అధ్యయన ఆర్టికల్ 7
పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!
యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
“నీ దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది.”—కీర్త. 130:4.
ముఖ్యాంశం
బైబిల్లో ఉన్న వేర్వేరు చక్కని పదచిత్రాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం, దానివల్ల యెహోవా మనలో ప్రతీఒక్కర్ని క్షమించే విధానం మీద మనకున్న కృతజ్ఞత పెరుగుతుంది.
1. క్షమించే విషయంలో మనుషులందరికీ ఒకేలాంటి ఆలోచనలు ఉంటాయా?
మీరు ఎవరినైనా బాధపెట్టే మాట అన్నా లేదా పని చేసినా ఆ వ్యక్తి “నిన్ను క్షమిస్తున్నాను” అని మీతో అంటే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అయితే “నిన్ను క్షమిస్తున్నాను” అనే మాటకు అర్థం ఏంటి? మీ ఇద్దరి మధ్య స్నేహం ఏం పాడవ్వలేదు అని ఆ వ్యక్తి చెప్పాలి అనుకుంటున్నాడా? లేదా ఇక జరిగిన దానిగురించి మాట్లాడొద్దని చెప్పాలి అనుకుంటున్నాడా? నిజంగానే క్షమించే విషయంలో మనుషులకు వేర్వేరు ఆలోచనలు ఉంటాయి.
2. యెహోవా క్షమాపణ గురించి లేఖనాల్లో ఏముంది? (అధస్సూచి కూడా చూడండి.)
2 అపరిపూర్ణులమైన మనల్ని యెహోవా క్షమించే విధానానికి, మనం ఒకరినొకరం క్షమించుకునే విధానానికి చాలా తేడా ఉంది. యెహోవా క్షమాపణ చాలా ప్రత్యేకమైనది. అందుకే కీర్తనకర్త దానిగురించి ఇలా చెప్పాడు: “ప్రజలు నీ మీద భయభక్తులు చూపించేలా, నీ దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది.” a (కీర్త. 130:4) అవును యెహోవా క్షమాపణే “నిజమైన క్షమాపణ.” క్షమాపణకు ఆయన పెట్టింది పేరు. కొన్ని లేఖనాల్లో, బైబిల్ని రాసినవాళ్లు క్షమాపణను సూచించడానికి ఉపయోగించిన హీబ్రూ పదం చాలా ప్రత్యేకమైనది. దాన్ని మనుషులు క్షమించే విధానాన్ని సూచించడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు.
3. యెహోవా క్షమించే విధానానికి, మనుషులు క్షమించే విధానానికి తేడా ఏంటి? (యెషయా 55:6, 7)
3 యెహోవా ఎవరినైనా క్షమిస్తే, ఆ వ్యక్తి చేసిన పాపం పూర్తిగా తుడిచేయబడుతుంది. ఆయనతో పాడైపోయిన బంధం తిరిగి బాగౌతుంది. యెహోవా పూర్తిగా, ధారళంగా క్షమిస్తాడు.—యెషయా 55:6, 7 చదవండి.
4. నిజమైన క్షమాపణ ఏంటో తెలుసుకోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తున్నాడు?
4 యెహోవా క్షమించే విధానానికి, మనుషులు క్షమించే విధానానికి తేడా ఉంటే, అపరిపూర్ణులైన మనం దాన్ని నిజంగా అర్థం చేసుకోవడం సాధ్యమేనా? మనకు అర్థమయ్యేలా సహాయం చేయడానికి యెహోవా తన క్షమాపణ గురించి వివరిస్తూ కొన్ని చక్కని పదచిత్రాల్ని ఉపయోగించాడు. ఈ ఆర్టికల్‌లో వాటిలో కొన్నిటిని చూస్తాం. యెహోవా పాపాన్ని ఎలా తీసేస్తాడో, అదే సమయంలో పాపంవల్ల పాడైన బంధాన్ని ఎలా తిరిగి బాగుచేస్తాడో అర్థం చేసుకునేలా అవి మనకు సహాయం చేస్తాయి. ఈ ఉదాహరణల్ని పరిశీలిస్తున్నప్పుడు మనల్ని ఎన్నో విధానాల్లో క్షమించే మన ప్రేమగల, దయగల తండ్రి మీద మనకున్న ప్రేమ, కృతజ్ఞత ఇంకా పెరుగుతుంది.
