదలుపెట్టాడు, ఒకప్పుడు పయినీర్లను అలా పిలిచేవాళ్లు.

మా అమ్మానాన్నల పెళ్లి 1926⁠లో జరిగింది. అమ్మ పేరు హేజల్‌ విల్కన్‌సన్‌. మా అమ్మమ్మ 1908⁠లో సత్యం తెలుసుకుంది. మా అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం, నేను రెండోవాణ్ణి. నేను 1931, ఏప్రిల్‌ 24న పుట్టాను. మా నాన్నకు బైబిలంటే ఇష్టం, గౌరవం. మమ్మల్ని కూడా బైబిల్ని ప్రేమించమని, గౌరవించమని చెప్పేవాడు. మేము యెహోవా ఆరాధనకే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చేవాళ్లం. మేము కుటుంబంగా కలిసి క్రమంగా ఇంటింటి పరిచర్యకు వెళ్లేవాళ్లం.—అపొ. 20:20.

మా నాన్నలాగే నేనూ రాజీపడలేదు, పయినీరు సేవ చేశాను

రెండవ ప్రపంచ యుద్ధం 1939⁠లో మొదలైంది. దాని తర్వాతి సంవత్సరం, కెనడాలో యెహోవాసాక్షుల పనిని నిషేధించారు. స్కూల్‌లో జెండా వందనం చేసి, జాతీయ గీతం పాడేటప్పుడు టీచర్లు మా అక్క డోరతీని, నన్నూ క్లాస్‌రూమ్‌ బయట ఉండనిచ్చేవాళ్లు. కానీ ఒక రోజు, నేను పిరికివాడినని అంటూ మా టీచర్‌ నన్ను అవమానించడానికి ప్రయత్నించింది. స్కూల్‌ అయిపోయిన తర్వాత, మా క్లాస్‌ పిల్లలు కొంతమంది నన్ను కొట్టి కింద పడేశారు. అలా జరగడం వల్ల, నేను “లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అని ఇంకా బలంగా నిర్ణయించుకున్నాను.—అపొ. 5:29.

నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1942, జూలైలో ఓ పొలంలోని నీళ్ల ట్యాంక్‌లో బాప్తిస్మం తీసుకున్నాను. మా స్కూల్‌కి సెలవులు ఇచ్చినప్పుడల్లా వెకేషన్‌ పయినీరు సేవ చేసేవాణ్ణి. దాన్నే ఇప్పుడు సహాయ పయినీరు సేవ అని పిలుస్తున్నాం. ఒక సంవత్సరంలోనైతే నేను ముగ్గురు సహోదరులతో కలిసి ఒంటారియో ఉత్తర ప్రాంతానికి వెళ్లి సేవ చేశాను. అక్కడ చెట్లను నరికేవాళ్లకు ప్రీచింగ్‌ చేశాం.

నేను 1949, మే 1న క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాను. తర్వాత, కెనడా బ్రాంచిలో జరుగుతున్న నిర్మాణ పనిలో సహాయం చేసేందుకు నన్ను రమ్మని పిలిచారు. కొంతకాలానికి నేను కెనడా బెతెల్‌ కుటుంబ సభ్యుణ్ణి అయ్యాను. అక్కడ నేను ప్రింటరీలో పనిచేశాను, బల్లపరుపుగా ఉండే ప్రెస్‌ను ఆపరేట్‌ చేయడాన్ని నేర్చుకున్నాను. అప్పట్లో, కెనడాలోని యెహోవాసాక్షులు ఎదుర్కొంటున్న హింస గురించి ఒక కరపత్రాన్ని ముద్రించడానికి కొన్నివారాలపాటు రాత్రులు పనిచేశాం.

