కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 8

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

యెహోవా నడిపిస్తున్న దారిలో నడుస్తూ ఉండండి

యెహోవా నడిపిస్తున్న దారిలో నడుస్తూ ఉండండి

“యెహోవా అనే నేనే . . . నిన్ను నడిపిస్తున్నాను.”యెష. 48:17.

ముఖ్యాంశం

ఈరోజుల్లో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడో, దానికి లోబడడం వల్ల మనం ఎలాంటి దీవెనల్ని పొందుతామో అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

1. మనకు యెహోవా నడిపింపు ఎందుకు అవసరం? ఉదాహరణ చెప్పండి.

 మీరొక దట్టమైన అడవిలో తప్పిపోయారు అనుకోండి. మీ చుట్టూ ఆకలి మీదున్న క్రూరమృగాలు, భయంకరమైన పురుగులు, విషపూరిత మొక్కలు, పెద్దపెద్ద గుంటలు లాంటి ప్రమాదాలు పొంచివున్నాయి. అలాంటప్పుడు ఆ ప్రమాదాలన్నీ తెలిసి, మిమ్మల్ని అక్కడనుండి జాగ్రత్తగా నడిపించే ఒక అనుభవంగల గైడ్‌ దొరికితే ఎంత బాగుంటుందో కదా! ఈ లోకం ఆ అడవి లాంటిదే. యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసే ప్రమాదాలతో ఈ లోకం నిండివుంది. కానీ మనకు యెహోవా ఒక మంచి గైడ్‌గా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రమాదాలన్నిటి నుండి కాపాడి, కొత్తలోకంలో శాశ్వత జీవితం అనే గమ్యానికి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు.

2. యెహోవా మనల్ని ఎలా నడిపిస్తాడు?

2 యెహోవా మనల్ని ఎలా నడిపిస్తాడు? ముఖ్యంగా తన వాక్యమైన బైబిలు ద్వారా నడిపిస్తాడు. అలాగే మనుషుల్ని కూడా ఉపయోగిస్తాడు. ఉదాహరణకు “నమ్మకమైన, బుద్ధిగల” దాసుని ద్వారా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేస్తున్నాడు. (మత్త. 24:45) అంతేకాదు ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘపెద్దలు లాంటి సమర్థులైన పురుషుల్ని కూడా యెహోవా ఉపయోగిస్తాడు. వీళ్లు కష్టమైన సమయాల్లో మనకు కావల్సిన ప్రోత్సాహాన్ని, సలహాల్ని ఇస్తారు. కష్టమైన ఈ చివరి రోజుల్లో యెహోవా అలా చేయి పట్టుకొని నడిపించడం ఎంత బాగుందో కదా! యెహోవాకు స్నేహితులుగా ఉండడానికి అలాగే ఇప్పుడు, ఎప్పుడు సంతోషంగా బ్రతకడానికి అది సహాయం చేస్తుంది.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 కొన్నిసార్లు యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని పాటించడం కష్టం కావచ్చు. ముఖ్యంగా, దాన్ని అపరిపూర్ణ మనుషుల ద్వారా ఇచ్చినప్పుడు అలా అనిపించవచ్చు. ఎందుకు? వాళ్లిచ్చే నిర్దేశాలు మనకు నచ్చకపోవచ్చు లేదా అవి తెలివైనవి కావని అనిపించవచ్చు. కాబట్టి అవి యెహోవా నుండి రాలేదని అనుకోవచ్చు. అలాంటప్పుడు యెహోవాయే తన ప్రజల్ని నడిపిస్తున్నాడని, ఆయన నడిపింపును పాటిస్తేనే దీవెనలు వస్తాయని నమ్మడం ప్రాముఖ్యం. మన నమ్మకాన్ని బలపర్చడానికి ఈ ఆర్టికల్‌లో, (1) బైబిలు కాలాల్లో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడు? (2) ఈరోజుల్లో ఎలా నడిపిస్తున్నాడు? (3) ఆయన నడిపింపులో నడవడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందుతాం? అనే విషయాల్ని చూస్తాం.

బైబిలు కాలాల నుండి ఇప్పటివరకు యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి మనుషుల్ని ఉపయోగించుకున్నాడు (3వ పేరా చూడండి)


ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఎలా నడిపించాడు?

