కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 8

పాట 130 క్షమిస్తూ ఉండండి

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరు ఇతరుల్ని క్షమిస్తారా?

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరు ఇతరుల్ని క్షమిస్తారా?

“యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.”కొలొ. 3:13.

ముఖ్యాంశం

మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమించడానికి మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

1-2. (ఎ) ఎలాంటప్పుడు క్షమించడం చాలా కష్టంగా ఉంటుంది? (బి) డెన్నిస్‌ ఎలా క్షమించింది?

 ఇతరుల్ని క్షమించడం మీకు కష్టంగా అనిపిస్తుందా? మనలో చాలామందికి అలా అనిపిస్తుంది. చెప్పాలంటే, ఎవరైనా మనల్ని బాగా బాధపెట్టేలా మాట్లాడితే, బాధపెట్టే పని చేస్తే క్షమించడం ఇంకా కష్టం అవుతుంది. అయితే బాధపెట్టినవాళ్ల మీద కోపం పెంచుకోకుండా వాళ్లని క్షమించడం అసాధ్యమైతే కాదు. ఉదాహరణకు క్షమించే విషయంలో చాలా పెద్ద మనసు చూపించిన సిస్టర్‌ డెన్నిస్‌ a అనుభవాన్ని గమనించండి. 2017లో ఆమె తన కుటుంబంతో కలిసి కొత్తగా నిర్మించిన యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని చూడడానికి వెళ్లింది. ఇంటికి తిరిగొస్తున్నప్పుడు వాళ్ల కారును ఇంకొక కారు గుద్దింది. డెన్నిస్‌ ఆ యాక్సిడెంట్‌లో స్పృహ కోల్పోయింది. ఆమె కళ్లు తెరిచేసరికి తన పిల్లలకు బాగా దెబ్బలు తగిలాయి. తన భర్త బ్రయన్‌ చనిపోయాడు. ఆ క్షణం గురించి తలుచుకుంటూ డెన్నిస్‌ ఇలా అంటుంది, “నా గుండె బద్దలైపోయింది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు.” ఆ డ్రైవర్‌ తాగిన మత్తు వల్ల లేదా దృష్టి పక్కకు మళ్లడం వల్ల యాక్సిడెంట్‌ చేయలేదని ఆమె తర్వాత తెలుసుకుంది. అప్పుడు ఆమె మనశ్శాంతి కోసం యెహోవాకు ప్రార్థించింది.

2 డ్రైవర్‌ని అరెస్టు చేసి విచారణకు తీసుకెళ్లారు. అతను దోషి అని తేలితే అతనికి జైలుశిక్ష పడుతుంది. అయితే డెన్నిస్‌ చెప్పే మాటల్ని బట్టే ఆ వ్యక్తికి శిక్ష వేయాలా వద్దా అని కోర్టు నిర్ణయిస్తుంది. ఆ సమయంలో తనకు ఎలా అనిపించిందో డెన్నిస్‌ చెప్పింది. తన జీవితంలో అసలు ఎన్నడూ తలుచుకోకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మళ్లీ మాట్లాడడం అంటే, తన గాయానికి ఉన్న కుట్లను విప్పి ఆ పుండు మీద కారం చల్లినట్టు ఆమెకు అనిపించింది. కొన్ని వారాల తర్వాత, తన కుటుంబానికి గుండె కోతను మిగిల్చిన ఆ వ్యక్తి ముందు మాట్లాడడానికి ఆమె కోర్టులో కూర్చుంది. ఆమె ఏం చెప్పింది? ఆ వ్యక్తి మీద జాలి చూపించమని డెన్నిస్‌ జడ్జ్‌ని అడిగింది. b తను మాట్లాడిన తర్వాత ఆ జడ్జ్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “నేను జడ్జ్‌గా ఉన్న ఈ 25 సంవత్సరాల్లో ఇలాంటి మాటల్ని కోర్టులో ఎప్పుడూ వినలేదు. తమను బాధపెట్టిన వ్యక్తి తరఫున మాట్లాడుతూ అతని మీద జాలి చూపించమని అడగడం గానీ, ప్రేమ-క్షమాపణ లాంటి పదాల్ని గానీ నేను ఎప్పుడూ వినలేదు.”

3. క్షమించేలా డెన్నిస్‌కి ఏం సహాయం చేసింది?

