కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయా

యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి

యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి

“యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో . . . జ్ఞాపకము చేసికొనుము.”2 రాజు. 20:3.

పాటలు: 52, 27

1-3. యెహోవాను పూర్ణహృదయంతో సేవించడం అంటే ఏమిటి? ఉదాహరణ చెప్పండి.

 మనందరం అపరిపూర్ణులం కాబట్టి పొరపాట్లు చేస్తుంటాం. అయితే, సంతోషకరమైన విషయం ఏమిటంటే మనం పశ్చాత్తాపంతో, విశ్వాసంతో యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవాను క్షమాపణ అడగవచ్చు. అలా చేస్తే ఆయన “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము” చేయడు. (కీర్త. 103:10) అయితే దావీదు సొలొమోనుతో చెప్పినట్టు, మనం చేసే ఆరాధన యెహోవా అంగీకరించాలంటే మనం ‘హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి.’ (1 దిన. 28:9) మరి అపరిపూర్ణులమైన మనం హృదయపూర్వకంగా ఎలా సేవించగలం?

2 దాన్ని అర్థంచేసుకోవడానికి మనం రాజైన ఆసా జీవితాన్ని, రాజైన అమజ్యా జీవితాన్ని పోల్చి చూడవచ్చు. వాళ్లిద్దరూ మంచి పనులు చేశారు. అయితే, వాళ్లు అపరిపూర్ణులు కాబట్టి పొరపాట్లు కూడా చేశారు. కానీ ఆసా ‘బ్రదికిన కాలమంతా అతని హృదయం యథార్థముగా ఉంది’ అని బైబిలు చెప్తోంది. (2 దిన. 15:16, 17; 25:1, 2; సామె. 17:3) అతను ఎల్లప్పుడూ యెహోవాను సంతోషపెట్టడానికే ప్రయత్నించాడు, ‘హృదయపూర్వకముగా ఆయనను సేవించాడు.’ (1 దిన. 28:9) కానీ అమజ్యా యెహోవాను పూర్ణహృదయంతో సేవించలేదు. అతను దేవుని శత్రువులను ఓడించిన తర్వాత, వాళ్ల దేవతల విగ్రహాల్ని తెచ్చుకొని వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు.—2 దిన. 25:11-16.

3 దేవున్ని పూర్ణహృదయంతో సేవించే వ్యక్తి యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, ఆయనను నిత్యం ఆరాధించాలని కోరుకుంటాడు. బైబిల్లో ‘హృదయం’ అనే మాట ఒకరి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అందులో ఆ వ్యక్తి కోరికలు, ఆలోచనలు, స్వభావం, సామర్థ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు కూడా ఉంటాయి. అయితే మనం అపరిపూర్ణులమైనప్పటికీ, యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించగలం. మనం ఆయనను సేవించాలని నిజంగా కోరుకుంటున్నాం కాబట్టే అలా చేస్తాం. అంతేకానీ ఏదో తప్పదన్నట్లుగా లేదా అలవాటులాగా దాన్ని చేయం.—2 దిన. 19:9.

 4. మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం?

4 యెహోవాను పూర్ణహృదయంతో సేవించడం అంటే ఏమిటో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఆసా జీవితాన్ని, అలాగే నమ్మకమైన మరో ముగ్గురు యూదా రాజుల జీవితాల్ని పరిశీలించవచ్చు. వాళ్లు ఎవరంటే: యెహోషాపాతు, హిజ్కియా, యోషీయా. ఈ నలుగురు రాజులు పొరపాట్లు చేసినప్పటికీ యెహోవాను సంతోషపెట్టారు. వాళ్లు తనను పూర్ణహృదయంతో సేవించారని యెహోవా గమనించాడు. వాళ్ల విషయంలో యెహోవా ఎందుకు అలా భావించాడో, వాళ్లను మనమెలా అనుకరించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆసా “హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను”

 5. ఆసా రాజైన తర్వాత ఏమి చేశాడు?