ఆ తర్వాత, నేను సేవా విభాగంలో పనిచేశాను. క్విబెక్‌లో సేవ చేయడానికి వెళ్తున్న పయినీర్లు బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్లను ఇంటర్వ్యూ చేసే పనిని నాకు అప్పగించారు. ఆ ప్రాంతంలో సాక్షులను చాలా హింసించేవాళ్లు. ఆ పయినీర్లలో అల్‌బర్టలోని ఎడ్‌మన్‌టన్‌లో ఉండే మేరీ జాజూల అనే సహోదరి కూడా ఉంది. ఆమె అమ్మానాన్నలు ఆర్థోడాక్స్‌ చర్చీకి వెళ్లేవాళ్లు. మేరీ, ఆమె అన్నయ్య బైబిలు స్టడీ ఆపడానికి ఒప్పుకోకపోవడంతో, వాళ్ల అమ్మానాన్నలు వాళ్లను ఇంట్లోంచి పంపించేశారు. వాళ్లిద్దరూ 1951, జూన్‌లో బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఆరు నెలలకు పయినీరు సేవ మొదలుపెట్టారు. మేరీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యెహోవా పట్ల ఆమెకు ఎంతో ప్రేమ ఉందని నేను చూడగలిగాను. దాంతో నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తొమ్మిది నెలల తర్వాత 1954, జనవరి 30న మేము పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి జరిగిన ఒక వారం తర్వాత, ప్రాంతీయ సేవ కోసం శిక్షణ పొందడానికి మాకు ఆహ్వానం వచ్చింది. ఆ శిక్షణ పూర్తయ్యాక, రెండు సంవత్సరాలపాటు మేము ఉత్తర ఒంటారియోలో ప్రాంతీయ సేవ చేశాం.

ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని విస్తరించినప్పుడు, ఎక్కువమంది మిషనరీలు అవసరమయ్యారు. కెనడాలో చలికాలం ఎముకలు కొరికే చలి ఉండేది, ఎండాకాలంలో దోమల బెడద ఉండేది. అందుకే వాటిని తట్టుకోగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేయగలమని మేరీ, నేను అనుకునేవాళ్లం. మేము 1956, జూలైలో 27వ గిలియడ్‌ తరగతికి హాజరయ్యాం. నవంబరు కల్లా మా కొత్త నియామకంలో అంటే బ్రెజిల్‌లో ఉన్నాం.

బ్రెజిల్‌లో మిషనరీ సేవ

మేము బ్రెజిల్‌కి వెళ్లాక, పోర్చుగీస్‌ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాం. ముందుగా, సంభాషణ మొదలుపెట్టడానికి సులభమైన మార్గాల్ని నేర్చుకున్నాం. తర్వాత, ఒక నిమిషం మాట్లాడి పత్రికను ఎలా అందించాలో నేర్చుకున్నాం. మేము ప్రీచింగ్‌కి వెళ్లి మాట్లాడినప్పుడు ఒకామె ఆసక్తి చూపించింది. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, దేవుని రాజ్యంలో జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక లేఖనాన్ని వాళ్లకు చదివి వినిపించాలని ముందే అనుకున్నాం. దాంతో నేను ప్రకటన 21:3, 4 వచనాలు ఆమెకు చదివి వినిపించాను. కానీ ఆ వెంటనే కళ్లు తిరిగి పడిపోయాను. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఎండ, ఉక్కపోత నాకు అలవాటు లేవు. అక్కడ వేడిని తట్టుకోవడం ఆ తర్వాత కూడా నాకు కష్టమైంది.

మాకు కాంపాస్‌ పట్టణంలో మిషనరీ సేవ చేసే నియామకం ఇచ్చారు. ఈరోజు అక్కడ 15 సంఘాలు ఉన్నాయి. కానీ మేము అక్కడికి వెళ్లినప్పుడు, కేవలం ఒక చిన్న గుంపు మాత్రమే ఉండి, నలుగురు సహోదరీలు ఉన్న ఒక మిషనరీ హోమ్‌ ఉండేది. ఆ సహోదరీల పేర్లు ఏమిటంటే: ఎస్తేర్‌ ట్రేసీ, రామోన బౌవర్‌, లూయేజ స్వార్టస్‌, లరేన్‌ బ్రుక్స్‌ (ఇప్పుడు లరేన్‌ వాలన్‌). ఆ మిషనరీ హోమ్‌లో నా పని బట్టలు ఉతకడం, వంట కోసం కట్టెలు తేవడం. ఒకసారి సోమవారం రాత్రి కావలికోట అధ్యయనం తర్వాత, మేరీ సోఫాలో ఉన్న దిండు మీద తలపెట్టి పడుకుంది. మేము ఆ రోజు ఎలా గడిచిందో మాట్లాడుకుంటున్నాం. మేరీ సోఫాలోంచి లేచినప్పుడు ఆ దిండు కింద నుండి ఓ పాము బయటకు వచ్చింది. నేను దాన్ని చంపేదాక చాలా కంగారుపడ్డాం.

