కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా చదవండి

బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా చదవండి

“నీకేం అర్థమైంది?”​—లూకా 10:26.

పాట 97 దేవుని మాట వల్లే జీవిస్తాం

ఈ ఆర్టికల్‌లో . . . a

1. యేసు లేఖనాల్ని విలువైనవిగా చూశాడని ఎందుకు చెప్పవచ్చు?

 యేసు బోధిస్తుంటే ఆయన మాటలు వింటూ ఉండడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆయనకు లేఖనాలు బాగా గుర్తుండేవి. ఆయన వాటిని తరచూ ఉపయోగిస్తూ మాట్లాడేవాడు. నిజానికి బాప్తిస్మం తర్వాత ఆయన అన్న మాటలు, చనిపోయేముందు ఆయన అన్న మాటలు లేఖనాల్లోనివే. b (ద్వితీ. 8:3; కీర్త. 31:5; లూకా 4:4; 23:46) అంతేకాదు ఆయన పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాలు లేఖనాల్ని ఉపయోగించి మాట్లాడాడు. వాటిని బిగ్గరగా చదివి వివరించాడు.—మత్త. 5:17, 18, 21, 22, 27, 28; లూకా 4:16-20.

యేసుకు లేఖనాలు బాగా తెలియడమేకాదు ఆయన వాటిని ప్రేమించాడు, వాటి ప్రకారం జీవించాడు (2వ పేరా చూడండి)

2. లేఖనాల్ని బాగా తెలుసుకోవడానికి యేసుకు ఏం సహాయం చేసింది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

2 యేసు పరిచర్య మొదలుపెట్టడానికి చాలా సంవత్సరాల ముందే దేవుని వాక్యాన్ని బాగా చదువుతుండేవాడు, వింటుండేవాడు. ఇంట్లో యోసేపు, మరియలు లేఖనాల్ని ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు కూడా యేసు ఖచ్చితంగా వినుంటాడు. c (ద్వితీ. 6:6, 7) అలాగే ప్రతీ విశ్రాంతి రోజున కుటుంబంతో కలిసి యేసు కూడా సమాజమందిరానికి వెళ్లేవాడు. (లూకా 4:16) అక్కడ కూడా లేఖనాల్ని చదువుతుంటే ఆయన శ్రద్ధగా వినేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనే సొంతగా లేఖనాల్ని చదవడం నేర్చుకుని ఉంటాడు. అందుకే యేసుకు లేఖనాలు బాగా తెలియడమేకాదు ఆయన వాటిని ప్రేమించాడు, వాటి ప్రకారం జీవించాడు. ఉదాహరణకు, యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఆలయంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన బోధకులు “ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు.”—లూకా 2:46, 47, 52.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

3 బైబిల్ని మనం రోజూ చదివితే మనకు కూడా లేఖనాలు బాగా తెలుస్తాయి, వాటిని ప్రేమిస్తాం. అయితే మనం చదువుతున్న దాని నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో యేసు అన్న మాటల్లో దానికి జవాబు ఉంది. ఆ మతనాయకులు లేఖనాల్ని బాగా చదివేవాళ్లు కానీ వాళ్లు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందలేకపోయారు. వాళ్లు లేఖనాల్ని చదివేటప్పుడు ఈ మూడు పనులు చేసి ఉంటే వాటినుండి ప్రయోజనం పొందేవాళ్లు. అవేంటో యేసు మాటల్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. (1) చదివినదాన్ని బాగా అర్థంచేసుకోవడం, (2) విలువైన బైబిలు సత్యాల్ని వెలికి తీయడం, (3) దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకోవడం. మనం కూడా బైబిల్లో చదివే వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఆ మూడు పనులు చేయాలి. వాటి గురించే ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

బైబిల్ని అర్థంచేసుకుంటూ చదవండి

4. దేవుని వాక్యాన్ని చదవడం గురించి లూకా 10:25-29 ఏం చెప్తుంది?

