కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 9

ధర్మశాస్త్రం యెహోవా ప్రేమకు, న్యాయానికి నిదర్శనం

ధర్మశాస్త్రం యెహోవా ప్రేమకు, న్యాయానికి నిదర్శనం

‘ఆయన నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు; లోకం యెహోవా కృపతో నిండివుంది.’—కీర్త. 33:5.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) మనందరం ఏం కోరుకుంటాం? (బి) ఇతరులు మనల్ని ఎలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు?

ఇతరులు మనతో ప్రేమగా, న్యాయంగా వ్యవహరించాలని అందరం కోరుకుంటాం. ఒకవేళ మనం ప్రేమను పొందలేకపోతుంటే, మనకు పదేపదే అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకూ పనికిరానివాళ్లమని అనిపించవచ్చు, నిరాశపడవచ్చు.

2 మనం ప్రేమ కోసం, న్యాయం కోసం పరితపిస్తామని యెహోవాకు తెలుసు. (కీర్త. 33:5) దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అంతేకాదు ఇతరులు మనతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ఒకవేళ ఇతరులు మీతో ప్రేమగా, న్యాయంగా వ్యవహరించకపోవడం వల్ల మీరు కృంగిపోతే, మోషే ధర్మశాస్త్రం * యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న శ్రద్ధను ఎలా తెలియజేసిందో దయచేసి పరిశీలించండి.

3. (ఎ) రోమీయులు 13:8-10 ప్రకారం, మోషే ధర్మశాస్త్రాన్ని లోతుగా పరిశీలించినప్పుడు ఏం తెలుసుకోగలుగుతాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 మోషే ధర్మశాస్త్రాన్ని లోతుగా పరిశీలించినప్పుడు, మన ప్రేమగల దేవుడైన యెహోవాకున్న ఆప్యాయతా భావాల్ని తెలుసుకోగలుగుతాం. (రోమీయులు 13:8-10 చదవండి.) ఈ ఆర్టికల్‌లో, యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కొన్ని నియమాల్ని పరిశీలించి, ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: ధర్మశాస్త్రం ప్రేమ మీద ఆధారపడివుందని ఎందుకు చెప్పవచ్చు? ధర్మశాస్త్రం న్యాయాన్ని ప్రోత్సహించిందని ఎలా చెప్పవచ్చు? అధికార స్థానంలో ఉన్నవాళ్లు ధర్మశాస్త్రాన్ని ఎలా అమలుచేయాలని దేవుడు కోరుకున్నాడు? ధర్మశాస్త్రం ముఖ్యంగా ఎలాంటివాళ్లను కాపాడింది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే ఎంతో ఓదార్పును, నిరీక్షణను పొందుతాం, మన ప్రేమగల తండ్రైన యెహోవాకు ఇంకా దగ్గరౌతాం.—అపొ. 17:27; రోమా. 15:4.

ధర్మశాస్త్రం ప్రేమ మీద ఆధారపడింది

4. (ఎ) మోషే ధర్మశాస్త్రం ప్రేమ మీద ఆధారపడిందని ఎందుకు చెప్పవచ్చు? (బి) మత్తయి 22:36-40 ప్రకారం, యేసు ఏ ఆజ్ఞల గురించి నొక్కిచెప్పాడు?

4 యెహోవా ఏం చేసినా ప్రేమతోనే చేస్తాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రేమ మీద ఆధారపడిందని చెప్పవచ్చు. (1 యోహా. 4:8) ధర్మశాస్త్రం మొత్తం రెండు ప్రాథమిక ఆజ్ఞలపై ఆధారపడివుంది. అవేంటంటే: దేవున్ని ప్రేమించడం, పొరుగువాణ్ణి ప్రేమించడం. (లేవీ. 19:18; ద్వితీ. 6:5; మత్తయి 22:36-40 చదవండి.) కాబట్టి, ధర్మశాస్త్రంలో ఉన్న దాదాపు 600 ఆజ్ఞల్లో ప్రతీ ఆజ్ఞ యెహోవా ప్రేమకు సంబంధించి ఏదోక విషయాన్ని నేర్పిస్తుంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

5-6. భార్యాభర్తలు ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? యెహోవా దేన్ని గమనిస్తాడు? ఒక ఉదాహరణ చెప్పండి.