ఒక సంవత్సరంపాటు పోర్చుగీస్‌ నేర్చుకున్న తర్వాత, మేము ప్రాంతీయ సేవ మొదలుపెట్టాం. మేము సేవ చేసిన ప్రాంతాల్లో కరెంటు ఉండేది కాదు. చాపల మీద పడుకునేవాళ్లం, గుర్రాల మీద గుర్రపు బండ్ల మీద ప్రయాణించేవాళ్లం. ఒకసారి, అప్పటివరకు పనిచేయని క్షేత్రంలో ప్రీచింగ్‌ చేసేందుకు కొండప్రాంతంలో ఉన్న ఓ పట్టణానికి ట్రైన్‌లో వెళ్లాం. అక్కడ ఒక రూమ్‌ అద్దెకు తీసుకొని ఉన్నాం. పరిచర్యలో ఇవ్వడానికి బ్రాంచి మాకు 800 పత్రికలు పంపించింది. ఆ పత్రికలు ఉన్న బాక్సుల్ని పోస్టాఫీసు నుండి తీసుకురావడానికి చాలాసార్లు తిరగాల్సి వచ్చింది.

1962⁠లో రాజ్య పరిచర్య పాఠశాలను బ్రెజిల్‌లోని వేర్వేరు చోట్ల నిర్వహించారు. ఆరు నెలలపాటు, ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు నేను ఒక్కడినే ప్రయాణించి వెళ్లాను. మానాస్‌లో, బెలెమ్‌లో, ఫోర్టలేజాలో, రెసేఫీలో, సాల్వడార్‌లో నిర్వహించిన పాఠశాలల్లో నేను ఉపదేశకునిగా పని చేశాను. నేను మానాస్‌లో ఉన్నప్పుడు పేరుపొందిన ఒక ఒపేరా హౌస్‌లో జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అయితే భారీ వర్షాలవల్ల శుభ్రమైన తాగే నీళ్లు దొరకలేదు. సమావేశానికి వచ్చిన సహోదరసహోదరీలు భోజనం చేయడానికి మంచి స్థలం కూడా లేదు. (ఆ రోజుల్లో సమావేశాల్లోనే భోజనాలు పెట్టేవాళ్లు.) ఈ సమస్య గురించి నేను ఓ మిలిటరీ అధికారితో మాట్లాడాను. అతను దయగా, సమావేశం జరిగినన్ని రోజులు సరిపడా మంచి నీళ్లు ఏర్పాటు చేశాడు. అలాగే రెండు పెద్దపెద్ద టెంట్లు వేయడానికి కొంతమంది సైనికుల్ని కూడా పంపించాడు. ఆ టెంట్లను మేము వంటగది కోసం, భోజనం చేయడం కోసం ఉపయోగించుకున్నాం.

నేను పాఠశాల ఉపదేశకునిగా వెళ్లినప్పుడు, మేరీ వ్యాపార క్షేత్రంలో ప్రీచింగ్‌ చేసింది. ఆ ప్రాంతంలో చాలామంది పోర్చుగల్‌ నుండి బ్రెజిల్‌కు డబ్బు సంపాదించడానికి వచ్చేవాళ్లు కాబట్టి ఎవ్వరూ బైబిలు విషయాల పట్ల ఆసక్తి చూపించేవాళ్లు కాదు. దాంతో మేరీ నిరుత్సాహపడి, కొంతమంది స్నేహితులతో ఇలా అంది, ‘నేను ఎక్కడికైనా వెళ్తానుగానీ పోర్చుగల్‌కి మాత్రం ఎప్పటికీ వెళ్లను.’ అది జరిగిన కొంతకాలానికి, మాకు ఓ ఉత్తరం వచ్చింది. దానిలో పోర్చుగల్‌లో సేవచేయడానికి వెళ్లమని రాసి ఉంది. ఆ సమయంలో అక్కడ మన పని నిషేధించబడింది. అయితే, ఆ ఉత్తరం చూసినప్పుడు మేరీ అవాక్కయ్యింది. కానీ మేము ఆ నియామకాన్ని ఒప్పుకొని పోర్చుగల్‌కి వెళ్లాం.

పోర్చుగల్‌లో మా నియామకం

మేము 1964, ఆగస్టులో పోర్చుగల్‌లోని లిస్బన్‌కు వచ్చాం. అక్కడున్న రహస్య పోలీసుల వల్ల మన సహోదరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు. కాబట్టి మొదట్లో స్థానిక సాక్షులను కలవకుండా ఉండడమే మంచిదని మాకు అనిపించింది. ముందు మేము ఒక రూమ్‌లో అద్దెకు ఉన్నాం. మాకు వీసా వచ్చాక ఒక అపార్ట్‌మెంట్‌కి మారాం. ఐదు నెలల తర్వాత మాకు బ్రాంచిలోని సహోదరులతో మాట్లాడడానికి వీలైంది. ఎట్టకేలకు మేము మీటింగ్‌కు హాజరవ్వగలిగినందుకు చాలా సంతోషించాం.

