అధ్యయన ఆర్టికల్ 9
జీవం దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతి
“ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.”—అపొ. 17:28.
పాట 141 జీవం ఒక అద్భుతం
ఈ ఆర్టికల్లో . . . a
1. యెహోవా మన ప్రాణాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నాడు?
మీ ఫ్రెండ్ ఒకరు మీకు ఒక ఇల్లును బహుమతిగా ఇచ్చారనుకోండి. కానీ దానికి కొన్ని పెచ్చులు ఊడిపోయాయి, అక్కడక్కడ సున్నం కొట్టుకుపోయింది. ఆ సమస్యలున్నా ఆ ఇంటి విలువ కొన్ని లక్షల్లో ఉంది. ఆ బహుమతిని బట్టి మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా చాలా సంతోషిస్తారు. ఆ ఇంటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే యెహోవా కూడా మనకు వెలకట్టలేని బహుమతిని ఇచ్చాడు, అదే జీవం. నిజానికి, యెహోవా మన ప్రాణాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నాడో చెప్పడానికి తన కుమారుణ్ణి మనకోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడు.—యోహా. 3:16.
2. రెండో కొరింథీయులు 7:1 ప్రకారం, యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు?
2 యెహోవాయే జీవానికి మూలం. (కీర్త. 36:9) ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు నమ్మాడు కాబట్టే ఆయన ఇలా అన్నాడు: “ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.” (అపొ. 17:25, 28) దీన్నిబట్టి జీవం దేవుడిచ్చిన బహుమతి అని చెప్పవచ్చు. ఆయన జీవాన్ని ఇవ్వడమేకాదు దాన్ని కాపాడుకోవడానికి అవసరమైనవన్నీ ఇచ్చాడు. (అపొ. 14:15-) అయితే యెహోవా అద్భుత రీతిలో మన ప్రాణాల్ని కాపాడడు. బదులుగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ ఆయన సేవ చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ( 172 కొరింథీయులు 7:1 చదవండి.) ఇంతకీ మన ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఎందుకు కాపాడుకోవాలి? దాన్ని ఎలా చేయవచ్చు?
దేవుడిచ్చిన బహుమతికి విలువివ్వండి
3. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎందుకు కృషిచేయాలి?
3 మనం యెహోవా సేవను పూర్తి బలంతో చేయాలనుకుంటాం కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కష్టపడతాం. (మార్కు 12:30) మన ‘శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించాలి’ అంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసేవాటికి దూరంగా ఉండాలి. (రోమా. 12:1) నిజానికి కొన్నిసార్లు మనం ఎంత చేసినా వచ్చే జబ్బులు రాకుండా ఆపలేం. అయితే, ఆరోగ్యంగా ఉండడానికి వీలైనంత ఎక్కువ కృషిచేసినప్పుడు మన తండ్రైన యెహోవా ఇచ్చిన జీవం అనే బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం.
4. రాజైన దావీదు ఏం కోరుకున్నాడు?
4 రాజైన దావీదు దేవుడిచ్చిన జీవం అనే బహుమతిని చాలా విలువైనదిగా చూశాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “నేను చనిపోవడం వల్ల, గోతిలోకి దిగిపోవడం వల్ల ఏం లాభం? మట్టి నిన్ను స్తుతిస్తుందా? అది నీ నమ్మకత్వం గురించి తెలియజేస్తుందా?” (కీర్త. 30:9) దావీదు ముసలివాడై చనిపోవడానికి కొన్నిరోజుల ముందే ఈ మాటలు రాసివుండవచ్చు. ఆయన చనిపోవాలని కోరుకోలేదు కానీ బ్రతికివుండి, వీలైనంత ఆరోగ్యంగా ఉంటూ దేవుని సేవ చేయాలని కోరుకున్నాడు. నిజానికి, మనందరం కూడా అదే కోరుకుంటాం.
5. మనం ఎంత ముసలివాళ్లమైనా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా ఏం చేయవచ్చు?
5 కొన్నిసార్లు మన ఆరోగ్యం పాడవ్వవచ్చు, వయసైపోవచ్చు. దానివల్ల ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేకపోతున్నామనే చిరాకు, బాధ ఉండవచ్చు. కానీ నిరుత్సాహపడి, మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత ముసలివాళ్లమైనా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా దావీదు రాజులాగే యెహోవా సేవ చేయవచ్చు. యెహోవా దృష్టిలో మన విలువ తగ్గదు అని తెలుసుకోవడం ఎంత ఊరటగా అనిపిస్తుందో కదా. (మత్త. 10:29-31) ఒకవేళ మనం చనిపోయినా యెహోవా మనల్ని మళ్లీ బ్రతికించడానికి ఎదురుచూస్తాడు. (యోబు 14:14, 15) కాబట్టి మనం ప్రాణాలతో ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉండాలి.
