జీవిత కథ
“నేను ఎప్పుడూ ఒంటరివాణ్ణి కాదు”
జీవితం ఏదో ఒక సందర్భంలో మనల్ని ఒంటరివాళ్లను చేస్తుంది. మనవాళ్లు చనిపోయినప్పుడు, ముక్కుమొహం తెలియని ప్రాంతంలో ఉన్నప్పుడు, చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మనకు అలా అనిపించవచ్చు. నేను అవన్నీ రుచి చూశాను. కానీ నా జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఎప్పుడూ ఒంటరిగా లేను అని అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను.
అమ్మానాన్నలు చూపించిన దారి
మా అమ్మానాన్నలు పక్కా క్యాథలిక్కులు. కానీ, దేవుని పేరు యెహోవా అని బైబిలు నుండి తెలుసుకున్నాక యెహోవాసాక్షులై, యెహోవా సేవలో దూసుకెళ్లారు. నాన్న యేసు బొమ్మలు చెక్కడం ఆపేశాడు. దానికి బదులు తనకున్న నైపుణ్యంతో మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ని ఒక రాజ్యమందిరంగా మార్చాడు. అది ఫిలిప్పీన్స్ రాజధానియైన మనిలా పరిసర ప్రాంతంలో ఉన్న శాన్ జ్వాన్ డెల్ మోంటెలోని మొట్టమొదటి రాజ్యమందిరం అయ్యింది.
నేను 1952లో పుట్టాను. నాకు నలుగురు అన్నలు, ముగ్గురు అక్కలు. నేను పుట్టినప్పటి నుండే నాన్న అన్నయ్యలతో, అక్కయ్యలతో చేస్తున్న స్టడీలో నన్ను కూడా కూర్చోపెట్టుకునేవాడు. చిన్నప్పుడు మా నాన్న ప్రతీరోజు బైబిల్లో ఒక్క అధ్యాయమైనా చదవమని నాకు చెప్పేవాడు. నాతో కలిసి చాలా ప్రచురణలు చదివాడు. నాన్న మా ఇంటికి అప్పుడప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుల్ని, బెతెల్‌లో సేవ చేసేవాళ్లను పిలిచేవాడు. అలా వాళ్ల అనుభవాలను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది, నేనూ వాళ్లలాగే ఉండాలని అనుకున్నాను. అందుకే మేమందరం మా జీవితంలో ప్రీచింగ్‌కే మొదటిస్థానం ఇవ్వాలనుకున్నాం.
విశ్వాసం అంటే ఏంటో మా అమ్మానాన్నల్ని చూసి నేర్చుకున్నాను. ఒంట్లో బాగోలేక మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న, నేను కలిసి 1971లో పయినీరు సేవ మొదలుపెట్టాం. కానీ 1973లో నాకు 20 ఏళ్లున్నప్పుడు నాన్న చనిపోయాడు. అమ్మానాన్న ఇద్దరూ లేకపోయేసరికి నా జీవితం శూన్యంగా, నాకంటూ ఎవరూ లేరు అన్నట్టుగా అనిపించేది. కానీ బైబిలు ఇచ్చే “నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ” వల్ల వాటి నుండి తేరుకున్నాను. (హెబ్రీ. 6:19) నాన్న చనిపోయిన కొంతకాలానికే పలావన్ ప్రాంతంలో ఉన్న కొరోన్ అనే మారుమూల ద్వీపంలో ప్రత్యేక పయినీరుగా సేవచేసే అవకాశం వచ్చింది.