నిషేధంవల్ల రాజ్యమందిరాలను మూసేశారు కాబట్టి మీటింగ్స్‌ సహోదరుల ఇళ్లలో జరిగేవి. వాళ్ల ఇళ్లను పోలీసులు రోజూ సోదా చేసేవాళ్లు. వందలకొలది మన సహోదరసహోదరీలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించేవాళ్లు. పోలీసులు వాళ్లతో దురుసుగా ప్రవర్తిస్తూ, బాధ్యతల్లో ఉన్న సహోదరుల పేర్లను వాళ్లనుండి బలవంతంగా రాబట్టడానికి ప్రయత్నించేవాళ్లు. కాబట్టి సహోదరులు ఒకరినొకరు కాపాడుకోవడానికి తమ ఇంటి పేర్లతో కాకుండా కేవలం జూజె, పౌలూ అని తమ పేర్లతో పిలుచుకునేవాళ్లు.

అలాంటి పరిస్థితుల్లో, సహించడానికి సహాయం చేసే ప్రచురణల్ని సహోదరులకు అందించడమే మా ముఖ్య లక్ష్యంగా ఉండేది. మేరీ కావలికోట అధ్యయన ఆర్టికల్స్‌ని, ఇతర ప్రచురణల్ని ప్రత్యేక రకమైన పేపరు మీద టైప్‌ చేసేది. ఆ పేపర్నే స్టెన్‌సిల్‌గా ఉపయోగించి సహోదరుల కోసం మరిన్ని కాపీలను తయారుచేసేవాళ్లు.

కోర్టులో మంచివార్తను సమర్థిస్తూ మాట్లాడడం

1966, జూన్‌లో లిస్బన్‌లో ఓ ముఖ్యమైన కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఫేజూ సంఘానికి చెందిన మొత్తం 49 మంది ఒకరి ఇంట్లో సమకూడి చట్టవిరుద్ధమైన మీటింగ్‌ జరుపుకున్నారని పోలీసులు ఆరోపించారు. సహోదరుల్ని ఆ కేసు కోసం సిద్ధంచేయడానికి, నేను సహోదరుల్ని దోషులుగా నిరూపించే లాయర్‌లా నటించాను. అయితే అనుకున్నట్టుగానే మేము ఆ కేసు ఓడిపోయాం. మొత్తం 49 మంది సహోదరసహోదరీలు, 45 రోజుల నుండి ఐదున్నర నెలల వరకు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఈ విచారణ ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. నిజానికి విచారణ జరుగుతున్నప్పుడు, మా లాయర్‌ బైబిల్లో గమలీయేలు పలికిన మాటలను ఎత్తి చెప్పాడు. (అపొ. 5:33-39) దాని తర్వాత, ఆ విచారణ గురించి వార్తాపత్రికల్లో వచ్చింది. మా లాయరు బైబిలు స్టడీ తీసుకుంటూ, మీటింగ్స్‌కు రావడం మొదలుపెట్టాడు. అది చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది.

1966, డిసెంబరులో నన్ను బ్రాంచి పర్యవేక్షకునిగా నియమించారు, నేను ఎక్కువగా చట్టపరమైన విషయాల్ని చూసుకునేవాణ్ణి. పోర్చుగల్‌లో యెహోవాసాక్షులు స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి కావాల్సిన చట్టపరమైన కారణాల్ని తయారు చేయడానికి మేము చేయగలిగినదంతా చేశాం. (ఫిలి. 1:7) చివరికి 1974, డిసెంబరు 18న మాకు చట్టపరమైన గుర్తింపు వచ్చింది. మా సంతోషాన్ని పంచుకోవడానికి ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి సహోదరులు నేథన్‌ నార్‌, ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ వచ్చారు. అప్పుడు ఓపోర్టోలో, లిస్బన్‌లో మర్చిపోలేని ఓ మీటింగ్‌ జరిగింది. ఆ రెండు చోట్ల కలిపి మొత్తం 46,870 మంది హాజరయ్యారు.