ఆరోగ్యాన్ని పాడు చేసేవాటికి దూరంగా ఉండండి
6. తినడం, తాగడం విషయంలో యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు?
6 బైబిలు వైద్య పుస్తకం కాదు. లేదా ఏం తినాలి, ఏం తినకూడదు అనే చిట్కాలు అందులో లేవు. కానీ ఆరోగ్యం విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటో బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, మన శరీరం నుండి “హానికరమైన వాటిని” తీసేసుకోమని యెహోవా మనకు చెప్తున్నాడు. (ప్రసం. 11:10) అతిగా తినడం, అతిగా తాగడం ప్రాణాంతకం అనీ, మనం అలా చేయకూడదనీ బైబిలు చెప్తుంది. (సామె. 23:20) వాటి విషయంలో మనం నిగ్రహం పాటించాలని యెహోవా ఆశిస్తున్నాడు.—1 కొరిం. 6:12; 9:25.
7. మన ఆరోగ్యం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సామెతలు 2:11 ఎలా సహాయం చేస్తుంది?
7 జీవం అనే బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపించడానికి మనం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. (కీర్త. 119:99, 100; సామెతలు 2:11 చదవండి.) ఉదాహరణకు తినడం గురించే తీసుకోండి. మనకు ఫలానా ఆహారమంటే బాగా ఇష్టం. కానీ అది తింటే మన ఆరోగ్యం పాడౌతుందని తెలిస్తే మనం దాన్ని దూరం పెడతాం. అంతేకాదు, మనం కంటినిండా నిద్రపోవడం ద్వారా, క్రమంగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, మన ఒంటిని-ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం ద్వారా తెలివైనవాళ్లమని చూపిస్తాం.
ప్రమాదాలు జరగకుండా చూసుకోండి
8. ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం యెహోవా దృష్టిలో ప్రాముఖ్యమని బైబిలు ఎలా చూపిస్తుంది?
8 ఇంట్లో అలాగే పని స్థలంలో పెద్దపెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంలో చెప్పాడు. (నిర్గ. 21:28, 29; ద్వితీ. 22:8) ఒక వ్యక్తి చేసిన పనివల్ల అనుకోకుండా ఇంకో వ్యక్తి ప్రాణం పోతే తీవ్రమైన పర్యవసానాలు ఎదురయ్యేవి. (ద్వితీ. 19:4, 5) అంతేకాదు, అనుకోకుండా గర్భంలో ఉన్న శిశువుకు హాని జరిగినా శిక్ష ఉంటుందని ధర్మశాస్త్రం చెప్పింది. (నిర్గ. 21:22, 23) కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుందని లేఖనాల్ని బట్టి అర్థమౌతుంది. యెహోవా కోరిక కూడా అదే.
9. ప్రమాదాలు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
9 మనం ఇంట్లో, పని స్థలంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా జీవం అనే బహుమతి పట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాం. ఉదాహరణకు పనికిరాని బ్లేడ్లు, కత్తులు, హానికరమైన కెమికల్స్ లేదా మందులు ఎక్కడబడితే అక్కడ కాకుండా జాగ్రత్తగా పడేస్తాం. వాటిని పిల్లలకు అందకుండా దూరంగా పెడతాం. మనం మంట వెలిగిస్తున్నప్పుడు, లేదా నీళ్లు కాగబెడుతున్నప్పుడు, ఏదైనా కరెంటు పని చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉండం. అలాగే సరిపడా నిద్రలేనప్పుడు, మద్యం తాగినప్పుడు, కొన్ని రకాల మందులు వాడినప్పుడు డ్రైవింగ్ చేయం. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడం.
ఊహించని ఆపదలు ఎదురైనప్పుడు
10. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, అది రాకముందు మనం ఏం చేయవచ్చు?
10 కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు, అంటువ్యాధులు లేదా అల్లర్లు చెలరేగినప్పుడు మన ప్రాణం ప్రమాదంలో పడే అవకాశముంది. మనం అలాంటి విపత్తుల్ని ఆపలేకపోవచ్చు. కానీ మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ నిర్దేశాల్ని పాటించాలి. (రోమా. 13:1, 5-7) కొన్నిసార్లు ప్రభుత్వాలు విపత్తుకు ముందస్తు సూచనలు ఇవ్వవచ్చు, సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లమని చెప్పవచ్చు. అలాంటప్పుడు మనం వాటిని తూ.చా. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకు కావల్సిన ఆహారం, నీళ్లు, ఫస్ట్-ఎయిడ్ కిట్ మన దగ్గర ఉండేలా చూసుకోవాలి.
