మీకు తెలుసా?
పూర్వం ఇశ్రాయేలీయులు కన్యాశుల్కాన్ని ఎందుకు ఇచ్చేవాళ్లు?
బైబిలు కాలాల్లో ఎవరికైనా పెళ్లి కుదిరితే పెళ్లికొడుకు కుటుంబంవాళ్లు, పెళ్లికూతురు కుటుంబానికి కన్యాశుల్కం ఇచ్చేవాళ్లు. దానిలో భాగంగా విలువైన వస్తువుల్ని, జంతువుల్ని లేదా డబ్బును ఇచ్చేవాళ్లు. కొన్నిసార్లు కష్టపడి పనిచేయడం ద్వారా కన్యాశుల్కాన్ని ఇచ్చేవాళ్లు. ఉదాహరణకు, రాహేలును పెళ్లి చేసుకోవడానికి యాకోబు ఏడు సంవత్సరాలు ఆమె తండ్రి దగ్గర కష్టపడి పనిచేశాడు. (ఆది. 29:17, 18, 20) ఇంతకీ ఇశ్రాయేలీయులు కన్యాశుల్కాన్ని ఎందుకు ఇచ్చేవాళ్లు?
బైబిలు విద్వాంసుడైన క్యారల్ మేయర్స్ చెప్తున్నట్టు, ‘వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఆడపిల్లలు కష్టపడి పనిచేసేవాళ్లు. వాళ్ల కష్టం ఆ కుటుంబానికి ప్రాముఖ్యమైనది. కాబట్టి వాళ్లు పెళ్లిచేసుకుని వెళ్లిపోయినప్పుడు కలిగే నష్టాన్ని పూరించడానికి కన్యాశుల్కం ఉపయోగపడేది.’ పెళ్లితో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన బంధుత్వం బహుశా కన్యాశుల్కం వల్ల బలపడేది. దాంతో ఆ రెండు కుటుంబాలు, కష్టసమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి వీలయ్యేది. అంతేకాదు కన్యాశుల్కాన్ని ఇచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని, ఆమె తన తండ్రి సంరక్షణ నుండి భర్త సంరక్షణలోకి వెళ్తుందని అది తెలియజేసేది.
కన్యాశుల్కాన్ని ఇచ్చినంత మాత్రాన భార్య అంటే కొనుక్కునే లేదా అమ్మే ఒక వస్తువని అర్థంకాదు. ఏన్షియంట్ ఇజ్రాయిల్—ఇట్స్ లైఫ్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “అమ్మాయి కుటుంబానికి కొంత డబ్బును లేదా దానికి సరిగ్గా సరిపోయే దేన్నైనా ఖచ్చితంగా ఇవ్వడం వల్ల, ఇశ్రాయేలీయుల పెళ్లి చూడడానికి ఒక కొనుగోలులా ఉండేది. కానీ వాళ్లు [కన్యాశుల్కాన్ని], అమ్మాయిలేని లోటును పూరించడానికి ఇచ్చే పరిహారంగా చూశారేగానీ, అమ్మాయిని కొనడానికి ఇచ్చే డబ్బులా చూడలేదని అనిపిస్తుంది.”
నేడు కొన్నిదేశాల్లో కన్యాశుల్కం ఇచ్చే ఆచారాన్ని ప్రజలు ఇంకా పాటిస్తున్నారు. అలాంటి దేశాల్లో ఉండే క్రైస్తవ తల్లిదండ్రులు ఎక్కువ కన్యాశుల్కాన్ని అడగకుండా ఉండడం ద్వారా, వాళ్లు ‘పట్టుబట్టే ప్రజలు కాదని అందరికీ తెలియజేస్తారు.’ (ఫిలి. 4:5; 1 కొరిం. 10:32, 33) అలాగే “డబ్బును ప్రేమించేవాళ్లు” లేదా అత్యాశపరులు కారని వాళ్లు చూపిస్తారు. (2 తిమో. 3:2) అంతేకాదు, అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువ కన్యాశుల్కాన్ని అడగకుండా ఉంటే, పెళ్లిచేసుకునే అబ్బాయి సరిపడా డబ్బును సంపాదించేదాకా పెళ్లిని వాయిదా వేయాల్సిన పరిస్థితి రాదు. లేదా పెద్దమొత్తంలో కన్యాశుల్కాన్ని ఇవ్వడానికి అతను పయినీరు సేవ ఆపేసి, ఫుల్‌టైమ్ ఉద్యోగం చేయాల్సిన అవసరం రాదు.
కొన్ని దేశాల్లో, కన్యాశుల్కానికి సంబంధించి చట్టం కొన్ని నియమాల్ని పెట్టింది. అక్కడ జీవించే క్రైస్తవ తల్లిదండ్రులు ఆ నియమాలకు లోబడతారు. ఎందుకంటే, క్రైస్తవులు ‘పై అధికారులకు లోబడాలని,’ దేవుని నియమాలకు వ్యతిరేకంగా లేని చట్టాలకు లోబడాలని బైబిలు చెప్తుంది.—రోమా. 13:1; అపొ. 5:29.