యెహోవా మన పాపాల్ని తీసేస్తాడు
5. యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు ఏం జరుగుతుంది?
5 బైబిల్లో చాలాసార్లు మన పాపాల్ని పెద్ద బరువులతో పోల్చారు. రాజైన దావీదు తాను చేసిన పాపాల గురించి ఇలా అన్నాడు: “నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి; అవి నేను మోయలేనంత భారంగా తయారయ్యాయి.” (కీర్త. 38:4) కానీ యెహోవా పశ్చాత్తాపపడే వాళ్ల పాపాల్ని క్షమిస్తాడు. (కీర్త. 25:18; 32:5) ఇక్కడ “క్షమాపణ” అని అనువదించిన హీబ్రూ పదానికి “ఎత్తడం” లేదా “మోయడం” అనే అర్థం ఉంది. ఒకవిధంగా మన భుజాల మీద ఉన్న పాపం అనే పెద్ద బరువును, యెహోవా ఒక బలవంతుడిలా ఎత్తి దాన్ని మనకు దూరంగా తీసుకెళ్లిపోతాడు.
6. యెహోవా మన పాపాల్ని ఎంత దూరం తీసుకుని వెళ్తాడు?
6 యెహోవా మన పాపాల్ని ఎంత దూరం తీసుకుని వెళ్తాడో వివరించే మరో పదచిత్రం కీర్తన 103:12లో ఉంది. అక్కడిలా ఉంది: “పడమటికి తూర్పు ఎంత దూరంలో ఉంటుందో, ఆయన మన అపరాధాల్ని మనకు అంత దూరంలో ఉంచాడు.” పడమటికి తూర్పు చాలా దూరంగా ఉంటుంది. ఆ రెండు కలవడం అసాధ్యం. మరో మాటలో చెప్పాలంటే, యెహోవా మన పాపాల్ని మన ఊహకందనంత దూరంగా తీసుకెళ్తాడని చెప్పవచ్చు. నిజంగా యెహోవా ఇలా క్షమిస్తాడని తెలుసుకోవడం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది!
7. యెహోవా మన పాపాల్ని ఏం చేస్తాడని బైబిలు చెప్తుంది? (మీకా 7:18, 19)
7 యెహోవా మన పాపాల్ని సూచనార్థకంగా మన నుండి దూరంగా తీసుకెళ్లిపోయినా, ఆయన వాటిని తన దగ్గరే ఉంచుకుంటున్నాడా? లేదు. రాజైన హిజ్కియా యెహోవా గురించి ఇలా రాశాడు: “నా పాపాలన్నిటినీ నీ వెనక పారేశావు.” లేదా అధస్సూచి చెప్తున్నట్టు “నా పాపాలన్నిటినీ నీ కళ్లముందు నుండి తొలగించేశావు.” (యెష. 38:9, 17; అధస్సూచి) యెహోవా పశ్చాత్తాపపడే వాళ్ల పాపాల్ని తీసుకుని వాటిని దూరంగా, ఎవరికీ కనిపించని చోట పారేస్తాడని ఈ పదచిత్రం చూపిస్తుంది. ఈ మాటల్ని ఇలా కూడా అనువదించవచ్చు: “అసలు ఎలాంటి పాపం జరగనట్టు నువ్వు వాటిని తీసేశావు.” దీని గురించి వివరించడానికి మీకా 7:18, 19లో ఇంకో పదచిత్రం ఉంది. (చదవండి.) అక్కడ యెహోవా మన పాపాల్ని సముద్ర లోతుల్లోకి పడేస్తాడని ఉంది. ప్రాచీనకాలంలో దేన్నైనా సముద్ర లోతుల్లోకి పడేస్తే దాన్ని తిరిగి తెచ్చుకోవడం జరగని పని.
8. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం?
8 యెహోవా మనల్ని క్షమించినప్పుడు, పాపం అనే బరువు నుండి మనల్ని విడుదల చేస్తాడని ఈ పదచిత్రాల ద్వారా మనం నేర్చుకున్నాం. నిజంగానే దావీదు చెప్పినట్టు “తమ అక్రమాలు, పాపాలు క్షమించబడినవాళ్లు సంతోషంగా ఉంటారు; ఎవరి పాపాన్నైతే యెహోవా అస్సలు గుర్తుపెట్టుకోడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు.” (రోమా. 4:7, 8) నిజమైన క్షమాపణ అంటే అది!