5 ఇశ్రాయేలీయుల జనాంగం రెండు రాజ్యాలుగా విడిపోయిన తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్లలో ఆసా మూడో రాజు. ఆసా రాజైనప్పుడు, అబద్ధ ఆరాధనను అలాగే అసహ్యమైన లైంగిక అనైతికతను తన రాజ్యంలో లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. విగ్రహాలను నాశనం చేసి, దేవాలయంలో ఉండే పురుష సంయోగులను వెళ్లగొట్టాడు. అంతేకాదు, ‘తన అవ్వ ఒక అసహ్యకరమైన విగ్రహాన్ని చేయించుకున్న కారణంగా ఆసా ఆమెను రాజమాత స్థానంలో ఉండకుండా తీసేశాడు.’ (1 రాజు. 15:11-13, NW) దానితోపాటు ‘దేవుడైన యెహోవాను ఆశ్రయించి, ధర్మశాస్త్రానికీ విధికీ’ లోబడమని అతను ప్రజల్ని ప్రోత్సహించాడు. ఇతరులు యెహోవాను ఆరాధించేలా సహాయం చేయడానికి ఆసా చేయగలిగినదంతా చేశాడు.—2 దిన. 14:4.

 6. కూషీయులు యూదా మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా ఏమి చేశాడు?

6 ఆసా పరిపాలించిన మొదటి పది సంవత్సరాల్లో యూదా రాజ్యంలో యుద్ధాలే జరగలేదు. ఆ తర్వాత కూషీయులు 10 లక్షల సైనికులతో, 300 రథాలతో యూదా మీదకు యుద్ధానికి వచ్చారు. (2 దిన. 14:1, 6, 9, 10) అప్పుడు ఆసా ఏమి చేశాడు? యెహోవా తన ప్రజల్ని రక్షిస్తాడనే నమ్మకం ఆసాకు ఉంది. అందుకే యుద్ధంలో గెలిచేలా సహాయం చేయమని అతను యెహోవాకు ప్రార్థించాడు. (2 దినవృత్తాంతములు 14:11 చదవండి.) కొన్నిసార్లు ఇశ్రాయేలు రాజులు యెహోవాకు నమ్మకంగా ఉండకపోయినా, తాను సత్య దేవుడని చూపించడానికి శత్రువుల మీద విజయం సాధించేలా ఇశ్రాయేలీయులకు యెహోవా సహాయం చేశాడు. (1 రాజు. 20:13, 26-30) కానీ ఈసారి మాత్రం, ఆసా యెహోవా మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన సహాయం చేశాడు. యెహోవా ఆసా ప్రార్థన విన్నాడు, దాంతో వాళ్లు యుద్ధంలో గెలిచారు. (2 దిన. 14:12, 13) కానీ అతను ఒక సందర్భంలో యెహోవాపై ఆధారపడకుండా, సిరియా రాజును సహాయం అడిగి పెద్ద తప్పు చేశాడు. (1 రాజు. 15:16-22) అయితే, ఆసాకు తనమీదున్న ప్రేమను యెహోవా చూడగలిగాడు. ‘ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించాడు.’ ఆసా ఉంచిన మంచి ఆదర్శాన్ని మనమెలా అనుకరించవచ్చు?—1 రాజు. 15:14.

7, 8. మీరు ఆసాను ఎలా అనుకరించవచ్చు?

7 యెహోవాపై మనకు పూర్తి భక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు, ‘కష్టమనిపించిన సందర్భాల్లో కూడా నేను యెహోవాకు లోబడతానా? ఆయన సంఘాన్ని పవిత్రంగా ఉంచాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నానా?’ ఒకసారి ఆలోచించండి, తన అవ్వను రాజమాత స్థానం నుండి తీసేయడానికి ఆసాకు ఎంత ధైర్యం అవసరమై ఉంటుందో కదా. ఆసాలాగే మీరు కూడా కొన్నిసార్లు ధైర్యం చూపించాల్సి రావచ్చు. ఉదాహరణకు, మీ కుటుంబంలో లేదా మీ సన్నిహిత స్నేహితుల్లో ఒకరు పాపం చేసి, పశ్చాత్తాపం చూపించకపోవడం వల్ల సంఘం నుండి బహిష్కరించబడ్డారని ఊహించుకోండి. అప్పుడు మీరు ఆ వ్యక్తికి దూరంగా ఉంటారా? అలా చేయడానికి మీ మనసు ఒప్పుకుంటుందా?