కష్టమైన నియామకంలో ఒంటరిగా పడ్డ పాట్లు
కొరోన్‌కు వచ్చినప్పుడు నా వయసు 21 ఏళ్లు. నేను సిటీలోనే పుట్టి-పెరిగాను కాబట్టి ఆ ద్వీపంలో కరెంట్, నీళ్లు, కార్లు, బండ్లు తక్కువ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ కొంతమంది బ్రదర్స్ ఉన్నా, నాకు పయినీరు పాట్నర్ అంటూ ఎవరూ లేరు. కాబట్టి కొన్నిసార్లు ఒక్కడినే
ప్రీచింగ్ చేసుకునేవాణ్ణి. మొదటి నెల మాత్రం కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ని బాగా మిస్ అయ్యాను. రాత్రుల్లో నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని చూస్తూ నా కళ్లల్లో నుండి నీళ్లు టపటప కారిపోయేవి. ఇక నా నియామకాన్ని ఆపేసి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాను.అలా ఒంటరిగా అనిపించినప్పుడు నా మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకునేవాణ్ణి. బైబిల్లో, మన ప్రచురణల్లో, నాకు బాగా నచ్చిన విషయాల్ని గుర్తు తెచ్చుకునేవాణ్ణి. నాకు తరచూ కీర్తన 19:14 గుర్తొచ్చేది. యెహోవాను ఏది సంతోషపెడుతుందో ఆలోచించినప్పుడు అంటే ఆయన పనుల గురించి, లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఆయన “నా ఆశ్రయదుర్గం, నా విమోచకుడు” అని నేను గుర్తించాను. అలాగే “మీరు ఒంటరివాళ్లు కాదు” a అనే కావలికోట ఆర్టికల్ నాకు చెప్పలేనంత సహాయం చేసింది. దాన్ని ఎన్నిసార్లు తిరగేశానో నాకే తెలీదు. ఒక రకంగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు యెహోవాతో ఎక్కువ టైం గడిపాను. అంటే ఆయనకు ప్రార్థన చేసేవాణ్ణి, అధ్యయనం చేసేవాణ్ణి, విషయాల్ని లోతుగా ఆలోచించేవాణ్ణి.
కొరోన్‌కు వచ్చిన కొంతకాలానికే నేను సంఘపెద్ద అయ్యాను. అక్కడ నేను ఒక్కడినే సంఘపెద్దను కాబట్టి ప్రతీవారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటం, సంఘ పుస్తక పఠనం, కావలికోట అధ్యయనం చేసేవాణ్ణి. ప్రతీవారం బహిరంగ ప్రసంగాలు కూడా నేనే ఇచ్చేవాణ్ణి. ఇక ఇప్పుడు నేను ఒంటరివాణ్ణని ఫీలవ్వడానికి టైమే లేదు.
కొరోన్‌లో ప్రీచింగ్ చాలా ఎంజాయ్ చేసేవాణ్ణి. నేను బైబిలు స్టడీ ఇచ్చిన కొంతమంది బాప్తిస్మం కూడా తీసుకున్నారు. కానీ కొన్ని కష్టాలు కూడా పడ్డాను. కొన్నిసార్లు టెరిటరీకి వెళ్లడానికి సగం రోజు నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. అక్కడికి వెళ్లాక ఎక్కడ పడుకోవాలో కూడా తెలీదు. సంఘ టెరిటరీలో చిన్నచిన్న ద్వీపాలు చాలా ఉండేవి. ఈత రాకపోయినా ఎగిసిపడుతున్న సముద్రంలో బోటు వేసుకుని, ఆ టెరిటరీలకు వెళ్లేవాణ్ణి. నిజానికి ఈ కష్టాలన్నిటిలో యెహోవా నన్ను కాపాడాడు, కంటికి రెప్పలా చూసుకున్నాడు. నా తర్వాతి నియామకంలో వచ్చే పెద్దపెద్ద కష్టాలకు యెహోవా నన్ను సిద్ధం చేస్తున్నాడని ఆ తర్వాతే అర్థమైంది.
పాపువా న్యూగిని
1978లో నన్ను ఉత్తర ఆస్ట్రేలియాలో ఉన్న పాపువా న్యూగినికి నియమించారు. పాపువా న్యూగిని పర్వతాలతో కప్పబడిన ఒక అందమైన దేశం. అది దాదాపు స్పెయిన్ అంత పెద్దది. అక్కడ ఉన్న ముప్పై లక్షలమంది జనాభా 800 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. మంచి విషయం ఏంటంటే, చాలామంది మెలేనేషియన్ పిడ్జిన్ అనే భాష కూడా మాట్లాడతారు. దాన్నే టోక్ పిసిన్ అని కూడా అంటారు.