4-5. యెహోవా తన ప్రజల్ని మోషే ద్వారా నడిపిస్తున్నాడని ఎలా చూపించాడు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

4 ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి యెహోవా మోషేను నియమించాడు. దానికితోడు, మోషే ద్వారా వాళ్లను నడిపించేది తానే అని యెహోవా కంటికి కనిపించే రుజువుల్ని ఇచ్చాడు. ఉదాహరణకు, పగలేమో మేఘస్తంభంతో రాత్రేమో అగ్నిస్తంభంతో వాళ్లను నడిపించాడు. (నిర్గ. 13:21) మోషే ఆ స్తంభం వెనకాలే వెళ్లాడు. అప్పుడు ఆయన, ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం దగ్గరికి చేరుకున్నారు. ముందేమో ఎర్రసముద్రాన్ని, వెనకేమో ఐగుప్తు సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. మోషే వాళ్లను ఎర్రసముద్రం దగ్గరికి తీసుకొచ్చి తప్పుచేశాడని అనుకున్నారు. కానీ ఆయన సరైనదే చేశాడు. యెహోవా కావాలనే మోషే ద్వారా వాళ్లను అక్కడికి తీసుకొచ్చాడు. (నిర్గ. 14:2) ఆ తర్వాత ఊహకందని విధంగా యెహోవా వాళ్లను విడిపించాడు.—నిర్గ. 14:26-28.

దేవుని ప్రజల్ని ఎడారిలో నడిపించడానికి మోషే మేఘస్తంభం మీద ఆధారపడ్డాడు (4-5 పేరాలు చూడండి)


5 ఆ తర్వాత 40 ఏళ్లపాటు మోషే ఇశ్రాయేలీయుల్ని ఎడారి ప్రాంతంలో నడిపించడానికి ఆ మేఘస్తంభం మీదే ఆధారపడ్డాడు. a కొంతకాలం వరకు ఆ మేఘస్తంభం ఇశ్రాయేలీయులందరికీ కనిపించేలా యెహోవా దాన్ని మోషే గుడారంపై ఉంచాడు. (నిర్గ. 33:7, 9, 10) యెహోవా ఆ స్తంభం ద్వారా మోషేతో మాట్లాడేవాడు. మోషే ఆ నిర్దేశాల్ని ప్రజలకు చెప్పేవాడు. (కీర్త. 99:7) యెహోవా వాళ్లను నడిపించడానికి మోషేను ఉపయోగిస్తున్నాడని ఇశ్రాయేలీయులకు స్పష్టమైన రుజువులున్నాయి.

మోషే, ఆయన తర్వాత నాయకుడైన యెహోషువ (5, 7 పేరాలు చూడండి)


6. యెహోవా ఇచ్చే నడిపింపును ఇశ్రాయేలీయులు ఏం చేశారు? (సంఖ్యాకాండం 14:2, 10, 11)

6 విచారకరంగా, చాలామంది ఇశ్రాయేలీయులు యెహోవాయే మోషే ద్వారా వాళ్లను నడిపిస్తున్నాడనే స్పష్టమైన రుజువుల్ని పట్టించుకోలేదు. (సంఖ్యాకాండం 14:2, 10, 11 చదవండి.) వాళ్లు పదేపదే మోషేను తిరస్కరించారు. దానివల్ల వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి యెహోవా వాళ్లను అనుమతించలేదు.—సంఖ్యా. 14:30.

7. యెహోవా నడిపింపులో నడిచిన కొంతమంది ఉదాహరణను చెప్పండి. (సంఖ్యాకాండం 14:24) (చిత్రం కూడా చూడండి.)

7 అయితే, కొంతమంది ఇశ్రాయేలీయులు యెహోవా నడిపింపును పాటించారు. ఉదాహరణకు, యెహోవా ఇలా చెప్పాడు: “నా సేవకుడైన కాలేబు . . . నిండు హృదయంతో నన్ను అనుసరిస్తూ వచ్చాడు.” (సంఖ్యాకాండం 14:24 చదవండి.) వాగ్దాన దేశంలో తనకు నచ్చిన చోటును ఇవ్వడం ద్వారా యెహోవా కాలేబును ఆశీర్వదించాడు. (యెహో. 14:12-14) ఇశ్రాయేలీయుల తర్వాతి తరం వాళ్లు కూడా యెహోవా నడిపింపును పాటించే విషయంలో మంచి ఆదర్శం ఉంచారు. మోషే తర్వాత ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోషువను నియమించినప్పుడు వాళ్లు ఆయన్ని “బ్రతికున్నంత కాలం ఎంతో గౌరవించారు.” (యెహో. 4:14) దాంతో వాళ్లు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టగలిగారు.—యెహో. 21:43, 44.