8 ఆసాకు అనిపించినట్టే, కొన్నిసార్లు మనకు కూడా అందరూ మనల్ని వ్యతిరేకిస్తున్నట్లు అనిపించవచ్చు. మీరు ఒక యెహోవాసాక్షి అయినందుకు, బహుశా మీ తోటి విద్యార్థులు లేదా టీచర్లు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. మీరు సమావేశాల కోసం సెలవు తీసుకుంటున్నందుకు లేదా తరచూ ఓవర్‌ టైమ్‌ చేయనందుకు మీరు వెర్రివాళ్లని మీ తోటి ఉద్యోగులు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆసాలాగే మీరూ యెహోవాపై ఆధారపడండి. ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి, సరైనదే చేస్తూ ఉండండి. ఆసాను బలపర్చినట్లే దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడని గుర్తుపెట్టుకోండి.

 9. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు మనం యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు?

9 ఆసా కేవలం తనగురించే ఆలోచించుకోలేదు, ‘దేవుడైన యెహోవాను ఆశ్రయించమని [వెదకమని, NW]’ ఇతరుల్ని ప్రోత్సహించాడు. యెహోవాను ఆరాధించేలా మనం కూడా ప్రజలకు సహాయం చేస్తున్నాం. మనకు యెహోవా మీదున్న ప్రేమతో, ప్రజలపట్ల-వాళ్ల భవిష్యత్తుపట్ల ఉన్న శ్రద్ధతో ఆయన గురించి ఇతరులతో మాట్లాడడం యెహోవా చూసినప్పుడు ఎంత సంతోషిస్తాడో కదా!

యెహోషాపాతు యెహోవాను వెదికాడు

10, 11. మనం యెహోషాపాతును ఎలా అనుకరించవచ్చు?

10 ఆసా కొడుకైన యెహోషాపాతు ‘తన తండ్రియైన ఆసా మార్గంలో నడుస్తూ’ వచ్చాడు. (2 దిన. 20:31, 32) ఎలా? యెహోవాను ఆరాధిస్తూ ఉండమని యెహోషాపాతు కూడా తన తండ్రిలాగే ప్రజల్ని ప్రోత్సహించాడు. ప్రజలకు ‘యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం’ నుండి బోధించడానికి కొంతమంది పురుషుల్ని యూదా పట్టణాలకు పంపించాడు. (2 దిన. 17:7-10) ప్రజల్ని ‘యెహోవా వైపుకు మళ్లించడానికి’ అతను ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం వరకు అంటే ఎఫ్రాయిము కొండ ప్రాంతాల వరకు కూడా వెళ్లాడు. (2 దిన. 19:4) కాబట్టి యెహోషాపాతు “యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన” రాజు అని చెప్పవచ్చు.—2 దిన. 22:9.

11 నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన గురించి నేర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. వాళ్లకు బోధించే పనిని మనందరం చేయవచ్చు. ప్రతీనెల బైబిలు స్టడీలు చేయాలనే లక్ష్యం మీరు పెట్టుకున్నారా? ఇతరులు కూడా యెహోవాను ఆరాధించేలా వాళ్లకు బైబిలు విషయాలు నేర్పించడం మీకు ఇష్టమేనా? ఆసక్తిగలవాళ్లు కనిపించాలని మీరు ప్రార్థిస్తున్నారా? మీరు కృషిచేస్తే, మీరు ఒక బైబిలు స్టడీ ప్రారంభించేలా యెహోవా సహాయం చేస్తాడు. మీ ఖాళీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించి ఒకరికి స్టడీ చేయగలరా? ఇతరులు మళ్లీ యెహోవాను ఆరాధించడానికి యెహోషాపాతు సహాయం చేసినట్లే, నిష్క్రియులకు మనం సహాయం చేయవచ్చు. అలాగే, బహిష్కరించబడిన వాళ్లు గతంలో చేసిన పాపాన్ని విడిచిపెట్టి ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లి సహాయం చేసేలా సంఘపెద్దలు ఏర్పాటు చేస్తారు.

12, 13. (ఎ) భయమేసినప్పుడు యెహోషాపాతు ఏమి చేశాడు? (బి) మనం యెహోషాపాతును ఎందుకు అనుకరించాలి?

