కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి ఫ్రెండ్‌గా ఎలా ఉండవచ్చు?

మంచి ఫ్రెండ్‌గా ఎలా ఉండవచ్చు?

కష్టాల్లో మీకెప్పుడైనా ఏకాకిగా అనిపించిందా? మనం చాలా “కష్టమైన కాలాల్లో” జీవిస్తున్నాం. వాటివల్ల మనం నీరసించిపోవచ్చు, మనకంటూ ఎవరూ లేరని అనిపించవచ్చు. (2 తిమో. 3:1) కానీ మన కష్టాల్ని మనం ఒక్కరమే ఎదుర్కోవాల్సిన అవసరంలేదు. “కష్టకాలంలో” మన భుజం తట్టే స్నేహితులు అవసరమని బైబిలు చెప్తుంది.—సామె. 17:17.

మంచి ఫ్రెండ్స్‌ మనకు ఎలా సహాయం చేస్తారు?

గృహ నిర్బంధంలో ఉన్నా అపొస్తలుడైన పౌలు ప్రీచింగ్‌ చేయగలిగాడు. తనకున్న నమ్మకస్థులైన ఫ్రెండ్స్‌ వల్లే అది సాధ్యమైంది

పౌలు మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు తనతోపాటు ఉన్న ఫ్రెండ్స్‌ ఆయనకు చాలా సహాయం చేశారు. (కొలొ. 4:7-11) ఉదాహరణకు, పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు తనంతట తాను చేసుకోలేని పనుల్ని ఆయన ఫ్రెండ్స్‌ చేసిపెట్టారు. అందులో ఒక పనేంటంటే, ఫిలిప్పీలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ఇచ్చిన వస్తువుల్ని ఎపఫ్రొదితు పౌలుకు అందజేశాడు. (ఫిలి. 4:18) తుకికు ఏమో, పౌలు రాసిన ఉత్తరాల్ని వేర్వేరు సంఘాలకు చేరవేశాడు. (కొలొ. 4:7) చుట్టూ స్నేహితుల అండదండలు ఉన్నాయి కాబట్టి పౌలు తన ఇంట్లో బందీగా ఉన్నా, జైల్లో ఉన్నా ప్రీచింగ్‌ చేసుకోగలిగాడు. మరి మీరు ఒక మంచి ఫ్రెండ్‌గా ఎలా ఉండవచ్చు?

మనకాలంలో కూడా మంచి ఫ్రెండ్స్‌ మనకు ఎంత సహాయపడతారో చెప్పే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, స్పెయిన్‌లో క్రమ పయినీరుగా సేవచేస్తున్న ఎలిజబెత్‌ అనే సిస్టర్‌కి ఒక మంచి ఫ్రెండ్‌ ఉండేది. అయితే, ఎలిజబెత్‌ వాళ్ల మమ్మీకి ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వచ్చినప్పుడు తన ఫ్రెండ్‌ ఆమెను ప్రోత్సహిస్తూ పంపే మెసేజుల్లో లేఖనాల్ని పెట్టేది. ఎలిజబెత్‌ ఇలా చెప్తుంది: “ఆ మెసేజ్‌లు నేను ఒంటరిదాన్ని కాదని నాకు గుర్తు చేశాయి. వాటివల్ల ప్రతీరోజు నాకు వచ్చే కష్టాన్ని తట్టుకునేంత బలం వచ్చేది.”—సామె. 18:24.

మన బ్రదర్స్‌సిస్టర్స్‌ ప్రీచింగ్‌కి లేదా మీటింగ్‌కి వెళ్లడానికి సహాయం చేసినప్పుడు కూడా వాళ్లతో మనకున్న స్నేహం పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక పెద్ద వయసు బ్రదర్‌ని గానీ సిస్టర్‌ని గానీ మీతోపాటు ప్రీచింగ్‌కి లేదా మీటింగ్‌కి తీసుకెళ్లగలరా? అలా చేస్తే మీరు వాళ్లను ప్రోత్సహించినట్టు అవుతుంది. అప్పుడు వాళ్లు కూడా తిరిగి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. (రోమా. 1:12) కానీ, అసలు ఇల్లు కదల్లేని పరిస్థితిలో ఉన్నవాళ్ల సంగతేంటి? వాళ్లకు మీరెలా ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండవచ్చు?

ఇల్లు కదల్లేని వాళ్లకు ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండండి

కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ అనారోగ్య సమస్య వల్ల నేరుగా మీటింగ్‌కి రాలేకపోవచ్చు. డేవిడ్‌ అనే బ్రదర్‌ గురించే తీసుకోండి. ఆయనకు క్యాన్సర్‌ వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువకాలం కీమోథెరపి తీసుకున్నాడు. ఆ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నంత కాలం డేవిడ్‌, ఆయన భార్య లిడియా ఆన్‌లైన్‌లోనే మీటింగ్స్‌కి హాజరయ్యారు.

మరి సంఘంలో ఉన్న ఫ్రెండ్స్‌, మేము ఉన్నామని వాళ్లకు ఎలా చూపించారు? మీటింగ్‌ అయిపోయిన ప్రతీసారి రాజ్యమందిరంలో ఉన్న కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ డేవిడ్‌, లిడియాలను ఆన్‌లైన్‌లో పలకరించేవాళ్లు. అలాగే వాళ్లు కామెంట్‌ ఇచ్చిన ప్రతీసారి మెచ్చుకుంటూ వాళ్లకు మెసేజ్‌లు చేసేవాళ్లు. దానివల్ల డేవిడ్‌, లిడియాలకు అస్సలు ఒంటరిగా అనిపించలేదు.