8. రాజుల కాలంలో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడో వివరించండి. (చిత్రం కూడా చూడండి.)

8 కొన్నేళ్ల తర్వాత, యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి న్యాయాధిపతుల్ని నియమించాడు. ఆ తర్వాత, రాజులు పరిపాలిస్తున్న కాలంలో తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ప్రవక్తల్ని నియమించాడు. నమ్మకమైన రాజులు ప్రవక్తలు ఇచ్చే సలహాల్ని విన్నారు. ఉదాహరణకు, నాతాను ప్రవక్త సరిదిద్దినప్పుడు దావీదు రాజు వినయంగా దానికి ఒప్పుకున్నాడు. (2 సమూ. 12:7, 13; 1 దిన. 17:3, 4) యెహోషాపాతు రాజు నిర్దేశం కోసం యహజీయేలు ప్రవక్త మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత ఆయన యూదాలో ఉన్న ప్రజల్ని “ప్రవక్తల మీద విశ్వాసముంచండి” అని ప్రోత్సహించాడు. (2 దిన. 20:14, 15, 20) హిజ్కియా రాజు దుఃఖంలో ఉన్నప్పుడు సహాయం కోసం యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్లాడు. (యెష. 37:1-6) రాజులు యెహోవా నిర్దేశాన్ని పాటించిన ప్రతీసారి ఎన్నో దీవెనల్ని పొందారు, ఆ దేశం కూడా కాపాడబడింది. (2 దిన. 20:29, 30; 32:22) తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ప్రవక్తల్ని ఉపయోగిస్తున్నాడని కొట్టొచ్చినట్లు కనిపించినాసరే చాలామంది రాజులు, ప్రజలు ప్రవక్తల్ని అస్సలు లెక్కచేయలేదు.—యిర్మీ. 35:12-15.

హిజ్కియా రాజు, యెషయా ప్రవక్త (8వ పేరా చూడండి)


మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని యెహోవా ఎలా నడిపించాడు?

9. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని నడిపించడానికి యెహోవా ఎవర్ని ఉపయోగించుకున్నాడు? (చిత్రం కూడా చూడండి.)

9 సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెహోవా క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. మరి ఆ తొలి క్రైస్తవుల్ని ఆయనెలా నిర్దేశించాడు? ఆయన యేసును సంఘానికి శిరస్సుగా నియమించాడు. (ఎఫె. 5:23) అయితే, యేసు ఒక్కో శిష్యుని దగ్గరికి వెళ్లి ఏం చేయాలో చెప్పలేదు గానీ ఆ తొలి క్రైస్తవుల్ని నడిపించడానికి అపొస్తలుల్ని, యెరూషలేములో ఉన్న పెద్దల్ని ఉపయోగించుకున్నాడు. (అపొ. 15:1, 2) అంతేకాదు, సంఘాల్ని నడిపించడానికి సంఘపెద్దలు కూడా ఉండేవాళ్లు.—1 థెస్స. 5:12; తీతు 1:5.

అపొస్తలులు, యెరూషలేములో ఉన్న పెద్దలు (9వ పేరా చూడండి)


10. (ఎ) మొదటి శతాబ్దంలోని చాలామంది క్రైస్తవులు యెహోవా ఇచ్చే నడిపింపుకు ఎలా స్పందించారు? (అపొస్తలుల కార్యాలు 15:30, 31) (బి) తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఉపయోగించుకున్న వాళ్లను బైబిలు కాలాల్లో కొంతమంది ఎందుకు లెక్కచేయలేదు? (“ స్పష్టమైన రుజువులున్నా కొంతమంది ఎందుకు లెక్కచేయలేదు?” అనే బాక్స్‌ చూడండి.)