5 వివాహజతకు నమ్మకంగా ఉండండి, పిల్లలపట్ల శ్రద్ధ తీసుకోండి. భార్యాభర్తలు జీవితాంతం ఉండే బలమైన ప్రేమను వృద్ధి చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఆది. 2:24; మత్త. 19:3-6) వ్యభిచారం చేయడం అంటే, వివాహజత పట్ల అసలేమాత్రం ప్రేమ లేకపోవడమే. అందుకే, వ్యభిచారం చేయకూడదనే ఏడో ఆజ్ఞ మంచి కారణంతోనే ఇవ్వబడింది. (ద్వితీ. 5:18) వ్యభిచారం, దేవునికి ‘వ్యతిరేకంగా చేసే పాపం.’ అది వివాహజత పట్ల క్రూరంగా ప్రవర్తించడమే. (ఆది. 39:7-9) నమ్మకద్రోహానికి గురైన వివాహజతకు కొన్నిసార్లు ఆ బాధ దశాబ్దాలపాటు ఉంటుంది.

6 భార్యాభర్తలు ఒకరితోఒకరు ఎలా ఉంటున్నారో యెహోవా జాగ్రత్తగా గమనిస్తాడు. ముఖ్యంగా, ఇశ్రాయేలీయులు తమ భార్యలతో చక్కగా వ్యవహరించాలని యెహోవా కోరుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని గౌరవించే భర్త తన భార్యను ప్రేమిస్తాడు, చిన్నచిన్న కారణాలకే ఆమెకు విడాకులు ఇవ్వడు. (ద్వితీ. 24:1-4; మత్త. 19:3, 8) ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య వల్ల విడాకులు ఇవ్వాల్సి వస్తే, భర్త ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి. లైంగిక పాపం చేసిందనే నింద ఆమె మీద పడకుండా ఆ పత్రం కాపాడేది. అంతేకాదు, భార్యకు విడాకుల పత్రాన్ని ఇచ్చే ముందు భర్త బహుశా నగర పెద్దల్ని కలవాల్సి ఉంటుంది. ఆ విధంగా, ఆ భార్యాభర్తలు విడిపోకుండా సహాయం చేసే అవకాశం ఆ పెద్దలకు ఉండేది. ఒక ఇశ్రాయేలీయుడు స్వార్థపూరిత కారణాల వల్ల తన భార్యకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నించిన ప్రతీసారి యెహోవా జోక్యం చేసుకోలేదు. అయినప్పటికీ యెహోవా ఆమె కన్నీళ్లను చూశాడు, ఆమె బాధను అర్థంచేసుకున్నాడు.—మలా. 2:13-16.

పిల్లలు క్షేమంగా, సురక్షితంగా ఉన్నామని భావించేలా తల్లిదండ్రులు వాళ్లను ప్రేమగా పెంచాలని, వాళ్లకు బోధించాలని యెహోవా కోరుకుంటున్నాడు (7-8 పేరాలు చూడండి) *

7-8. (ఎ) తల్లిదండ్రులకు యెహోవా ఏమని ఆజ్ఞాపించాడు? (ముఖచిత్రం చూడండి.) (బి) మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

7 ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తే, యెహోవా పిల్లల బాగోగులను కూడా ఎంతో పట్టించుకుంటాడని అర్థమౌతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భౌతిక అవసరాలే కాకుండా వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీర్చాలని యెహోవా ఆజ్ఞాపించాడు. తల్లిదండ్రులు తమకు దొరికే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ పిల్లలు యెహోవా ధర్మశాస్త్రం పట్ల కృతజ్ఞతను, ఆయన పట్ల ప్రేమను పెంచుకునేలా సహాయం చేయాలి. (ద్వితీ. 6:6-9; 7:13) యెహోవా ఇశ్రాయేలీయుల్ని శిక్షించడానికి ఒక కారణం ఏంటంటే, వాళ్లు తమ పిల్లలతో చాలా ఘోరంగా వ్యవహరించడం. (యిర్మీ. 7:31, 33) తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదు లేదా వాళ్లతో కఠినంగా వ్యవహరించకూడదు, బదులుగా వాళ్లను యెహోవా ఇచ్చిన స్వాస్థ్యంగా, అంటే బహుమతిగా ఎంచాలి.—కీర్త. 127:3.