యెహోవా మన పాపాల్ని తుడిచేస్తాడు
9. మనల్ని పూర్తిగా క్షమిస్తానని చెప్పడానికి యెహోవా ఎలాంటి పదచిత్రాల్ని ఉపయోగించాడు?
9 విమోచన క్రయధనం ద్వారా పశ్చాత్తాపపడేవాళ్ల పాపాల్ని తను ఎలా తుడిచిపెట్టేస్తాడో మనకు అర్థమయ్యేలా చెప్పడానికి యెహోవా వేరే పదచిత్రాల్ని కూడా ఉపయోగించాడు. సూచనార్థకంగా మన పాపాల్ని కడిగేస్తాను అని యెహోవా చెప్తున్నాడు. అలా చేసినప్పుడు పాపం చేసిన వ్యక్తి శుద్ధి అవుతాడు. (కీర్త. 51:7; యెష. 4:4; యిర్మీ. 33:8) దీని గురించి యెహోవాయే ఇలా అంటున్నాడు: “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, మంచు అంత తెల్లగా అవుతాయి; అవి ముదురు ఎరుపు రంగులో ఉన్నా, ఉన్ని అంత తెల్లగా అవుతాయి.” (యెష. 1:18) ఎర్రటి లేదా ముదురు ఎర్రటి మరకల్ని బట్టల నుండి తీసేయడం చాలా కష్టం. కానీ ఆ మరకల్లాంటి పాపాల్ని కూడా యెహోవా ఎంతబాగా కడిగేస్తాడంటే, అవి కనిపించకుండా మాయమైపోతాయని ఈ పదచిత్రం ద్వారా ఆయన మనకు మాటిస్తున్నాడు.
10. తాను ఎంత ఎక్కువగా క్షమిస్తాడో చూపించడానికి యెహోవా ఇంకా ఏ పదచిత్రాన్ని ఉపయోగించాడు?
10 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు పాపాల్ని ‘అప్పులతో’ కూడా పోల్చారు. (మత్త. 6:12; లూకా 11:4) కాబట్టి మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతీసారి, ఒకవిధంగా మన అప్పు ఇంకాఇంకా పెరిగిపోతుంది. మనందరం యెహోవాకు పెద్దమొత్తంలో అప్పున్నాం. కానీ యెహోవా మనల్ని క్షమించాడంటే, ఆయన మన అప్పును రద్దుచేసేసినట్టు. క్షమించేసిన పాపాల్ని ఆయన మళ్లీ గుర్తుచేసుకోడు. ఎవరైనా మన అప్పును రద్దు చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, యెహోవా మనల్ని క్షమించినప్పుడు మనకు అంతకన్నా ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది.
11. మన పాపాలు “తుడిచేయబడతాయి” అని బైబిలు చెప్పినప్పుడు దానర్థం ఏంటి? (అపొస్తలుల కార్యాలు 3:19)
11 యెహోవా మన అప్పుల్ని లేదా పాపాల్ని రద్దు చేయడమే కాదు, వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. (అపొస్తలుల కార్యాలు 3:19 చదవండి.) ఒక అప్పును రద్దు చేసినప్పుడు దానికి సంబంధించిన కాగితం మీద ఒక పెద్ద ‘X‘ మార్క్ పెట్టినట్టు మనం ఊహించుకోవచ్చు. కానీ ఆ మార్క్ కింద ఎంత డబ్బు అప్పున్నామో మనకు ఇంకా కనిపిస్తుంది. అయితే దేన్నైనా తుడిచిపెట్టేయడం అలా కాదు. ఈ పదచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన కాలంలో ఇంక్‌ని ఎలా తయారుచేసేవాళ్లో మనం తెలుసుకోవాలి. దాన్ని కార్బన్, జిగురు, నీళ్లు కలిపి తయారుచేసేవాళ్లు. ఒక స్పాంజీని తడిపి రాసిన దానిని తుడిచేస్తే అది కనిపించకుండా పోతుంది. కాబట్టి అప్పును తుడిచిపెట్టేయడం అంటే అది పూర్తిగా మాయమైపోవడం. అంతకుముందు రాసిన విషయాలు ఇక కంటికి కనిపించవు. అసలు మనం అప్పే చేయనట్టు యెహోవా చూస్తాడు. యెహోవా మన పాపాల్ని రద్దు చేయడమే కాదు, వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడని తెలుసుకోవడం మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా.—కీర్త. 51:9.
