కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 6

పాట 18 విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—దానికి కృతజ్ఞులై ఉండండి

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—దానికి కృతజ్ఞులై ఉండండి

“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.”యోహా. 3:16.

ముఖ్యాంశం

మన పాపాల్ని క్షమించడానికి యెహోవా ఏం చేశాడో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. దానివల్ల ఆయన చేసిన ఏర్పాట్ల మీద మన కృతజ్ఞత పెరుగుతుంది.

1-2. మన పరిస్థితి మొదటి పేరాలో చెప్పుకున్న యువకుడిలా ఎలా ఉంది?

 ఒక యువకుణ్ణి ఊహించుకోండి. అతను డబ్బున్న కుటుంబంలో పెరిగాడు. కానీ ఒకరోజు అనుకోకుండా వాళ్ల అమ్మానాన్న యాక్సిడెంట్‌లో చనిపోయారు. అది విని ఆయన గుండె పగిలిపోయింది. దాన్నుండి తేరుకునేలోపే ఆయన ఇంకో షాకింగ్‌ విషయాన్ని వినాల్సి వచ్చింది. అదేంటంటే వాళ్ల అమ్మానాన్న తమ ఆస్తంతా దుబారా చేసి చాలా అప్పుల్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి, ఆస్తికి వారసుడయ్యే బదులు అప్పులకు వారసుడయ్యాడు. అప్పుల వాళ్లంతా ఇంటిమీద పడ్డారు. ఆ అప్పుల భారం ఎంత పెద్దది అంటే, అతను జీవితాంతం కష్టపడినా ఆ అప్పును తీర్చలేడు.

2 చెప్పాలంటే, మన పరిస్థితి కూడా ఆ యువకుడిలానే ఉంది. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు పరిపూర్ణులుగా అందమైన పరదైసులో జీవించారు. (ఆది. 1:27; 2:7-9) సంతోషంలో మునిగితేలే, చావేలేని జీవితం వాళ్ల కళ్లముందు ఉంది. కానీ పరిస్థితంతా ఒక్కసారిగా తలకిందులైంది. అందమైన తోటలాంటి తమ ఇంటిని, చావేలేని జీవితాన్ని వాళ్లు కోల్పోయారు. భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు వారసత్వంగా ఇవ్వడానికి వాళ్ల దగ్గర ఏం మిగిలింది? బైబిలు ఇలా చెప్తుంది: “ఒక మనిషి [ఆదాము] ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమా. 5:12) ఆదాము నుండి మనకు వారసత్వంగా పాపం వచ్చింది, అది మరణాన్ని తెచ్చింది. ఆ పాపం జీవితాంతం కష్టపడినా తీర్చలేని పెద్ద అప్పుల కుప్ప లాంటిది.—కీర్త. 49:8.

3. మన పాపాల్ని ‘అప్పులతో’ ఎందుకు పోల్చవచ్చు?

3 యేసు, పాపాల్ని ‘అప్పులతో’ పోల్చాడు. (మత్త. 6:12; లూకా 11:4) పాపం చేసిన ప్రతీసారి మనం యెహోవాకు అప్పుపడుతున్నట్టు అవుతుంది, మన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఒకవేళ ఆ అప్పు తీర్చకపోతే మనం చనిపోయినప్పుడే ఆ అప్పు మాఫీ అవుతుంది.—రోమా. 6:7, 23.

4. (ఎ) ఎవరోఒకరి సహాయం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? (కీర్తన 49:7-9) (బి) బైబిల్లో “పాపం” అనే మాట దేన్ని సూచిస్తుంది? (“ పాపం” అనే బాక్సు చూడండి.)

4 ఆదాముహవ్వలు చేతులారా పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించడం మనకు సాధ్యమౌతుందా? మనవల్ల అయితే కాదు. (కీర్తన 49:7-9 చదవండి.) ఎవరోఒకరు సహాయం చేయకపోతే మనకు చిరకాలం జీవించే ఆశ గానీ, పునరుత్థాన నిరీక్షణ గానీ ఉండదు. అప్పుడు మనకూ, జంతువులకు పెద్ద తేడా ఏం ఉండదు. వాటిలాగే ఏ ఆశా లేకుండా చనిపోతాం.—ప్రసం. 3:19; 2 పేతు. 2:12.

5. వారసత్వంగా వచ్చిన పాపం అనే అప్పు తీర్చడానికి మన ప్రేమగల తండ్రి ఏ బహుమతి ఇచ్చాడు? (చిత్రం చూడండి.)