8 పాఠాలు: భార్యాభర్తలు ఒకరితోఒకరు ఎలా ఉంటున్నారో యెహోవా జాగ్రత్తగా గమనిస్తాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే యెహోవా వాళ్లను బాధ్యులుగా ఎంచుతాడు.

9-11. ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదనే ఆజ్ఞ యెహోవా ఎందుకు ఇచ్చాడు?

9 వేరేవాళ్లవి ఆశించకండి. ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదని పదో ఆజ్ఞ చెప్పింది. (ద్వితీ. 5:21; రోమా. 7:7) యెహోవా ఒక విలువైన పాఠం నేర్పించడానికే ఆ ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, తన సేవకులు తమ హృదయాన్ని అంటే తమ ఆలోచనల్ని, భావాల్ని కాపాడుకోవాలి. చెడ్డపనులకు కారణం చెడ్డ ఆలోచనలు, భావాలే అని ఆయనకు తెలుసు. (సామె. 4:23) ఒక ఇశ్రాయేలీయుడు తన హృదయంలో చెడు కోరికలు వృద్ధి చేసుకుంటే అతను ఇతరులతో ప్రేమ లేకుండా ప్రవర్తించే అవకాశం ఉంది. రాజైన దావీదు అదే చేశాడు. అతను మంచి వ్యక్తే అయినా ఒక సందర్భంలో ఎదుటివ్యక్తి భార్యను కోరుకున్నాడు. ఆ కోరిక అతను పాపం చేసేలా నడిపించింది. (యాకో. 1:14, 15) దావీదు ఆమెతో వ్యభిచారం చేశాడు, ఆమె భర్తను మోసం చేయడానికి ప్రయత్నించాడు, చివరికి అతన్ని చంపించాడు.—2 సమూ. 11:2-4; 12:7-11.

10 ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదనే ఆజ్ఞకు ఒక ఇశ్రాయేలీయుడు లోబడకపోతే, దాన్ని యెహోవా తెలుసుకోగలడు. ఎందుకంటే ఆయన హృదయాల్ని చదవగలడు. (1 దిన. 28:9) చెడ్డ ప్రవర్తనకు దారితీసే ఆలోచనలు అస్సలు రాకుండా జాగ్రత్తపడాలని ధర్మశాస్త్రంలోని ఆ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు గుర్తుచేసింది. యెహోవా ఎంత తెలివైన, ప్రేమగల తండ్రో కదా!

11 పాఠాలు: యెహోవా పైకి కనిపించేవాటికి మించి చూడగలడు. మన హృదయంలో ఏముందో ఆయన తెలుసుకోగలడు. (1 సమూ. 16:7) మన ప్రతీ ఆలోచనను, భావాన్ని, పనిని ఆయన చూడగలడు. ఆయన మనలో ఉన్న మంచిని చూసి, దాన్ని ప్రోత్సహిస్తాడు. కానీ మనకొచ్చే చెడు ఆలోచనలు చెడు పనులకు దారితీయకముందే మనం వాటిని గుర్తించి, అదుపు చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు.—2 దిన. 16:9; మత్త. 5:27-30.

ధర్మశాస్త్రం న్యాయాన్ని ప్రోత్సహించింది

12. మోషే ధర్మశాస్త్రం ఏ విషయం బోధిస్తోంది?