12 ఒక పెద్ద సైన్యం యూదా మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు కూడా తన తండ్రిలాగే యెహోవామీద ఆధారపడ్డాడు. (2 దినవృత్తాంతములు 20:2-4 చదవండి.) సైన్యాన్ని చూసి భయపడిన యెహోషాపాతు సహాయం కోసం యెహోవాను వేడుకున్నాడు. శత్రువుల్ని ఓడించడం తమవల్ల కాదనీ, ఏమి చేయాలో తనకు, తన ప్రజలకు తోచట్లేదనీ అతను ప్రార్థించాడు. యెహోవా ఖచ్చితంగా సహాయం చేస్తాడని యెహోషాపాతుకు తెలుసు. అందుకే అతను, “నీవే మాకు దిక్కు” అని ప్రార్థించాడు.—2 దిన. 20:12.

13 ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఏమి చేయాలో తోచకపోవచ్చు, భయం వేయవచ్చు. (2 కొరిం. 4:8, 9) కానీ యెహోషాపాతు ఏమి చేశాడో గుర్తుచేసుకోండి. ప్రజలందరి ముందు యెహోవాకు ప్రార్థన చేస్తూ తాము బలహీనులమని ఒప్పుకున్నాడు. (2 దిన. 20:5) కుటుంబ పెద్దలు యెహోషాపాతును అనుకరించవచ్చు. వచ్చిన సమస్యను తట్టుకోవడానికి, ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలుసుకోవడానికి మీకూ మీ కుటుంబానికీ సహాయం చేయమని యెహోవాను అడగండి. ఇలాంటి ప్రార్థనల్ని మీ కుటుంబం ముందు చేయడానికి సిగ్గుపడకండి. వాళ్లు మీ ప్రార్థన వింటే, యెహోవాపై మీకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకుంటారు. యెహోవా యెహోషాపాతుకు సహాయం చేసినట్లే మీకు కూడా సహాయం చేస్తాడు.

హిజ్కియా ఎప్పుడూ సరైనదే చేశాడు

14, 15. హిజ్కియా యెహోవామీద ఎలా పూర్తిగా ఆధారపడ్డాడు?

14 ‘యెహోవాను హత్తుకున్న’ మరో రాజు హిజ్కియా. అతని తండ్రి విగ్రహారాధన చేస్తూ, మంచి ఆదర్శాన్ని ఉంచకపోయినా హిజ్కియా మాత్రం మంచి వ్యక్తిగా ఎదిగాడు. అతను ‘ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టాడు.’ అంతేకాదు “మోషే చేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా” చేశాడు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు దాన్ని ఆరాధిస్తున్నారు. హిజ్కియా యెహోవాపట్ల పూర్తి భక్తిని చూపించాడు. యెహోవా “మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని” హిజ్కియా పాటిస్తూ వచ్చాడు.—2 రాజు. 18:1-6.

15 హిజ్కియా పరిపాలనలో శక్తివంతమైన అష్షూరు సైన్యం యూదా మీదకు దండెత్తి, యెరూషలేమును నాశనం చేస్తామని బెదిరించింది. అష్షూరు రాజైన సన్హెరీబు యెహోవాను ఎగతాళి చేస్తూ హిజ్కియా లొంగిపోయేలా చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో, హిజ్కియా యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచి సహాయం కోసం ప్రార్థించాడు. అష్షూరు సైన్యం కన్నా దేవుడు ఎంతో శక్తిమంతుడని, ఆయన తన ప్రజల్ని కాపాడగలడని హిజ్కియాకు తెలుసు. (యెషయా 37:15-20 చదవండి.) దేవుడు ఒక దూతను పంపి 1,85,000 మంది అష్షూరు సైనికుల్ని చంపించడం ద్వారా హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చాడు.—యెష. 37:36, 37.

16, 17. హిజ్కియాను మీరెలా అనుకరించవచ్చు?