4 మనం దేవుని వాక్యాన్ని అర్థంచేసుకుంటూ చదవాలి. లేకపోతే దాని నుండి పూర్తి ప్రయోజనం పొందలేం. ఉదాహరణకు, “ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి” యేసుతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకోండి. (లూకా 10:25-29 చదవండి.) ఆ వ్యక్తి శాశ్వత జీవితం పొందాలంటే నేను ఏం చేయాలని యేసును అడిగాడు. దానికి జవాబు దేవుని వాక్యంలోనే తెలుసుకునేలా యేసు సహాయం చేశాడు. యేసు అతన్ని “ధర్మశాస్త్రంలో ఏం రాసివుంది? నీకేం అర్థమైంది?” అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి దేవున్ని అలాగే పొరుగువాళ్లను ప్రేమించాలని లేఖనం చెప్తుందని అతను అన్నాడు. అది సరైన జవాబే. (లేవీ. 19:18; ద్వితీ. 6:5) కానీ ఆ తర్వాత, అతను “ఇంతకీ నా పొరుగువాడు ఎవరు?” అని యేసును అడిగాడు. దీన్నిబట్టి ఆ వ్యక్తి లేఖనాల్ని చదివాడు గానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తుంది. అందుకే తన జీవితంలో ఆ లేఖనాల్ని ఎలా పాటించాలో అతనికి తెలియలేదు.

బైబిల్ని అర్థంచేసుకుంటూ చదవడం మనందరం నేర్చుకోవచ్చు

5. ప్రార్థించడం, మెల్లగా చదవడం బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి?

5 చదివే విషయంలో మంచి అలవాట్లను పెంచుకుంటే దేవుని వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. దానికి సంబంధించి కొన్ని సలహాల్ని ఇప్పుడు చూద్దాం. చదివే ముందు ప్రార్థించండి. లేఖనాల్ని అర్థం చేసుకోవాలంటే మనకు యెహోవా సహాయం అవసరం. కాబట్టి మనసుపెట్టి చదవడానికి తన పవిత్రశక్తిని ఇవ్వమని మనం అడగవచ్చు. తర్వాత గబగబ కాకుండా మెల్లగా చదవండి. అప్పుడు చదివేవి మీకు అర్థమౌతాయి. బహుశా మీరు బయటికి చదవచ్చు. లేదా బైబిలు ఆడియో రికార్డింగ్‌ వింటూ చదవచ్చు. అలా రికార్డింగ్‌ని వింటూ లేఖనాల్ని చూడడంవల్ల మీరు వాటిని బాగా అర్థం చేసుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు, ఎక్కువ నేర్చుకోగలుగుతారు. (యెహో. 1:8) చదివిన తర్వాత మళ్లీ ప్రార్థించండి. ఈసారి తన వాక్యాన్ని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞత చెప్పండి. అలాగే చదివినదాన్ని పాటించడానికి సహాయం చేయమని అడగండి.

చదువుతున్నదాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి నోట్సు రాసుకోవడం ఎందుకు సహాయం చేస్తుంది? (6వ పేరా చూడండి)

6. చదివేటప్పుడు కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించడం, నోట్సు రాసుకోవడం ఎందుకు మంచిది? (చిత్రం కూడా చూడండి.)

6 బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో రెండు సలహాలు పాటించవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని చదివిన తర్వాత కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, ‘ఈ లేఖనాల్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు? ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది?’ ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు ముఖ్యమైన విషయాల్ని బాగా అర్థంచేసుకోవచ్చు. ఇంకో సలహా ఏంటంటే, చదివిన వాటిని నోట్సు రాసుకోండి. అలా చేస్తే చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించగలుగుతాం. అలాగే మనకు ఎంతవరకు అర్థమైందో స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇంతకీ మీరు ఏమేమి రాసుకోవచ్చు? మీకు వచ్చే ప్రశ్నల్ని, మీరు పరిశోధించి తెలుసుకున్న విషయాల్ని, ముఖ్యమైన అంశాల్ని రాసుకోవచ్చు. చదివిన వాటిగురించి మీకు ఏం అనిపించిందో, మీరు వేటిని పాటించాలని అనుకుంటున్నారో కూడా రాసుకోవచ్చు. అలా రాసుకోవడం వల్ల దేవుని వాక్యం మీ కోసమే రాయబడిందనే నమ్మకం కలుగుతుంది.