అజోరస్‌, కేప్‌ వర్డ్‌, మడీరా, సావోటోమ్‌, ప్రిస్సిపి వంటి పోర్చుగీస్‌ మాట్లాడే దీవుల్లో కూడా ప్రకటనాపని జరిగేలా యెహోవా సహాయం చేశాడు. ఈ ప్రాంతాల్లో సాక్షుల సంఖ్య పెరగడంతో, మాకు మరింత పెద్ద బ్రాంచి అవసరమై దాన్ని నిర్మించారు. ఆ బ్రాంచి సమర్పణ ప్రసంగాన్ని 1988, ఏప్రిల్‌ 23న సహోదరుడు మిల్టన్‌ హెన్షల్‌ ఇచ్చాడు. ఆ కార్యక్రమానికి 45,522 మంది సహోదరసహోదరీలు హాజరయ్యారు. ఒకప్పుడు పోర్చుగల్‌లో మిషనరీలుగా సేవ చేసిన 20 మంది సహోదరసహోదరీలు కూడా వాళ్లలో ఉన్నారు.

నమ్మకంగా ఉన్నవాళ్ల నుండి మేము ఎంతో నేర్చుకున్నాం

ఎన్నో సంవత్సరాలపాటు నేనూ, మేరీ నమ్మకమైన సహోదరుల దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటూ సంతోషంగా గడిపాం. ఉదాహరణకు, ఒకసారి సహోదరుడు థియోడోర్‌ జారస్‌తో కలిసి నేను కూడా జోన్‌ సందర్శనానికి వెళ్లాను. అప్పుడు నేను అతని నుండి ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను. మేము సందర్శించిన బ్రాంచి చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఆ సమస్యను పరిష్కరించడానికి బ్రాంచి కమిటీ సభ్యులు కూడా చేయగలిగినదంతా చేశారుగానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. దాని విషయంలో వాళ్లు ఇంకేమీ చేయలేకపోతున్నందుకు బాధపడ్డారు. అయితే సహోదరుడు జారస్‌ వాళ్లకు ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు, “ఇప్పుడిక పవిత్రశక్తి విషయాల్ని చక్కబెట్టే వరకు వేచి చూద్దాం.” మరో సందర్భంలో నేనూ, మేరీ చాలా సంవత్సరాల క్రితం బ్రూక్లిన్‌ను సందర్శించడానికి వెళ్లినప్పుడు సహోదరుడు ఫ్రాంజ్‌ చెప్పిన మాటల్ని కూడా నేనెప్పటికీ మర్చిపోలేను. మాలో కొంతమందిమి కలిసి సహోదరుడిని ఒక సలహా అడిగాం. అప్పుడాయన ఇలా అన్నాడు, “నేనిచ్చే సలహా ఏమిటంటే: పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీరు యెహోవా దృశ్య సంస్థను అంటిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించమని యేసు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్న ఏకైక సంస్థ ఇదే.”

ఆ సలహాను పాటించడంవల్ల నేనూ, మేరీ చాలా సంతోషించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచీలకు జోన్‌ సందర్శనాలు చేసినప్పుడు ఎదురైన ఎన్నో తీపి జ్ఞాపకాల్ని మా మనసులో దాచుకున్నాం. అలా సందర్శిస్తున్నప్పుడు, యెహోవా సేవ చేస్తున్న అన్ని వయసుల వాళ్లను కలిసి, వాళ్ల సేవను యెహోవా మెచ్చుకుంటున్నాడనే భరోసాను ఇవ్వడం మాకు సంతోషంగా అనిపించింది. యెహోవా సేవ చేస్తూనే ఉండమని మేము వాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించాం.

చాలా సంవత్సరాలు గడిచాయి, ఇప్పుడు మా ఇద్దరి వయసు 80 దాటింది. మేరీ ఆరోగ్యం అంతగా బాలేదు. (2 కొరిం. 12:9) పైగా మేము వేరే పరీక్షలను కూడా ఎదుర్కొన్నాం. కానీ వాటివల్ల మా విశ్వాసం బలపడింది, అంతేకాదు యెహోవాకు నమ్మకంగా ఉండాలని ఇంకా బలంగా నిశ్చయించుకున్నాం. యెహోవా సేవలో మేము గడిపిన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, యెహోవా తన అపారదయతో మమ్మల్ని ఎన్నెన్నో విధాలుగా దీవించాడని అర్థమౌతుంది. a

a ఈ ఆర్టికల్‌ని ప్రచురణకు సిద్ధం చేస్తుండగా, 2015 అక్టోబరు 25న సహోదరుడు డగ్లస్‌ గెస్ట్‌ నమ్మకమైన యెహోవా సేవకునిగా చనిపోయాడు.