నన్ను తాత్కాలికంగా పాపువా న్యూగిని రాజధానియైన పోర్ట్ మోర్జబీలోని ఇంగ్లీషు సంఘానికి నియమించారు. కానీ ఆ తర్వాత నేను టోక్ పిసిన్ సంఘానికి మారి, ఆ భాష తరగతులకు వెళ్లాను. అక్కడ నేర్చుకున్నవి ప్రీచింగ్‌లో వాడేవాణ్ణి, అందుకే ఆ భాషను త్వరగా నేర్చుకోగలిగాను. ఎంతోకాలం గడవకముందే నేను ఆ భాషలో బహిరంగ ప్రసంగాలు కూడా ఇచ్చేవాణ్ణి. పాపువా న్యూగినికి వచ్చిన సంవత్సరంలోపే అక్కడున్న పెద్దపెద్ద నగరాల్లో ఉన్న టోక్ పిసిన్ సంఘాలకు నన్ను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. అప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయి ఉంటానో ఆలోచించండి.
సంఘాలన్నీ ఒకదానికొకటి చాలా దూరంగా ఉండేవి కాబట్టి చాలా ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వాటికోసం నేను చాలా ప్రయాణించాను కూడా. మొదట్లో కొత్త దేశం, కొత్త భాష, కొత్త సంస్కృతి అలా అంతా కొత్త కొత్తగా ఉండింది. కాబట్టి నాకు చాలా ఒంటరిగా
అనిపించింది. ఆ ప్రాంతమంతా పర్వత ప్రాంతం కాబట్టి సరైన రోడ్డు రవాణా ఉండేదికాదు. నేను సంఘాల్ని సందర్శించడానికి ప్రతీవారం విమానంలో వెళ్లాల్సి వచ్చేది. కొన్నిసార్లయితే అంతంతమాత్రంగా ఉండే సదుపాయాలు గల విమానంలో నేను ఒక్కడినే ప్రయాణించేవాణ్ణి. అది బోటులో ప్రయాణించే దానికంటే భయంకరంగా అనిపించేది.అక్కడ ఫోన్లు చాలా తక్కువమంది దగ్గర ఉండేవి. కాబట్టి సంఘాలతో నేను ఉత్తరాల ద్వారా మాట్లాడేవాణ్ణి. కొన్నిసార్లయితే నా ఉత్తరాల కన్నా నేనే ముందు వెళ్లేవాణ్ణి. అక్కడికి వెళ్లాక చుట్టుపక్కలవాళ్లను, ఇక్కడ యెహోవాసాక్షులు ఎక్కడ ఉంటారని అడిగేవాణ్ణి. అలా నాకు బ్రదర్స్ దొరికిన ప్రతీసారి వాళ్లు నన్ను చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఆహ్వానించేవాళ్లు. వాళ్ల ప్రేమను, ఆప్యాయతను చూసి యెహోవా కూడా నన్ను చాలా విధాలుగా చేయి పట్టుకుని నడిపించినట్టు అనిపించింది. అందుకే నేను ఆయనకు ఇంకాఇంకా దగ్గరవ్వగలిగాను.
బౌగెన్‌విల్ ద్వీపంలో నేను వెళ్లిన మొట్టమొదటి మీటింగ్‌లో ఒక భార్యాభర్తలు నవ్వుతూ నన్ను పలకరించారు. వాళ్లు నా దగ్గరికి వచ్చి: “మీరు మమ్మల్ని గుర్తుపట్టారా?” అని అడిగారు. తీరా చూస్తే వాళ్లు ఎవరోకాదు పోర్ట్ మోర్జబీలో నా బైబిలు విద్యార్థులు. నేను వస్తూ వస్తూ అక్కడ ఒక బ్రదర్‌కి ఆ స్టడీ అప్పగించాను. ఇప్పుడు వాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. పాపువా న్యూగినిలో నేను గడిపిన మూడు సంవత్సరాల్లో వచ్చిన ఎన్నో దీవెనల్లో ఇదొకటి.