7. బైబిల్ని చదువుతున్నప్పుడు మనకు ఏ లక్షణం అవసరం? ఎందుకు? (మత్తయి 24:15)

7 దేవుని వాక్యాన్ని చదివి బాగా అర్థం చేసుకోవాలంటే వివేచన అనే లక్షణం చాలా అవసరమని యేసు చెప్పాడు. (మత్తయి 24:15 చదవండి.) వివేచన అంటే ఒక విషయానికి, ఇంకో విషయానికి మధ్య ఉన్న పోలికలు-తేడాలు గుర్తించడం, అలాగే సూటిగా చెప్పని విషయాల్ని కూడా అర్థం చేసుకోవడం. అంతేకాదు, ఏదైన ఒక సంఘటన బైబిలు ప్రవచనాల్ని ఎలా నెరవేరుస్తుందో గుర్తించాలంటే మనకు వివేచన అవసరం. బైబిల్లో మనం చదువుతున్న ప్రతీ దాని నుండి ప్రయోజనం పొందాలంటే కూడా ఈ లక్షణం అవసరం.

8. వివేచన ఉపయోగించి చదవడం అంటే ఏంటి?

8 తన సేవకులకు యెహోవా వివేచన ఇస్తాడు. కాబట్టి ఆయనకు ప్రార్థించి ఆ లక్షణాన్ని పెంచుకోవడానికి సహాయం చేయమని అడగండి. (సామె. 2:6) అయితే మీ ప్రార్థనకు తగ్గట్టు వివేచన ఉపయోగిస్తూ ఎలా చదవచ్చు? చదువుతున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చదివిన వాటికి, ఇప్పటికే మీకు తెలిసిన వాటికి ఎలాంటి సంబంధం ఉందో ఆలోచించండి. దానికోసం యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం లాంటి మన పరిశోధన పనిముట్లను ఉపయోగించండి. చదివిన బైబిలు భాగాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని జీవితంలో ఎలా పాటించాలో తెలుసుకోవడానికి ఈ పనిముట్లు మీకు సహాయం చేస్తాయి. (హెబ్రీ. 5:14) మీరు ఇలా వివేచన ఉపయోగించి చదివితే లేఖనాల్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు.

విలువైన బైబిలు సత్యాల్ని వెలికి తీయండి

9. సద్దూకయ్యులు దేవుని వాక్యంలోని ఏ ముఖ్యమైన సత్యాన్ని పట్టించుకోలేదు?

9 హీబ్రూ లేఖనాల్లో మొదటి ఐదు పుస్తకాలు సద్దూకయ్యులకు కొట్టిన పిండి. కానీ వాటిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని వాళ్లు చూసీచూడనట్టు వదిలేశారు. ఉదాహరణకు, పునరుత్థానం గురించి సద్దూకయ్యులు యేసును అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో గమనించండి. ఆయన వాళ్లతో, “ముళ్లపొద దగ్గర దేవుడు మోషేతో అన్న మాటలు అతను రాసిన పుస్తకంలో మీరు చదవలేదా? దేవుడు అతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు.” (మార్కు 12:18, 26) ఈ విషయాన్ని సద్దూకయ్యులు చాలాసార్లు చదివుంటారు. కానీ పునరుత్థానం గురించిన ముఖ్యమైన సత్యాన్ని వాళ్లు పట్టించుకోలేదని యేసు అడిగిన ప్రశ్నను బట్టి అర్థమౌతుంది.—మార్కు 12:27; లూకా 20:38. d

10. మనం చదివేటప్పుడు ఏం చేయడానికి ప్రయత్నించాలి?