3 డెన్నిస్‌ ఎలా క్షమించగలిగింది? యెహోవా ఎలా క్షమిస్తాడో ఆమె బాగా ఆలోచించింది. (మీకా 7:18) యెహోవా మనల్ని క్షమిస్తున్నందుకు కృతజ్ఞత ఉంటే వేరేవాళ్లను కూడా మనం క్షమించగలుగుతాం.

4. మనం ఏంచేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? (ఎఫెసీయులు 4:32)

4 యెహోవా మనల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే, మనం కూడా ఇతరుల్ని క్షమించాలని ఆయన కోరుకుంటున్నాడు. (ఎఫెసీయులు 4:32 చదవండి.) మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. (కీర్త. 86:5; లూకా 17:4) ఇతరుల్ని క్షమించడానికి మనకు సహాయం చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

మీ ఫీలింగ్స్‌ని పట్టించుకోండి

5. సామెతలు 12:18 ప్రకారం, ఎవరైనా మనల్ని బాధపెడితే మనకు ఎలా అనిపిస్తుంది?

5 ఎవరైనా, ముఖ్యంగా మన అనుకున్నవాళ్లు నొప్పించేలా ఏమైనా అంటే లేదా ఏదైనా చేస్తే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. (కీర్త. 55:12-14) కొన్నిసార్లు, మన మనసుకైన గాయాల్ని శరీరానికి అయ్యే గాయాలతో పోల్చవచ్చు. (సామెతలు 12:18 చదవండి.) బాధగా అనిపించినప్పుడు మన ఫీలింగ్స్‌ని అణచుకోవడమో లేదా వాటిని పట్టించుకోకపోవడమో చేస్తాం. కానీ అలా చేస్తే శరీరాన్ని కత్తితో పొడిచి, గాయం దగ్గరే కత్తిని తీయకుండా వదిలేసినట్టు ఉంటుంది. కాబట్టి మన ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా ఉంటే అవే తగ్గిపోతాయిలే అని అనుకోకూడదు.

6. ఎవరైనా మనల్ని బాధపెడితే మనకు వెంటనే ఎలా అనిపించవచ్చు?

6 ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనకు వెంటనే కోపం రావచ్చు. అది సహజమే అని బైబిలు చెప్తుంది. అయితే ఆ కోపం మన మీద పైచేయి సాధించనివ్వకుండా చూసుకోవాలని బైబిలు హెచ్చరిస్తుంది. (కీర్త. 4:4; ఎఫె. 4:26) ఎందుకు? ఎందుకంటే కొన్నిసార్లు మన ఫీలింగ్స్‌ని మనసులోనే దాచేసుకోకుండా వాటిని చేతల్లో చూపిస్తుంటాం. అంతేకాదు కోపం చూపించడం వల్ల మనకు వచ్చేదేమీ ఉండదు. (యాకో. 1:20) కోపం రావడం సహజమే, కానీ ఆ కోపాన్ని పెంచుకుంటామా లేక దాన్ని తీసేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి.

కోపం రావడం సహజమే, కానీ ఆ కోపాన్ని పెంచుకుంటామా లేక దాన్ని తీసేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి

7. ఎవరైనా మనల్ని నొప్పిస్తే ఇంకా ఎలా అనిపించవచ్చు?

7 ఎవరైనా మనల్ని నొప్పించినప్పుడు కోపం ఒక్కటే కాదు, వేరే ఫీలింగ్స్‌ కూడా వస్తాయి. ఉదాహరణకు, యాన్‌ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నా చిన్నప్పుడు మా డాడీ మా మమ్మీని వదిలేసి, నన్ను చూసుకుంటున్న ఆయాను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నన్ను అందరూ వదిలేశారని నాకు అనిపించింది. తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లలు నా స్థానం తీసేసుకున్నారు, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు అనే బాధ నన్ను వెంటాడింది.” సిస్టర్‌ జార్జెట్‌ ఉదాహరణను గమనించండి. వాళ్లాయన అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు తనకు ఎలా అనిపించిందో ఇలా చెప్పింది: “నా మనసు విరిగిపోయింది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి మంచి స్నేహితులం. ఇంకా ఆయన నా పయినీరు పార్ట్‌నర్‌ కూడా.” నయోమి అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మా ఆయన నన్ను ఇంతలా బాధపెడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. కాబట్టి ఆయన రహస్యంగా అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని చెప్పినప్పుడు నన్ను మోసం చేసినట్టు, నాకు పెద్ద నమ్మకద్రోహం జరిగినట్టు అనిపించింది.”

