పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు
2023, జనవరి 18, బుధవారం రోజున jw.orgలో ఒక సంతోషకరమైన ప్రకటన వచ్చింది. అదేంటంటే, యెహోవాసాక్షుల పరిపాలక సభలో ఇద్దరు సహోదరులు గేజ్ ఫ్లీగల్ అలాగే జెఫ్రీ విండర్ కొత్త సభ్యులుగా నియమించబడ్డారు. వీళ్లిద్దరు ఎంతోకాలంగా యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్నారు.
సహోదరుడు ఫ్లీగల్ అమెరికాలోని పెన్సిల్వేనియాలో పుట్టిపెరిగాడు. ఆయన తల్లిదండ్రులు కూడా యెహోవాసాక్షులే. ఆయన టీనేజీలో ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం, ప్రచారకుల అవసరం ఎక్కువున్న ఒక చిన్న పల్లెటూరికి మారారు. అక్కడికి వెళ్లిన కొంతకాలానికే అంటే 1988, నవంబరు 20న ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.
బ్రదర్ ఫ్లీగల్ వాళ్ల అమ్మానాన్న ఆయన్ని పూర్తికాల సేవ చేపట్టమని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. వాళ్లు తరచూ ప్రాంతీయ పర్యవేక్షకుల్ని, బెతెల్ కుటుంబ సభ్యుల్ని వాళ్లింటికి ఆహ్వానించేవాళ్లు. వాళ్లెంత సంతోషంగా ఉన్నారో బ్రదర్ ఫ్లీగల్ తన కళ్లారా చూడగలిగాడు. దానివల్ల ఆయన 12 ఏళ్ల వయసులోనే బెతెల్‌లో సేవచేయాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న సంవత్సరంలోపే అంటే 1989, సెప్టెంబరు 1న క్రమ పయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన బెతెల్ సేవచేయాలనే తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 1991, అక్టోబరు నుండి ఆయన బ్రూక్లిన్ బెతెల్‌లో సేవచేయడం మొదలుపెట్టాడు.
బ్రదర్ ఫ్లీగల్ బెతెల్‌లో ఎనిమిది సంవత్సరాలపాటు బైండరీలో పనిచేశాడు. ఆ తర్వాత ఆయన్ని సర్వీస్ డిపార్ట్మెంట్కి మార్చారు. ఆ సమయంలో ఆయన కొన్ని సంవత్సరాలపాటు రష్యా భాషా సంఘంలో సేవచేశాడు. 2006 లో ఆయన, నాదియా అనే సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కూడా ఆయనతోపాటు బెతెల్ సేవ చేయడం మొదలుపెట్టింది. వాళ్లిద్దరూ కలిసి పోర్చుగీస్ భాషా సంఘంలో సేవచేశారు. అలాగే పది కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు స్పానిష్ భాషా సంఘంలో కూడా సేవచేశారు. బ్రదర్ ఫ్లీగల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఆయన్ని టీచింగ్ కమిటీ ఆఫీస్‌కి మార్చారు. ఆ తర్వాత సర్వీస్ కమిటీ ఆఫీస్‌కి కూడా మార్చారు. 2022, మార్చిలో ఆయన్ని పరిపాలక సభలోని సేవా కమిటీకి సహాయకునిగా నియమించారు.
బ్రదర్ విండర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మురెటా అనే నగరంలో పెరిగాడు. ఆయన అమ్మానాన్నలు కూడా యెహోవాసాక్షులే. ఆయన 1986, మార్చి 29న బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఆ తర్వాతి నెల నుండే సహాయ పయినీరు సేవచేయడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ఎంత ఆనందించాడంటే, కొన్నేళ్లు సహాయ పయినీరు సేవచేసిన తర్వాత 1986, అక్టోబరు 1న క్రమ పయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాడు.
టీనేజీలో ఉన్నప్పుడు బ్రదర్ విండర్, బెతెల్‌లో సేవచేస్తున్న తన ఇద్దరు అన్నయ్యల్ని కలవడానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక, ఆయన కూడా పెద్దయ్యాక బెతెల్ సేవచేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత 1990, మే నెలలో వాల్‌కిల్‌లో ఉన్న బెతెల్‌లో సేవచేయడానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది.
బెతెల్‌లో బ్రదర్ విండర్ క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఫామ్ డిపార్ట్మెంట్, బెతెల్ ఆఫీస్ లాంటి ఎన్నో డిపార్ట్మెంట్లలో పనిచేశాడు. ఆయన 1997 లో ఆంజెలా అనే సిస్టర్ని పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత నుండి వాళ్లిద్దరూ కలిసి బెతెల్ సేవలో కొనసాగారు. 2014 లో ప్రపంచ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనిలో సహాయం చేయడానికి బ్రదర్ విండర్ని వార్విక్కు పంపించారు. 2016 లో ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌కి ఆయన్ని నియమించారు. అక్కడ బ్రదర్ విండర్ ఆడియో వీడియో సర్వీసెస్‌లో పనిచేశాడు. నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్లని మళ్లీ వార్విక్కు పిలిచారు. ఇక్కడ బ్రదర్ విండర్ని పర్సనల్ కమిటీ ఆఫీస్‌కి నియమించారు. 2022, మార్చి నెలలో బ్రదర్ విండర్ని పరిపాలక సభలోని పర్సోనెల్ కమిటీకి సహాయకునిగా నియమించారు.
రాజ్య పనిని ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడి పనిచేస్తున్న “మనుషుల్లో వరాలు” లాంటి ఈ సహోదరుల్ని యెహోవా మెండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాం!—ఎఫె. 4:8.