16 కొంతకాలం తర్వాత, హిజ్కియా ఆరోగ్యం పాడై అతను చనిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి కష్ట పరిస్థితిలో, తన విశ్వసనీయతను గుర్తుచేసుకొని సహాయం చేయమని అతను యెహోవాను వేడుకున్నాడు. (2 రాజులు 20:1-3 చదవండి.) హిజ్కియా ప్రార్థన విని యెహోవా అతన్ని బాగుచేశాడు. ఒకవేళ మనం కూడా అనారోగ్యంతో బాధపడుతుంటే, దేవుడు ఒక అద్భుతం చేసి మనల్ని బాగుచేయాలని లేదా మన ఆయుష్షు పెంచాలని ఎదురుచూడడం సరైనది కాదని బైబిలు నుండి నేర్చుకున్నాం. కానీ హిజ్కియాలాగే మనం సహాయం కోసం యెహోవా వైపు చూడవచ్చు. మనం ఇలా ప్రార్థించవచ్చు, “యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో . . . జ్ఞాపకము చేసికొనుము.” యెహోవా ఎల్లప్పుడూ, ఆఖరికి మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చూసుకుంటాడనే నమ్మకం మీకుందా?—కీర్త. 41:3.

17 మనం హిజ్కియాను ఇంకా ఏ విషయంలో కూడా అనుకరించవచ్చు? బహుశా ఏదైనా ఒక విషయం యెహోవాతో మన స్నేహాన్ని పాడు చేస్తుండవచ్చు లేదా మనం ఆయన్ని సేవించకుండా మన సమయాన్ని హరించి వేస్తుండవచ్చు. ఉదాహరణకు నేడు చాలామంది, మనుషుల్ని తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తున్నారు. ప్రముఖుల్ని, తమకు తెలియని వేరేవాళ్లను అభిమానిస్తున్నారు. వాళ్ల గురించిన పుస్తకాలను చదవడానికి, వాళ్ల ఫోటోలను చూడడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రజలు ఇంటర్నెట్‌లో ఇతరులతో మాట్లాడడానికి సోషల్‌ మీడియాను లేదా వేరే ఉపకరణాల్ని ఉపయోగిస్తుంటారు. నిజమే, అటువంటి ఉపకరణాల్ని ఉపయోగించి, మన కుటుంబసభ్యులతో లేదా సన్నిహిత స్నేహితులతో మాట్లాడడం మనకు సంతోషాన్నిస్తుంది. కానీ సోషల్‌ మీడియా వల్ల చాలా సమయం వృథా అయిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, మనం ఇంటర్నెట్‌లో పెట్టిన ఫోటోలకు, కామెంట్లకు చాలామంది లైక్‌ కొడితే మనలో గర్వం కూడా మొదలవ్వవచ్చు. లేదా ఎవరైనా వాటిని చూడడం మానేశారని మనకు తెలిస్తే మనకు బాధ కలుగవచ్చు. కానీ మనం అపొస్తలుడైన పౌలును, అకుల ప్రిస్కిల్లను అనుకరించాలి. వాళ్లు ప్రతీరోజు తమ సమయాన్ని ఎలా ఉపయోగించేవాళ్లు? ప్రజలు, ముఖ్యంగా యెహోవాను సేవించనివాళ్లు చేసే ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి తమ సమయాన్ని ఉపయోగించారా? పౌలు “తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు” అని బైబిలు చెప్తుంది. అంతేకాదు అకుల ప్రిస్కిల్లలు ప్రకటించడానికి, ప్రజలకు “దేవుని మార్గం గురించి ఇంకా ఖచ్చితంగా” వివరించడానికి తమ సమయాన్ని ఉపయోగించారు. (అపొ. 18:4, 5, 26) మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘మనుషుల్ని నా ఆరాధ్య దైవాలుగా చూడకుండా ఉండే విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నానా? నిజంగా ప్రాముఖ్యంకాని పనులు చేయడానికి నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా ఉంటున్నానా?’—ఎఫెసీయులు 5:15, 16 చదవండి.

యోషీయా యెహోవా ఆజ్ఞలను పాటించాడు

18, 19. మనం యోషీయాలా ఎలా ఉండవచ్చు?