8. (ఎ) వేరేవాళ్లను క్షమించడానికి కొన్ని కారణాలు ఏంటి? (బి) క్షమిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి? (“ ఎవరైనా మనల్ని తీవ్రంగా బాధపెడితే . . . ” అనే బాక్సు చూడండి)

8 వేరేవాళ్లు ఏం చెప్తారో-ఏం చేస్తారో మన చేతుల్లో లేదు, కానీ మనం ఏం చేస్తాం అనేది మన చేతుల్లోనే ఉంది. అన్నిటికన్నా మనం చేయగల మంచి పని ఏంటంటే, క్షమించడం. ఎందుకంటే మనం యెహోవాను ప్రేమిస్తాం. మనం వేరేవాళ్లను క్షమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం కోపం పెంచుకుంటూ వేరేవాళ్లను క్షమించకుండా ఉంటే, కొన్నిసార్లు తెలివితక్కువగా ప్రవర్తిస్తాం, చివరికి మనకు మనం హాని చేసుకుంటాం. (సామె. 14:17, 29, 30) క్రిస్టీన్‌ అనే సిస్టర్‌ ఉదాహరణ గమనించండి. ఆమె ఇలా చెప్తుంది: “నాకు ఎవరిమీదైనా పీకలదాకా కోపం ఉంటే నేను నవ్వడం తగ్గించేస్తాను. సరిగ్గా తినను, సరిగ్గా నిద్రపోను. నా ఫీలింగ్స్‌ని కంట్రోల్‌ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల నా భర్తతో, ఇతరులతో సరిగ్గా ఉండలేను.”

9. మనం కోపాన్ని ఎందుకు వదిలేయాలి?

9 మనల్ని బాధపెట్టినవాళ్లు మనకు కనీసం సారీ కూడా చెప్పకపోతే అప్పుడేంటి? అప్పుడు కూడా వాళ్లను క్షమించడం మనకే మంచిది. ముందు అనుకున్న జార్జెట్‌ ఇలా అంటుంది: “నాకు కొంచెం టైం పట్టింది కానీ, నా మాజీ భర్త మీద నాకున్న కోపాన్ని తీసేసుకున్నాను. దానివల్ల నేను చాలా మనశ్శాంతిని పొందాను.” మనం కోపాన్ని వదిలేస్తే దాన్ని వేరేవాళ్ల మీద చూపించకుండా ఉంటాం. అంతేకాదు జరిగినదాని గురించి ఆలోచించడం మానేసి జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం, జీవితాన్ని మళ్లీ ఎంజాయ్‌ చేయగలుగుతాం. (సామె. 11:17) ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు క్షమించడానికి సిద్ధంగా లేకపోతే, అప్పుడేంటి?

కోపాన్ని, బాధను తగ్గించుకోండి

10. కోపాన్ని, బాధను తగ్గించుకోవడానికి మనకు మనం ఎందుకు టైం ఇవ్వాలి? (చిత్రాలు కూడా చూడండి.)

10 కోపాన్ని, బాధను ఎలా తగ్గించుకోవచ్చు? మనం చేయగల ఒక పని ఏంటంటే, మనకు మనం కాస్త టైం ఇచ్చుకోవాలి. మనకు ఏదైనా గాయమైతే ఆ గాయం పూర్తిగా మానడానికి టైం పడుతుంది. అదేవిధంగా ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించే ముందు, మన మనసుకైన గాయం మానడానికి కూడా టైం పట్టవచ్చు.—ప్రసం. 3:3; 1 పేతు. 1:22.

శరీరానికి అయ్యే గాయాలు పూర్తిగా మానడానికి వైద్య సహాయంతో పాటు, టైం కూడా అవసరం. మన మనసుకు అయ్యే గాయాలు కూడా అంతే (10వ పేరా చూడండి)


11. క్షమించడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

11 క్షమించడానికి సహాయం చేయమని యెహోవాను ప్రార్థనలో అడగండి. c ముందు చెప్పిన యాన్‌కి ప్రార్థన ఎలా సహాయం చేసిందో ఇలా వివరించింది: “అనకూడని మాటలు అన్నందుకు, చేయకూడని పనులు చేసినందుకు నాతో సహా, మా కుటుంబంలో ఉన్న ప్రతీఒక్కరిని క్షమించమని నేను యెహోవాను అడిగాను. ఆ తర్వాత మా డాడీకి, ఆయన రెండో భార్యకు వాళ్లను క్షమిస్తున్నట్టు ఉత్తరం రాశాను.” అలా చేయడం యాన్‌కి చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆమె ఇలా చెప్తుంది: “యెహోవా క్షమించినట్టు క్షమించడానికి ప్రయత్నించాను కాబట్టి మా డాడీ, ఆయన భార్య ఏదోకరోజు యెహోవా గురించి నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను.”