10 దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిలు చదువుతున్నప్పుడు, మనం చదివే దాని నుండి ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనం ప్రాథమిక బైబిలు సత్యాలే కాకుండా లోతైన విషయాల్ని, సూటిగా లేని సూత్రాల్ని కూడా తవ్వి తీయాలి.

11. రెండో తిమోతి 3:16, 17 ప్రకారం, బైబిల్లోని విలువైన సత్యాల్ని మీరెలా వెలికి తీయగలరు?

11 బైబిలు చదువుతున్నప్పుడు అందులోని విలువైన సత్యాల్ని ఎలా బయటికి తీయవచ్చు? 2 తిమోతి 3:16, 17 (చదవండి.) ప్రకారం, లేఖనాలన్నీ (1) బోధించడానికి, (2) గద్దించడానికి, (3) సరిదిద్దడానికి, (4) క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మనం ఏ బైబిలు పుస్తకం చదివినా ఈ నాలుగు ప్రయోజనాల్ని పొందవచ్చు. ఒక బైబిలు భాగాన్ని చదువుతున్నప్పుడు అది యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి లేదా సూత్రాల గురించి ఏం బోధిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చదువుతున్న బైబిలు భాగం గద్దించడానికి ఎలా సహాయం చేస్తుందో ఆలోచించండి. తప్పుడు ఆలోచనల్ని, పనుల్ని గుర్తించి వాటికి దూరంగా ఉండడానికి ఈ వచనాలు ఎలా సహాయం చేస్తాయి? అలాగే యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఈ వచనాలు ఎలా సహాయం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైన తప్పుడు నమ్మకాన్ని లేదా పరిచర్యలో ఎవరైన చెప్పిన ఒక విషయాన్ని సరిదిద్దడానికి మీరు చదివే వచనాలు ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి. చదువుతున్న లేఖనాల నుండి ఏమైనా క్రమశిక్షణ పొందగలరేమో చూడండి. యెహోవాలా ఆలోచించడానికి ఈ వచనాల్లో నాకేమైనా శిక్షణ దొరుకుతుందా అని ఆలోచించండి. ఈ నాలుగు ప్రయోజనాల్ని మనసులో పెట్టుకుని బైబిలు చదివినప్పుడు విలువైన సత్యాల్ని మీరు వెలికి తీయగలుగుతారు. దాంతో బైబిలు చదవడాన్ని మీరు ఇష్టపడతారు.

దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకోండి

12. “మీరు చదవలేదా?” అని యేసు పరిసయ్యులను ఎందుకు అడిగాడు?

12 పరిసయ్యులు లేఖనాల్ని సరైన దృష్టితో చూడలేదని చెప్పడానికి యేసు వాళ్లను“మీరు చదవలేదా?” అనే ప్రశ్నను అడిగాడు. (మత్త. 12:1-7) e యేసు శిష్యులు విశ్రాంతి రోజున చేయకూడని పనులు చేస్తున్నారని పరిసయ్యులు వాళ్లమీద నిందవేశారు. దానికి జవాబిస్తూ యేసు బైబిల్లోని రెండు ఉదాహరణల్ని చెప్పాడు. అలాగే హోషేయ పుస్తకం నుండి ఒక వచనాన్ని చెప్పాడు. అలా చెప్పడం ద్వారా పరిసయ్యులు విశ్రాంతి రోజు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని, వాళ్లకు కరుణ లేదని యేసు చూపించాడు. ఈ మతనాయకులు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఎందుకు మార్పులు చేసుకోలేదు? ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ గర్వంతో ఎదుటివాళ్ల తప్పులు పట్టేవాళ్లు. వాళ్లు బైబిలు చదువుతున్నప్పుడు కూడా అలాంటి దృష్టితోనే చదివారు. అందుకే వాళ్లు దాన్నుండి ప్రయోజనం పొందలేదు, లేఖనాలకు తగ్గట్టు మార్పులు చేసుకోలేదు.—మత్త. 23:23; యోహా. 5:39, 40.