10 మరి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యెహోవా ఇచ్చే నడిపింపుకు ఎలా స్పందించారు? చాలామంది ఆయనిచ్చే నిర్దేశాల్ని ఇష్టంగా పాటించారు. నిజానికి, వాళ్లకు దొరికిన ప్రోత్సాహాన్ని బట్టి “ఎంతో సంతోషించారు.” (అపొస్తలుల కార్యాలు 15:30, 31 చదవండి.) మరైతే, మనకాలంలో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడు?

యెహోవా తన ప్రజల్ని ఇప్పుడు ఎలా నడిపిస్తున్నాడు?

11. మనకాలంలో యెహోవా తన ప్రజల్ని నడిపిస్తున్నాడు అనడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

11 యెహోవా ఇప్పటికి తన ప్రజల్ని చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా, సంఘానికి శిరస్సయిన తన కుమారుడి ద్వారా అలా నడిపిస్తున్నాడు. అయితే, తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఇప్పటికీ మనుషుల్ని ఉపయోగిస్తున్నాడు అనడానికి ఏమైనా రుజువులున్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు, 1870 తర్వాత జరిగిన సంఘటనల గురించి ఆలోచించండి. ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ అలాగే ఆయన సహచరులు, దేవుని రాజ్యానికి సంబంధించి 1914వ సంవత్సరం ఒక మైలు రాయిగా ఉండబోతుందని అర్థంచేసుకోవడం మొదలుపెట్టారు. (దాని. 4:25, 26) వాళ్లు ఆ ముగింపుకు రావడానికి బైబిలు ప్రవచనాల మీద ఆధారపడ్డారు. వాళ్లు చేసిన బైబిలు పరిశోధనను యెహోవా నడిపించాడా? ఖచ్చితంగా! 1914 లో ప్రపంచంలో జరిగిన సంఘటనలు దేవుని రాజ్య పరిపాలన మొదలైందని రుజువు చేశాయి. ఆ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత అంటువ్యాధులు, భూకంపాలు, ఆహారకొరతలు వచ్చాయి. (లూకా 21:10, 11) తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా నిజాయితీగల ఆ పురుషుల్ని ఉపయోగించాడు అనడంలో సందేహం లేదు!

12-13. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రకటనా పని, బోధనా పని ఇంకా ఎక్కువ జరగడానికి యెహోవా సంస్థ ఏయే ఏర్పాట్లు చేసింది?

12 రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఏం జరిగిందో కూడా పరిశీలించండి. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న బాధ్యతగల సహోదరులు ప్రకటన 17:8 వచనాన్ని అధ్యయనం చేశారు. దాన్నిబట్టి, ఆ యుద్ధం హార్‌మెగిద్దోన్‌కి నడిపించట్లేదు గానీ ఇంకా ఎక్కువమందికి ప్రీచింగ్‌ చేయడానికి కాస్త అనుకూలమైన సమయం ఇస్తుందని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. అయితే, అప్పట్లో అది తెలివైన నిర్ణయం అనిపించకపోయినా భూవ్యాప్తంగా ప్రకటించే, బోధించే పనిని చేయడానికి మిషనరీలకు శిక్షణ ఇచ్చేలా వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ని సంస్థ ఏర్పాటు చేసింది. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మిషనరీలను పంపించారు. అంతేకాదు, సంఘాల్లో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరూ ఇంకా మంచి బోధకులయ్యేలా నమ్మకమైన దాసుడు దైవపరిపాలనా పరిచర్య కోర్స్‌ను b మొదలుపెట్టారు. వీటన్నిటి వల్ల తమ ముందున్న పనికోసం దేవుని ప్రజలు చక్కగా సిద్ధపడగలిగారు.

13 ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కష్టమైన సమయంలో యెహోవాయే తన ప్రజల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడని స్పష్టంగా అర్థమైంది. రెండో ప్రపంచ యుద్ధం నుండి యెహోవా ప్రజలు చాలా దేశాల్లో ప్రశాంతంగా, స్వేచ్ఛగా పరిచర్య చేసుకున్నారు. నిజానికి మన పని అంతకంతకు విస్తరించింది.