12. మన ఫీలింగ్స్‌ని కాకుండా యెహోవాను ఎందుకు నమ్మాలి? (సామెతలు 3:5, 6)

12 మీ ఫీలింగ్స్‌ని కాదు, యెహోవాను నమ్మండి. (సామెతలు 3:5, 6 చదవండి.) మనకు ఏది మంచిదో యెహోవాకే తెలుసు. (యెష. 55:8, 9) మనకు హానిచేసే వాటిని చేయమని ఆయన ఎప్పుడూ అనడు. కాబట్టి క్షమించమని ఆయన మనకు చెప్తున్నాడంటే, అది మన మంచికోసమే అని పూర్తిగా నమ్మవచ్చు. (కీర్త. 40:4; యెష. 48:17, 18) ఇంకోవైపు మన ఫీలింగ్స్‌ని నమ్ముకుంటే, మనం ఎప్పటికీ క్షమించలేకపోవచ్చు. (సామె. 14:12; యిర్మీ. 17:9) ముందు చెప్పిన నయోమి ఇలా అంటుంది: “నా భర్త అశ్లీల చిత్రాలు చూశాడు కాబట్టి, నేను ఆయన్ని ఎందుకు క్షమించాలి అని మొదట్లో అనుకున్నాను. అలా క్షమించేస్తే ఆయన నన్ను ఎంత బాధపెట్టాడో మర్చిపోతాడేమో, నన్ను మళ్లీమళ్లీ బాధపెడతాడేమో అని భయపడ్డాను. యెహోవా కూడా నా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాడు కదా అనిపించింది. కానీ తర్వాత నేను గుర్తించింది ఏంటంటే యెహోవా నా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకున్నంత మాత్రాన, నా ఫీలింగ్స్‌ సరైనవే అని చెప్పినట్టు కాదు. నాకెలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు, అలాగే నా మనసుకైన గాయం మానడానికి సమయం పడుతుందని కూడా ఆయనకు తెలుసు. అయినాసరే నేను క్షమించాలని ఆయన కోరుకుంటున్నాడు.” d

మీ బంధాన్ని మళ్లీ బాగుచేసుకోండి

13. రోమీయులు 12:18-21 ప్రకారం మనం ఏం చేయాలి?

13 ఎవరైనా మనల్ని బాగా నొప్పిస్తే జరిగిన దానిగురించి మాట్లాడకపోవడమే కాదు, దానికన్నా ఎక్కువే చేయాలి. ఒకవేళ మనల్ని బాధపెట్టిన వ్యక్తి మన బ్రదర్‌ లేదా సిస్టర్‌ అయితే, వాళ్లతో సమాధానపడడానికి ప్రయత్నించాలి. (మత్త. 5:23, 24) కోపానికి బదులు కరుణ చూపించాలి, పగ పెంచుకునే బదులు క్షమించాలి. (రోమీయులు 12:18-21 చదవండి; 1 పేతు. 3:9) అలా చేయడానికి మనకు ఏం సహాయం చేస్తుంది?

14. మనం వేరేవాళ్లలో ఏం చూడడానికి ప్రయత్నించాలి? ఎందుకు?

14 యెహోవా మనుషుల్లో మంచిని చూడడానికే ప్రయత్నిస్తాడు. మనం కూడా యెహోవాలాగే మనల్ని నొప్పించిన వాళ్లలో మంచి లక్షణాల్ని చూడడానికి ప్రయత్నించాలి. (2 దిన. 16:9; కీర్త. 130:3) మనం మనుషుల్లో మంచిని వెతికితే మంచి లక్షణాలే కనిపిస్తాయి. వాళ్లలో చెడును వెతికితే చెడు లక్షణాలే కనిపిస్తాయి. వేరేవాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని చూసినప్పుడు, వాళ్లను క్షమించడం తేలికవుతుంది. ఉదాహరణకు జెరడ్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “ఒక బ్రదర్‌ చేసిన తప్పుల గురించి ఆలోచించే బదులు, ఆయనలో ఉన్న ఎన్నో మంచి విషయాల గురించి ఆలోచించినప్పుడు తనని క్షమించడం నాకు ఇంకా తేలికవుతుంది.”