12 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడని కూడా ధర్మశాస్త్రం బోధిస్తోంది. (కీర్త. 37:28; యెష. 61:8) ఇతరులతో నిష్పక్షపాతంగా వ్యవహరించే విషయంలో ఆయన పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు యెహోవా వాళ్లను దీవించాడు. అయితే వాళ్లు ఆయన నీతి ప్రమాణాల్ని పాటించనప్పుడు కష్టాలు అనుభవించారు. పది ఆజ్ఞల్లో, మరో రెండు ఆజ్ఞల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

13-14. పది ఆజ్ఞల్లో మొదటి రెండు ఆజ్ఞలు ఏ విషయాన్ని నొక్కిచెప్పాయి? ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞలకు లోబడినప్పుడు ఎలా ప్రయోజనం పొందారు?

13 యెహోవాను మాత్రమే ఆరాధించాలి. ఇశ్రాయేలీయులు యెహోవాను మాత్రమే ఆరాధించాలని, విగ్రహాలను పూజించకూడదని పది ఆజ్ఞల్లో మొదటి రెండు ఆజ్ఞలు నొక్కిచెప్పాయి. (నిర్గ. 20:3-6) యెహోవా ఆ ఆజ్ఞలు ఇచ్చింది తన ప్రయోజనం కోసం కాదుగానీ తన ప్రజల ప్రయోజనం కోసమే. వాళ్లు ఆయనకు నమ్మకంగా ఉన్నంతకాలం వర్ధిల్లారు. కానీ ఇతర జనాంగాల దేవుళ్లను ఆరాధించినప్పుడు కష్టాలపాలయ్యారు.

14 కనానీయుల గురించి ఆలోచించండి. వాళ్లు జీవంగల సత్య దేవున్ని ఆరాధించకుండా ప్రాణంలేని విగ్రహాలను పూజించారు. ఫలితంగా, తమనుతాము దిగజార్చుకున్నారు. (కీర్త. 115:4-8) వాళ్లు తమ ఆరాధనలో భాగంగా, అసహ్యమైన లైంగిక పనులు చేసేవాళ్లు, తమ పిల్లల్ని బలిచ్చేవాళ్లు. ఇశ్రాయేలీయులు యెహోవాను కాకుండా విగ్రహాలను పూజించినప్పుడు, వాళ్లు కూడా తమనుతాము దిగజార్చుకున్నారు, తమ కుటుంబ సభ్యులకు హాని చేశారు. (2 దిన. 28:1-4) అధికార స్థానంలో ఉన్నవాళ్లు యెహోవా న్యాయ ప్రమాణాల్ని పక్కనబెట్టారు. వాళ్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బలహీనుల్ని, నిస్సహాయుల్ని అణగద్రొక్కారు. (యెహె. 34:1-4) ఏ దిక్కులేని స్త్రీలతో, పిల్లలతో కఠినంగా వ్యవహరించేవాళ్లను శిక్షిస్తానని యెహోవా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. (ద్వితీ. 10:17, 18; 27:19) అయితే, ఇశ్రాయేలీయులు తనకు నమ్మకంగా ఉంటూ, ఒకరితోఒకరు న్యాయంగా వ్యవహరించుకున్నప్పుడు ఆయన వాళ్లను దీవించాడు.—1 రాజు. 10:4-9.

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఎదుర్కొనే అన్యాయాల్ని గమనిస్తున్నాడు (15వ పేరా చూడండి)

15. యెహోవా గురించి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

15 పాఠాలు: యెహోవాను సేవిస్తున్నానని చెప్పుకునే ఎవరైనా, ఆయన ప్రమాణాల్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన ప్రజలకు హానిచేస్తే, దానికి మనం యెహోవాను నిందించకూడదు. అయితే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఎదుర్కొనే అన్యాయాల్ని గమనిస్తున్నాడు. తన బిడ్డ బాధను చూసి ఒక తల్లి ఎంత బాధపడుతుందో అంతకన్నా ఎక్కువగా యెహోవా మన కష్టాల్ని చూసి బాధపడతాడు. (యెష. 49:15) ఆయన వెంటనే జోక్యం చేసుకోకపోయినా, ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తూ పశ్చాత్తాపం చూపించని పాపుల్ని తగిన సమయంలో శిక్షిస్తాడు.