5 ఈ ఆర్టికల్‌ మొదట్లో అనుకున్న యువకుడి గురించి ఇంకోసారి ఆలోచించండి. అతని అప్పులన్నీ తీర్చేస్తానని ఒక ధనవంతుడు చెప్తే, అతనికి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అతను చాలా కృతజ్ఞత చూపిస్తాడు, ఆయన ఇచ్చే సహాయాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మన ప్రేమగల తండ్రి అయిన యెహోవా కూడా ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపం అనే అప్పును తీర్చడానికి మనకు ఒక బహుమతి ఇచ్చాడు. దానిగురించి వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహా. 3:16) అంతేకాదు ఈ బహుమతి వల్లే యెహోవాతో మంచి సంబంధం ఏర్పర్చుకోవడం సాధ్యమౌతుంది.

విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా క్షమాపణ గురించిన మంచివార్తను యేసు ప్రకటించాడు. (యోహాను 3:16) విమోచన క్రయధనం ఇవ్వడానికి తన ప్రాణాన్ని ఇష్టంగా బలిచ్చాడు (5వ పేరా చూడండి)


6. ఈ ఆర్టికల్‌లో మనం ఏ బైబిలు మాటల్ని పరిశీలిస్తాం? ఎందుకు?

6 పాప క్షమాపణను సాధ్యం చేసిన ఈ అద్భుతమైన బహుమతి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి బైబిల్లోని కొన్ని మాటల్ని, వాటి అర్థాల్ని పరిశీలిద్దాం. అవేంటంటే: శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడం, ప్రాయశ్చిత్తం, విమోచన క్రయధనం, విడిపించబడడం, నీతిమంతులుగా తీర్పు తీర్చబడడం. వీటి గురించి ఆలోచించే కొద్దీ, మన పాపాల్ని క్షమించడానికి యెహోవా చేసినవాటి మీద మన కృతజ్ఞత పెరుగుతుంది.

ఉద్దేశం: దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడం

7. (ఎ) ఆదాముహవ్వలు దేన్ని కూడా పోగొట్టుకున్నారు? (బి) వాళ్ల వారసులమైన మనకు ఏం అవసరం? (రోమీయులు 5:10, 11)

7 ఆదాముహవ్వలు చిరకాలం జీవించే అవకాశాన్ని కోల్పోవడమే కాదు, తమ తండ్రియైన యెహోవాతో ఉన్న అమూల్యమైన బంధాన్ని కూడా తెంచేసుకున్నారు. పాపం చేయకముందు ఆదాముహవ్వలు యెహోవా కుటుంబంలో భాగంగా ఉన్నారు. (లూకా 3:38) కానీ అవిధేయత చూపించినప్పుడు వాళ్లు ఆయన కుటుంబం నుండి గెంటేయబడ్డారు. వాళ్లు ఆ తర్వాతే పిల్లల్ని కన్నారు. (ఆది. 3:23, 24; 4:1) కాబట్టి వాళ్ల వారసులమైన మనకు యెహోవాతో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడం అవసరం. (రోమీయులు 5:10, 11 చదవండి.) ఇంకోమాటలో చెప్పాలంటే, ఆయనతో మంచి సంబంధాన్ని పెంచుకోవాలి. ‘శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడం’ అని అనువదించిన గ్రీకు పదానికి “శత్రువును స్నేహితునిగా మార్చుకోవడం” అనే అర్థం ఉందని ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తుంది. ఆసక్తికరంగా, దాన్ని చేయడానికి యెహోవాయే ముందుకొచ్చాడు. ఎలా?

ఏర్పాటు: ప్రాయశ్చిత్తం

8. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?

8 పాపులైన మనుషులు తనతో మంచి సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి యెహోవా చేసిన ఏర్పాటే ప్రాయశ్చిత్తం. సరిసమానమైన విలువను చెల్లించి, ఆదాము కోల్పోయినదాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యెహోవా ఆ ఏర్పాటు చేశాడు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: ‘దేవుడు ఒక ప్రాయశ్చిత్త బలి ఏర్పాటు చేశాడు.’ (రోమా. 3:25, అధస్సూచి) దానివల్ల మనలో ప్రతీ ఒక్కరం దేవునితో శాంతియుత సంబంధాన్ని కలిగి ఉండడం సాధ్యమైంది.