15. మనల్ని బాధపెట్టిన వ్యక్తికి ‘నిన్ను క్షమించాను’ అని చెప్పడం ఎందుకు మంచిది?

15 మనం చేయాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని బాధపెట్టిన వ్యక్తికి వాళ్లను క్షమించామని చెప్పడం. ఎందుకు? పైన ప్రస్తావించిన నయోమి ఏం చెప్తుందంటే: “ఒకసారి నా భర్త ‘నన్ను క్షమించావా?’ అని అడిగాడు. అప్పుడు నేను నోరు తెరిచి ‘నిన్ను క్షమించాను’ అని చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఆయన్ని మనస్ఫూర్తిగా క్షమించలేదని అప్పుడు నాకు అర్థమైంది. కానీ కొంతకాలం తర్వాత ‘నేను నిన్ను క్షమించాను’ అనే ముఖ్యమైన ఆ మాటల్ని చెప్పగలిగాను. అప్పుడు నా భర్త కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత ఆయనకే కాదు, నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. దాన్ని నేను మాటల్లో చెప్పలేను. అప్పటి నుండి నేను ఆయన్ని తిరిగి నమ్మడం మొదలుపెట్టాను, మేము మళ్లీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం.”

16. క్షమించడం గురించి మీరేం నేర్చుకున్నారు?

16 వేరేవాళ్లను మనం క్షమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కొలొ. 3:13) అలా చేయడం కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం క్షమించగలం. దానికోసం మనం మన ఫీలింగ్స్‌ని పట్టించుకోవాలి. మనకున్న కోపాన్ని, బాధను పెంచుకోకుండా ఉండాలి. అప్పుడు మళ్లీ మన బంధాలను బాగుచేసుకోగలుగుతాం.—“ క్షమించడానికి చేయాల్సిన మూడు పనులు” అనే బాక్సు చూడండి.

క్షమిస్తే వచ్చే ప్రయోజనాల మీద మనసుపెట్టండి

17. క్షమించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

17 క్షమించడానికి మన దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని గమనించండి. ఒకటి, కరుణగల మన తండ్రి అయిన యెహోవాను అనుకరిస్తాం, ఆయన్ని సంతోషపెడతాం. (లూకా 6:36) రెండు, యెహోవా మనల్ని క్షమించినందుకు కృతజ్ఞత చూపిస్తాం. (మత్త. 6:12) మూడు, మన ఆరోగ్యం బాగుంటుంది, మన స్నేహాలు కళకళలాడతాయి.

18-19. క్షమించడం వల్ల ఎలాంటి ఫలితాలు రావచ్చు?

18 మనం వేరేవాళ్లను క్షమించినప్పుడు ఊహించని ఆశీర్వాదాల్ని రుచిచూసే అవకాశం ఉంటుంది. పైన ప్రస్తావించిన డెన్నిస్‌ ఉదాహరణను మళ్లీ గమనించండి. యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తి విచారణ తర్వాత సూసైడ్‌ చేసుకుందామని అనుకున్నాడు. ఆ విషయం డెన్నిస్‌కి తెలీదు. కానీ డెన్నిస్‌ తనని క్షమించడం అతని మనసును తాకింది. దాంతో అతను యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు.

19 వేరేవాళ్లను క్షమించడమంత కష్టమైన పని ఇంకొకటి ఉండదని మనకు అనిపించవచ్చు. కానీ అలా చేస్తే వచ్చే ప్రయోజనాలు దేనికీ సాటిరావు. (మత్త. 5:7) కాబట్టి మనందరం యెహోవాలా క్షమించడానికి శాయశక్తులా కృషి చేద్దాం.

పాట 125 “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”

a కొన్ని పేర్లను మార్చాం.

b ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది క్రైస్తవులు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.

cఒకరినొకరు క్షమించండి” (ఇంగ్లీష్‌), “మనస్ఫూర్తిగా క్షమించాలి,” “మళ్లీ స్నేహం చేద్దాం!” అనే ప్రత్యేక పాటల వీడియోలను jw.org వెబ్‌సైట్‌లో చూడండి.

d అశ్లీల చిత్రాలు చూడడం పాపం. అది భర్తను లేదా భార్యను బాధపెట్టినట్టు అవుతుంది. అయితే, ఆ కారణాన్ని బట్టి ఏ తప్పూ చేయని భర్త లేదా భార్య విడాకులు తీసుకోవడానికి లేఖనాలు అనుమతించట్లేదు.