ఓ చిన్ని కుటుంబం
1978లో నేను కొరోన్‌ని వదిలి రావడానికి ముందు అందం, త్యాగం కలగలిపిన ఒక అమ్మాయిని కలిశాను. ఆమె పేరు ఆడెల్. ఆమె తనకున్న ఇద్దరు పిల్లలు శామ్యూల్, షిర్లీని చూసుకుంటూ పయినీరు సేవ చేస్తుంది. అలాగే ముసలితనంలో ఉన్న తన అమ్మను కూడా చూసుకుంటుంది. 1981, మే నెలలో నేను ఫిలిప్పీన్స్‌కు తిరిగొచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి తర్వాత మేము కలిసి క్రమ పయినీరు సేవ చేస్తూ కుటుంబాన్ని చూసుకున్నాం.
మాకు పిల్లలు ఉన్నా 1983లో నన్ను మళ్లీ ప్రత్యేక పయినీరుగా నియమించి పలావన్ ప్రాంతంలో ఉన్న లినపాకన్ ద్వీపానికి పంపించారు. అక్కడ ఒక్క యెహోవాసాక్షి కూడా లేడు. కాబట్టి మేము కుటుంబంగా ఆ మారుమూల ప్రాంతానికి వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లిన ఒక సంవత్సరం తర్వాత ఆడెల్ వాళ్లమ్మ చనిపోయింది. కానీ మేము మా సేవలో బిజీగా ఉంటూ ఆ బాధను దిగమింగుకోగలిగాం. అక్కడ మేము చాలా బైబిలు స్టడీలు మొదలుపెట్టాం. వాళ్లందరూ మీటింగ్స్‌కి కూడా వచ్చేవాళ్లు. కాబట్టి మాకు ఒక చిన్న రాజ్యమందిరం అవసరమైంది. దాన్ని మేమే సొంతగా కట్టుకున్నాం. ఆ ద్వీపానికి వెళ్లాక, కేవలం మూడు సంవత్సరాల్లోనే జ్ఞాపకార్థ ఆచరణకు 110 మంది వచ్చినప్పుడు మా ఆనందాన్ని పట్టలేకపోయాం. మేము అక్కడి నుండి వచ్చేసిన తర్వాత వాళ్లల్లో చాలామంది బాప్తిస్మం కూడా తీసుకున్నారని విన్నాం.
1986లో నన్ను కులియన్ అనే ద్వీపానికి నియమించారు. అక్కడ కుష్ఠు రోగులు ఉండే ఒక కాలనీ ఉండేది. అక్కడికి వెళ్లాక ఆడెల్‌ని కూడా ప్రత్యేక పయినీరుగా నియమించారు. మొదట్లో కుష్ఠురోగం ఉన్నవాళ్లతో ప్రీచింగ్ చేయాలంటే మాకు భయమేసింది. కానీ అక్కడ బ్రదర్స్‌సిస్టర్స్ మాకు ధైర్యం చెప్పి, కుష్ఠురోగానికి ట్రీట్‌మెంట్ తీసుకున్న వాళ్లనుండి ఆ రోగం వేరేవాళ్లకు వ్యాపించడం చాలా అరుదు అని చెప్పారు. అలాంటి కొంతమంది రోగులు అక్కడ ఒక సిస్టర్ ఇంట్లో జరిగే మీటింగ్స్‌కి కూడా వచ్చేవాళ్లు. అటు దేవుడూ, ఇటు మనుషులూ తమను పట్టించుకోరు అనుకునేవాళ్లతో బైబిల్లో ఉన్న ఆశను లూకా 5:12, 13.
చెప్పడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. వాళ్లందరూ ఏదోకరోజు పూర్తి ఆరోగ్యంతో ఉంటామనే సంతోషం వాళ్ల ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది.—కులియన్‌లో జీవితానికి మా పిల్లలు ఎలా సర్దుకుపోయారు? కొరోన్ నుండి మాతోపాటు ఇద్దరు యౌవన సహోదరీల్ని కూడా పిల్లలకు తోడుగా తీసుకొచ్చాం. శామ్యూల్, షిర్లీ అలాగే ఆ ఇద్దరు సిస్టర్స్ చక్కగా ప్రీచింగ్ చేసుకునేవాళ్లు. వాళ్లే సొంతగా కొంతమంది పిల్లలకు బైబిలు స్టడీలు మొదలుపెట్టారు. ఆడెల్, నేను ఆ పిల్లల అమ్మానాన్నలకు స్టడీ చేసేవాళ్లం. అలా మేము ఒకానొక సమయంలో 11 కుటుంబాలతో స్టడీలు చేశాం. ఎంతోకాలం గడవకముందే, మేము చాలా బైబిలు స్టడీలు మొదలుపెట్టాం. వాళ్లందరూ మంచి ప్రగతి సాధిస్తున్నారు. అలా మేము ఒక సంఘాన్ని కూడా స్థాపించాం.