ధర్మశాస్త్రాన్ని ఎలా అమలుచేయాలి?

16-18. మోషే ధర్మశాస్త్రం ఏయే అంశాల గురించి ప్రస్తావించింది? మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

16 మోషే ధర్మశాస్త్రం ఒక ఇశ్రాయేలీయుడి జీవితానికి సంబంధించిన చాలా అంశాల గురించి ప్రస్తావించింది. కాబట్టి నియమిత పెద్దలు తన ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చాలని యెహోవా కోరుకున్నాడు, వాళ్లు అలా చేయడం చాలా ప్రాముఖ్యం. ఆరాధనకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా ప్రజల తగాదాలకు, నేరాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆ పెద్దలు తీర్పుతీర్చాల్సి ఉంటుంది. ఈ కింది ఉదాహరణల్ని పరిశీలించండి.

17 ఒక ఇశ్రాయేలీయుడు ఎవరినైనా చంపితే, అతనికి వెంటనే మరణ శిక్ష విధించేవాళ్లు కాదు. నగర పెద్దలు ఆ హత్యకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకోవడానికి విచారణ జరిపి, మరణశిక్ష విధించాలో లేదో నిర్ణయించేవాళ్లు. (ద్వితీ. 19:2-7, 11-13) నగర పెద్దలు ఇశ్రాయేలీయుల జీవితానికి సంబంధించిన చాలా విషయాలను, అంటే వాళ్ల ఆస్తి తగాదాలను, వివాహ జీవితానికి సంబంధించిన గొడవలను కూడా పరిష్కరించాల్సి ఉండేది. (నిర్గ. 21:35; ద్వితీ. 22:13-19) పెద్దలు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు ప్రతీఒక్కరూ ప్రయోజనం పొందారు, ఆ జనాంగమంతా యెహోవాకు ఘనత తీసుకొచ్చింది.—లేవీ. 20:7, 8; యెష. 48:17, 18.

18 పాఠాలు: యెహోవా మన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు. మనం ఇతరులతో న్యాయంగా, ప్రేమగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన మాటల్ని, ప్రవర్తనను ఆయన గమనిస్తాడు. ఆఖరికి మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవాటిని కూడా ఆయన గమనిస్తాడు.—హెబ్రీ. 4:13.

19-21. (ఎ) పెద్దలు, న్యాయాధిపతులు దేవుని ప్రజలతో ఎలా వ్యవహరించాలి? (బి) దేవుని ప్రజల్లో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా మోషే ధర్మశాస్త్రం ఎలా కాపాడింది? మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

19 చుట్టుపక్కల ఉన్న ఇతర జనాంగాల చెడు ప్రభావం తన ప్రజలమీద పడకుండా యెహోవా వాళ్లను కాపాడాలనుకున్నాడు. అందుకే పెద్దలు, న్యాయాధిపతులు ధర్మశాస్త్రాన్ని నిష్పక్షపాతంగా అమలుచేయాలని ఆయన చెప్పాడు. అయితే, తీర్పు తీర్చేవాళ్లు ఆయన ప్రజలతో దురుసుగా లేదా కఠినంగా వ్యవహరించకూడదు. బదులుగా, వాళ్లు న్యాయాన్ని ప్రేమించాలి.—ద్వితీ. 1:13-17; 16:18-20.