13. మనం ఏ దృష్టితో బైబిల్ని చదవాలి? ఎందుకు?

13 మనం సరైన దృష్టితో బైబిల్ని చదవాలని యేసు మాటల్నిబట్టి నేర్చుకోవచ్చు. పరిసయ్యుల్లా కాకుండా మనం వినయంగా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ‘దేవుని వాక్యం మన హృదయాల్లో నాటబడేటప్పుడు దాన్ని సౌమ్యంగా స్వీకరించాలి.’ (యాకో. 1:21) సౌమ్యంగా ఉంటేనే దేవుని వాక్యం మన హృదయంలో నాటుకుంటుంది. అంటే మనం మార్పులు చేసుకోగలుగుతాం. గర్వం చూపించకుండా, ఇతరుల్లో తప్పులు పట్టకుండా ఉన్నప్పుడే కరుణ, కనికరం, ప్రేమ గురించి బైబిల్లో చదివినప్పుడు వాటికి తగ్గట్టు మనం మార్పులు చేసుకోగలుగుతాం.

దేవుని వాక్యానికి తగ్గట్టు మనం మార్పులు చేసుకుంటున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? (14వ పేరా చూడండి) f

14. మనం దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటున్నామో లేదో ఎలా చెప్పవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

14 ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాన్నిబట్టి మనం దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటున్నామో లేదో తెలుస్తుంది. పరిసయ్యులు అలా చేయలేదు కాబట్టి “ఏ తప్పూ చేయనివాళ్లను దోషులని” పిలిచేవాళ్లు. (మత్త. 12:7) మనం వాళ్లలా కాకుండా ఇతరుల గురించి ఏం ఆలోచిస్తున్నామో, వాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నామో చూసుకోవాలి. దాన్నిబట్టే మనం దేవుని వాక్యానికి తగ్గట్టు ఎంతవరకు మార్పులు చేసుకున్నామో తెలుస్తుంది. ఉదాహరణకు, మనం ఎప్పుడూ ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడుతున్నామా లేదా వాళ్లలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపిస్తున్నామా? మనం ఇతరుల మీద కరుణ చూపిస్తూ, క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఇతరుల్లో తప్పులు పడుతూ వాళ్లమీద కోపాన్ని పెంచుకుంటున్నామా? ఇలా మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉంటే మన ఆలోచనలు, భావాలు, పనులు బైబిలుకు తగ్గట్టు ఉన్నాయో లేవో తెలుస్తుంది.—1 తిమో. 4:12, 15; హెబ్రీ. 4:12.

దేవుని వాక్యాన్ని చదువుతూ సంతోషంగా ఉండండి

15. దేవుని వాక్యం గురించి యేసుకు ఎలా అనిపించింది?

15 యేసు లేఖనాల్ని ఎంతో ప్రేమించాడు. ఆ విషయం గురించి కీర్తనకర్త కీర్తన 40:8 లో ముందే ఇలా చెప్పాడు: “నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.” యేసు దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టే ఆయన సంతోషంగా ఉన్నాడు, యెహోవా సేవ చేస్తూనే ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని చదివి, దాన్ని ప్రేమిస్తే సంతోషంగా ఉంటాం, మనం చేసే ప్రతీది సఫలమౌతుంది.—కీర్త. 1:1-3.

16. దేవుని వాక్యం నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మీరేం చేయాలి? (“ బైబిల్ని అర్థం చేసుకోవడానికి యేసు మాటలు సహాయం చేస్తాయి” అనే బాక్సు చూడండి.)