12. దట్టమైన మేఘం గురించిన పదచిత్రం నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు?
12 మన పాపాల్ని ఎలా తుడిచేస్తాడో చూపించడానికి యెహోవా ఇంకో పదచిత్రాన్ని ఉపయోగించాడు. ఆయనిలా అంటున్నాడు: “మేఘంతో కప్పేసినట్టు నీ దోషాల్ని, దట్టమైన మేఘంతో కప్పేసినట్టు నీ పాపాల్ని నేను తుడిచేస్తాను.” (యెష. 44:22) యెహోవా క్షమించినప్పుడు, ఒకవిధంగా దట్టమైన మేఘంతో మన పాపాల్ని కప్పేసి, కనిపించకుండా చేస్తాడు.
13. యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?
13 ఈ పదచిత్రాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మన పాపాల విషయంలో పశ్చాత్తాపపడితే యెహోవా నుండి వచ్చే నిజమైన క్షమాపణ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకున్నాం. యెహోవా మన పాపాల్ని క్షమించేశాక, ఇక ఆ పాపాల మరకలు జీవితాంతం మనతోనే ఉంటాయని బాధపడాల్సిన అవసరంలేదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా యెహోవా మన అప్పుల్ని పూర్తిగా రద్దు చేస్తాడు. కనీసం మనం ఆ పాపం చేశామని కూడా గుర్తుంచుకోడు.
యెహోవా మనతో ఉన్న బంధాన్ని మళ్లీ బాగుచేస్తాడు
14. యెహోవా మనల్ని పూర్తిగా క్షమిస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
14 యెహోవా నుండి వచ్చే నిజమైన క్షమాపణ వల్ల మనకు ఆయనతో ఒక మంచి సంబంధం ఉంటుంది. దానివల్ల తప్పు చేశామనే బాధతో మనం కుమిలిపోకుండా ఉండగలుగుతాం. యెహోవా మన మీద కోపం పెంచుకుంటున్నాడనో, మనల్ని శిక్షించడానికి చూస్తున్నాడనో మనం భయపడం. ఆయన అసలు అలా చేయనే చేయడు. మనల్ని క్షమిస్తానని యెహోవా చెప్పిన మాటను మనం ఎందుకు నమ్మవచ్చు? ఎందుకంటే యెహోవా యిర్మీయా ప్రవక్తతో ఇలా అన్నాడు: “నేను వాళ్ల అపరాధాన్ని క్షమిస్తాను, వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను.” (యిర్మీ. 31:34) అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్పాడు. (హెబ్రీ. 8:12) అయితే దానర్థం ఏంటి?
15. యెహోవా మన పాపాల్ని ఇక గుర్తుచేసుకోడు అంటే దానర్థం ఏంటి?
15 బైబిల్లో “గుర్తుచేసుకో” అనే మాటకు ఒక విషయం గురించి ఆలోచించడం లేదా దాన్ని గుర్తు తెచ్చుకోవడం అనే అర్థాలు మాత్రమే కాదు, ఆ విషయంలో చర్య తీసుకోవడం అనే అర్థం కూడా ఉంది. యేసు పక్కన వేలాడదీయబడ్డ నేరస్తుడు ఇలా అడిగాడు: “యేసూ, నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” (లూకా 23:42, 43) యేసు అధికారం పొందినప్పుడు, కేవలం తన గురించి ఆలోచించమని ఆ నేరస్తుడు అడగలేదు. యేసు ఇచ్చిన జవాబును బట్టి, ఆయన చర్య తీసుకుని ఈ నేరస్తుణ్ణి పునరుత్థానం చేస్తాడని అర్థమౌతుంది. కాబట్టి యెహోవా మన పాపాల్ని గుర్తుచేసుకోడు అంటే ఆయన మనల్ని క్షమించేశాడని, ఆ పాపాల పేరుతో భవిష్యత్తులో మనల్ని శిక్షించడని అర్థం.
16. నిజమైన క్షమాపణ వల్ల వచ్చే స్వేచ్ఛ గురించి బైబిలు ఏం చెప్తుంది?