9. ఇశ్రాయేలీయుల పాపాల్ని క్షమించడానికి యెహోవా ఏ తాత్కాలిక ఏర్పాటు చేశాడు?

9 ఇశ్రాయేలీయులు తనతో ఒక మంచి సంబంధాన్ని కలిగివుండడానికి, వాళ్ల పాపాల్ని క్షమించేలా యెహోవా ఒక తాత్కాలిక ఏర్పాటు చేశాడు. వాళ్లు సంవత్సరానికి ఒకసారి ఒక ప్రత్యేకమైన పండుగను చేసుకునేవాళ్లు. అదే ప్రాయశ్చిత్త రోజు. ఆ రోజున ప్రధానయాజకుడు ప్రజలందరి తరఫున జంతు బలుల్ని అర్పించేవాడు. నిజమే మనుషుల పాపాల్ని జంతు బలులు పూర్తిగా తీసేయలేవు, ఎందుకంటే అవి మనుషులకు సరిసమానమైనవి కావు. కానీ పశ్చాత్తాపం చూపించిన ఇశ్రాయేలీయులు యెహోవా చెప్పినట్టు బలులు అర్పించినప్పుడు, ఆయన వాళ్ల పాపాల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. (హెబ్రీ. 10:1-4) అంతేకాదు ప్రాయశ్చిత్త రోజున అలాగే వేరే సమయాల్లో ఇశ్రాయేలీయులు అర్పించిన బలులు వాళ్లు పాపులని, వాళ్ల పాపాల్ని కప్పడానికి ఇంకా గొప్ప బలి అవసరమని వాళ్లకు గుర్తు చేశాయి.

10. మనుషులందరి పాపాల్ని క్షమించడానికి యెహోవా ఏ శాశ్వతమైన ఏర్పాటు చేశాడు?

10 మనుషులందరి పాపాల్ని క్షమించడానికి యెహోవా మనసులో ఒక శాశ్వతమైన ఏర్పాటు ఉంది. తన కుమారుడు ‘అనేకుల పాపాల్ని భరించడానికి ఒక్కసారే అర్పించబడేలా’ ఆయన ఏర్పాటు చేశాడు. (హెబ్రీ. 9:28) యేసు ‘ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు.’ (మత్త. 20:28) ఇంతకీ విమోచన క్రయధనం అంటే ఏంటి?

మూల్యం: విమోచన క్రయధనం

11. (ఎ) బైబిలు ప్రకారం విమోచన క్రయధనం అంటే ఏంటి? (బి) ఎవరు మాత్రమే విమోచన క్రయధనాన్ని చెల్లించగలరు?

11 బైబిలు ప్రకారం ప్రాయశ్చిత్తానికి, దేవునితో తిరిగి శాంతియుత సంబంధం నెలకొల్పడానికి చెల్లించే మూల్యమే విమోచన క్రయధనం. a యెహోవా వైపు నుండి చూస్తే, మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి ఈ విమోచన క్రయధనం ఆధారంగా ఉంది. ఏవిధంగా? ఆదాముహవ్వలు పరిపూర్ణ జీవితాన్ని, శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్లు పోగొట్టుకున్న దానికి సరిసమానమైన మూల్యమే చెల్లించాలి. (1 తిమో. 2:6) దాన్ని చెల్లించే వ్యక్తి (1) పరిపూర్ణుడై ఉండాలి, (2) అతనికి భూమ్మీద శాశ్వతకాలం జీవించే సామర్థ్యం ఉండాలి, (3) తన ప్రాణాన్ని మనకోసం త్యాగం చేయాలనే కోరిక ఉండాలి. అప్పుడు మాత్రమే, మనం పోగొట్టుకున్న జీవితానికి ఆ వ్యక్తి జీవితం ప్రాయశ్చిత్తంగా ఉంటుంది.

12. యేసు విమోచన క్రయధనాన్ని ఎందుకు చెల్లించగలిగాడు?