మొదట్లో ఆ ప్రాంతంలో నేను ఒక్కడినే సంఘపెద్ద కాబట్టి కులియన్‌లో ఉన్న ఎనిమిదిమంది ప్రచారకులకు అలాగే మర్లీ అనే ఊరిలో ఉన్న తొమ్మిదిమంది ప్రచారకులకు ప్రతీవారం మీటింగ్స్ చేయమని బ్రాంచి ఆఫీస్ చెప్పింది. మర్లీ అనే ఊరికి వెళ్లాలంటే బోటులో మూడు గంటలు ప్రయాణించాలి. మేము అక్కడ మీటింగ్స్ అయిపోయాక కుటుంబమంతా కలిసి హల్సే అనే ఊరిలో బైబిలు స్టడీలు చేయడానికి చాలా గంటలు కొండల మీద నడుచుకుంటూ వెళ్లేవాళ్లం.
కొంతకాలానికి చాలామంది సత్యంలోకి వచ్చారు. కాబట్టి మర్లీ అలాగే హల్సేలో రాజ్యమందిరాలు కట్టాం. లినపాకన్‌లోనైతే బ్రదర్స్-సిస్టర్స్, స్టడీవాళ్లు రాజ్యమందిరానికి కావాల్సిన వస్తువులు ఇచ్చారు అలాగే చాలామంది దానికోసం కష్టపడ్డారు. మర్లీలో ఉన్న హాలులో 200మంది పడతారు, అలాగే ప్రాంతీయ సమావేశాల కోసం కూడా ఆ హాలును కొంచెం పెద్దది చేసుకోవచ్చు.
దుఃఖం, ఒంటరితనం, తిరిగొచ్చిన సంతోషం
పిల్లలు ఎదిగాక 1993లో నేను, ఆడల్ ఫిలిప్పీన్స్‌లో ప్రాంతీయ సేవ మొదలుపెట్టాం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో పాఠశాల ఉపదేశకునిగా శిక్షణ పొందడానికి పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాను. నిజానికి ఉపదేశకునిగా పనిచేయడానికి కావాల్సినంత సామర్థ్యం నాకు లేదని అనిపించింది. కానీ ఆడల్ నా వెన్ను తట్టింది. నా కొత్త నియమానికి కావాల్సిన బలం యెహోవా ఇస్తాడని ఆమె నాకు గుర్తుచేసింది. (ఫిలి. 4:13) నిజానికి ఆడెల్ అనుభవంతో ఆ మాట చెప్పింది. ఎందుకంటే ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నా తన నియామకాన్ని చేస్తూ వచ్చింది.