20 యెహోవా తన ప్రజలపట్ల కనికరం చూపిస్తాడు. అందుకే, తన ప్రజల్లో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా ఉండేలా ఆయన కొన్ని నియమాల్ని ఇచ్చాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తిపై తప్పుడు నేరం మోపే అవకాశాల్ని ధర్మశాస్త్రం తగ్గించింది. తనమీద ఎవరు నింద మోపారో తెలుసుకునే హక్కు నేరం మోపబడిన వ్యక్తికి ఉంటుంది. (ద్వితీ. 19:16-19; 25:1) అంతేకాదు, అతను నేరస్తుడని తీర్పు తీర్చాలంటే కనీసం ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం చెప్పాలి. (ద్వితీ. 17:6; 19:15) మరి ఎవరైనా నేరం చేయడాన్ని ఒక్క సాక్షి మాత్రమే చూస్తే, అప్పుడేంటి? ఆ నేరస్తుడు శిక్ష తప్పించుకుంటాడని అనుకోకూడదు, ఎందుకంటే యెహోవా ఆ నేరాన్ని చూశాడు. కుటుంబం విషయానికొస్తే, తండ్రికి కుటుంబంపై అధికారం ఉంటుంది, కానీ అది పరిమితమైనది. కొన్ని కుటుంబ వివాదాల్లో, నగర పెద్దలు జోక్యం చేసుకుని, వాళ్లే చివరి తీర్పు చెప్పాల్సి ఉంటుంది.—ద్వితీ. 21:18-21.

21 పాఠాలు: యెహోవా మనకు పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు; ఆయన చేసే ప్రతీది న్యాయంగానే ఉంటుంది. (కీర్త. 9:7) తన ప్రమాణాల్ని నమ్మకంగా పాటించేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్లను ఆయన శిక్షిస్తాడు. (2 సమూ. 22:21-23; యెహె. 9:9, 10) కొంతమంది చెడ్డపనులు చేసి, శిక్ష తప్పించుకున్నట్టు మనకు అనిపించవచ్చు. కానీ వాళ్లకు తగిన సమయంలో తీర్పు తీర్చబడేలా యెహోవా చూస్తాడు. (సామె. 28:13) ఒకవేళ వాళ్లు పశ్చాత్తాపపడకపోతే, “జీవంగల దేవుని చేతుల్లో పడడం భయంకరం” అని వాళ్లు త్వరలోనే తెలుసుకుంటారు.—హెబ్రీ. 10:30, 31.

ధర్మశాస్త్రం ముఖ్యంగా ఎలాంటివాళ్లను కాపాడింది?

తగాదాలను పరిష్కరించేటప్పుడు పెద్దలు యెహోవా ప్రేమను, న్యాయాన్ని అనుకరించాలి (22వ పేరా చూడండి) *

22-24. (ఎ) ధర్మశాస్త్రం ముఖ్యంగా ఎలాంటివాళ్లను కాపాడింది? మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (బి) నిర్గమకాండము 22:22-24⁠లో ఏ హెచ్చరిక ఉంది?

22 తమనుతాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న అనాథలను, విధవరాళ్లను, పరదేశులను ధర్మశాస్త్రం ముఖ్యంగా కాపాడింది. ఇశ్రాయేలులోని న్యాయాధిపతులకు యెహోవా ఇలా చెప్పాడు, “పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.” (ద్వితీ. 24:17) సమాజంలో చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ల పట్ల యెహోవా వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు. అలాంటివాళ్లతో కఠినంగా వ్యవహరించే వాళ్లను శిక్షిస్తానని కూడా ఆయన చెప్పాడు.—నిర్గమకాండము 22:22-24 చదవండి.

23 రక్తసంబంధుల మధ్య లైంగిక సంబంధాల్ని నిషేధించడం ద్వారా ధర్మశాస్త్రం కుటుంబ సభ్యుల్ని కాపాడింది. (లేవీ. 18:6-30) చుట్టుపక్కల జనాంగాల వాళ్లు అలాంటి తప్పుల్ని చేసేవాళ్లు, వాటిని చూసీచూడనట్లు వదిలేసేవాళ్లు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం అలాంటి తప్పుల్ని యెహోవా చూసినట్లు చూడాలి, అంటే వాటిని అసహ్యించుకోవాలి.

24 పాఠాలు: అధికార స్థానంలో ఉన్నవాళ్లు, తమ పర్యవేక్షణలో ఉన్నవాళ్లందరి పట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన లైంగిక పాపాల్ని అసహ్యించుకుంటాడు. అందరూ, ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లు కాపాడబడాలని, వాళ్లకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు.