18 హిజ్కియా మునిమనుమడైన యోషీయా రాజు కూడా “పూర్ణమనస్సుతో” యెహోవా ఆజ్ఞల్ని పాటించాడు. (2 దిన. 34:31) అతను టీనేజీలో ఉన్నప్పుడు, ‘దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొన్నాడు.’ అతనికి 20 ఏళ్లు వచ్చినప్పుడు, యూదాలో విగ్రహారాధన లేకుండా చేయడం మొదలుపెట్టాడు. (2 దినవృత్తాంతములు 34:1-3 చదవండి.) యెహోవాను సంతోషపెట్టడానికి యోషీయా ఎంతో కృషి చేశాడు. నిజానికి అతను చాలామంది ఇతర యూదా రాజుల కన్నా ఎక్కువే చేశాడు. ఒక రోజు దేవాలయంలో ప్రధాన యాజకునికి దేవుని ధర్మశాస్త్రం దొరికింది. బహుశా అది మోషే స్వయంగా రాసిన పుస్తకం అయ్యుంటుంది. యోషీయా కార్యదర్శి దాన్ని చదివి వినిపించినప్పుడు, యెహోవాను పూర్ణహృదయంతో సేవించాలంటే తాను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని యోషీయా అర్థం చేసుకున్నాడు. ఇతరుల్ని కూడా అదే చేయమని అతను ప్రోత్సహించాడు. దానివల్ల, యోషీయా జీవించినంతకాలం ప్రజలు “యెహోవాను అనుసరించుట మానలేదు.”—2 దిన. 34:27, 33.

19 మీరు యౌవనులైతే, యోషీయాను అనుకరిస్తూ యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోండి. యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని యోషీయా తన తాత అయిన మనష్షే రాజు నుండి నేర్చుకొని ఉంటాడు. మీరు కూడా మీ కుటుంబంలోని, సంఘంలోని వృద్ధుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తమకు యెహోవా చేసిన ఎన్నో మేలుల గురించి వాళ్లు మీకు చెప్తారు. లేఖనాల్లోని విషయాల్ని అర్థంచేసుకున్న తర్వాత యోషీయాకు ఎలా అనిపించిందో గుర్తుచేసుకోండి. అతను యెహోవాను సంతోషపెట్టాలని ఎంతో కోరుకున్నాడు కాబట్టి వెంటనే మార్పులు చేసుకున్నాడు. బైబిలు చదివితే, యెహోవాకు లోబడాలనే మీ కోరిక కూడా మరింత దృఢపడుతుంది. దానివల్ల, యెహోవాతో మీ స్నేహం మరింత బలపడుతుంది, మీరు మరింత సంతోషంగా ఉంటారు. అప్పుడు యెహోవా గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక మీలో కలుగుతుంది. (2 దినవృత్తాంతములు 34:18, 19 చదవండి.) బైబిల్ని చదివినప్పుడు, యెహోవా సేవను మీరు మరింత బాగా ఎలా చేయవచ్చో కూడా గ్రహిస్తారు. అలా గ్రహించినప్పుడు, యోషీయాలాగే మార్పులు చేసుకోవడానికి మీరు చేయగలినదంతా చేయండి.

యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి

20, 21. (ఎ) మనం చర్చించుకున్న నలుగురు రాజుల్లో ఏ విషయాన్ని గమనించవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

20 యెహోవాను పూర్ణహృదయంతో సేవించిన ఈ నలుగురు యూదా రాజుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? వాళ్లు యెహోవాను సంతోషపెట్టాలని, తాము జీవించినంత కాలం యెహోవాను ఆరాధించాలని నిశ్చయించుకున్నారు. వాళ్ల మీదకు బలవంతులైన శత్రువులు వచ్చినప్పుడు యెహోవా మీద ఆధారపడ్డారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వాళ్లు యెహోవాను ప్రేమించారు కాబట్టి ఆయనను సేవించారు.

21 అపరిపూర్ణులైన ఈ నలుగురు రాజులు పొరపాట్లు చేసినప్పటికీ యెహోవాను సంతోషపెట్టారు. వాళ్ల హృదయాల్లో ఏముందో యెహోవా చూశాడు, వాళ్లు ఆయన్ని నిజంగా ప్రేమించారని ఆయనకు తెలుసు. మనం కూడా అపరిపూర్ణులమే కాబట్టి పొరపాట్లు చేస్తుంటాం. కానీ మనం పూర్ణహృదయంతో తనను సేవిస్తున్నామని చూసినప్పుడు యెహోవా సంతోషపడతాడు. తర్వాతి ఆర్టికల్‌లో, ఈ రాజులు చేసిన పొరపాట్ల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.