2006లో నేను పాఠశాల ఉపదేశకునిగా సేవ
చేస్తున్నప్పుడు ఆడెల్‌కి పార్కిన్‌సన్స్ జబ్బు వచ్చిందని తెలిసింది. అది విన్నాక మేము షాకయ్యాం. ఇక తనను చూసుకోవడానికి నియామకాన్ని ఆపేదాం అని చెప్పినప్పుడు, ఆడెల్ “వద్దు, దీనికొక మంచి డాక్టర్‌ని వెదకండి. మనం తన సేవలో ముందుకెళ్లడానికి యెహోవా తప్పకుండా సహాయం చేస్తాడని నాకు తెలుసు” అని అంది. ఆ తర్వాతి ఆరు సంవత్సరాలు యెహోవా సేవ చేయడం తన వల్ల కాదని ఆడెల్ ఎప్పుడూ అనలేదు. ఆమె నడవలేనప్పుడు వీల్‌ఛైర్‌లో కూర్చొని ప్రీచింగ్ చేసింది. ఇక మాట్లాడలేనప్పుడు కనీసం ఒకట్రెండు పదాల్లో మీటింగ్స్‌లో కామెంట్ చెప్పేది. 2013లో చనిపోయేవరకు ఆమె అన్నిటినీ నమ్మకంగా సహించింది. ఆమె ఉంచిన అసాధారణమైన ఆదర్శానికి చాలామంది ఆమెను మెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు మెసేజ్‌లు చేసేవాళ్లు. నమ్మకానికి, ప్రేమకు నిలువెత్తు రూపమైన నా భార్యతో 30 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిపాను. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు ఇక మళ్లీ ఒంటరివాణ్ణి అయ్యాను, దుఃఖంలో మునిగిపోయాను.నేను నా నియామకంలో ముందుకెళ్లాలని ఆడెల్ కోరుకునేది, నేను అదే చేశాను. యెహోవా సేవలో బిజీగా ఉండడం వల్ల ఒంటరితనం నుండి బయటపడగలిగాను. 2014 నుండి 2017 వరకు మన పనిపై ఆంక్షలున్న దేశాల్లో ఉన్న తగాలోగ్ భాషా సంఘాల్ని సందర్శించాను. ఆ తర్వాత థైవాన్, అమెరికా, కెనడాలో ఉన్న తగాలోగ్ సంఘాల్ని సందర్శించాను. 2019లో ఇంగ్లీష్ భాషలో రాజ్య సువార్తికుల కోసం పాఠశాలను ఇండియాలో అలాగే థాయ్‌లాండ్‌లో నిర్వహించాను. ఈ నియామకాలన్నిటిలో నేను ఆనందాన్ని వెతుక్కున్నాను. నిజానికి యెహోవా సేవలో బిజీగా ఉన్నప్పుడు నా అంత సంతోషంగా ఎవ్వరూ లేరు అనిపించింది.
సహాయం—అందని ద్రాక్ష కాదు
నాకు కొత్త నియామకం వచ్చిన ప్రతీసారి నేను కలిసే బ్రదర్స్-సిస్టర్స్ మీద నాకున్న ప్రేమ పెరిగింది. కాబట్టి వాళ్లను వదిలి వెళ్తున్నప్పుడు బాధ మిగిలింది. అలాంటి సందర్భాల్లో నేను యెహోవా మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నాడని, నా జీవితంలో వచ్చిన ప్రతీ మార్పుకు అలవాటు పడడానికి సహాయం చేస్తున్నాడని చాలాసార్లు రుచి చూశాను. ప్రస్తుతం నేను ఫిలిప్పీన్స్‌లో ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్నాను. ఈ కొత్త సంఘం నాకు బాగా అలవాటయ్యింది. ఇది నన్ను పట్టించుకునే, నా మీద శ్రద్ధ చూపించే ఒక కుటుంబంగా మారింది. శామ్యూల్, షిర్లీ విషయానికి వస్తే, వాళ్లు వాళ్లమ్మ బాటలో నడవడం చూసి గర్వపడుతున్నాను.—3 యోహా. 4.
అవును, నా జీవితంలో నేను ఎన్నో కష్టాల్ని చూశాను. నేను ఎంతో ప్రేమించే నా భార్య నా కళ్లముందే భయంకరమైన జబ్బుతో బాధపడి, చనిపోయింది. ఎన్నో కొత్తకొత్త పరిస్థితులకు అలవాటు పడాల్సి వచ్చింది. అయినాసరే, యెహోవా “మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని నేను చూడగలిగాను. (అపొ. 17:27) “యెహోవా చెయ్యి” తన సేవకులకు, ఆఖరికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లకైనా మద్దతు ఇవ్వలేనంత, బలపర్చలేనంత చిన్నది కాదు. (యెష. 59:1) యెహోవా నా జీవితం మొత్తంలో ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. అవును, నేను ఎప్పుడూ ఒంటరివాణ్ణి కాదు!
a 1972 సెప్టెంబరు, 1 కావలికోట (ఇంగ్లీష్) పత్రికలోని, 521-527 పేజీలు చూడండి.