14. యెహోవా సంస్థ అలాగే నియమించబడిన పెద్దలు ఇచ్చే నిర్దేశంపై మనం ఎందుకు నమ్మకం పెట్టుకోవచ్చు? (ప్రకటన 2:1) (చిత్రం కూడా చూడండి.)

14 ఈరోజుల్లో పరిపాలక సభ సభ్యులు నడిపింపు కోసం క్రీస్తు వైపు చూస్తున్నారు. పరలోకంలో విషయాల్ని ఎలా చూస్తారు అనే దాన్నిబట్టి వాళ్లు సహోదరులకు నిర్దేశాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ తర్వాత, ప్రాంతీయ పర్యవేక్షకుల్ని అలాగే పెద్దల్ని ఉపయోగించుకొని ఆ నిర్దేశాల్ని సంఘాలకు పంపిస్తున్నారు. c అభిషేకించబడిన పెద్దలు క్రీస్తు “కుడిచేతిలో” ఉన్నారు. (ప్రకటన 2:1 చదవండి.) అయితే ఈ పెద్దలు అపరిపూర్ణులు, కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. మోషే, యెహోషువ, అపొస్తలులు కూడా కొన్నిసార్లు తప్పులు చేశారు. (సంఖ్యా. 20:12; యెహో. 9:14, 15; రోమా. 3:23) అయినప్పటికీ, నమ్మకమైన దాసున్ని అలాగే నియమించబడిన ఈ పెద్దల్ని యేసుక్రీస్తు చాలా శ్రద్ధగా నడిపిస్తున్నాడు. అంతేకాదు, వాళ్లను “ఈ వ్యవస్థ ముగింపు వరకు” నడిపిస్తూ ఉంటాడు. (మత్త. 28:20) కాబట్టి, నాయకత్వం వహించడానికి నియమించబడిన ఈ సహోదరులు అందించే నిర్దేశంపై మనం పూర్తి భరోసా ఉంచవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిపాలకసభ (14వ పేరా చూడండి)


యెహోవా నడిపింపులో నడుస్తూ ఉంటే ప్రయోజనం పొందుతాం

15-16. యెహోవా నిర్దేశాన్ని పాటించిన వాళ్లనుండి మీరేం నేర్చుకున్నారు?

15 యెహోవా నడిపింపులో నడుస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఎన్నో దీవెనల్ని సొంతం చేసుకుంటాం. ఉదాహరణకు, సింపుల్‌గా జీవించండి అని నమ్మకమైన దాసుడు ఇస్తున్న సలహాను యాండీ, రోబిన్‌ పాటించారు. (హెబ్రీ. 13:5) దానివల్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా పని చేయగలిగారు. రోబిన్‌ ఇలా అంటుంది: “మేము చాలా చిన్నచిన్న ఇళ్లలో ఉండేవాళ్లం. కనీసం వంటగది కూడా ఉండేదికాదు. ఫోటోలు తీయడమంటే నాకు చాలా ఇష్టం. దానికోసం చాలా సామాన్లు కొన్నాను, వాటిని అమ్మేసేటప్పుడు ఏడ్పు వచ్చేసింది. కానీ, అబ్రాహాము భార్య శారాలాగే వదిలేసిన వాటిగురించి ఆలోచించకుండా, ముందుముందు యెహోవా కోసం నేనేమి చేయగలను అని ఆలోచించి సంతోషించాను.” (హెబ్రీ. 11:15) ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ దంపతులు ఎలా ప్రయోజనం పొందారు? రోబిన్‌ ఇలా అంటుంది: “యెహోవాకు ఇవ్వగల్గినదంతా ఇస్తున్నామని తెలుసుకోవడం చాలా సంతృప్తినిస్తుంది. యెహోవా ఇచ్చే నియామకాల్ని చేసినప్పుడు కొత్తలోకంలో జీవితం ఎలా ఉంటుందో ఒక శాంపిల్‌ చూడగలుగుతాం.” యాండీ కూడా ఇలా అంటున్నాడు: “రాజ్య పనిలో పూర్తిగా మద్దతివ్వడం మాకు చాలా సంతృప్తిగా ఉంది.”