11. మనచుట్టూ అంటువ్యాధి వ్యాపిస్తున్నప్పుడు ఏం చేయాలి?
11 ఒకవేళ మనచుట్టూ ఏదైనా అంటువ్యాధి వ్యాపిస్తుంటే ఏం చేయాలి? చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, క్వారెంటీన్ అవ్వడం లాంటి ప్రభుత్వ నిర్దేశాల్ని మనం పాటించాలి. వీటిని తూ.చా. తప్పకుండా పాటించినప్పుడు జీవం అనే బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం.
12. సామెతలు 14:15 ప్రకారం, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఎలాంటి సమాచారం గురించి జాగ్రత్తగా ఉండాలి?
12 సాధారణంగా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, దానిగురించి మన స్నేహితుల మధ్య, ఇరుగుపొరుగువాళ్ల మధ్య, టీవీల్లో గాలి వార్తలు ఎక్కువగా వ్యాప్తి ఔతుంటాయి. కాబట్టి మన చెవిన పడ్డ “ప్రతీ మాట” నమ్మే బదులు ప్రభుత్వం, వైద్య సిబ్బంది ఇచ్చే నమ్మదగిన సమాచారాన్ని వినడం తెలివైన పని. (సామెతలు 14:15 చదవండి.) పరిపాలక సభ అలాగే బ్రాంచి కార్యాలయాలు వీలైనంత ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి సంఘ కూటాలకు, పరిచర్యకు సంబంధించి నిర్దేశాలు ఇస్తారు. (హెబ్రీ. 13:17) మనం ఆ నిర్దేశాల్ని పాటించడం వల్ల మన ప్రాణాల్నే కాదు, ఇతరుల ప్రాణాల్ని కూడా కాపాడిన వాళ్లమౌతాం. అంతేకాదు మనం ఉంటున్న ప్రాంతంలో యెహోవాసాక్షులకు మంచిపేరు తీసుకొస్తాం.—1 పేతు. 2:12.
రక్తం ఎక్కించుకునే పరిస్థితుల గురించి సిద్ధపడండి
13. రక్తం విషయంలో యెహోవా ఆజ్ఞను పాటిస్తూనే జీవం పట్ల గౌరవాన్ని ఎలా చూపిస్తాం?
13 యెహోవాసాక్షులు రక్తాన్ని పవిత్రంగా ఎంచుతారని చాలామందికి తెలుసు. మనం యెహోవా ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినాసరే రక్తాన్ని ఎక్కించుకోం. (అపొ. 15:28, 29) అంతమాత్రాన మనకు ప్రాణం అంటే లెక్కలేదని కాదు. మనం యెహోవా ఇచ్చిన జీవం అనే బహుమతిని చాలా విలువైనదిగా ఎంచుతాం. కాబట్టి రక్తం లేకుండా మెరుగైన వైద్యాన్ని చేయడానికి డాక్టర్లు ముందుకొస్తే, దాన్ని తీసుకోవడానికి మనం వెనకాడం.
14. ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు రాకుండా మనం ఎలా చూసుకోవచ్చు?
14 ఈ ఆర్టికల్లో ఇవ్వబడిన సలహాల్ని పాటిస్తే ఆపరేషన్లు గానీ, పెద్దపెద్ద వైద్య చికిత్సలు గానీ చేయించుకోవాల్సిన పరిస్థితి రాకపోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, దాన్నుండి త్వరగా కోలుకునే అవకాశముంది. కాబట్టి మన పనిస్థలంలో అలాగే ఇంట్లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం ద్వారా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించడం ద్వారా అత్యవసర పరిస్థితులు గానీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు గానీ రావు.