“ధర్మశాస్త్రం రాబోయే ఆశీర్వాదాలకు నీడ”

25-26. (ఎ) ప్రేమ, న్యాయం ఊపిరి-జీవం లాంటివని ఎందుకు చెప్పవచ్చు? (బి) నాలుగు ఆర్టికల్స్‌లోని రెండో ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

25 ప్రేమ, న్యాయం ఊపిరి-జీవం లాంటివి; ఒకటి లేకుండా మరొకటి ఉండదు. యెహోవా మనతో న్యాయంగా వ్యవహరిస్తున్నాడనే నమ్మకం కుదిరినప్పుడు, ఆయన మీద మనకున్న ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు మనం దేవున్ని, ఆయన నీతి ప్రమాణాల్ని ప్రేమించినప్పుడు ఇతరులతో ప్రేమగా, న్యాయంగా వ్యవహరించాలనే పురికొల్పు పొందుతాం.

26 ఇశ్రాయేలీయులు యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండేలా ధర్మశాస్త్ర ఒప్పందం సహాయం చేసింది. అయితే, యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, దాని స్థానంలో అంతకన్నా మెరుగైనది మరొకటి వచ్చింది కాబట్టి దేవుని ప్రజలు ఇక ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (రోమా. 10:4) అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని “రాబోయే ఆశీర్వాదాలకు నీడ” అని వర్ణించాడు. (హెబ్రీ. 10:1) అయితే, ఈ నాలుగు ఆర్టికల్స్‌లోని రెండో ఆర్టికల్‌లో ఇంకొన్ని మంచి విషయాలతోపాటు, క్రైస్తవ సంఘంలో ప్రేమ, న్యాయం ఉండడం ఎంత ప్రాముఖ్యమో చర్చిస్తాం.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

^ పేరా 5 యెహోవా మనపట్ల శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో వివరించే నాలుగు ఆర్టికల్స్‌లో ఇది మొదటిది. మిగతా మూడు ఆర్టికల్స్‌ 2019, మే కావలికోట సంచికలో వస్తాయి. రెండో ఆర్టికల్‌లో, యెహోవా క్రైస్తవ సంఘంలో ప్రేమను, న్యాయాన్ని ఎలా చూపిస్తున్నాడో చర్చిస్తాం. మూడో ఆర్టికల్‌లో, చెడుతనం మధ్య యెహోవా ప్రేమ, న్యాయం ఎలా చూపిస్తున్నాడో చర్చిస్తాం. నాలుగో ఆర్టికల్‌లో, లైంగిక వేధింపులకు గురైన వాళ్లకు ఎలా ఊరట ఇవ్వవచ్చో చర్చిస్తాం.

^ పేరా 2 పదాల వివరణ: యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 600 కన్నా ఎక్కువ నియమాల్ని “ధర్మశాస్త్రం,” “మోషే ధర్మశాస్త్రం,” “ఆజ్ఞలు” అని పిలుస్తారు. అంతేకాదు, బైబిల్లో ఉన్న మొదటి ఐదు పుస్తకాల్ని (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు) ధర్మశాస్త్రం అని తరచూ పిలుస్తారు. కొన్నిసార్లు ధర్మశాస్త్రం అనే పదం హీబ్రూ లేఖనాలన్నిటినీ కూడా సూచిస్తుంది.

^ పేరా 60 చిత్రాల వివరణ: భోజనం సిద్ధం చేసేటప్పుడు, ఇశ్రాయేలీయురాలైన ఒక తల్లి తన కూతుళ్లతో మాట్లాడుతోంది. వాళ్ల వెనకాల, గొర్రెల్ని ఎలా కాయాలో తన కొడుకుకు నేర్పిస్తున్న తండ్రి.

^ పేరా 64 చిత్రాల వివరణ: ఒక వ్యాపారి ఒక విధవరాలితో, ఆమె కొడుకుతో దురుసుగా ప్రవర్తించినప్పుడు, నగర ద్వారాల దగ్గరున్న పెద్దలు ఆమెకు ప్రేమగా సహాయం చేస్తున్నారు.