ఇల్లు కదల్లేని వాళ్లను కూడా మీతోపాటు ప్రీచింగ్‌లో కలుపుకోండి

ఇల్లు కదల్లేని బ్రదర్స్‌సిస్టర్స్‌ని మనతో ప్రీచింగ్‌లో కలుపుకోవడానికి ఎలా ప్లాన్‌ చేసుకోవచ్చు? కష్టం అనుకోకుండా కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకుంటే, మనం వాళ్లను మర్చిపోలేదని చూపించినట్టు అవుతుంది. (సామె. 3:27) వాళ్లతోపాటు ఉత్తరాలు రాయడానికి లేదా టెలిఫోన్‌ సాక్ష్యం చేయడానికి కొంత టైం తీసుకోవచ్చు. ఇల్లు కదల్లేనివాళ్లు బహుశా ఫీల్డ్‌ సర్వీస్‌ మీటింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో కనెక్ట్‌ అవ్వవచ్చు. అది డేవిడ్‌, లిడియాలకి బాగా నచ్చింది. డేవిడ్‌ ఇలా అంటున్నాడు: “బ్రదర్స్‌-సిస్టర్స్‌ చెప్పే ఒక చిన్న మాట, చేసే ఒక చిన్న ప్రార్థన మాకు కొండంత బలాన్ని ఇచ్చింది.” అంతేకాదు ఒకవేళ సురక్షితమైతే, పరిస్థితులు అనుమతిస్తే, అప్పుడప్పుడు మీ బైబిలు విద్యార్థినే ఇల్లు కదల్లేని ప్రచారకుల ఇంటికి తీసుకెళ్లి బైబిలు స్టడీ చేయవచ్చేమో ఆలోచించండి.

ఇల్లు కదల్లేని బ్రదర్స్‌సిస్టర్స్‌తో సమయం గడిపినప్పుడు వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని తెలుసుకుంటాం, వాళ్లకు ఇంకా దగ్గరౌతాం. ఉదాహరణకు, వాళ్లతో కలిసి ప్రీచింగ్‌ చేసినప్పుడు వాళ్లు ఇతరుల మనసు తాకేలా బైబిల్ని ఉపయోగించడం చూసి మనం వాళ్లను ఇంకా ఇష్టపడతాం. వాళ్లతో అలా ప్రీచింగ్‌కి, మీటింగ్‌కి వెళ్లినప్పుడు ఇంకా ఎక్కువమంది మనకు ఫ్రెండ్స్‌ అవుతారు.—2 కొరిం. 6:13.

పౌలుకు కష్టాలు అన్నివైపులా చుట్టుముట్టినప్పుడు తన ఫ్రెండ్‌ తీతు ఆయనకు ఊరటను ఇచ్చాడు. (2 కొరిం. 7:5-7) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మన బ్రదర్స్‌సిస్టర్స్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్లను పలకరించడమే కాదు, వాళ్ల పక్కనే ఉంటూ వాళ్లకు కావాల్సింది చూసుకోవడం ద్వారా కూడా ఊరటను ఇవ్వొచ్చు.—1 యోహా. 3:18.

హింస ఎదుర్కొంటున్నవాళ్లకు మంచి ఫ్రెండ్‌గా ఉండండి

రష్యాలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ఒకరికొకరు చెయ్యి అందించుకోవడంలో తిరుగులేని ఆదర్శాన్ని ఉంచారు. సెర్గీ, ఆయన భార్య టాత్యాన అనుభవాన్ని గమనించండి. ఒకరోజు పోలీసులు వాళ్ల ఇంటిని తనిఖీ చేసిన తర్వాత వాళ్లను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. టాత్యాన ముందు విడుదలై ఇంటికి వచ్చేసింది. సెర్గీ ఇలా చెప్తున్నాడు: “టాత్యాన ఇంటికొచ్చిన వెంటనే ఒక సిస్టర్‌ ధైర్యం చేసి ఆమెను కలవడానికి మా ఇంటికి వచ్చింది. తర్వాత చిందరవందరగా ఉన్న మా ఇంటిని సర్దడానికి చాలామంది ఫ్రెండ్స్‌ సహాయం చేశారు.”

సెర్గీ ఇంకా ఇలా అంటున్నాడు: “నాకు బాగా ఇష్టమైన ఒక లేఖనం సామెతలు 17:17. అక్కడిలా ఉంది: ‘నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.’ నా అంతట నేను హింసను తట్టుకోలేను అని అనిపించినప్పుడు ఈ మాటలు అక్షర సత్యమని చూశాను. నా పక్కన నిలబడడానికి ధైర్యంగల ఫ్రెండ్స్‌ని యెహోవా నాకు ఇచ్చాడు.” a

రానున్న రోజుల్లో మనం ఇంకా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటాం కాబట్టి, తల వాల్చడానికి మనకు ఒక భుజం కావాలి. అంటే ఒకరకంగా మనకు మంచి ఫ్రెండ్స్‌ కావాలి. ముఖ్యంగా, మహాశ్రమ సమయంలో అలాంటి వాళ్లు మనకు చాలా అవసరం. కాబట్టి ఇప్పటినుండే మనం ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండడానికి కృషి చేద్దాం.—1 పేతు. 4:7, 8.

a jw.orgలో ఉన్న “నా పక్కన నిలబడడానికి ధైర్యంగల ఫ్రెండ్స్‌ని యెహోవా నాకు ఇచ్చాడు” అనే ఇంగ్లీష్‌ ఆర్టికల్‌ చూడండి.