12 యేసు విమోచన క్రయధనాన్ని ఎందుకు చెల్లించగలిగాడో మూడు కారణాల్ని గమనించండి. (1) ఆయన పరిపూర్ణుడు, “ఆయన ఏ పాపం చేయలేదు.” (1 పేతు. 2:22) (2) దానివల్ల, ఈ భూమ్మీద శాశ్వతకాలం జీవించే సామర్థ్యం ఆయనకు ఉంది. (3) తన ప్రాణాన్ని ఇష్టంగా త్యాగం చేసి, మనకోసం చనిపోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. (హెబ్రీ. 10:9, 10) పాపం చేయకముందు ఆదాము ఎలా ఉన్నాడో, యేసు కూడా అలానే పరిపూర్ణ వ్యక్తిగా ఉన్నాడు. (1 కొరిం. 15:45) కాబట్టి యేసు మనకోసం చనిపోవడం ద్వారా ఆదాము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగాడు, అంటే ఆదాము పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఇవ్వగలిగాడు. (రోమా. 5:19) అలా యేసు “చివరి ఆదాము” అయ్యాడు. ఆదాము పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఇవ్వడానికి మళ్లీ ఇంకొక పరిపూర్ణ వ్యక్తి అవసరంలేదు. ఎందుకంటే, యేసు “అన్నికాలాలకు సరిపోయేలా” ఒక్కసారే చనిపోయాడు.—హెబ్రీ. 7:27; 10:12.

13. ప్రాయశ్చిత్త ఏర్పాటుకు, విమోచన క్రయధనానికి తేడా ఏంటి?

13 మరైతే ప్రాయశ్చిత్త ఏర్పాటుకు, విమోచన క్రయధనానికి తేడా ఏంటి? ప్రాయశ్చిత్త ఏర్పాటు అంటే, మనుషులకు తనకు మధ్య మంచి సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి దేవుడు తీసుకునే చర్య. విమోచన క్రయధనం అంటే, పాపులైన మనుషులకు ప్రాయశ్చిత్తాన్ని సాధ్యం చేయడానికి చెల్లించిన మూల్యం. ఆ మూల్యమే యేసు మన తరఫున చెల్లించిన అమూల్యమైన రక్తం.—ఎఫె. 1:7; హెబ్రీ. 9:14.

ప్రయోజనాలు: విడిపించబడడం, నీతిమంతులుగా తీర్పు తీర్చబడడం

14. ఇప్పుడు ఏం చూస్తాం? ఎందుకు?

14 ప్రాయశ్చిత్త ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ఏంటి? ఆ ప్రయోజనాలను నొక్కి చెప్పడానికి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిలో రెండిటి అర్థాల్ని ఇప్పుడు చూస్తాం. వాటిని లోతుగా పరిశీలించడం ద్వారా యెహోవా క్షమాపణకు దారి తీసిన ప్రాయశ్చిత్త ఏర్పాటు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం.

15-16. (ఎ) బైబిల్లో “విడిపించబడడం” అనే మాట దేన్ని సూచిస్తుంది? (బి) పాపం నుండి, మరణం నుండి విడిపించబడడం గురించి మీకేం అనిపిస్తుంది?

15 బైబిల్లో విడిపించబడడం అనే మాట, విమోచన క్రయధనం చెల్లించబడడం వల్ల మనం పొందే విడుదలను సూచిస్తుంది. అపొస్తలుడైన పేతురు దానిగురించి ఇలా చెప్పాడు: “మీ పూర్వీకుల నుండి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీరు విడిపించబడింది వెండి, బంగారం లాంటి నశించిపోయే వాటితో కాదని మీకు తెలుసు. బదులుగా అమూల్యమైన రక్తంతో, అంటే ఏ కళంకం గానీ మచ్చ గానీ లేని గొర్రెపిల్ల రక్తంలాంటి క్రీస్తు రక్తంతో మీరు విడుదల చేయబడ్డారు.”—1 పేతు. 1:18, 19, అధస్సూచి.

16 ఎన్నో బాధల్ని మిగిల్చిన పాపం, మరణం నుండి విమోచన క్రయధనం మనల్ని విడుదల చేస్తుంది. (రోమా. 5:21) యేసు అమూల్యమైన రక్తం లేదా ప్రాణం వల్ల మనం విడిపించబడ్డాం కాబట్టి యెహోవాకు, యేసుకు మనం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం.—1 కొరిం. 15:22.

17-18. (ఎ) నీతిమంతులుగా తీర్పు తీర్చబడడం అంటే ఏంటి? (బి) దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి?