15. (ఎ) డిపిఎ కార్డును నింపి, ఎప్పుడూ మనతోనే ఉంచుకోవడం ఎందుకు మంచిది? (చిత్రం కూడా చూడండి.) (బి) ఈ వీడియోలో చూసినట్టు, రక్తానికి సంబంధించి మన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
15 జీవం అనే బహుమతిని మనం విలువైనదిగా ఎంచుతాం కాబట్టి అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్ లేదా డిపిఎ కార్డును నింపుతాం. దాన్ని ఎప్పుడూ మనతోనే ఉంచుకుంటాం. ఈ డాక్యుమెంట్లో రక్తమార్పిడుల గురించి అలాగే కొన్ని రకాల వైద్యాల గురించి మన నిర్ణయాల్ని రాసి పెట్టుకుంటాం. మీ డిపిఎ కార్డులో తాజా సమాచారం ఉందా? ఒకవేళ మీరు దాన్ని నింపాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా ఆలస్యం చేయకండి, దాన్ని వెంటనే నింపండి. వైద్యం విషయంలో మన నిర్ణయాల్ని ముందే రాసి పెట్టుకోవడంవల్ల డాక్టర్లతో చర్చించే సమయం వృథా అవ్వకుండా సరైన సమయంలో మనకు వైద్యం అందుతుంది. అంతేకాదు, మన ఒంటికి పడని వైద్యం చెయ్యకుండా జాగ్రత్తపడడానికి వైద్య సిబ్బందికి ఆ డాక్యుమెంట్ సహాయం చేస్తుంది. b
16. డిపిఎ కార్డు ఎలా నింపాలో మీకు తెలీకపోతే ఏం చేయాలి?
16 మనం ఏ వయసువాళ్లమైనా, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదోక సందర్భంలో ప్రమాదానికి గురౌతాం, అనారోగ్యపాలౌతాం. (ప్రసం. 9:11) కాబట్టి డిపిఎ కార్డును నింపి పెట్టుకోవడం తెలివైన పని. దాన్నెలా నింపాలో మీకు తెలీకపోతే, మీ పెద్దల్ని అడగండి. ఆ డాక్యుమెంట్ నింపడానికి వాళ్లు సహాయం చేస్తారే గానీ మీకోసం వైద్య నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదే. (గల. 6:4, 5) అయితే వాళ్లు ఆ డాక్యుమెంట్లో ఉన్న వేర్వేరు అంశాల్ని మీకు వివరిస్తారు. దాన్నిబట్టి మీ నిర్ణయాల్ని రాసి పెట్టుకోవచ్చు.
పట్టుబట్టేవాళ్లుగా ఉండకండి
17. ఆరోగ్యం విషయంలో మనం పట్టుబట్టేవాళ్లం కాదని ఎలా చూపించవచ్చు?
17 మన ఆరోగ్యం గురించి, మనం తీసుకునే వైద్యం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేఖనాల్ని పరిశీలిస్తాం. (అపొ. 24:16; 1 తిమో. 3:9) అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, అలాగే వాటిని వేరేవాళ్లతో చర్చిస్తున్నప్పుడు ఫిలిప్పీయులు 4:5 లో ఉన్న సూత్రాన్ని మనం పాటిస్తాం. అక్కడ ఇలా ఉంది, “మీరు పట్టుబట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి.” మనం పట్టుబట్టేవాళ్లంగా ఉండకూడదంటే మన ఆరోగ్యం గురించి మరీ అతిగా ఆలోచించకూడదు లేదా మన అభిప్రాయాల్ని వేరేవాళ్లపైన రుద్దకూడదు. మనలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినా మన బ్రదర్స్ సిస్టర్స్ అంటే మనకు ఇష్టం. కాబట్టి వాళ్లను మనం గౌరవిస్తాం.—రోమా. 14:10-12.
18. జీవం అనే బహుమతికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
18 మన ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ మన పూర్తి శక్తితో, జీవానికి మూలమైన యెహోవాకు సేవచేయడం ద్వారా మన కృతజ్ఞతను చూపించవచ్చు. (ప్రక. 4:11) ప్రస్తుతమైతే రోగాల్ని, విపత్తుల్ని మనం తప్పించుకోలేం. నిజానికి అవి సృష్టికర్త ఉద్దేశంలోనే లేవు. అందుకే ఆయన నొప్పి, చావు లేని కాలాన్ని తీసుకొస్తాడు. (ప్రక. 21:4) ఈలోపు, మనం ప్రాణాలతో ఉన్నంతకాలం మన ప్రియ పరలోక తండ్రైన యెహోవా సేవ చేయడంకన్నా మనకు ఇంకేం కావాలి.
పాట 140 పరదైసులో శాశ్వత జీవితం!
a జీవం అనే వెలకట్టలేని బహుమతి ఇచ్చినందుకు మనం కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చో ఈ ఆర్టికల్లో చూస్తాం. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మన ప్రాణాల్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ పనులు చేయాలో చూస్తాం. అలాగే ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే ఎలా సిద్ధపడవచ్చో కూడా చూస్తాం.
b రక్తాన్ని ఉపయోగించే వైద్య విధానాలకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు? అనే వీడియోను jw.orgలో చూడండి.
c చిత్రాల వివరణ: ఒక యౌవన సహోదరుడు డిపిఎ కార్డును నింపి తను ఎక్కడికెళ్లినా దాన్ని తీసుకెళ్తున్నాడు.