16 యెహోవా నిర్దేశాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఇంకెలాంటి ప్రయోజనం పొందుతాం? మార్షీయ అనుభవాన్ని పరిశీలించండి. పయినీరు సేవ చేయమని సంస్థ చెప్పే సలహాను ఆమె పాటించాలనుకుంది. (మత్త. 6:33; రోమా. 12:11) ఆమె ఇలా చెప్తుంది: “నా స్కూల్‌ చదువు అయిపోయాక నాలుగు సంవత్సరాలు యూనివర్సిటీలో ఫ్రీగా చదివే అవకాశం వచ్చింది. కానీ నేను యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను. కాబట్టి ప్రీచింగ్‌ చేస్తూనే నన్ను నేను పోషించుకోవడానికి సరిపోయే ఒక వృత్తివిద్యా కోర్సును తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయాల్లో అదే బెస్ట్‌ నిర్ణయం. ఇప్పుడు నేను పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూనే పయినీరుగా, బెతెల్‌లో కమ్యూటర్‌గా, ఇంకా యెహోవా సేవలో ఎన్నో పనులు చేయగలుగుతున్నాను.”

17. ఇంకే విషయాల్లో యెహోవా నిర్దేశాన్ని పాటిస్తూ ఉండవచ్చు? దానివల్ల వచ్చే ప్రయోజనమేంటి? (యెషయా 48:17, 18)

17 కొన్నిసార్లు డబ్బును ప్రేమించే, దేవుని నియమాల్ని పక్కన పెట్టేసే లాంటి పనులు చేయకుండా ఉండమని సంస్థ మనకు సలహా ఇస్తుంది. అది పాటించడం మనకే మంచిది. మనం మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాం, అనవసరమైన తలనొప్పుల్ని తప్పించుకుంటాం. (1 తిమో. 6:9, 10) దానివల్ల యెహోవాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. హృదయలోతుల్లో సంతోషాన్ని, మనశ్శాంతిని, సంతృప్తిని పొందుతాం.—యెషయా 48:17, 18 చదవండి.

18. యెహోవా నిర్దేశాన్ని పాటిస్తూ ఉండాలని ఎందుకు గట్టిగా నిర్ణయించుకున్నారు?

18 మహాశ్రమ సమయంలో, వెయ్యేండ్ల పరిపాలనలో కూడా యెహోవా మనల్ని నడిపించడానికి మనుషుల్ని ఉపయోగిస్తాడు. (కీర్త. 45:16) మరప్పుడు మన ఇష్టాయిష్టాల్ని పక్కనపెట్టి, మనకు నచ్చకపోయినా వాళ్లు చెప్పేది వింటామా? దానికి జవాబు, యెహోవా ఇచ్చే నిర్దేశానికి మనం ఇప్పుడు ఎలా స్పందిస్తాం అనే దానిమీద ఆధారపడివుంటుంది. కాబట్టి యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని, ఆఖరికి మన ప్రాణాల మీద కాపలాగా ఉంచిన సహోదరుల నిర్దేశాన్ని కూడా పాటిస్తూ ఉందాం. (యెష. 32:1, 2; హెబ్రీ. 13:17) అలా చేసినప్పుడు, మనమీద ఆధ్యాత్మికంగా ఒక్క గీత కూడా పడకుండా కొత్తలోకంలో శాశ్వత జీవితమనే మన గమ్యానికి తీసుకెళ్లే మన గైడ్‌ యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని చూపిస్తాం!

మీరెలా జవాబిస్తారు?

  • ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఎలా నడిపించాడు?

  • మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని యెహోవా ఎలా నడిపించాడు?

  • ఈరోజుల్లో యెహోవా నిర్దేశాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం పొందుతాం?

పాట 48 ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం

a ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోకి నడిపించడానికి యెహోవా ఒక దేవదూతను కూడా నియమించాడు. ఆ దేవదూత పేరు మిఖాయేలు. పరలోకంలో యేసు పేరు అదే.—నిర్గ. 14:19; 32:34.

b ఆ తర్వాత దీన్ని, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అని పిలిచారు. ప్రస్తుతం, వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో మనకు ఈ శిక్షణ దొరుకుతుంది.

c 2021, ఫిబ్రవరి కావలికోట పత్రికలోని 18వ పేజీలో ఉన్న “పరిపాలక సభ బాధ్యత” అనే బాక్స్‌ చూడండి.