17 నీతిమంతులుగా తీర్పు తీర్చబడడం అంటే మనం చేసిన పాపాలు కొట్టేయబడడం, మన పాపపు మరకలు పూర్తిగా తుడిచేయబడడం. ఇలా చేసినంతమాత్రాన యెహోవా తన న్యాయ ప్రమాణాల్ని మీరినట్టేమీ అవ్వదు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేది మనం చేసిన మంచి పనుల వల్ల కాదు. అలాగని మన పాపాల్ని ఆయన చూసీచూడనట్టు వదిలేయడు కూడా. ప్రాయశ్చిత్త ఏర్పాటు మీద, విమోచన క్రయధనం మీద మనం విశ్వాసం చూపిస్తున్నాం కాబట్టి యెహోవా మన అప్పుల్ని మాఫీ చేస్తున్నాడు లేదా మన పాపాల్ని క్షమిస్తున్నాడు.—రోమా. 3:24; గల. 2:16.

18 యెహోవా మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? యేసుక్రీస్తుతో పాటు పరలోకంలో రాజులుగా పరిపాలించడానికి ఎంపిక చేయబడినవాళ్లు, ఇప్పటికే దేవుని పిల్లలుగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. (తీతు 3:7; 1 యోహా. 3:1) వాళ్ల పాపాలు క్షమించబడ్డాయి. ఇక వాళ్లపై ఎలాంటి పాపపు మరకలు లేవు. అలా వాళ్లు దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులయ్యారు. (రోమా. 8:1, 2, 30) భూనిరీక్షణ ఉన్నవాళ్లు దేవుని స్నేహితులుగా స్వీకరించబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. వాళ్ల పాపాలు కూడా క్షమించబడ్డాయి. (యాకో. 2:21-23) హార్‌మెగిద్దోన్‌ దాటిన గొప్పసమూహం కళ్ల ముందు, చావేలేని జీవితం ఉంటుంది. (యోహా. 11:26) సమాధుల్లో ఉన్న “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని” దేవుడు బ్రతికిస్తాడు. (అపొ. 24:15; యోహా. 5:28, 29) చివరికి, యెహోవాకు లోబడే సేవకులందరూ ఈ భూమ్మీద “దేవుని పిల్లల మహిమగల స్వాతంత్ర్యాన్ని” రుచి చూస్తారు. (రోమా. 8:21) అప్పుడు మనం మన తండ్రియైన యెహోవాతో పూర్తిగా శాంతియుత సంబంధాన్ని కలిగివుంటాం. ప్రాయశ్చిత్త ఏర్పాటు వల్ల వచ్చే ఈ ఆశీర్వాదం ఎంత వెలకట్టలేనిదో కదా!

19. మన కథ ఎలా మలుపు తిరిగింది? (“ యెహోవా క్షమాపణ వల్ల” అనే బాక్సు కూడా చూడండి.)

19 ఒకప్పుడు మన పరిస్థితి, ఈ ఆర్టికల్‌ మొదట్లో అనుకున్న యువకుని పరిస్థితిలానే ఉంది. మనం కూడా అన్నీ కోల్పోయి, జీవితాంతం కష్టపడినా తీర్చలేనంత అప్పును వారసత్వంగా పొందాం. కానీ యెహోవా మనకు సహాయం చేశాడు. ప్రాయశ్చిత్త ఏర్పాటు వల్ల, విమోచన క్రయధన మూల్యం వల్ల మన కథ మలుపు తిరిగింది. యేసుక్రీస్తు మీద మనకున్న విశ్వాసం పాపం, మరణం నుండి మనకు విడుదలయ్యే అవకాశాన్ని ఇస్తుంది. మన పాపాలన్నీ కొట్టేయబడతాయి, అలాగే మన పాపపు మరకలు పూర్తిగా తుడిచేయబడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మన ప్రియ పరలోక తండ్రియైన యెహోవాతో ఇప్పుడు మంచి సంబంధాన్ని కలిగి ఉండగలుగుతున్నాం.

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

20 యెహోవా, యేసు మనకోసం ఏం చేశారో ధ్యానించినప్పుడు, మన హృదయంలో కృతజ్ఞత పొంగిపొర్లుతుంది. (2 కొరిం. 5:15) వాళ్లు సహాయం చేయకపోతే మనకు అసలు ఏ ఆశా ఉండేదికాదు. అయితే యెహోవా ఒక్కసారి క్షమిస్తే, ఇక మనం తప్పు చేశామనే బాధతో కుమిలిపోవాల్సిన అవసరం లేదు అనడానికి బైబిల్లో చక్కటి పదచిత్రాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 10 మన దేవుడైన యెహోవాను స్తుతించండి!

a కొన్ని భాషల్లో, “విమోచన క్రయధనం” అనే మాటను ఇలా అనువదించారు: “ప్రాణానికి మూల్యం” లేదా “చెల్లించిన మూల్యం.”