16 యేసు మాటల్ని మనసులో ఉంచుకుంటూ, ఆయన చేసినట్టే చేయడం ద్వారా మనం కూడా బైబిల్ని ఇంకా బాగా చదవగలుగుతాం. ప్రార్థించడం, మెల్లగా చదవడం, ప్రశ్నల గురించి ఆలోచించడం, నోట్సు రాసుకోవడం ద్వారా మనం బైబిల్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. మన ప్రచురణల్ని ఉపయోగించి జాగ్రత్తగా పరిశీలిస్తూ వివేచన చూపించవచ్చు. మనం కొన్ని బైబిలు భాగాల్ని చదువుతున్నప్పుడు వాటిలో దాగివున్న విలువైన సత్యాల్ని తవ్వి తీయడానికి ప్రయత్నించవచ్చు. అలా చేసినప్పుడు మనం బైబిల్ని చాలా బాగా ఉపయోగించగలుగుతాం. మనం అంతగా వాడని లేఖనాల నుండి కూడా పూర్తి ప్రయోజనం పొందుతాం. బైబిల్ని చదివేటప్పుడు సరైన దృష్టితో చదవడం ద్వారా దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకోగలుగుతాం. ఈ సలహాలన్నీ పాటించడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు మనం బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతాం. అలాగే యెహోవాకు మరింత దగ్గరౌతాం.—కీర్త. 119:17, 18; యాకో. 4:8.

పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది

a యెహోవాను ఆరాధించే మనమందరం ప్రతీరోజు బైబిలు చదవడానికి కృషిచేస్తాం. వేరేవాళ్లు కూడా బైబిలు చదువుతారు. కానీ వాళ్లు చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవట్లేదు. యేసు కాలంలో కొంతమంది అలానే ఉన్నారు. అలాంటివాళ్లతో యేసు అన్న మాటల్ని పరిశీలిద్దాం. అలాచేయడం ద్వారా బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా ఎలా చదవవచ్చో తెలుసుకుంటాం.

b బాప్తిస్మం తీసుకునే సమయంలో పవిత్రశక్తితో అభిషేకించబడినప్పుడు, యేసు పరలోకంలో ఉన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చేలా యెహోవా చేశాడని చెప్పవచ్చు.—మత్త. 3:16.

c మరియకు లేఖనాలు బాగా తెలుసు. ఆమె వాటిని ఉపయోగించి మాట్లాడేది. (లూకా 1:46-55) బహుశా లేఖనాలు ఉన్న గ్రంథపు చుట్టల్ని కొనుక్కునేంత డబ్బులు యోసేపు, మరియల దగ్గర ఉండి ఉండకపోవచ్చు. కాబట్టి సమాజమందిరంలో దేవుని వాక్యం బిగ్గరగా చదువుతున్నప్పుడు వాళ్లు శ్రద్ధగా విని వాటిని గుర్తుపెట్టుకుని ఉంటారు.

d 2013, ఏప్రిల్‌ 1 కావలికోట పత్రికలో “దేవునికి దగ్గరవ్వండి ‘ఆయన సజీవులకే దేవుడు’” అనే ఆర్టికల్‌ చూడండి.

e మత్తయి 19:4-6 వచనాలు కూడా చూడండి. ఇక్కడ యేసు మళ్లీ పరిసయ్యుల్ని “మీరు ఇది చదవలేదా?” అని అడిగాడు. వాళ్లు సృష్టి గురించిన వచనాల్ని చదివారు. కానీ వివాహం విషయంలో దేవుని అభిప్రాయాన్ని పట్టించుకోలేదు.

f చిత్రాల వివరణ: రాజ్యమందిరంలో మీటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆడియో-వీడియోకి సంబంధించిన పనులు చూసుకుంటున్న ఒక సహోదరుడు చాలా తప్పులు చేస్తున్నాడు. కానీ మీటింగ్‌ అయిపోయిన తర్వాత సహోదరులు ఆయన తప్పుల గురించే మాట్లాడకుండా ఆయన చేసిన కృషిని మెచ్చుకుంటున్నారు.