16 నిజమైన క్షమాపణ వల్ల వచ్చే స్వేచ్ఛను అర్థం చేసుకోవడానికి బైబిలు ఇంకో పదచిత్రాన్ని ఉపయోగిస్తుంది. అపరిపూర్ణత వల్ల మనం “పాపానికి దాసులుగా ఉన్నాం” అని బైబిలు చెప్తుంది. కానీ యెహోవా మనల్ని క్షమించడం వల్ల ‘పాపం నుండి విడుదల చేయబడ్డాం.’ (రోమా. 6:17, 18; ప్రక. 1:5) అవును, విడుదలై స్వేచ్ఛను పొందిన దాసుల్లాగే యెహోవా క్షమాపణ వల్ల మన ఆనందానికి అవధులుండవు.
17. క్షమాపణ వల్ల మనం బాగవ్వడం ఎలా సాధ్యమైంది? (యెషయా 53:5)
17 యెషయా 53:5 చదవండి. మనం చర్చించబోయే చివరి పదచిత్రంలో ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న ఒక మనిషితో మనల్ని పోల్చారు. యెహోవా తన కుమారుని ద్వారా ఇచ్చిన విమోచన క్రయధనం వల్ల సూచనార్థకంగా మనం బాగయ్యాం. (1 పేతు. 2:24) ఆధ్యాత్మిక అనారోగ్యం వల్ల యెహోవాతో పాడైపోయిన మన బంధం, విమోచన క్రయధనం ద్వారా పూర్తిగా బాగవ్వడం సాధ్యమైంది. ప్రాణాంతకమైన వ్యాధి నుండి బాగైన వ్యక్తికి ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఊహించండి. అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా బాగైనప్పుడు, యెహోవా ఆమోదాన్ని తిరిగి పొందినప్పుడు మనకు కూడా పట్టలేనంత ఆనందం కలుగుతుంది.
యెహోవా మనల్ని క్షమించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?
18. యెహోవా క్షమాపణ గురించి బైబిల్లో ఉన్న పదచిత్రాల్ని పరిశీలించడం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? (“యెహోవా మనల్ని ఎలా క్షమిస్తాడు?” అనే బాక్సు కూడా చూడండి.)
18 యెహోవా క్షమాపణ గురించి బైబిల్లో ఉన్న పదచిత్రాల్ని పరిశీలించడం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆయన క్షమించినప్పుడు పూర్తిగా క్షమిస్తాడు, ఆ పాపాల పేరుతో భవిష్యత్తులో మనల్ని శిక్షించడు. దానివల్ల మన పరలోక తండ్రితో మనం మంచి సంబంధాన్ని కలిగివుండగులుగుతాం. అదే సమయంలో నిజమైన క్షమాపణ ఒక బహుమతి అని మనం గుర్తుంచుకోవాలి. మన పనుల్నిబట్టి కాదుగానీ పాపులైన మనుషుల మీద తనకు ఉన్న ప్రేమ, అపారదయ వల్లే యెహోవా మనకు ఈ ఏర్పాటు చేశాడు.—రోమా. 3:24.
19. (ఎ) మనం దేవునికి ఎందుకు కృతజ్ఞులం? (రోమీయులు 4:8) (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏం తెలుసుకుంటాం?
19 రోమీయులు 4:8 చదవండి. ‘నిజమైన క్షమాపణకు’ మూలం యెహోవా దేవుడు కాబట్టి మనలో ప్రతీఒక్కరం ఆయనకు ఎంతో కృతజ్ఞులం. (కీర్త. 130:4) అయితే మనం క్షమించబడతామా లేదా అనేది ఒక ప్రాముఖ్యమైన విషయంపై ఆధారపడి ఉంటుంది. దానిగురించి యేసు ఇలా అన్నాడు: “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు.” (మత్త. 6:14, 15) కాబట్టి మనం కూడా క్షమించే విషయంలో యెహోవాలా ఉండాలి. అయితే దాన్ని ఎలా చేయవచ్చు? ఆ ప్రశ్నకు జవాబు తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పాట 46 యెహోవా, నీకు కృతజ్ఞతలు
a ఈ లేఖనంలో “నిజమైన క్షమాపణ” అని అనువదించబడిన హీబ్రూ పదాలు యెహోవా మాత్రమే పూర్తి స్థాయిలో పాపాల్ని క్షమించగలడని చూపిస్తున్నాయి. చాలా బైబిలు అనువాదాల్లో ఈ ముఖ్యమైన విషయం కనిపించదు. కానీ పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో మాత్రం ఈ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.